‘నేను’ ఎవరు?

1
6

రమణ సద్గురువు మనకి అందిచ్చిన అద్భుతమైన పుస్తకం ‘నేను’ ఎవరు?

ప్రతివాళ్ళూ తమకు దుఃఖమే లేని ఆనందాన్ని కోరతారు. తమని తాము, అందరికంటే, అన్నిటికంటే, ఎక్కువగా ప్రేమిస్తారు. ఆనందమే ప్రేమకి మూలకారణం. నిద్రలోనూ, మనస్సులేనప్పుడూ, అనుభవించే సహజమైన ఆనందాన్ని అందుకోవటానికి తనని తను తెలుసుకోవాలి. దానికి జ్ఞాన మార్గం లోని “నేనెవరు” అనే విచారణ ముఖ్య సాధనం.

1.నేనెవరు

ఏడు ధాతువులతో కూడిన ఈ స్థూల దేహం నేను కాను. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని అనుభవించే అయిదు జ్ఞానేంద్రియాలు (చెవులు, చర్మమూ, కళ్ళూ,నాలికా, ముక్కూ) నేను కాను. మాట్లాడటం, కదలటం, పట్టుకోవటం, విసర్జనం, రమించటం వంటి పనులు చేసే నోరు, కాళ్ళు, చేతులు, గుదము, లింగము, ఇవేవీ నేను కాను. దేహంలో అయిదు విధాలుగా తిరిగే పంచ ప్రాణాలు నేను కాను. ఆలోచించే మనస్సుని నేను కాను. అన్ని వస్తువులూ, వాటి వర్తనా వొదిలి, వాటి వాసనల స్పృహ ఉన్న అజ్ఞానాన్ని నేను కాను.

2. ఇవేవీ నేను కాకపోతే మరి నేనెవరు.

పైన చెప్పిన వాటన్నిటినీ “ఇది కాదు” “ఇది కాదు” అని తోసివేస్తే మిగిలే ఎరుక, అదే నేను.

3. ఎరుక స్వభావమేమిటి

ఎరుక స్వభావము ఉనికి, చైతన్యము, ఆనందము

4. ఆత్మ జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది

చూడబడే ఈ ప్రపంచమంతా ఎప్పుడు కనబడకుండాపోతుందో అప్పుడు అన్నిటినీ చూసే ఆత్మ జ్ఞానం కలుగుతుంది.

5. ప్రపంచం కనిపిస్తున్నప్పుడు ఆత్మజ్ఞానం కలగదా?

కలగదు.

6.ఎందువల్ల

చూసేవాడూ, చూడబడేదీ తాడూ పాము లాంటివి. ఎల్లాగైతే పాము అనే భ్రాంతి పోయేదాకా దానికి ఆధారమైనది తాడు అని తెలియదో, ప్రపంచం నిజమనే నమ్మకం పొయ్యేదాకా, దానికి ఆధారమైన ఆత్మని తెలుసుకోలేవు.

7.కనిపించే ఈ ప్రపంచం ఎప్పుడు మాయమౌతుంది.

విషయాల్ని గుర్తించే మనస్సు ఎప్పుడు కదలకుండా ఉంటుందో అప్పుడు ప్రపంచం అదృశ్యమౌతుంది.

8.మనస్సు స్వభావమేంటి

ఆత్మలో ఉన్న అద్భుతమైన శక్తే మనస్సు. అన్ని ఆలోచనలకీ అదే మూల కారణం. ఆలోచనలు కాకుండా వేరే మనస్సనేది లేదు. అందుకని ఆలోచనే మనస్సు స్వభావం. ఆలోచనలకి వేరుగా ప్రపంచమనే స్వతంత్ర వ్యవస్థ లేదు. గాఢ నిద్రలో ఆలోచనలు లేవు, అందుకని ప్రపంచమే లేదు. మేలుకున్నప్పుడూ, కలల్లోనూ ఆలోచనలున్నయ్యి కనుక ప్రపంచం కనిపిస్తుంది. సాలీడు తనలోంచి దారాన్ని బయటికి తీసి మళ్ళీ తనే ఎట్లా లోపలికి తీసుకుంటుందో, అలాగే మనస్సు ప్రపంచాన్ని తనే కల్పించి తిరిగి దాన్ని తనలోకి తీసుకుని నాశనం చేస్తుంది. ఆత్మ నుంచి మనస్సు ఎప్పుడు బయటికి వొచ్చినా ప్రపంచం కనిపిస్తుంది. అందుకని ప్రపంచం నిజమైనదిగా కనిపిస్తే ఆత్మ కనిపించదు. అలాగే ఆత్మ సాక్షాత్కారమైనపుడు ప్రపంచం కనిపించదు. ఎల్లప్పుడూ మనస్సు స్వభావాన్ని పరిశీలిస్తుంటే, మనస్సు నాశనమయ్యి ఆత్మ మిగులుతుంది. మనస్సు ఎప్పుడూ స్థూలంగా ఉండేవాటి మీద ఆధారపడుతుంది. అది విడిగా ఉండలేదు. మనస్సునే సూక్ష్మ శరీరమనీ జీవుడనీ అంటారు.

9.మనస్సు స్వభావాన్ని తెలుసుకోవటానికి విచారణా పద్ధతులు ఏమిటి.

“నేను” అంటూ ఈ దేహంలో మెదిలేది మనస్సే. దేహంలో ఎక్కడ ఈ “నేను” అనే ఆలోచన మొదలౌతున్నదని విచారిస్తే అది హృదయంలో మొదలౌతుందని అర్ధమౌతుంది. అదే మనస్సుకు మూలం.”నేను, నేను” అని ఎవరన్నా ఆలోచిస్తే వాళ్ళు మనస్సుకు మూలమైన హృదయాన్నే చేరతారు. మనస్సులో మొదలయ్యే ఆలోచనల్లో “నేను” అనేది మొదటిది. ఇది మొదలైన  తర్వాతనే మిగతా ఆలోచనలు వొస్తాయి. ఉత్తమ పురుష అయిన “నేను” మొదలైన తరవాతే మధ్యమ పురుష అయిన “నువ్వు”, ప్రథమ పురుష అయిన “వాడు” వొస్తాయి. ఉత్తమ పురుష అయిన “నేను” లేకుండా మధ్యమ పురుష, ప్రథమ పురుష ఉండవు.

10. మనస్సు ఎల్లా నాశనమౌతుంది.

“నేనెవరు”అనే విచారణ వల్ల. “నేనెవరు” అనే ఆలోచన మిగతా అన్ని ఆలోచనలనీ నాశనం చేసి, మంటని ఎగదోయటానికి ఉపయోగపడే పుల్ల లాగే అది కూడా చివరికి నాశనమైపోతుంది. అప్పుడు, ఆత్మజ్ఞానం వొస్తుంది.

11.”నేనెవరు” అనే ఆలోచనని వొదలకుండా పట్టుకుని ఉండే ఉపాయం ఏమిటి.

మిగతా ఆలోచనలు వొచ్చినపుడు వాటిని పొడిగించకుండా “ఇవి ఎవరికి కలుగుతున్నయ్యి” అని విచారించాలి. ఒక ఆలోచన వొచ్చినప్పుడు “ఇది ఎవరికి వస్తోంది” అని శ్రద్ధగా విచారించాలి. అప్పుడు “నాకు వస్తోంది” అని సమాధానం వొస్తుంది. అప్పుడు “నేనెవరు” అని విచారిస్తే మనస్సు దాని మూలంలోకి వెళ్ళిపోయి, మొదలైన ఆలోచన ఆగిపోతుంది. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చేస్తే మనస్సుకి దాని మూలంలో స్థిరంగా ఉండే శక్తి ఎక్కువ అవుతుంది. సూక్ష్మమైన మనస్సు, బుద్ధి లోంచీ, ఇంద్రియాల్లోంచీ, బయటికి వొస్తే, స్థూలమైన పేర్లూ, రూపాలూ ఏర్పడతాయి. ఎప్పుడు మనస్సు, హృదయంలో నిలిచి ఉంటుందో, పేర్లూ రూపాలూ అదృశ్యమౌతాయి. మనస్సుని బయటకు పోనియ్యకుండా, దాన్ని హృదయంలోనే అట్టిపెట్టటాన్ని “లోచూపు” (అంతర్ముఖం) అంటారు. మనస్సు, హృదయం నించి బయటికిపోతే దాన్ని”బైటిచూపు” (బహిర్ముఖం) అంటారు. అట్లా, ఎప్పుడైతే మనస్సు లోచూపుతో హృదయంలో ఉందో, అన్ని ఆలోచనలకీ ఆధారమైన “నేను” అనే అహంకారం అణిగిపోయి ఎప్పుడూ ఉండే ఆత్మ ప్రకాశిస్తుంది. ఎవరే పని చేసినా “నేను” అనే అహంకారం వొదిలి చెయ్యాలి. ఎవరైనా ఈ విధంగా చేస్తే, వారికి అంతా భగవంతుడి స్వరూపంగా కనిపిస్తుంది

12.మనస్సుని శాంతింప చేయటానికి వేరే మార్గాలేమీ లేవా.

విచారణ కాకుండా వేరే సరైన మార్గాలు లేవు. మిగతా మార్గాల్లో మనస్సుని స్వాధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే మనస్సు స్వాధీనంలోకి వొచ్చినట్టు కనిపిస్తుంది కానీ మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. శ్వాసని నియమించినా కూడా మనస్సు అణుగుతుంది, కానీ అది అట్లా శ్వాసని నియమించినంత సేపే ఉంటుంది. ఎప్పుడైతే శ్వాస మళ్ళీ మొదలౌతుందో మనస్సు కూడా మిగిలి ఉన్న సంస్కారాలకి తగినట్టుగా కదలటం మొదలౌతుంది. మనస్సుకీ, శ్వాసకీ మూలం ఒకటే. ఆలోచనే మనసుకి లక్షణం. “నేను” అనేదే మనస్సులో వొచ్చే మొదటి ఆలోచన. అదే అహంకారం. అహంకారం మొదలైన చోటే శ్వాస కూడా మొదలౌతుంది. అందుకనే మనస్సెప్పుడు అణిగితే శ్వాస కూడా అణుగుతుంది. అలాగే శ్వాస అణిగితే మనస్సు కూడా అణుగుతుంది. కానీ గాఢ నిద్రలో మనస్సు అణగినా శ్వాస ఆగదు.. దేహాన్ని రక్షించటానికీ, దేహం చావలేదని ఇతరులు గుర్తుపట్టటానికి వీలుగా భగవంతుడు చేసిన పద్ధతి  ఇది.

మేలుకున్నప్పుడూ, సమాధిదశ లోనూ, ఎప్పుడైతే మనస్సు అణిగిందో, అప్పుడు శ్వాస కూడా అణుగుతుంది. మనస్సు స్థూల రూపమే శ్వాస. చనిపోయేదాకా మనస్సు, దేహంలో శ్వాసని అట్టే పెట్టుతుంది. దేహం చనిపోతే, మనసు తనతోపాటు శ్వాసని తీసుకెళుతుంది. అందువల్లే ప్రాణాయామం లాంటి శ్వాసని నియంత్రించే పద్ధతులు మనస్సుని లొంగతీయటానికి సహాయపడతాయిగానీ మనస్సుని నాశనం చేయలేవు. శ్వాసని నియంత్రించే పద్ధతుల లాగానే  భగవంతుడి రూపాల మీద ధ్యానమూ, మంత్రాలని జపించటమూ, భోజన నియమాలూ లాంటివి మనస్సు అణచటానికి మాత్రమే సహాయకారులు.

భగవంతుడి రూపాలు ధ్యానం చేయటమూ మంత్రజపమూ లాంటి వాటి వల్ల మనస్సు కదలకుండా ఒకే విషయం మీదే ఉంటుంది. ఏనుగు తొండం లాగే, ఎప్పుడూ కదులుతూ ఉండటం మనస్సు లక్షణం. ఎల్లాగైతే ఏనుగు, తొండానికి గొలుసు అందిస్తే దాన్నేపట్టుకుని తొండాన్ని స్థిరంగా ఉంచుతుందో, అల్లాగే మనస్సుకి ఒక రూపాన్నో నామాన్నో అలవాటు చేస్తే, అది దాన్నే పట్టుకుని ఉంటుంది. ఆలోచనలు ఒకేసారి అనేకం వొస్తే ఒక్కొక్క ఆలోచనా బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గి మనస్సు ఏకాగ్రస్థితి చెందుతుందో, అల్లాంటి మనసుకు ఆత్మ విచారణ తేలిక అవుతుంది.. ఉన్న అన్ని నియమాలలో మితంగా సాత్త్విక ఆహారాన్ని తినటం అనేది ఉత్తమం అయినది. దీన్ని పాటించటం వల్ల మనస్సు లోని సత్త్వగుణం పెరిగి ఆత్మ విచారణకి సహాయ పడుతుంది.

13.సముద్రంలో అలల లాగా ఆగకుండా విషయాల గురించి ఆలోచనలు వొస్తాయి. ఇవ్వన్నీ ఎప్పుడు నాశనమౌతాయి.

ఆత్మ ధ్యానం పెరుగుతున్నకొద్దీ ఆలోచనలు నాశనమౌతాయి.

14. మొదలనేది లేకుండా వొస్తున్న ఈ ఆలోచనలు పోయి శుద్ధమైన ఆత్మ లాగా నిలవటానికి అవకాశం ఉందా?

అవకాశం ఉందా, లేదా అనే అనుమానాలు పెట్టుకోకుండా ఆత్మ విచారణని గట్టిగా, వొదలకుండా చెయ్యాలి. గొప్ప పాపాత్ముడైన వాడు కూడా “నేను పాపిని నన్నెవరు రక్షిస్తారు” అని బాధ పడి ఏడవకుండా, “నేను పాపిని ” అనే భావాన్ని పూర్తిగా వొదిలి, మనస్సు కేంద్రీకరించి ఆత్మ విచారణ చేస్తే అతను తప్పకుండా కడతేరుతాడు. చెడ్డదీ, మంచిదీ అంటూ మనస్సు, రెండు రకాలుగా ఉండదు. మసస్సు ఒక్కటే కానీ మనస్సులో మిగిలిన సంస్కారాలు రెండు రకాలు, శుభమైనవీ అశుభమైనవీ. మనస్సు శుభమైన సంస్కారాలతో ఉన్నప్పుడు దాన్ని మంచిదనీ అశుభమైన సంస్కారాలతో కూడినపుడు దాన్ని చెడ్డదనీ అంటారు.

మనస్సుని ప్రపంచ విషయాల మీదో ఇతరుల విషయాల మీదో తిరగనివ్వకూడదు. ఇతరులు ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళ మీద ద్వేష భావం పెంచుకోకూడదు.  కోరికనీ ద్వేషాన్నీ, రెంటినీ వొదిలెయ్యాలి. ఇతర్లకి ఏవైతే ఇస్తున్నామో అవ్వన్నీ మనకి మనమే ఇచ్చుకుంటున్నామనే సత్యం అర్ధమౌతే ఇతర్లకి ఎందుకివ్వడు? అహంకారం లేచినపుడు అన్నీ లేస్తాయి. అహంకారం అణగితే అంతా అణుగుతుంది. వినయంతో ఎప్పటిదాకా ఉంటామో అప్పటిదాకా ఫలితాలు చక్కగా ఉంటాయి. మనస్సు అణిగితే ఎవరైనా, ఎక్కడైనా ఉండొచ్చు.

15.ఎంతకాలం విచారణ కోసం సాధన చెయ్యాలి?

విషయాల సంస్కారాలు ఎప్పటిదాకా మనస్సులో ఉంటయ్యో అప్పటిదాకా “నేనెవరు” అనే విచారణ చేస్తూ ఉండాలి. ఆలోచనలు ఎప్పుడు మొదలౌతయ్యో గమనించి ఎక్కడ మొదలయ్యాయో అక్కడే అప్పుడే వాటిని నాశనం చెయ్యాలి. ఎవరైనా ఆపకుండా ఆత్మ గురించే ఆలోచిస్తే, ఆత్మని పొందేందుకు అది సరిపోతుంది. కోటలో శత్రువులున్నంతవరకూ వాళ్ళు బయటికి వొచ్చి పోరాడుతారు. వొస్తున్న వాళ్ళందరినీ, బయటికి వొచ్చీ రాగానే నాశనం చేస్తే, చివరికి కోట మన వశమౌతుంది.

16. ఆత్మ లక్షణము ఏమిటి

నిజంగా ఉండేది ఆత్మ ఒక్కటే. ప్రపంచమూ, జీవుడూ ఈశ్వరుడూ ఇవన్నీ దాంట్లో కనిపించే దృశ్యాలే. ముత్యపు చిప్పలో వెండి లాగా ఈ మూడూ ఒకే సారి కనిపిస్తాయి, ఒకే సారి మాయమౌతాయి.”నేను” అనే ఆలోచన ఏ మాత్రమూ లేనిదే ఆత్మ. దాన్నే “నిశ్శబ్దం” అంటారు. ఆత్మే ప్రపంచమూ, ఆత్మే “నేను”, ఆత్మే “దేవుడు”. అంతా శివమే అంతా ఆత్మే.

17. అంతా భగవంతుడి సృష్టే కాదా?

కోరిక, ప్రయత్నం, నిర్ణయం ఇవేవీ లేకుండానే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడి సమక్షంలో  సూర్య శిల మంటలని చిమ్ముతుంది, తామరలు పూస్తాయి, జనాలు వాళ్ళ పనులు చక్కబెట్టుకుని విశ్రాంతి తీసుకుంటారు. అయస్కాంతం దగ్గరుంటే ఇనప సూది కదిలినట్టే, భగవంతుడి సన్నిధిలో, మూడు గుణాలకీ, అయిదు ఇంద్రియాలకి లోబడే జీవులు, వాళ్ళ ప్రారబ్ధం ప్రకారం పనులు చక్కబెట్టుకుని విశ్రాంతి తీసుకుంటారు. భగవంతుడు ఏ నిర్ణయమూ తీసుకోడు. ఏ కర్మా ఆయనని అంటదు. సూర్యుణ్ణి జనాల పనుల ఫలితాలు బాధించవు, ఆకాశాన్ని మిగతా నాలుగు భూతాలూ బాధించలేవు, ఇదీ అలాగే.

18.భక్తులలో ఎవరు అందరికంటే గొప్ప భక్తుడు

ఎవరు తనని తాను ఆత్మ రూపుడైన భగవంతునికి పూర్తిగా అర్పించుకుంటాడో అతను అందరికంటే గొప్ప భక్తుడు. తనని తాను భగవంతునికి పూర్తిగా  అర్పించుకోవటమంటే, ఆత్మకి సంబంధించని ఆలోచనలు మొదలవ్వటానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా ఎల్లప్పుడూ ఆత్మలో స్థిరంగా ఉండడమే. తన మీద పెట్టిన బరువూ బాధ్యత ఎంత పెద్దవైనా భగవంతుడు వాటిని భరిస్తాడు. దేవుడి అద్భుత శక్తే అన్నిటినీ నడిపిస్తున్నప్పుడు ఆ శక్తికి పూర్తిగా శరణాగతి కాకుండా, ఏది చెయ్యాలి ఎట్లా చెయ్యాలి, ఏది చెయకూడదు, ఎందువల్ల అనుకుంటూ ఎప్పుడూ చింతించటం ఎందుకు? రైలు పెట్టె బరువులన్నిటినీ తీసుకుని వెళ్తుందని తెలిసీ, దాన్ని ఎక్కిన తరవాత బరువులన్నీ మన నెత్తినే మోస్తూ బాధపడడం కంటే దాన్ని కింద పెట్టి సుఖంగా ఉండటం మెరుగు కదా.

19. సంగం లేకుండా ఉండటం(నిస్సంగం) అంటే ఏమిటి

ఆలోచనలు మొదలవ్వగానే, వాటిని, అవి పుట్టినచోటే, ఏ మాత్రం మిగలకుండా నాశనం చేయటమే నిస్సంగం. ముత్యాల్ని వెదకటానికి నడుముకి రాయి కట్టుకుని సముద్రపు అడుగుకి ముణిగి ముత్యాల్ని ఎట్టా తీస్తారో అట్లాగే ప్రతి ఒక్కళ్ళూ సంగం లేకుండా తనలోతాను ముణిగి ఆత్మ ముత్యాన్ని సంపాదించాలి.

20. దేవుడో, గురువో, జీవుడికి విముక్తి ప్రసాదించగలరా.

దేవుడు, గురువు దారి మాత్రమే చూపిస్తారు. వాళ్ళకి వాళ్ళే జీవుణ్ణి విముక్తి స్థితికి తీసుకువెళ్ళరు. నిజానికి దేవుడు, గురువూ ఒక్కరే. పులి నోట్లో పడిన ఎర ఎలా తప్పించుకోలేదో, దయతో గురువు చూసిన చూపుతో ప్రభావితులైన వాళ్ళని గురువు నాశనం కాకుండా తప్పక రక్షిస్తాడు. కానీ ప్రతివాళ్ళూ దేవుడో, గురువో చూపించిన దారిలో సొంతంగా ప్రయత్నించి కష్టపడి విముక్తిని సాధించాలి. తనని తాను తెలుసుకోవాలంటే జ్ఞానం ఉన్న సొంత కంటితో చూడాలికానీ వేరే వాళ్ళ కళ్ళతో చూసి ఏమి లాభం. రాముడైనవాడికి తాను రాముడని తెలుసుకోవాలంటే అద్దం సహాయం అవసరమా?

21.ముక్తి కోసం తపించేవాడికి తత్త్వాలూ, వాటి ప్రకృతిని విచారించటం తప్పనిసరా?

చెత్తని పారేసేముందు అదేమిటి, దాంట్లో ఏముంది అనే విచారణ అనవసరమైనట్లే, ఆత్మని తెలుసుకోవాలనుకునేవాడికి తత్త్వాలు ఎన్ని?, వాటి గుణాలూ, ప్రకృతులూ ఏమిటి అనేది అనవసరం. ఆత్మని కనిపించకుండా దాచి పెట్టే తత్త్వాలూ వాటి విచారణని పూర్తిగా తోసిపుచ్చాలి. ప్రపంచాన్ని ఒక కలగా అనుకోవాలి.

22. మెలకువకీ కలకీ తేడా ఏమీ లేదా

మెలకువ ఎక్కువ సేపు ఉంటుంది. కల తక్కువ సేపుంటుంది. మేలుకున్నప్పుడు అదే నిజమని, మేలుకుని ఉన్నంతసేపూ ఎలా అనిపిస్తుందో, కల జరుగున్నంతసేపూ, కల కూడా నిజమే అనిపిస్తుంది. కలలో మనస్సు ఇంకో దేహాన్ని ధరిస్తుంది. మెలకువా, కలా రెండిట్లోనూ ఆలోచనలూ, పేర్లూ రూపాలూ ఒకేసారి ఏర్పడతాయి.

23. విముక్తిని పొందాలనుకునేవారికి పుస్తకాలు చదవటం ఏమన్నా సహాయపడుతుందా?

అన్ని పుస్తకాలూ ముక్తిని పొందాలంటే మనస్సుని అణచాలి అంటయ్యి. అవ్వన్నీ ఏకకంఠంతో చెప్పే విషయం, మనసుని అణచటం అనేది, సరిగ్గా అర్థమైతే అంతులేకుండా చదవటం అవసరం లేదు. మనస్సుని శాంతింపచెయ్యాలంటే ఇతరాలన్నీ వొదిలి తన ఆత్మ గురించే తనలోపల తానే వెదుక్కోవాలి. ఈ వెదుకులాట పుస్తకాల్లో ఎట్లా చేస్తారు. తన ఆత్మని జ్ఞాననేత్రంతో తనే తెలుసుకోవాలి. ఆత్మ అయిదు కోశాల లోపల ఉంది, పుస్తకాలు వాటి బయట ఉన్నయ్యి. పంచ కోశాలని పూర్తిగా వొదిలి విచారణ చెయ్యాలిన ఆత్మని పుస్తకాల్లో వెదకటం శుద్ధ దండగ. తను నేర్చుకున్నదంతా తనే మర్చి పోవాల్సిన సమయం వొస్తుంది.

24. ఆనందమంటే ఏమిటి

ఆత్మ లక్షణం ఆనందం. ఆనందమూ, ఆత్మా రెండూ ఒక్కటే వేరు కావు. ప్రపంచంలో ఉన్న ఏ వస్తువులోనూ ఆనందం లేదు. ప్రపంచంలోని విషయాల ద్వారా ఆనందం వొస్తోందని మనం అజ్ఞానం వలన ఊహిస్తాము. మనస్సు బయటికి పోతే అది దుఃఖాన్నే  అనుభవిస్తుంది. నిజానికి, మనసులోని కోరికలు తీరితే అది తన సొంత చోటికి తిరిగి వెళ్ళి ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. అలాగే కోరుకున్న విషయాలు దొరికినప్పుడూ, వద్దనుకునే విషయాలు తొలిగినప్పుడూ, నిద్రలోనూ, సమాధి లోనూ, మూర్ఛలోనూ, మనస్సు అంతర్ముఖమై శుద్ధ ఆత్మానందాన్ని అనుభవిస్తుంది. మనస్సు, అలుపు లేకుండా మాటిమాటికీ బయటికి వెళ్ళి, మళ్ళీ తిరిగి వెనక్కి వొస్తూ ఉంటుంది. బయట ఎండ మాడుస్తున్నా చెట్టు నీడ చల్లగా ఉంటుంది కాబట్టి ఎండలో తిరిగేవాళ్ళు, చెట్టు నీడ కోసం వెదికి దానికింద జేర్తారు. నీడ లోంచి ఊరికే ఏమీ పనిలేకుండా ఎండలోకి వెళ్ళొస్తూ ఉండేవాడు మూర్ఖుడు. ఎలాగైతే  తెలివైనవాడు నీడ వొదిలి అనవసరంగా పోడో సత్యాన్ని తెలిసినవాడి మనస్సు బ్రహ్మాన్ని వొదిలిపోదు. సత్యం తెలియని మూర్ఖుల మనస్సు ప్రపంచం చుట్టూ తిరుగుతూ దుఃఖపడి క్షణ కాలం ఆనందం కోసం పరబ్రహ్మని వెతుక్కుంటూ వెనక్కి వొస్తుంది. నిజానికి ప్రపంచం అనేది ఒక ఆలోచనే. ఏ ఆలోచనా రాకుండా ఉంటే ప్రపంచం అదృశ్యం అవుతుంది. అప్పుడు మనస్సు ఆనందాన్ని అనుభవిస్తుంది. ఎప్పుడైతే ప్రపంచం కనిపిస్తుందో మనస్సు దుఃఖాన్ని అనుభవిస్తుంది.

25. జ్ఞాన దృష్టి అంటే ఏమిటి.

మౌనంగా ఉండటాన్నే జ్ఞాన దృష్టి అంటారు. మౌనంగా ఉండటం అంటే మనస్సుని ఆత్మలో స్థిరంగా ఉంచటం. టెలిపతీ, జ్యోతిషం, జరిగినవీ జరగబోయేవీ చెప్పటం లాటివి జ్ఞాన దృష్టి కానే కావు.

26. కోరికలు లేకుండా ఉండటానికీ జ్ఞానానికీ గల సంబంధమేమిటి.

కోరికలు లేకుండా ఉండటమే జ్ఞానం. అవి రెండూ వేరు కావు, ఒక్కటే. కోరికలు లేకుండా ఉండటమంటే మనస్సుని ఏ విషయం మీదకీ పోనీకుండా ఉండటం. జ్ఞానమంటే ఏ విషయమూ కనిపించకుండా ఉండటం. ఇంకోవిధంగా చెప్పాలంటే ఆత్మకి ఇతరమైన వాటికోసం వెదక్కపోవటమే, కోరికలు లేకుండా ఉండటమూ, నిస్సంగమూ. ఆత్మని వొదలకపోవటమే జ్ఞానం.

27. విచారణకీ ధ్యానానికీ తేడా ఏమిటి.

మనస్సుని ఆత్మలోనే ఉంచటం విచారణ. సచ్చిదానందమైన బ్రహ్మే తన ఆత్మ  అని ఆలోచించటం ధ్యానం.

28 ముక్తి అంటే ఏమిటి.

బంధనాల్లో ఉన్న తన ఆత్మ స్థితిని గురించి విచారణ చేసి తన నిజమైన స్థితిని గ్రహించటమే ముక్తి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here