క్విల్ట్

6
2

[dropcap]E[/dropcap]gos are like volcanoes; you never know when they explode!

నా మేరేజ్ కౌన్స్‌లర్ సిల్వియా టెక్స్ట్ మెసేజ్.

నాకూ, రాజ్‌కి మధ్య తరచూ గొడవలు వస్తూండడంతో కౌన్సలర్‌ని కలిసాను.

గత రెండ్రోజులుగా నాకూ, రాజ్‌కి ఒకటే యుద్ధం.

ఇద్దరమూ ఏకాభిప్రాయానికి రావడం లేదు.  రాజ్ వాదన చూస్తే నాకు చికాకుపుడుతోంది.

ఈసారి  క్రిస్‌మస్‌కి బోస్టన్ వెళదామని అన్నాను. తను వద్దంటాడు. ఎంత కన్విన్స్ చేసినా వినడు.

బోస్టన్ దగ్గర బిల్లెరికా లో మామీ (అమ్మమ్మ) ఉంటుంది. తను ఎప్పట్నుండో రమ్మంటోంది. చూసి రెండేళ్ళు దాటింది. ఎమిలీ పుట్టినప్పుడు వద్దామని అనుకుంది కానీ, ఆరోగ్యం సరిగా లేక రాలేదు. ఎమిలీ పుట్టగానే ఫొటోలు పంపాను.  తనకి చూడాలని ఉందని ఎప్పుడూ అంటూవుంటుంది.

“జెన్నీ, బోస్టన్‌లో వింటర్ భరించలేం. విపరీత మైన స్నో  పడుతుంది కూడా.

అంత చలిలో ఎమిలీని తీసుకెళ్ళాలా? కావాలంటే ఏప్రిల్ తరువాత వెళదాం…”

అన్నాడు రాజ్.  కాదు – ఈ సారి వెళ్ళి తీరాలని నేను పట్టు పడుతున్నాను.

ప్రతీ క్రిస్‌మస్‌కీ ఫీనిక్స్ వెళ్ళడం అలవాటు. క్రితం సారి రాజ్ కూడా వచ్చాడు.

మా అమ్మా, నాన్నలిద్దరూ దాదాపు పదేళ్ళ క్రితం విడాకులు తీసుకున్నారు.

చాలాకాలంగా మా అమ్మ పెళ్ళి చేసుకోకుండానే ఉంది.

మా అమ్మ ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంది. తమ ఆఫీసులో కొత్తగా చేరిన హోసే అనే ఒక స్పానిష్ అతన్ని రెండేళ్ళ క్రితం పెళ్ళి చేసుకుంది. ఎమిలీ పుట్టినప్పుడు ఒక వారం శలవు పెట్టుకొని వచ్చింది.

ఇప్పుడైతే ఈ కాలిఫోర్నియాలో ఉంటున్నాను కానీ, నా బాల్యం అంతా బిల్లరికాలోనే గడిచింది. అదీ మామీ దగ్గర.  నా పెళ్ళికి మామీ వద్దామనుకుంది కానీ అప్పుడూ సుస్తీ చేసి రాలేకపోయింది.

“నరకం ఎక్కడో లేదు – బ్రతికుండగానే ఇక్కడే, ఇదే. ఓపికున్నప్పుడు వెళ్ళాలన్న ఆలోచనుండదు.  వెళ్ళలనుకున్నప్పుడు ఓపికుండదు…” అంటూంటుంది – ఎప్పుడూ మాట్లాడినా.

నా పెళ్ళి రెండు సార్లు జరిగింది. ఒకసారి ఇక్కడా. ఇంకోసారి ఇండియాలో.

మామీ ఇండియా ఎలాగూ రాలేదు.  ఇక్కడికయినా వద్దామని అనుకుంది. మరీ కదల్లేని పరిస్థితుల వల్ల రాలేకపోయింది. తరువాత  నేనూ, రాజ్ వెళదామనీ అనుకున్నాం. వర్క్ హడావిడిలో పడి వీలు చిక్కలేదు. ఈలోగా నాకు ప్రెగ్నెన్సీ. అలా వెళ్ళడం పడలేదు.

“రాజ్! ప్లీజ్ – నాకోసం – మామీకి ఎమిలీని చూడాలని వుంది. తను రాలేదు. ఈ క్రిస్‌మస్‌కి వెళితే సంతోషిస్తుంది…”  – ప్రాధేయపడ్డాను.

“మా అమ్మా, నాన్నల్ని ఇక్కడ వదిలేసి ఎలావస్తాను…? పైపెచ్చు మా నాన్నకి డ్రైవింగ్ కూడా రాదు…”

“మనం అక్కడేం నెలలు ఉండడం లేదు. జస్ట్ ఫైవ్ డేస్. అయినా మీరు క్రిస్మస్ ఎలాగూ జరుపుకోరు కదా…?”

“జరుపుకోవడం కాదు సమస్య. మా అమ్మా, నాన్నల్ని వదిలి రావడం నాకిష్టం లేదు. వాళ్ళు ఫీల్ అవుతారు…!”

“ఇందులో ఫీల్ అవడానికి ఏముంది? నాలుగు రోజులు ఉంటామంతే… అయినా వాళ్ళేమీ కిడ్స్ కాదు…”

“కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఎమిలీని చూసుకుంటా…”

ఇది విని నాకు చిర్రెత్తుకొచ్చింది.

“రాజ్! ఆర్ యూ స్టుపిడ్? వెళ్ళేదే ఎమిలినీ చూపించడానికి.  నేనొక్కత్తినీ వెళ్ళడానికి నీ పర్మిషన్ అవసరం లేదు…” – చికాగ్గా లేచి వెళిపోయాను.

ఆ తరువాత మామధ్య మాటలు సాగలేదు. ఎదురుపడినప్పుడల్లా  నా కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాను.

ఓ రోజు మా మదర్-ఇన్-లా నన్ను మెల్లగా అడిగింది ఇంగ్లీషులో కూడబలుక్కుంటూ – నువ్వు బోస్టన్ వెళ్ళాల్ట కదాని.

వెళ్ళాలి కాదు – వెళుతున్నామని గట్టిగానే చెప్పాను.

రాజ్ చెప్పే వుంటాడు వాళ్ళ భాషలో. ఎందుకైనా మంచిదని ఆవిడకి అర్థమయ్యేటట్లు వివరంగానే చెప్పాను. ఆవిడేం మాట్లాడ లేదు. వెళ్ళడం ఇష్టం లేదని మొహంలో కనిపిస్తూనే ఉంది. ఐ డోంట్ కేర్!

రాజ్ తల్లి తండ్రులు అతన్ని వదిలిపెట్టరు.  వాళ్ళొచ్చాక మా మధ్య ప్రైవసీ పోయింది.

ఒకసారి సినిమాకి వెళదాం అన్నాను. ఎమిలీని అమ్మా, నాన్న దగ్గర వదిలి వెళదాం అన్నాడు. నాకిష్టం లేదు. మనతో తీసికెళదాం అన్నాను. ఇద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్.

మూడ్ అంతా పాడయ్యింది. చివరకి రాజ్ బ్రతిమాలితే బయల్దేరా. వెళ్ళేముందు ఎమిలీ గురించి వంద జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళాను. రాజ్ విసుక్కున్నాడు.

రాజ్ అమ్మా, నాన్నా వచ్చి మూడు నెలలు దాటింది.

నేను వర్క్‌కి వెళ్ళాల్సి వచ్చిందని సాయం కోసం రాజ్ ఇండియా నుండి పిలిపించాడు.  సరే అన్నాను కానీ, వాళ్ళు వచ్చాక రాజ్‌కి నాకూ మధ్య తరచూ మాటల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.

రాజ్ వాళ్ళమ్మకీ, నాకూ కాస్త చుక్కెదురు. ముఖ్యంగా ఎమిలీని హ్యాండిల్ చేసే విధానంలో.  రాజ్ అమ్మ పేరు జయా.

ఆవిణ్ణి పేరు పెట్టి పిలవద్దని రాజ్ విసుక్కుంటాడు. నాకు వరసలు పెట్టి పిలిచే అలవాటు లేదు.

ఇద్దరి మధ్యా ఆర్గ్యుమెంట్స్!

నేను మాత్రం జయా అనే పిలుస్తాను. రాజ్ చెప్పి చెప్పి చెప్పి ఊరుకున్నాడింక.

ప్రతీసారీ తన తల్లి తండ్రులు తననెంత గొప్పగా పెంచిందీ చెప్తాడు.

తనని అమెరికా పంపడానికి అతని తల్లితండ్రులు ఆర్థికంగా ఎంతో కష్టపడ్డారనీ అంటాడు.

ఏదైనా అంటే – అతని తల్లితండ్రులు పైసా పైసా కూడబెట్టి మరీ తనని చదివించారంటాడు. ముఖ్యంగా నేను ఎం.ఎస్ చదువుకోసం లోన్ పేమెంట్ చేసినప్పుడల్లా.

“మీ కుటుంబాలన్నీ విచిత్రంగా ఉంటాయి.  మీ పేరెంట్స్ నీ చదువుకి కట్టగలిగి ఉండీ నిన్ను లోన్ తీసుకోమనడం…” అంటూ వెటకారంగా నవ్వుతాడు.

“ఇవ్వలేక కాదు, నాకూ ఒక బాధ్యత గుర్తు చేయడం కోసం…” అని చెప్పినా వినడు.

రాజ్ పేరెంట్స్‌కి ప్రతీ విషయంపైనా ఆరా. ఒకటికి వంద సార్లు అడుగుతారు. నాకేమో రెండో సారి చెప్పే అలవాటు లేదు.  ఇదే రాజ్‌తో అంటే – అదే ప్రేమ అంటాడు.

“మీ ప్రేమలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంతెందుకూ – మీ అమ్మా, నాన్నా నీ బేబీ షవర్‌కొచ్చినప్పుడు  మనమందరం లంచ్‌కి వెళ్ళాం గుర్తుందా? ఎవరి లంచ్‌కి వాళ్ళే డబ్బులిచ్చారు. అక్కడెందుకుండదు ప్రేమ? అదీ మీ కల్చర్!” అంటూ దెబ్బలాడాడు.

” అందరూ సంపాదించుకుంటున్నారు కదా? అందరూ కలిసున్నామన్నది ప్రధానం. ఎవరు డబ్బు కట్టారన్నది కాదు…యూ నీడ్ టు గ్రో…” అనేసి అక్కణ్ణుండి లేచి వెళిపోయాను.  ఇలా వుంటాయి మా మాధ్య మాటలు.

రాజ్‌తో మా ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకోను.

మావన్నీ మెటీరియలిస్టిక్ జీవితాలంటాడు ఎప్పుడూ.

ఇలా ప్రతీ చిన్న విషయానికీ ఒక రాద్ధాంతం ఉంటుంది.

మా ఇన్‌లాస్‌తోనే నాకు సమస్య. రాజ్‌తో పరవాలేదు కానీ, వాళ్ళొచ్చాక ఒకరకమైన సఫకేషన్.

వాళ్ళకి శుభ్రత తక్కువ. నాకేమో పరమ చాదస్తం. ఇల్లంతా నీటుగా వుండాలి. ముఖ్యంగా కిచన్!

నాకు ఎమిలీని ఆ చేత్తో, ఈ చేత్తో ముట్టుకోవడం ఇష్టం ఉండదు.

ఒక్కోసారి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా బయటకి వచ్చేస్తోంది.

జయాకి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు.

వాళ్ళ అలవాట్లూ, పద్ధతులూ నాకూ కొత్త.  రాజ్ వరకూ పరవాలేదు కానీ వాళ్ళతో నాకు ఇబ్బందిగానే ఉంది.  కానీ పైకి అనను. రాజ్ ఏమైనా ఫీల్ అవుతాడని.

బోస్టన్ వెళడానికి టిక్కట్లు కొంటానని రాజ్‌కి చెప్పాను.

తనేమీ మాట్లాడ లేదు.  నన్ను కన్విన్స్ చెయ్యడానికి రెండు మూడు సార్లు టెక్స్ట్ మెసేజిలు పెట్టాడు.  నేనయితే వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను.

సిల్వియా టెక్స్ట్ మెసేజ్.

కౌన్సిలింగ్‌లో భాగంగా రోజూ ఒక మెసేజ్ పెడుతూ ఉంటుంది.

Differences are nothing but hidden injuries; you don’t see them, but you suffer.

000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here