‘రచన’కు 50 ఏండ్లు

0
5

[dropcap]స[/dropcap]రిగ్గా 50 ఏళ్ళ క్రితం

26 జూలై 1970 నాడు

‘మారుతున్న సామాజిక విలువలు – సమాజం పట్ల రచయితల బాధ్యతలు’ అన్న అంశం మీద ‘యువభారతి’ సాహితీ సంస్థ ఆంధ్ర సారస్వత పరిషత్తు భవనంలో సాహితీ గోష్ఠి నిర్వహించింది. గోష్ఠి నాటికి పూర్వమే 37 మంది సాహితీమూర్తుల ప్రసంగ పాఠాల్ని ‘రచన’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించింది.

నేను ‘రచయితలు – విమర్శకులు – విమర్శ’ అన్న అంశంపైన ప్రసంగించిన ఆరుగురు సాహితీమూర్తుల ప్రసంగ పాఠాలనుంచి మాత్రం కొన్ని వాక్యాలు, కొన్ని పంక్తులను యిక్కడ పేర్కొంటాను.

డా. దివాకర్ల వేంకటావధాని ‘మారుతున్న విలువలు – విమర్శకుల కర్తవ్యం’ అన్న అంశమీది ప్రసంగ పాఠంలోని కొన్ని వాక్యాలు :

“కాలమును బట్టి సారస్వతపు విలువలు గూడ మారుచుండును. విమర్శకుడు ఈ మార్పులను దృష్టియుంచుకొనవల్సిన ఆవశ్యకతమెంతైన నున్నది. రచయితలు విమర్శకుల సూచనలను పరిశీలించి యుపాధేయములైన వానిని గ్రహింపవలెను. విమర్శక రచయితలకపహార్యమైన సంబంధమున్నది. ఆ సంబంధము గుర్తింపబడని నాడు విమర్శకుల దారి విమర్శకులది, రచయితల దారి రచయితలది. ఆధునిక కాలముననట్లే జరుగుచున్నది.”

‘రచయితలు – విమర్శకులు’ అన్న అంశం మీద శ్రీ కె.వి రమణారెడ్డి ప్రసంగపాఠంలోని కొంతభాగం:

“….తెలుగులో భావకవిత్వం రెక్కలు పూన్చుకొంటున్న రోజుల్లో అక్కిరాజు ఉమాకాన్తుడు (ప్రతికూల విమర్శలు చేసి) ఏటికి ఎదురీది రెక్కలు విరుచుకున్నవాడే. కొంతమంది విమర్శకుల మీద రచయితల వైపునుంచి రాక్షస మనస్కులనే నింద వచ్చిపడుచున్నది. దోషాలు ఎంతటి కొమ్ములు ఒరిగిన రచయితలోనైనా వుంటాయి. మేఘంలోని నల్లడాగునే చూసి, దాని మెరుగంచును చూడకపోతే ఎట్లా?.. రచయితకూ పాఠకుడికీ మధ్య విమర్శక నామధేయుడు మూడో మనిషి వచ్చి దూరి ఉభయులకూ అన్యాయం చేయడం కంటే రచయితే విమర్శక రూపం దాల్చితే నయం కదా! స్విన్‍బర్న్ గురించి రాస్తూ టి.యస్. ఇలియట్ ఇట్లే అంటాడు. ఇలియట్ కూడా ఉభయచర జీవే. మన శ్రీ శ్రీ, విశ్వనాధలు మంచి విమర్శకులు గూడా.

…..విమర్శక వ్యాపారమనేది స్వతంత్రపు రచనోత్సాహం మీద నీళ్ళు చల్లేటటువంటిదని కొందరంటారు. విమర్శ అనేది పరోపజీవి మాత్రమేనని కూడా ధ్వని. కవిగా రాణించలేక విమర్శకు పూనుకున్నట్లు విమర్శకులను ఆక్షేపించడమన్నది అన్ని కాలాల్లోనూ, దేశాల్లోనూ వున్నది. విమర్శకుడు పరోపజీవి (parasite) మాత్రమేనా? నిజమే. రచన అనే ఆధారం లేకుండా విమర్శ సాగే వీలులేదు.

’రచయితలు – ప్రభుత్వం’ అన్న అంశమీద శ్రీ అక్కిరాజు వాసుదేవరావు ప్రసంగ పాఠంలోని పంక్తులు:

“ప్రజలకు ఉత్తమ వినోదాన్ని, విజ్ఞానాన్ని, ప్రబోదాన్ని కలిగించే సాహిత్యాన్ని సృష్టించడం రచయిత ధర్మం. రచయిత సాహితీ కృషికి అసంబర్థమైన పరిమితులు, నిర్బంధాలు విధించే అధికారం ఎవ్వరికీ లేదనీ అనుకోవచ్చు. అతని భావ పరిధికి ఎల్లలు లేవు. తన కాలానికీ, యుగానికీ సంబంధించిన ధర్మాన్ని ప్రతిఫలించజేయడం రచయిత లక్షణం.”

డా. కేతవరపు రామకోటి శాస్త్రి ‘విలువలు మారిన సాహిత్యం’ పై ప్రసంగపాఠంలో “రాజకీయ వాతావరణమెంత కలుషితముగా నున్నదో సాహిత్యరంగమంత కేమాత్రమును తక్కువగా లేదు. మన నేటి సాహిత్యమున సాహిత్యము కానరాదు. ప్రజాహితము కొరకు ప్రభుత్వము, ఆనందానుభవము కొరకు ఆర్థిక విధానం, విజ్ఞానం కొరకు విద్య, సర్వ మానవ విశిష్టానుభవాభివ్యక్తి కొరకు సాహిత్యము – యువన్నియు నిప్పుడు లేవు.”

కాళోజీ ‘జీవితం – సాహిత్యం’ ప్రసంగ పాఠంలోని భాగం:

“మానవ జీవిత విమర్శే రచన. మళ్ళీ రచన మీద విమర్శ ఏమిటి? అర్థంలేని మాటగాకపోతే…

పాఠకునికి విమర్శ ప్రయోజనం ఏమీలేదు. పాఠకుడి స్వేచ్ఛకు విమర్శకుడు అడ్డుతగిలి తానేదో వ్యాఖ్యానం చేస్తానంటాడు. పాఠకుడ్ని తప్పుదారులు పట్టించినా పట్టించవచ్చు. రచన స్వయంగా చదివి ఆనందించగలవాడే పాఠకుడు. విమర్శకుని సలహామేరకు చదివేవాడు పాఠకుడు కాదు, విద్యార్థి కావచ్చునేమో. విమర్శను పాఠకుడు ఏనాడూ ఆచరించలేదు. ఏ పుస్తక విక్రేతనడిగినా ఈ విషయం రుజువవుతుంది. గురుజాడను ‘అకవి’ అని విమర్శకులు అన్నంత మాత్రాన పాఠకులు ఆయన రచనలను ఆదరించడం మానినారా? విమర్శ యొక్క వుపయోగం మళ్ళీ విమర్శకులు కాదల్చుకున్న వారికి తప్ప పాఠకులకూ లేదు, రచయితలకూ లేదు. తన అభిరుచికి అనుగుణంగానే పాఠకుడు సాహిత్యాన్ని, రచయితను ఎంచుకుంటాడు.

జీవితాల్లో వున్నంతటి వైవిద్యం సాహిత్యంలోనూ వుంటుంది. ప్రతి సాహిత్య స్రష్టదీ ఒక ప్రత్యేకదారి ఎవరిదారి వారిదే. సాహిత్యం అంటే యిలా వుండాలి అని ఖచ్చితమైన సూత్రాలు చేస్తే వాటి ఉల్లంఘన జరిగినంతగా ఆచరణ జరుగదు. విమర్శకులు, అలంకారికులు కొన్ని సూత్రాలను రూపొందిస్తూనే వుంటారు. అది ట్రంకు రోడ్ల వంటిది. కార్లు, సున్నిత వాహనాలను వుపయోగించే స్వల్ప సంఖ్యాకులకు మాత్రమే వాటి ఉపయోగం. స్వేచ్ఛ వుండదు. కాలిబాటనడకలో స్వేచ్ఛ వుంటుంది. వున్న బాట అసౌకర్యంగా తోస్తే కొత్తబాటను సృష్టించుకుంటారు.”

గోరా శాస్త్రి ప్రసంగ పాఠంలోని కొంతభాగం :

“…. నవీన కాశీ మజిలీ కథలు పునర్జన్మ ఎత్తాయి. వాటినే నవలలు అంటున్నారు. 90% రచయితలు సాహిత్యాన్ని వ్యాపారంగా మార్చివేశారు. సాహిత్య సభల నిర్వహణ కూడా ఒక వ్యాపారం.

రెండు రకాల రచయితలుంటారు. సర్వదా ఉంటారు. కార్యక్షేత్రంలో దిగి సంఘసంస్కరామో, రాజకీయ సంరంభమో చేపట్టి తమ కృషికి సాహిత్య రచనలను ప్రచార సాధనాలను వినియోగించుకునేవారు ఒక రకం. ఉదా: కందుకూరి వీరేశలింగం పంతులు, రాజకీయ పార్టీల పత్రికలు, మత ప్రచార సాహిత్యం మొదలైనవి.

కావ్యరంగం (సాహితీరంగం), కార్యరంగం (సామాజిక, రాజకీయ రంగం) కొన్ని కొన్ని సమయాల్లో ఒకరంగంలో కృషిచేసే వ్యక్తిని మరో రంగం ప్రభావితం చేస్తుంది. అది పూర్తిగా వైయుక్తికం.

ఉదా:- అమెరికా రచయిత ‘థోరో’ రాసిన ‘వాల్డెన్’ అనే గ్రంధం, రష్యా రచయిత ‘కౌంట్‍లియో’ రచనలు గాంధీని ప్రభావితం చేశాయట. కానీ, ‘థోరో’ మహాశయుని రచనలు అమెరికాలో ఎలాంటి ఉద్యమాల్ని తీసుకురాలేదు. నిఖిలప్రపంచమూ- నిన్నా, ఇవాళా, రేపూ నివాళులర్పించే మహారచయిత టాల్‍స్టాయ్, మానవ నాగరికత ఊపిరిపీల్చినంతకాలం ప్రపంచ సాహిత్యంలో ధృవ తారవలె టాల్‍స్టాయ్ నిలుస్తాడు. బకూనిన్, బుఖారిన్, చెకోవ్, గోగోల్ కూడా రష్యన్ మహారచయితలు.

గాంధీజీ, గాడ్సే యిద్దరూ కూడా భగవద్గీతను ధర్మ సంస్థాపనకు ’దీపకళిక’గా అభివర్ణించారు. కానీ ఒకే గ్రంథం ఇద్దరి భావాల్నీ ఉత్తర, దక్షిణా ధృవాలుగా మార్చింది.

సాహిత్యరంగంలోని భేద, మోదాలతో సంబంధం లేకుండా జాతీయ జీవనం మార్పు చెందుతుంది. శ్రీశ్రీ మహాకవి, కృష్ణశాస్త్రిగారు కవితా శిల్పంలో అద్వితీయులు. అందరి రచనల్నీ ఆనందిస్తున్నారు. మంత్రుల మీద పంచరత్నాలు రాసే వాళ్ళున్నారు, అగ్నివర్షం కురిపించే వాళ్ళున్నారు. శరపరంపరగా ‘కాలక్షేపం బటాణీల’ నవలల్ని రాసే నవలా మణులున్నారు. అందరూ సమకాలికులే. జాతి జీవన విధానాన్ని మార్చుతున్న ‘పాపాన్ని’ వారికి అంటగట్టడం పరమ అన్యాయం. సహగమనాన్ని సమర్థించేవారున్నారు, ఏకకాలంలో నక్సలైట్లను ప్రశంసించేవాళ్ళున్నారు. ‘దేవతావస్తాలను’ ధరించి తమ సెక్సు రేడియేషను కిరణాలను ప్రసరింపజేయాలనే యువతీమణుల ఉత్కంఠనూ, నీతి బాహ్య రాజకీయాలనూ వగైరా, వగైరా సృష్టికి కారకులు, బాధ్యులు కవులూ, రచయితలూ ఎంతమాత్రం కాదు.

రచయిత తయారుచేసిన ‘దినుసు’ను నచ్చితే పబ్లిషరు ప్రచురిస్తాడు, నచ్చితే పాఠకుడు చదివి ఆనందిస్తాడు. ఒకరు రామాయణాన్ని మరోమారు రాస్తే, మరొకరు ‘దోపిడీదారులను’ తిడుతూ సాహిత్యాన్ని వండుతున్నారు. సమానత్వం కావాలని మహిళలు రాస్తున్నారు. నవ నాగరికత వ్యామోహంలో వింత పోకడలు పోయే మహిళల గురించి ‘పురుషరచయితలు’ వాపోతున్నారు.”

‘రచన – సాహిత్యగోష్టి’ని సమీక్షిస్తూ శ్రీ సురమౌళి వాక్యాలు:

‘విద్యాశాఖామాత్యులు శ్రీ పి.వి నరసింహారావు ’రచన’ పుస్తకాన్ని ఆవిష్కరించాడు, ’గోష్ఠి’ని కూడా ఆవిష్కరించాడు. ఇటువంటి గోష్ఠుల ప్రాధాన్యతను ఉగ్గడించిన విద్యామంత్రి ఎన్నో పుస్తకాల ప్రచురణకు విరాళాలిస్తున్న విద్యాశాఖ నుండి ధనసహాయం గురించిన మాట యింతవరకూ తెలియజేయక పోవడం శోచనీయం’ అని రాశాడు (ఆంధ్రభూమి – 03-08-1970 సంచికలో ప్రచురితం).

‘ఆంధ్రపత్రిక’ దినపత్రిక 09-08-1970 ఆదివారం సారస్వతానుబంధంలో ఈ గోష్ఠి సందర్భంగా రచయిత తన భావపరంపరలను కలంలో పోసి సామాజికుని నెత్తిన రుద్దటం జరుగుతోందని ఇటీవలి కవిత్వాలు, కవితలు, రచనలు తేటతెల్లం చేస్తున్నాయి అని రాసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here