‘రచైత’ రాంపండు

2
10

[dropcap]“దే[/dropcap]శభాషలందు తెలుగు ‘లెస్స’ అన్నారొకప్పుడు. ఇప్పుడది దేశభాషల ముందు తెలుగు ‘లెస్’ అయిపోతోంది. బస్సుల మీద, గోడ రాతలలో, కరపత్రాల్లో ఒత్తులు కోల్పోయి, తలకట్లు తెగిపోయి, దీర్ఘాలు లఘవులైపోయి అవిటితనంతో అల్లాడుతోంది. స్మార్ట్ ఫోన్లలో తెలుగు – అక్షరాలు ఆంగ్లభాష అనువాద కౌగిలిలో బందీ అయిపోయి, జైలు జీవితాన్ననుభవిస్తోంది. పలుకు బంగారంలా వెలిగిన తెలుగు, యాసకి దాసీతనం చేస్తోంది. నా భాష, నా తెలుగు వంటి పూర్వవైభవ పదాల్ని నెమరు వేసుకుంటున్న తెలుగు భాషకు పునర్వైభవం ఎప్పుడు?”

ప్రశ్నతోనే ప్రసంగాన్ని ముగించిన రాంపండు సభికుల కరతాళ ధ్వనులతో బాటు ప్రశంసల్నీ అందుకున్నాడు. రచైత, మిత్రుడు అయిన కృష్ణమురళీ పుస్తకావిష్కరణకి విజయవాడ వెళ్ళిన రాంపండు… ఆ రాత్రే రైలెక్కి.. తెల్లారేసరికల్లా హైద్రాబాదొచ్చి, ఆటోలో ఆరింటికల్లా ఇల్లు చేరాడు.

నాలుగు సార్లు కాలింగ్ బెల్ మోగించినా తలుపు తెరుచుకోలేదు. అనుమాన మొచ్చి.. కిందికి చూసాడు. తాళం కప్ప వేటాడుతోంది.

“ఎక్కడి కెళ్ళిందబ్బా భానుమతి?” అనుకుని ఆమె సెల్‌కి ఫోన్ చేశాడు. రింగవుతోంది కానీ లిఫ్ట్ చెయ్యడం లేదు. తన దగ్గరున్న తాళం చెవితో తలుపులు తెరిచాడు. అంతే! పాత పుస్తకాల కంపు గుప్పమనేసరికి లైటేశాడు. ఎదురుగా కన్పించిన పుస్తకాల బండిల్సు చూసేసరికి… రాంపండుకు విషయం అర్థమైంది. ఉక్కపోత భరించలేక… ఫ్యానేశాడు. ఆ గాలికి.. టీపాయ్ మీదున్న పేపర్లు లేచి గాల్లో గంతులేస్తుంటే.. వాటిని ఒడిసి పట్టుకున్నాడు. భార్య భానుమతి రాసిన నాల్గుపేజీల లేఖాస్త్రం… అని రెండు లైన్లు చదవగానే అర్థమయింది. అంతే! బట్టలు మార్చుకోవడం కూడా మర్చిపోయి.. కుర్చీలో కూచుని.. లెటరు చదువుతున్నాడు. భార్య అస్త్రాలు సంధించేంత రాంపండు ఘనచరిత్రేంటో.. చదువుదాం రండి!

***

రాంపండుకి చిన్నప్పట్నుండి లేనిది ఉన్నదిగా ఊహించుకోవటం, వాస్తవాల్ని ఊహల్లో విహరింపజేయటం… ఆ ఉద్వేగంలో… అలౌకికానందం పొందుతూ, ఆ ఆనందంలో ఉద్భవించే భావాల్ని అక్షరాల్లో బంధించాలన్న తపన మెండుగా ఉండేది. ఎప్పటికైనా తానో మహా రచయితనై పోవాలన్న మోహం.. బాల్యంలోనే వేళ్ళూనుకుంది. హైస్కూలు స్థాయిలో ఆశువుగా కవితలు చెప్పేవాడు. విన్నవాళ్ళ పొగడ్తలు విని… కీలుగుర్రమెక్కి ఆకాశంలో అయిడియాల కోసం విహరించేవాడు.

ఇదంతా ఓ కంట గమనిస్తున్న తండ్రి రాంపండుకి మార్కులు తక్కువొచ్చినప్పుడల్లా మాటలతో మనసులోనే వాతలు తేలేట్టు మందలించేవాడు. తాత్కాలికంగా తండ్రి మాటలకి ఫీలైనా… ఇంటర్లో చూసుకోవచ్చులే… అనుకుని భావావేశాన్ని అణచిపెట్టుకుని… బుధ్ధిగా చదివి, పదో తరగతి గట్టెక్కాడు.

ఇంటర్లో చేరాక తన మానాన తనన్నొదలకుండా… ఎంసెట్లో మంచి ర్యాంకు రావాలని కండీషన్ పెట్టి… ట్యూషను కూడా పెట్టించి.. లోలోపల ఉప్పొంగే భావావేశం బయటకి రాకుండా కట్టుదిట్టం చేశాడు తండ్రి. అటు చదువు మీద, ఇటు రచనల మీద ఏకాగ్రత కుదరక… ఎంసెట్ ర్యాంకు కాస్తా హుళక్కి అవటంతో… బి.ఎ. డిగ్రీలో చేరాల్సొచ్చింది. బి.ఎ.లో అయితే బోల్డంత సమయం దొరుకుతుందనీ, ఇన్నాళ్ళూ.. అణచిపెట్టుకున్న… కవితా ప్రవాహాన్ని పరవళ్ళు తొక్కించొచ్చనుకుని… సంబరపడిపోయాడు రాంపండు. అంతలో తండ్రి.. ‘ఒన్ మినిట్’ అని డిగ్రీతో బాటు సివిల్సు పరీక్షలకి ప్రిపేరవ్వాలని… కాలేజీ అయ్యాక సివిల్సు కోచింగ్ సెంటర్‌కి వెళ్ళాలని ఆంక్ష విధించాడు. హత విధీ! అని మనసులో తిట్టుకున్నా, పైకి మాత్రం తండ్రి మాట జవదాటని రాముడిలా తలాడించాడు రాంపండు. కోచింగ్ సెంటర్లో లాస్ట్ బెంచీలో కూచుని.. తన కవితా ఝరికి అక్షరరూపం కల్పిస్తూ.. రోజుకో కవిత రాయాలన్న నియమం పెట్టుకున్నాడు.

ఓ రోజు ఆకాశవాణీ వారి ప్రకటన విని తన కవితల్ని… పంపాడు. టి.వి. ఛానెళ్ళ పుణ్యమా అని వినే నాధుడు లేక మూగవోయిన వీణలా మారిన ఆకాశవాణి వాళ్ళు.. రాంపండు కవితలకి ఆమోద ముద్ర వేశారు. పదిరోజుల తర్వాత పిలుపు రావడంతో ఎగిరి గంతేశాడు. మహామహులెంతోమంది తమ వాణిని విన్పించిన ఆకాశవాణిలో తన కవితారంగేట్రం శుభసూచకంగా భావించి, ఆ విషయాన్ని ఒక్క తండ్రికి తప్ప బంధుమిత్రులందరికి దండోరా వేసుకున్నాడు రాంపండు.

అప్పుడు మొదలైన రాంపుడు రచనా ప్రయాణం.. కార్డు కథలు, కాలమ్ కథలు, సింగిల్ పేజీ కథల్లోకి ప్రవేశించింది. రాయటం పత్రికలకి పంపటం, తిరిగి రావటం.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా.. సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో.. తపాలా ఖర్చులకి డబ్బుల్లేనప్పుడల్లా తల్లి దాచిపెట్టే పోపుల డబ్బాలో చోరీ చెయ్యటం మొదలెట్టి, పట్టుబడ్డాడు.

విషయం విన్న తండ్రి తిట్లలో ఉప్పూ, కారం దట్టించి మరీ తిట్టడం మొదలెట్టాడు. అలా తండ్రి చేత తిట్లు తింటున్నపుడు ఉద్భవించిన ఓ పదునైన కథని అక్షరీకరించి, ఓ ప్రముఖ పత్రికకి పంపాడు. ఆర్నెల్ల తర్వాత రాంపండు కథ అచ్చయిందని, ఓ ఫ్రెండు ద్వారా తెలుసుకుని.. ఆ పత్రిక కొనుక్కుని, తొలిసారి తన పేరు ప్రముఖ పత్రికలో… చూసుకున్న ఆనందంలో ఆకాశం వేపు చూశాడు.

బి.ఎ. పట్టా పుచ్చుకున్నాక.. నెలరోజులకి అకస్మాత్తుగా తండ్రి గుండెనెప్పితో మరణించాడు. అంతే ఆ తర్వాత తనని సివిల్సు గురించి ప్రశ్నించేవాళ్ళు లేకపోవడంతో ఆ మెటీరియలంతా అటకెక్కించేశాడు. ఇన్నేళ్ళూ.. రాంపండుకి లోలోపలే మ్రగ్గిపోతున్న రచయిత.. విజృంభించి కథ, కవిత, నవల వంటి అన్ని ప్రక్రియల్లోనూ క్రియాశీల రచనలు చెయ్యాలని నిశ్చయించుకుని.. గదికే పరిమితమైపోయాడు. ఆ విషయం తెల్సుకున్న మేనమామ…

“ఒరేయ్! ఒరేయ్! ఇంటికి పెద్దకొడుకువి. డిగ్రీ పూర్తయి సంవత్సరం కావొస్తున్నా ఉద్యోగ ప్రయత్నం చెయ్యకుండా, మీ నాన్న పెన్షనుతో తిని కూచుంటూ, కాగితాలకి, కలాలకీ, తపాలా, కొరియర్లకి డబ్బు తగలేస్తుంటే ఇల్లెలా గడుస్తూంది? నీకు బాధ్యత ఎప్పుడు తెలుస్తుంది?” అని చీవాట్లు పెట్టి రాంపండులో చెట్టులా ఎదగాలనుకుంటున్న రచనాంకురాల్ని నిర్తాక్షిణ్యంగా కత్తిరించేసి, వెళ్తూ వెళ్తూ బోన్సాయి మొక్కలాంటి బంపరాఫరిచ్చెళ్ళాడు.

“నువ్వు త్వరగా ఉద్యోగం తెచ్చుకుంటే… నా కుతురు భానుమతిని నీకు భార్యని చేసేస్తాను” అన్నాడు.

అంతే మంచి వయస్సులో ఉన్న రాంపండు కళ్లముందు భానుమతి అందం ఐశ్వర్యారాయ్‌లా కన్పించసాగింది. మరో ఆలోచనకి తావివ్వకుండా రచనా వ్యాసంగాన్ని తాత్కాలికంగా కట్టి పెట్టి.. పగలూ రాత్రి కష్టపడి తొలి ప్రయత్నంలో బ్యాంకు పరీక్షలో ఉత్తీర్ణుడై బ్యాంకుద్యోగయ్యాడు. మేనమామ అన్న మాట ప్రకారం.. కూతుర్నిచ్చి రాంపండు బ్రహ్మచర్యానికి.. విముక్తి కల్గించాడు.

‘వివాహాయ విద్యనాశాయ’ అన్నట్టు తనలోని రచయిత పెళ్ళి తర్వత తెరమరగవకూడదనుకుని.. అందుకు భానుమతి సహకారం ఎంతో అవసరమని భావించి, తన అభిరుచులతోబాటు, రచనా తృష్ణని తొలిరాత్రి తొలిరుచికి ముందే, అర్థరాత్రి దాటేవరకూ ఏకంతంలో ఏకరువు పెటుతున్న రాంపండుని విరక్తిగా చూసి..

“బావా నాకు నిద్రస్తోంది… పాలు చల్లారిపోయాయి… మల్లెలు వాడిపోయాయి…” అని సింబాలిక్‌గా సూచించేసరికి… వయసు వేడి గుర్తొచ్చి… వేగంగా లైటార్పి భానుమతిని అల్లుకుపోయాడు రాంపండు.

పెళ్ళైన కొత్తల్లో అరేబియన్ గుర్రంలా దౌడు తీస్తాడనుకున్న రాంపండు రాతలలో కుస్తీపట్లు పడుతూ.. ఏ అర్థరాత్రి దాటాకో భార్య గుర్తొచ్చి పక్కలోకి వస్తే… అప్పటికే ఎదురుచూపులతో విసిగిపోయి మూడంకేసి గురకపెట్టి నిద్రపోతున్న భానుమతిని ఇబ్బంది పెట్టకుండా పక్కకి తిరిగి పడుకునేవాడు.

పెళ్ళయి మూడేళ్ళవుతున్న భానుమతికి బాలింతయ్యే భాగ్యం కలగకపోయేసరికి, మేనమామ రంగంలోకి దిగి.. రాంపండుతో..

“నువ్విలా కథలూ, కాగితాలతో కాపురం చేసుకో… నేను నా కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్తాను” అని వార్నింగిచ్చేసరికి… జ్ఞానోదమయిన రాంపండు విజృంభించి, ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా.. సంవత్సరం తిరిగే సరికి కవల పిల్లలతో భార్యని బాలింతని చేశాడు.

ఇహనైనా రచయితగా తన సత్తా చాటాలన్న పట్టుదలకి… ప్రత్రికాఫీసుల చుట్టూ తిరుగుతూ పుస్తకావిష్కరణలకి, సాహితీ సభలకి హాజరౌతూ, వర్థమాన రచయితల్ని, సీనియర్ రైటర్లని కలుస్తూ, వారి సలహాలు తీసుకుంటూ ఏభైకి పైగా కథలు, రెండు నవలలు రాసేశాడు. కథలు ప్రముఖ పత్రికల్లో అచ్చవుతున్నా ఏదో వెలితి రాంపండుని వెంటాడుతోంది. అది తనకి రావాల్సినంత గుర్తింపు రావట్లేదన్న బాధ. తన తర్వాత రచయితలుగా వచ్చిన వాళ్ళకి.. పది కథలు కూడా రాయకుండా సన్మానాలు, బిరుదులు వస్తుంటే.. తననెవరూ గుర్తించటం లేదన్న అవ్యక్త బాధ వేధిస్తోంది. ఆ తరుణంలో…

ఓ సభలో పరిచయమైన సీతా సుబ్రావ్… వందకి దగ్గర్లో కథలు రాసిన రచయిత. కేంద్ర ప్రభుత్వద్యోగి. అతని భర్య సీత. తన పేరు ముందు తగిలిస్తేనే… ఇంట్లో రాసుకోనిస్తానని కండిషన్ పెట్టిందట. అందుకు సుబ్బారావు కాస్తా సీతా సుబ్రావ్ అయ్యానని.. చాలా కాలం తను ఆడో మగో చాలమందికి తెలియలేదని, సగర్వంగా తన మీదే జోకేసుకున్నాడు సుబ్రావ్.

ఓ రోజు ఇద్దరూ లంచ్‌కెళ్ళారు. మాటల మధ్య తన అవ్యక్త బాధంతా క్రుమ్మరించాడతని ముందు మన రాంపండు. అంతా విన్నాక…

“కాలం మారిపోయింది సార్. చదివే వాళ్ళు తగ్గిపోయారు. ముద్రించే వాళ్ళు మృగ్యమైపోయారు. కొత్త కొత్త మాధ్యమాలు రోజుకొకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టి.వి, వాట్సప్, ఫేస్‌బుక్, వెబ్ మ్యాగజైన్స్, బ్లాగులు.. ఇలా ఒకటేమిటి.. కలం పుస్తకాలతో పన్లేకుండా పోతోంది. పుస్తకాలు ప్రింటు చేసేదేవరు. ఒకవేళ చేసినా కొని చదివేదెవరు. అంతా అంతర్జాల మాయాజాలం.. కన్నుమూసి తెరిచేలోపల అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఏ సమాచరామైనా ప్రత్యక్షమవుతోంది. అందుకే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పెద్ద పెద్ద పబ్లిషర్లే షట్లర్లు మూసేస్తున్నారు” అన్నాడు సుబ్రావ్.

“మరైతే నాలాంటి రచైతల పరిస్థితి ఎలా” వాపోతూ… అన్నాడు రాంపండు.

“ఎలా? అని ఫీలవకండి. రచయితకి కీర్తి కండూతి సహజ కవచకుండలాల్లాంటివి. మీరేం దిగులు పడకండి. మీకు గుర్తింపు తెచ్చే బాధ్యత నాది. ఎన్ని కథలు రాసినా రాని గుర్తింపు ఒక్క కథా సంపుటితో తీసుకురావచ్చు” అన్నాడు సుబ్రావ్ భరోసాతో భుజం తట్టి.

“మీకెవరైనా తెల్సిన పబ్లిషర్సున్నారా?” అమాయకంగా అడిగాడు రాంపండు.

“చూడండి పండుగారూ. మీ స్వంత ఖర్చులతో మీరే ఓ కథా సంపుటి ముందు ముద్రించాలి. దానికి ప్రముఖ రచయితలతో ముందుమాటలు, పుస్తకావిష్కరణ, రివ్వూలు, రేడియో టివి చర్చలు, ఫేస్‌బుక్ అప్‌డేట్స్… ఇవన్నీ ఇవ్వాల్టి ప్రచారసాధనాలు.

మీ కథ ఏదైనా పత్రికలో పబ్లిష్ అయితే.. మీరే మీ ఫ్రెండ్స్ పది మందికి వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా.. ఫలానా పత్రికలో నా కథ అచ్చయిందని సదరు పత్రిక లింకు గానీ, లేదా ఆ కథ.. పిక్స్ గానీ తీసి, సెల్ప్ ప్రచారం చేసుకోవాలి. అప్పుడు ఎవరో ఒకరు.. తమ అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారానో, ఫేస్‌బుక్ ద్వారానో మెసేజ్ ద్వారానో.. తెలియజేస్తారు. ఇలా చేస్తేనే.. మీరు వార్తల్లో వ్యక్తిలా కన్పిస్తుంటారు. అప్పుడే పత్రికల వాళ్ళు మిమ్మల్ని ప్రముఖ రచైతగా గుర్తించి అడిగి మరీ మీతో సీరియల్స్ రాయించుకుంటారు.”

“మన పుస్తకం మనమే ముద్రించుకుంటే… మార్కెటింగ్ మాటేంటి?”

“అదంతా నేను చూసుకుంటాను పండుగారూ డబ్బు మాత్రమే మీది. మీ కథా సంపుటిని ప్రముఖ పబ్లిషింగ్ సంస్థే ముద్రస్తుంది. ఇదంతా తెరవెనుక జరుగుతుంది. నేనున్నాగా!” అన్నాడు సుబ్రావ్ ధైర్యంగా.

ఆ మాటతో మెత్తబడ్డ రాంపండు.. “షుమారుగా ఎంతవుతుందండీ” అన్నాడు. ఎంతవుతుందో సుబ్రావ్ వివరంగా చెప్పేసరికి.. నోరు తెరిచిన రాంపండు ‘లక్ష దాటేట్టుందే’ అన్నాడు.

“భలే వారే పండుగారూ! ఈ రోజుల్లో లక్ష లెక్కటండీ! మొన్నటికి మొన్న కవీంద్ర భారతిలో ఓ ప్రముఖ రచయిత పుస్తకావిష్కరణకి దాదాపు రెండు లకారాలు ఖర్చుపెట్టాడు. చూడండి! ఎవరో వచ్చి మన కథల్ని, కవితల్ని, నవలల్ని ముద్రిస్తారని ఎదురుచూస్తూ కూచుంటే.. వెనకబడిపోతాం, ముదిరిపోతాం, వయసైపోతుంది, బట్టతల వచ్చేస్తుంది, పలితకేశాలు మెరుపుదాడులు మొదలెట్టి రాలిపడుతుంటాయి. మన ఫిగర్ ఫేడవుటవ్వకముందే.. ప్రముఖ రచయితల జాబితాలో చేరిపోవాలి పండుగారూ!” అన్నాడు.

భార్యకి తెలీకుండా బ్యాంకులోను తీసుకుని తొలి కథా సంపుటిని పేరున్న ప్రచురణా సంస్థ పేరుతో అందంగా తీర్చిదిద్దాడు సుబ్రావ్ సారధ్యంలో రాంపండు. ప్రముఖ రచయిలిద్దరికి స్టార్ హోటల్లో విందులిచ్చి ముందుమాట రాయించాడు. పుస్తకావిష్కరణ సభ పండుగలా చేశాడు. వచ్చిన వాళ్ళకి ఉచితంగా పుస్తకాలు పంచి పెట్టాడు. అతిథులకు, తల మీద టర్బన్లు, షాల్స్ కప్పి హంగామా చేశాడు. ఆత్మీయ అతిథులుగా ఆహ్వానించిన పది మంది రచయిత్రులను చీరతో సత్కరించాడు. అంతటితో ఆగకుండా ప్రముక పుస్తక విక్రయ కేంద్రాల్లో 60:40 నిష్పత్తిలో.. పుస్తకాలమ్ముడయ్యాక డబ్బులిచ్చే షరతు మీద పుస్తకాలిచ్చాడు. రివ్యూల కోసం ప్రముఖ పత్రికలన్నిటికీ రెండ్రెండు కాపీలు, అవార్డుల కోసం సాహితీ సంస్థలకీ నాలుగు కాపీలు కొరియర్లో పంపాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో పలు సాహితీ సభలు ఏర్పాటు చేసి పుస్తకాన్ని ప్రమోట్ చెయ్యడం కోసం సగం ధరకే పుస్తకాన్ని ఊరూరా తిప్పినా.. ఒకటీ అరా అమ్ముడయ్యేవి కాని ప్రయాణపు ఖర్చులు కూడా వచ్చేవి కావు. మోత బరువు తగ్గుతుందని సభలకి వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇచ్చినా.. చాల మంది కుర్చీల పక్కనే పుస్తకాన్ని వదిలి వెళ్ళేవారు.

అది చూసిన రాంపండుకి బ్లడ్ బాయిలయి.. సుబ్రావ్‌ని నిలదీశాడు. “ఏంటండీ ఇది! ఇందుకా? నాతో ఇంత డబ్బు తగలేయించారు?” అని ఆవేశపడిపోయాడు.

“దానికే ఆవేశపడితే ఎలా పండుగారూ! ఒక్క పుస్తకంతోనే విజయం మీ విలాసంగా మారుతుందా? ఈ సారి మీ తొలి నవల వేద్దాం. దాని తర్వాత మీ కవితా సంపుటి అలా వేస్తేనే గదా! మీరెవరో పది మందికీ తెలిసేది. కష్ట నష్టాల్లేకుండా ఫలితం వెంటనే వస్తుందా!? చెప్పండి” అని ఎదురు క్వశ్చనేశాడు సీతా సుబ్రావ్.

అలా వరుసగా మూడేళ్ళలో నాలుగు పుస్తకాలకి నాలుగు లక్షల అప్పు చేశాడు రాంపండు. ఫలితం మాట అటుంచితే.. ఇంట్లో ఏ మూల చూసినా పుస్తకాల బండిల్సు పేరుకు పోయాయి. కొనే నాధుడు లేడు. పుస్తక విక్రయ కేంద్రాల్లో ఎన్ని అమ్ముడయ్యాయో ఎన్ని ఉన్నాయో తెలిపేవాళ్లు లేరు. అవార్డుల కోసం పంపిన పుస్తకాల అడ్రస్సే లేదు. అవార్డులన్నీ వందిమాగధులకే పరిమితం అనే విషయాన్ని ఆలస్యంగా తెల్సుకున్నాడు. ఇదలా ఉంచితే.. బుక్ ఎగ్జిబిషన్‌లో సుబ్రావ్, తనూ చెరిసగం అద్దె కట్టే ఒప్పందం మీద స్టాల్ తీసుకున్నారు. నాలుగు పుస్తకాలు వందరూపాలు ఆఫర్ ఇచ్చినా.. కొనే నాధుడు లేక స్టాల్ రెంట్ కూడా జేబులో నుండే కట్టాల్సొచ్చింది.

ఏతా వాతా రాంపండుకి అనుభవం మీద బోధపడిందేమంటే ధన ఇంధనం, పలుకుబడీ, ప్రచారం, ఆర్భాటం ఉంటే నువ్వేం రాసినా పాఠకులు బ్రహ్మరథం పడతారు. ఇంకా చెప్పాలంటే విదేశీ యూనివర్సిటీలు ఆన్‌లైన్లోనే ‘డాక్టరేట్ డిగ్రీ’ కూడా ప్రదానం చేస్తాయి. ఈ విషయాలన్నీ ఆలస్యంగా అవగతం, ఆకళింపు చేసుకునే సరికి, రాంపండు చేతి వేళ్ళు రాయనని మొరాయిస్తున్నాయిప్పుడు. నాలుగు లక్షల నికర అప్పు మిగిలాక గానీ రాంపండుకి ‘అంతా భ్రాంతే’ అన్పించింది.

ఇంట్లో ఏమూల చూసినా కన్పిస్తున్న పుస్తకాల్లో పిల్లలు రోజుకొకటి తీసి పిచ్చి గీతలు గీస్తుంటే.. సహించలేక వాళ్ళ మీద చెయ్యి చేసుకోబోయిన రాంపండుకి అడ్డపడిన భానుమతి భాగమతిలా మారి.. రాంపండుని నిలదీసేసరికి.. పబ్లిషర్సే ప్రింటేయిస్తున్నారని అబద్దం చెప్పి.. ఇంటికి దూరంగా గది అద్దెకి తీసుకుని పుస్తకాల్ని తరలించాడు.

***

చదివారుగా! ఇప్పుడు భానుమతేం రాసిందో చదువుదాం రండి

“బావా! నీకు భార్యనైనందుకు చింతిస్తున్నాను. నాకు తెలికుండా నాలుగు లక్షల అప్పుచేసి పబ్లిషర్ల పేరుతో ప్రింటు చేయించి, దమ్మిడీ రాబడి లేకుండా అప్పుల్లో మునిగిపోయిన నీ రచనా వ్యసనం.. చూసి చూసి ఇక భరించే సహనం చచ్చిపోయింది. అదేమని నిలదీసిన నాకు తెలీకుండా అద్దెగదికి పుస్తకాలన్నీ తరలించావు. మొన్న నువ్వు విజయవాడెళ్ళాక.. ఆ ఇంటి వాళ్ళు మన ఇంటి మీద కొచ్చి.. పుస్తకాల వల్ల తమ ఇంటికి చెదలు వస్తోందని తక్షణం ఖాళీ చెయ్యమన్నారు. వాటన్నింటినీ మళ్ళీ పుట్టింటికి తరలించేసరికి నాకు చుక్కలు కన్పించాయి.

ఇంటి బాధ్యత, పిల్లల బాధ్యత నామీదొదిలేసి.. నువ్వు చేస్తున్న నిర్వాకంతో విసిగిపోయాను. నేనూ నా పిల్లలు పుట్టింటికెళ్తున్నాం.. నీ కంటుకున్న వ్యసన వ్యాధికి మందులు వాడు. పూర్తిగా తగ్గిందన్న నమ్మకం కుదిరాక.. తిరిగి నీ దగ్గరకి రావాలో వద్దో ఆలోచిస్తాను.”

 -భానుమతి

ఉత్తరం చదివిన రాంపండుకే కాదు మనిషన్న ప్రతి వాడిలో ఇలాంటి వ్యాధేదో ఉండే ఉంటుంది..దాని వలన ఏదో సాధిద్దామని గాల్లో పేకమేడలు కట్టేస్తూ, వాస్తవాన్ని విస్మరిస్తుంటాం. ఆ వ్యామోహంలో.. ఏం చేస్తామో, ఎంత కోల్పోతామో, ఎంత అశాంతికి గురౌతామో.. పట్టించుకోం, కాలానుగుణ్యమైన పోకడల్ని ఆకళింపు చేసుకోకుండా, కాలంతో కరచాలనం చెయ్యకపోతే, రాంపండు లాంటి అమాయకుల్ని.. సీతా సుబ్రావ్ లాంటి మాయకులు బకరాల్ని చేస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త..

‘ఒన్ మినిట్…’ విద్వత్తున్న చోటికి విజయం వెతుక్కుంటూ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here