రాజకీయ వివాహం-14

0
4

“ఏమండీ చూస్తుంటే మీ ప్రతిభ అంతా ఇంకా పదవిలోకి రాకముందరే వినియోగిస్తున్నట్లు ఉన్నారు. మరి మీలాంటి ఆక్టివ్ పర్సన్స్‌ను ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కావాలి అని ఎందుకు కోరుకోరు. మీ విధానాలు మా కళ్ళముందే కనపడుతున్నాయి కదా, వీటిని మేము ఎలా కాదనగలము. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారు. మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది” ఆ ఇద్దరి నాయకుల్లో ఒకాయన అన్నాడు. అర్థం కానట్లుగా అక్కడున్న వారి అందరివైపు చూసింది ప్రియాంక.

సిద్ధార్థ జోక్యం చేసుకుంటూ “అయితే మొత్తానికి మన లీడర్‌గా, అదే రాబోయే ఎన్నికల్లో జె.హెచ్. పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ‘మిస్ ప్రియాంక’ను ఎంచుకోవడంలో మీకు ఎటువంటి అభ్యంతరం లేదన్నమాట” వాళ్ళందరితో అన్నాడు సిద్ధార్థ. కొంతసేపు అతను ఏమి మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అర్థం అయిన తరువాత  ఆమె తన చెవులను తానే నమ్మలేకపోయింది.

ప్రసాద్ గారు లాంటి సీనియర్లు ఉండగా తనకు ఈ అవకాశం లభిస్తుంది అని ఆమె కలలో అయినా అనుకోలేదు. అందుకే ఆమె నిస్సహాయంగా ప్రసాద్ గారి వంక చూస్తూ “అంకుల్, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు పని చెయ్యడమే ఇష్టం కానీ నేనెప్పుడూ నాయకత్వం గురించి ఆలోచించలేదు. అందులోనూ మీలాంటి సీనియర్లు అందరినీ వదిలేసి పెద్దగా అనుభవం లేని నన్ను ఇందుకు ఎంచుకోవడం ఎంత వరకు సమంజసం చెప్పండి” అడిగింది ప్రియాంక

“చూడమ్మా నాయకత్వం కూడా ఒక పని నువ్వు ఎందుకు అనుకోకూడదు. పైగా పార్టీలో చాలామందిని ఎదుర్కుని నువ్వు నీ లక్ష్యం ప్రకారం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించావు. దానివల్ల పార్టీ రాజకీయంగా నష్టపోయినప్పటికీ నువ్వు చెక్కుచెదరిని ధైర్యంతో ముందుకు సాగావు. ఇది ఎవ్వరు మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోరు.

ఇంక నా విషయం అంటావా నేను ఎప్పుడూ కొత్తనీటిని ఆహ్వానించడానికే ప్రయత్నిస్తాను, ముప్పై ఏళ్ళ నా రాజకీయ జీవితంలో నేను ఏనాడూ పదవుల కోసం ఆశపడింది లేదు. నాది కూడా మీ అందరి లక్ష్యం లాంటిదే. నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడం అనేది నేను ఒక్కడినో, లేదా సిద్ధార్థ ఒక్కడో సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, దానికి పబ్లిక్ సపోర్ట్ కూడా చాలావరకు ఉంది.

ప్రస్తుతం ప్రభుత్వ పనితీరులో లోపాలను పసిగట్టి దానికి దీటుగా సమాధానం చెప్పాలంటే, ఆ విధానాలు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మన ప్రణాలికను రూపొందించగలిగిన ఒక వ్యక్తి కావాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రాహుల్‌ని ఎదుర్కోవడానికి, లేదా రాహుల్ కాని పక్షంలో ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు ప్రజలకు దొరికిన ఏకైక వ్యక్తివి నువ్వు అని నా అభిప్రాయం.

ఇంకా కార్యాచరణ మొత్తం రాహుల్ కనుసన్నలలో జరుగుతున్నప్పటికీ జనసమాజ్ పార్టీలో ప్రస్తుతానికి హనుమంతరావు సీఎంగా కొనసాగుతూ ఉండడం వలన ఈ సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకోరు. అందుకనే వారికన్నా ముందుగా నిన్ను మనం అభ్యర్ధిగా ప్రకటిస్తే అది మనకు లాభం చేకూర్చేదిగా పరిణమిస్తుంది. కనుక నువ్వు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించకుండా మా అందరి కోరిక మీదట ఇందుకు ఒప్పుకోవాలని నా అభిప్రాయం” తన స్వరంలో నిజాయితీ ధ్వనిస్తూ ఉండగా ఆయన చెప్పాడు.

“ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే నీ నిర్ణయం తెలిపిన మరుక్షణం ప్రస్తుతానికి అవసాన దశలో మన పార్టీ ఫండ్‌ను ఉచ్ఛస్థాయికి తీసుకువెళ్ళడానికి చాలా మంది పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. వారందరూ నీ నిర్ణయం కోసం బయట ఎదురు చూస్తున్నారు” ఆమె వంక చూసి నవ్వుతూ నెమ్మదిగా చెప్పాడు సిద్ధార్థ.

అక్కడున్నవారు ఎవరూ ఈ విషయం గమనించకుండా జాగ్రత్తపడ్డాడు. అంటే తమ పార్టీని సపోర్ట్ చెయ్యడానికి ముందరే చాలా మంది ఇన్వెస్టర్స్‌తో రాహుల్ సంప్రదింపులు జరిపాడు అన్నమాట, ఎలాగైనా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటుంది అని అతను ఎలా అనుకున్నాడు. ఇదంతా చూస్తే సిద్ధార్థకు తన మీద తనకు గట్టి నమ్మకమే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇంకా మున్ముందు ఎన్ని చిత్రాలను ఆమె చూడబోతోందో అని ఆమె ఆశ్చర్యపోయింది.

ఆమె ఇంకా నిశ్శబ్దంగా ఉండేసరికి సిద్ధార్థ మళ్ళీ అన్నాడు “ప్రజలు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రియాంక. అంతకన్నా ఎక్కువగా నీమీద నమ్మకం పెట్టుకున్న పార్టీ కూడా ఎదురు చూస్తోంది. నీ నాయకత్వం పట్ల వారందరిలో ఉన్న నమ్మకానికి నువ్వు ఎటువంటి విలువ ఇస్తావో నువ్వే ఊహించుకో.

అవసరమైన సమయంలో అవసరమైన నిర్ణయం తీసుకోగలిగిన సత్తా నీలో ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదంటావా? మనం జర్నలిజం కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఉపన్యాసం ఒక్కసారి గుర్తు తెచ్చుకో, అందులో కనీసం ఒక్కశాతం నిజం ఉన్నా నువ్వు ఈ నిర్ణయాన్ని ఆమోదించవలసినదిగా నేను కోరుతున్నాను. ఇది నేను నీ స్నేహితుడిగా కాదు, ఒక సాధారణమైన వ్యక్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఆ తరువాత నీ ఇష్టం” సిద్ధార్థ ఇలా మాట్లాడడం ఆమెకు ఎందుకో కొత్తగా అనిపించింది. తన మీద ఇంత నమ్మకం ఏర్పడడానికి వెనుక అతని కృషి చాలా ఉందని ఆ సమయంలో ఆమెకు అనిపించింది.

“మిస్ ప్రియాంక మీతో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ, ఒకటి రెండు సందర్భాల్లో మీరు మాట్లాడడం వినే అవకాశం నాకు లభించింది. నేను చాలా కాలంగా రచనలు చేస్తూ ఉండడం, కార్మికుల తరఫున పోరాడుతూ ఉండడం వల్లన నాకు మనుషుల గురించి లోతుగా పరిశీలించే అవకాశం లభించింది.

ఒక వ్యక్తికి ఒక విషయం పట్ల నిర్దిష్టమైన, స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండి దాన్ని ఆచరణలో పెట్టడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. దానికి అన్నిటికన్నా ముఖ్యం మనమీద మనకు నమ్మకం ఉండడం, ఇప్పటివరకూ మీరు చేసిన పనులన్నిటిలో నాకు అది కనిపించింది. కన్‌స్ట్రక్టివ్ ఫోర్సు కానీ, ల్యాండ్ అక్విజిషన్స్ గురించి మీరు కండక్ట్ చేసిన సెమినార్స్ కానీ, అన్ని జిల్లాలలోకి వెళ్లి ప్రజల గురించి తెలుసుకుని వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కలిపించడం కానీ, ఇవన్నీ నా  అభిప్రాయం మీ కార్యదీక్షతకు నిదర్శనాలు.

కానీ ఇప్పుడు అలోచించి చూస్తే ఇంతమంది ఇన్నివిధాలుగా చెప్తున్నా మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి కాలయాపన చేస్తున్నారు అంటే బహుశా మీ విషయంలో నేనేమైనా పొరపాటు పడ్డానా అనుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పండి మీలో ఆ లక్షణం ఉందా, ఎవరేమనుకున్నా వారి ప్రభావం మీమీద పడకుండే విధంగా నిర్ణయం తీసుకునే స్థానంలో మీరున్నారా.

మీరు చేసిన భూ యాజమాన్యం పైన రీసెర్చ్‌ను ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రిగా  చట్టం కింద అసెంబ్లీలో ప్రవేశపెట్టి ‘అందరికీ భూమి’ అన్న మీ నాన్నగారి చిరకాల స్వప్నాన్ని సాకారం చెయ్యగలిగిన దమ్ము మీలో ఉందా?” కొంచెం సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు ఆదిత్యనారాయణ. మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాటలు ఆమెకు చాలా కఠినంగా అనిపించాయి.

అయినా కానీ తన రీసెర్చ్ గురించి ఆయనకెలా తెలిసింది అని ప్రశ్నార్థకంగా ఆయన వైపు చూస్తున్న ఆమెతో “ ఎస్. మీ అనుమానం నిజమే, నేను రెగ్యులర్‌గా మీ వర్క్‌ని ఫాలో అవుతూ వచ్చాను. త్వరలోనే దాన్ని బిల్ కింద రూపొందించాలి అని మీరు అనుకుంటున్నట్లుగా కూడా నాకు తెలిసింది. దానికి సంబధించిన డ్రాఫ్ట్ కాపీ కూడా ఇంటర్నెట్‌లో ఇప్పటికే హల్చల్ సృష్టిస్తోంది. ఈ విషయం మీకు తెలీకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది” అన్నాడు ఆదిత్యనారాయణ.

తను చేస్తున్న రీసెర్చ్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఒకడే ఉన్నాడు, అందుకే ఆమె సిద్ధార్థ వైపు తిరిగి ప్రశ్నిస్తున్నట్లుగా చూసింది. సిద్ధార్థ చిన్నగా నవ్వాడు, అంటే ఆ డ్రాఫ్ట్ కాపీని లీక్ చేసినది సిద్ధార్ధ అయ్యుంటాడు అని ఆమెకు అర్థం అయ్యింది. అక్కడ కాసేపు నిశ్శబ్దం ఆవరించి ఉంది, అందరూ ఆమె వంక ఆసక్తిగా చూస్తున్నారు, తను తీసుకోబోతున్న ఒక్క నిర్ణయమే కొన్ని అమాయక జీవితాలను ప్రభావితం చెయ్యబోతోంది అన్న విషయం ఆలోచిస్తేనే ఆమె మనసుకు చాలా కష్టం కలిగింది.

చాలా సేపు ఆలోచించిన తరువాత ఒక నిర్ణయానికి వచ్చినదానిలాగా ఆమె మాట్లాడడం ప్రారంభించింది “నేనెప్పుడూ ఇంత గుర్తింపు కోసం, ఇంతమంది నమ్మకం కోసం ప్రాకులాడలేదు, నిజం చెప్పాలంటే ఇంతమంది సపోర్ట్ నాకు లభిస్తుంది, వారందరి కోరిక కూడా ఒకటే అవుతుంది అని నేను నమ్మలేదు. చాలాకాలం వరకూ ప్రజలకు రాజకీయాలు అవసరం లేదు అని నేను అభిప్రాయపడ్డాను.

కానీ కొంతమంది స్వార్థపరుల నుండి ప్రజలను కాపాడాలంటే అంతకన్నా వేరే ప్రత్యామ్నాయం లేదన్న విషయం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆ స్వార్థపరులు ఎవరు వారిని నేను ఏ విధంగా ఎదుర్కుని నా లక్ష్యాన్ని చేరుకుంటాను, వారిని నాతో పాటుగా ప్రజలకు కూడా ఉపయోగపడే రీతిలో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని నేను చేతల్లో నిరూపిస్తాను. మీ కోరిక ప్రకారమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడడానికి నేను అంగీకరిస్తున్నాను” ఆమె ఈ మాట చెప్పిన మరుక్షణం ఆ గది అక్కడున్న ఎమ్మెల్యేల హర్షధ్వానాలతో మారుమ్రోగి పోయింది.

పక్క గదిలో సేదతీరుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిసారు. అప్పుడే ప్రియాంక ముఖ్యమంత్రి అయిపోయినంత సందడి నెలకొంది అక్కడ. ఈ హడావిడిలో వీరుండగానే తమ ఇంటి తలుపు తోసుకుంటూ ఒక ఇరవై మంది కెమెరామెన్లు, వారి వెనక విలేఖరులు లోపలి వచ్చి ఆమెను చుట్టుముట్టారు, ఆమె పక్కనే సిద్ధార్థ కూడా ఉన్నాడు.

ఆమె ఒక్కసారి సిద్ధార్థ వంక చూస్తే, అతను తనకేమీ తెలీదు అన్నట్లుగా భుజాలెగరేసాడు “మేడం, ముందుగా అతి చిన్న వయసులోనే జె.హెచ్. పార్టీ  ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికైనందుకు ప్రజలందరి తరఫునా మా శుభాకాంక్షలు మేడం” ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ విలేఖరి తనతో అన్నాడు. తమను సప్పోర్ట్ చెయ్యడానికి వచ్చిన ఇండస్ట్రియలిస్టుల్లో ఒకళ్ళు పెద్ద గజమాలతో కెమెరాలు అన్నిటి సమక్షంలో తనను సత్కరించారు, తనకి నామోషీగా అనిపించినా వాళ్ళందరి కోసం దానిని అంగీకరించక తప్పలేదు

“ఈ శుభ సందర్భంలో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకోవాలి అనుకుంటున్నాము. ధరణికోట ప్రాజెక్ట్ విషయంలో ప్రజలనుంచి అక్రమంగా సేకరించిన భూమిని వారికి తిరిగి ఇప్పించడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించబోతున్నారు అని తెలిసింది, నిజమేనా” మొట్టమొదటి సారి ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవడం వలన ఆమె కొంచెం తడబడింది.

“ఆ ప్రాజెక్ట్ గురించి సేకరించిన భూమి గురించి మా నాన్నగారు ఉన్న సమయంలో ఆయన దగ్గరకు చాలామంది ప్రజలు తమకి అన్యాయం జరిగింది అంటూ వస్తూ ఉండడం నేను చూసాను. అయితే వారివారి వాదనల్లో ఎంత వరకూ నిజం ఉంది, ఎవరైనా ప్రేరేపించడం వల్లన వారు ప్రభుత్వానికి సహకరించడానికి విముఖంగా ఉన్నారా అన్నది సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ర్యాలీల గురించి అయితే మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, నేను వీలైనంత వరకు సమయం వృథా చెయ్యకుండా ఉండడానికే ఇష్టపడతాను. ఆ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ గురించి, అక్కడ భూమి ఓనర్శిప్ గురించి ఇప్పటికే మా కన్‌స్ట్రక్టివ్ ఫోర్సు వాలంటీర్స్, ఎంప్లాయిస్ అధ్యయనం చేసి ఉన్నారు, నేను కూడా రెండు మూడుసార్లు ఈ విషయం కోసం అక్కడికి వెళ్లివచ్చాను” ఆమె కనస్ట్రక్టివ్ ఫోర్సు గురించి మాట్లాడిన వెంటనే ఒక విలేఖరి అందుకున్నాడు.

“మేడం ఈ కన్‌స్ట్రక్టివ్ ఫోర్సు అన్నది ప్రభుత్వానికి అనుకూలమా, వ్యతిరేకమా. ఎందుకంటే ఆల్రెడీ మన గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ పేరిట ప్రతీ ఊరిలో ఒక సెంటర్ నిర్మించాలి అనే బిల్‌ను ప్రవేశపెట్టి ఆమోదం పొందింది కదా మరి ఈ సమయంలో మీరు వారికి సహకరించకుండా కొత్తగా ఈ ఫోర్సును డెవలప్ చెయ్యడం వెనక మీరు ముఖ్యమంత్రి అయ్యిన తరువాత మిమ్మల్ని సప్పోర్ట్ చేసిన వాళ్ళకి ఈ కన్‌స్ట్రక్టివ్ ఫోర్సుని లీగలైజ్ చేసి దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఇవ్వడానికి చేసే ప్రయత్నమా” ఆమె వంక సూటిగా చూస్తూ అడిగాడు అతను.

ఆమెకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు, తనకు లేని కొత్త కొత్త ఆలోచనలు కూడా ఈ మీడియా వారు ఏ విధంగా తన మనసులోకి చోప్పిస్తున్నారో అని ఆమెకు చాలా ఆశ్చర్యమేసింది. ఆ సమయంలో కల్పించుకున్న సిద్ధార్థ.

“ఆల్రైట్ మిస్టర్ దట్ ఈజ్ ఏ టూ ఫార్ ఫెచ్డ్ అజంప్షన్, ఆర్ అలిగేషన్ టూ మేక్. అస్సలు ప్రతిపక్షం స్థానంలో ఉన్నది మేమా లేదా మీరా అని మాకు అనుమానం కలిగిస్తోంది. మేము ప్రభుత్వంపై చెయ్యాల్సిన విమర్శలను మీరు మాపై చెయ్యడం ఏమీ బాలేదు” అతను ఆ మాటలు అనగానే అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిసాయి.

అందరూ కొంత సమయం హాయిగా నవ్వుకున్నారు ఆ తరువాత ఇంకా ప్రశ్నలు అడగబోతున్న వారిని తప్పించుకుని “ఒకే ఎనఫ్ ఫర్ నౌ. ఐ థింక్ ఎవ్రీబడీ గాట్ దెయిర్ మనీ షాట్” అనగానే ఆ జోక్ అర్ధమైన అందరూ పగలబడి నవ్వారు. అక్కడితో సభ ముగిసింది ప్రియాంక ను జాగ్రత్తగా ఇంటికి చేర్చాడు సిద్ధార్థ.

ఆ రోజు టీవీ ఛానెల్స్ వాళ్ళు ప్రసాద్ గారి ఇంట్లో జరిగిన సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఆ మరుసటిరోజు అన్ని ముఖ్య వార్తాపత్రికల్లో ప్రియాంకను ముఖ్యమంత్రి అభ్యర్థి గా జె.హెచ్. పార్టీ ప్రకటించినట్లుగా  చాలా పెద్దగా ప్రచురింపబడింది. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా ఆరు నెలల వ్యవధి ఉంది.

***

“ఈ ఏరియాలో మనకి ఎటువంటి క్లూస్ దొరుకుతాయని మీ అభిప్రాయం, ఇది మనకు ఎవిడెన్స్ దొరికిన స్పాట్‌కి చాలా దూరంగా ఉంది కదా” అడిగాడు చక్రధర్. అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయ్యింది, అప్పుడే వర్షం పడడం వలన వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది, అందులో తామున్నది అటవీ ప్రాంతం కావడం వలన చుట్టూ పెద్దపెద్ద చెట్లతో, వాటి నుంచి జారుతున్న నీటి బిందువులతో ఆ  ప్రదేశం అంతా ముగ్ధమనోహరంగా ఉంది.

అటువంటి సమయంలో ఎవరికైనా కొంచెం బద్ధకంగా ఉండడం సహజమే, కానీ జగదీశ్వరరావు మాత్రం తన వెంట వచ్చిన చక్రధర్ సహాయంతో ముంబై నాశిక్ హై వే కి కొంచెం దూరంగా ఉన్న ప్రదేశంలో తాము ఇదివరకు వెతికిన ప్రదేశం దగ్గర వెతుకుతున్నారు. ఆ ప్రదేశాన్ని దాటుకుని కొంచెం ముందరకు వెళ్తే తమకొక పది ఎకరాలు విస్తీర్ణంలో నిర్మించబడిన భవనం ఒకటి కనిపించింది. చాలా పురాతనంగా ఉన్న ఆ భవనం వైపు వెళ్తున్న జగదీశ్వరరావుని ఉద్దేశించి అన్నాడు

“ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలుసు చక్రీ. నాకు తెలిసి క్రితంసారి మనం ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మనం ఈ స్పాట్‌ని మిస్సయ్యినట్లు అనిపిస్తోంది. అయినా ఆ సమయంలో మన వాళ్ళు అంత కమిటెడ్‌గా లేరనుకో. అంతా ఏదో ఆదరాబాదరాగా జరిగిపోయింది. నువ్వు కూడా ఉన్నావ్ కదా. ఇంత దూరంలో ఈ ప్రదేశం ఉందంటే దీనికి కనీసం కేర్‌టేకర్, లేదా వాచ్‌మన్ ఉండే అవకాశం ఉంది కదా. లెట్స్ నాట్ వెస్ట్ ఎనీమోర్ టైం” అని చెప్పి ఆ బంగాళాకు దూరంగా ఉన్న ఒక చిన్నగడిలాంటి దాంట్లో కునికిపాట్లు పడుతున్న ఒక వ్యక్తిని లేపి మాట్లాడుతున్నాడు జగదీశ్వరరావు,

అక్కడ సంభాషణ అంతా హిందీలో జరుగుతోంది “బాబూ ఈ భవనం ఎవరికి చెందినది, దీని ఓనర్ ఎవరు” అడిగాడు.

 “ఇక్కడ ఓనర్ అంటూ ఎవరూ లేరు సార్. ఒక వ్యక్తి మాత్రం అప్పుడప్పుడు ఇక్కడ మీటింగ్స్ అవీ పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనే నాకు ఈ ప్రదేశం మొత్తానికి అవసరమైన సామాన్లు అవీ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి హడావిడిగా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట చాలా మంది రకరకాల వాహనాల్లో వస్తూ ఉంటారు. ఆ సమయంలో మాత్రం నాకు ఎక్కువ డబ్బులు ఇస్తాడు ఆయన చూస్తే ఈ ప్రాంతం వాడిలాగా నాకు అనిపించడు” తనకు తెలిసిన వివరాలు చెప్పాడు ఆ ఏభై ఏళ్ళు పైబడిన వ్యక్తి. అతను మాట్లాడుతున్న మధ్యమధ్యలో బాగా గట్టిగా దగ్గుతున్నాడు.

“సరే ఆయన వయసు ఎంతుంటుంది. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా అతను ఇక్కడికి వచ్చాడా?” అడిగాడు చక్రధర్. అతన్ని చూస్తే ఎందుకో ఆ ముసలివాడు కొంచెం భయపడ్డాడు.

“ఇంతకీ మీరెవరు సార్, ఈ వివరాలు అన్నీ మీకెందుకు”

అతను కొంచెం బెదిరినట్లుగా అనిపించి జగదీశ్వరరావు కొంచెం మెల్లిగా “మేము ప్రభుత్వాధికారులం తాతా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీకు తెలిసిన వివరాలు అన్నే చెప్పావనుకో బోలెడన్ని బహుమతులు ఇస్తాము” చక్రధర్ వంక చూస్తూ అన్నాడు.

“బహుమతులెందుకు లేదని బాబూ, అతని వయసు ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉంటాది. ఈ బంగాళా గురించి ప్రభుత్వ లెక్కల్లో కూడా లేదు, దీన్ని ఎవరూ పట్టించుకోరు, అస్సలు ఇక్కడ ఈ బంగాళా ఉన్నట్లే తెలీదు. ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను బాబు అతడు వచ్చాడు. హడావిడిగా ఒక ఏభై మంది పైగా అతని వెంట మధ్యాహ్నం మూడు ఆ సమయానికి వచ్చారు. సాయంకాలం వరకూ ఉంది ఏడూ ఆ ప్రాంతానికి ఎంత త్వరగా వచ్చారో అంతే త్వరగా వెళ్ళిపోయారు.అంతే బాబూ”

“మరి వాళ్ళు వస్తున్నట్లు నీకు ముందుగా ఎలా తెలిసింది”అడిగాడు చక్రధర్

“వాళ్ళే నాకొక సెల్ఫోన్ కొనిచ్చారు బాబు. కొంతకాలం క్రితం అది పోయింది. నేను అస్సలు ఈ భవనం నించి బయటకి వెళ్ళను” అతను చెప్పాడు. ఇంక అతడి దగ్గర నుంచి ఎటువంటి వివరాలు రాబట్టలేము అని నిర్ణయించుకున్న తరువాత వాళ్ళిద్దరూ తిరిగి ముంబై చేరుకోవడానికి, తాము హైర్ చేసుకున్న కారులో హైవే మీద వెళ్తున్నారు.

మధ్యలో బడలికగా అనిపించి టీ తాగడానికి ఒక ధాబా దగ్గర ఆగారు. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు అవుతోంది.

“నాకు తెలీక అడుగుతాను మనకి టిప్ అందించిన వాడికి ఆ సెల్ఫోన్ అక్కడ లభిస్తుంది అని ఏ విధంగా తెలిసి ఉంటుంది. ఆలోచిస్తే  ఖచ్చితంగా అతను ఈ మిస్టర్ X గ్యాంగ్ లో మెంబర్ అయినా అయ్యుండాలి. లేదా గాంగ్ మెంబర్ అతనికి స్నేహితుడు అయినా అయ్యుండాలి అనిపిస్తోంది.

వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో మనకి టిప్ అందించిన వ్యక్తి వారి నుండి విడిపోయి ఉండాలి, లేదంటే తప్పించుకుని పారిపోవడానికి అయినా ప్రయత్నించి ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద కాన్స్పిరసీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు తమ ప్లాన్‌ను ఎవరో ఫోటోలు తీస్తున్నారంటే చూస్తూ ఊరుకోరు కదా” అన్నాడు జగదీశ్వరరావు

“అయితే ఇందాక మనం చూసిన బిల్డింగ్‌ని హైర్ చేసుకున్నది మిస్టర్ X అయి ఉంటాడా?” తన అనుమానాన్ని వెలిబుచ్చాడు.

“ఏమో చెప్పలేము, ఆ వాచ్‌మన్ సమాచారం ప్రకారం మనం ఎటువంటి కంక్లూజన్‌కి రాలేకపోతున్నాం.” భుజాలేగరేస్తూ చెప్పాడు తాము సిబిఐ ఆఫీసర్లు అని ఆ ధాబా ఓనర్‌కి ఎలా తెలిసిందో తెలీదు కానీ అతనే స్వయంగా వచ్చి తమకు కావలసినవి అన్నీ చూస్తున్నాడు. టీతో పాటుగా స్నాక్స్ కూడా అందించాడు.

“నాకు ఇంకొక అనుమానం సార్. మనకి టిప్ అందించినది, మిస్టర్ X గాంగ్‌లో మెంబర్ ఈ ఇద్దరూ ఒకళ్ళే అంటారా. అలా అయితే కనుక అతను ఎవరు”

“అతను ఎవరనేది నేను చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకరు కాదు అని నా అభిప్రాయం”

“సార్ మీరు తెలుగు వాళ్ళలాగా కనిపిస్తున్నారు అవునా సార్” ఇంతలో ధాబా ఓనర్ తమ సంభాషణకి అడ్డుపడుతూ అడిగాడు. అవునన్నట్లుగా తలూపారు వాళ్ళిద్దరూ.

“జాగ్రత్తగా వెళ్ళండి సార్, ఈ మధ్య ఈ ఏరియాలో ఆక్సిడెంట్స్ ఎక్కువయ్యాయి. కొంత కాలం క్రితం ఇదే రోడ్ మీద బైకు పైన వెళ్తున్న ఒక యువకుడికి మా ధాబా ముందరే ఆక్సిడెంట్ అయ్యింది.”

ఏదో స్ట్రైక్ ఐనట్లు అడిగాడు జగదీశ్వరరావు “మరి అతను ఏమయ్యాడు చనిపోయాడా. ఇది జరిగి సరిగ్గా ఎంత కాలం అయ్యింది.”

కుతూహలంగా అతని సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు చక్రధర్.

“చనిపోయాడో లేదో తెలీదు కానీ, ఆ ఆక్సిడెంట్ చేసిన వ్యక్తే ఆ యువకుడిని తన కారులో హాస్పిటల్‌కు తీసుకువెళ్ళాడట సార్. నాకు సరిగ్గా తెలీదు కానీ అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నవి విన్నట్లుగా మా కుర్రాడు చూసి చెప్పాడు. ఇది జరిగి సరిగ్గా సంవత్సరం అవుతోంది. నాకు బాగా గుర్తు ఎందుకంటే ఆ రోజు పెద్దపండగ కూడా” చెప్పాడు ఆ ధాబా ఓనర్

“సందేహంలేదు సార్ ఇతను ఆ మిస్టర్ X గ్యాంగ్ మెంబర్ అయ్యుంటాడు” గట్టిగా అన్నాడు చక్రధర్. నిశ్శబ్దంగా ఉండమన్నట్లుగా సైగ చేసాడు జగదీశ్వరరావు

 “ఏ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారో నీకేమైనా ఐడియా ఉందా”

“అది కూడా మా కుర్రాడే చెప్పాడు సార్. చంద్రావతి హాస్పిటల్” వెంటనే ఇద్దరూ ముందూ వెనకా ఆలోచించకుండా తమ హోటల్‌కి వెళ్ళడానికన్నా ముందర హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు.

అక్కడ రికార్డ్స్ రూమ్లో సరిగ్గా సంవత్సరం క్రితం అడ్మిట్ అయ్యిన ఆక్సిడెంట్ కేసెస్ లిస్టు చూస్తున్నారు వారిద్దరూ. వాళ్ళలో సూరి గురించి తెలుసుకోవడానికి వాళ్లకి పెద్ద సమయం పట్టలేదు.

“ఇతన్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేసారు. ఆ ట్రీట్ చేసిన డాక్టర్‌తో మాట్లాడవచ్చా” తమ ఐడెంటిటీ కార్డులు చూపించి అక్కడున్న డాక్టర్‌ను అడిగారు

“సారీ సార్, ఆ పేషెంట్ ఆరోజునే మృతిచెందాడు, బాడీని ఎవరూ క్లెయిమ్ చేయ్యకపోవడం వల్ల గవర్నమెంట్ రూల్స్ ప్రకారం క్రిమేట్ చేసాం” తన నిస్సహాయతను వెలిబుచ్చాడు ఆ డాక్టర్.

“ఆక్సిడెంట్ ఐన వ్యక్తి ఫోటో ఏమైనా ఉందా”

“ఫోటో లేదు కానీ సీసీటీవీలో అతని ముఖం రికార్డ్ అయ్యి ఉంటుంది” డాక్టర్ అన్నాడు.

“మరి అతడిని జాయిన్ చేసిన వ్యక్తి ఎవరు. ఆ డీటెయిల్స్ ఎక్కడున్నాయి.” అడిగాడు చక్రధర్

“ఆ వ్యక్తి వీఐపీ కోటాలో రూమ్ రిజిస్టర్ చేయించాడు సార్. అందుకే డీటెయిల్స్ అడగలేదు” చెప్పాడు ఆ డాక్టర్.

“ఇంతకీ ఏ వీఐపీ కోటా అది”

“ఎమ్మెల్యే కేటగిరీ సార్, ఇదిగో ఆ వ్యక్తి సిగ్నేచర్” చూపించాడు ఆ డాక్టర్. అక్కడ సెక్యూరిటీ క్యాంలో ఒక సంవత్సరం క్రితం టైం లైన్ చూసిన వాళ్ళకి గణేష్ ముఖం కనిపించింది.

“ఇతడు నాకు తెలుసు సార్, మన హోం మినిస్టర్ రాహుల్‌కి చాలా మంచి ఫ్రెండ్. అతని మీటింగ్స్ అన్నీ ఇతనే అరేంజ్ చేస్తూ ఉంటాడు. అంటే మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ హైదరాబాద్‌కి షిఫ్ట్ అన్నమాట” అతను చెప్పినది విని సాలోచనగా తల పంకించాడు జగదీశ్వరరావు..

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here