రచయితల సమస్యలు

0
8

[11, 12 ఆగస్ట్ 1973 తేదీలలో జరిగిన ‘కడప జిల్లా రచయితల మహాసభల’ సందర్భంగా ‘కడప జిల్లా రచయితల సంఘం’ ప్రచురించిన విశేష సంచిక కోసం శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన ఈ వ్యాసాన్ని సంచిక పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము.]

[dropcap]ర[/dropcap]చయిత ప్రధానంగా రెండు సమస్యలతో సతమతమవుతున్నాడు. మొదటిది రచనకు కావలసిన విషయసేకరణకు సంబంధించినది. రెండవది రచించిన గ్రంథాలను ప్రచురించుకోవటంలో పడే యాతన. గ్రంథమనే పేరుతో ఏది వ్రాసినా చెల్లుపాటయ్యే కాలం అంతరించింది. ఏదైనా ఒక విషయాన్ని గురించి వ్రాసే ముందు రచయిత ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవలసి వుంటుంది. అంతేకాక ఆ విషయమును గూర్చి ఇదివరలో ప్రకటితమైన రచనలతో పరిచయం కల్గివుండటం అవసరము. ఇదివరకు వ్రాసినవారికంటె మరికొన్ని క్రొత్త విషయాలను వెల్లడి చేయగల్గినపుడే క్రొత్తరచనకు పూనుకోవడం సబబు. లేకున్న ఆ రచన పాడిందే పాటగా వుండిపోతుంది. క్రొత్త విషయాలను తెలియ జేయవలెనన్నపుడు రచయిత ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవలసి వుంది. రచయిత వ్యుత్పన్నుడు కావలెను. అందుకు అతనికొక గ్రంథాలయ మవసరము. అసలు రచయితకు తాను బాగా అధ్యయనం చేసి అవగాహన మొనర్చుకొన్న విషయాలనే విశిష్టంగా చెప్పవలెనన్న తహతహ వుండవలసిందే. అట్టి మనస్తత్వం పరిశ్రమ లేనట్టి రచయిత చేసే రచనలు నిష్ప్రయోజకములు. వాటివల్ల రచయితకుగాని పాఠకులకు గాని లాభించే ప్రయోజనమేమీ వుండదు.

రచయిత తీవ్రమైన పరిశ్రమకు సంసిద్ధుడు కావలెను. ఈ పరిశ్రమ వ్యయ, ప్రయాసలతో కూడుకొన్నది. నా అనుభవంలోని ఒక విషయాన్ని మనవి చేస్తాను. కడప మండలములో జన్మించిన సుప్రసిద్ధ కవి ఆయన. ఆయన, గతించి నలుబదేళ్ళు అయుంటుంది. సుమారు నలుబది గ్రంథాలను రచించిన వాడాయన. ఆకవిని అతని కావ్యాలను గురించి ఒక పరిచయ వ్యాసం వ్రాయదలచితిని. స్థానికంగా వుండే గ్రంథాలయాలను, కళాశాల గ్రంథాలయంలోను ఆ కవిగారి రచనలకై తిరిగితిని. స్థానిక పండితులను విచారించితిని. ఏ రెండుమూడు గ్రంథములో తప్ప తక్కినవేవి లభింపలేదు. ఆ మహాకవి తన జీవితకాలంలో సేకరించిన గ్రంథములనే కాక స్వీయరచనలను చేర్చి నాలుగు వందల గ్రంథములను ఒక బీరువాలో సహా స్థానిక గ్రంథాలయ మొకదానికి 1926లో దానముగా ఇచ్చినట్లు తెలిసింది. కాని అక్కడ వారి గ్రంథములేవి లభింపలేదు. చివరకు ఒంటిమిట్ట కోదండ రామాలయ ధర్మకర్తల నుండి కొన్ని గ్రంథములు లభించినవి. ఆయన మరెవరో కాదు. ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బరావుగారే.

రాయలసీమ కవుల గూర్చి పరిచయ వ్యాసాలు వ్రాస్తున్నపుడు మరికొన్ని అనుభవాలు కలిగినవి. కొందరు కవులు నా అభ్యర్థనకు ఉదాసీనంగా వుండిపోయారు. మరికొందరు, తమపేరును ఆ రచనలలో ఉటంకించలేదేమన్నారు. మరికొందరు మేమిన్నాళ్ళ తరువాత జ్ఞప్తికి వచ్చామా అన్నారు. ఒక సంఘము వారు రచయిత మరో సంఘానికి చెందినవాడని విమర్శించారు. ఈ రీతి సమస్యలు పరిశోధనాత్మక కృషి సల్పే రచయిత లందరూ ఎదుర్కోవలసి వుంటుందనుకొంటాను.

డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి

ఇక కథలు, కవితలు, నవలలు, నాటికలు రచించేవారి విషయం చూద్దాం. వారికి పై పేర్కొన్న సమస్యలుండవు కాని వారు ఎదుర్కొనే సమస్యలు కొంత భిన్నంగా వుంటాయి. అతడు కేవలం ప్రతిభావంతుడైన మాత్రాన రచన చేయలేడు. తాను రచింపదలచిన రచనా ప్రక్రియ యొక్క పూర్వాపరాలను అతడు బాగా గ్రహించి వుండవలెను. అంతేకాదు ఇరుగు పొరుగు భాషలలోని ఉత్తమ రచనల పరిచయమూ వుండవలెను. అంతకంటె ముఖ్యముగా ఆయా ప్రక్రియలో కాలాను గుణ్యంగా వచ్చిన రచనాశిల్పము, వస్తు చిత్రణము, పాత్రల మనో విశ్లేషణా నిరూపణము, జీవిత దృక్పథము, శైలీవిన్యాసము మున్నగు వాటిలో పరిచయముండవలెను. రచన విశిష్టంగ వుండవలెను కదా? అట్టి రచనకు పూనుకొనే రచయితకు కావలసిన అనుభవము పరిశ్రమ, విషయ పరిజ్ఞానము వుండి తీరవలెను. అందువల్ల కథా, కవిత, నవల నాటిక మున్నగు వాటిని రచించే వారి కృషి ఎంతమాత్రమూ సులువైనది కాదు. ఇట్టి బృహత్తరమైన బాధ్యతను పూనుకొని రచనలు సాగించేందుకు కావలసిన అనుకూలాలు, వసతులు ఎంతవరకు లభిస్తున్నవి? అని మనం ఆలోచించవలసి వుంది. మేధావులైన అట్టి రచయితలు ఏ చీకూ చింతా లేకుండా ఏకాగ్రతతో రచనలు సాగించే అవకాశం వుందా అని నా ప్రశ్న. తెలుగుదేశంలో రచన ఒక వృత్తిగా పరిణమించే కాలం ఇంకా రాలేదు. ఆత్మ తృప్తికి తమ సంతోషానికే వ్రాసేవారు ఎక్కువ. జీవికకై ఏదో ఒక వృత్తిని సాగిస్తూ విరామ కాలంలో రచనలు సాగించేవారు అత్యధిక సంఖ్యాకులుగా వున్నారు. ఈ పరిస్థితులలో విశిష్టము, విశ్వజనీనము అయిన రచన చేయడం ఎలా సాధ్యమవుతుంది. మీరు పరిశోధనలు సాగించండి, ఉత్తమ గ్రంథాలు వ్రాయండి, తగినంత ఆర్థిక సహాయం మేమందజేస్తాం అనే సంస్థ కాని, విశ్వవిద్యాలయం కాని ప్రభుత్వం కాని కానరాదు. ఆర్థికంగా సతమతమవుతున్న ఈ సమయంలో రచయిత మాత్రం నిబ్బరంగా నిశ్చితంగా రచనలు ఎలా చేయగలడు? అనే విషయం మనం ఆలోచించవలసి యున్నది.

ఎన్నో కష్టాలను అధిగమించి రచన పూర్తి చేసిన తరువాత దాన్ని ప్రచురించి విక్రయించుటలో అతడు వందలాది సమస్యల నెదుర్కోవలసి వుంది. రచనకు తగిన ప్రతిఫలం ఆశించడం ఆకాశ పుష్పంలా ఆసంభవమైంది. కొద్ది పెట్టుబడితో అల్పవ్యవధిలో శ్రమ లేకుండా అధిక లాభాలను గడించండం ప్రచురణకర్తల లక్ష్యము. సాధారణంగా వ్యాపారమంటేనే లాభార్జనాసక్తి ప్రధానంగా వుంటుంది. రచనలలో కూడ పరిశోధనాత్మక రచనలు సులువుగా అమ్ముడుపోవు. వాటిని ప్రచురించుటకు సామాన్యంగా ఎవరూ ముందుకురారు. ఈనాడు కథలూ, నవలలూ ప్రచురించే సంస్థలు ఎన్నో పుట్టుకొచ్చినవి. వారు బాగా డబ్బు చేసుకొంటున్నారు.

రచయిత తన రచన అందంగా ఆకర్షణీయంగా అచ్చుతప్పులు లేకుండా, ఆలస్యం కాకుండ ముద్రింపబడి పాఠకుల ప్రశంసలు అందుకోవలెనని ఆశించడం సహజం. కాని రచయితల మనస్తత్వాలను బాగా గ్రహించిన ప్రచురణకర్తలు ఏదో కొంత ముట్టజెప్పి రచనను తీసుకొని ముద్రించి బాగా డబ్బు చేసుకోవడం సామాన్యంగా జరుగుతున్నదే. కాకపోతే మరుముద్రణ కొచ్చినప్పుడు పదో పదిహేనో శాతం రాయల్టి ఇస్తారు. రచయిత స్వయంగా ముద్రించి విక్రయదారుల వద్దకు వెళ్తే నలభై, యాభై శాతం వరకు కమీషన్ ఇమ్మంటారు. ఇవన్నీ చూస్తే రచయిత కావడం కంటే వ్యాపారి కావడం అన్నివిధాలా లాభదాయకం అనిపిస్తుంది. తెలుగు దేశంలో రచయిత లెదుర్కొనే సమస్యలలో ఇదొక పెద్ద సమస్య. స్వయంగా ప్రకటించే రచయితకు పుస్తకాలను అమ్ముకోవడం గడ్డు సమస్యగా వుండిపోతుంది. మిత్రులకిచ్చిన కాంప్లిమెంటరీ ప్రతులు తప్ప తక్కినవన్నీ యింటిలో మూలుగుతూ వుంటాయి. కొన్నినెలలు దాటినా పరిస్థితిలో మార్పురాక పోయేసరికి పుస్తక వ్యాపారులను ఆశ్రయించి వారు కోరిన ధరకు అమ్మివేసి తన బరువు తీరిపోయిందనుకుంటారు. చివరకు తన మిత్రుల కివ్వటానికి ప్రతులు కావాలని విక్రయదారును అడిగితే పూర్తి వెల యిస్తేగాని పుస్తకం లేదంటాడు. ఇది రచయితకూ, ప్రచురణకర్తకూ మధ్యగల బాంధవ్యం. రచయిత రెంటికీ చెడిన రేవడి అయిపోతున్నాడు.

రచన ఒక వృత్తిగా పరిణమించలేదనే విషయం అందరికీ తెలిసిందే. తొలిదశలో రచయిత ప్రతిఫలము ఆశించడు. కొంతకాలం సాగిన తర్వాత అతడు తన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కోరడం సహజం. ధనార్జనయే ప్రధానంగా భావించి రోజుకు కొన్నిపుటల వంతున వ్రాసే రచయితలు కూడ ప్రచురణకర్తల వలలో పడిపోయే ప్రమాదం వుంది.

వందో, యాభయ్యో చెల్లించి రచనలను చేజిక్కించుకొని, కొన్నేళ్ళయినా వాటిని ప్రచురించుటకు పూనుకోనట్టి ప్రకటన కర్తలు వున్నారు. కొన్నేళ్ళయినా పుస్తకాలు బయటికి రాలేదేమని రచయిత అడిగినప్పుడు ముద్రణకు కావలసిన పెట్టుబడి చాలదంటాడు ప్రచురణకర్త. చివరకు రచయితనుండి కొంత పైకాన్ని తీసుకొంటాడు. ఈ రీతిగా రచయిత నానా యాతనలు పడుట సంభవిస్తున్నది.

ఇన్ని అవస్థలను అధిగమించి పుస్తకాలను అచ్చు వేసుకొన్న తర్వాత, ప్రముఖుల అభిప్రాయాలకు, పత్రికలో సమీక్షలకు పుస్తకాలను పంపుకొంటాడు. కొందరు పెద్దలు పుస్తకాలు అందినట్లు కూడా వ్రాయరు. కొన్ని నెలలు దాటినా సమీక్షలు రావు.

రచయితల సహకార సంఘాలు నిర్మింపబడినపుడు, యీ సమస్యలు చాలావరకు పరిష్కారం కాగలవు. ప్రభుత్వము గ్రంథాలయాలు, విద్యాసంస్థలు, యీ సహకార సంఘాల ప్రచురణలను తప్పక కొనవలసి వుంటుంది. అట్టి మంచిరోజులు త్వరలో రాగలవని ఆశిద్దాం.

– జానమద్ది హనుమచ్ఛాస్త్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here