రాధమ్మ కథ

3
7

[శ్రీ కళాధర్ రచించిన ‘రాధమ్మ కథ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఈ[/dropcap] రోజు ఇంకా రాలేదేందో శాంతమ్మ!” అంటూ ఇంటి గలుమ ముందుకు వస్తూపోతూ ఉంది రాధమ్మ.

అనుకుంటూ ఉండగానే రోజూ లాగానే ఊతకర్ర పట్టుకొని నడుంపై చేయి వేసుకుని నెమ్మదిగా వస్తూ వుంది శాంతమ్మ.

“రాధమ్మా, ఏం శాకం వండావు తల్లీ” అంటూ ఇంట్లోకి నెమ్మదిగా వచ్చింది శాంతమ్మ.

“ఆఁ.. శాంతమ్మా! వచ్చావా? ఇంకా వంటేం చేయలేదు. ఇవ్వాళ పెద్దగా ఆకలిగా లేదు. ఈ రోజేంది ఇంత ఆలశ్యం చేశావు?”

“కోడలు పనికి పోతూపోతూ, గుడాలు ఉడుక పెట్టిపోయింది, పిల్లగాడు బడికెళ్ళొచ్చి తింటాడని.” అని చెప్పి,

“పొద్దుపోతోంది కదా ఇంకా వంట చేయలేదంటవేంటి? ఆకలైందమ్మా. వంట మొదలెట్టమ్మా” అంది శాంతమ్మ.

“సరే శాంతమ్మా, నువ్వొచ్చావుగా, ఇక నీతో మాట్లాడుకుంట వండేస్తా” అంది రాధమ్మ.

ఇది రాధమ్మ, శాంతమ్మల దినచర్య.

రాధమ్మది ఆ ఊర్లో భూస్వాముల కుటుంబం. శాంతమ్మ వాళ్ళింట్లో ఒకప్పుడు చాలా రోజులు ఇంటిపనులు చేసింది.

ఆమే కాదు, వారి పూర్వం నుంచి రాధమ్మ ఇంట్లో ఇంటిపనులు చేసే చాకలివాళ్లు.

రాధమ్మ భర్త చాలా రోజుల క్రితం కాలం చేశాడు. రాధమ్మ ఇప్పుడు ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఇద్దరు కొడుకులు పట్నంలో స్థిరపడ్డారు. రాధమ్మ కొద్ది రోజులు కొడుకుల వద్దే ఉండి కోడళ్ళ ప్రవర్తన నచ్చక ఎవరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఊరొచ్చి ఒక్కర్తే ఆ పెద్ద ఇంట్లో ఉంటోంది. కొడుకులు ఎంత రమ్మన్నా కూడా వెళ్ళదు. అప్పుడప్పుడు కొడుకులు వచ్చి చూసిపోతూ ఉంటారు. ఏమన్నా అవసరం అయితే అందించమని శాంతమ్మ కొడుక్కి కొంత డబ్బులు ఇచ్చి వెళుతూ ఉంటారు.

ఇక శాంతమ్మకు ఇప్పుడు శరీరం సహకరించకుండా ఉంది. చాలా ఏండ్లు.. చాలా ఏండ్లేంది.. తనకు బుద్ధి తెలిసిన దగ్గర నుంచి నాలుగు ఇండ్లల్లో పనులు చేస్తూనే సాగింది తన జీవితం. కొడుకు పుట్టిన కొద్దిరోజులకే భర్త మరణించాడు. అత్త, మామ, కొడుకును పెట్టుకొని జీవనం సాగించింది. కొడుకుని కొద్దిగా చదివించింది. కొడుకు ఆటో నడుపుతాడు. కోడలు తమ కులవృత్తిని కొనసాగిస్తుంది. నాలుగు ఇండ్లలో పనులు చేస్తూ ఉన్న ఒక్క కొడుకును చదివిస్తోంది. చూడాలి – ఈ తరంలోనైనా వారి జీవితాలు మారతాయేమో!

ఇక ఒంటరిగా ఉన్న రాధమ్మకు శాంతమ్మ సావాసమైంది. కొడుకు, కోడలు పనికి వెళ్ళగానే శాంతమ్మ నెమ్మదిగా రాధమ్మ ఇల్లు చేరుతుంది. పొద్దుపొడిచే దాకా అక్కడ కాలక్షేపం చేస్తారు. చీకటి పడుతుండగానే శాంతమ్మ తిరుగు ప్రయాణమవుతుంది. శాంతమ్మ ఇల్లు పెద్ద దూరమేమీ కాదు. నాలుగు సందులు మళ్ళితే ఇల్లు చేరుతుంది. కొన్ని సార్లు కొడుకు త్వరగా వస్తే తీసుకెళ్తాడు.

శాంతమ్మ రాధమ్మ కన్న పదేళ్ళు పెద్దది. రాధమ్మను చిన్నతనాన ఎత్తుకు తిరిగింది కూడా.

“అమ్మా రాధమ్మా, నువ్వు చిన్నతనాన సానా మొండిదానివమ్మా. ఎప్పుడూ ఎత్తుకు తిరగాలి. కిందకు దించితే గుక్క పెట్టి ఏడ్చేదానికి. నీకు గుర్తుందో లేదో” అంటూ ఫక్కున నవ్వింది శాంతమ్మ.

“ఇల్లాంతా ఎంత సందడిగా ఉండేదో. మీ అమ్మానాన్న, మీ మేనత్తలు, మీ మేనమామ –

మీ నాయన అన్నట్లుగానే మీ మేనమామకు ఇచ్చి పెళ్ళి చేసాడు. అయినా బావంటే ఎంత భయముండేదో మీ మామకు, చానా మర్యాదుండేది.

అంతా కళ్ళ ముందు ఏరు లాగా ఎల్లిపోయింది” అంటూ నెమరేస్తూ ఉండేది శాంతమ్మ.

రాధమ్మ వింటూ దిగాలు పడేది.

రాధమ్మ ఒకప్పుడు ఇలా ఉండకపోయేది. పనోళ్ళను పనివాళ్ళ లాగే చూసేది. బాగా బలిసిన వాళ్ళాయె. ఒకప్పుడు శాంతమ్మ గలుమ దాటి లోపలికి రావాలంటే భయపడేడి. అందులోనూ రాధమ్మంటే చాలా భయం ఉండేది. తక్కువ జాతి – అంటూ ఎక్కువ తక్కువలు చూపించేది రాధమ్మ.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలాగా పయనించదు. ఇప్పుడు శాంతమ్మను చాలా బాగా చూసుకుంటుంది రాధమ్మ. తన కోసం బల్లపీట ఒకటి వేయించింది. చాలా సేపు ముచ్చట్లు పెడుతూ అటు నడుం వాల్చమంటుంది. ఏదైనా తినడానికి చేసి పెడుతూ ఉంటుంది. పండో, ఫలమో ఏదో ఒకటి శాంతమ్మకు పెడుతూ ఉంటుంది. తను ఇంటికి వెళ్ళేటప్పుడు తన మనవడికి ఏదో ఒకటి ఇచ్చి పంపుతుంది రాధమ్మ.

ఊరి ముచ్చట్లు, చిన్ననాటి జ్ఞాపకాలు, కొడుకులు, కోడళ్ల ముచ్చట్లతో రోజులు గడుస్తూ ఉండేవి రాధమ్మకు, శాంతమ్మకు.

రాధమ్మ మార్పుకు కారణం తన ఒంటరితనం నుంచి ఉపశమనానికై ఉండొచ్చు -మనిషి ఆకలి ముందు పెట్టేవాడి కులం మతం గుర్తు రావు. ఆకలి, అవసరం అనే సుగుణాలు మనిషిని ఏ స్థాయి నుంచైనా ఏ స్థాయికైనా తీసుకుపోతాయి. పుట్టేటప్పుడు ఏం తీసుకురాడు, పోయేటప్పుడు ఏం తీసుకుపోడు. కులం, మతం – మనిషి ఆకలిని తీరుస్తాయా అనే జాతీయాలు – మనిషి – చివరి అంకంలోనో లేదా అవసరాలు తీర్చుకోవడం కోసమే వాడుతాడు తప్ప అంగ బలం, ధన బలం ఉన్నప్పుడు అవి గుర్తుకు రావు.

అలా రోజులు గడిచిపోతున్నాయి. ప్రతి రోజు లాగే శాంతమ్మ ఇంకా రాలేదే అంటూ ఇంటి గలుమ వద్దకు వస్తూ పోతూ ఉంది రాధమ్మ. పొద్దు జాము గడిచిపోతోందే ఇంకా రాలేదేంది శాంతమ్మ అనుకుంటూ గలుమ దాటి రెండడుగులు వేసింది. శాంతమ్మ కొడుకు ఆటో రావడం గమనించింది రాధమ్మ. తనని చూసి ఆపుతాడులే అనుకుంది రాధమ్మ. అలాగే స్పీడుగా వెళ్ళిపోయాడు శాంతమ్మ కొడుకు.

రాధమ్మ అలాగే చూస్తుండిపోయింది. శాంతమ్మ కొడుకు అలా స్పీడుగా వెళ్ళిపోయినందుకు కాదు – ఆటోలో శాంతమ్మ కోడలు కేకలు పెడుతూ ఏడుస్తోంది. పక్కనే ఏదో మూట ఉంది.

అటుఇటు గాబరాగా చూస్తోంది రాధమ్మ. ఇంట్లోకి వెళ్ళి ఏమైందో ఏమో అని గాబరా పడింది.

ఇంతలో సమాచారమొచ్చింది – అమ్మ శాంతమ్మకు రాత్రి కడుపులో నొప్పొస్తే దావఖానాకు తీసుకుపోయిండ్రు. ఏమైందో ఏమో ఏకువ జామున చనిపోయింది అని చెప్పాడు వాడు.

రాధమ్మకు ఒక్కసారిగా గుండె పగిలినట్లైంది. శాంతమ్మ తనతో ముచ్చటించిన ముచ్చట్లన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒంటరితనం గుర్తొస్తోంది. తనకు ఎవరూ లేరని, ఏదో ఆత్మబంధువును కోల్పోయిన బాధలో పడిపోయింది రాధమ్మ.

సాయంకాలానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. శాంతమ్మని కడసారి చూసే ధైర్యం చేయలేకపోయింది రాధమ్మ. ఒక మంచి నేస్తాన్ని కోల్పోయింది. అలా కొద్ది రోజులు గడిపిన రాధమ్మ ఆ ఊళ్ళో ఉండలేకపోయింది. కొడుకులు ఎంత బలవంతపెట్టినా వెళ్ళని రాధమ్మ పట్నం ప్రయాణమైంది.

మనిషి ఓ ఊళ్ళో పుట్టి, పెరిగి, జీవితాన్ని సాగించి ఆ ఊళ్ళో చావడం అంత తేలికేం కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here