రైల్వే జంక్షన్

1
14

[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘రైల్వే జంక్షన్’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు.]

[dropcap]“మ[/dropcap]ళ్ళీ రండి” అంటూ ఉబ్బసపు గొంతుతో చెప్పిన లావాటి బడ్డీకొట్టువాడికి, కృత్రిమ ఉత్సాహంతో “తప్పకుండా” అనే గాలిపటం ఎగరవేసి, దానికొక ‘థ్యాంక్స్’ అనే తోక తగిలించి, చిల్లరను పర్సులోకి తోసి, కౌంటర్ పైనున్న క్యారి బ్యాగ్ ను లాక్కుని, టైమయిపోయింది అనుకుంటూనే గబగబా మెట్లు దిగిన ఆమె ఆశ్చర్యంతో కనులు విప్పారించింది. కాని మరుక్షణంలో ఆ అనుమానం కాస్త ఎడమ కనుబొమ పైన కనిపించిన సగం రొట్టె ఆకారం గాయపు గుర్తుతో పరిహారం లభించినట్టై టక్కున ఆగిపోయింది. అతడు కూడా ఆగిపోయాడు అతడి కళ్ళలోనూ ఆశ్చర్యంతో పాటు సందేహం కూడా.

కళ్ళ ముందున్న వాస్తవాన్ని ముందుగా గ్రహించింది అతడే. మొహంలోని ఆశ్చర్యం, సందేహం మాయమై వాటి స్థానంలో మొహమాటం కనిపించింది. రెండు చేతుల్ని ఆమెనుండి ఏదో దాస్తున్నట్టుగా వెనక్కి తీసుకున్నాడు.

ఆమె కూడా వాస్తవానికి వచ్చింది కొంత నిదానంగా. అయినా కానీ ఆమె మొహం పైనుండి ఆశ్చర్యం ఇంకా పూర్తిగా తొలగి పోలేదు. “నువ్వు ఇక్కడ?” అంటూ మెల్లగా గొంతు విప్పింది. ఇక తను మాటలు మొదలు పెట్టవచ్చు అనేలా అతడి మొహంలో ఒక నెమ్మది పరచుకుంది. “ అవును.. ఇలాగే.. ఏదో పని. నువ్వు ఇక్కడున్నావని నాకు తెలియదు. తెలియడం అటుంచు, ఊహ కూడా రాలేదు.” అని మెల్లగా అన్నాడు. వెంటనే చిరునవ్వు నవ్వాడు.

ఆమె కూడా నవ్వడానికి ప్రయత్నించింది. కానీ మాసిపోయినట్టున్న ఎరుపు రంగు ప్యాంటు, అంతే మాసిన తెలుపు, బూడిద రంగు గళ్ళ హాఫ్ చొక్కా, పిల్లిగడ్డం, చెదరిన క్రాఫు ఉన్న అతడ్నే కళ్ళు చికిలించి చూస్తూ నవ్వలేక పోయింది. “ఎన్ని రోజులైంది నిన్ను చూసి! నువ్వూ ఈ ఊళ్ళోనే ఉన్నావా? ఎప్పట్నుంచి?” అంది. తను ఇంకా కొట్టు ముందే నిల్చున్నాని గుర్తుకు వచ్చి అతడి వైపు చూస్తూనే రెండడుగులు పక్కకు జరిగింది. అతడు నాలుగడుగులు జరిగి ఆమె పక్కలో నిల్చున్నాడు. “విజయవాడకు వెళ్తున్నాను. నేను వచ్చిన ట్రైన్ ఈ స్టేషన్లో ముక్కలవుతుందట. బోగీలు చెల్లా చెదరై కొన్ని నాగ్పూర్ వైపు, కొన్ని చెన్నై వైపు వెళ్తాయట. నేనున్న బోగీ ఇంకో ట్రైనుకు తగులుకొని విజయవాడ వైపు వెళ్తుందట. ఈ సర్కస్ అంతా ముగిసేటప్పటికి రెండు గంటలు పడుతుందట. నాకు లోపల బోరు కొట్టి దిగి బయటికి వచ్చాను. రైలు బయలుదేరేటప్పటికి వెళ్తే సరి” అన్నాడు. తను చెప్పిందంతా ఆమెకు అర్థమయిందా లేదా అని సందేహంతో ఆమె కళ్ళలోకి చూశాడు. “ఇంకా గంటన్నర టైముంది” అని కూడా చేర్చాడు. దానికి ఆమెకు నవ్వొచ్చింది. “ఇది జంక్షన్” అంది, అతడికి తెలియదేమో అని. అతడు నిట్టూర్చాడు. “ఈ జంక్షన్ అనేది ఒక విచిత్రమైన ప్రదేశం” అన్నాడు చటుక్కున. అన్నాక నాలుక్కరుచుకున్నాడు. ఇంకేమో చెప్పాలని నోరు తెరిచాడు. “ఈ జంక్షన్లకు వచ్చిన ఏ రైలు కూడా వచ్చినట్టుగా ఇక్కడ్నుండి వెళ్లవు. తాము ఏ దిక్కును అనుకుని వస్తాయో ఆ దిక్కుకే వెళ్తాయనే నమ్మకం కూడా ఉండదు.”

ఆమె మొహంలో ఉన్న నవ్వు మాయమయ్యింది. విషయాన్ని మారుస్తూ “లగేజ్ సేఫే కదా? చైన్ వేసావు కదా?” అని ప్రశ్నించింది. అతడి మొహంలో నవ్వు కనిపించింది. “అంతటి ముఖ్యమైన లగేజేం లేదులే. చెప్తే నవ్వుతావు. ఒక రెండు జతల బట్టలు, సోపు, టవల్ ఉన్న ఒక చిన్న సంచీ. అంతే. నాది పైన బర్త్. దాన్ని మడిచి మూలలో పెట్టాను. అక్కడుంది అని ఎవరికీ కనిపించదు.” అంటూ పెద్దగా నవ్వాడు. ఆమె మొహం తేలికయింది.

అలా తేలికయిన మొహాన్ని కిందకి దించి, క్యారీ బ్యాగ్‌ను కుడిచేతికి మార్చుకుని, ఎడమ చేతి మణికట్టుకున్న నల్ల డయలున్న చిన్న గడియారాన్ని అంగట్లోని నియాన్ లైట్ వెలుగులో చూసి “రా! ఇంటికి వెళదాం. మా ఇల్లు ఇక్కడే దగ్గరే. సమయానికి సరిగ్గా నా బండి మీద నిన్ను మళ్ళీ స్టేషన్‌కు దింపుతాను” అంది. చాలా కాలం తరువాత కలిసిన తన స్నేహితురాళ్ళను ఆహ్వానించినంత సులభంగా తను అతణ్ణి ఇంటికి పిలవడం తనకే ఆశ్చర్యం అనిపించింది. అతడి ప్రతిక్రియకోసం ఎదురు చూడసాగింది.

అతడి మొహంలో కంగారు కనిపించింది. దానికి పూసిన మొహమాటం అనే లేపనం. తల దించి తననొకసారి చూసుకుంటూ “ఇంటికా! ఇప్పుడొద్దు. ఇంకెప్పుడైనా వస్తాను” అన్నాడు మెల్లగా.

అతడి హావభావాలను ఇదివరకే గమనించిన ఆమె బలవంత పెట్టడానికి మనసొప్పక “సరే! ఇక్కడే పార్కులో కూచుందాం పద” అంటూ అతడి బదులుకు చూడకుండా బయలుదేరింది. గతంలోని వందలాది జ్ఞాపకాలతో ఆమె మనసు బరువయింది. తల వంచుకుని ఆమెను అనుసరించాడు అతడు. మూడడుగులు నడవగానే ఆగిపోయిన ఆమెను చూస్తూ చిరునవ్వుతో “నీ వెనకే వస్తున్నాను” అన్నాడు. తనూ నవ్వింది. ఆ నవ్వు సహజంగా ఉండింది. నిర్మలంగా ఉండింది. “అది కాదు. ఆ సందేహం నాకు ఉండలేదులే ! నీకు ఇంకేం పని లేదు కదా? నీ రైలు బయలుదేరే దాకా నీకు తీరికే కదా? అని అడగడానికి ఆగానంతే” అన్నదామె. “అదేం లేదు. నీను ఫ్రీనే. ఈ ఊళ్ళో నాకేం పనుంటుంది?” అన్నాడు అతడు వడివడిగా. “నాకెవరు?’ అనబోయి ‘నాకేం పనుంటుంది’ అన్నట్టనిపించింది ఆమెకి. కానీ ఏం మాట్లాడకుండా ముందుకు నడిచింది. తను తడబడింది ఆమెకు తెలిసిపోయిందా, ఏమనుకుందో అనే ఆలోచనతో మరింత తల తగ్గించి ఆమెను అనుసరిస్తున్న అతడికి ఆమె ఎడమ ముంజెయ్యి కనుకొలుకును తుడిచింది కనిపించలేదు.

పైపైకి వస్తున్న జనాల నడుమ దారి చేసుకుంటూ అంగళ్ళ వరస అంచుని చేరుకుని, రోడ్డును నిదానంగా దాటి, ఆమె పార్కుకున్న వికెట్ గేటును జరిపి పార్కులోకి వెళ్ళింది. ఆమె వెనకనే అతడు. దగ్గర కనిపించిన ఖాళీ సిమెంటు బెంచి వైపు చూపుతూ “ఇక్కడ కూర్చోవచ్చు” అన్నాడు సన్నగా. ఆమెకు వినిపించలేదేమో అని సందేహం కలిగి మళ్ళీ అదే అనబోయేంతలో ఆమె “వద్దు” అంది. వెంటనే ఒక సారి దగ్గ “ఇక్కడ చాలా వెలుగుంది. షాపింగ్‌కు వచ్చినవాళ్లంతా మనల్నే చూస్తారు” అని సమర్థించుకుంది. అతడు పెదవి కదపకుండా ఆమెను అనుసరించాడు.

ఆ పార్క్ తనకు చాలా పరిచితం అన్నట్టుగా ఆమె, కనిపిస్తున్న వాకింగ్ పాత్ వదిలి, చిన్న చిన్న గులకరాళ్ళు పొదిగిన ఇరుకైన, ఒకరు మాత్రం వెళ్ళగలిగిన దారి వెంబడి లోపలికి వెళ్ళి, అటూ ఇటూ చూసి, పొట్టి చెట్టుకింద మసక చీకటి పరచుకున్న బెంచీ అంచుకు అలసిపోయినట్టుగా కూలబడింది. దూరంగా పట్టాల పైన రైలొకటి ‘సుంయ్’ అంటూ సున్నితంగా సద్దు చేస్తూ నిశాచరిలా సాగిపోతూ కనిపించింది. అదెందుకు అంత దొంగతనంగా వెళుతోంది అని ఆశ్చర్యపడుతూ, తనలో తనే చర్చించుకుంటూ అతడు ఆ బెంచి ఇంకో అంచుకు కూర్చుని, తన చేతిలో ఉన్న దానిని ఇద్దరి మధ్యలో తనకు దగ్గరగా ఉంచుకున్నాడు. దాన్ని గమనించిన ఆమె మొహంలో మందహాసం తొణిఇసలాడింది. అది చూసిన అతడి మొహంలో మళ్ళీ మొహమాటం చోటు చేసుకుంది.

“ఇలా అంటే నువ్వు నవ్వుతావు” అంటూ మొదలుపెట్టిన అతడు “ఏదో గ్రూపులో ఒక రంగురంగుల పోస్టర్ కనిపించింది. ఏదో కథల పోటీ అది. ఎవరో ఫార్వర్డ్ చేశారు. దాన్ని చూస్తుంటే మరచిపోయిన ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తుకు రాసాగాయి. నెల రోజుల నుండి ఇలా గుర్తుకొస్తున్న జ్ఞాపకాల్ని ఒక కథగా రాయొచ్చు కదా అనిపించింది. ఆ ఆలోచన రాగానే ఆశ్చర్యం వేసి, మనసు తేలికయినట్టనిపించింది. ఎలాగూ ఈ రాత్రి ప్రయాణం ఉంది కదా. అందులో రాసేయొచ్చు.. ఐ మీన్.. ప్రయత్నించొచ్చు అనుకుని ఈ నోట్ బుక్ తీసుకున్నా” చిన్న గొంతుతో అన్నాడు. ఆమె కళ్ళు విప్పారించేంతలో “పెన్ను ఎక్కడో పోయింది. అందుకే దీన్ని తీసుకున్నాను చూడు” అంటూ జేబులోంచి ఒక నీలం పెన్నును తీసి చూపిస్తూ నవ్వేశాడు. “దీనికోసం కాకపోతే అసలు రైలు దిగేవాణ్ణే కాదు” అంటూ కలిపాడు. అతణ్ణి చూసిన పది పన్నెండు నిమిషాల నుండి ఆమె మనసులో తొంగి చూస్తున్న జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా పొంగి వచ్చేశాయి.

బిఎస్సి రెండవ సంవత్సరం అది. రచయిత్రిగా పేరు పొందిన లెక్చరర్ ఒకామె అప్పుడే కొత్తగా ట్రాన్సఫర్ అయి వచ్చింది. ఆమె రావడం తోటే ఆ సంవత్సరం కాలేజ్ మ్యాగజైన్ బాధ్యత ఆమెకు అప్పగించారు ప్రిన్సిపాల్ గారు. ఆమె కూడా అది సంతోషంగా ఒప్పుకుంది. చెప్పలేనంత ఉత్సాహం ఆమెకు. విధ్యార్థులకని కథల పోటీ పెట్టి మూడు బహుమతులను అనౌన్స్ చేసి, బహుమతి పొందిన కథలను ఆ సంవత్సరం కాలేజ్ మ్యాగజైన్లో ప్రకటిస్తానని ప్రకటించింది.

హైస్కూలునుండి వక్తృత్వ పోటీలలో, వ్యాస రచన పోటీలలో బహుమతులు అందుకుంటున్నది ఆమె. ఇంటర్‌కు వచ్చిన తరువాత అయితే మొదటి బహుమతి ఎవరికీ దక్కనివ్వలేదు. ఇటీవల అభ్యుదయవాద కథలు రాయడానికి ప్రయత్నించి ఒకట్రెండు పత్రికల్లో కూడా చోటు చేసుకుంది. ‘అమ్మమ్మ ఇంటి మాసిపోని జ్ఞాపకాలు’ అనే అంశం పైన ఒక మాసపత్రిక జరిపిన వ్యాస రచన పోటీలో మొదటి బహుమతి పొంది ఇంకా ఒక నెల కూడా కాలేదు. అలాంటిది తనదే అడ్డాలో కాలేజీ కథల పోటీ వదులుకుంటుందా? ఉత్సాహంగా పాల్గొంది. కాలేజి చరిత్రలోనే మొదటి సారిగా జరిపిన కథల పోటీలలో మొదటి బహుమతి తనదే కావాలని నిర్ణయించుకుంది. తప్పకుండా అవుతుంది అని అనుకుంది కూడా.

కానీ బహుమతి వచ్చింది బిఎ మొదటి సంవత్సరంలో ఉన్న అతడికి.

తరగతి పాఠాలలో ప్రతిభను కనబరచడంతో పాటు ఇంత చిన్న వయసుకే ప్రఖ్యాత రచయితల రచనలను చదివి, వారి రచనల నుండి కొంత కొంత నేర్చుకుని, రచయిత్రిగా వికసించే దారిలో వెళ్తూ, ఇప్పటికప్పుడే నలుగురి దృష్టిలో పడేలా అడుగులు వేసిన తను తన సాహిత్య జీవితంలోని ఒక విశిష్టమైన మలుపు వద్ద నిల్చున్నాను అనుకుని. మహత్వాకాంక్షతో నాల్గు రోజుల్లో కథ రాసి, రెండువారాలు దాన్ని దిద్ది, దీనికి దీటు ఇంకేదీ ఉండదు అనుకుంటూ మనసులో విర్రవీగుతూ లెక్చరర్‌కు స్వయంగా ఇచ్చిన కథకు రెండవ బహుమతి.

ఇక రెండే వారాలలో జరిగే కాలేజ్ డే సంబరల్లో, బహుమతి పొందిన కథలతో కాలేజ్ మ్యాగజైన్ విడుదల, బహుమతి ప్రదానం జరిగే చారిత్రాత్మక కార్యక్రమ సమయానికి తను ఊళ్ళో ఉండరాదు, ఉన్నా ఆస్పత్రిలో ఉండాలి అని నిర్ణయించుకుంది.

అతడు బహుమతి పొందిన కథ అతడు తన జీవితంలో రాసిన మొదటి కథ అని తెలిసినప్పుడు, లెక్చరర్ అతడిని అందరి ఎదుట పొగిడినప్పుడు, ఈ కాలేజీలో ఉన్నంత వరకూ తనకు ఇక ప్రథమ బహుమతి రాదు అనుకుని తన బ్రతుకే ముగిసినట్టు నిరాశ పడిందామె.

కాలేజ్ డే వచ్చింది. అయిపోయింది. ఆమె తన నిర్ణయాన్ని నిలుపుకుంది. కానీ ఊరు వదలి వెళ్ళే అవసరం రాలేదు. కానీ అస్పత్రికి వెళ్ళింది. తొలిచూలు కాన్పుకు పుట్టింటికి వచ్చిన అక్కతో పాటు. కానీ అక్క లేబర్ వార్డునుండి వస్తున్న పురుటి నొప్పులు కానీ, పసికందు పుట్టగానే అందరి నవ్వులు కానీ ఆమె చెవిని సోకలేదు. ఆమెకు కాలేజ్ డే పాటలు, ఉపన్యాసాలే వినిపించాయి.

మరుసటి రోజు పాపను చూడడానికి తల్లితో పాటు వచ్చిన తన ఆత్మీయ స్నేహితురాలి చేతిలో పాపకు గిలక, అక్కకు మొసంబి పళ్ళు, ఈమె కోసం కాలేజ్ మ్యాగజైన్ ఉన్నాయి. తను పుస్తకాన్ని గిరాటేసి, గిలక పట్టుకుని పాప ముందు అల్లాడించసాగింది.

దినమంతా ఆ పుస్తకాన్ని పట్టించుకోలేదు. కానీ చదివింది మాత్రం అక్క, అన్నయ్య. ఇద్దరిదీ ఒకే తీర్మానం. అతడు రాసిన కథ చాలా బాగుంది. మొదటి బహుమతికి అర్హత పొందినది అని.

అదేమిటో చూసేద్దాం అనుకుని రాత్రి పడుకునే ముందు దానివైపు చూసింది. ఆ కథతోపాటు పోటీకి వచ్చిన కథల గురించి లెక్చరర్ రాసిన అభిప్రాయాన్ని చదివిదింది. కళ్ళు మూసుకుని బొమ్మలా కూర్చుండిపోయింది.

బడికి వెళ్ళిన విద్యార్థి, తిరిగి వచ్చేటప్పటికి అతడి తల్లి బావిలో శవమై ఇంటి ముందు ఈత చాప పైన పడున్నది అతడి కథా వస్తువు. నిమ్న వర్గాల బాధలు, వారి ఇళ్ళ చుట్టూ ఉన్న మురికి, వాళ్ళ బస్తీలలో జరిగే కొట్లాటలు వీటన్నిటినీ ఆ లేత బాలుడి వైపునుండి చూసిన వైనం అంతా మనసుకు హత్తుకునేలా చిత్రితమై కనిపించింది. “మనల్ని రచయితల్ని చేసేది మనం చదివిన పుస్తకాలు కాదు, మనం బ్రతికే బ్రతుకు” అని లెక్చరర్ తన అభిప్రాయంలో రాసిన వాక్యాన్ని మరోసారి చదివింది. అతడి ఫోటోను మరోసారి గమనించింది. ఎడమ కనుబొమ పైన సగం రొట్టె ఆకారంలో ఉన్న గాయం గుర్తు ఉన్న ఆ మొహాన్ని చూసిన జ్ఞాపకమే లేదే అనుకుంది. “నా ప్రపంచం ఎంత చిన్నది” అని గట్టిగానే అనుకుని మొహం పైకి దుప్పటిని లాక్కుంది.

మరుసటి రోజు తను పోకిరీ వెధవలు, రౌడీలు, మూర్ఖులు, పరిచయం మాట అటుంచి ఒక పదానికి కూడా అర్హులు కాని వేస్టులు అని తను ఇంతవరకూ నమ్మిన ఆర్ట్స్ కాలేజి విద్యార్థుల గుంపును వెతుక్కుంటూ ఇంతవరకూ తను కాలు పెట్టని కాలేజి ఇంకో వైపు ఉన్న పాత భవనం వైపు నడిచింది. మంచి కథ రాసిన అతడిని అభినందించాలని వెళ్లింది.

మొహంలో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, బిగువు గొంతుతో అతడు ఎక్కడున్నాడని ఒక గుంపును అడిగింది. బదులుగా అనేక చేతులు పైకి లేచాయి. అవన్నీ ఒక్కో దిక్కును చూపాయి. తోడుగా అల్లరి నవ్వులు. ఒక్కదాన్నే ఎందుకు వచ్చానా అనిపించింది ఆమెకు. తన పిచ్చి ఉత్సాహాన్ని తిట్టుకుంటూ మొహం గంటు పెట్టుకుని వెనిక్కి తిరిగిన ఆమెకి విజిల్స్ మధ్య “మూలలో స్తంభం చాటున నిల్చున్నాడు మొదటి బహుమతి మౌని బాబా, వెతుక్కుంటోంది రెండో బహుమతి మండే కొరివి” అనే అశుకవిత వినిపించి అతడి వైపు తిరిగింది. అతడి గడ్డంలో వెంట్రుకలు వేలాడుతున్నాయి. కాలేజ్ మ్యాగజైన్ ఫోటోలో అవి లేవు. కానీ కనొబొమ పైన సగం రొట్టె ఆకారం గుర్తు మాత్రం మెరుస్తోంది.

ఆమె అభినందనలను మొహమాటంగానే స్వీకరించాడు. రెండవ బహుమతి పొందిన ఆమెను పట్టించుకోలేదు. ఆమెకు నిరాశ కలగలేదు. పైగా తన మొహం వైపు చూడడానికే జంకుతున్న అతడి గురించి ఆమెకు నవ్వు, అతడి గురించి అగాధమైన కుతూహలం. కానీ ఆమె ప్రశ్నలకు అతడి వైపునుండి ఒకొక్క పదం బదులు మాత్రమే. అదంతా జరుగుతుంటే చుట్టూతా “ జాక్ పాట్ కొట్టాడ్రా మనవాడు”, “అది మహా టక్కరి పిల్లరోయ్, బెంజ్ బండి”, “ఒరేయ్ బెంజ్ కాదురా! ఆడి, లక్సురి ఆడి”, “ ఏ అది కూడా కాదురా, మనవాడికి దొరికింది రోల్స్ రాయ్ కంటే కొంచెం తక్కువ. అంతే” అనే కామెంట్లు, వాటి నడుమ ఈలలు..

వాటినేమీ పట్టించుకోలేదామె. కానీ ఆ ఒక్కొక్క మాటకూ, ఒక్కొక్క ఈలకూ అతడు మాత్రం క్రుంగిపోతూ, ముడుచుకుపోతూ పోయాడు. అది ఆమె భరించలేకపోయింది.

తన స్నేహితురాళ్ళను కనుక్కుంది. కానీ వదులు చొక్కాలు, కాళ్ళకు హవాయి చెప్పులు తొడుక్కుని ఆ ఊరి ఏదో మూలనుండి కాలి నడకన వస్తున్న అతడి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదని తెలుసుకుంది. తెలుసుకునే ఆసక్తి కూడా కనిపించలేదు. అయితే సరే. ఇది అర్థం అయ్యాక తనే అతడి గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. వయస్సుకు తగ్గ ఉడుకు రక్తం మనిషయినా ఆమెకు ఒక జాలి గుండె అయితే ఉంది.

“ఇన్ని రోజులు ఎందుకు రాయలేదు? ఇలాంటి ప్రతిభను అదెలా దాచావు? నీలో పొంగుతున్న కథలను ఎలా దాచుకున్నావు? అలా దాచడానికి నీకు మనసైనా ఎలా ఒప్పింది?” అంటూ ఒకింత ఆశ్చర్యం, ఒకింత విసుగు కనబరచింది. “ఇప్పుడైనా ఇక రాయి, ఆపకు” అంటూ బలవంతం చేసింది. “ఏం చెప్పాలో తెలియడం లేదు” అనేలా ఉంది అతడి ప్రవర్తన. “ఏదో రాశాన్లే” అని నిర్లిప్తంగా బదులిచ్చాడు. మూడవసారి కలిసినప్పుడు అతడి విశ్వాసాన్ని సంపాదించే ప్రయత్నంలో, ఇంట్లో ఎవరెవరుంటారు అని ఆత్మీయంగా అడిగంది. “నాన్న, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు” అంటూ ఇంతవరకూ మాట్లాడిన వాటిలో అతి పెద్ద జవాబిచ్చాడు. “అమ్మ?” అన్న ప్రశ్నకు “లేదు” అని మెల్లగా అన్నాడు. ఇక ఆ దిక్కులో సంభాషణ కొనసాగించలేక పోయింది. “కొత్తగా ఏమైనా రాశావా? నాకు చూపించు ప్లీస్” అంటూ మళ్ళీ మాటలను పట్టాలెక్కించడానికి ప్రయత్నించింది. అతడు ఏదో గొణిగి జారుకున్నాడు.

అలాగే జారే పోయాడు.

పరీక్షలు అయిపోయాయి. తరువాత అందరికీ రెండు నెలల వేసవి సెలవులు.

సెలవుల తరువాత కొత్త సల్వార్ కమీజ్ తొడుక్కుని, ఆమె కాలేజీకి వచ్చినప్పుడు రచయిత్రి లెక్చరర్ కనిపించలేదు. ఆమె పెళ్ళి చేసుకుని న్యూజిల్యాండ్ వెళ్ళిపోయిందట. ఈ సంవత్సరం కథల పోటీ లేదు అని నిరాశ ఆమెకు. ఆ నిరాశ తన కోసం కాదు అని ఆమెకు మాత్రం తెలుసు. అతడికి తెలుసా అని తెలుసుకోవడానికి ఆ ఈలల సంతలోకి మళ్ళీ కాలు పెట్టింది. అతడక్కడ కనిపించలేదు.

వారమంతా అలాగే. అతడెక్కడ అని ఎవరివద్దా సమాచారం లేదు. అతడి గురించి తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు అన్నది సరైన వాస్తవం. అతడి గురించిన అసక్తి ఎవరికీ లేదు అన్నది మరింత సరైన వాస్తవం. అలాగే ఒకసారి సైన్స్ బ్లాక్ వైపు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి దేవతలాగా ఎదురుగా ప్రత్యక్షమై అతడు కాలేజికి రావడం లేదని తెలిపింది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి, కనబడితే తనకు తెలపమని సిగ్గు వదిలి అడిగింది.

ఒక నెలలో అందరూ అతడిని మరచిపోయారు, ఆమె తప్ప. ఆమెతో పాటు అతడిని తలచుకున్నది ఆమెకు ఆ రోజు కాలేజ్ మ్యాగజైన్ తెచ్చిచ్చిన స్నేహితురాలు మాత్రమే. “ప్రపంచం చాలా చిన్నదే. అది గుండ్రంగానూ ఉంది. ఎప్పుడో నీకు దొరుకుతాడు” అని ఓదార్చింది కూడా.

ఆమె మాట నిజమవుతుందేమో అని పత్రికలనన్నిటినీ వెతికేది. ఎక్కడా దొరకలేదు.

ఆమె జీవితంలో కూడా మార్పులు రాసాగాయి. అవి ఆమెను ఊపిరి సలపనీయకుండా శ్రావణ మాసపు వెల్లువల్లాగ ప్రవాహ వేగంలో తమతో పాటు తీసుకెళ్లాయి. ఎంత వేగంగా అంటే ఆమెకు కథలు రాయడానికి గానీ, కనీసం చదవడానికి గానీ సమయం దొరకనంత. కానీ అప్పుడప్పుడు అతడు గుర్తుకొచ్చేవాడు. క్రమంగా అది కూడా అరుదై అతడు జ్ఞాపకాల్లోంచి మాయమై పోయాడు. చివరికి అతడి పేరు గుర్తుకొచ్చింది తను పుట్టింటికి వెళ్ళినప్పుడు. అక్కడ తన కాలేజ్ పుస్తకాలను తిరగేస్తుంటే వాటి మధ్య కాలేజ్ మ్యాగజైన్ కనపడి అతడి జ్ఞాపకాన్ని పైకి తెచ్చింది.

స్నేహితురాలు చెప్పిన మాట ఈ రోజు నిజమనిపించింది. ఈ చిన్న, గుండ్రటి భూమిపైన మళ్ళీ అతడు కనిపించాడు.

పొడుగాటి రైలొకటి వేగంగా దడ దడ చప్పుడు చేస్తూ పరిగెత్తింది. “వేసవి సెలవులు అయిపోయాక నువ్వు కాలేజీకి రానేలేదు! ఎక్కడికి వెళ్ళిపోయావు?” ఆమె జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి అడిగింది. కనురెప్పలు కొట్టకుండా రైలు మిగిల్చి పోయిన ఖాళీ పట్టాలనే దీక్షగా చూస్తున్న అతడు ఒకసారి గడియారం చూసుకున్నాడు. వెనుకటి మాదిరిగా నిదానంగా ఒక్కో మాట బదులిచ్చి ఆమెను సతాయించకుండా మెత్తగా మొదలుపెట్టి పటపటా మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడడం అతడికి జీవితం నేర్పినట్టుంది.

“నీకు తెలుసు కదా, మా నాన్న రైల్వేలో కూలీగా పనిచేసేవాడు. రాత్రి పూట నేను కూడా జాయిన్ అయ్యేవాణ్ణి. నీకు తెలియదులే. కాలేజీలో ఎవరికీ తెలియకూడదని ముఖానికి మఫ్లర్ చుట్టుకునేవాణ్ణి. అది సరే! జరిగిందేమంటే వేసవి సెలవుల్లో ఒక రాత్రి.. పన్నెండయిందేమో.. అప్పుడు నాన్న రైలు కింద పడి చనిపోయాడు. నా కళ్ళ ముందే అది జరిగింది.”

పార్క్ లో వాక్ చేసేవాళ్ళ, అంగళ్ళ వరసలో రణగొణ మాట్లాడుతున్న శబ్దాలను మింగేసేలా రైలొకటి దీర్ఘంగా ఈల వేసింది. తను విన్నదాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకు సమయం దొరికింది.

రైలు కూత విన్న అతడు మరొక్కసారి తన వాచీని చూసుకుని “ అప్పట్నుంచి నాకు స్టేషన్లోకి కాలు పెట్టడానికి మనసొప్పలేదు. అది తలచుకుంటేనే వణుకు పుట్టేది. ఇంటి దగ్గరున్న ఒక ఆయిల్ మిల్లులో పన్లోకి చేరాను. పొద్దున్న పూట ఆ ఏరియాలో పాల ప్యాకెట్లు వేసేవాణ్ణి. తమ్ముళ్ళను చదివించాల్సి ఉండింది కదా! చెల్లెలు కూడా ఉండింది మరి” అన్నాడు.

అతడి నోటినుండి “కాలేజ్ వదిలేశాను” అన్న పదాలు రాలేదు అని ఆ షాక్ మధ్యలోనూ ఆమె గమనించింది. “అంతే. ఇంకేం లేదు. నీది చెప్పు. బిఎస్సి అయినాక ఎంఎస్సి చేశావా?” అన్నాడు.

అతడి ప్రశ్న అర్థం కావడానికి ఆమెకు కొన్ని క్షణాలు పట్టింది. అర్థమయిన తరువాత సమాధానానికి బదులు అతడిని అడగడానికి తన వద్ద ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయని అనిపించింది. వాటన్నిటినీ అడగడానికి కొంచెం వేచి ఉండాల్సి వచ్చింది.

వారిద్దరి పైన తన తీక్షణమైన వెలుగును ప్రసరిస్తూ ఒక ఇంజన్ కర్కశంగా చుకు చుకు చుకు అంటూ అటునుండి ఇటు వెళ్ళింది. దాని వెంటనే ఒక పది పన్నెండు బోగీలు ధడక్ ధడక్ అని చప్పుడు చేస్తూ పరిగెత్తాయి. చివరికి ఒకే ధడక్ తో ఆ శబ్దం ముగిసేటప్పటికి అతడు చిన్నగా వణుకుతున్నాడు.

అతడిని మానసికంగా అక్కడినుండి దూరం చెయ్యాలనుకుని ఆత్రంగా పెదవి విప్పింది. “తరువాత ఏమయ్యింది? తమ్ముళ్ళు, చెల్లెలు ఎక్కడున్నారు? నువ్వేం చేస్తున్నావు? పెళ్ళాం, పిల్లలు?”

పొడుగాటి నిట్టూర్పు అనే ఇంజన్‌కు పదాల బోగీలు జోడిస్తూ చెప్పాడు. “రాజీని మేనమామే చేసుకున్నాడు. తను ఇప్పుడు పల్లెలోనే ఉంది. ఇద్దరు పిల్లలు. అంతా సరిగ్గా ఉందని చెప్పలేను. సంసారమన్నాక ఉండే ఉంటాయి కదా! కలతలు! ఎలాగో నెట్టుకొస్తోంది. కష్టం వస్తే నాతో ఏమీ అనదు. నాకు ఇబ్బంది కలగరాదనో లేదా నా నుండి ఏమీ ప్రయోజనం లేదనో తెలియదు” అని ఆపాడు.

ఆమె తల ఎత్తి చూసేసరికి అతడి కళ్ళు రైలు పట్టాల అవతల ఉన్న చెట్టు పైన ఉన్నది కనిపించింది. దాన్ననుసరించి అటు వైపు తిరిగిన ఆమెకు ఒక నల్లటి శరీరం చెట్టుపైనుండి దిగేది కనిపించింది. అది మెల్లగా దిగుతూ ఒక్కసారిగా వేగాన్ని పెంచుకుని రైలు పట్టాల పైన దిగింది. కీచ్ కీచ్ అని అరుస్తున్న దేనినో తన కాళ్ళతో పట్టుకుని మళ్ళీ ఎగిరింది. కాళ్ళలో ఉన్న జంతువుకున్న పొడుగాటి తోక ఆ చీకటిలోనూ స్పష్టంగా కనిపించింది. “హ్” అన్న శబ్దం ఆమెకు తెలియకుండానే ఆమె గొంతునుండి వెలువడింది. అతడి వైపు చూసేసరికి అతడు గొంతు సర్దుకుంటూ కనిపించాడు.

“రాజప్ప బిఎస్‌ఎఫ్ చేరాడు. ఇప్పుడదేమో బార్మేర్ అని రాజస్థాన్లోని పాకిస్తాన్ బార్డర్లో ఉన్నాడు. భయంకరమైన వేడి ప్రాంతమట. పరశురామ్ క్రాంతికారి కవితలు రాస్తాడు. ‘నెత్తురు పరశువు’ అనే కలం పేరుతో. వాడి కవితలు బహుశ అన్ని పేపర్లలోనూ వస్తూనే ఉంటాయి. నువ్వు చూసుండొచ్చు.”

తనకు ఆ కలం పేరు తెలియదు అని చెప్పలేకపోయింది. అంతలో “ఇంతకీ నువ్వేం చేస్తున్నావు?” అని అడిగింది.

అతడి మొహంలో నిశబ్ద మందహాసం. తల పైని ఆకుల సమూహంలో రెండు పక్షులు రెక్కలు విదిల్చి కువకువమన్నాయి.

“పరశు ఇల్లు వదిలి ఐదు నెలలయింది. ఇంతకు ముందు కూడా అలా చేసేవాడు. కానీ ఒకట్రెండు నెలల్లో తిరిగి వచ్చేవాడు. ఈ సారి మాత్రం జాడలేదు. నక్సలైట్లతో జత కట్టాడని వార్త. మరడికెర ఎంఎల్‌ఎ హత్యలో వీడికి కూడా పాత్ర ఉంది అని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడెక్కడో శ్రీకాకుళం వైపు పారిపోయాడని వాళ్ళ అంచనా.”

శ్రీకాకుళం అనగానే ఆమె మనసులో తన అభిమాన గాయకుడు పి.బి.శ్రీనివాస్ మెదిలాడు. అది ఆయన జన్మస్థలం కదూ అనుకుంది. “..ఉదయానికి విజయవాడ చేరుకుని అక్కడినుండి శ్రీకాకుళం వెళ్ళే రైలు పట్టుకోవాలి. నాకూ పోలీసులకు పరుగు పందెం, ఎవరు ముందుగా వాణ్ణి చేరుకుంటారు అని.” అంటూ చెప్తున్నాడు. మరో రైలు కూత పెడుతూ మెల్లగా పాకుతూ వెళ్ళింది. “నీ గురించి చెప్పు. ఎప్పట్నుండి ఇక్కడున్నావు? భర్తా, పిల్లలూ?” అతడి ప్రశ్న రైలు కంటే వేగంగా ఉండింది. ఆమె మెలకువ వచ్చినట్లుగా “ఆ” అనింది. అతడు నవ్వినట్లనిపించి అతడివైపు తిరిగింది.

అవును. అతడు చిన్నగా నవ్వుతున్నాడు. మొహం మాత్రం పైని నల్లని ఆకాశం వైపు ఉంది.

అటు వైపే చూస్తూ కలలోనేమో అన్నట్టు గొంతు విప్పాడు. “నువ్వు కూడా కాలేజీ సగంలోనే వదిలేశావు కదా? నాకెలా తెలుసు అంటావా? కాలేజీ మొదలవగానే ఒక రోజు ఉదయాన్నే వచ్చి సైన్స్ బ్లాక్ నోటీస్ బోర్డ్ పైనున్న మీ టైం టేబల్ రాసుకున్నాను. అప్పుడప్పుడు సమయం చూసుకుని వచ్చి దూరంగా నిలుచుని చూసేవాణ్ణి. నిన్ను చూడాలనే వేచి ఉండేవాణ్ణి. కనబడకపోతే వెళ్ళిపోయేవాణ్ణి. ఒక రోజు నిన్ను డ్రాప్ చేసి వెళ్తున్న మీ డ్రైవర్ వచ్చి ఏదేదో తిట్టాడు. పరిగెత్తి వెళ్ళిపోయాను.” మాటల నడుమ ఆమె వైపు తిరిగిన తన కళ్ళను మళ్ళీ నెత్తి పైని ఆకాశం వైపు తిప్పి జోరుగా నవ్వసాగాడు.

ఆమె ఉలిక్కిపడింది. కళ్ళు వెడల్పయ్యాయి. ఓరగా అతడిని చూసింది. ఏదో చెప్పాలన్నా నోరు పెగల్లేదు.

అతడు నవ్వుతున్నది ఆపి “ కానీ నిన్ను చూడడం మాత్రం మానలేదు. ఇంకొద్దిగా దూరంగా, ఒక చెట్టు వెనక అంతే. కొన్ని రోజుల తరువాత నువ్వు కాలేజికి రావడం మానేశావు. ఒక నెలంతా కనబడలేదు.”

ఆమె అత్యాశ్చర్యంతో అతడి వైపే చూస్తోంది. “..నా వల్లనే అలా జరిగిందేమో అనిపించింది. మీవాళ్ళు నిన్ను వేరే కాలేజీలో చేర్పించారేమో లేదా వేరే ఊరికి పంపారేమే అనుకున్నాను. చాలా బాధేసింది. మళ్ళీ అటువైపు వెళ్ళలేదు..” అతడు చెప్తున్నాడు. గొంతు సన్నగా అయింది. తల వంచుకున్నాడు.

మరో రైలు చనిపోయినవాళ్ళను కూడా లేపేంతగా కూత పెట్టగానే ఆమె ఈ లోకానికి వచ్చింది. అతడు వాచీ చూసుకోవడం చూసి, తను కూడా చూసుకుంది. ఒకసారి అతడి వైపు, పైకి, కిందికి, అటూ ఇటూ చూస్తూ చెప్పనారంభించింది. “లేదు. అదొక పెద్ద కథ. మా అక్క తన ఏడెనిమిది నెలల బిడ్డను వదిలేసి చనిపోయింది. నాలుగు రోజుల చలిజ్వరం. అంతే. ఆ బిడ్డ ఏడుపు చూడలేక పోయాను. సన్నబడిపోయింది. ఆ పాప నాకు బాగా మాలిమైంది. పరీక్షలు తరువాతి సంవత్సరం రాస్తే అయిందిలే అనుకుని పాపను చూసుకోవడానికి నిలబడ్డాను. తరువాత బతుకు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళింది.” అంటూ ఆపింది. మళ్ళి పూనకం వచ్చినదానిలా “బావ కూడా పాపను చాలా ఇష్టపడేవారు. రశ్మి, అదే మా అక్క పాప, నన్నే తన అమ్మ అనుకుంది. ఇంకేముంది? నేను మా బావకు రెండో భార్యనయ్యాను. నా ఇష్టంతోనే అనుకో. బావ చాలా మంచివాడు. నన్నూ, రశ్మిని చాలా బాగా చూస్కుంటాడు. కానీ ఆయనకు టైమే ఉండడం లేదు.”

అతడు శిలలా కూర్చుండి పోయాడు. ఆమె కరగి నీరై పారుతోంది.

“పాపను తీసుకుని ఆయనతో పాటు ఈ ఊరికి వచ్చాము. ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజిలో ప్రొఫెసర్. అదొక్కటే కాకుండా పెద్ద పెద్ద బిల్డర్ కంపెనీల కన్సల్టెంట్. ముంబై, ఢిల్లీ, చండీఘర్ అంటూ తిరగడం. మూణ్ణెల్లకొకసారి ఫారిన్ టూరు. రోజుకున్న ఇరవైనాలుగు గంటలు ఆయనకు సరిపోవు. అలా నేను ఇంటికే పరిమితమై పోయాను. నాకు పిల్లలు పుట్టలేదు. నాకు ఇప్పుడు రశ్మియే అంతా. కానీ..” ఆపింది. అతడు గాబరా పడ్డాడు. అలాగే ఆమె మాటలను వినసాగాడు.

“రశ్మికి ఇరవై మూడు సంవత్సరాలు ఇప్పుడు. మంచి పిల్ల, చదువులో ఎప్పుడూ చురుకు. నేనంటే ప్రాణం దానికి. కానీ.. అదేం మంత్రం వేశాడో.. ఆ.. ఆ దేవుడు నుదుట ఏం రాసి పంపుతాడో. ఒకతడిని ప్రేమించింది. పెళ్ళంటూ చేసుకుంటే అతడ్నే. లేకపోతే నా శవాన్ని చూడడానికి రెడీ అవ్వు అమ్మా అనేసింది. మనిషన్నాక ప్రేమించడం సహజమే. కానీ ఇక్కడ ఇబ్బంది అతడి మతం. ఇప్పటి వాతావరణంలో నిజం ఏది, నాటకం ఏది అనేది తెలియడం లేదు. అదీ కాకుండా ముంబై నమ్రత, ఢిల్లీ శ్రద్ధ, బంగ్లాదేశ్ కవిత కథలనన్నీ విన్నాక ప్రాణం కొట్టుకుంటుంది. ఆ కేరళ స్టోరీ సినిమా ట్రైలర్ చూసి కదలిపోయాను.” ఆమె గొంతు అతడి మనసును తాకేలా వణికింది.

ఆసరాకని అతడి వైపు వాలి ఆమె తన అరచేతిని అతడి నోట్ బుక్ పైన పెట్టుకుంది. బలంగా బరువుగా నొక్కిపట్టి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంది. ఎదురుగా సాగిపోతున్న రైలు వేగానికి సమానంగా మాట్లాడసాగింది. “నా కూతురికి ఏమీ కాకూడదని అందరు దేవుళ్ళకూ మొక్కుకున్నాను. నా స్వంత ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఈయన నేను చెప్పిన దానికి ఎదురు చెప్పరు. మా ఇంటి పక్కనే ఒక ఇల్లుకొని అమ్మాయిని, అల్లుణ్ణి కళ్ళెదురుగ్గానే ఉంచుకున్నాము. వాళ్ళ పండుగలు, మన పండుగలు అన్నిటినీ ఆచరిస్తాము. అల్లుడికి ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నాము. అతడికే కాదు. అతడి అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను కూడా మా వాళ్ళలా చూసుకుంటున్నాము. అల్లుడి చెల్లెలికి క్రితం నెల పెళ్ళయింది. రేపు ఆమె భర్త బర్త్ డే. ఆయనకు మా ఆయన ఒక ఉంగరాన్ని తెచ్చారు. నేను ఒక రెండు జతల బట్టలు కొన్నాను.” తొడ పైన పెట్టుకున్న క్యారి బ్యాగ్ పైన అరచెయ్యి తట్టింది. “ఏ కారణానికీ నేను మా అమ్మాయిని వదులుకోవడానికి తయారుగా లేను. నేను నా జీవితంలో ఏమేం పోగొట్టుకున్నానో తెలుసా?” వెక్కింది. ఛాతీ ఎగసిపడింది.

తన నోట్ బుక్ పైన గట్టిగా నొక్కిపట్టిన ఆమె కుడి చెయ్యి వెనుక భాగం వైపు అతడు నిదానంగా తన చేతిని కదిపాడు. ముందుగా నాలుగు వేళ్ళు, తరువాత తన అరచేతితో మృదువుగా తట్టసాగాడు. ఆమె కళ్ళు ఒక్కసారిగా విశాలమయ్యాయి.

అతడి తట్టడం క్రమంగా నిదానమయ్యింది. అంతే నిదానంగా ఆమె కళ్ళు మూతబడసాగాయి. ఒక దశలో అలా తట్టడం పూర్తిగా నిలిచిపోయి, అతడి అరచెయ్యి ఆమె అరచేతి వెనుక భాగం పైన నిశ్చలంగా అయ్యేటప్పటికి ఆమె కళ్ళు పూర్తిగా మూసుకున్నాయి.

ఎవరు ముందుగా మేలుకున్నరో ఇద్దరికీ తెలియదు. పూర్తిగా మెలకువ వచ్చినాక “టైమయిపోయింది. నా వల్ల నీకు రైలు మిస్సవకూడదు.” అంటూ ఆమె లేచి నిల్చుంది. కన్నీళ్ళు కిందికి జారకుండా అతడు కనురెప్పలను మళ్ళీ మళ్ళీ ఒత్తుకుంటున్నాడు.

ఇద్దరూ మౌనంగా పార్కునుండి బయటికి వచ్చారు. ఇప్పుడు అతడు ముందు, ఆమె వెనుక.

బయటికి వచ్చి అతడు దారి తెలియక నిల్చున్నాడు ఆమె అతడి వద్దకు వచ్చింది. “చలో నేను నిన్ను స్టేషన్‌కు డ్రాప్ చేస్తాను.” అంటూ కార్ వద్దకు వెళ్ళీంది. “వద్దు వద్దు. నేను నడిచి వెళ్తాను. ఐదు నిమిషాలంతే” అన్నాడతను. “పర్లేదు. నేను వెళ్ళేది అటు వైపే. ఎక్కు.” అంటూ ఆమె కారులోకి వెళ్ళి అతడి వైపు తలుపు తీసింది.

అతడు మొహమాటంగా కొంతసేపు ఆగాడు. ఆమె తెరిచిన తలుపును మూసి, వెనుక తలుపును తెరిచి ఆమె మొహం చూడకుండా లోపలికి వెళ్ళి కుర్చున్నాడు.

“ఆహా! లేడి డ్రైవర్ ఉన్న రసికుడు అని ఈ ఊరి జనాలకు చూపాలని ఆశ అనుకుంటాను!” ఆమె జోరుగా నవ్వింది. “అవును” అంటూ నవ్వు కలిపాడు. “బ్రతుకులో ఒక్క నిమిషమైనా ఆ అదృష్టం నాకు కావాలి. ఏక్ దిన్ కా… కాదు కాదు.. ఏక్ మినిట్ కా సుల్తాన్” అంటూ ఆమెకంటే గట్టిగా నవ్వాడు. చుట్టూ ఉన్న జనాలు వీరివైపు చూశారు. ఆమె నిశబ్దంగా నవ్వుతూ కిటికీ అద్దాల్ని మూసింది. కారును ముందుకు దూకించింది. రోడ్డు వైపే చూస్తూ “అదేదో కథ రాయాలని నోట్ బుక్, పెన్ తీసుకున్నావు కదా” అంటూ అతడివైపు చూసింది. అతడు పాల్గొన బోయే కథల పోటీ గురించిన మెసేజ్ తనకూ వచ్చింది గుర్తుకు వచ్చింది. “తప్పకుండా కథ రాయి. పోటీతో ఆరంభమైన నీ రాత పోటీతోనే మళ్ళీ ప్రాణం పోసుకోనీ” అంది మలుపులో వేగంగా తిప్పుతూ. “నువ్వూ రాయచ్చుగా! నీకు బహుమతి వస్తే నాకొచ్చినట్టే” అని మెల్లగా అన్నాడు ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా. ఆమె బదులివ్వలేదు.

రెండు నిమిషాలలో కారు స్టేషన్ ముందాగింది. “ఇంకా పావుగంట టైముంది. నిదానంగా వెళ్ళు. తొందరపడద్దు.” అనింది ఆమె తగ్గు గొంతుతో. అతడు దిగి ఆమె వైపు వచ్చాడు. కనిపించినప్పటి మాదిరిగా చేతులు వెనుక కట్టుకున్నది చూసి ఆమె నవ్వుకుంది. “బై” అని గుసగుసగా అని చెయ్యూపింది. అతడు కూడా “కథ రాయి, మరచిపోకు” మొహం నిండా నవ్వుతో అన్నాడు. కళ్ళలో లేత వెలుగు. అలాగే నవ్వుతూ ఆమె వైపు చూస్తూనే రెండడుగులు వెనిక్కి జరిగాడు.

కారు ఎందుకో ముందుకు కదల్లేదు. ఒకట్రెండు సార్లు దగ్గినట్టు చేసి మూగబోయింది. ఆమె ఎక్కడెక్కడో చేతులు పెడుతూ గాబరా పడుతూ కనిపించింది. అతడు వెంటనే మళ్ళీ దగ్గరికి వెళ్ళాడు. “ఎందుకో స్టార్టవడం లేదు. పెట్రోలు ట్యాంక్ ఫుల్లుగా ఉంది. ఇక్కడికి రావడానికి ముందే నింపించాను.” అని సణిగింది. అతడు “తోస్తాను ఉండు.” అన్నాడు. ఆమె మొహం నిండా మొహమాటం నిండుకుంది. బొమ్మలా అతడి వైపు చూసింది. “ఇవన్నీ మామూలే. ఎందుకలా మొహమాట పడ్తావ్? ఇక్కడే ఇలా కావడం మంచిదయింది. నేనున్నాను కదా!” అంటూ భరోసా ఇచ్చేలా గబగబా అన్నాడు. ఆమె జవాబుకు కాచుకోకుండా కారు వెనుకకు వెళ్ళాడు.

నాలుగు అడుగులు తోసాడో లేదో వాహనం మేలుకుని నేనున్నానంది.

మొహం నిండా చిరునవ్వు పులుముకుని తన ముందు వచ్చి నిలుచున్న అతడి వైపు ఆమె నూటొక్క భావాలు నిండిన చిరునవ్వు విసిరింది. అతడు అదే నవ్వు మొహాన్ని ముందుకు తెచ్చి “కథ.. కథ!” అన్నాడు. మరింత వంగి “మరచిపోకు!” అని ఆమెకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడాడు. ఆమె నవ్వింది.

కారు ముందుకు వెళదామా వద్దా అనేలా ముందుకు జరిగింది. అప్పుడు కూడా ఆమె మొహంలో నవ్వు ఉండడం అతడికి కనిపించింది. ఎన్నో రోజుల తరువాత ఇలా నిర్మలంగా తను నవ్వగలిగాను అని ఆమె అనుకుంది.

తనకోసమే కాచుకున్నట్టు వెలిగిన పచ్చ దీపానికి థ్యాంక్స్ చెప్పి కుడివైపు తిరుగుతూ ఒక్క క్షణం అతడుండిన వైపుకు చూసింది. అక్కడ అతడు ఇటు వైపే చూస్తూ అలాగే నిలబడి ఉండడం కనిపించింది.

ఇంటి నౌకరు మణి గేటు తీయగానే కారును దాని జాగాలో చేర్చిందామె. గేటు మూసి సమీపించిన మణి “రశ్మి పాప ఇప్పుడే వచ్చిందమ్మా! అందరూ మీ కోసం కాచుకున్నారు. నేను పాలు పెట్టాను.” అంటూ లోపలికి పరిగెత్తింది.

ఆమెకు అతడు గుర్తుకొచ్చాడు. దాన్ని వెన్నంటే, తను మరచి పోయినానుకున్న “మనల్ని రచయితలుగా చేసేది మనం చదివిన పుస్తకాలు కాదు. మనం గడిపే జీవితం” అని చెప్పిన రచయిత్రి-లెక్చరర్ గుర్తుకు వచ్చింది.

వెంటనే దిగాలనిపించలేదు. అలాగే కళ్ళు మూసుకుని బొమ్మలా కూర్చుండిపోయింది. ఒక నిమిషం తరువాత కళ్ళు తెరిచి, అతడు వెనుక ఇంకా ఉన్నాడేమో అనిపించి సర్రున వెనక్కి తిరిగింది. కానీ అక్కడ అతడు లేడు. కానీ సీట్ పైన ఏదో కనిపించింది.

కుతూహలంతో ఇంకాస్త వంగి చూసింది. అదొక నోట్ బుక్. లోపల ఏదో ఉన్నట్టుగా ఉబ్బి కనపించింది. ఎడమ చెయ్యి చాచి దాన్ని తీసుకుంది. తొడపైన పెట్టుకుని తీసి చూసింది. నీలం రంగు లావు పెన్ను అక్కడ ముగ్ధంగా పడుకుని కనిపించింది.

ఆమె శిలలా నిటారుగా అయింది.

మరు నిమిషంలో ఆమెలో ప్రాణ సంచార మయ్యింది. ఒకసారి గట్టిగా వెక్కింది. తరువాత దోసిట్లో మొహాన్ని దాచుకుని వెక్కెక్కి ఏడవ సాగింది. వేళ్ళ సందులనుండి జారిన కన్నీటి బిందువులు తెరచి ఉన్న నోట్ బుక్ పైన టపటపామంటూ పడి ఖాళీ పుటలను తడపసాగాయి.

కన్నడ మూలం: శ్రీ ప్రేమశేఖర్

తెలుగు: చందకచర్ల రమేశ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here