రాజకీయ వివాహం-13

0
12

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 13వ భాగం. [/box]

అధ్యాయం- 13

[dropcap]“ఏం[/dropcap]టండీ నన్నేదో దోషిని చేసినట్లు మాట్లాడుతున్నారు, నా పరిధిలో నాకు సాధ్యమైనంత నేను చేస్తూనే వచ్చాను. కానీ జనాల్లో మీ ప్రణాళికల కన్నా, రాహుల్ తండ్రి మరణం పట్ల సింపతీ ఎక్కువైంది. ప్రతీ న్యూస్ ఛానెల్ వాళ్ళు దుర్ఘటన జరిగిన స్థలంలో లభించిన వీడియోలు, జోగేశ్వరరావు గారి శరీరాన్ని తీసుకురావడం ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించడం జనం చాలా బాధ పడ్డారు, ఒక ప్రజానాయకుడికి ఇలాంటి దుస్థితి పట్టడం జనం జీర్ణించుకోలేకపోయారు.

కావాలంటే అది జరిగినప్పుడు అక్కడ ఉన్న మీ సిద్ధార్థను కూడా అడగండి మీకు తెలుస్తుంది. ఈ స్థితిలో జరిగిన ఎలక్షన్స్ మనం ఎన్ని అనుకున్నా కానీ, ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా కానీ అతనికి వోట్లు పడడం అనివార్యం.

నేను కూడా పెద్దగా ఆలోచించకుండా బరిలోకి దిగాను, అటువంటి టఫ్ కాంపిటీషన్‌ను ఎదుర్కోవాలంటే కొంత అఫ్ఫెన్సివ్‌గా ఉండక తప్పదు, రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరైనా చేసేది అదే. నిజం చెప్పాలంటే ఆ సమయంలో నన్ను కంటెస్ట్ చెయ్యమని బలవంతం చేసింది సిద్ధార్థనే, కనుక నాకన్నా ఎక్కువ అతనే బాధ్యత వహించాలి” చిరాకుగా అన్నాడు నాచిరెడ్డి. అతనిప్పుడు పార్టీ ఆఫీస్‌లో సిద్ధార్థ, ప్రసాద్ గారూ, ప్రియాంక ఇంకా వారి ఇతర అనుయాయిలతో భేటీ అయ్యి ఉన్నాడు.

ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అక్కడ చర్చ జరుగుతోంది, పార్టీ మొన్న జరిగిన బై ఎలక్షన్స్‌లో ఓడిపోవడం గురించి ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారు, అందరూ నాచిరెడ్డి రాహుల్‌పై చేసిన విమర్శలే అందుకు కారణం అని గొడవ చేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వాన్ని నిలదీసే స్థానంలో ఉన్న తమపార్టీ ఇప్పుడు ఏమి చెయ్యలేని స్థితిలోకి వచ్చేసింది.

నకునారెడ్డి గారి మరణం, హనుమంతరావు జనసమాజ్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి కావడం వీటన్నిటితో అస్సలు పార్టీలో ఏకాభిప్రాయం కుదరడం కష్టం అవుతోంది. ప్రసాద్ గారు రాహుల్ పైన అసెంబ్లీలో మాట్లాడడం అనుచితంగా ఉందని ప్రియాంక అంటే, కన్‌స్ట్రక్టివ్ ఫోర్సు పేరుతో ప్రియాంక చేపడుతున్న కార్యక్రమాలన్ని ఒక పద్ధతి ప్రకారం లేకుండా పార్టీ ఫండ్‌ను అనవసరంగా వృథా చేస్తోంది అని ప్రసాద్ గారి వర్గం విమర్శలు చేస్తోంది.

ఎవరికి వారే యమునాతీరే అన్న పద్ధతిలో ఉంది ప్రస్తుతం జె.హెచ్. పార్టీ. ఎవరిమీద, ఎవరికీ నియంత్రణ లేకుండా ఉన్నట్లు ఉంది, ఆఖరికి ప్రియాంక చొరవ తీసుకుని మాట్లాడడం ప్రారంభించింది

“మనమందరం ఇక్కడ మన ముఖ్య ఉద్దేశం మర్చిపోతున్నాం, ఇలా ఒకరినొకరు విమర్శించుకోవడం వలన మనకు నష్టం తప్ప లాభం లేదు. ఎవరి లోపాలు వారికున్న మాట వాస్తవమే అయితే మనం ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టిన తరువాత వాటన్నిటినీ పక్కనపెట్టి మన అందరి ఉమ్మడి లక్ష్యంపైన దృష్టి పెట్టాలి.

రాజకీయాలంటే కేవలం తీసుకోవడం మాత్రమే అని ఇప్పటివరకు చాలామంది నమ్ముతూ వచ్చి రాజకీయంలో ఉన్నవారు అందరినీ తక్కువగా చూడడం మొదలుపెట్టారు, అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే అందుకు మానాన్నగారు కూడా అతీతులు కాదు. ఇన్నాళ్ళుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన సాధించినది ఏంటని ఎప్పుడైనా ఎవరైనా అలోచించారా. సరే అదలా పక్కన ఉంచితే మనం ఇప్పటివరకూ జరిగిన పనులను ఎలాగో మార్చలేము.

భూషణరావు లాంటివారికి కొమ్ముకాసాము అనే బాడ్ రిమార్క్ ఎలాగో మన మీద ఉంది, అందుకే నాన్నగారు తన సొంత సంపాదన అంతా తన ఆఖరి సమయంలో పార్టీ ఫండ్ కింద మార్చమని నా దగ్గర ప్రమాణం తీసుకున్నారు, అంతే కాకుండా కొంతమంది స్వచ్ఛందంగా కూడా దానికి సహకరించారు. ఇప్పుడు నేను ఖర్చు చేస్తున్నదంతా దాని నుంచి తీసి చేస్తున్నదే. అయితే మీరందరూ కోరుకున్నట్లుగా దాన్ని పబ్లిసిటీకో, లేదా ప్రొటెస్ట్స్ చెయ్యడానికో కాకుండా వ్యవస్థకు ఉపయోగపడే పనులకు ఉపయోగిస్తున్నాను.

దీనివల్ల పార్టీ పలుకుబడి ప్రజల్లో పెరుగుతుందో తరుగుతుందో మీరే ఆలోచించండి. ఇంకా మీకు కావాలంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తాను వినండి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతీరోజు నాదగ్గరకు కొన్ని వందల మంది యువతీ యువకులు ఈ ఫోర్సులో చేరి వారివారి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి తమకు చేతనైన సహాయం చేస్తామని వస్తున్నారు.

వారికి నేను ఎటువంటి డబ్బులూ ఇవ్వడం లేదు, ఇంకా చెప్పాలంటే వారు పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదు. మన ప్రజల్లోకి విస్తుతంగా వెళ్తున్నాం మన లక్ష్యం ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు అని అర్థం చేసుకోవడానికి ఇంహకన్న గొప్ప నిదర్శనం ఏముంటుంది” తన మీద విరుచుకుపడుతున్న వారిని ఎదుర్కోవడానికి తను చేస్తున్న పనులు నిజాయితీగా చెప్పింది ప్రియాంక. ఈ సమయంలో సిద్ధార్థ కూడా ఆమెకు పెద్దగా సహాయపడలేకపోతున్నాడు.

“మేడం మీకు అస్సలు పాలిటిక్స్ గురించి తెలీదు. మీకు కనిపిస్తున్న వారు, మీకు సహాయపడతాం అన్నవారు అందరూ నిజంగా ఎలక్షన్స్ వచ్చేప్పటికి మీరెవరో కూడా మర్చిపోయి మీ ప్రత్యుర్ధలకు మాత్రమే ఓటేస్తారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ప్రసాద్ గారు రాహుల్ విషయంలో మాట్లాడినట్లు ఇదంతా వారికి ఒక ఫేషన్ లాంటిది. మీరు కూడా వారితో కలిసి సమానంగా పనిచేస్తారు. ఇంకా చెప్పాలంటే కొంతకాలం తరువాత వారిని మీరు చెప్పినమాట వినగలిగేలా చేసుకునే నాయకత్వ లక్షణం మీలో లేదు అని ఆఖరి క్షణంలో వారికి అనిపించినా అనిపించవచ్చు. ప్రజలెప్పుడూ తమ నిజాయితీని శంకించే వాళ్ళను పెద్దగా ఇష్టపడరు.

తాము ఇప్పటివరకూ చూడని నాయకత్వం ఏదీ లేదని కొత్తగా తమను మార్చగలిగే స్థాయి కలిగిన నాయకుడు లేడని ఎప్పుడో వాళ్ళ మదిలో పాతుకుపోయింది. మీకు ఇంకా ఈ విషయం అర్థం కావాలంటే ఒకటి రెండు ఎదురు దెబ్బలు తినాలి. అందులో నాచిరెడ్డి విషయంలో మొదటిది తగిలింది, ఇదే పద్ధతి కొనసాగితే కనుక రెండవ దానికోసం ఎక్కువ కాలం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ స్వస్తి చెప్పి నాలుగైదు బహిరంగ సభలు చేసి కేంద్ర రాష్ట్రాలకి మధ్య చిచ్చుపెట్టే విధంగా పత్రికల్లో ప్రకటనలు రిలీజ్ చేసి, కార్మికుల సహాయంతో రెండు మూడు బందులు చేసారనుకోండి ఖచ్చితంగా వచ్చేసారి మీరే సీఎం అవుతారు.

కనుక పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని అవగాహన, అనుభవం ఉండడం కూడా అంతే ముఖ్యం. అది టైం అయినా కావచ్చు, ఎనర్జీ అయినా కావచ్చు” ప్రసాద్ గారి తరఫున వకాల్తా తీసుకున్న ఒక సీనియర్ ఎమ్మెల్యే అన్నాడు. ఇటువంటి మానసిక ప్రవృత్తిని ఆమెను హర్షించలేకపోయింది, కానీ అంత అనుభవం ఉన్న ఆయన నోటినుంచి అటువంటి మాటలు రావడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.

ఆయన చెప్పినదాంట్లో నిజానిజాలు గురించి ఆలోచించడానికి కూడా ఆమెకు మనస్కరించడం లేదు. ఏదేమైనా ఇతరులను విమర్శించే స్థాయిలో కానీ, ఇతరుల సలహాలు పాటించే స్థాయిలో కానీ తానిప్పుడు లేదు, తన మనసులో ఉన్న ప్రణాళికనే లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగిపోతోంది, అది ఆమెను ఎక్కడికి తీసుకువెళ్తుందో కాలమే నిర్ణయించాలి. ఏమైనా తన లక్ష్యాన్ని మాత్రం మరువకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది.

“సరే ఇంక మాటలు అనవసరం, ఆ ధరణికోట ప్రాజెక్ట్ గురించి మళ్ళీ డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఈ అంశంలో పార్టీ అధ్యక్షులు తమ స్పష్టమైన అభిప్రాయం చెప్పవలసినదిగా కోరుతున్నాం. గతంలో జోగేశ్వరరావుగారి మరణానికి ముందర ఆ స్థలంపైన సుప్రీం కోర్టుకు వెళ్ళాలనే యోచనలో ఉన్నాము. అప్పుడు దానికి కారణం భూషణరావు నకునారెడ్డిగారి పైన ఒత్తిడి తీసుకురావడం ఆ విషయం అందరికీ తెలుసు.

అయితే ముఖ్యమంత్రిగారు మరణించిన తరువాత అధికార పక్షంతో కలిసిపోయి సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా తన స్థలం తను దక్కించుకున్నాడు. ఇంక రాహుల్ కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేడు అని అర్ధమయ్యింది. ఇది మనకి చాలా మంచి అవకాశం అనే చెప్పుకోవాలి, ఆ స్థలం మనం అధికారంలో ఉన్న సమయంలో మనమే కొంతమంది లబ్దిదారులకు అందజేసాము, అంతేకాకుండా అక్కడకి దగ్గరలో ఉన్న నాయుడుపల్లిలో ఉన్న తాండా వాళ్ళ సపోర్ట్ మనకి ఎలాగో ఉంది.

కనుక మనం కమ్యూనిస్ట్‌ల సహాయం తీసుకుని ప్రజల తరఫున పోరాడితే ఖచ్చితంగా మనం అధికారంలోకి రావచ్చు, ఇందుకు మనకు సహాయం చెయ్యడానికి ‘ఆదిత్యనారాయణ’ గారు సిద్ధంగా ఉన్నారు, దానితో మీరు ప్రజలకు చెయ్యాలి అనుకున్న పనులు కూడా చేసినట్లు అవుతుంది. కనుక మనం దీనిమీద కృషి చేస్తే మంచిది అని నా అభిప్రాయం” ప్రసాద్ గారు చెప్పారు. ఆయన ఈ విధంగా కూడా మాట్లాడగలరు అని ఆమెకు ఇప్పుడే అర్థం అయ్యింది.

ఆయన చెప్పిన ఇదే ‘ఆదిత్యనారయణ’ ఇంతకు మునుపు భూషణరావుతో కలిసాడు అన్న సంగతి మరి ఈయనకు తెలుసో లేదో, తెలిసినా బహుశా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఈయనకు కూడా ఉన్నదేమో ఎవరు చెప్పగలరు. ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో తెలుసుకునే స్థితిలో తను లేదు. ప్రతీ మనిషి, ప్రతీ చర్య వెనుకా ఏదో హిడెన్ ఎజెండా నమ్మే స్థితిలో ఉంది, కానీ ఆమె ఇప్పుడు అవన్నీ ఆలోచించాలీ అనుకోవడం లేదు.

తనకి శాశ్వతమైన పరిష్కారం కన్నా తాత్కాలికమైన ఉపసమనం మాత్రమే ఎక్కువ అవసరం అని ఆమెకు అనిపించింది. అందుకే వారితో ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా చెప్పకుండా “దాని గురించి మనం అసెంబ్లీ సమావేశం ఐన తరువాత మాట్లాడుకుంటే మంచిది, ఇంకా ఈ అంశంపైన ఎక్కువ గ్రౌండ్ వర్క్ చెయ్యాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. ఇతర ప్రతిపక్షాలు శాంతంగా ఉన్నాయంటే ప్రభుత్వాన్ని సమర్దిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది.

కనుక ప్రభుత్వ ప్రణాళికను పూర్తిగా అర్థం చేసుకుని, దాని ఫీజిబిలిటీని తయ్యారు చెయ్యవలసినదిగా సిద్ధార్థను కోరుతున్నాను. మీరు ఆయనతో కో-ఆర్డినేట్ అవ్వండి. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుందాం” అయిష్టంగానే తాను చెప్పినదానికి తలూపాడు ఎమ్మెల్యే ప్రసాద్, అక్కడితో సభ ఎటూ తేలకుండా ముగిసింది. ప్రస్తుతానికి ఎదురుదెబ్బలు తగలకుండా బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకుంది ప్రియాంక.

***

“హలో బాస్, ఏంటి ఆరోజు అస్సలు పలకరించినా తెలీనట్లు మాట్లాడకుండా వెళ్ళిపోయారు” జన సాంద్రత తక్కువున్న ప్రదేశంలో ఒక మూలగా ఒంటరిగా కూర్చుని విస్కీ తాగుతున్న ఆ వ్యక్తితో అన్నాడు గణేష్.

అతనిప్పుడు విశాఖపట్నంలోని ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నాడు, తను పలకరించిన వ్యక్తి తరచుగా ఆ ప్రదేశానికి వస్తాడు, అతనికి కొంచెం స్త్రీ వ్యామోహం ఉందని, ఆ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ మేనేజర్ అతనికి హెల్ప్ చేస్తూ ఉంటాడని, అని తను ఇక్కడికి వచ్చిన రెండు రోజులలోనే తెలుసుకున్నాడు, ఇందుకు అతనికి లోకల్‌గా పోలీస్ ఇన్ఫార్మర్ రాంపండు సహాయపడ్డాడు.

 “ఆ బాస్ నువ్వా, ఇంతకీ మనం ఎప్పుడు కలిసాం, నువ్వు నన్నెక్కడ పిలిచావ్” అడిగాడు ఆ వ్యక్తి, అతను బాగా మత్తులో ఉన్నట్లు గ్రహించాడు గణేష్.

“అదేంటి బాస్, ఆరోజు ఈవెనింగ్ ఎయిట్ థర్టీ ఆ టైములో ముంబైలో కలిసాము మర్చిపోయావా. నీతో పాటు గుండుగాడు కూడా ఉన్నాడు. మీరిద్దరూ కలిసి వెనక నుండి నేను పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నేను బాస్” అతని వంక చూస్తూ చెప్పాడు.

తను ఫాలో అవుతున్న లీడ్ ఎంతవరకూ నిజమో అతనికి తెలీదు కానీ, ఎందుకో సుకన్యకూ ఇతనికీ పరిచయం ఉండే అవకాశం ఉంది అని తనకి అనిపిస్తోంది. సుకన్య తల్లిదండ్రులు కూడా ఆమెకు కొంతమంది హై ప్రొఫైల్ మనుషులతో పరిచయం ఉందని, ఇదే విషయంలో నాచిరెడ్డితో తరచుగా మాట్లాడుతూ ఉండేదని చెప్పారు. అందుకే గత రెండు రోజులగా ఇతని చర్యలు గమనించే పనిలో ఉన్నాడు, ఇప్పుడు అవకాశం దొరకడంతో ఇతనితో మాట్లడుతున్నాడు.

కొంత సేపు తనని పైనుండి కిందవరకూ చూసి “అవునా, అస్సలు ఎవడ్రా నువ్వు. ఫేసు చూస్తే పెద్ద డకోటా గాడిలా ఉన్నావ్, నన్నెప్పుడు చూసావ్, అస్సలు నీకేం కావాలి” కొంచెం జోగుతూ గట్టిగా అడిగాడు. దూరంగా ఉన్నవాళ్ళు తనని చూడడంతో కొద్దిగా భయపడ్డాడు గణేష్. అమ్మో ఈ తాగుబోతు వెధవతో జాగ్రత్తగా డీల్ చెయ్యాలి లేదంటే మొత్తం ప్లాన్ అంతా నాశనం అవుతుంది.

“అదేంటి బాస్ ఇందాకానే నన్ను గుర్తుపట్టినట్లుగా ‘నువ్వా బాస్’ అన్నావ్ కదా. అప్పుడే నా గురించి మర్చిపోయావా నేను గణేష్‌ని ప్రతాప్” తన పేరు చెప్తే అయినా కనీసం గుర్తుపడతాడేమో అని అతనికి అనిపించి అన్నాడు.

“హమ్మా నా పేరు కూడా తెలుసుకున్నావ్, అంటే ఏంట్రా నేను తాగేసి ఉన్నాను, నాకు మనుషులు గుర్తుండరు అనే కదా నీ ఉద్దేశం, చెప్తా ఉండు” అని జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ‘షీ సెల్స్, సీ షెల్స్ ఆన్ దీ సీ షోర్’, ‘షీ సెల్స్, సీ షెల్స్ ఆన్ దీ సీ షోర్’, ‘షీ సెల్స్, సీ షెల్స్ ఆన్ దీ సీ షోర్’.. అని అదేపనిగా టంగ్ ట్విస్టర్ చెప్తూనే ఉన్నాడు, “నేను స్టడీగా ఉన్నాను అని చెప్పడానికి ఇది సరిపోతుందా నీ యబ్బా…” అని రెండు మూడు బూతులు తిట్టాడు.

బాబోయి వీడికి పూర్తిగా ఎక్కేసినట్లు ఉంది, ఇంకా ఎక్కువ సేపు ఉంటే ఇక్కడ గోలగోల చేస్తాడు అందుకే తన ఎదురుగా కూర్చుని ఉన్న రాంపండుకి సైగ చేసాడు, అతను తాము కూర్చున్నదగ్గరకి వచ్చి “అరెరే సూపర్ సార్, మీరు తమిళంలో కూడా చాలా బాగా మాట్లాడతారే” అతడిని సముదాయించాడు.

“ఏరా ఇంత కష్టపడి నేను హిందీ మాట్లాడితే, తమిళమని నన్ను ఎగతాళి చేస్తావా, నువ్వు అస్సలు నా ఫ్రెండువే కాదు, పదరా గణేష్ ఈ ఎదవ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మాట్లాడకుందాం” ఇప్పుడు ఆశ్చర్యపోవడం తన వంతైంది. సరేలే ఇది కూడా మన మంచికే అతని దారిలోనే వెళ్తే తమకి ఏమైనా ఆచూకి తెలియవచ్చేమో అని

“సరే రారా ప్రతాప్ మనం ఈ మిత్రద్రోహికి దూరంగా మీ రూంకి వెళ్లి మాట్లాడుకుందాం” రాంపండును చూసి కన్నుకొట్టి చెప్పాడు, ఇంతలో హడావిడి చూసి మేనేజర్ అక్కడికి వస్తే గణేష్ అతడిని పక్కకు తీసుకువెళ్ళి అతడిని సమాధానపరిచాడు. తను తిరిగి వచ్చేసరికి ప్రతాప్ రాంపండుతో మాట్లాడుతున్నాడు, అతను బాగా తూలుతూ ఉన్నాడు.

“అరేయ్ గణేష్, ఎందుకురా అలా మాటిమాటికీ కుక్కలా తిరుగుతూ ఉంటావ్, ఆ మేనేజర్ గాడితో ఏంటి పని నీకు” కోపంగా అడిగాడు ప్రతాప్.

“అబ్బే అదేమీ లేదు బాస్, రూమ్ కి వెళ్దాం అన్నారు కదా, ఒక్కసారి కీస్ తీసుకుందాం అని ఆయన్ని అడిగాను అంతే” చెప్పాడు గణేష్.

“అరేయ్ నువ్వొట్టి ఫూల్‌విరా, ఫష్ట్ నా దగ్గర లేవంటే కదా ఆయన్ని అడగాలి, మరి నా దగ్గర ఉన్నాయా అని నన్ను అడిగావా?” వారిద్దరి వంకా చూస్తూ అన్నాడు ప్రతాప్

“అవును సారీ, అయితే పదా రూమ్‌కి వెళ్దాం” అతడిని లేపడానికి ప్రయత్నిస్తూ అన్నాడు గణేష్, రాంపండు.

“ఎక్కడికి వెళ్ళేది, నా దగ్గర కీస్ లేవు కదా, వెళ్లి ఆ మేనజర్ గాడినే అడుగు” ఒక్కసారి గణేష్, రాంపండు ముఖముఖాలు చూసుకున్నారు, వాళ్ళిద్దరినీ చూసి పగలబడి నవ్వాడు ప్రతాప్, రాంపండు వెళ్లి మేనేజర్‌ని అడిగి కీస్ తీసుకుని వచ్చాడు. ఇద్దరూ సాయం పట్టి అతడిని పై ఫ్లోర్‌లోకి తీసుకెళ్తున్నారు.

“మనమిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి” అడిగాడు గణేష్.

“ఆ నేను చెప్తా నేను చెప్తా, నా వెనకాల వచ్చెయ్యండి” అని వాళ్ళని వదిలేసి పరుగులు తీసాడు, వాళ్ళిద్దరూ మెట్ల మీద అతడిని వెంబడించారు, కొంత సమయం తరువాత.

“పదండి ఇదే మన రూమ్, అరేయ్ పండూ నువ్వెళ్ళి డోర్ అన్లాక్ చెయ్యరా” ఆయాసపడుతూ గణేష్‌తో పాటుగా వచ్చిన పక్కనున్న వ్యక్తితో అన్నాడు ప్రతాప్, అతని వంక గణేష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

“హరే, నా పేరు మీకెలా తెలుసు, మీకేమైనా మైండ్ రీడింగ్ అలాంటిది వచ్చా” అడిగాడు రాంపండు.

“మైండ్ రీడింగా నీ బొందా, ముందు తాళం తియ్యి బే” వీడి హడావిడి బాగా ఎక్కువైంది అని మనసులో అనుకుని తాళం తీస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా తాళం తెరుచుకోవడం లేదు

“ఏంటి సార్, తాళం ఓపెన్ అవ్వడం లేదు, అస్సలు మీ రూమ్ ఇదేనా” అనుమానంగా అడిగాడు

“తెరుచుకోవడం లేదా, ఛాన్స్ లేదే ఇది సిక్స్త్ ఫ్లోర్ ఏనా” అడిగాడు ఇద్దరూ.

 “అరేయ్ ఇది నైంత్ ఫ్లోర్ రా, సిక్స్త్ ఫ్లోర్ దాటి మూడు ఫ్లోర్స్ పైకి వచ్చేసాం. ఇందాకాటి నుంచి పెద్ద పోటుగాడిలాగ రండి రండి గోల చేసి తీసుకోచ్చావ్ మమ్మల్ని” ఇంక అతనితో మర్యాదగా మాట్లాడి లాభం లేదని కోపంగా అన్నాడు గణేష్.

“అరేయ్ సారీరా, నేను కొంచెం డ్రింక్ చేసి ఉన్నాను కదా, మీరైనా కొంచెం ఆలోచించాలి కదరా” వాళ్ళకి నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదు.

“ఛీ ఈ తాగుబోతు వెధవ మాటలు నమ్మి వచ్చినందుకు, మన చెప్పుతో మనమే కొట్టుకోవాలి” అని మనసులో అనుకుని మళ్ళీ ప్రతాప్‌ను తీసుకుని లిఫ్ట్‌లో కిందకి దిగి సిక్స్త్ ఫ్లోర్ లోని రూమ్ నెంబర్ అరవై తొమ్మిదిలోకి వెళ్ళారు ముగ్గురూ.

“సారీ నెంబర్ తొంబై ఆరు కదా, కీ చెయిన్‌కి ఉన్న నెంబర్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే” సంజాయిషీ ఇస్తున్నట్లుగా చెప్పాడు అతను.

“సరేలే ఇంక పదా లోపలికి” ముగ్గురూ కలిపి లోపల వున్న డబుల్ బెడ్ మీద కూర్చుని వున్నారు.

“ఈరోజు మనం ముగ్గురం కలుసుకున్న ఈ శుభ సందర్భంలో, నేను మీ అందరికీ పెద్ద పార్టీ ఇవ్వదలచుకున్నాను” కాసేపు కబుర్ల తరువాత అనౌన్స్ చేసాడు ప్రతాప్.

“బాస్ బాస్, ఇప్పటికే ఓవర్ అయ్యింది, ఇప్పుడెందుకు లెండి పార్టీలు అవన్నీ. సరదాగా మాట్లాడుకుందాం కూర్చోండి” ఏమనుకున్నాడో ఏమో కానీ పెద్దగా మాట్లాడకుండా కూర్చున్నాడు.

“సరే బాస్, మీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారా?” అడిగాడు గణేష్.

“అవును బిజినెస్ మీటింగ్స్‌కి ఈ హోటల్‌నే ఎంచుకుంటూ ఉంటాను, మా డాడీ పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి, ఇప్పుడు జనసమాజ్ పార్టీలో చేరాడు, మాకు ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్‌లు ఉన్నాయి, నేను వస్తూనే ఉంటాను, ఈ మేనేజర్ కూడా మనకి ఫుల్ సపోర్ట్ మనకి అవసరమైనవి అన్నీ సప్లై చేస్తూ ఉంటాడు” అని చెప్పి వారి వంక చూసి కన్నుకొట్టాడు, వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు.

“అవునా మరి ప్రాబ్లం ఏమీ అవ్వదా” తనకు విషయం తెలీనట్లుగా అతనితో మాట్లాడించాలి అని అడిగాడు.

“కమాన్ బాస్, చెప్పాను కదా మా బాబు పెద్ద బిజినెస్మెన్ అని మాకు ఈ రాష్ట్రంలో తిరుగు లేదు, ఏ గవర్నమెంట్ అయినా మన పాకెట్లో ఉండవలసిందే” గర్వంగా చెప్పాడు అతను, కొంతసేపటి తరువాత ఏదో అనుమానం కలిగినట్లు.

“అవును ఏంటి నా గురించి ఆరా తీస్తున్నారు, కొంపతీసి మీరిద్దరూ సిబిఐ ఆఫీసర్లు కారు కదా” అడిగాడు ప్రతాప్.

“అరే మేమెక్కడ అడిగాం సార్, మీరే కదా మీ అంతట మీరే చెప్పారు” కొంచెం ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు రాంపండు.

అతను అలా అనడంతో గణేష్ ‘ష్’ అని నిశ్శబ్దంగా ఉండమన్నట్లుగా నోటిమీద వేలు వుంచి హెచ్చరించాడు. గణేష్ రాంపండుని సహాయం చెయ్యమని అడిగినప్పటి నుంచీ రాంపండు అతనితోనే ఉండి, తనకు తెలిసిన రౌడీ షీటర్లు, ఇతరు రఫ్ క్యారెక్టర్ల గురించి అతనికి వివరాలు అందిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అమ్మాయిలతో ప్రతాప్ ఇక్కడికి వస్తాడని, ఆ సమయంలో అతని దగ్గర తన బాడీగార్డులు కానీ, తనతో పాటుగా పనిచేసే రౌడీలు కానీ ఉండరని తెలుసుకుని, ఒక అమ్మాయి ద్వారా అతడు ఈ హోటల్‌కి వచ్చే ఏర్పాటు చేసారు వాళ్ళిద్దరూ.

“ఒకే అయితే మీకు సుకన్య గారు తెలిసే ఉండాలి” డైరెక్ట్‌గా పాయింట్ కి వస్తూ అడిగాడు.

“ఏయ్ దొంగా, ఎప్పుడూ నీకు అమ్మాయిల గురించే గొడవ. అవును సుకన్య తెలీకపోవడం ఏంటి, మాజీ కేంద్రమంత్రి నాచిరెడ్డి వైఫ్ కదా.ఆ సుకన్యా తెలుసు, దాని బాయ్ ఫ్రెండ్ చరణ్ గురించి కూడా తెలుసు, నాకు ఒక పార్టీలో పరిచయం అయ్యింది. దగ్గరకి రండి, చెవులో చెప్తా ఎవరికీ చెప్పకండి”

ఇద్దరూ కుతూహలంగా అతనికి దగ్గరగా వెళ్లారు “మా బాస్ చెప్పడంతో నేనే ఆమెను ఆ పార్టీకి పిలిచాను, ఆ చరణ్ గాడిని పరిచయం చేసుకుని వాడికి ఒక ఫారెన్ టూర్ స్పాన్సర్ చెయ్యడంతో వాడి నమ్మకం గెలుచుకుని ఆ సుకన్యను పార్టీకి ఇన్వైట్ చేసాం” వాళ్ళకి ఈ విషయం వారికి చాలా కొత్తగా అనిపించి అతడిని మళ్ళీ అడిగాడు గణేష్.

“మీ బాస్ అంటే మీ నాన్నగారు భూషణరావు గారా?”

“ఆహాహాహ” గట్టిగా నవ్వుతున్నాడు ప్రతాప్.

కొంత సేపు అలా నవ్విన తరువాత అతను పడిపోయాడు, ఇంక ఎంత కదిపినా అతనిలో చలనం లేకపోయేసరికి ఇంక అతడిని అక్కడే వదిలేసి అక్కడ నుండి బయటపడ్డారు వారిద్దరూ.

***

“నమస్తే సార్, నన్ను గుర్తు పట్టారా?” అడిగాడు ఆ పెద్దమనిషి, ఫుల్ సూట్లో ఉన్న ఆయనను చూసిన ప్రతీసారి నాచిరెడ్డికి ఎక్కడ లేని కోపం, నిస్సత్తువ కలుగుతుంది, కానీ తాను ఏమీ చెయ్యలేని పరిస్థితి, తాను ప్రస్తుతానికి ఇంకా బెయిల్ మీదే ఉండడం వలన అతను ప్రతీ ఒక్కరిని ఎంతో మర్యాదతో చూడవలసిన అవసరం కలుగుతోంది.

గత రెండు సంవత్సరాలుగా తాను హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఉన్న అంత కాలంలో కనీసం ఒక పది పదిహేను సార్లు ఈ పెద్దమనిషి ఎంక్వైరీ పేరుతో తనని కలుస్తూనే ఉన్నాడు. అతని పేరు జగదీశ్వరరావు, సిబిఐ డిప్యూటి సూపరింటెండెంట్. ప్రస్తుతం తన భార్య కేసును ఆయనే డీల్ చేస్తున్నాడు. తనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గతంలో ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో జోగేశ్వరరావుగారి హస్తం ఉంది.

అయితే ఆయన మరణానంతరం కూడా ఇతను తనని వదలకుండా హింసిస్తున్నాడు అంటే దీనికి కారణం ఏమై ఉంటుందో నాచిరెడ్డికి అర్థం కావడం లేదు. తన మరణంతో తనకి సంబంధం ఉందనే విషయం ఆయన ధృడంగా నమ్ముతున్నాడు, అందుకే తనను నీడలా వెంటాడుతున్నాడు. తన భార్య ఎలా మరణించింది అన్నది ఇప్పటికి కూడా తనకు మిస్టరీగానే ఉంది. అప్పటినుంచీ ఆయన తన కూతురిని కూడా ఎక్కువగా కలవడం లేదు, పాప సుకన్య తల్లిదండ్రులతోనే ఉంటోంది.

“సార్ మీరు నన్ను ఎన్ని సార్లు ప్రశ్నించినా, ఎన్నిసారి టైంలైన్‌ని రీ వెరిఫై చేసినా కానీ మీకు కొత్తకొత్త ఇన్ఫర్మేషన్ తెలీదు. నాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది, నేను గతంలో సెంట్రల్ మినిస్టర్ చేసాను అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. అందుకని గవర్నమెంట్ యొక్క అమూల్యమైన కాలాన్ని, వనరులని వేస్ట్ చెయ్యడం నాకు ఇష్టం ఉండదు.

ఇప్పటికే నా పార్టీ రాజకీయాలు, సొంత బిజినెస్‌లో లాసెస్‌తో నేను పీకల్లోతు ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను, మీరు మళ్ళీ మళ్ళీ ఈ కేసును ప్రోబ్ చెయ్యడం వల్ల ఉపయోగం లేదు” బాధపడుతూ అన్నాడు నాచిరెడ్డి, వాళ్ళిప్పుడు తన ఇంట్లోనే ఉన్నారు.

“ఆ చక్రి, మీరు కొంచెం నెక్స్ట్ రూమ్‌లో వైట్ చెయ్యండి, సార్ మిమ్మల్ని చూసి నెర్వస్ అవుతున్నాడు, ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే, నేనే మిమ్మల్ని పిలుస్తాను. ప్లీజ్” అని చెప్పగానే ఆయన సోఫా వెనుక సెక్యూరిటీలాగ నిలబడిన చక్రధర్ అనే వ్యక్తి ఇంకా అతనిలాంటి ఆయన సబ్ ఆర్డినేట్స్ కొంతమంది వెనకకు వెళ్ళారు.

“కమాన్ సార్, ఎంతో అవసరం ఉంటే తప్ప నేను మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యను అని తెలుసు కదా. పైపెచ్చు ఇప్పుడు నకునారెడ్డి గారి కేసు ఇన్వెస్టిగేషన్ కూడా సెంటర్ మమ్మల్నే చేయ్యమంది. ఈ సందర్భంగా జరిగిన ఇన్వెస్టిగేషన్లో మాకు కొంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. రీసెంట్‌గా మా హెడ్‌క్వార్టర్స్‌కు ఒక అనానిమస్ టిప్ అందింది.

ఆ టిప్‌ను ఫాలో అయితే మాకు ఒక సెల్ ఫోన్ దొరికింది, పూర్తిగా పాడైపోయిన ఆ సెల్ ఫోన్‌లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని నాకు అనిపిస్తోంది. మా అనాలిసిస్ టీం ఆ ఫోన్‌ను రీస్టోర్ చెయ్యడంలో చాలా బిజీగా ఉన్నారు” ఆయన చెప్పాడు.

“అవునా అయితే దానికీ నాకూ సంబంధం ఏంటి. అది నా ఫోన్ అనా మీరు అంటున్నది” చిరాకుగా అన్నాడు.

“ఊరుకోండి మీరూ, మీ జోక్స్. మీ టెన్షన్ నేను అర్థం చేసుకోగలను, మాకు వచ్చిన ఆ సోర్స్‌ను ట్రేస్ చేస్తే అది విశాఖపట్నం ఏరియా నుండి వచ్చినట్లుగా తెలిసింది, అంతే కాదు అది మీ ఇంటి దగ్గరలోనే ఉన్నట్లుగా కూడా తెలిసింది, సరే మాకు ఈ వివరాలు తెలియపరిచి కేసులో ఒక కొత్త కోణం తెరిచే విధంగా చేసిన ఆ వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తే మాకు డెడ్ ఎండ్ తగిలింది.

అంటే అతనెవరో కానీ తన ఉనికి తెలీకుండా జాగ్రత్తపడుతూ మాకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నట్లుగా ఉన్నాడు. అంతేకాకుండా అతను మీకు చాలా దగ్గరగా తెలిసిన వ్యక్తి అయ్యి ఉండాలి అని నా అనుమానం, అందుకనే అలాంటి వారు ఎవరైనా మీకు తెలిస్తే కనుక మీరు కొ ఆపరేట్ చేస్తే, మీకు ఈ టెన్షన్స్ ఏమీ లేకుండా మీరు పాలిటిక్స్ చేసుకోవచ్చు, నేను నా డ్యూటీ చేసుకోవచ్చు. అందరం హాపీగా ఉండచ్చు, ఏమంటారు” అడిగాడు జగదీశ్వరరావు. ఆయన అలా అనడంతో తన అరికాలి మంట నెత్తికెక్కినట్లు అయ్యింది.

“అంటే ఏంటండీ, ఇప్పటివరకూ నేను మీకు కో ఆపరేట్ చెయ్యలేదు అనా మీ ఉద్దేశం. దిస్ ఈజ్ టూ మచ్, ఆ సిగ్నల్ ఏదో మా ఇంటికి దగ్గర నుంచి వస్తే, దానికీ నాకు సంబంధం ఏంటి, మా ఇంటి చుట్టుపక్కల ఎంతోమంది ఉంటున్నారు కదా, వారందరినీ ఎందుకు అడగడం లేదు, నా ఒక్కడిమీదే ఎందుకు కాంసంట్రేట్ చేస్తున్నారు” ఆవేశంతో అన్నాడు నాచిరెడ్డి

“ఎందుకంటే ఆ కేస్తో కానీ, ముఖ్యమంత్రి కేసుతో కానీ వారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి, మీకు ఉంది కాబట్టి, మీరు బెయిల్‌పై ఉన్నారనే విషయం మర్చిపోకండి, అవసరమైతే నేను మళ్ళీ మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళి క్వశ్చన్ చెయ్యగలను.

మీ భార్య కేసుతో పాటుగా, ఈడీ కేసు నుంచి తప్పించుకున్నారు అని సంబరపడిపోకండి. అన్నీ ఇంటర్ లింక్డ్ ఇక్కడ. మీమీద దాదాపు నాలుగు కేసులు వరకూ మోపబడి ఉన్నాయి, ఇంకా మీ ఆస్తులని జప్తు చెయ్యలేదంటే అది మీ అదృష్టం అని తెలుసుకోండి” తను కూడా ఏ మాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చాడు జగదీశ్వరరావు.

నాచిరెడ్డికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు, తనకి పూర్తి సహకారం ఇస్తామన్న పార్టీవారు కూడా ఇప్పుడు ఏమీ స్పందించకుండా, తమ పని తాను చూసుకుంటున్నారు. ఈ మధ్య సిద్ధార్థ కూడా తనతో ఎక్కువగా మాట్లాడడం లేదు, తన బావమరిది బిజినెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఈయనతో గొడవపడడం వలన లాభం లేదనిపించింది, కానీ ఇతని మూర్ఖత్వాన్ని తాను భరించలేకపోతున్నాడు అయినా కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితి.

“ఒకే సార్, నాకైతే అలాంటి వారు ఎవరూ తెలీదు, ఒకవేళ ఎప్పుడైనా అలాంటివారి గురించి విన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మీకు తప్పకుండా చెప్తాను, ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా సహకారం అందిస్తాను, నా భార్య మరణం గురించి దాని వెనుక ఉన్న నిజానిజాల గురించి తెలుసుకోవాలని నాకు కూడా ఉంది.

ఈ ఈడీ కేసులో నిజం లేదు సార్, అవన్నీ జోగేశ్వరరావు గారి పొలిటికల్ అజెండా ప్రకారం నామీద మోపబడిన కేసులు తప్ప ఆ టైములో నేనేమి నా పవర్స్ మిస్ యూజ్ చెయ్యలేదు, ఫాక్ట్స్ అన్నీ మీ కళ్ళముందే ఉన్నాయి, ఇంక మిగిలినది మీ చేతిలోనే ఉంది, తరువాత మీ ఇష్టం” అని కాళ్ళబేరానికి వస్తున్నట్లుగా అన్నాడు నాచిరెడ్డి

“ఎనీవే ఫాక్ట్స్ అనేవి అవసరం ఐన టైములో వాటంతట అవే బయటపడతాయి, మీరేమి టెన్షన్ పడకండి, మీరు మాకు హెల్ప్ చేసినంత కాలం మేము మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను, మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యండి” ఉంటాను అని చెప్పి తన సిబ్బందిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జగదీశ్వరరావు. ఆయన వెళ్ళిపోయినా తరువాత బాగా అలోచించి ఏమి చెయ్యాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక నెంబర్ ఫోన్ చేసాడు నాచిరెడ్డి.

“నేను అర్జెంట్ గా భూషణరావుగారిని కలవాలి అనుకుంటున్నాను, తేజా నువ్వు ఏమి చేస్తావో తెలీదు కానీ, ఇమ్మీడియేట్‌గా మీటింగ్ అరేంజ్ చెయ్యి” ఎప్పుడూ లేనిది సడెన్‌గా తన బావ తనకి ఫోన్ చెయ్యడం చాలా విచిత్రంగా అనిపించింది. “సరే తప్పకుండా చేస్తాను బావా, డోంట్ వర్రీ” అని హుషారుగా సమాధానం చెప్పాడు, అది పట్టించుకోకుండా హడావిడిగా ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు నాచిరెడ్డి”

***

“ఆ రండి రండి నాచిరెడ్డిగారు మనం వేరే పార్టీ వాళ్ళం కదా, మీ గాలి ఇటువైపు మళ్ళిందేంటి. దీంట్లో ఏదైనా రహస్యం ఉందా” అడిగాడు భూషణరావు.

“మీకు తెలియని రహస్యం ఏముంటుంది సార్, మొత్తానికి మీకు వ్యాపారంతో పాటు రాజకీయం కూడా బాగానే వంటపట్టినట్లు అయ్యింది” భూషణరావుతో వాళ్ళింట్లో కలుసుకోవడానికి ఏర్పాట్లు చెయ్యడం జరిగింది.

“ఏం చేస్తాం సార్, మా వ్యాపారం కాపాడుకోవాలి అంటే మీ రాజకీయం ఎప్పటికీ అవసరం ఉంటుంది కదా, అందులోనూ మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం చేసుకోగల అవకాశం కూడా నాకు దీనివల్ల లభించింది. నకునారెడ్డి గారు ఉన్న సమయంలో మనం పెద్దగా కలుసుకోకపోయినా నాకు మీ గురించి పూర్తిగా తెలుసు, ఏంటో అవసరం ఉంటే తప్ప రెండు వేరు వేరు వర్గాలకు చెందిన మనం కలుసుకోవడం జరగదు. చెప్పండి ఏమి పని మీద వచ్చారు” అడిగాడు భూషణరావు.రాజకీయాల్లోకి వచ్చిన దగ్గరనుంచీ ఆయన తన సెక్యూరిటీ బాగా పెంచుకున్నాడు. సూటిగా ఆయన ఆ ప్రశ్న అడిగేసరికి ఏమి చెప్పాలో అర్థం కాలేదు.

“ఏముంది సార్, ఇందాకా మీరు అన్నట్లుగా మనకి ఒకరి అవసరం ఒకరికి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఇప్పుడు రెండు రకాలుగా కూడా బాగా డిమాండ్ ఉన్న వ్యక్తి అని నాకు అనిపిస్తోంది. కాదంటారా చెప్పండి?” ఆయనను తిరిగి ప్రశ్నించాడు నాచిరెడ్డి.

“అయితే ఇప్పుడు మీరు ఏ రంగంలో నా నుంచి సహాయం అర్ధించడానికి వచ్చారు” వచ్చిన విషయం చెప్పకుండా అతను అలా సాగదీయడం ఆయనకు కొంచెం అసహనం కలిగించింది. నిజానికి ఇతని సెక్రటరీ తనకి ఫోన్ చేసినప్పుడే ఏదో విషయం ఉంటుందని గ్రహించగలిగాడు.

“రంగం ఏదైనా కానీ ప్రస్తుతానికి నేను రెండిటిలోనూ నష్టపోయి ఎటు వెళ్ళాలో తెలీని పరిస్థితుల్లో ఉన్నాను సార్. గతంలో జరిగిన ఎన్నికల్లో జనసమాజ్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి మమ్మల్ని ఓడించింది, ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది, రాహుల్ పైన పోటీ చేసిన నేను దారుణంగా ఓడిపోయాను. దాంతో పొలిటికల్‌గా నా ఇమేజ్ మొత్తం ఖరాబు అయిపోయింది, అస్సలు క్రితం సారి ఓడిపోయినప్పుడే నేను మళ్ళీ రాజకీయల్లోకి రాకుండా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను.

కానీ నకునారెడ్డి గారి అనారోగ్యం వల్ల అది కుదిరింది కాదు, ఆ తరువాత నా భార్య మరణం నా అరెస్ట్, జె.హెచ్. పార్టీ వాళ్ళు బెయిల్ ఇప్పించడం ఇవన్నిటితో నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాల్సిన కలిగింది. అయితే అన్ని సమయాలు మనం అనుకున్నట్లుగా ఉండవు కదా. ఎందుకో, ఎవరు ప్రోద్బలం మీదో తెలీదు కానీ సిబిఐ వారు నన్నింకా వెంటాడుతూనే ఉన్నారు.

వాళ్ళు మాటలని బట్టి నా ఆస్తులని జప్తు చేసి నా భార్య మరణం నామీద రుద్దాలని చూస్తున్నారు, నాకెటువంటి సంబంధం లేని ఈ కేసులో బాధితుడుగా ఉండవలసిన నేను నిందితుడుని అవ్వడం విచారించదగిన విషయం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ప్రూఫ్ చూపించమనండి, వాళ్ళు మైండ్‌లో ఒక థియరీ పెట్టుకుని దాన్ని ఎలాగైనా నిజం చెయ్యాలని సాక్ష్యాలు సృష్టించే పనిలో పడ్డారు, ఎవరో వారిని ఈ విధంగా భావించేలా చేస్తున్నారని నా అభిప్రాయం” భూషణరావు వంక నిస్సహాయంగా చూస్తూ అన్నాడు నాచిరెడ్డి, భూషణరావు అతని చివరిమాటలను పెద్దగా పట్టించుకోలేదు.

“నాకు మాపార్టీ నుండి ఎటువంటి సహాయం లభించడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రియాంక నేతృత్వంలో వారందరూ అంతర్గత కలహాల్లో మునిగి ఉన్నారు, నా గురించి పట్టించుకునే వారే లేరు. పై నుంచి మా బావమరిదితో పార్టనర్‌షిప్ ఉన్న నా వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది, ఈ సమయంలో సిబిఐ వారు పదేపదే నన్ను ప్రశ్నించడం, దానిపై వార్తా పత్రికల్లో, టీవీల్లో భిన్న కధనాలు రావడం ఏమంత మంచి విషయం కాదు.

ఒకరకంగా చెప్పాలంటే అది నా వ్యాపారానికి పెద్ద నష్టం లాంటిది. దానికి తోడుగా బెయిల్‌కి సంబంధించిన ఎమౌంట్ గురించి కూడా పార్టీ వాళ్ళు నన్ను సర్దమంటారేమో అని నాకు ఈమధ్యనే భయం కలుగుతోంది. ఇటువంటి సమయంలో కేవలం మీరు మాత్రమే నాకు సహాయం చెయ్యగలరు” ఆయన వంక చూస్తూ చెప్పాడు నాచిరెడ్డి

“నేను వింటున్నాను చెప్పండి” అన్నాడు భూషణరావు

“ఏమీ లేదు, మీరు జనసమాజ్ పార్టీ తీసుకునే కీలకమైన నిర్ణయాలను ప్రేరేపించే స్థాయిలో ఉన్నారనే విషయం తెలిసింది, పార్టీ అధ్యక్షుడు రాహుల్ అయినా కానీ హనుమంతరావు వారి బృందం అంతా మీ చేతుల్లోనే ఉందని ఊళ్ళో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. అందుకే నేను జనసమాజ్ పార్టీలో చేరే అవకాశం కల్పించడానికి మీరు సహాయపడవలసినది కోరుతున్నాను” ఆఖరికి తన మనసులో విషయాన్ని బయటపెట్టాడు నాచిరెడ్డి.

“ఓ, ఇది నేను అస్సలు ఊహించని విషయం. ఎంత లేదనుకున్న మీ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే జె.హెచ్. పార్టీతో కదా, మరి మీ పార్టీలో ఉన్న సిద్ధార్థ, ఎమ్మెల్యే ప్రసాద్ వీరి వర్గం, ప్రియాంక వీళ్ళందరి సంగతేంటి వీరు మీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారా?” ఆశ్చర్యపోతూ అడిగాడు భూషణరావు.

“నిర్ణయం అంటూ జరిగిపోయిన తరువాత ఇంక వాళ్ళు ఏమనుకుంటే నాకేమి నష్టం చెప్పండి. నాకు తెలిసి వాళ్ళు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు, మీలాంటి పెద్దల అండతో మళ్ళీసారి కూడా జనసమాజ్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనడం అతిశయోక్తి కాదు. అసెంబ్లీలో ప్రసాద్ రాహుల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసాయి.

ఇంక ప్రియాంక, సిద్ధార్థ ఇలాంటి కొత్తవాళ్ళు పెద్దగా చెయ్యగలిగినది ఏమీ లేదు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న రీతిన ఉన్నాయి. ఇవి నేను అంటున్న మాటలు కావు, నాకు తెలిసిన ఆన్లైన్ ఛానెల్ వాళ్ళు నిర్వహించిన సర్వేలో వెల్లడైన నిజాలు” ఆయనతో అన్నాడు నాచిరెడ్డి.

“అలా అయితే ఒకప్పుడు మీరు కూడా రాహుల్‌ని విమర్శించారు, నాకు తెలిసి అప్పుడు ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. మరి అలాంటప్పుడు మీరు పార్టీకి అవసరం అవుతారు అని ఎలా అనుకోగలుగుతాము.” అడిగాడు భూషణరావు

“అందుకే కదా నేను రాహుల్ దగ్గరకి కాకుండా మీ దగ్గరకు వచ్చాను, పేరుకి నేను రాజకీయ నాయకుడిని అయినా నా మెయిన్ ఇంట్రెస్ట్స్ వేరే ఉన్నాయి, అవేంటో మీకు తెలిసే ఉంటాయి. నేను మీ జనసమాజ్ పార్టీకి అవసరం లేదనే విషయం నాకు తెలుసు, కానీ నాకు మీ పార్టీ అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ నిర్ణయాలను ప్రేరేపించగల మీ అవసరం ఎక్కువగా ఉంది. దానివల్ల ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మీకు ప్రయోజనం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒక్కసారి ఆలోచించండి” అభ్యర్దిస్తున్నట్లుగా అడిగాడు నాచిరెడ్డి.

కొంతసేపు ఆలోచించిన తరువాత భూషణరావు “సరే మీరు అన్నట్లుగానే మీరు మా పార్టీలో చేరారు అనుకోండి, మాకు అమాంతం కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి”

“అంటే మీరు గొప్ప వ్యాపారవేత్తలు, ఏ బిజినెస్‌లో అయినా నమ్మకమే పునాది అన్న విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంటాను” అతను అన్నదానికి సాలోచనగా తల పంకించాడు భూషణరావు.

***

“ఒక మనిషిలో ఒక లోపం ఉంటే, ఒక వ్యవస్థలో వంద లోపాలు ఉంటాయి. మరి అలాంటి లోపాలతో కూడుకున్న వ్యవస్థలో ప్రతీ అంశంలో పారదర్శకత కోరుకోవడమంటే మూర్ఖత్వమే అవుతుంది. ఒక వ్యక్తి తీసుకునే ప్రతీ నిర్ణయానికి జవాబుదారీగా ఉండాలంటే సగానికి సగం పనులు ఇంకా ప్రారంభించక ముందే ఆగిపోతాయి.

ప్రతీ విషయానికి ఎకౌంటబిలిటీ అవసరమే, అయితే అది వ్యక్తులకు మాత్రమే పరిమితమై అవసరమైన వాళ్ళకే లిమిటెడ్‌గా సమాధానం చెప్తూ సత్వరం నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటే పనులు వేగవంతం అవుతాయన్నది నా అభిప్రాయం”

సొసైటీ ఫర్ డెమోక్రాటిక్ ఎకౌంటబిలిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సు ఇది, ఈ సదస్సులో న్యాయశాస్త్రం, అర్ధశాస్త్రం, రాజకీయం ఇత్యాది రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు పాల్గొన్నారు, ఆ సభకు గౌరవ అధ్యక్షత వహించవలసిందిగా జె.హెచ్. పార్టీ ప్రెసిడెంట్ ప్రియాంకను కోరడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన డిబేట్‌లో ఒక యువకుడు తన భావాలను ఈ విధంగా వ్యక్తపరిచాడు. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తి శర్మగారు కూడా పాలుపంచుకున్నారు.

ఆయన సభను ఉద్దేశించి మాట్లాడుతూ “ఒకే మిస్టర్, మీరు అన్నదాని ప్రకారమే చూస్తే కనుక లోపభూయిష్టంగా ఉన్న వ్యవస్థ ముందుకు సాగాలంటే ప్రతీ ఒక్కరిలో చిత్తశుద్ధితో పాటుగా జవాబుదారీతనం కూడా ఉండాలి. అది లేని పక్షంలో స్వీయ నియంత్రణ లేని సమాజంలో మనం నివసిస్తున్నట్లు అవుతుంది, దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. అలాంటివారు అందరూ ఒకచోట చేరారు అనుకోండి అప్పుడు వారు తీసుకునే సత్వర నిర్ణయాలకు అధికశాతం ప్రజలు నష్టపోతారు. అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ప్రతీవ్యక్తిలో పారదర్శకత అవసరం, ముఖ్యంగా ప్రభుత్వ రంగం ఇతర అనుసంధాన ప్రజాప్రయోజన రంగాల్లో ఇది చాలా చాలా అవసరం. వై బికాజ్ మోర్ ఆర్ లెస్ అవర్ లైవ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్. కాదంటారా?” ఆయన అడిగాడు, అందరూ అపారమైన ప్రజ్ఞ కలిగిన ఆయన మాటలను ఆసక్తిగా వింటున్నారు.

విశాలమైన ఆ సభా ప్రాంగణం సెంట్రలైజ్డ్ ఏసీ చెయ్యబడి ఉంది. వెయ్యిమంది పైగా పాలుపంచుకున్న ఆ సభలో సూది పడితే వినిపించే అంత నిశ్శబ్దం ఆవరించి ఉంది.

“అలా అని నేను అనడం లేదు సార్, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకే పార్టీలో పాతికేళ్ళ రాజకీయ జీవితం కలిగిన ఒక వ్యక్తి ఏదో ఒక కారణంతో పార్టీ మారాడు అనుకోండి, అది అతని వ్యక్తిగత నిర్ణయం అవుతుంది. దానికి అతను జవాబుదారిగా ఉండాలి అనుకోవడం మంచి విషయమే, కానీ ప్రశ్నించే స్థితిలో ఉండబోయేది ఎవరు అన్నది ఇక్కడ ముఖ్యం. నా ఉద్దేశంలో ఎవరైతే దానిద్వారా నేరుగా ప్రభావితం అవుతారో వారికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది” అతను తన వాదనను వినిపించాడు, ఈ సమయంలో కల్పించుకుని ప్రియాంక మాట్లాడడం మొదలుపెట్టింది.

ఆమె పక్కనే సిద్ధార్థ కూడా ఉన్నాడు. లెక్కకు మించిన టీవీ చానెల్స్ ఈ సమావేశాన్ని ప్రసారం చెయ్యడంలో నిమగ్నమై ఉన్నాయి

“అయితే నేరుగా ప్రభావితం అయ్యేవారిలో ప్రజలు ఉండరని మీరు అంటున్నారా” ఆమె సూటిగా అతడిని చూస్తూ అడిగింది

“ఖచ్చితంగా ఉండరు, ఎందుకంటే అతను చెప్పినది మీకు నచ్చితే, నమ్మకం కలిగితే వోట్ వేస్తారు. అతనిలో ఎన్నో లోపాలు ఉండవచ్చు, కానీ ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీలో మనకి కానీ ఇంకెవరికి కానీ అతన్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు. అయితే మీరు అన్నట్లుగా ఆసక్తి వున్నవారు డైరెక్ట్‌గా అతడిని అప్రోచ్ అయ్యి తమ అనుమానాలు వ్యక్తపరిస్తే మంచిది, అలాకాకుండా అది అందరికీ ప్రాథమిక హక్కు చెయ్యడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని నేను అంటాను” ఆమె ఏమి సమాధానం చెప్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు

“మీరు చెప్పినదానికి నేను అంగీకరిస్తాను, బట్ ఇందాకా సార్ చెప్పినట్లు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటే దానివల్ల వ్యక్తిగత నియంత్రణ ఉంటుంది. వీ షుడ్ నాట్ మేక్ యూజ్ ఆఫ్ ది ఎక్స్ట్రీం లిబర్టీస్ ప్రోవైడెడ్ బై ది డెమోక్రసీ ఎట్ దీ స్టేక్ ఆఫ్ అదర్స్. అదంత ఆరోగ్యకరమైన పరిణామం అని నాకు అనిపించదు” ఆమె ఈ మాట అనడంతో అతను ఏమనుకున్నాడో ఏమో కానీ ఇంకా పొడిగించలేదు.

ఒక్కసారిగా హాల్ మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది, అక్కడితో సభ ముగిసింది. నాచిరెడ్డి జనసమాజ్ పార్టీలో చేరిపోవడం, అతనితోపాటుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోవడం జె.హెచ్. పార్టీకి కోలుకోలేని దెబ్బగా పరిణమించింది. దానితో జె.హెచ్. పార్టీలో ఎమ్మెల్యేలు వేళ్ళమీద లెక్కె పెట్టగలిగినంత తక్కువ సంఖ్యకు చేరిపోయారు. ఏమి చెయ్యాలో తోచక, తనదగ్గరకు వచ్చిన ఈ సొసైటీ ఫర్ డెమోక్రాటిక్ ఎకౌంటబిలిటీ వారి కోరిక మీదట ఈ సభకు రావడానికి అంగీకరించింది ప్రియాంక.

ఇంకా ఎన్నికలు కేవలం పది నెలలే ఉండడంతో ఆమె ఏమి చెయ్యడానికైనా సిద్ధపడే స్థాయికి వచ్చేసింది. ప్రస్తుతం ఆమె సిద్ధార్థకు కూడా పెద్దగా సమాధానం చెప్పడం లేదు, వారిద్దరూ ఈ మధ్యకాలంలో కలసినదే చాలా తక్కువ. అతడిని కూడా తప్పుపట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే తనకి లాగే అతనికి కూడా ఈ రాజకీయాలూ అవీ కొత్తే కదా, మొత్తం మీద చూస్తే కనుక ప్రస్తుతానికి ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒంటరులే.

“ప్రత్యక్ష రాజకీయాలకు తెరతీస్తూ జనసమాజ్ పార్టీలో చేరిన మాజీ కేంద్రమంత్రి నాచిరెడ్డి అతని బాటనే అనుసరించిన పలువురు జె.హెచ్. పార్టీ నేతలు” అంటూ పత్రికల వాళ్ళు చెవుల తుప్పు ఒదిలిపోయేలా ప్రచారం చేస్తూ వచ్చారు.

ఈ సందర్భంలో ఎంత కాదనుకున్నా ఆమెకు తోడుగా ఉన్నది, ఆమె పార్టీలో ఇంకా నమ్మకంగా ఉన్నది కేవలం ప్రసాద్ గారు ఒక్కరే. సంఖ్యా బలం తగ్గినప్పటికీ తనలో ఆత్మస్థైర్యం పెంపొందించి తనకు తానుగా పెట్టుకున్న వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది.

ఆమె ఈ మధ్య సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఎప్పుడు చూసినా మీటింగ్లు, సభలు అని తిరుగుతూనే ఉంది. తాను స్థాపించిన ఆ కన్‌స్ట్రక్టివ్ ఫోర్స్, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవి ప్రభుత్వానికి అనుసంధానంగా కలిసి పనిచేస్తోంది అని అంతగా ప్రాచుర్యం లేని ఒక దినపత్రికలో నాలుగవ పేజీలో ఒక చివరన ఆమె చూసింది, ఆ రోజున ఆమె ఆనందానికి అంతు లేదు. ఎందుకో ఆరోజు ఎలాగైనా తన లక్ష్యం ప్రజల్లోకి వెళ్ళింది అని ఆమె అభిప్రాయపడింది.

తను సరైన దారిలోనే వెళ్తున్నాను అని ఎక్కడో మూలాన చిన్న ఆశ తళుక్కుమంది. నాచిరెడ్డి అధికార పక్షంతో కలిసిపోవడం వలన ఇంక ఆయన భార్య కేసు గురించి మర్చిపోయింది, ఇక ఇప్పట్లో అతని జోలికి ఎవరూ వెళ్ళకపోవచ్చు, దానికి నిదర్శనమే ఆయన పార్టీలో చేరిన కొన్నిరోజుల్లోనే సిబిఐ అతని భార్య కేసు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చింది.

అంతేకాకుండా జోగేశ్వరరావు గారి మరణం విషయంలో నియమించబడిన కమ్మిటీ నాలుగువందల పేజీల నివేదిక సమర్పించి సిబ్బంది పొరపాటు వల్లనే ప్రమాదం జరిగినదని, ఇందులో ఎటువంటి కాన్స్పిరసీ లేదని తేల్చిచెప్పింది అక్కడితో ఆ కేసు ఆ విధంగా ముగిసింది. రాహుల్ కూడా ఇంక ఆ విషయం పై పెద్దగా ఆరా తీయవలసినదిగా కోరలేదు. అయితే ఇంకా ధరణికోట ప్రాజెక్ట్ పనులు మాత్రం ప్రారంభం కాకుండా పేపర్ల మీదనే ఉన్నాయి.

“నేను చెప్పాను కదా నాచిరెడ్డి గారికి క్లీన్ చీట్ ఇస్తారని, నేను చెప్పినట్లే జరిగింది చూసావా” ప్రియాంకతో ఒకరోజు అన్నాడు సిద్ధార్థ.

“ఆహా ఇందులో నీ గొప్పతనం ఏముంది? ప్రభుత్వంతో కలిసి అతని మీద కేసులు రాకుండా, వ్యాపారానికి నష్టం జరగకుండా ఒప్పందం చేసుకున్నాడు. ఆయన ఒకవేళ మనపార్టీలో ఉండగా ఇది జరిగితే కనుక నువ్వన్నట్లు నేను ఒప్పుకునే దాన్ని” ఆమె కూడా అతనితో పోటీగా అన్నది

“ఐనా నీకు, ప్రసాద్ గారికీ మొదటినుంచీ ఆయన పార్టీలోకి రావడం ఇష్టం లేదులే. సరే ఇంతకీ ఇప్పుడు ఏమంటావ్, ఇంకా ఆయన నిందితుడే అంటావా?” అడిగాడు సిద్ధార్థ.

“సిబిఐ అతనికి క్లీన్ చీట్ ఇచ్చిన తరువాత నేనెందుకు దాన్ని తప్పుపడతాను. కాకపోతే వాళ్ళు అంత త్వరగా ఈ కేసును హండిల్ చేసిన విధానం వల్లనే కొంచెం అనుమానం కలుగుతోంది అంతే” అన్నది ఆమె. ఇంక ఈ విషయాన్ని అతను పొడిగించలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here