రేడియో కబుర్లు

0
7

[box type=’note’ fontsize=’16’] రేడియో కబుర్లు అనే ఈ వ్యాసాన్ని శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు రచించారు. మూల వ్యాసం త్రిలిఙ్గ రజతోత్సవ సంచికలో ప్రచురితం. [/box]

[dropcap]నా[/dropcap]ద ప్రసరణానికి భూ-జల-వాయ్వాకాశాలు తోడవుతాయి. ముఖ్యంగా మానవులుండేది గాలిలోనే గనక వాయువు నాదవాహకంగా ఉంటుందనేమాట మానవులు గమనిస్తూండే విషయమే. పోనీ వాయువేగం వేరూ, వాయువులో నాదవేగం వేరూ అయినా, జనించిన ఒక నాదతరంగాన్ని వాయువు తన ప్రకంపనశక్తి వల్ల మోసెయ్యగలదనేమాట రూఢి. అది అట్లా మోసెయ్యకలదేగాని, విశేషదూరం గడవకుండానే నాదంయొక్క పటుత్వం క్షీణించి క్షీణించి త్వరలో ఆ నాదమే అంతరించిపోతుంది. (నాదానికి అల్లా క్షీణించే లక్షణమే గనక లేకపోతే భూగోళం ఎల్లప్పుడూ గందరగోళంగా ఉండవలిసొచ్చేది గనక మనం విచారపడనక్కర్లేదు!) ఒకవేళ అల్లా అంతరించకుండా నిలవగల సామర్థ్యం నాదానికి ప్రసాదించాం అనుకోండి, అనుకున్నా భూమికి సగంచుట్టు తిరిగిరావడానికి నాదానికి ఒకపూటా అందుపైన నాలుగుగంటలూ కూడా ఇంకా చాలనేచాలదు. భూగోళంమీద ఉండే ఏ యిద్దరి మనుష్యులకైనా మిక్కిలి ఎక్కువదూరం (భూమియొక్క అర్ధపరిధి గనక) పదమూడువేలమైళ్ళు మించదు. అటువంటి యిద్దరిలో ఒకడు మాట్టాడితే రెండోవాడికి వినపడడం నాదబలానికి అతీతం గనక అసంభవం అని మానవులు నమ్మేవారు. కాని మానవుల విజ్ఞానమూ, ఆలోచనా, కార్యాచరణా, జీవితావసరాలూ పెరిగినకొద్దీ, ఎవరో ఒక జ్ఞాని మరో పన్లో ఉండి ఒక విద్యుద్దీప ప్రయోగంలో గావించిన ఊహానుమాన బీజంవల్ల ‘రేడియో’ అనే సంస్థ ఆవిర్భవించిన మీదట, అసంభవం అని లోగడ అనుకున్న పని, సంభవం అయినా పూటకాలంలో కూడా కాదనుకున్నపని, సెకను యొక్క ఒక వీసభాగంలో జరిగిపోతూండడం విశేష నాగరికత లేనివాళ్లకి కూడా పరిపాటి అయిన సంగతి. అనగా రేడియో వచ్చి, వాయుదేవుడు వేగవిషయంలో ఎంతపేరుపడ్డప్పటికీ ఆ ‘మంద’ పవనం గార్ని నాదవాహక క్రియలోంచి కొన్ని సందర్భాల్లో తొలగించి, ఆ పని తనుచేసి, దూరాన్ని జయించేసి, దూరశ్రవణం సుసాధ్యం చేసింది. ఇక, ప్రేషక స్థానంలో నాదోచ్చారణ చెయ్యగానే ఉద్భవించే నాదతరంగం, దాన్ని అనుసరించి సూక్ష్మాతిసూక్ష్మాలతో శబ్దగ్రాహిలో బయల్దేరే విద్యుత్తరంగం, దాన్ని బట్టి ఉండే ప్రవర్ధకతరంగం, అది పరివర్తనకోశంలో పడ్డమీదట పుట్టే క్రమణికతరంగం, తద్వారా ప్రకంపన తరంగం, సాధారణసాతత్యంలోంచి మహాసాతత్యం పొందిన ప్రవాహక తరంగం, దాన్నించి కాంతవిద్యుత్తరంగం, తత్ప్రసరణం పైక్రియలన్నీ విలోమంగా నడవడానికి ఏర్పాట్లు చేసుకుని గ్రాహకాన్ని అదే సృతిలో మేళగించి జనం కూచున ప్రతీస్థలంలోనూ అసలునాదం యథారీతిగా సిద్ధించి సెకను యొక్క వీసభాగంకంటె తక్కువలో వినపడడం – అనేటటువంటి తికమకలు ‘రేడియో’ అనేది తన నిత్యకృత్యంలో పడేపాట్లు! అన్నట్టు ప్రేషక స్థానంలో ఉండే నాదచోదకులు కూడా అటువంటి పాట్లు పడతారు. తక్కినవాళ్ళు ఫలితం వినడానికి చెవికోసుగుంటారు గాని, అటువంటి వాటిని చెవినిపెట్టరు.

‘రేడియో’లో విశేషాలు ఏమిటంటే వినపడే దూరం పొడుగునా కాస్త తీగేనా లేకపోడం ఒకటీనూ, నాదం భూమి అంతటా సెకను యొక్క భాగంలోనే చుట్టబెట్టి వినిపించడమూనూ! ఇతర గ్రహాలదగ్గిరికి భూమినాదం ఈ యంత్రంవల్ల వినిపించదని చెబుతారు. వెళ్ళి తిరిగొచ్చినవాళ్ళు చెప్పేవరకూ అది ఒప్పుగున్నా తప్పులేదు. మనిషియొక్క దేశాభిమానం భూగోళాభిమానంగా మారడానికి అవకాశాలు రేడియోలో ఉన్నాయి. పరభాషలు వినేటప్పుడు అవి కూతలులా ఉన్నాయనీ పరగానాలు వినేటప్పుడు అవి ఒకటోరకం ఏడుపులులా ఉన్నాయనీ జనం అనవసర నిరసనం చెయ్యడం పోయి, ఆయానాదాలు వాళ్ళవాళ్ళకి శ్రావణయోగ్యంగా ఉండే కవిత్వగానాలు గావును అని సరిపుచ్చుకోగలగడమే గొప్ప సహనశక్తి గనక అది రేడియోవల్ల అభివృద్ధి అవుతుందని చెప్పవచ్చు. భాషేకాక, గానమే కాక, ఇతరనాద లేశ సముదాయం కూడ హృదయాన్ని ఆకర్షించి అర్ధదాయకం కూడా కావచ్చునని రేడియోలో తెలుస్తుంది. చదవడంలోనూ వ్రాయడంలోనూ అవసరం అయే శ్రమగాని, శ్రద్ధగాని దీక్షగాని లేకుండానే ఆ మాటకొస్తే, అసలు చదవడం వ్రాయడం తెలియవలసిన అవసరం లేకుండానే, ఏకకాలమందే అనేక మానవుల్ని జ్ఞానవంతుల్నిగా చెయ్యడానికి రేడియోకి సామర్థ్యం ఉంది. శారీరక మానసిక ఆత్మిక సందర్భాల్లో మానవజాతికి అవసరం, అనుగుణం, అనుకూలం, ఆనందంగల ఏ విషయం అయినా సరే అరటిపండు ఒలిచినట్టు వినిపించగల ప్రజ్ఞ రేడియోదే. రేడియో నిమిత్తం అయే సొమ్ము ఖర్చూ కాలవ్యయమూ గమనించి అందుకు తగ్గట్టుగా ఎంతమంది పామరజనం అజ్ఞాననిద్ర లోంచి మేల్కొల్పబడ్డారూ, వాళ్ళ విజ్ఞానపు మట్టం ఎన్ని అంగుళాలు పైకి ఎగిరిందీ అనే లెక్కలు ఎప్పటికప్పుడు తేల్చడానికి వీలైనరకంవి కావు. అసలు పామరజనం రేడియోలాభం పూర్తిగా పొందగలరా అనేదే మీమాంస. ఎందులోనైనా సరే గొప్పవాడొచ్చి మాట ఆడినా, గానశాస్త్రి వచ్చి పట్టుపట్టినా, రొద చేసినా, జనం వినడానికి గ్రాహకపు పెట్టెలున్నచోట్లకి ఎగడతారు. రేడియోలో మాట్టాడిం తరువాత గాని, పాడింతరువాత గాని గొప్పవాళ్ళయిన వ్యక్తులు కూడా వెతికితే విధిగా దొరికి తీరతారు. మధ్యరంగం వాళ్ళకి రేడియో వినడం మంచి వ్యసనం. నస్యం, కాఫీ పీల్చడము వ్యసనంలాగే, టాకీ చూడడపు (తెలుగుదై తేవినడపు) వ్యసనంలాగే, వార్తాపత్రికలు చదవడపు (డబ్బుఖర్చు తనదికాకుండా ఉండే షరతుకి) వ్యసనంలాగే, ఈ వ్యసనమూనూ! అందుకని ప్రేషకభవనంలో గంటల ప్రకారం కాదు! సెకనుల ప్రకారం కొందరు పనిచెయ్యాలి, అల్లానే లక్షలాది జనం, ఇతరపని (అగ్నిహోత్రాలు చేయడం వంటివి తప్ప) మానుకుని గ్రాహకయంత్రాల చుట్టూ మూగాలి. రేడియో వినడం మంచి నిషా అని కూడా కొందరు అంటారు. కొన్ని ఇతర నిషాలలో పడి ఉంటూండే సమయాల్లో ఎవడైనా తన దుఃఖాలు హాయిగా మరిచిపోగలగడమే కాకుండ తన యిష్టం లేకుండా తననే మరిచిపోవాలి, కాని ఇందులో అంతమట్టుకు రాదు. ఎటొచ్చీ, విని విని విని ఏమి విన్నావు అని ఎవరేనా అడిగినప్పుడు, అన్నీ కొట్టుకుపోయాయి ఫలితం సున్న అని గాని, ఓ దాన్ని ఓదాంతో కొట్టెయ్యగా ఒక్కటే ఫలితం, అది నేనే అనిగాని చెప్పుకోడానికి చాలా అవకాశం ఉంది. జనానికి ఆదిలో శబ్దమే ప్రమాణం, మధ్యకాలంలో గ్రంథప్రమాణం కావలిసొచ్చింది, కాని మళ్ళీ ఇప్పుడు శబ్ద ప్రమాణంలో పడేటట్టు కనిపిస్తారు. రేడియో అనేది పత్రికల పాలిట ఇటీవల పుట్టిన దుడుకుసవితి. అయినా చేత అనగల పత్రికలు కూడా వాత అనగల రేడియో దగ్గిన నోరెత్తలేవు. కనబడి వినబడే నాటకలోకం యొక్క వినబడే సగం చెక్కనీ రేడీయో స్వాధీనపరుచుకుంది. రాబోయే టెలివిజన్ ఆ తక్కిన కనబడే సగం చెక్కనీ దఖలు పరుచుకోబోతోంది. చెలరేగుతూన్న టాకీ యావత్తునాటకాన్నీ బొమ్మకట్టి మింగేసే యత్నంలో ఉండనే ఉంది. రేడీయో వినిపిస్తూ పనిచేయిస్తే కూలివాళ్ళు ఎక్కువపని చెయ్యగలుగుతున్నారని తెలుస్తుంది.

రేడియోసెట్టు వీపుమీద పెట్టి ఆవుల్ని పాలుపితికితే మామూలు కంటే ఎక్కువగా పాలిస్తున్నాయని కనిపెట్టారు. అట్లాకాక, మామూలులో తన్నే రకంవి ఇటువంటప్పుడు ముందుకుమ్మేసి ఆ వెనక తన్నేసినా ఉభయత్రాకుడా రేడియోసెట్టుకి ప్రమాదం ఉండదని రూఢిగా చెబుతున్నారు.

రేడియో శక్తి బలాన్ని బట్టి చెట్లని కోరిన సైజులో పెంచుతున్నారు.

రేడియో వల్ల కుదర్చగల రోగాలకంటె వచ్చేరోగాలు చాలా తక్కువే అనే సంగతి పరిశోధనల వల్ల తేల్చారు.

ఒక వ్యక్తి ఏదో యంత్రం కేసి చూస్తూ, కనిపించని జనశతాల్ని గురించి, వారి మెప్పు వగైరాలు తనకు అందే చిక్కులేకుండా, హృదయం విప్పి, హృదయంగమంగా నాదం చెయ్యడం ఒక గొప్పకళ అని ఒక మహావాదంలో ఒక పార్టీ దెబ్బలాడగా, అది కళ కాదు కేవల ద్రుత ప్రకృతికమే అని ఇంకోపార్టీ ప్రతిఘటించారు.

జనం ఎదట ప్రత్యక్షంగా నిలబడి నెగ్గలేని వ్యక్తి కూడా రేడియోలోంచి ఉపన్యాస వాచికంగాని గానంగాని చేసేటప్పుడు వినే జనం తమ ఇష్టాయిష్టాల్ని బట్టి గోలచేసినా గొల్లుమన్నా, తను మాత్రం మానక్కర్లేదు, సయించకపోతే జనమే మానుకోవాలి.

ఒకళ్లని వారి పక్కింటివాళ్ళు తిట్టేటప్పుడు, ఈ కాలంలో ఆఒకళ్ళు మళ్ళీ తిట్టక్కర్లేదు. తమరి రేడియో సెట్టువిప్పి ఆ క్షణంలో దొరికే పరదేశపు బ్యాండులాంటిది పెట్టేసి తప్పుగుంటే సరి, అవతల వాళ్ళ తిట్లు ఠక్కున కట్టిపోతాయి.

ఒకవేళ పక్కింటివాళ్ళు కోపధారి బాపతై, వీళ్ళు విరామం లేకుండా రేడియో వెయ్యడము వల్ల తమరు కోపంలో మరీ రెచ్చిపోయి, వీళ్ళని సరసం చాలించండని కోరారా, వీళ్ళు గంటకి రూపాయిలాంటి రేటు మాట్లాడుకుని, ఇచ్చిన డబ్బుని బట్టి ఎన్నిగంటలో లెక్క వేయించి అంతసేపూ ఆపడానికి తెగించవచ్చు.

రేడియో నాటకాల్లో నటులు కాగితాలకేసి చూస్తూ నాటకాన్ని పెదవుల్తో గిరవటెయ్యడానికి వీలుంది. మామూలుగా జీవించే నటులు వచ్చిన ముక్కలు ఎల్లా చెప్పాలీ అని బాధపడితే రేడియో నటులు ఏమి ముక్కలా చెప్పడం అని ఆడేటప్పుడే కళ్ళతో తడుముకోవలసిన అవసరాలు కలగచ్చు.

రేడీయో పక్ష కార్యక్రమం తెలుగులో అచ్చుకొట్టగా అది ఆంధ్రులికి అవసరం లేకపోయింది గనక, ఇతర భాషల వాళ్ళకి మూడు నాలుగేసి రేడియో స్టేషన్లు పడ్డ తరవాత, ఏకంగా మహాంధ్రా రేడియో స్టేషన్ పురమాయిస్తారు అని గ్రహించుకుని, అది తీరా కట్టొచ్చేసరికి, ఏ ఊళ్ళోనూ లేక ఏ ఊరు సమీపంలోనూ అని యథాప్రకారం మళ్ళీ దెబ్బలాట రావచ్చును గనక, ఆ పనిమీద ఇప్పణ్ణించీ ఆంధ్రులంతా నడుం కట్టి నిద్రపోతారని వినపడుతుంది.

రేడియో పాలకులకు జనం దగ్గిర్నించి వెళ్ళే ఉత్తరాల సంఖ్యని బట్టి రేడియోలో మాటకి గాని పాటకి గాని ఆహ్వానపునరాహ్వానాలు ఉండవచ్చునని అంటారు. ఒక్కొక్క పాటో మాటో అయింతరువాత, దాన్ని జనం ఎల్లా భరించినా, అది అద్భుతంగా ఉండేసినట్టు పైవారికి ఉత్తరాలు కురవాలిట, కురుస్తూంటాయి. అసలు అవి వేర్వేరుగా ఉన్నా ఫరవాలేదు. ఉంటూండవు. వేర్వేరు ఊళ్ళనించి వెళ్ళినా మతలబు ఒకటే అవడం చిత్రం. ఒక్కొక్కప్పుడూ ఆ ఉత్తరాలు రాసేవాళ్ళు అందరూ ఒకే రీతిగ పొరపాటు పడతారో గ్రహపాటో, దిక్కుమాలికర్మం, ఆ అసలు గాయకుడూ గాని ‘మాటకుడు’ గాని వీల్లేక నియమించిన ప్రకారం వెళ్ళి పాటగాని మాటగాని ఆడి ఉండకపోయినా, ఆ జరగని కార్యక్రమం అద్భుతంగా జరిగిపోగా తమరు వినేశాం అని ఉత్తరాలు దిమ్మరిస్తూంటారు. ఉత్తరాల వల్ల ఏం నిర్ణయం అవుతుందయ్యా అంటే లిఖిత సాక్ష్యం గదా! శబ్దం చేసే రేడియోకి శబ్దసాక్ష్యం పనికిరాకపోడంలో ఆశ్చర్యం లేదు.

రేడియో స్టేషన్ పాలకుల చర్య, వాళ్ళ పుణ్యం చొప్పున, మహానిరంకుశం! అనగా మరేం లేదు, వాళ్ళే అనాలి, జనం వినాలి. కుంయికంయి మనకూడదు, అనలేరు. మొరలు వినిపించవ్, రచనలు పత్రికలకి పంపితే, వారికీ వారికీ ఏవైనా పేటీలు రావచ్చు. చూడండీ, అంచేత ఆ రచనల్లో కొన్ని కొన్ని వాక్యాల దగ్గిరికొచ్చేసరికి సిరా మంచిరకంది కాకపోడం వల్ల ఆ వాక్యాలు కాగితానికి అంటుకోవు. కాని నిరంకుశత్వానికి కాలం ఉంది. ‘హర్ హిట్లర్’ని మొట్టికాయవేసే పైవాడూ ‘హిజ్ హిట్లరు’ ఉండి తీరుతాడు అని మా డాక్టర్ ప్రెసిడెంటు ఒకసారి డిన్నర్ మధ్యలో సెలవిచ్చారు. అమెరికాలోని ఎలక్ట్రిక్ ఇంజనీరు డాక్టర్ నీల్ మోరే హాప్కిన్స్ అనే ఆయన ఒక చిన్న యంత్రం కనిపెట్టాడట. అది త్వరలోనే అమ్మకానికి వస్తుందిట. అది ప్రతీ రేడీయో సెట్టుకీ పెట్టవచ్చుట. దాల్లో ఎవరు మాట్టాడినా తక్షణం ఆమాట భేష్ అన్నారే స్టాఫ్ అన్నా సరే రేడీయో చోద స్థానంలో వినిపిస్తుందిట. అప్పుడు అన్ని గ్రాహక రేడియోల వాళ్ళూ కూడా తమ ఆనంద విచారాలు ఒకేసారి వెలిబుచ్చి రాట్టాయిన ప్రేషక రేడియో స్టేషన్లలో పనిచెయ్యడం గాని దానికి సమీపంలో ఉండడం గాని కొంచెం ఇబ్బందిగానే ఉండవచ్చుట. కాని ఒక మంచిలాభం ఉంటుందన్నారు. రేడియోసెట్లు ఎంతమంది కొన్నారో అంతమందీ గనక మెచ్చడమో తిట్టడమో కానిచ్చేసరికి, సెట్లు ఎన్నీ అనే లెక్క జనాభా లెక్క కంటే ఖంజాయింపుగానూ త్వరగానూ తెలిసిపోవచ్చుట!

రాత్రివేళ కొన్ని రేడియో సెట్లలోంచి వచ్చేమాటలు కంపుకొడుతున్నాయని అంటారు గాని, మనం ఈ కాలంలో అల్లాంటి మాటలు నమ్మకూడదు.

వినే జనం తమకు తెలియంది గంటసేపు భరించగలరు గాని తెలిసేది పావుగంట భరించలేరు. సంగీతంలో మాటలకి అర్థాలు స్ఫురించకపోయినా తెలిసినట్టు అనుకోవాలి, రాగాలకి అర్థాలు అడగకూడదు. ఇక, పదరచనలో మాటలకి అర్థాలు తెలియాలి. లేకపోతే ఉచ్చారణకే అడ్డిపోతుంది. అర్థజోక్యం లేని రచనల్తో ఆనందం అనుక్షణం కలిగించవచ్చు గాని, తెలిసే మాటల్లో అనేకులకి ఒకడు చెయ్యగల మహోపదేశం ఈ రోజుల్లో రోజూ ఎక్కణ్ణించి వస్తుంది కొత్తదీ! అందుకని, రేడియో కవిత్వం విలవ రేడియో గానం విలవలో దశాంశం కూడా ఉండదు.

జేబులోకి సరిపోయే రేడియో సెట్లు పాతిగేసి రూపాయలకి వస్తాయని చెప్పుగుంటూండడం వల్ల సగం రేట్లు అయింతరువాత సినీమాకి వెళ్ళినట్టు, అప్పుడు మనం కూడా ఓ సెట్టు కొనుక్కోలేక పోతామా అని అస్మదాదులు లోపల లోపల కుట్రలు పన్నుతున్నారు.

జేబు రేడియో అయిం తర్వాత చెవల రేడియో బయల్దేరుతుందని ఇంకా మరికొందరు చెవులు నిక్కపొడుచుగుని ఉన్నారు. వాళ్ళు యనుకునేసెట్టు అయిదురూపాయిలే. చివరికి ఎల్లానూ వినవలసింది చెవే గనక, ఆ సెట్టు చెవికే తగిలించెయ్యొచ్చు, కుండనాలూ తమ్మెట్లూ లాగ! ఒక చెవికే అయితే అసహ్యంగా ఉండవచ్చు గనక, రెండు చెవలకీ – ఒకటి స్వదేశ వార్తలకీ రెండోది విదేశ కార్యక్రమాలకీ అని పెట్టుగుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఒకవేళ, వాటి బరువు వల్ల చెవులు దీర్ఘం అయినా ప్రస్తుతం పూర్ణ కర్ణాభరణాలు ధరించేవాళ్ళ చెవల కంటే ఎక్కువ దీర్ఘం కావనిన్నీ, అసలు దీర్ఘశ్రవత్వం క్రమేపీ వృద్ధశ్రవత్వంలో పడి మిక్కిలి వైభవంగా ఉండబోతుందనిన్నీ కొందరు అభయం ఇస్తున్నారు.

ఒకవేళ టెలివిజన్ కూడా ఈ లోపులోనే ప్రచారంలోకి వస్తే తక్షణమే అనగా ఇంటి టెలివిజన్ సెట్టూ, జేబు టెలివిజన్ సెట్టూ, కంటి టెలివిజన్ సెట్టు, అంటూ కూచుని కాలం పాడుచేసి పారెయ్యకుండా, మొదట్లోనే కళ్ళసెట్టు ప్రచారంలోకి తెచ్చేస్తారని చాలా నమ్మకంగా అంటున్నారు. ఇదివరకే మామూలు కళ్ళజోడు ధరిస్తూన్న వాళ్ళ విషయంలో అర్ధ చంద్రాకారంలో అద్దాలు కేటాయించి, పై అర్ధాలలోంచి చూసినప్పుడు ప్రత్యక్ష రూపాలూ అడుగు అర్ధాలలోంచి చూస్తే, అవి టెలివిజన్ సెట్టువి గనుక పరోక్ష రూపాలూ ఏకముహూర్తంలో కనిపించేటట్టు చేస్తారనిన్నీ, అప్పుడు ప్రత్యక్ష పరోక్షాలు గాని, లేకపోతే పోనీ సగుణ నిర్గుణ బ్రహ్మల్ని గాని ప్రతీదుర్గుణ బ్రహ్మా చూడవచ్చునన్నీ, పైన వాడిష్టం అనిన్నీ, తెలుస్తుంది.

శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారు, బి.యే., యల్.టి. రాజమహేంద్రవరము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here