రేడియో

0
7

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకులకు యలమర్తి అనురాధ రచించిన ‘రేడియో’ అనే నాటికని అందిస్తున్నాము. [/box]

పాత్రలు:

మాధవరావు (45) – తండ్రి – వార్తలు

రాజేశ్వరి (36) – తల్లి – పురాణం

కళ్యాణ్ (19) పెద్ద కొడుకు – క్రికెట్ మ్యాచ్, హిందీపాటలు

అనుపమ (18) పెద్ద కూతురు – సాంగ్స్, నాటకాలు

రాజా (12) – చిన్న కొడుకు – రామారావు

అరుణ (14) – చిన్న కూతురు – నాగేశ్వరరావు

***

[dropcap]ర[/dropcap]చయిత : ఈ దేశంలో ఆస్తులు, అంతస్తులు కోసం దెబ్బలాడుకొని మాటా మాటా అనుకొని కలియబడే తండ్రీ కొడుకులను, తల్లీ కూతుళ్ళనే చూసేం. రేడియో కోసం తన్నుకునే ఈ సంఘటనను చూడండి.

భగవంతుడు నిర్ణయించిన రోజులలో ఇదీ ఒక ఆదివారం. సబ్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు పేపరు చదువుతున్నాడు. కంపనీగా కాఫీ కావాల్సి వచ్చింది.

మాధవరావు : “రాజేశ్వరీ, అర్జంటుగా కాఫీ పట్రా.”

“ఆ!! తెస్తున్నానండీ” లోపలనుంచి రాజేశ్వరి.

రెండు నిమిషాల తరువాత కప్పు పెట్టిన శబ్దం.

రాజేశ్వరి : “ఊఁ! తీసుకొండి. మొదలయింది రోజూ కార్యక్రమం, ఇంతకీ ఈ రోజు రేడీయోలో నాటిక ఏమి వస్తుందో?”

మాధవరావు : “పేపరులో నాటకమనే వేస్తాడు వెర్రిముఖమా. పేరు ప్రసార విశేషాలలోనే వినాలి, అని ఎన్నిసార్లు చెప్పినా అర్థమయి చావదే (కొంచెం విసుగుగా)”

రాజేశ్వరి : “అబ్బో! మీకే పెద్ద తెలివితేటలున్నట్లు, నాకా మాత్రం తెలియదేమిటి? ఏదో మా కాలంలో చదువులు లేకపోవడం వలన చదవలేదు కానీ, లేకపోతే మీకంటే ఎక్కువే చదివేదాన్ని. కొంత మతిమరుపు నాకేడవడం వల్ల మీరు ఆడిండి ఆట పాడింది పాటగా ఉంది (కొంచెం ఈసడింపు, బాధ మిళితమై ఉండాలి)”

మాధవరావు : “అబ్బ! ఎంత , అమాయకంగా కబుర్లు చెబుతూ నేను ఏం చేయాలో చెప్పే నీ గురించి నేను పలచనగా మాట్లాడటమా!”

రాజేశ్వరి : “ఆఁ! ఇక ఆపండి. దండకం మొదలుపెట్టారు.”

మాధవరావు : “అవునూ! ఇంకా పిల్లలు లేచినట్లు లేరే!”

రాజేశ్వరి : “ఇంటిని కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇంకో గంటకు ఎలాగూ లేస్తారు. ఇల్లును రణరంగంగానూ మార్చేస్తారు. ఈ ఆదివారం వస్తే నా దుంప తెగిపోతుంది సుమండీ.”

మాధవరావు : “సరి సరేలే! కాస్త ఆ రేడియో తెచ్చి ఇక్కడ పెట్టు. ఆరుంబావు దాటినట్లుంది. 6.30 అయిపోయినట్లుంది, భక్తిరంజని విందాం.”

రాజేశ్వరి : “అలాగే నాకు వంటింట్లో బోలెడు పనుంది. ఇది పెట్టుకొని పాట వింటూ కూర్చుంటే ఎలా అవుతుంది. వంటింట్లో పెడితే నేనూ వింటాను. కాస్త వద్దురూ.

మాధవరావు : పిల్లమూక లేవలేదు కదా, కాసేపు హాయిగా విందామంటే, పోట్లాటకు నువ్వు తయారయ్యావ్. వాళ్ళ కంటే ముందు వచ్చినదానివి కదూ! ఎంతైనా నీ తరువాతే వాళ్ళు. కానీయ్, ఇన్నేళ్ళు నన్ను ఆడించింది చాలక ఇంకా ఆడిద్దామనుకుంటున్నావ్. కానియ్యిలే.”

రాజేశ్వరి : “అబ్బా! చిన్న విషయానికి ఎంత స్తోత్రమే చదివారు. మీ ఇష్టమొచ్చినట్టు చెయ్యండి. నిజంగా నామీద ప్రేముంటే నా దగ్గరే పెడతారు.”

మాధవరావు : “ఈ డైలాగు మన పెళ్ళి అయినప్పటి నుంచీ నువ్వు చెబుతున్నదే. చేయించుకుంటున్నదే. రోజులు మారుతున్నా నీ డైలాగ్స్ మాత్రం మారటం లేదు.”

రాజేశ్వరి : “రోజులు మారినా, మనుషులు, మనసులు మారలేరు. అందుకే డైలాగులు కూడా మారవు (ఖచ్చితంగా)”

మాధవరావు : “మీకేం ఎన్ని కబుర్లయినా చెబుతారు ఖాళీగా కూర్చుని”

రాజేశ్వరి :  “మీకు – మగవాళ్లకు –  సెలవు కానీ, ఆడవాళ్లకు వంటకు మాత్రం సెలవు ఉండదు. (కినుకగా)”

మాధవరావు : “నెలకొకసారి వచ్చే పున్నమిలా వారానికి ఒక్కరోజు గవర్నమెంటు వాళ్ళు సెలవు ఇస్తే దానికి కూడా ఆడిపోసుకుంటావు ఎందుకే.”

రాజేశ్వరి : “కబుర్లతో కాలం ఏం వెళ్లబుచ్చుతారు కానీ ఆ రేడియో పెట్టండి.”

(భక్తి పాట వస్తూ ఉంటుంది) (పాట వెనకాల వినిపిస్తూనే ఉండాలి)

రాజేశ్వరి : “ఏమండీ ఏం కూర చేయమంటారు?”

మాధవరావు : “అబ్బా! భక్తి పాటలు పెట్టుకున్నావు కదా, అవి వినక మధ్యాహ్నం కూర గురించి ఇప్పటినుంచే ఆలోచన ఎందుకే?”

రాజేశ్వరి : “అబ్బ! చెబుదురూ!”

మాధవరావు : “ఏం పాపం? దేవి గారి దయ ఈ రోజు ఇలా నామీద ప్రసారమయింది. పిల్లలు పెరిగాక ఏనాడైనా, నన్ను ఈ కూరల గురించి అడిగావా? పెద్దమ్మాయి అనుకి బంగాళదుంప వేపుడు అంటే ఇష్టమని ఒకరోజు, చిన్నది అరుణ కాకరకాయ పచ్చిపులుసు అంటే పడి చస్తుందని మరొకరోజు, కళ్యాణ్ కొత్తిమీర పచ్చడి అంటూ ఇంకోరోజూ ఇలా గడిపేసేదానివి.”

రాజేశ్వరి : “అయ్యో ఆగిపోయారేం చిన్నవాడనా పాపం రాజాని వదిలేశారు. వాడికి రాగిలడ్డూ అంటే ఇష్టమని కూడా చెప్పకపోయారా? అయినా నాకు తెలియక అడుగుతాను ఈ నాలుగింటిలో మీకిష్టం లేనిది ఏదన్నా ఉందా? లొట్టలు వేసుకుని తినేవారు చేసిపెడితే. అవకాశం వచ్చింది కదా అని దెప్పితే సరికాదు. రీజన్‍బుల్‍గా ఉండాలి.”

కళ్యాణ్ : “ఏమిటి నాన్నగారండీ అమ్మ ఇంగ్లీషులో మాట్లాడేస్తోంది?”

మాధవరావు : “రా…! రా….! కళ్యాణ్. నేనొక్కడినే దొరికానని దులపరించేస్తోంది మీ అమ్మ.”

రాజేశ్వరి : “లేచావా నాయనా! తండ్రీ కొడుకులు సరిపోతారు మాట్లాడుకోవటానికి. మిగతావాళ్ళు ఇంకా లేవలేదా? తెల్లారి బారెడు ప్రొద్దువస్తోంది. వెళ్ళి వాళ్ళను కూడా లేపు.”

(భక్తిరంజని సమాప్తం) సూక్తిముక్తావళి.

రేడియోలో అనౌన్స్‌మెంట్ వినిపించడంతో…

రాజేశ్వరి : “అయిపోయింది మీ గోలలోనే భక్తిరంజని అయిపోయింది.”

మాధవరావు : “ఇంక నీకు అవసరం లేదుకదా. వార్తలు వినటానికి నేను పట్టుకుపోతాను.”

కళ్యాణ్ : “నాన్నగారండీ! ఏడుంబావు వరకు మీ ఇష్టం. ఆ తరువాత మాత్రం నాకే ఇవ్వాలి. మీ ముద్దుల కూతుర్లు అడిగారు కదా అని ఇచ్చారంటే నేను ఊరుకోను. ఆఁ!” అంటూ పెరట్లోకి వెళ్ళిపోతాడు.

కళ్యాణ్ : ‘ఈ ముఖం కడుక్కోవటం అనే కార్యక్రమం పూర్తి చేసేశాను. వార్తలు అయిపోయి రేడియో కూడా చేతికొచ్చేసింది. అమ్మ ఏమో వీళ్ళను లేపమంది. అనుని లేపితే…. వద్దులే తల్లీ! జరూకా వింటానంటే కాదంటే కాదని జానపద గేయాలు పెట్టి బోర్ కొట్టిస్తుంది. అసలే గయ్యాళి దానితో వేగలేం. పోనీ రాజాగాడిని లేపితే  ఇంకేంలేదు తెలుగుదేశాన్ని నిద్రలేపినట్లే. కొంపదీసి వివిధ భారతిలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అని పాట వచ్చిందంటే చెవులు చిల్లులు పడే సౌండ్ పెట్టేసి తందనాలు తొక్కేస్తాడు. వీళ్లెవరూ కాకుండా చిన్న చెల్లి అరుని లేపితే…. తల్లి వద్దులే ఒక్క ఆరున్నొక రాగం తీసిందంటే అందరూ వస్తారు. దీనిని ఒక్కదాన్ని లేపితే మిగిలిన ముగ్గురునీ లేపినట్లే. నాకెందుకొచ్చింది. లేచినప్పుడు ఎలాగూ తప్పదు కదా! లేపలేదని అమ్మతో తిట్లు తినకుండా ఒక చిన్న ప్లాను వేస్తాను.’

“అమ్మా! వీళ్ళు ఎంత చెప్పినా లేవటం లేదే!” గట్టిగా అరిచాడు.

‘అయ్యయ్యో… చిన్నగా ఇలా అమ్మ దగ్గరకు వెళ్ళి చెబితే బాగుంటుందేమో అనుకుంటూ నిజంగా అరిచేశానే. అదిగో వాళ్ళు కదులుతున్నారు. బాబోయ్ లేచేట్లున్నారు. లేస్తారేమో? తనిక్కడనుంచి తప్పుకోవడం మంచిది (చిన్నగా)’

“అన్నయ్యా! టైమ్ ఎంతయిందిరా?”

అను లేచిపోయింది.

‘7.30 అయిపోయిందంటే ఇంకేమైనా ఉందా, కాస్త టైము తక్కువ చెబితే సరి (చిన్నగా మనసులో అనుకున్నట్లు)’

“ఏడు అయింది అమ్మ మిమ్మల్ని లేపమంది. “

అరు: అను అక్కా! పెద్దన్నయ్య ఆబద్ధం చెబుతున్నాడే, ఇందాకే వార్తలు అవగానే రేడియో ఇమ్మని నాన్నగారికి చెప్పి వెళ్ళాడు. నేను లేచి మళ్ళీ అమ్మ నిద్ర పోనివ్వదేమో అని చాటుగా వచ్చి ప్రక్క ఎక్కేశాను.”

అను : “ఏరా! కళ్యాణ్! పెద్ద చిన్న బేధాలు లేకుండా అబద్ధాలు చెబుతున్నావు కదూ! నీ పని చెబుతాను ఉండు. ఈ దుప్పటి ఒకటి” అంటూ ఒక్క ఉదుటున వచ్చి “(కళ్యాణ్) నీ దగ్గర రేడియో లాక్కుపోకపోతే అడుగు. (నడిచిన శబ్దం)”

అను: “ఇవ్వరా”

క : “ఇవ్వను”

అను: “ఇవ్వవు”

క : “ఇస్తాను కానీ ఒక్క షరతు”

అను: “ఏమిటి?”

క: “జరూకా వినేంత వరకు నాకు. ఆ తరువాత నీకు. ఒక అయిదు నిమిషాలు ఓపికపట్టవే.”

అను : “సరే! ఈలోపు నేను ముఖం కడుక్కుని వస్తాను.”

రేడియో అనౌన్స్‌మెంట్! – ఈ రోజు కార్యక్రమంలో ప్రేమ్‍నగర్, నాలుగు స్తంభాలాట, నాదేశం, బుద్ధిమంతుడు, బెబ్బులిపులి… సినిమాల నుంచి శ్రోతలు కోరిన తెలుగు పాటలు వింటారు.

అరుణ ‘టాటా వీడ్కోలు గుడ్‍బై ఇంక సెలవు’ అంటూ లేచింది.

క : “అరు! ఏమిటే ఆ తాగుడు యాక్షన్? ఆ అరుపులతో కాస్త ఏమేమి వస్తాయో విననివ్వరు కదా!”

రాజా : “జననీ జన్మ భూమిస్య పాట వస్తుందోచ్”

క : “చిన్నవెధవ కూడా లేచేశాడు. ఇంక ఇంతే సంగతులు. నేను రేడియో పుచ్చుకుని పెరట్లోకి పోతా.”

ఆగు! అన్నయ్య! ఆగు! (రాజా, అరుల గొంతులు)

అరు : “అరేయ్ అన్నయ్యా! జరూకా అయిపోయినట్లుంది కదూ! ఇక ఇవ్వు. అవతల వైజాగ్ స్టేషనులో భావ తరంగిణిలో నాటకం లాంటి మంచి ప్రోగ్రామ్ ఇప్పటికే మిస్ అయ్యాను.”

క : “వాళ్లను తప్పించుకుని స్థిమితపడే లోపల జరూకా సమాప్తం అయి కూర్చుంది. మనం ఇక్కడ ఈ విషయాలు గురించే దెబ్బలాడుకుంటున్నామని ఆ రేడియో స్టేషన్‍లో వాళ్లకు తెలియదు కదా. అందుకే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు నడిపేసుకుంటారు. మన మాటలు, మన కామెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్లకు అందేట్లు ఉంటే ఎంత బాగుంటుంది.”

అను : “అరేయ్ చాలా బాగుంటుంది. వినటానికే సుత్తి అవతల నా ప్రోగ్రామ్ అయిపోతుందని నేను చస్తుంటే”… అంటూనే (స్టేషన్ రాడ్ కదుపుతున్న శబ్దం).

రేడియో స్టేషన్ మారుస్తూ ఉంటుంది.

రాజా : “రేడియో ఏది అన్నయ్యా?”

కళ్యాణ్ : “ఇంకెక్కడి రేడియో? అను పట్టుకొని తుర్రుమంది.”

అరు : “అలాగా! అక్క ఎక్కడుందో మనం కనుక్కున్నట్లే రా! రా! రాజా! పోదాం.”

రాజా : “అక్క ఎక్కడుంటుందో నీకు తెలుసా!”

అరు : “మల్లె చెట్టు కింద కూర్చుని ఉంటుంది.”

రాజా : “అక్కా! నేనొక మాట చెప్పనా?”

అరు: “చెప్పరా?”

రాజా : “ఇప్పుడే మనం వెళ్ళి దాని దగ్గర లాక్కోవటమెందుకు? పావు తక్కువ ఎనిమిదింటికి కదా పాటలు వొచ్చేది.”

అరు : “అవును.”

రాజా : “అందుకని ఈలోపు ముఖం కడిగేసుకొని అమ్మ ఇచ్చే కాఫీ త్రాగేసి అక్క దగ్గరకు ఎకాఎకిని వెళ్ళి లాగేసుకుందాం.”

అరు : “రైట్, పద పోదాం.”

రాజా : “అమ్మా! కాఫీ ఇస్తావా? టిఫిన్ చేసేశావా?”

రాజేశ్వరి : “ఇస్తాను నాయినా ఇస్తాను. చిన్నది అని దీనిని పనిచేయకపోయినా వదిలేస్తున్నాను. పెద్దది అది లేచిందా రేడియో పెట్టుకు కూర్చుంది. రోజూ కాలేజికి పోతామే ఈ రోజైనా అమ్మకు సాయం చేద్దామని ఎవరికీ లేదు. వేళకు తిండి మాత్రం కావాలి.”

రాజా : “కాఫీ ఇస్తే తాగేసి వెళ్ళి దాన్ని పిలుచుకువస్తాను.”

రాజేశ్వరి : “వాళ్లంతట వాళ్ళకు బుద్ధి రావాలి గాని పిలవాలేమిటి ఏమీ అక్కరలేదులే.”

రాజా : ‘అయ్యో! ఈ వంకైనా అక్క దగ్గర రేడియో సంపాదించెయ్యొచ్చు అనుకొంటే ఇదీ బెడిసికొట్టిందే (స్వగతంలో)’

అరు : “అమ్మా ఏమైనా సాయం చెయ్యనా?”

రాజేశ్వరి : “అక్కర్లేదులే ఇప్పుడేం పనుంది? వెళ్ళి స్నానాలు చెయ్యండి ఎనిమిది దాటుతోంది.”

రాజా : “ఇంకా ఎనిమిది కూడా అవలేదమ్మా.”

రాజేశ్వరి : “అరేయ్ వ్రేలెడంత లేవు నువ్వు నన్ను ఎత్తి చూపించేవాడూ! ఏదో మాట వరుసకంటే… ఆఁ! ఆఁ!”

రాజా :” బాబోయ్ నేను పోతున్నా! అరు అక్కా! రావే!”

అరు : “అక్కా! అక్కా!”

అను : “ఊఁ! వచ్చేశారా మాట్లాడకుండా రేడియోలో పాటలు వింటానంటే సరే. లేకపోతే నాన్నగారితో చెప్పి అక్షింతలు వేయిస్తాను. కానీ ఇది మాత్రం ఛస్తే ఇవ్వను.”

రాజా : ‘ఛస్తే ఎలాగూ ఇవ్వవు అని మాకు తెలుసులేవే (అని మనసులో అనుకొంటూ)’

అరు : “కాదంటే ఇవ్వదు గయ్యాళి అక్క (చిన్నగా)”

రాజా, అరు: “అలాగే గోలచెయ్యం.”

అను : “గుడ్ ఇలా వచ్చి నాకు చెరొక ప్రక్క కూర్చోండి.”

(రేడియోలో) చిత్రతరంగిణి : జస్టిస్ చౌదరిలో ఎస్.పి బాలసుబ్రమణ్యం (పాడిన) చట్టానికి, న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట వస్తూ వుంటుంది.

రాజా : “హాయ్! హాయ్! మా ఎన్టీఆర్ పాటే”

అను : “హుష్”

రాజా : “ఈ పాటప్పుడు ఆయన చాలా బాగా ఏక్ట్ చేశాడు కదే!”

అరు : “పెద్ద చేశాడు లేవోయ్. మా నాగేశ్వరరావుకు ఆ పాత్ర ఇస్తే అంతకంటే బాగా చేసేవాడు.”

రాజా : “ఇవ్వలేదు కదా!”

అరు : “అదంతా నాకనవసరం. మా ఎ.ఎన్.ఆర్ బాగా చేస్తాడు అది మాత్రం ష్యూర్.”

రాజా : “ఎ.ఎన్.ఆర్ కంటే ఎన్టీఆర్ బాగా చేస్తాడు.”

అరు : “కాదు.”

అను : “అబ్బ! ఆపండి. ఇక్కడ మీ ఇద్దరూ ఇలా కొట్టుకుంటున్నారు కానీ వాళ్ళు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటారు.”

అరు : “నిజమే. కానీ వాడు మా నాగేశ్వరరావునంటే.”

రాజా : “నువ్వు మాత్రం మా ఎన్టీఆర్ ననలేదా.”

అను : “మళ్ళీ మొదలుపెట్టారు. ప్రశాంతంగా విందామంటే ఎప్పుడూ కుదిరి చావదు. మీరే ఏడవండి. ఇదిగో రేడియో తీసుకోండి.”

ధనధన శబ్దం చేస్తూ వెళుతుంది.

అరు : “అక్క వెళ్ళింది గానీ ఊరుకోదు ఏమోరా. నాన్నగార్కి చెప్పిందంటే మన పని అప్పోచ్.”

రాజా : “మనం అరుచుకోకుండా బుద్ధిగా విందాం. నాన్నగారు ఏమీ అనరులే.”

అరు : “అరేయ్. రాజా! సౌండ్ తగ్గించరా!”

రాజా : (వెంటనే తగ్గించేస్తాడు.) “ఏమైందక్కా.”

అరు : “అదుగోరా అమ్మ యిటే వస్తోంది. విజయవాడ స్టేషన్‍లో పెడితే భక్తిపాటలు వస్తాయని మనల్ని కేకలేస్తుందేమోరా”

రాజా : “మరి ఏం చేద్దాం?”

అరు : “ఆఁ! ఐడియా వచ్చింది.”

రాజా : “ఏమిటి (ఆదుర్దాగా)”

అరు : “స్టోర్ రూంలోకి పోయి ఇవి వినేసి ఎనిమిది అవగానే బయటకు వచ్చేద్దాం.”

రాజా : “భలే! భలే! పద పోదాం.”

***

మాధవరావు :  “చిన్నవాళ్ళిద్దరూ కనిపించటం లేదేమిటి? ఎక్కడికయినా వెళ్ళారా?”

రాజేశ్వరి : “ఇంతసేపూ అక్కడే ఉన్నారుగా. టిఫిన్ తయారయింది. వస్తారా?”

మాధవరావు : పిల్లలని కూడా పిలుద్దాం, అను, కళ్యాణ్ టిఫిన్‍కు వస్తారా?”

అను : “లేదమ్మా (వివిధ భారతిలో) వినోదవల్లరిలో ఈ రోజొక మంచి నాటకం ఉంది అది విన్నాక వచ్చేస్తాం. మీరు కానిచ్చేయండి.”

రాజేశ్వరి : “కళ్యాణ్ నువ్వురా”

క : “నేనూ అంతే. నాన్నగారూ నువ్వు తినెయ్యండి.”

మాధవరావు : “అవునురా టైమెంతయింది?”

క : “ఎనిమిది అయిందండి.”

మాధవరావు : “అరేయ్! మీకెన్నిసార్లు చెప్పానురా, వార్తల టైముకు రేడియో నాకివ్వాలని. ఎప్పుడూ ఆ వెధవ పాటలేనా?”

అరు : “ఇదిగోండి నాన్నగారూ రేడియో!”

మాధవరావు : “నువ్వు మంచిదానివమ్మా ఇంతసేపూ ఎక్కడూన్నారు?”

అరు : “స్టోర్ రూంలోనండి. బయట వింటుంటే మమ్మల్ని చిన్నవాళ్ళని చేసి అన్నయ్య, అక్కయ్య లాగేసుకుంటున్నారు.”

రాజేశ్వరి : “ఏమండీ! ఏడుగంటల వార్తలు విన్నారుగా. మళ్ళీ ఇంతలో ఏం వింటారు గానీ కాస్త అర్చన ప్రోగ్రాం పెట్టండి. పూజ టైమయింది కూడా.”

మాధవరావు : “భక్తిరంజని విని నువ్వు అర్చనకు తయారవుతే తప్పు లేదు కానీ నా ఉద్యోగానికి సంబంధించిన వార్తలు వింటే తప్పు వచ్చిందేం! ఇందాక నీకు ఛాన్స్ ఇచ్చాను. ఈసారి నాదే. పోనీ ఇప్పుడు నీకిచ్చిన తరువాత హిందీ వార్తలు విందామంటే పిల్లలందరూ ఏకగ్రీవంగా వచ్చి నామీద పడతారు, నాటకం వింటామని. నేను హాలులోకి వెళుతున్నాను.”

రాజా : “అమ్మా! నాకు టిఫిన్ పెట్టెయ్యవూ ఆకలి వేస్తొంది”

అరు : “నాకు కూడా.”

రాజేశ్వరి : “అలాగే వచ్చేయ్యండి మళ్ళీ 8.30 అయ్యేటప్పటికి రేడియో దగ్గర తయారై కొట్టుకోవద్దు రండి… రండి… “

అరు, రాజా : “పో! మమ్మీ! (ముద్దుగా అంటారు)”

***

రాజేశ్వరి : “ఏరా! కళ్యాణ్ కొంచెం ఉప్మా వడ్డించనా!”

క : “వద్దమ్మా!”

అను : “అన్నయ్యా! నాటకం చాలా హాస్యంగా వుంది కదూ. మనింట్లో వాళ్ళను చూసి రాసినట్లే ఉంది.”

రాజేశ్వరి : “ఆ రచయిత ఇంట్లో కూడా మీలాంటి కోతులు ఉన్నాయేమో”

క : “చూడండి నాన్నగారూ! అమ్మ ఎలా అంటుందో.”

మాధవరావు : “పెద్దవాళ్లవుతున్నా కొట్టుకొనే మిమ్మల్ని అనాలిగానీ అమ్మనెందుకు!”

క : “అసలు డాడీ! తప్పంతా మీదే.”

మాధవరావు : “నాదా?”

క : “మరి కాకపోతే టేప్ రికార్డర్ కొనమంటే కొన్నారా! అదికొంటే మాకిష్టమైనది టేప్ చేసుకొని కొంతమంది అటు వెళతాంగా.”

రాజేశ్వరి : “ఎందుకూ దానికోసం కూడా దెబ్బలాడుకోటానికా.”

క : “అమ్మా! కాసేపు నువ్వుండు. నాన్నగారితో మేము మాట్లాడుతాం.”

మాధవరావు : “చూస్తున్నారు కదరా! మీ కాలేజీ ఫీజులకే సంసారానికే నా జీతం బొటా బొటీగా సరిపోతోంది. మన అవసరాలకు తగ్గట్టు ధరలు పెరగటం లేదుగా. అవి ఆకాశాన్నంటుతున్నాయి (నిస్సహాయంగా)”

క : “ఆఁ! అక్కడే మాకు కోపం వస్తుంది. ఆ నారాయణరావు మీ కొలీగ్ కదా. ఎంతలా స్టేటస్ మెయిన్‌టెయిన్ చేస్తాడు. ఫ్రిజ్, కారు, టేప్ రికార్డరు, స్టీరియో, టివి… ఓహ్ అసలు వాళ్ళింట్లో లేనిది అంటూ ఉండదు. అతనిలా మీరు ఎందుకు లంచాలు పుచ్చుకోకూడదు?”

మాధవరావు : “ఒకడు చెడిపోయాడని అందరూ చెడిపోవాలా?”

క : “ఏమో నాన్నగారు ఈ దేశంలో న్యాయంగా బ్రతికిన వాడెవడూ సుఖపడలేదు. అందుకు మీరే కారణం. నయాపైసా తీసుకోకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం మీకేమైనా మెచ్చి మేక తోలు కప్పిందా? డ్యూటీ బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్ అంటుంది అంతే…”

మాధవరావు : “మనస్ఫూర్తిగా బాధ్యతను నెరవేర్చిన ఆఫీసర్‍కు ఆ చిన్న మాటే ఎంతో సంతృప్తినిస్తుంది. అది మీకు చెప్పినా అర్థం కాదు.”

క : “మీరిలా తృప్తిపడుతున్నారని తెలిసే ఎదుగూ బొదురూ లేకుండా ఇలా ఉంచేశారు. బాగా డబ్బులు ముట్ట చెబుతున్నాడని మీ జూనియర్ నారాయణరావు గారికి ప్రమోషన్ ఇచ్చారు. అతనిలో ఏం గొప్ప ఉందని మీకంటే ముందు ప్రమోషన్ ఇచ్చారు. ఇటు చూస్తే సీనియారిటీ లేదు. పోనీ ఘనకార్యాలు ఏమైనా చేశారా అంటే అదీలేదు. లంచాలు తీసుకుంటున్నాడు. లంచాలు పైవాళ్ళకు పోస్తున్నాడు. అది అతని చేతిలోని స్కిల్ అంటాను నేను.”

మాధవరావు : “యువతరం ఇలాంటివి విని, చూసి పాడయిపోతుందిరా. వాళ్ళు ఎన్నాళ్ళో పైకి పోరు. కొన్నాళ్ళలో అధఃపాతాళానికి జారిపోతారు.”

క : “అది మీ భ్రమ డాడీ. నా ముందే ఎంతోమంది ఇలా పైకి పైకి వెళ్ళిపోతున్నారు.”

అను : “నిజమే అన్నయ్యా! నిన్న చదివిన ’మా దేశం మాకేమిచ్చింది’ నవలలో చెప్పింది ఎంత యథార్థం? చివరకు ప్రభుకి మిగిలింది ఏముంది? కన్నకొడుకును పోగొట్టుకున్నాడు. పోనీ అంత కష్టపడిన దానికి ఫలితం దక్కిందా అంటే అదీ లేదు, మొత్తం ఫైల్స్ అన్నీ కాల్చివేస్తారు. ఇలాంటివి ఎక్కడో ఒకచోట జరిగితేనే రచయిత్రులకు రాయలనే కోరిక వస్తుందేమో అనిపించింది. సులోచన రాణి గారి చిత్రీకరణ వర్ణనాతీతం. ప్రభులో ఉన్న డ్యూటీ గురించి ఎంత చక్కగా వర్ణించిందో? అది చదువుతున్నంతసేపు నాన్నగారే గుర్తుకువచ్చారు.”

క : “ప్రభులాంటి సమిధగా నిలచిపొవాలనే నాన్నగారు కూడా ఇలా చేస్తున్నారు.”

మాధవరావు : “మీ ఇద్దరి వాదనలు బాగానే ఉన్నాయి. నేనూ నిన్ననే చదివాను ఆ పుస్తకం. చివరకు ఆమె ఇచ్చిన సందేశం ఏమిటి? అది అర్థం చేసుకోరేం?”

క : “అర్థం చేసుకోలేక, అర్థంకాక కాదు. తన కుటుంబం కాలిపోతున్నా దేశం కోసం బాధపడిన అతనికి ఈ దేశం ఏమిచ్చింది? నిస్వార్థ బుద్ధితో డ్యూటీ నిర్వహిస్తున్న వాళ్ళని కొంత కాకపోతే కొంత అయినా తృప్తిపరిస్తే ప్రతివాడూ అలాగే తయారవుతాడంటున్నా.”

రాజేశ్వరి : “టిఫిన్ తినడం మానేసి మీ వాదనలు ఏమిటి? తినండి. ఇవి ఎప్పుడూ ఉండేవేగా.”

మాధవరావు : “ఆవేశం తగ్గించుకోరా కళ్యాణ్ (నెమ్మదిగా)”

క : “జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు చూస్తుంటే ఆవేశం పొంగుతోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత కృంగతీస్తోంది. అదే మా బాధ.”

రాజా : “అమ్మా! అక్క కొట్టిందే” (ఏడుస్తూ వస్తాడు).

మాధవరావు : “ఎందుకు దెబ్బలాడుకున్నారు?”

రాజా : “ప్రక్క స్టేషనులో ఎన్టీఆర్ పాట, మంచిది వస్తోందని పెట్టమన్నాను. ప్రక్కన చేరి ఒకటే గోల అని కొట్టింది.”

రాజేశ్వరి : “పదిగంటల దాకా ఈ బాధ తప్పదు. అసలు ఒక్కొక్కసారి నాకైతే ఆదివారం ఆ రేడియోవాళ్ళను అసలు ఏమీ ప్రసారం చెయ్యద్దు అని చెప్పాలనిపిస్తుంది. వాళ్ళకు మాత్రం రెస్ట్ అక్కర్లేదా! ఇటు మాకూ ఈ బాధ తప్పుతుంది.”

అరు : “అప్పుడు మేం వెళ్ళి స్ట్రైక్ చేస్తాం అక్కడే. ఆదివారం బోర్ కొట్టించేస్తున్నారు ఏ కార్యక్రమం లేకుండా అని.”

రాజేశ్వరి : “మీలాంటి వాళ్ళు ఉండబట్టే వాళ్ళు సెలవు రోజుకూడా శ్రమపడుతున్నారు.”

మాధవరావు : “ఇప్పుడు వాళ్లను దెప్పిపొడుస్తున్నావు కాని పన్నెండు అయ్యేటప్పటికి ఉషశ్రీ గారి పురాణ కాలక్షేపం పెట్టండిరా అని పెట్టేంత వరకూ గోల చెయ్యవూ.”

రాజేశ్వరి : “అవును అది వారానికి ఒకసారి వస్తుంది. ఎన్నోమంచి విషయాలు తెలుస్తాయి.”

అను : “మేమూ వారానికి ఒకరోజే కదమ్మా ఇవన్నీ వినేవి. మిగతా రోజులలో మా కాలేజీలు, మా పుస్తకాలూ, మా వర్క్ తోనే సరిపోతుంది కదా.”

రాజేశ్వరి : ఇంతకీ ఏమిటంటారు అప్పుడు కూడా పాటలే పెట్టుకుంటారా?”

క : “అమ్మా! నేనలా మాధవ్ వాళ్ళింటికి వెళ్ళివస్తాను.”

రాజేశ్వరి : “అలాగే నాయినా.”

అను : ‘తప్పించుకుపోయాడు తెలివిగా’ (స్వగతంలో)

రాజేశ్వరి : “రాజా ఏడీ?”

అను : “మన మాటలలో తప్పుకొని ఉంటాడు మళ్ళీ కొట్టుకోవటానికి. నేను వెళ్ళి చూసి వస్తానుండు.”

అందరూ తలా ఒక మూలకు వెళ్ళిపోయారు.

రాజేశ్వరి : పది అయిదంటే సగం ఆదివారం గడిచిపోయినట్టే. పిల్లలు చూశారా. రాజా ఎంతలా ఎదిగిపోయాడో! ఎన్నిమాటలో మాట్లాడుతున్నారో.”

మాధవరావు : “అవును మరి, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. పరిస్థితులను ఆకళింపు చేసుకునే తెలివితేటలు వస్తున్నాయి. మన కాలంలో ఈ వయసుకు ఏమీ తెలిసేది కాదు. పెద్దలు ఏం చెబితే అంతే.”

రాజేశ్వరి : “ఇప్పుడు మళ్ళీ ఖర్మ. పుట్టుకతోనే బుద్ధులు నేర్చుకుంటున్నారు. ప్రక్కింట్లో రాధ ఎంత పిల్లని? వాళ్ళ అమ్మానాన్న పిల్లలు ఎలా ప్రక్కన కూర్చుని మాట్లాడుకుంటారో కూడా చెబుతుంది. పిల్లలకు భయపడవలసిన రోజులు కూడా వచ్చేస్తున్నాయి.”

మాధవరావు : “వంట కూడా చేసేశావా రాజీ.”

రాజేశ్వరి : “సగం సగం అయింది. పదిగంటలకు బయటపడిపోతాను. మరి ఆదివారం స్పెషల్ కూడా చేయాలిగా”

మాధవరావు : “అనుని కాస్త సాయానికి పిలవకూడదూ!”

రాజేశ్వరి : “ఎందుకండి ఏదో పని తొందరలో దానిని తిడతాను కానీ రేపు పెళ్ళి అయితే దానికి ఎలాగూ తప్పవు ఇవన్నీ. ఇప్పుడన్నా సుఖపడనివ్వండి.”

మాధవరావు : “ఎంత మంచిదానివి రాజీ.”

రాజేశ్వరి : “కాస్త అవకాశమిస్తే మరీ చిన్నవారైపోతారు మీరు.”

మాధవరావు : “మనకిప్పుడే ఏం వయసు మీరిపోయిందని.”

రాజేశ్వరి : “మనంత ఎత్తు ఎదిగిన పిల్లలు కళ్ళ ఎదుట ఉన్నా మీకు మనం చిన్నవాళ్ళలాగే కనిపిస్తున్నామా?”

మాధవరావు : “నాకెప్పుడూ నువ్వు చిన్నదానివే

రాజేశ్వరి: “అరు వస్తోంది” (చిన్నగా).

మాధవరావు : “ఆఁ! ఆఁ! (తడబడూతూ), రాజీ! నేనలా అరుగుమీద కూర్చుంటాను. అవసరమైతే పిలువు” అంటూ వెళ్ళిపోతాడు.

***

రాజేశ్వరి : “పిల్లలూ భోజనానికి వస్తారా?”

అను : “ఉండమ్మా అన్నయ్య నన్ను వనితావనిలో సీరియల్ విననివ్వడం లేదు.”

క : “మంచి హిందీ సాంగ్ వస్తోందే ప్లీజ్ అను.”

అను : “అన్నయ్యా! నీకన్నా కొంచెం ఉండాలిగా. నీకా పాట మళ్ళీ వినిపిస్తుందేమో కానీ నాకు సీరియల్ అయిపోయిందంటే మళ్ళీ వినటం కుదరదు.”

క : “మహా గొప్ప సీరియల్‌లే. మళ్ళీ ఇవన్నీ కలిపి గంట నాటకంలో వెయ్యకపోడు. అప్పుడు విందువుగానీలే ఇవ్వు ఇవ్వు.”

అను : “అమ్మా! వీడు చూడవే.”

రాజేశ్వరి : “అరేయ్! కల్యాణ్! ఆడపిల్ల దానితో పోటీ ఏమిటి? నాన్నగారు నిద్రపోతున్నారన్న జ్ఞానం కూడా లేదు మీకు. వెళ్ళి నీ ఫ్రెండ్ ఇంట్లో వినుపో. అను! నువ్వెళ్ళి విను.”

క : “ఎప్పుడూ మీరంతా ఒకటే. రాత్రికి  9.30 మంచి సాంగ్స్ వస్తాయంటే హరికథ అని నువ్వు లాక్కుపోతావ్. నేనెప్పుడు సంపాదిస్తానో ఎప్పుడు కొనుక్కుంటానో. అప్పటిదాకా ఇవి తప్పవులే.”

అను : “అమ్మా నువ్వు వింటావా?”

రాజేశ్వరి : “వింటాను గానీ ఇక్కడ వద్దు. పద అలా హాలులోకి పోయి పెట్టుకుందాం. మెలుకువ వస్తే మీ నాన్నగారు కేకలేస్తారు.”

మ్యూజిక్. ‘మీరింతవరకు “తీర్పు మీదే” సీరియల్ విన్నారు.’

అను : “మంచి టైంలో ఆపేస్తున్నారు సీరియల్‍ని.”

రాజేశ్వరి : “అప్పుడే గదా నువ్వు మీ అన్నయ్యతో దెబ్బలాడి మరీ వినేది.”

అను : “అసలలా కన్నకూతురు భవిష్యత్తును నాశనం చేసే తండ్రులు ఉంటారమ్మా?”

రాజేశ్వరి : “అంతేనమ్మా అనుమానం మనసులోకి వచ్చిందంటే జీవితమంతా నాశనం అయిపోతుంది. ఆ అమ్మాయి తనవల్ల పుట్టిన కూతురు కాదనే అనుమానంతో చివరికి హత్య చేసినా చేస్తాడు. ఏమో ఊహించలేకుండా ఉన్నానమ్మా! మళ్ళీ వారం వరకు ఏమవుతుందో, ఏమిటో అని ఎదురుచూస్తూ ఉండాలి తప్పదు.”

“రాజీ” అని లోపల నుంచి పిలుస్తాడు మాధవరావు.

“వస్తున్నానండీ” రాజేశ్వరి సమాధానం.

“రెండు అయితే వార్తలు పెట్టుకుంటాను, రేడియో తీసుకురా”

“ఆఁ! అలాగే”

అను : “గురకపెట్టి నిద్రపోతున్నా వార్తల సమయానికే నాన్నగారికి భలే మెలకువ వస్తుందే”

రాజేశ్వరి : “అలవాటు. ఇది పట్టుకెళ్ళి ఇచ్చి వస్తాను మీ నాన్నగారికి”

అను :  “అలాగే”

రాజేశ్వరి వెళుతుంది.

***

రాజేశ్వరి : “అను!”

అను : “ఊఁ!” (పరధ్యానంగా)

రాజేశ్వరి : “ఏమిటే ఇంకా ఆ సీరియల్ గురించే ఆలోచిస్తున్నావా?”

అను : “ఏం లేదే”

రాజేశ్వరి : “ఏం లేకపోవటమేమిటే నీ ముఖమే చెబుతోంది”

అను : “అలాంటి సంఘటనలు తలంచుకుంటే బాధవేయదేమిటమ్మా”

రాజేశ్వరి : “సరి సరి. ఇలా బాధపడుతూ కూర్చుంటావంటే, కళ్యాణ్ కిచ్చి హిందీపాటలే వినమనేదాన్ని. మించిపోయిందేం లేదు. మూడు గంటల నాటకం వినటం మానేయ్.”

అను : “అమ్మా! ఆశ”

రాజేశ్వరి : “మళ్ళీ తయారవుతావా?”

అను : “మరీ! బాధ వస్తుందని ఇలాంటి హృదయాన్ని కదిలించే నాటకాలు వినటం మానేస్తే ఇంకేమైనా ఉందా? అంత బాధపడినా, తీయటి బాధను ఎదుర్కొన్న అనుభూతి మిగులుతుంది. అదంటే నాకిష్టం.”

రాజేశ్వరి : “ఏమిటో మీ పిచ్చి”

అను : “పోనీ వదిలెయ్యమ్మా”

రాజేశ్వరి : “వదిలెయ్యక చేసేదేముందిలే”

అరు : “అక్కా, రేడియో ఎక్కడా కనిపించదేం.”

అను : “అది….” (చెప్పబోయేంతలో).

రాజా : “అక్కా చెప్పకే దానికి. నాకు చెవిలో చెప్పెయ్. ప్లీజ్ అక్కా ప్లీజ్.”

అను : “ఏం పందెం వేసుకున్నారా?”

రాజా : “కాదు పిల్లల కార్యక్రమం వినటానికి. చిన్నక్క చేతిలో పెట్టుకున్నప్పుడు నేనేమైనా అంటే కొడుతుంది. అదే నా దగ్గర ఉందనుకో, నేనెక్కడ అది పట్టుకుని పారిపోతానో అని నేను చెప్పినట్లు వింటుంది. అందుకని (గారాబంగా)”

అను : “మీ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇంకొకళ్ళు ఏడుస్తారు. అది నాకిష్టం లేదు. టాస్ వేద్దాం. ఎవరికి వస్తే వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి.”

అరు, రాజా : “ఓకే.”

అను : “రాజా! నువ్వు చిన్నవాడివిగా, నీకు ఏది కావాలో కోరుకో.”

రాజా : “నాకు బొమ్మ కావాలి.”

అను : “గుడ్” అంటూ నాణాన్ని పైకి విసురుతుంది.

(క్రింద పడిన శబ్దం)

రాజా : “హాయ్! హాయ్! నాదే పడింది.”

అరు : “అక్కా, ఇంతకు రేడియో ఎక్కడుంది?”

అను : “నాన్నగారి దగ్గర.”

రాజా : “అరు అక్కా! రా పోదాం!”

అను : “ఏమిటో వీళ్ళ పిచ్చి ఎవరి దగ్గర రేడియో ఉంటేనేం, వినాలి గానీ.”

రాజేశ్వరి : “ఇంతకూ సాయంత్రం ప్రోగ్రామ్ ఏమైనా వేసుకున్నారా?”

అను : “ఊఁ! పాత పిక్చర్ చాణుక్య చంద్రగుప్తుడు అరు, రాజా కలిసి వెళతారట. నేనూ, అన్నయ్య ’లవ్‍స్టోరీ’కి వెళదామనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ కూడా వస్తారులే.”

రాజేశ్వరి : “అయితే సాయంత్రానికి ఇల్లంతా ఖాళీ అయిపోతుందన్నమాట సలక్షణంగా.”

అను : “నాటిక అయిపోగానే రెడీ అయి వెళ్ళిపోతాం. దారిలో కాస్త షాపింగ్ ఉందట మా ఫ్రెండ్స్‌కు. అది కానిచ్చేసి పిక్చర్‍కి వెళతాం.”

రాజేశ్వరి : “అయితే టిఫిన్ చెయ్యాలిగా నేను వెళతాను.”

అను : “నువ్వుండమ్మా, నాటకం వింటూ నేను చేసేస్తానుగా.”

రాజేశ్వరి : ‘ఆ మాటే తృప్తిగా వుంది. అందుకేనేమో ఎదిగివచ్చిన ఆడపిల్ల ఆసరా ఉంటే తల్లికీ ఏ దిగులూ ఉండదని (స్వగతంలో)’

***

మాధవరావు : “ఏమిటి ఇల్లు అంతా ఇంత ప్రశాంతంగా ఉంది, వీళ్ళంతా ఏరి?”

రాజేశ్వరి : “అందరూ తలా దారినా సినిమాకు వెళ్ళారు.”

మాధవరావు : “మరి మనల్ని వదిలేశారేం?”

రాజేశ్వరి : “మీరు మరీనూ?”

మాధవరావు : “మనం కూడా వెళదామేమిటి?”

రాజేశ్వరి : “వాళ్ళు వెళ్ళేరు కదా రేపు మనం వెళదాం లెండి.”

మాధవరావు : “పిల్లలు వెళితే మనం వెళ్ళకూడదా ఏమిటి?”

రాజేశ్వరి : “అదికాదండీ 9.30కి రేడియోలో రుక్మిణీ కళ్యాణం హరికథ ఉంది, అందుకని” (నసుగుతూ).

మాధవరావు : “అదా సంగతి, అలా చెప్పు. సినిమా వద్దంటుందేమిటా అని నేను ఆశ్చర్యపోతున్నాను. తయారవ్వు రాజీ, దగ్గర హాలులో దానికి వెళ్ళి వచ్చేద్దాం. అయినా ఇప్పుడు సినిమాలన్నీ పద్నాలుగు రీళ్ళేగా. తొమ్మిదింటికల్లా అవనే అయిపోతున్నాయ్.”

రాజేశ్వరి : “అలాగైతే సరే. ఏమండీ!”

మాధవరావు : “మళ్ళీ ఏమొచ్చింది?”

రాజేశ్వరి : “డ్రాయర్ మీద రేడియో చూడండి. ఎలా బుజ్జిముండలా చూస్తోందో, దానిని అందరూ వదిలేశారని.”

మాధవరావు : “అలా ఎందుకు అనుకుంటున్నావ్? ఈ ఆదివారం వస్తే అమ్మగారికిలా నాకూ రెస్ట్ ఉండటం లేదు. ఇప్పటికైనా వదిలిపెడితే చాలు అనుకుంటోందేమో.”

రాజేశ్వరి : “వాటికీ మాటలొస్తే తమ బాధలన్నీ చెప్పుకొనేవేమో.”

మాధవరావు : “ఆఁ! ఆఁ! దాని బాధలు గురించి ఆలోచిస్తూ నువ్వు తయారైతే మనం వెళ్ళేటప్పటికి విశ్రాంతి చూపిస్తాడు.”

రాజేశ్వరి : “మీరు మరీ చోద్యంగా మాట్లాడతారు. నిముషంలో రడీ అయిపోనూ.”

మాధవరావు : “నీలాంటి వాళ్ళను చూసే – ఫస్ట్ షో కి రెడీ అవమంటే సెకండ్ షో టైముకు బయటకు వచ్చిందట సింగారించుకుని అనే నానుడివచ్చి ఉంటుంది.”

రాజేశ్వరి : “మీ హాస్యానికేం లెద్దురూ. మీరు రిక్షాని పిలవండి ఈలోపు నాదయిపోతుంది.”

***

మాధవరావు:  “ఆవ్ (ఆవలిస్తూ) రాజీ! నీ హరికథ అయిపోయినట్లేనా?”

రాజేశ్వరి : “అయిపోయిందండీ. ఆదివారం కూడా అయిపోయింది. ప్రొద్దున నుంచీ ఆ రేడియో వాగింది వాగినట్లే ఉంది అందుకని దానిని కూడా ఫుల్ రెస్ట్ తీసుకోమని చెప్పి కవర్ తొడిగి వచ్చేశాను.”

మాధవరావు : “మంచిపని చేశావ్”

రాజేశ్వరి : “నేనెప్పుడూ మంచిపనులే చేస్తానండోయ్ (నవ్వుకుంటూ)”

***

అందరూ ప్రక్క లెక్కేశారు. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఇంక నన్ను కదిపే వాళ్ళెవరూ ఉండరు. ఎవరు అన్నా అనకపోయినా ఆదివారం అప్పుడే వద్దు బాబోయ్ అని నేనంటాను.

– ఇట్లు, మీ రేడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here