రైతు బాంధవుడు – వారి లేఖావళి

1
9

[నవంబరు 7 యన్. జి. రంగా గారి జయంతి సందర్భంగా ‘రైతు బాంధవుడు – వారి లేఖావళి’ అనే వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

[dropcap]‘యన్. [/dropcap]జి. రంగా’గా ప్రపంచ ప్రసిద్ధులైన నిడుబ్రోలు వాసి గోగినేని రంగ నాయకులు గారు. వీరు అనేక రంగాలలో సుప్రసిద్ధులైనారు. నవంబరు 7, 1900 నాడు జన్మించిన రంగా గారి తల్లి దండ్రులు గోగినోని నాగయ్య, అచ్చమాంబలు.

Photo Courtesy: Internet

రంగా గారికి చిన్నతనం నుండే పుస్తకాలను బాగా చదివే అలవాటు వుండేది. విద్యార్థి దశలోనే వీరేశలింగం గారి రచనలు చదివి, ప్రభావితులయ్యారు. అంతే కాక, రాజకీయ సభలకు కూడా వెళ్లి దేశ స్వాతంత్య్ర సమరం పట్ల అవగాహన పెంచుకున్నారు. లండన్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వచ్చి 1927లో మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకునిగా చేరారు. కాని 1930లో గాంధీజీ పిలుపు నందుకుని భారత రాజకీయాలలో కాలు పెట్టారు. ఆ సంవత్సరమే భారత పార్లమెంట్‌లో ప్రతినిధిగా ప్రవేశించారు. అది మొదలు ఏ కొద్ది కాలమో తప్పించి 1991 వరకు దాదాపు 60 యేళ్లపాటు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కొనసాగారు. సుదీర్ఘ కాలం పాటు తన గొంతును బలంగా వినిపించిన రాజకీయవేత్త అయ్యారు.

ఈ అరవయ్యేళ్ల మధ్య కాలంలో రంగా గారి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్య్ర సమరయోధునిగా పలుమార్లు జైలు జీవితం గడిపారు. జైలులో వున్నప్పుడు కూడా తోటి ఖైదీలకు రాజకీయ పాఠాలు నిర్వహించారు. జైలు వెలుపల వున్న రైతుల కోసం కొన్ని పుస్తకాలను కూడా రచించారు.

1930లో కాంగ్రెసులో చేరగానే జమీందారీ వ్యతిరేక పోరాటంలో రైతుల పక్షాన నిలబడ్డారు. 1933లో రైతు కూలీ ఉద్యమానికి నాయకత్వం కూడా వహించి, అదే సంవత్సరం గాంధీజీ చేత తన స్వగ్రమామైన నిడుబ్రోలులో భారతీయ రైతు కేంద్రాన్ని స్థాపింపజేశారు. అది మొదలు తన జీవన పర్యంతం రైతు సంక్షేమం కోసమే పాటు పడుతూ తాను ఒక గొప్ప వ్యవసాయ ఆర్థిక శాస్త్రవేత్తగా ఎదిగారు. ఈ ఎదుగుదలలో దేశ విదేశాల వ్యవసాయ, ఆర్థిక, రాజకీయ, సామాజికవేత్తలతో పరిచయాలు, వారి దేశాలకు ఆహ్వానాలు, అభినందనలు అందుకున్నారు.

వారు చేసిన పనుల పై ఒక సారి దృష్టి సారిద్దాం.

1936లో కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రైతు కూలీల పరిస్థితిపై గాంధీజీతో చారిత్రాత్మక చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని ‘బాపూ దీవెనలు’ అను పేరుతో ఒక పుస్తకాన్ని రచించి రైతులకు అందించారు.

ఈనాడు రాజకీయ పాదయాత్రలు జరుగుతున్నట్లే రంగా గారు ఆనాడు రైతు పాదయాత్రను చేశారు, రైతుల స్థితిగతులను స్వయంగా పరిశీలిస్తూ.

1938లో ఇందులాల్ యాజ్ఞిక్‍తో కలసి కూడా కిసాన్ సభలు నిర్వహించారు. నెహ్రూ ప్రతిపాదించిన సహకార వ్యవసాయ పద్ధతిని వ్యతిరేకించారు. రంగా పార్లమెంట్‌లో వుంటే రైతుకు భద్రత వుంటుందని స్వయంగా తరువాత తరువాత భారత ప్రధానిగా నెహ్రూజీయే అన్నారు.

1946లో కోపెన్ హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సదస్సులోను, 1948లో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. వ్యవసాయం పట్ల నమ్మకముంచి శాంతియుత పూరితమైన సామ్యవాదం వైపు పరుగులు తీద్దామని నొక్కి వక్కాణించేవారు.

అంతర్జాతీయ రైతు నాయకులైన జార్జి డిమిట్రోవ్, ఫెరెన్స్ నాగీ, దీనా స్టాక్ లాంటి వారు రంగా గారి ఆప్త మిత్రులయ్యారు. ఇలాంటి వారెందరితోనో రైతు సంక్షేమం గురించి తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు.

ఇలా రైతాంగ విధానాలకు మద్దతునిస్తూ రైతు నాయకుడైన వీరిని రైతాంగ ఉద్యమ పిత అనీ, రైతు బాంధవుడని కొనియాడుతారు. దీనికి కారణం విదేశాలలోని రైతుల పరిస్థితుల పట్ల కూడా దృష్టి పెట్టి అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య వ్యవస్థాపకులలో ఒకరయ్యారు.

అవసరం పడినప్పుడల్లా పలు మార్లు ప్రపంచ దేశాల పర్యాటనలు విస్తృతంగా చేశారు. ఆంగ్ల, తెలుగు భాషలలో కలిపి మొత్తం 80 పుస్తకాలను రచించారు.

1954లో న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ సమాఖ్యలో ప్రధానోపన్యాసం చేస్తూ, “పొగాకు, పత్తి, చేనేత కార్మికుల గురించి ఆలోచించాలి” అన్న మేల్కొలుపును కావించారు. విప్లవోద్యమాలలో రైతులు నిర్వహించిన పాత్రను అధ్యయనం చేసి రివల్యూషనరీ పెజంట్స్‌, ది క్రెడో ఆఫ్‌ వరల్డ్‌ పెజంట్స్‌ అనే గ్రంథాలను వ్రాశారు. ఇలా ఏ పని చేస్తున్నా వారి శ్వాస, ధ్యాస రైతే. మధ్య మధ్యలో అనేక సంస్కరణలూ చేపట్టారు. కృషీకార్‌ లోక్‌ పార్టీ, స్వతంత్ర పార్టీలను, స్థాపించారు. ఆంధ్రాలో తొలిసారిగా నిడుబ్రోలులో రాజకీయ పాఠశాలను నిర్వహించి, ఎంతో మంది పేరు పొందిన ఈనాటి నాయకులకు వారే రాజకీయ గురువయ్యారు.

మనకొక పొగాకు బోర్డు వుండాలని దాని కోసం సంఘటితంగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. హరిజనోద్ధరణకు, వయోజనుల ఓటు హక్కుకూ పాటు పడ్డారు.

ఇలా రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలలో పాలు పంచుకుంటూనే, రైతుల సంక్షేమం కొరకు తపించారు. వారు జరిపిన ఉత్తర ప్రత్యత్తరాలలో, చివరకు భార్య భారతీదేవికి వ్రాసిన లేఖలలో కూడా రైతుల ప్రస్తావనే వుంటుంది. వాటిలో మచ్చుకు కొన్నిటిని చూద్దాం.

***

28-5-1955 న మాస్కో నుండి భార్యకు వ్రాసిన లేఖ.

“మాస్కో, స్టాలిన్ గ్రాడ్, తాష్కెంట్, జార్జియా, ఉక్రేన్, లెనిన్ గ్రాడ్ లతో పని చేసే కార్మికులకు ఇక్కడ ఎక్కువ ప్రతిఫలం వున్నది. ఇక్కడి మహిళలు అన్ని రంగాలలో, ముఖ్యంగా వైద్య రంగంలో చక్కగా రాణిస్తున్నారు. అది చాలా సంతోషించదగిన విషయం.”

~

అలాగే 1967లో వ్రాసిన ఉత్తరం.

“ప్రియ భారతీదేవీ! యునైటెడ్ సుప్రీం సోవియట్ రైతుల్ని అణిచివేయబడ్డ వర్గంగానే చూస్తున్నది. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలలో పని చేసే రైతులకు తగిన రక్షణ లేదు.” అంటూ ఇంకా కొన్ని రైతు సమస్యల్ని గూర్చి వివరించారు.

***

వివిధ దేశాల ప్రముఖులు రంగా గారికి వ్రాసిన లేఖలు కూడా ఒకటి రెండు చూద్దాం.

జూన్ 6 1955న జార్జి పాడ్ మోర్, లండన్ నుంచి వ్రాసిన లేఖ.

“ప్రియ రంగా గారు,

మా లండన పార్లమెంట్‌లో మీరు రైతుల సమస్యలపై మాట్లాడతారని మా సెక్రటరీ చెప్పాడు. మీరు వచ్చి ఈ నెల 13, 14 తేదీలలో మాట్లాడండి. ఇదే విషయాన్ని ఇండియా హౌస్‌కు తెలియజేస్తాం. నేను మిమ్మల్ని గోల్డ్ కోస్టు కమీషనర్‌కు పరిచయం చేస్తాను.”

~

రంగా గారు బాపూజీకి మరి కొందరికి వ్రాసిన లేఖలు.

“పూజ్య బాపూ!

“ఆదివాసీ సంఘాన్ని బలోపేతం చేయాలన్న లక్ష్యాన్ని కూడా మీ నిర్మాణాత్మక కార్యక్రమాలో చేర్చండి”

అని వ్రాయటమే కాక ఇక్కడ ఆదివాసీ గూడెలకు వెళ్లి పని చేయమని సోమసుందరం అనే వ్యక్తికి, వారికి సహాయం చేయమని ప్రకాశం గారికీ 1946 లోనే లేఖలు వ్రాశారు.

***

“ప్రియ సత్యనారాయణా, గౌతు లచ్చన్నా!

సర్కారు జిల్లాలలో, బారువా, విశాఖపట్నం ప్రాంతాలలో ఎక్కవగా పల్లెకారులున్నారు. మీరు పట్టించుకుని వారికి సంఘాలు ఏర్పాటు చేయటమే కాక, వారికి కావలసిన తోడ్పాటు కూడా అందించమని కోరుతున్నాను.”

***

29-3-1947 నాడు న్యూఢిల్లీ నుండి మద్రాసు ప్రభుత్వము వారైన రెడ్డియార్ గారికి వ్రాసిన లేఖ.

“రెడ్డియార్ గారూ! ఆంధ్రా కాంగ్రెస్ కమిటీ తరుపున వ్రాస్తున్నాను. మీ ప్రభుత్వం, బియ్యానికి, ధాన్యానికి గల రేటు తారతమ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. బియ్యం ధర బాగా ఎక్కువైనందున రైతులకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని అరికట్టటానికి చర్యలు తీసుకోండి.

 రంగా.”

~

“రంగా గారూ!

1948లో మీరు ప్రారంభించిన రాష్ట్ర స్థాయి జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థలు ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నాయి. దేశ విదేశాలలో అంతర్జాతీయ లేబరు ఆర్గనైజేషన్‌లో పని చేసే వారందరూ మీ కృషితో సంతోషంగా వున్నారు” అని 1949లో ప్రొఫెసర్ బి.యన్.మూర్తి గారు జెనీవా నుండి లేఖ వ్రాసి ప్రశంసించారు.

***

1949లో యు.పి. ముఖ్యమంత్రి, గవర్నర్ గారికి వ్రాసిన లేఖలు:

“ప్రియ వల్లభపంత్! మన తూర్పు కోస్తాలో తుఫాను తాకిడికి నష్టపోయిన వేలాది రైతులకు తక్షణసాయం అందించండి.

రంగా”

***

అదే సంవత్సరం కెనడాలో చేసిన రేడియో ప్రసంగంలో కూడా రైతులు, పంటలు దిగుబడుల ప్రస్తావనే. “ప్రపంచ బ్యాంకు రైతులకు ఋణాల్ని మంజూరు చేయాలి. పాశ్చాత్య దేశాలు, మా భారత్‌కు అప్పులిచ్చి చేయుత కల్పించాలి” అని చెప్పారు.

ఆ రోజుల్లో U.K , U.S.A లలోని రేడియోలలో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అవి చూసి స్పందించిన రంగా గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రసారశాఖామాత్యులతో మాట్లాడి ‘పొలం పనులు’ కార్యక్రమాన్ని మన రేడియోలో ప్రవేశపెట్టించారు. వారింకా ఎన్నో యోచనలు చేసి వాటిన్నింటినీ ఆమోదింప చేశారు.

అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తుల సంఘ సమావేశాలలో పారిస్‌లో కూడా నూతన ఆర్థిక విధానంలో రైతుల కోర్కెలను ప్రపంచం గుర్తించి అమలు చేయాలన్న తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.

***

యూనివర్శిటీ ఆఫ్ ఆర్కన్స్కాస్ నుండి ఎఫ్. జి. ఫ్రెడ్‌మన్ వ్రాసిన లేఖ:

“రంగా గారు రైతు హృదయాలను మీ మాటల్లో వినాలన్న కోర్కె మాకున్నది. మీరు మా యూనివర్శిటీకి వచ్చి రైతు హృదయస్పందన మాకు విన్పించి మమ్మల్ని ఉత్సాహపరచండి.”

***

అవసరమైతే ఎవరినైనా ఎదురించి మాట్లాడగలిగే ధీశాలి రంగా. దానికోక ఉదాహరణ.

“వినోబాజీ! మీరు భూములపై పెత్తనాన్ని మేనేజర్లకు అప్పజెప్పమంటున్నారు. అలా వద్దు. మనకు మన గ్రామ పంచాయితీలు, సహకార సంస్థలే బలోపేతంగా వుండి, సమర్థవంతంగా పని చేయాలని కోరుకుందాం.

రంగా.”

***

22-5-1968

“భారత ఫుడ్ అండ్ అగ్రికల్టర్ మినిస్టరు

జగజీవన్ రామ్ గారూ!

ఆహార పదార్ధాల కల్తీ జరుగుతున్నది. అరికట్టండి.

రంగా”

**

14 నవంబరు 1968

“భారత ప్రధాని

ఇందిరా గాంధీ గారికి!

ఒరిస్సా తదితర ప్రాంతాలలో తుఫాను తీవ్రతను గమనించండి. అక్కడి ప్రజలకు వెంటనే సహాయ చర్యలు అందించే ఏర్పాట్లు చేయండి.

రంగా”

ఇలా ఎన్నో మార్లు భారత ప్రధానులకు ఎన్నో విషయాలలో లేఖలు వ్రాసి తను వ్రాసిన విషయాలను వారిచే ఆమోదింపజేశారు.

***

17-4-1969 నాడు భారత ఆహార వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తెచ్చిన విషయం:

రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పంచాల్సిందే అని పార్లమెంట్ ద్వారా ఒత్తిడి చేస్తున్నామని ఆనాటి పార్లమెంటులో ప్రకటించారు.

ఇంటగెలిచి రచ్చ గెలిచిన ప్రజల మనిషి రంగా.

తన భావాలతో, లేఖలతో భార్యను కూడా ప్రభావితం చేయగలిగారు. భార్యకు వ్రాసిన మరో లేఖను చూద్దాం. యుగోస్లేవియాలోని రైతుల గురించి అన్ని విషయాలూ భార్యతో ప్రస్తావించారా లేఖలో,

“10-6-55

బెల్‌గ్రేడ్.

బెల్‌గ్రేడ్ లోని రైతు నాయకులైన ‘మచక్ – రాడిక్’ లాంటి రైతు నాయకుల్ని కలుసుకున్నాను. అంతే కాక వారి నుంచి రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్న మాట కూడా తీసుకున్నాను. మీరు కూడా రైతుల సంక్షేమం మరవద్దు.”

భారతీదేవి భర్త అడుగుజాడలలోనే నడిచారు. అంతేకాక రాయలసీమ కరువు నివారణ కమిటీ ప్రెసిడెంటుగా వుండి గుంటూరు జిల్లా కలెక్టరు గారి ద్వారా 190 బస్తాల ధాన్యాన్ని జిల్లాలోని తహసీర్దారులకు అందించారు. అంతకు ముందు కూడా 1940-41 లోనే గోదావరి వరదల కాలంలో కూడా 10,000 బస్తాల ధాన్యాన్ని సేకరించి పంపిణీ చేశారు. ఆంధ్రాలో ‘దయగల, కిసాను తల్లి’ అని పేరుపొందారు.

రంగా గారు రైతు సంక్షేమ పుస్తకాల వలన, పథకాల వలన ఆక్స్‌ఫర్డ్ లండన్ లాంటి ప్రాంతాల నుండి ఎన్నో అభినందన లేఖలు, ప్రశంసా పత్రాలు పొందారు.

రంగా గారు ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలతో, వ్యక్తులతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములను AGONY & SOLACE అనే పేరుతో గ్రంథస్థం చేశారు.

రంగా గారు చేసిన ఎన్నో సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991లో ‘పద్మభూషణ్’ పురస్కారంతో వారిని సత్కరించింది.

రైతు బంధు, ప్రజల మనిషి అయిన యన్. జి. రంగా జూన్ 9 1995 నాడు వారి స్వస్థలంలోని నివాసమైన ‘గోభూమి’లో తుదిశ్వాస విడిచారు.

నవంబరు 7 యన్. జి. రంగా గారి జయంతి సందర్భంగా వారికి నా నివాళులు.

[డా. జక్కంపూడి సీతారామారావు, M.B.B.S, L.L.M గుంటూరు లోని యన్. జి. రంగా ట్రస్టు నిర్వహకులు గారికి థన్యవాదములతో]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here