పీవీగారితో అరుదైన ఒక జ్ఞాపకం!

2
10

[box type=’note’ fontsize=’16’] మాజీ ప్రధాని పి.వి. నరసింహారావుగారి శత జయంతి ఉత్సవాల సమయంలో – వారితో తమకున్న ఒక అపురూప జ్ఞాపకాన్ని సంచిక పాఠకులకు అందిస్తున్నారు ఏ. అన్నపూర్ణ. [/box] 

అప్పుడు పీవీనరసింహారావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యామంత్రిగా వున్న రోజులు. వారికి సాహిత్యం పట్ల ఎంత మక్కువంటే సామాన్యులైన పండితులు రచయితలను కూడా ఆదరించే గొప్పస్వభావం. మా నాన్నగారు కాకినాడ పిఠాపురంరాజావారి కళాశాలలో ఇంగ్లీషు లెక్చరరుగా వున్నారు. వారు రచయిత, కవి, సంస్కృత పండితులుగా ఎన్నో పురాణ ఆధ్యాత్మిక గ్రంథాలను వ్రాసేవారు. సంస్కృతంలో వున్న భారత భాగవత రామాయణ గ్రంథాలను అందరూ చదువుకునేలా రాసేరు. ఆ మూడు గ్రంథాలనూ ఆవిష్కరించే కార్యక్రమం తలపెట్టారు. ఆ ముగ్గురూ ఎవరు అయితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. మొదట పీవీగారే మెదిలారు. అయితే వారు వస్తారా…. అయినా ప్రయత్నం చేద్దామని అభ్యర్థిస్తూ లేఖ రాసేరు.

అదే మరొకరైతే నాకు వీలుపడదు, ఊపిరిసల్పనంత పనితో వున్నాను….అనో… అసలా లేఖను పరిశీలన చేసేవారు కాదేమో… అక్కడ వున్నది ఎవరు? పీవీగారు కదా! వెంటనే అంగీకరిస్తూ జవాబు రాసేరు. నాన్నగారి ఆనందానికి అంతులేదు. సరే ఒక గ్రంథం పీవీగారు ఆవిష్కరిస్తారు. మిగతా రెండూ? అప్పటికే ఉద్దండ పండితులూ ప్రఖ్యాత కవి రచయితలు అయిన విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధానిగార్లు ఆప్త మిత్రులు నాన్నగారికి. కళలకు పెట్టింది పేరు కాకినాడ. తరచుగా సాహితీ కార్యక్రమాలు సదస్సులూ జరిగినపుడు వారిద్దరూ మా ఇంటికి వచ్చి ఉండేవారు. వారు బయట ఎవరింటిలోనూ భోజనం చేయరు. అమ్మ మడిగా శుచిగా రుచిగా పిండివంటలతో వంటచేసేది. కనుక మాకు బాగా ఆప్తులు. వారు వుండనే వున్నారు. వారికీ చెప్పగానే మిగిలిన పనులు మానుకుని ”పీవీగారే వస్తున్నప్పుడు మేము రాకపోడం జరగనే జరగదు” అన్నారు.

అంతటి సాహితీమూర్తులు వేదికను అలంకరిస్తే ఆ మహోత్సవం ఎలా వుంటుంది? ఎందరో నాన్నగారి దగ్గిర చదువుకున్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు గ్రామాల జమీందార్లు సినీప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందాయి. వేదిక ఎక్కడ వుండాలి….. నగరానికి ముఖ్యమైన బజారు సినీథియేటర్లూ వున్న వీధిలో వేయి మంది జనం పట్టే సూర్య కళామందిర్ ముస్తాబైంది. కాకినాడ ప్రత్యేకతే అది. సినిమా థియేటర్లు అన్నీ అప్పట్లో ఒకే వీధిలో పన్నెండుదాకా ఉండేవి. చుట్టుపక్కల గ్రామాలవారికీ ఈవార్త తెలిసిపోయింది. అసలే సినిమా మాట్నీ వదిలిన టైము, ఆ జనం ఈ జనం వచ్చేసి చోటులేక అక్కడి రోడ్డుమీద అటూఇటూ నిలబడ్డారు. పోలీసులు “మీకేం కనబడుతుంది… ఇంటికి పొండి” అంటే ”మైకులు పెడతారు కదండీ… ఆ మైకులో వారి ముగ్గురి ప్రసంగాలూ వింటాము, మేము వెళ్ళం.” అన్నారు. ఆనాటి కవుల వైభవం అంతటిది. అయితే అన్నిఅంశాలలో గొప్పవారైన పీవీగారిని చూడాలన్న ఆత్రం అది. ఇక పీవీగారు ఆవిష్కరించే గ్రంథం చదివే తీరికలేని వారు హైదరాబాదు నుంచి కాకినాడ కారులో వస్తూ శ్రద్ధగా మొత్తం చదివారు. ఇక్కడ మీరు గమనించండి… రాజకీయ నాయకులు ఎలా వుంటారు? అసలా పుస్తకం వైపు కన్నెత్తి చూస్తారా? ఏదో ఒక పేజీ చదివేసి రాసిచ్చే సెక్రటరీలు వుంటారు. మొక్కుబడిగా నాలుగు మాటలు చెప్పేసే వారిని చూసేం. వీరు అలాంటివారు కానే కాదు.

అందుకే ఈ విషయం స్వయంగా చెప్పి పుస్తకం గురించి మాటాడిన అపర నర్సింహుడీతడు. ఎందరో రచనలు చేస్తారు. పేరున్న రచయితల చేత ఆవిష్కరింప చేయాలనీ ఆశిస్తారు. అదంతా సులువుగా జరగకపోవచ్చు. కానీ పీవీగారు మామూలు వ్యక్తికాదు. ఔపోసన పట్టే మేధావి. చిన్న-పెద్ద అనే తేడా లేదు. వారికి నచ్చాలి అంతే! గ్రంథ రచయితగా నాన్నగారూ సంతానమైన మేమూ చేసుకున్న అదృష్టం. కాకినాడ నగర చరిత్రలోనే చెప్పుకోతగిన ఈ సాహిత్య సభకు పీవీగారు రావడం, అది అంగరంగ వైభవంగా జరగడం మాకు ఎప్పటికీ మరువలేని అనుభూతి.

ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో ‘భువనవిజయం’ గురించి చరిత్రలో చదివాము. ‘అది ఇలాగే జరిగి వుండాలి’ అంటూ అప్పటి పత్రికలూ వ్రాసేయి. రేడియోలో వార్తలు వినిపించారు. ఒక్క సాహిత్యమే కాదు రాజకీయంగా, వ్యక్తిపరంగా పీవీగారి జీవితం ఎంతో ఉత్తమమైంది. వారి ఆలోచనలు స్ఫూర్తిదాయకం. వారు రాసిన పుస్తకాలూ ఎందరికో మార్గదర్శకాలు. వారి ప్రభావం చాలామందిపై ఉంటుంది.

అందరికీ చిరస్మరణీయులు. కాలంతోపాటు మారుతూ ప్రజల అభిమానం చూరగొనడం ఉత్తమ నాయకుల లక్షణం. అది నిరూపించిన పాములపర్తి వెంకట నరసింహరావుగారు ధన్యులు.

వాణిగారు నాన్నగారిని దర్శించుకోవడం వారి ఆశీస్సులు తీసుకోవడం మాకెంతో అదృష్టం. వారిని తలుచుకుని ఈ వ్యాసం రాసేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here