పుట్టింటి మమకారం

3
11

[శ్రీ చేకూరి రామలింగరాజు రచించిన ‘పుట్టింటి మమకారం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

తనుండే హైదరాబాద్ లోనే ఉండే కొడుకు ఇంట్లో మరునాడు కిట్టిపార్టీ ఉండడంతో కోడలికి సహాయ పడడానికి ఆ రాత్రికే ఆమె ఇంటికి వచ్చింది సూర్యప్రభ. మరునాడు పనిమనిషిని కూడా ఉదయానే రప్పించింది కోడలు పావని. పనసకాయ ముక్కల పలావు, గుత్తివంకాయ కూర, ఉల్లి చట్నీ చేసి సాంబారు పెట్టారు.తదుపరి పాకం గారెలు కూడా వేసారు.

సమయం పదకొండు గంటలయ్యేసరికి అతిథులందరూ ఒక్కొరొక్కరుగా చేరుకున్నారు. అందరికీ ఆహ్వానం పలికి తాగడానికి జ్యూస్‌లు ఇప్పించింది. అవి తాగాక కాసేపు ఆటలు పాటలతో కాల కాలక్షేపం చేశారు. మధ్యాహ్నమయ్యాకా భోజనాలు చేశారు. వంటలు చాలా బావున్నాయని మెచ్చుకున్నారందరూ. ఆ తర్వాత హాల్లో క్రింద పరిచిన తివాచీలమీదా, సోఫాల్లోనూకూర్చుని సేదదీరుతూ కబుర్లలో పడ్డారు

“మరీ సాగదీస్తున్నాడండీ! మూడు వారాల నుండి అక్కడే ఉంది కథ” ఏదో సీరియల్ గురించి అంది ఒకావిడ. “అవునండీ చాలా విసుగొస్తోంది అయినా మనం చూడకుండా ఉండలేక పోతున్నాం” మరొకరెవరో అన్నారు. కాస్త అలసటగా అనిపించి పడకగదిలోకి వెళ్ళి మంచంమీద నడుం వాల్చింది సూర్యప్రభ. ఆ గది వెలుపల తలుపు ప్రక్కగా కూర్చున్న గాంధీనగర్ వసుంధర గారు, పక్క ఇంటి పార్వతమ్మగారి మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి.

“మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా? ఏదైనా కుదిరిందా” అడుగుతోంది పార్వతమ్మ

“ఇంకా కుదరలేదు పార్వతి గారూ! మేరేజ్ బ్యూరో వాళ్ళు ఏవో సంబంధాలు తెస్తూనే ఉన్నారు. అన్నీ చూస్తున్నాం. ఈ మధ్యే ఒక సంబంధం చెప్పారు. అమ్మాయి చాలా అందంగా ఉంది. చదువు కూడా మొదటినుండీ మెరిట్ లొనే సాగింది. కంప్యూటర్ సైన్సులో డిగ్రీ చేసి ఉద్యోగం చేస్తోంది. వాళ్ల అసలు ఊరు కోనసీమలో నడిమిలంక అట. ఈ అమ్మాయి అన్నగారి దగ్గర కాకినాడలో ఉంటోంది” చెబుతోంది వసుంధర.

నడిమిలంక పేరు వినగానే అది తమ ఊరే కావడంతో ఆసక్తిగా వినసాగింది సూర్యప్రభ.

“బావుంది మరి ముదుకెళ్తున్నారా” ఆడిగింది పార్వతమ్మ గారు.

“అదే ఆలోచిస్తున్నాం. వాళ్ళు అంత స్థితిమంతులు కాదు. మాకు కట్నాలు అవీ ఏమీ అవసరం లేదు కానీ, అబ్బాయి వెళ్ళినప్పుడు కాస్త మంచి ఇల్లూ, ఆ అమ్మాయికి చిన్న చిన్న పెట్టిపోతలకైనా స్తోమత ఉందా లేదా అని చూస్తున్నాం” చెప్పింది వసుంధర.

వింటున్న సూర్యప్రభకు ఆవిడ చెబుతున్నది తన మేనకోడలు లావణ్య గురించి కాదు కదా! అనుకుంది. అన్నయ్య సుబ్బారాయుడు నడిమిలంకలో ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ ఉండగా కొడుకు గోపాలకృష్ణ కాకినాడలో ఒక రొయ్యల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు లావణ్య కూడా గోపాలకృష్ణ దగ్గరే ఉండి చదువుకు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తోంది.

సాయంత్రం పార్టీ ముగిసి అందరూ వెళ్ళిపోయాకా తన అన్నయ్యకు ఫోన్ చేసింది. ఆయన మోకాళ్ళ నొప్పుల గురించి తెలుసుకుని వదిన కులాసా అడిగి అదయ్యాక అడిగింది.

“మన లావణ్యకు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అన్నయ్యా!” అని.

“చూస్తున్నాను ప్రభా! మన గోపి కూడా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ ద్వారా సంబంధాలు చూసిస్తున్నట్టు చెప్పాడు. అన్నట్టు హైదరాబాద్ నుంచి కూడా ఓ సంబంధం వచ్చింది. వాళ్ళు కబురు చేస్తే వాకబు చేయడానికి నీకు చెబుదామనుకుంన్నాం” చెప్పాడు సుబ్బారాయుడు.

“అలాగే అన్నయ్యా!నా దృష్టిలో కూడా ఏదైనా సంబంధం వస్తే చెబుతాను” అంది.

తరవాత మేనల్లుడు గోపీకి ఫోన్ చేసి లావణ్యకు వచ్చిన హైదరాబాద్ పెళ్లి సంబంధం గురించి వివరాలు అడిగి తెలుసుకునే సరికి, వసుంధర గారి అబ్బాయికి వచ్చింది తన మేనకోడలు లావణ్య సంబంధమే అని అర్థమయ్యింది. ఒకసారి తమ ఊరు వెళ్ళడానికి నిశ్చయించుకుని అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన గోపీకి ఫోన్ చేసి రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రభను తమ ఊరు తీసుకునిరమ్మని చెప్పాడు.

“లింగంపల్లి నుండి కాకినాడ పోర్ట్ వెళ్ళు గౌతమీ సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ మరికొద్ది నిమిషములలో ఒకటవ నెంబరు ప్లాట్‌ఫాం పైకి వచ్చును” ఎనౌన్సమెంట్ విని అత్తయ్య ఫోన్లో చెప్పిన బోగీ దగ్గరకు ఎదురు వెళ్లి బ్యాగ్ అందుకుని “రా అత్తయ్యా!” అంటూ స్వాగతం పలికాడు. ఆమెను ఊరిలో దింపడానికి ఫ్రెండ్ కారు అడిగి తెచ్చుకున్నాడు. బయటకు వచ్చి బ్యాగ్ వెనుక సీట్లో పెట్టి ఆమె కూర్చున్నాకా ఇంటికి బయలుదేరాడు. రైల్వే ఫ్లైఓవర్ దాటి కాస్త ముందుకు వెళుతుంటే రెండు వైపులా పెద్ద బిల్డింగ్స్ చూసి ‘ఎంతగా మారిపోయిందో సిటీ, చాలా అభివృద్ధి అయ్యింది’ అనుకుంది. కొంత దూరం వెళ్లి జంక్షన్‌లో మెయిన్ రోడ్ వైపు తిరుగుతూ మూలనున్న భవనాన్ని ఉత్సుకతతో చూడసాగింది. పైన ‘సిటీ సెంట్రల్’ పేరుతో ఉన్న పెద్ద షాపింగ్ మాల్ అది. అది ఉన్న స్థలం ఒకప్పుడు తమదే. తనకు పెళ్లి సమయంలో ఆ ఆస్తి వ్రాసి ఇచ్చారు నాన్న. తరవాత తన భర్త దాన్ని అమ్మి హైదరాబాద్‌లో స్థలం కొన్నారు. ఒక బిల్డర్‌కి డెవలప్‌మెంటుకు ఇస్తే తన వరకు 5 ఫ్లాట్లు వచ్చాయి. వాటి మీద అద్దె రూపంలో తనకు మంచి ఆదాయమే వస్తోంది. ఒకసారి కొడుకు వెంకట్‌కి ఒక బ్యాంక్ లోను నిమిత్తం తనఖా పెట్టుకుంటామని అడిగితే కుదరదని నిష్కర్షగా చెప్పేసింది. కోడలు వాళ్ళు చిన్నబుచ్చుకున్నారు కూడా. అదే సమయంలో గోపి ఆలోచనలు కూడా భవనం గురించే సాగుతున్నాయి. అది ఉన్న స్థలం ఒకప్పుడు తమదేనట. నాన్న చెప్పేవాడు. ‘ఎందుకు అమ్మేసారో! అది ఉండి ఉంటే ఏ కష్టాలు ఉండేవి తనకు’ అనుకున్నాడు నిట్టూర్పుగా. ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయి తనకు. తండ్రి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేయించాలి. పిల్లలు స్కూలు ఫీజులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెల్లెలు లావణ్య చదువు పూర్తయ్యి ఉద్యోగం చేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా తనమీద ఉంది. తండ్రి మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ ఆదాయం, తనకొచ్చే చాలీచాలని జీతంతో ఇవన్నీ ఎలా చెయ్యాలో అర్థంకాక మథనపడుతున్నాడు. కారు ఇంటికి చేరుకున్నాక గోపీ భార్యనూ, పిల్లలనూ, లావణ్యనూ చూసి చాలా సంతోషపడింది. ఆమె స్నానం చేసి తయారయ్యాక టిఫిన్ తిని కారులో తమ ఊరికి బయలుదేరారు.

కారు గోదావరి బ్రిడ్జి దాటి కొబ్బరితోటలూ, వరిచేల మధ్య నుంచి ఊరివైపు సాగుతుండగా ఊరిలో సాగిన తన జీవితం తలపుకొచ్చిందామెకు. తను ఒకే ఆడపిల్ల కావడంతో నాన్న గోపాలస్వామి, అన్నయ్య సుబ్బారాయుడు చిన్నప్పటినుండీ ఎంతో అపురూపంగా చూసుకునేవారు. అప్పట్లో తమకు గోదావరి తీరాన ముప్పై ఎకరాల పొలం ఉండేది. నాన్న, అన్నయ్యలు వ్యవసాయం చేసేవారు. వరి, కొబ్బరితో పాటు, కాయగూరలూ పండేవి. దీనికి తోడు పశువుల్ని కూడా పెంచేవారు. మంచి ఆదాయం వచ్చేది.

అన్నయ్య పొలంలో ఉండవలసి వచ్చినప్పుడు అన్నం క్యారేజీ తానే తీసుకు వెళ్ళేది. తిరిగి వచ్చేటప్పుడు పొలంలో కాసిన జామకాయలో, పండిన వేరుశెనగ కాయలో కండువాతో మూటగట్టి ఇచ్చేవాడు అన్నయ్య. తనకోసమే పెంచిన పూల మొక్కల నుండి గులాబీలూ, మల్లె పూలూ, కనకాంబరాలూ క్యారేజీలో నింపి ఇచ్చేవాడు. నాన్న పంటలమ్మిన డబ్బు తెచ్చుకోవడానికి టౌనుకి వెళ్ళినప్పుడు తనకోసం బట్టలూ, పౌడర్లూ, ప్పులూ ఏవి కోరితే అవి తెచ్చిపెట్టేవాడు. కొంచెం పెద్దమొత్తంలో డబ్బు వచ్చినప్పుడు ఒక్కో బంగారు నగ చేయిస్తూ ఉండేది అమ్మ రంగాయమ్మ. కొంత డబ్బు కూడబెట్టి భవిష్యత్తులో పెరుగుతుందని టౌనులో ఒక మంచి ప్రాంతంలో స్థలం కూడా కొన్నారు నాన్న.

ఊళ్ళో ఉన్నంత వరకూ చదివిన తనకు, పక్కఊరి హై స్కూలుకు పంపించి చదివించారు. ఆ తరువాత ఆడపిల్లలను టౌనుకు పంపించి చదివించడం తమ ఊర్లో ఎవరికీ అలవాటు లేనందున తన చదువు ముగిసిపోయింది. తనకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేసరికి తమ బంధువులు “పిల్లకు పెళ్లి చేసేస్తే ఒక బాధ్యత తీరిపోతుందిరా నీకు” అంటూ ఉండేవారు నాన్నతో. ఏవో సంబంధాలు తెస్తూ ఉండేవారు. అలా వచ్చిన సంబంధాలలో ఓ సంబందం నాన్నకు నచ్చి చెప్పారు. “అబ్బాయి వాళ్ళది అసలు మన పక్క ఊరేనమ్మా! వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారట. అబ్బాయి కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. బావున్నాడు, బుద్ధిమంతుడంటున్నారు”

“సరే నాన్నా! నీ ఇష్టం” అంటూ తన సమ్మతిని తెలియజేసింది. అలా ఘనంగా తన పెళ్లి జరిపించారు నాన్న, అన్నయ్యలు. తర్వాత కొంతకాలానికి అన్నయ్య కూడా పెళ్లయింది. మరుసటి సంవత్సరం గోపీ పుట్టడం జరిగింది. తరవాత కొన్నేళ్ళకు హఠాత్తుగా నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అమ్మ కూడా సంవత్సరం తిరుగకుండనే ఆయన చెంతకే చేరింది. అన్నయ్యకు మరో ఆడబిడ్డ లావణ్య పుట్టింది.

కాలక్రమంలో ఊరిలోని తమ పొలాలు చాలామటుకు నదీపాతానికి గురయ్యి పోవడంతో కొద్దిపాటి భూమి మాత్రమే మిగిలింది. వ్యవసాయం ఖర్చులు పెరిగి లాభమే లేకుండా పోయింది. పిల్లలు పెద్దవాళ్ళయేసరికి ఆదాయం సరిపోక చాలా ఇబ్బంది పడ్డాడు అన్నయ్య. గోపీ చదువుకుని టౌనులో ఉద్యోగం చూసుకున్నాడు. తన కొడుకు మాధవకు లావణ్యను చేసుకోవాలని అనుకునేది. మేనరికం సంబంధాల వల్ల సమస్యలుంటాయని డాక్టర్లే అంటూండడంతో విరమించుకుంది. అన్నయ్య ఉన్న కొద్దిపాటి పొలం, ఇల్లూ చూసుకుంటూ ఊరిలో ఉండిపోయాడు. గోపీ సుమతిల పెళ్ళయింతర్వాత టౌనులో కాపురం పెట్టుకున్నాడు. చెల్లెల్ని కూడా దగ్గరుంచుకుని చదివించుకున్నాడు.

ఇంతలో కారు ఇంటికి చేరుకోవడంతో నాన్న చెల్లెల్ని చూసి గబా గబా ఎదురు వచ్చి “రావే ప్రభా!” అన్నాడు.

“చెల్లెల్ని చూడగానే మోకాళ్ళ నొప్పులు పోయినట్టున్నాయి అన్నగారికి” పరిహాసమాడుతూ అంది వదిన రాజ్యలక్ష్మి ప్రభకు మంచినీళ్లు అందిస్తూ. అందరూ నవ్వుకున్నారు.

కాసేపటి తర్వాత “నేను వెళ్తాను నాన్నా! ఆఫీస్ ఉంది ఎప్పుడు రావాలో ఫోన్ చేసి చెబితే వస్తాను” అన్నాడు గోపీ.

“సరే గోపీ నువ్వు వెళ్ళిరా!” సుబ్బారాయుడు అనడంతో బయలుదేరాడు గోపీ.

మధ్యాహ్నం భోజనాలు అయ్యాకా కాసేపు విశ్రాంతి తీసుకుని ఊర్లోని తమ బంధువుల ఇళ్లకు వెళ్లి పెద్దవాళ్ళందరినీ పలుకరించి వచ్చింది ప్రభ. చిన్ననాటి స్నేహితురాళ్ళు కొందరు ఇంటికి వస్తే వాళ్ళతో కబుర్లతో సాయంకాలం దాకా సరదాగా గడిచిపోయింది. వాళ్ళు వెళ్ళాకా ఆరుబయట కూర్చుని ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. కాస్త పొద్దుపోయాకా భోజనానికి రమ్మని వదిన పిలవడంతో అన్నగారితో కూర్చుని భోజనం చేస్తూ అడిగింది

 “అన్నయ్యా రేపు మన ఊర్లోని వేణుగోపాలస్వామి గుడికి వెళదామా!”

“సరేనమ్మా! వెళదాం” అన్నాడు సుబ్బారాయుడు.

ఉదయం లేచి గుడికి బయలుదేరారు అన్నాచెల్లెళ్లు. సుబ్బరాయుడుకి నడవడానికి మోకాళ్ళు ఇబ్బంది పెడుతున్నా చేతికర్ర ఆసరాతో జాగ్రత్తగా నడుచుకుంటూ చెల్లెలితో గుడికి చేరుకున్నాడు సుబ్బారాయుడు. గుడిలో దేవుని దర్శనం అయ్యాకా బయటకు వచ్చి గుడి కొనేటి మెట్లమీద కూర్చున్నారు, ప్రసాదం తింటూ. సుబ్బారాయుడు దగ్గర ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే గోపీ ఫోన్. ఎత్తి “ఏంటి గోపీ!” అన్నాడు.

“చాలా శుభవార్త నాన్నా! మన లావణ్యకు హైదరాబాద్ సంబంధం చూస్తున్నాం కదా! వాళ్ళు సంబంధం మాకు సరేనంటున్నారని చెప్పారు నాన్నా మ్యారేజ్ బ్యూరో వాళ్ళు. మరొక విషయం నాన్నా! అత్తయ్య మ్యారేజ్ బ్యూరో వాళ్లకు ఫోన్ చేసి లావణ్యకు హైదరాబాద్‌లో ఫ్లాట్ ఉందని చెప్పమన్నదట. అందుకే వాళ్ళు ముందుకు వచ్చినట్టున్నారు” చెప్పాడు గోపీ.

సుబ్బారాయుడు ప్రక్కనే ఉన్న చెల్లెలి వైపు ఆశ్చర్యంగా చూస్తూ “సరే నేను అత్తయ్యతో మాట్లాడతాను” అన్నాడు. ఫోన్ పెట్టేసి

“ఏమిటే! ప్రభ ఇదీ లావణ్యకు హైదరాబాద్ ఫ్లాట్ ఇస్తామని చెప్పావట. మేము హైదరాబాద్‌లో ప్లాట్ ఎలా ఇవ్వగలం” అన్నాడు సుబ్బారాయుడు ఆందోళనగా.

“అన్నయ్యా హైదరాబాద్‌లో నాకున్న ఫ్లాట్ లలో ఒకటి లావణ్యకు వ్రాద్దామని అనుకుంటున్నాను. నా చిన్నప్పటి నుంచీ నా మీద ప్రేమతో ఎన్నో చేసారు నాన్నా, నువ్వూ. నీకు ఏం చేద్దామన్నా వద్దంటావు.. నీ మీద నా ప్రేమను ఇలా నా మేనకోడలిపై చూపించుకొనీ” చెప్పింది ప్రభ అన్నగారి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

“అది కాదు ప్రభా!” అని సుబ్బారాయుడు ఏదో చెప్పబోతుంటే

“ఇంకేమీ మాట్లాడకు.వేణుగోపాలస్వామిని తలుచుకుని పెళ్లి పనులు మొదలు పెట్టు” అంది గుడి వైవు చూపిస్తూ.

చెల్లెలి అభిమానానికి సంతోషం ముప్పిరిగొనగా ఇంకేమీ మాట్లాడలేకపోయాడు సుబ్బారాయుడు.

అన్నాచెల్లెళ్ల ఇద్దరి మనసులలో ఎంతో ప్రశాంతత ఆ గుడిలో కోనేటిలా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here