రాతి గుండె

3
8

[లేఖిని సంస్థ, సరసిజ థియేటర్ ఫర్ విమెన్ సంయుక్తంగా నిర్వహించిన ‘2023 గోళ్ళమూడి సుందరమ్మ స్మారక కథల పోటీల’లో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ ఇది. రచన శ్రీమతి దాసరి శివకుమారి.]

 

[dropcap]“అ[/dropcap]మ్మా! నీ మనుమడి కిక్కడ మెకానికల్ బ్రాంచ్‌లో బి.టెక్. అయిపోయిందిగా. జర్మనీ వెళ్లి అక్కడ ఎంఎస్ చేయాలి. ఆ తర్వాత ‘ఎయిర్ బస్’లో కాని ‘ఎయిర్ క్రాఫ్ట్’లో కానీ పనిచేయాలని వాడి కోరిక. వాడికి ఇప్పుడు నీ ఆర్థిక సాయం కావాలి. నీ దగ్గర డబ్బుంది. నాన్నగారి తాలూకు ఫ్యామిలీ పెన్షన్, నీ సర్వీస్ తాలూకు వచ్చే రెండు పెన్షన్లు ఏం చేస్తున్నావు? నాకూ, మీ అల్లుడికీ, ఎలాగూ ఇవ్వవు. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారుగా. మనుమడి మీద కూడా నీకు ఆపేక్ష లేదా?” అంది నిష్ఠూరంగా ముక్త.

“చూడు ముక్తా. నిన్ను కని పెంచాము. చదివించాము. కోరుకున్న వాడితో పెళ్లి జరిపించాం. ఆ తరువాత మీ నాన్నగారు పోయారు. నా బాధ్యతగా నీకు బంగారం, మీ నాన్నగారి తాలూకు ఆస్తి అంతా నీకు అప్ప చెప్పేసాను. నీకు చదువుంది. మంచి ఉద్యోగముంది. స్వంత ఆఫీసు అంటూ పెట్టొద్దు. మీ ఆయనది నలుగురితో పని చేయించుకునే స్వభావం కాదు. అలా చేయించుకోవటం ఆయన వల్ల కాదు. ఇబ్బందులు పడతారు. తను కూడా, ఏదో ఒక హార్డ్‌వేర్ ఉద్యోగం చూసుకుంటే మంచిదని ఒకటికి రెండుసార్లు చెప్పాను. స్వంత ఆఫీసు నడుపుకుంటే ఎంతో గొప్పగా వుంటుంది. నలుగురితో నారాయణ అంటూ ఉద్యోగాలు చేస్తే ఏం గుర్తింపు వుంటుంది? అంటూ మీరిద్దరూ నా మాటలు కొట్టి పారేశారు. ప్రాజెక్టులు తెచ్చుకుని, అవి పూర్తి చేయటం మీ ఆయనకు చేతకాలేదు. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. ఇల్లు గడవడానికి కూడా నా జీవితమే ఆధారం. నువ్వు ఆదుకో అమ్మా అంటూ నాకు ఫోన్లు మీద ఫోన్లు చేశావు. నేను పట్టించుకోలేదు. మరలా ఇప్పుడు నీ కొడుకుకు సహాయం చేయమంటావు. మీ స్వశక్తితో పంపుకుంటారో, నీ కొడుకు లోన్ తీసుకుని వెళతాడో నాకు సంబంధం లేదు. వాడికి ఇక్కడ చదువూ, ఉద్యోగాలు లేవా? పోనీ జర్మనీయే, వెళతానంటే సంతోషంగా లక్షో, రెండు లక్షలో ఇస్తాను. అంతకుమించి నేనే సహాయం కానీ, ఏ హామీ కానీ వుండను. మీ స్వశక్తితో బ్రతకటం మీరింకెప్పుడు నేర్చుకుంటారు?” అన్నది అపర్ణ.

“నిన్ను డబ్బు అడుగుతున్నామని కదా నీకంత చులకన అయిపోయాం. నేను నీ కన్న కూతుర్నేగా. నాకూ, నా పిల్లలకూ నీ సంపాదన పెట్టక ఇంకెవరికి ధారాధత్తం చేస్తావు? నువ్వు చేసే దానధర్మాలన్నీ మాకు తెలుస్తూనే వున్నాయి. ఊళ్లోవాళ్లు చస్తే వాళ్లను భద్రపరచడానికి నువ్వే మార్చురీ బాక్స్, ఆ తర్వాత వాళ్లను శ్మశానానికి తీసుకెళ్లడానికి ట్రాలీ కూడా కొనిచ్చావు. లక్షలు పెట్టి గ్రంథాలయానికి పైకప్పు బాగు చేయించావు. పెద్ద బాలశిక్ష నుండి పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాల వరకు కొనిస్తున్నావు. ఊళ్ళో వాళ్ళ మెప్పు కోసమే కదా ఇదంతా చేస్తున్నావు.”

“ఎవరి మెప్పు కోసమో నేను ఇదంతా చేయటం లేదు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు విదేశాల మోజులో పడి దూరదూరంలో వుంటున్నారు. ఇక్కడ వారి తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళను రెండు మూడు రోజులపాటు మార్చురీ బాక్స్‌లో పెట్టి భద్రపరచాల్సి వస్తుంది. వాళ్లు బ్రతికుండగా కళ్ళు కాయలు కాచేటట్లుగా ఎదురు చూశారు. చచ్చి శవాలై కూడా కన్న పిల్లల రాక కోసం వారి ఆత్మలు తపించి పోతున్నాయి. చివరిలో వచ్చిన సంతానం ఓ చూపు చూచి స్నానం చేసి అప్పటికే సిద్ధం చేసిన శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనం మాత్రం చేస్తున్నారు. మండు వేసవి కాలంలో కరెంటు వస్తూ పోతూ వుంటే మార్చురీ బాక్స్‌లో చల్లదనం సరిపోదు. అది పనిచేయాలంటే జనరేటర్ అవసరం వుంటున్నది కాబట్టి అది కూడా నేనే ఏర్పాటు చేయాలనుకుంటున్నాను”

“ఇక చాలు ఆపమ్మా. శవాలు. వాటి నిల్వలు. లక్షలు పోసి జనరేటర్లు. శవాలను దగ్గరలో వున్న సిటీకి తరలిస్తే అక్కడి మార్చురీలలో జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఆ భాగ్యానికి ఈ సోది అంతా చెప్తున్నావు.”

“నేను కావాలని ఈ ప్రస్తావన తేలేదు. నీవన్న దానికి సమాధానం చెబుతున్నాను. అందరూ శవాలను వెంటనే సిటీ మార్చురీలకు తరలించడానికి ఇష్టపడక చివరిసారిగా కంటి నిండా చూసుకుందామని ఇంటిలోనే ఉంచాలనుకుంటున్నారు. పోతే ఇక్కడి చుట్టూ ప్రక్కల ఊళ్ళలోని పిల్లలకి అవసరమైన పుస్తకాలు లేకపోతే నేనే తెప్పించి గ్రంథాలయంలో వుంచాను.”

“వినటానికి నాకు కంపరంగా వున్నదమ్మా. మా ఆయన చెప్పనే చెప్పారు. నువ్వు వెళ్లి అడగటం దండగ. ఆవిడ రాతి గుండె కరగదు. నువ్వు ఏడ్చుకుంటూ తిరిగి వస్తావని. నీ దగ్గరకు వచ్చి అడగటం నాదే బుద్ధి తక్కువ. మా నాన్న పెన్షన్ తాలూకు అన్నా ఇస్తావేమోనని ఆశపడి నేనే వచ్చాను. వచ్చినందుకు బాగా గడ్డి పెట్టావు.” అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది ముక్త.

వెనుక నుండి అపర్ణ పిలిచే పిలుపు ఏమాత్రం లెక్కచేయలేదు.

పండుగలూ, పబ్బాలూ వచ్చినప్పుడు, కూతురిదీ, మనుమడిదీ పుట్టినరోజులు అంటూ తన బాధ్యతగా తాను ఎక్కువ ఆర్భాటాలకు పోకపోయినా పద్ధతిగా తను జరపాల్సినవి జరుగుతూనే వున్నది. కాని ముక్తకూ, వాళ్ల ఆయనకూ, కూతురు అత్తగారి తరుపు వారందరికీ తనేదో దానధర్మాలు చేస్తూ వచ్చిన డబ్బంతా దుబారా చేసేస్తున్నదని తెగ బాధగా వున్నది. తమ ఊరి బంధువుల్లో కూడా కొంతమంది తన కూతురికి ఫోన్ చేసి చాడీలు చెప్తున్నారు. మాకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదని వాపోతున్నారు.

ఈసారి ముక్తా, వాళ్ళ ఆయనా, అతని మేనమామ అంతా కలిసి వచ్చారు.

బంధువులు ఫోన్ చేసి చెప్పిన విషయం నిజమే. అమ్మ ఇల్లంతా రిపేర్ చేయిస్తున్నది అనుకున్నది ముక్త. వాళ్ళ ఆయన ఇల్లూ, ఇంటి చుట్టుపక్కల అంతా ఓసారి తిరిగి చూసి వచ్చాడు. ఈలోగా అపర్ణ అందరికీ కాఫీలు కలిపి ఇచ్చింది. కాఫీ తాగుతూ అల్లుడి మేనమామ మాటలు మొదలు పెట్టాడు.

“ఒంట్లో కులాసాగా వుంటుందా అక్కయ్యగారూ! చూడబోతే ఇల్లంతా సర్దేసినట్టున్నారు. ఏవో పనులు చేయిస్తున్నట్లుగా కనపడుతున్నది.”

“అవునండీ. ఇల్లంతా చిన్నచిన్న రిపేర్లుంటే చేయిస్తున్నాను. తప్పదు కదండీ.” అన్నది అపర్ణ.

“అక్కయ్య గారూ! ఇంకా ఈ ఇల్లు రిపేర్ అంటూ దీనిమీద అనవసరంగా ఖర్చు ఎందుకండీ? అయినా కాడికి అమ్మేసుకుని కూతురూ, అల్లుడు దగ్గరకు వచ్చి వుండండి. వాళ్ళిద్దరూ పనుల మీద, బయటకు వెళ్లేవాళ్లు. మీరు ఇల్లు కనిపెట్టుకొని వాళ్లకు ఇంట్లో పెద్దదిక్కుగా ఉన్నట్లుంటుంది. మీకూ పిల్లల దగ్గర వున్న సంతృప్తి కలుగుతుంది. మీ భార్యాభర్తలు ఇద్దరూ వున్నప్పుడైతే నేను ఈ మాట అనను. ఇప్పుడు మీరు ఒక్కరే ఉండాల్సి వచ్చింది కదా! ఎప్పుడే అవసరమొస్తుందో తెలియని స్థితి. మీరు దగ్గరుంటే ముక్తా వాళ్లకు వెనక పీకులాట వుండదు. మీరు ఎక్కడున్నా మీ పెన్షన్ మీరు డ్రా చేసుకోవచ్చు.”

“చూడండి. నేను ఒంటరిగానేవున్నా, నాకు ఇంకా ఒంట్లో ఓపిక, ఆరోగ్యం కూడా బాగానేవున్నాయి. ఈ ఊరంటే మమకారమో, ఈ ఇల్లు అంటే నాకు మోజో, మీరు ఏమైనా అనుకోండి. ఇది మా సొంత ఇల్లు కాబట్టి ఇక్కడే వుండాలనుకుంటున్నాను. ఒంటరిగా వుండలేనని అనిపించినప్పుడు నాకు తోడుగా, ఎవరినైనా మనిషిని తెచ్చి పెట్టుకుంటాను. అంతేకానీ ఇల్లు వదలి ఎక్కడకూ రాను. ముక్తా వాళ్ల మీద నా బరువు బాధ్యతలు వేయాలని అనుకోవడం లేదు.”

“ఇక్కడే వుండి కన్న కూతుర్ని, మనుమణ్ణీ కాదని ఎవరెవరికో దానధర్మాలు చేసుకోవచ్చు. వాటికైతే ఎక్కడెక్కడ దాచిపెట్టిన నిధులన్నీ బయటకు వస్తాయి. మేం అడిగితే మాత్రం మొండిచేయే చూపిస్తారు.” అన్నాడు అల్లుడు అక్కసుగా.

“అది కాదు లెండి అక్కయ్య గారూ! కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి” అన్నాడు అల్లుడి మేనమామ.

“ఎందుకమ్మా ఇలా మమ్మల్ని బాధ పెడతావు? ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది?”అన్నది ముక్త.

“చూడు ముక్తా! నా సంపాదన గురించి అడిగే హక్కు మీకు లేదు. ఎందుకంటే నీకు ఇస్తానన్న కట్నం కానీ, ఇతర ఆస్తులు కానీ నేనేమీ ఇవ్వకుండా ఎగ్గొట్టలేదుగా. ఇప్పుడు మా పెన్షన్లు నా ఇష్టం. ఎవరెవరికో అపాత్ర దానం నేనేమీ చేయటం లేదు. మీ నాన్న పనిచేసిన ఆఫీసులోని జవాను కొడుకు బాగా తెలివిగలవాడు. పేదరికం మూలాన వాడి చదువు ఆగిపోకూడదని కొంత ఆర్థిక సహాయం చేస్తున్నాను. అలాగే నేను పనిచేసిన ఊరిలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బంది పడటం నాకు అనుభవమే. అందుకని అక్కడ బస్సు షెల్టర్‌కు సాయం చేశాను. నేనేం గొప్ప గొప్ప సాయాలు చేయటం లేదు. ఉడతా భక్తిగా మాత్రం చేస్తున్నాను. వీటి కోసం మీ పర్మిషన్లు, ఇష్టాఇష్టాలు నేను పట్టించుకోను.”

“ఆ ఊరిలో ఎవరూ దాతలు లేరా? లేకపోతే ఎవరికీ ఇలాంటి ఆలోచనలు రావా? అన్నిటికీ తగుదునమ్మా అంటూ నువ్వే బయలుదేరుతావు. ఇలాగే వచ్చే పెన్షన్ ల డబ్బంతా హారతి కర్పూరం చెయ్యి.”

“ఎవరి పెన్షన్ ముక్తా. నాదీ, మా ఆయనదీ. వేరే ఎవరిదో కాదు కదా? మా పెన్షన్లు నేను స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే హక్కు నాకున్నది. ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అని అడిగే హక్కు మీకు ఎవరికీ లేదు.” అంది నిక్కచ్చిగా అపర్ణ.

“అంతా విన్నారుగా బాబాయి గారూ! అనవసరంగా శ్రమపడి మాతో మీరూ వచ్చారు. మీ అమ్మతో నేను వివరంగా మాట్లాడి ఒప్పిస్తానమ్మా అన్నారు. ఆమె ఎవరి మాట వినే రకం కాదు. ఎవరినైనా లెక్క చేసే రకం అంతకన్నా కాదు. పదండి పోదాం.” అంటూ ముందు ముక్తే దారితీసింది.

అపర్ణ ఎంత చెప్తున్నా వినకుండా భోజనాలైనా చేయకుండా వెళ్లిపోయారు.

***

అపర్ణే ఎప్పుడైనా ఫోన్ చేసి ముక్తను క్షేమ సమాచారాలు అడుగుతుంది. ముక్త మాత్రం పొడిపొడిగా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. చూద్దాం. అమ్మ ఎల్లకాలం ఇలాగేవుంటుందా? రేపు కాలో, చెయ్యో పడిపోతే అప్పుడు నేనే దిక్కు అవుతాను. నా అవసరం అప్పుడు కానీ తెలియదు అనుకుంటుంది.

ఒకటిగా ఉన్న ఇంటిని రెండు భాగాలు చేయించింది అపర్ణ. ఒక భాగంలో తానుంటూ మరొక భాగంలో ఒక చిన్న కుటుంబాన్నివుండమన్నది. తల్లీ, కొడుకు ఇద్దరే వుంటారు. ఆమె అపర్ణకు అన్ని పనుల్లోనూ తోడుంటున్నది. కొడుకు బీకాం పూర్తి చేశాడు. ఇంకా ఉద్యోగం రాలేదు. మంచి చురుకైనవాడు. అపర్ణకు బయటి పనులన్నీ చూస్తున్నాడు. కాలం సాఫీగా గడుస్తున్నది.

ముక్త కొడుకు తనే స్టడీ లోన్ తీసుకుని జర్మనీ వెళ్లి చదువుకున్నాడు. స్కాలర్‌షిప్ కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి చదువు పూర్తి చేయటానికి పెద్దగా డబ్బు ఇబ్బందులు ఏం పడలేదు. చదువయ్యాక తను కోరుకున్నట్లుగానే  ‘ఎయిర్ బస్’ లోనే ఉద్యోగం సంపాదించుకున్నాడు.

ముక్తా వాళ్ళ ఆయనకు తను పెట్టిన ‘మైత్రీ’ కంపెనీని నడిపే సామర్థ్యం లేక వదిలేసుకుని, తన చదువుకు తగ్గ హార్డ్‌వేర్ ఉద్యోగం చూసుకున్నాడు. మంచి జీతమే వస్తున్నది. ముక్తకు ప్రమోషన్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే వున్నది. సొంత ఇల్లూ, మంచి కారూ ఏర్పడ్డాయి. ముక్త కొడుకు జర్మనీలో తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి, అలాగే పెళ్లి చేసుకుని మరీ వచ్చాడు. ఇక్కడ ముక్తా వాళ్ళు రిసెప్షన్ పెట్టుకుని బంధువులందరికీ పిలిచారు. అపర్ణ కూడా వెళ్ళింది. పెళ్లికూతురుకు ఒక రవ్వల నెక్లెస్, పెళ్ళికొడుకుకు ఒక చెక్కును కవర్లో పెట్టి కానుకగా ఇచ్చింది.

“థాంక్స్. అమ్మమ్మా, నాకిప్పుడు కానుకగా ఏ డబ్బూ అవసరం లేదు. దీన్ని మీ అమ్మాయికి ఇచ్చేస్తున్నాను. ఈ చెక్కును నీకే తిరిగి ఇచ్చేస్తే నువ్వు బాధ పడతావని ఇలా చేస్తున్నాను” అని వెంటనే తల్లి చేతికి ఇచ్చేశాడు.

అపర్ణకు 75 ఏళ్లు వచ్చేసాయి. చిన్న చిన్న అనారోగ్యాలు తప్పితే పెద్దగా ఇబ్బందులు ఏం లేవు. ఉన్నట్లుండి కాలు జారి వెనక్కు గచ్చు మీద పడిపోయింది. పడటంతోనే తల వెనుక భాగాన బాగా గాయమైంది. విపరీతంగా రక్తస్రావం అయింది. వైద్యం అందించే లోగానే సునాయాసంగా ఆఖరి శ్వాసను తీసుకున్నది. ఊరు ఊరంతా తరలివచ్చారు. తను కొనిచ్చిన మార్చురీ బాక్స్ లోనే ప్రశాంతంగా పడుకొని వున్నది. చనిపోయిన రెండు గంటలకల్లా ధన్వంతరి కంటి ఆసుపత్రి వారు వచ్చి కళ్లను సేకరించుకుని వెళ్లారు. ఆ మధ్యాహ్నానికే యన్.ఆర్.ఐ. మెడికల్ కాలేజీ వారు తమ ఆంబులెన్స్‌తో వచ్చి అపర్ణ శవాన్ని తరలించుకు వెళ్లారు. ఇలా తను చనిపోయి కూడా మరి కొంతమందికి సాయపడాలని ముందే నిర్ణయించుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నది.

పక్కవాటాలోని తల్లీ కొడుకులు ముక్తకు అన్ని విధాలా చేదోడు వాదోడుగావున్నారు.

తమ చేత కర్మకాండలు చేయించుకోవడం కూడా ఇష్టం లేక తల్లి ఇలా చేసిందా? తనంటే అంత కోపం అమ్మకెందుకు? అని రకరకాలుగా ఆలోచించింది ముక్త. ఎంత ఆలోచించినా తను చేసిన తప్పేమిటో ముక్తకు అంతుబట్టలేదు. ఆ ఆలోచనలతోనే బీరువా తెరిచి చూసింది ముక్త. ఎదురుగా ఒక కవర్ పెట్టి ఉన్నది. కవరు చించి చూస్తే లోపల అమ్మ రాసిన కాగితమేదో కనిపించింది.

“ముక్త దంపతులకు నా ఆశీస్సులు. నా మనుమడి కుటుంబానికి కూడా నా ప్రేమ పూరిత దీవెనలు. నాకు ఎవరి మీదా, ఎప్పుడూ ఏ కోపం లేదు. రాదు. నేనేం చెప్పినా, ఏం చేసినా మీ మంచి కోసమే చేశాను. కానీ మీకు అర్థం కాలేదు. నామీద బాగా వ్యతిరేక భావాలు మీ మనసులో నింపుకున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఎన్నోసార్లు నీకు చిన్నతనం నుండి చెప్తున్నాను ముక్తా. పెళ్లయిన తర్వాత కూడా పదేపదే నువ్వు నా నుండి డబ్బు ఆశించే దానివి. నువ్వు స్వయంగానే ఎదగాలని నా కోరిక. నేను చెయ్యి అందిస్తూ పోతే మీకు సొంత ఆలోచనలు, సొంత ఎదుగుదల వుండవు. అందుకే కొంత కఠినంగా వుండేదానిని. పోతే నీ కొడుకు తనే స్టడీ లోన్ తీసుకుని బాధ్యతగా చదువుకుని, చదువు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకున్నాడు. లోన్ మొత్తం తనే తీర్చేసుకోగలిగాడు. వాడికి డబ్బు విలువ తెలిసి రావాలని అలా చేశాను. వాడు ప్రయోజకుడైనందుకు నాకు చాలా సంతోషంగా వున్నది. అల్లుడికి నామీద బాగా కోపం వుండివుంటుంది. నేను అలా కఠినంగా వుండకపోతే చేతకానితనంతో తను పెట్టిన కంపెనీని దివాలా తీయించుకుని, అప్పుల పాలై బికారిగా మిగిలిపోయేవాడు. సాయం చేసేవారు ఎవరూ లేకపోయేసరికి తనకు తానే సరైన మార్గం ఎన్నుకొన్నాడు. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎందుకు అలా చేశానో?

అలాగే మనం ఈ సమాజంలో పుట్టి పెరుగుతున్నందుకు మన తోటి వారికి ఎంతో కొంత సేవ చేయాలని నాకు ఇష్టంగా ఉండేది. నాకు తోచిన చిన్న చిన్న సాయాలు చేయగలిగాను.

నువ్వు కూడా పట్టుదలగా చదివి పరీక్షలు రాసి పూర్తి చేసి ప్రమోషన్లు తెచ్చుకున్నావు. అప్పుడు నేను ఎంత సంతోషించానో నీకు తెలియదు. నువ్వే ఇప్పుడు ఒకరికి పెట్టగలిగిన స్థితిలోవున్నావు.

నేను చనిపోయిన తర్వాత నాకు దిన వారాలంటూ ఏ క్రతువులూ, ఆచారాలూ, ఆర్భాటాలూ చేయొద్దు. నేను అన్ని ఏర్పాట్లు చేసే వుంచాను. నేను చనిపోయిన సందర్భంగా బీదలకు అన్నదానం చేయండి చాలు. ఆ ఖర్చుకు కూడా బీరువాలో డబ్బు పెట్టి వుంచాను. మన ఇంట్లో ఉండే ఈ కుటుంబాన్ని ఇక్కడే వుండనీయండి.

చివరగా ఒక్క మాట ముక్తా. బ్యాంకులో 20 లక్షల డబ్బు మనిద్దరి పేరా జాయింట్‌గా ఫిక్స్‌డ్ చేసి వుంచాను. నా తదనంతరం అది మీ దంపతులకే. నీకు నా ముద్దులు మరియు ఆశీస్సులు.

ప్రేమతో

అమ్మ.”

వీలునామా లాంటి ఆ ఉత్తరం చదివి బోరుమన్నది ముక్త.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here