పురస్కారానుభూతి

    0
    6

    [box type=’note’ fontsize=’16’] పాఠకుల అభినందన రచయితకు ప్రాణవాయువయితే , పురస్కారాలు,సన్మానాలు ఉత్తేజాన్నిచ్చే పండుగల్లాంటివి. ఉగాది పురస్కారం అందుకున్న రచయిత్రి అల్లూరి గౌరీలక్ష్మి  పండుగ పురస్కారానుభూతిని సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు..[/box]

     

    పురస్కారాలంటే ఒక రంగంలో కృషి చేస్తూ పోతున్న వారికి కొంచెం గుర్తింపు నిచ్చి ప్రోత్సహించడం. వీపు తట్టి భేష్ అనడం. పదిమంది ఎదుట వారిని పిలిచి సన్మానించి గౌరవించడం. ఆ పురస్కారం/అవార్డు/బహుమతి మనకి లభించినప్పుడు మనకి కొంత ఉత్తేజం మరికొంత తృప్తీ కలగడం సహజం. ఆ కథనం బెట్టిదనిన..
    ఈ శ్రీ విళంబి నామ ఉగాదికి రెండు రోజుల ముందు శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఆరు గంటలకు రాష్ట్ర సాంసృతిక శాఖ నుండి నాకు ఫోన్ వచ్చింది. “ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకోబోతున్న ఉగాది పురస్కార గ్రహీతల్లో మీరొకరు. అందుకు మా అభినందనలు. ఉగాది రోజున ఉదయం ఎనిమిది గంటలకల్లా తుమ్మలపల్లి కళాక్షేత్రంకు రండి. మన రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రి గారి చేతి మీదుగా పురస్కారం అందుకోండి.” అని.
    ఈ మాటలు వినగానే ఒక్కసారిగా చెవులు మొద్దుబారినట్టుగా అనిపించాయి. “మీకు ఒక హోటల్‌లో వసతి ఇస్తాము. ఆ హోటల్ పేరు” అని ఆయన చెప్పబోయేంతలో “వొద్దొద్దు నేను లోకలే” అని గట్టిగా ఆనందంతో అరిచి ఫోన్ పెట్టేసాను.
    సంతోషంగా “గాల్లో తేలినట్టుందే!” అనీ “ఆజ్ మై ఊపర్ – ఆసమా నీచే!” అని రెండు భాషల్లో పిచ్చి పిచ్చిగా పాడుకున్నా! రాత్రి భోజనం మానేశా. కడుపు నిండి పోయినట్టూ, ఆకల్లేనట్టూ అనిపించింది. రాత్రంతా కంటి మీద కునుకు లేదు.
    మళ్ళీ లోపల చిన్న బెదురు ఈ ఫోన్ కాల్ నిజమేనా! అని. అతను నా పేరే చెప్పాడా! నేను పొరబడ్డానా! అని. తెల్లారి పొద్దున్నే ఆ నంబర్‌కి ఫోన్ చేశా. నా అనుమానం బైట పెట్టా. “నా పేరు మీకు తెలుసు కదాండీ! మీరు నాకే ఫోన్ చేశారు కదండీ“ అంటూ. “అదేమిటండీ కల్చరల్ డిపార్ట్మెంట్ తరఫున నేను చెబుతుంటే మీరు నమ్మకపొతే ఎట్లా” అని ఆయన నాపై కోప్పడి ఆపై హర్ట్ అయ్యి, ఠక్కున ఫోన్ పెట్టేసాడు. అప్పుడు నాకింక పిచ్చి ధైర్యం వచ్చేసింది, ఆ తర్వాత జనాలపై దాడి ప్రారంభించా. అందరికీ ‘ నాకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సన్మానమోచ్ ’ అని మెసేజ్ టైపు చేసి పెట్టేశా !
    మరీ దగ్గరి వాళ్ళు “అంటే ఏమిటే?“ అని రిప్లైలు పెట్టడం మొదలు పెట్టారు. నేను వారిని ఎడ్యుకేట్ చెయ్యడానికి నడుం బిగించాను. ఇంతలో ఊరి నుండి బంధువులు వచ్చారు. వాళ్లతో పురస్కారం గురించి చెప్పలేకా, చెప్పకుండా ఉండాలేకా ఏదేదో ఐ పోయాను. అతిధుల సేవలో పడ్డాను. ఫోన్ల పరంపర మొదలయ్యింది. ‘యూ డిసర్వ్’ అనీ, నీకొస్తే మాకొచ్చినంత ఆనందంగా ఉందనీ సన్మిత్రుల ఫోన్లు. ఉగాది పురస్కారం వచ్చిన తోటి వారు, రాని వారూ, నా కొచ్చిందని తెలియని వారూ, తెలిసిన వారూ అంతా గందరగోళంగా అయిపోయింది.
    లంచ్ టైం దాటాక ఒక ప్రముఖ దినపత్రిక నుండి ఫోన్ “మీ బయో డేటా ఇవ్వండి, ఫోటో ఇవ్వండి” అంటూ వాట్సప్‌లో నా పాస్‌పోర్ట్ ఫోటోలుండవు కదా! బయోడేటా రాద్దామంటే కంగారులో పేపర్ లేదు, పెన్ కనబడలేదు. నా గురించి ఏం రాయాలో తెలియలేదు. బంధువులు మధ్యాన్నం ఓ కునుక్కి పడుకున్నాక ఒక మూల కూర్చుని ఒక పిచ్చి కాగితం తీసుకుని పెన్సిల్‌తో ఏదేదో నోటికొచ్చింది రాసేసి అడిగినాయనకి వాట్సప్‌ మెసేజ్ పెట్టా. నెత్తిమీద నుంచి పెద్ద బరువు దిగినట్టు ఊపిరి పీల్చుకున్నా.
    బంధువులు చెప్పే కబుర్లు వింటూ స్నాక్స్, టీ తయారు చేస్తున్నా. ఇంతలో మరో దినపత్రిక వాళ్ళు ఫోన్ చేసి “మీ బయోడేటా, ఫోటో కావాలి. మా మెయిల్ ఐడీకి పంపండి” అని ఫోన్ పెట్టేసారు. ఇక లాభం లేదని ఆఫీస్‌కి బయలు దేరా, అక్కడన్నీ ఉంటాయి కదా అని. సెక్యూరిటీ అబ్బాయుండాలని దేవుడికి దణ్ణాలు పెట్టుకుంటూ వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ అతను ఉన్నాడు. తాళం తీసి కంప్యూటర్ ఆన్ చేసి సాయం చేసాడు. పని ముగించుకుని పువ్వులు, మావిడాకులూ, వేప పువ్వు కొనుక్కుని ఇల్లు చేరాను.
    అలా ఆ రాత్రి రోజల్లా అలిసిపోవడం వల్ల నిద్ర పిలవగానే వచ్చేసింది. చిన్న కునుకు పట్టి ఉద్వేగంతో రెండుకల్లా మెలకువ వచ్చేసింది. నాకేమిటీ! సన్మానమేమిటీ! విచిత్రం! కల కాదు కదా! అనుకుంటూ ఓ రెండు గంటలు అటూ ఇటూ పొర్లాను. తెల్లవారు జామున నాలుగవనిచ్చి లేచిపోయి పూజ ముగించి, ఉగాది పచ్చడి చేసి, టిఫిన్ కాఫీలు కూడా కానిచ్చి ఎనిమిదికల్లా ఫ్యామిలీతో ముఖ్యమంత్రి గారి మీటింగ్‌కి బయలుదేరా! ఆ రోజు ఉదయమే రెండు దినపత్రికలూ నా ఫోటో వేసి నా పరిచయం రాశాయి. అవి చదివిన వాళ్ళ ఫోన్లూ, మెసేజ్‌లూ తుమ్మలపల్లి కళాక్షేత్రంకు వెళుతుండగా దార్లోనే మొదలయ్యాయి. హాల్లో ప్రవేశించాము. అవార్డు అందుకోబోయే వాళ్ళందర్నీ ఒక చోట కూర్చోబెట్టారు. నాకు టెన్షన్ మొదలయ్యింది.
    పదికల్లా మీటింగ్ ప్రారంభం అయ్యింది. అందరి స్పీచ్‌ల తర్వాత ముఖ్యమంత్రి గారి స్పీచ్ రాజకీయ వివరంగా సాగింది. మధ్యలో లంచ్ లాంటి బ్రేక్‌ఫాస్ట్, ఉగాది పచ్చడి అందరికీ అందింది. పురస్కారాలు ఇంకా ఇంకా ఆలస్యం అయితే బావుండనిపించింది. తీరిగ్గా తింటూ ఉండగానే పురస్కారాలు మొదలన్న ప్రకటన వెలువడింది. తినడం మానేశా. మళ్ళీ టెన్షన్ మొదలయ్యింది. చాలా వేగంగా పేర్లు పిలుస్తున్నారు. గ్రహీతలంతా హడావిడిగా స్టేజి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది.
    నా పేరు పిలిచాక చెవులు సంతృప్తి పడ్డాయి. వేదిక పైకి వెళ్ళాను. షాల్ కప్పాక మెమెంటో ఇవ్వబోతూ “ఏం చేస్తారు మీరు?” అనడిగారు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పానో గుర్తులేదు. జ్ఞాపిక తీసుకుని మబ్బుల్లో తేలుతూ వేదిక దిగి వచ్చేసా.


    బైటికొచ్చాక ఆనందంతో, సంతోషంతో అవార్డు మరీ బరువుగా అనిపించింది. మిత్రుల అభినందనలు, పరస్పరాభినందనలు అయ్యాక ఇంటికొచ్చాం. వెంటనే సీఎం గారు నాకు సత్కారం చేస్తున్న ఫోటో ఒక మిత్రుడు మెయిల్లో పంపారు. దానిని అందరికీ ఫార్వార్డ్ చేశా! ఒక్క సారిగా కంగ్రాట్యులేషన్స్ మెసేజ్‌లతో నా మొబైల్ పువ్వులు తప్ప ఆకులు లేని బోగన్ విలియా పొదలా పచ్చగా వెలిగిపోయింది. ఒక దాని వెంట వచ్చిన మిస్‌డ్ ఫోన్ కాల్స్ గుట్టగా పడ్డాయి.
    ఇంట్లో బంధు మిత్రుల అభినందన సభ ఏర్పాటు చేశారు. నాకు ఏం మాట్లాడాలో తెలీక, వెర్రి చూపులు, అసందర్భపు మాటలు, పిచ్చి నవ్వులు లాంటి పనులు చేసి ఆ సభ ముగించాను. ఆ రాత్రి అలిసి సొలసి ఝామ్మని నిద్రపోయా. తెల్లారే సరికి దినపత్రికలు పురస్కార గ్రహీతల ఫోటోలు, పేర్లు వేస్తూ నా పేరును అల్లు గౌరీలక్ష్మి అనీ, ఆలూరి గౌరీలక్ష్మి, లక్ష్మీగౌరి అనీ యధాశక్తి మార్చి నవ్వించాయి. ఇదీ నా “ విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచ్చిన శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది పురస్కారానుభూతి“.
    చిత్తగించవలెను.
    అల్లూరి గౌరీ లక్ష్మి

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here