రాజకీయ వివాహం-14

0
12

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 14వ భాగం. [/box]

అధ్యాయం- 14

[dropcap]“అం[/dropcap]తా బాగానే ఉంది కానీ ఇప్పుడు మనం చాలా విషయాల్లో పునరాలోచన చేసుకునే అవసరం కలుగుతోంది” అన్నాడు సిద్ధార్థ, అతను ప్రియాంకతో కలిపి ఇప్పుడే ఒక సమావేశానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. మధ్యదారిలో ప్రియాంకను వాళ్ళ ఇంటిదగ్గర దించివేస్తానని ఆమె వద్దంటున్నా వినకుండా ఆమెతో వస్తున్నాడు, తన కారును డ్రైవర్‌కి ఇచ్చేసి ముందరే పంపించేసింది ఆమె.

“అంటే, ఏ విషయంలో అని నీకు అనిపిస్తోంది?” అడిగింది ఆమె

 “ఇప్పుడు నువ్వు ఫాలో అవుతున్న మార్గాలు అన్నిటిలోనూ, నీ స్ట్రాటజీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలిటిక్స్‌లో ముందుకు వెళ్ళాలంటే కేవలం మంచిపనులు చెయ్యడం ఒకటే సరిపోదు, నీ ఇమేజ్ ప్రజల్లోకి చొచ్చుకుని పోయేలాగా ఉండాలి, అంటే నిత్యం ఏ పని చేస్తున్నా కానీ ప్రజలకు నువ్వు గుర్తురావాలి, నువ్వు మాత్రమే గుర్తురావాలి” సునాయాసంగా కార్ నడుపోతూ చెప్పాడు సిద్ధార్థ.

 “నువ్వు చెప్తున్నది ఏంటో నాకు అర్థం కాలేదు, మనం అనుకుంటునట్లు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము. అందరూ కూడా మన సభలకి వస్తున్నారు, నాకిష్టం లేకపోయినా నువ్వు చెప్పావని కొన్ని పనులు చేస్తూనే వచ్చాను. ఇంకా ఇంతకన్నా ఏమి కావాలి చెప్పు” అర్థం కానట్లుగా అడిగింది ప్రియాంక.

“మరైతే నాచిరెడ్డిగారు ఎందుకు మన నుంచి విడిపోయుంటారని నీకు అనిపిస్తోంది”

“అస్సలు దానికీ ఇప్పటి మన స్ట్రాటజీకి సంబంధం ఏమిటి?” విసుగ్గా అడిగింది

 “సంబంధం ఉంది, లేకపోతే ఇప్పటికి కూడా ప్రజలు ఆ విషయం గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అంతేకాకుండా ధన్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు, అంటే భూషణరావు చెందిన బినామీ కంపెనీల్లో ఒకటి ఇప్పటికే ధరణికోట ఏరియా దగ్గర పనులు ప్రారంభించేసారు. దానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇన్‌ఫాక్ట్ అతడిని ఇచ్చేలా చేయించాడు భూషణరావు. గతంలో మీ నాన్నగారు ఎలాగ అతని చేతులో కీలుబొమ్మలాగ ప్రవర్తించారో ప్రస్తుతానికి రాహుల్ పరిస్థితి కూడా అంతే, ఆ హనుమంతారావు లాంటి ఒక డమ్మీని సీఎం కింద పెట్టి మొత్తం కధనంతా వెనకనుండి నడిపిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ వ్యర్థ నిర్వాహణ ప్లాంట్ మన రాష్ట్ర ప్రభుత్వంలో త్వరితగతిన పూర్తిచేసి త్వరలోనే దేశీయ ఇంధన మార్కెట్ మొత్తాన్ని కాప్చర్ చేసే ఆలోచనలో ఉన్నాడు భూషణరావు.

అందుకు సంబధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికే విదేశీ ట్రాన్సిట్లో ఉన్నట్లుగా సమాచారం. కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంతరించిపోతున్న ఈ రోజుల్లో కేంద్రప్రభుత్వం కూడా రానున్న ఈ ప్రత్యామ్నాయ వనరుల మీద దృష్టిపెట్టాలని అనుకుంటోంది, దీనికి తగినట్లుగా బడ్జెట్లో డెబ్బై వేల కోట్లను కేటాయించింది. దీనికి బిడ్డింగ్ పడిన ప్రతీ రాష్ట్రంలో భూషణరావు నలభైకి పైగా ఉన్న తన బినామీ కంపెనీలతో కోట్ చెయ్యించనున్నాడు.

అందుకే మనం ఎట్టి పరస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఆపాలి, నువ్వు చేసే పనులు ప్రభుత్వానికి సహకరించే ఉన్నమాట నిజమే కానీ, ప్రస్తుతానికి ప్రభుత్వమే కీలుబొమ్మగా మారిపోతే ఇంకా నీ లక్ష్యాలు ఎలా నెరవేరతాయి. ఫస్ట్ మన కాళ్ళమీద మనం నడవగలిగినప్పుడు మాత్రమే మనం ఇతరులకి సహాయం చెయ్యగలుగుతాం” ఆమెతో అన్నాడు సిద్ధార్థ. తను తన పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, సిద్ధార్థ భూషణరావుకి సంబంధించిన వివరాలు సేకరించడంలో బిజీగా ఉన్నాడు అన్న విషయం ఆమెకు అర్థం అయ్యింది.

“నాతోనే ఉంటూ ఇంత పెద్ద రీసెర్చ్ చేసావ్ కదా, ఇప్పుడు మనం ఏమి చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు” అతనివంక చూస్తూ అంది. ఇంతలో తన ఇల్లు రావడంతో వారి మధ్య సంభాషణ ముగిసింది. అతడిని లోపలి రమ్మని ఆహ్వానించినా అతను చాలా సున్నితంగా తిరస్కరించాడు.

“ఇంతవరకూ నేను చేసినదానికి ప్రతిఫలం రావాలన్న, నువ్వు ఎప్పటినుంచో అనుకుంటున్న, అదే ప్రజలకు స్వశక్తి యొక్క గొప్పతనం తెలియజేయాలి అన్న నీ లక్ష్యం నెరవేరాలి అన్నా ఒక్కటే మార్గం ఉంది” వెళ్ళేముందర ఆమెతో అన్నాడు సిద్ధార్థ.

“ఏమిటది” అర్థం కానట్లుగా అడిగింది

“రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం” అని చెప్పి అక్కడ నుంచి తన కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు, అతను వెళ్ళిన వైపే రెప్పవేయకుండా చూస్తూ నిలుచుంది ప్రియాంక.

***

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సుల్తాన్ బజార్, హైదరాబాద్. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ఆఫీసులో తన కేబిన్‌లో కంప్యూటర్‌లో ఏదో రిపోర్ట్ చదువుకుంటున్నాడు డిప్యూటీ సూపరింటెండెంట్ జగదీశ్వరరావు. చాలా రోజులనుంచి తను ఎంతో కష్టపడి సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా తన టేబుల్ చుట్టుపక్కల చిన్న చిన్న స్టిక్ నోట్స్‌గా అతికించబడి ఉన్నాయి.

ఆ గదిలో ఉన్న గోడకి దూరంగా ఒక పెద్ద వైట్ బోర్డు వేళ్ళాడుతూ ఉంది, దాని మీద నలుగురి ఫోటోలు అతికించబడి ఉన్నాయి. జగదీశ్వరరావుకి యాభై సంవత్సరాలు వయసు ఉంటుంది. తన భార్యతో ఆయనకు కొన్ని సంవత్సరాల క్రితం విడాకులు కోర్టు మంజూరు చేసింది. కూతురు అమెరికాలో పెద్ద చదువులు చదివి అక్కడే తనతో పాటుగా ఉద్యోగం చేసే ఒక తెల్ల జాతీయుడిని వివాహం చేసుకుని స్థిరపడింది.

ఆమె అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటుంది. తన పనేదో తను చూసుకుని జగదీశ్వరరావు ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. తెల్లని మేని ఛాయతో, ఇప్పుడిప్పుడే నెరుస్తున్న జుట్టుతో అయిదున్నర అడుగులు ఎత్తు ఉన్న ఆయన శరీరం ఇప్పటికీ ధృడంగా ఆటుపోట్లకు తట్టుకునే విధంగా ఉంటుంది. ఇప్పటికి రాష్ట్రంలోనే కాకుండా, దేశంలో చాలా కేసుల్లో తన డిపార్ట్మెంట్‌కి ఎనలేని సేవలు అందించిన ఆయన ఉత్తమ ప్రతిభకు గాను ప్రెసిడెన్షియల్ అవార్డ్ కూడా అందుకున్నారు.

ఎటువంటి కేసునైనా అపారమైన తన అనుభవంతో, నిశిత దృష్టితో, విషయ పరిజ్ఞానంతో  పరిష్కరించడానికి తోడ్పడే ఆయన డిపార్ట్మెంట్‌లో అందరికీ గురుతుల్యులు లాంటివారు. ఆయన ఆ రిపోర్ట్ చదవడం మొదలుపెట్టి ఎంతసేపు అయ్యిందో తెలీదు కానీ దాన్ని చదువుతున్న కొద్దీ ఆయనలో అసహనం ఎక్కువవుతోంది.

ఎంతోకాలంగా తను కష్టపడి సేకరించిన విషయాలు అన్నిటినీ, పక్కకు నెట్టి హడావిడిగా డాక్టర్ రామకృష్ణ కమిటీ జోగేశ్వరరావు దుర్మరణానికి సంబంధించిన రిపోర్ట్‌ను సిబ్బంది పొరపాటు వల్లనే జరిగింది అని ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఎంత కాదనుకున్న ఇందులో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చొరవ ఉండి ఉంటుంది అని ఆయనకు అనిపించింది.

ఐనా ఇంతకాలం నిస్వార్థంగా తన సంస్థకు సేవలు అందించినప్పటికీ పై అధికారుల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసుతో పాటు, తాను పని చేస్తున్న నాచిరెడ్డి కేసు, ఇంకా జె.హెచ్. పార్టీకి సంబధించిన ఇతర కేసులు కూడా వదిలేయవలసి వచ్చింది. అయితే అధికారికంగా తాను వాటినుంచి తప్పించుకున్నప్పటికీ, తన అంతట తానుగా ఈ కేసులను పరిష్కరించాలి అనుకున్నాడు. ఎక్కువగా ఎవరితోనూ కలవని ఆయనకు డిపార్ట్మెంట్‌లో కొంతకాలం క్రితం జాయిన్ అయ్యిన చక్రధర్ అంటే ఎందుకో వాత్సల్యం ఏర్పడింది. అందుకే తాను పని చేసిన ప్రతీ కేసులో చక్రి ఉండే విధంగా చర్యలు తీసుకున్నాడు ఆయన.

“ఏంటి సార్, ఇంకా అదే రిపోర్ట్ చదువుతున్నారా?” తన వెనక నుంచి వినపడిన మాటలకు ఒక్కసారిగా అటు తిరిగాడు.

తన కాబిన్‌లోకి ఎవరు వచ్చినా పెద్దగా ఇష్టపడని ఆయన చక్రధర్ విషయంలో మాత్రం అటువంటి అంక్షలేమీ పెట్టుకోలేదు.

ఒక్కసారి నిరాశగా అతనివైపు చూసి తన రివాల్వింగ్ చైర్లో వెనకకు వాలి “మరేమీ చెయ్యమంటావ్, ఆ నాచిరెడ్డి పుణ్యామా అని మన పని చేస్తున్న కేసులన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయి, కొత్తగా డిపార్ట్మెంట్‌లో ఏమీ కేసెస్ లేవు. ఇంతకన్నా మంచిపని నాకు మరొకటి కనిపించలేదు.

ఎన్ని సార్లు చదివినా ఈ రిపోర్ట్‌లో ఏదో తేడా ఉందని నాకు అనుమానం తీరడం లేదయ్యా. ముంబైలో మనం రికవర్ చేసిన ఆ సెల్ ఫోన్ తాలూకు డాటా ఇంకా మనకి అందకుండానే మధ్యలో ఎవరో అడ్డుకుని, ఈ కేసుకి చరమగీతం పాడేసారు” కొంచెం బాధపడుతున్నట్లుగా అన్నాడు.

“అయినా అందులో పెద్దగా ఇంపార్టంట్ విషయం ఏదీ ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది సార్. లేదంటే తన తండ్రి కేసు విషయంలో రాహుల్ అంత నిర్లక్ష్యంగా ఉండడు కదా” అతను ఆ రూమ్‌లో గోడకి తగిలించి ఉన్న వైట్ బోర్డులో ఫొటోస్ వంక చూస్తున్నాడు. తాము పని చేస్తున్న కేసులో చనిపోయిన వారి ఫోటోలతో పాటు తాము ఇప్పటివరకు ఇంటరాగేట్ చేసిన వ్యక్తుల అందరి ఫోటోలు ఉన్నాయి వాటిలో వరదరాజన్, చరణ్, సుకన్య, నాచిరెడ్డి, ఛాయాదేవి, సుకన్య తల్లిదండ్రులు, నకునారెడ్డి, నాచిరెడ్డి బావమరిది తేజా, భూషణరావు  వీళ్ళందరి ఫోటోలు ఉన్నాయి.

దీనికి తోడు దూరంగా జోగేశ్వరరావు గారు దుర్మరణం చెందిన ఫ్లైట్ రెకేజ్ తాలూకు ఫోటోలు,  పూర్తిగా ధ్వంసమైన ఇంజన్‌ను తిరిగి అసెంబుల్ చేసిన ఫోటోలు, ఇన్వెస్టిగేషన్ టైములో ఇంజన్ మాన్యుఫాక్చరర్ దాని బ్లాక్ బాక్స్ నుండి సేకరించిన సమాచారం వగైరా వివరాలు అన్నీ వున్నాయి.

అన్నిటికీ దూరంగా ఒక చోట మనిషి ఆకారంలో ఉన్న ఒక చాయాచిత్రం మీద ‘మిస్టర్ X’ అని రాసి దాని చుట్టూ ఎరుపు రంగుతో సర్కిల్ చెయ్యబడి ఉంది.

కుతూహలంగా అక్కడికి వెళ్ళిన చక్రధర్ “ఎవరు సర్ ఈ ‘మిస్టర్ X’ “ ఆసక్తిగా అడిగాడు, ఆయన ఇదే కేసు మీద చాలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు అతనికి అనిపించింది.

“మనం ఇప్పటివరకు టేకప్ చేసిన కేసులు మూడు చక్రి, మొదటిది నాచిరెడ్డి భార్య మృతి ఆయన మీద ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అదే ఈడీ వాళ్ళు పెట్టిన కేసు, రెండవది మాజీ ముఖ్యమంత్రి నకునారెడ్డిగారికి సంబంధించిన అశోక్ త్యాగీ కేసు, మూడవది జోగేశ్వరరావు చాపర్ క్రాష్ కేసు. మన ఇన్వెస్టిగేషన్ ఇంకా మధ్యంతరంగా ఉండగానే ఈ కేసులన్నీ వాటంతట అవే పరిష్కరింపబడ్డాయి, లేదా వెనక్కి తీసుకోబడ్డాయి. దీన్ని బట్టి ఆలోచిస్తే నీకేమి అర్థమవుతోంది” చక్రధర్ ను ఉద్దేశించి అడిగాడు.

“నాకైతే మనం టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తోంది సార్. నాచిరెడ్డి గారు ఇప్పుడు జనసమాజ్ పార్టీలో చేరిపోవడం వలన ఆయన మీద ఈడీ సమన్లు వెనక్కి  తీసుకున్నారు. నకునారెడ్డిగారు అనారోగ్యం కారణంగా చనిపోవడం వలన ఆ కేసు కూడా అర్ధాంతరంగా ముగించవలిసిన అవసరం కలిగింది, ఇంకా జోగేశ్వరరావు గారి చాపర్ క్రాష్ కూడా ఆక్సిడెంటల్‌గా జరిగింది అని రిపోర్ట్ మనకి చెప్తోంది. ఇవి మన కళ్ళముందర ఉన్న నిజాలు.

ఒక కేసు అలా తప్పుదోవ పట్టింది అంటే అనుకోవచ్చు కానీ ఇన్ని కేసులు ఒకేసారిగా వాటంతట అవే సాల్వ్ అయిపోవడం యాదృచ్చికం అని నాకు అనిపించడం లేదు.” ఆయన వంక చూస్తూ చెప్పాడు, బహుశా ఆయనకు వ్యక్తిగత జీవితం లేకపోవడం వల్ల తన కాలం సమయం మొత్తం ఇదే లోకంగా గడుపుతున్నట్లు అతనికి అనిపించింది. తను అన్నదానికి ఆయన కొంచెం ఇబ్బంది పడినట్లు అతనికి అనిపించింది

“సరే ఈ రోజు లంచ్ ఏమి చేసారు” మాట మారుస్తూ అన్నాడు చక్రధర్.

“లంచా.. ఇప్పుడు అస్సలు టైం ఎంతైంది” అయోమయంగా అతని వంక చూస్తూ అడిగాడు. అతనేమీ మాట్లాడకపోయేసరికి తన వాచీ చూసుకుని

“ఓ మై గాడ్, త్రీ తర్టీ అయిపోయిందా నేనింకా ఏ పదకొండున్నరో, పన్నెండో అయ్యి ఉంటుదని అనుకున్నానే” కంగారు పడుతూ అన్నాడు.

“సరే సరే, లంచ్ టైం ఎలాగో అయిపోయింది కాబట్టి సరదాగా టీ తాగుతూ మనం ఈ విషయం డిస్కస్ చేసుకుందాం, కం లెట్స్ గో” అని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కాంటీన్ వైపు దారి తీసాడు జగదీశ్వరరావు, చక్రధర్ ఆయనను అనుసరించాడు. మరికాసేపట్లో వారిద్దరూ డిపార్ట్మెంట్ కాంటీన్‌లో ఎదురెదురుగా కూర్చుని టీ తాగుతూ ఉన్నారు.

“నాకెక్కడో లింక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది చక్రి, ఎంత కాదనకున్న ఈ మూడు కేసులు ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నాయి అన్న విషయం నేను కొట్టిపారెయ్యలేకపోతున్నాను” అతని వంక చూస్తూ చెప్పాడు.

కాంటీన్‌లో దాదాపుగా ఏభై మంది పైగా ఉన్నారు, అందరూ అదే డిపార్ట్మెంట్లో వివిధ విభాగాల్లో పనిచేసేవారే. ఎవరి పని వాళ్ళది అన్నట్లు అందరూ ఏదో ఒక విషయం మీద చర్చించుకుంటున్నారు. రోజు ఈ సమయానికి ఆ ప్రదేశం అంతా కోలాహలంగా ఉంటుంది. ఈ అంత హడావిడిలో వీరి మాటలు గురించి పట్టించుకున్నవారు లేరు.

“అంటే ఏ విధంగా కనెక్షన్ ఉందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సార్. మన దగ్గర ఉన్న బిట్స్ అండ్ పీసెస్ ఇన్ఫర్మేషన్‌తో అన్నీ ఇంటర్లింక్ చెయ్యగలగడం ఇంపాజిబుల్. మీరే మీ బ్రెయిన్ ఈ సమయంలో కొంచెం మాకు అప్పివ్వాలి. కేస్ మళ్ళీ రీ ఓపెన్ చెయ్యడం మాట అటుంచితే మీరు ఈ కేసులో ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకే కనీసం మీకంటూ ఈ విషయంలో ఒక క్లోజర్ రావడానికి నేను నా శక్తి మేరకు పనిచేస్తాను. ఇది నా గురువుగారికి నేను సమర్పించుకుంటున్న గురుదక్షిణ లాంటిది” చెప్పాడు చక్రధర్.

 “మూడు పాయింట్స్ ఇక్కడ మనం కన్సిడర్ చెయ్యాలి. వన్ నాచిరెడ్డిని డిఫేం చెయ్యడానికి అతని భార్యను ఎవరో ఆక్సిడెంట్ అనిపించే విధంగా హత్య చేయించారు అనుకుందాం, దాని వల్ల ఇప్పటివరకూ ఎవరికీ ఎటువంటి మోనిటరీ బెనిఫిట్ వచ్చింది. అంతేకాకుండా ఆమె మరణించడానికి ముందర కొంతకాలం కనిపించకుండా పోయింది అదే సమయంలో ఆమెతో సంబంధం ఉంది అని భావించిన చరణ్ ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలీదు.

టూ ఒకే సమయంలో ఇద్దరు ప్రజానాయకులు ఏ కారణం లేకుండా ఎందుకు చనిపోతారు, మొదటిది ఆక్సిడెంట్ అనుకుంటే కనుక, రెండవది అదే నకునారెడ్డిగారి మరణం కూడా ఆక్సిడెంట్ లేదా సహజమరణం అనుకోవడానికి ఛాన్స్ లేదు వై బికాజ్ దేర్ ఆర్ టూ మెనీ కో ఇన్సిడెన్సెస్.

మూడవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎవిడెన్స్, మనకి అనానిమస్ టిప్ అందిన సెల్ఫోన్  దగ్గరనుంచీ మనం ఫాలో అప్ చేస్తే డెడ్ ఎండ్ తగిలింది. ఇప్పుడు ఆ సెల్ఫోన్ కూడా ముంబై హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఆ చాపర్ రెకేజ్‌ని పూర్తి క్షుణ్ణంగా పరిశీలించకుండా హడావిడిగా రిపోర్ట్ సబ్మిట్ చేసేసారు. నువ్వు వచ్చే ముందర నేను ఆ రిపోర్ట్‌నే చదువుతున్నాను, దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగాను” ఆసక్తిగా తాను చేసిన పరిశోధన అంతా చెప్తున్నాడు జగదీశ్వరరావు.

“ఒకే మీరు చెప్పిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ వాట్ ఈజ్ ది కనెక్షన్” అడిగాడు చక్రధర్

 “అక్కడికే వస్తున్నాను, ఇవన్ని ఒకదానికి ఒకటి జోడించి చూస్తే కనుక నాకేమనిపిస్తోంది అంటే ఎవరో మన పరిశోధన సాగకుండా అడ్డుపడాలి అని చూస్తున్నారు. అందుకే ఇవన్నీ అంత త్వరితగతిన జరిగిపోయాయి, నకునారెడ్డి గారు చనిపోకపోతే ఆ తరువాత రోజు మనం ఆయనను కలిసి ఇంటారాగేట్ చెయ్యాల్సిన అవసరం ఉంది కదా మర్చిపోయావా” టీ సిప్ చేస్తూ చక్రధర్‌ను అడిగాడు జగదీశ్వరరావు. అవునన్నట్లుగా తలూపాడు అతను

“అంటే ఎవరికీ అనుమానం రాకుండా సహజ మరణంగా అనిపించే రీతిలో ఇవన్ని పనులు చేస్తున్నాడు అతనే ‘మిస్టర్ X’. దీని వెనుక పొలిటికల్ కాన్స్పిరసీ ఉందో, లేదా కార్పొరేట్ కాన్స్పిరసీ ఉందో ఆ మిస్టర్ X ఎవరనేది తెలిస్తేనే బయటపడుతుంది”.

“మరి మనకి ఈ ఎనానిమస్ టిప్ అందించింది ఎవరై ఉంటారు. వాళ్ళు బయటకి రాకుండా మనకి ఈ సమాచారం అందించడం వెనక ఏం ఉద్దేశం ఉందంటారు” అర్థం కానట్లుగా అడిగాడు చక్రధర్.

“అతను ఎవరైనా కావచ్చు, ఒక రెస్పాన్సిబుల్ సిటిజెన్, ఈ కేసుతో సంబంధం ఉన్నవాడు. అన్నిటికన్నా ఎక్కువగా మిస్టర్ X గురించిన పూర్తి వివరాలు తెలిసిన వాడు అయ్యుండాలి. ఆ వ్యక్తి ఎవరైనా కానీ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండి ఉంటాడు అంతే.” అన్నాడు జగదీశ్వరరావు, ఆయన చెప్పినదానికి సాలోచనగా తల పంకించాడు చక్రధర్.

ఇంతలో  ఆయన సెల్ఫోన్ శబ్దం చేసింది, అందులోకి చూసిన కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్న తరువాత ఏదో ఆలోచన తళుక్కున మెరిసి ఆయన ముఖం ప్రకాశవంతం అయ్యింది

“హా ఐ గాట్ ఇట్ చక్రధర్ కమాన్ లెట్స్ గో” ఆనందంగా అతని భుజం తడుతూ అన్నాడు జగదీశ్వరరావు.

“ఎక్కడికి సార్” ఆయన వంక అయోమయంగా చూస్తూ అన్నాడు చక్రధర్.

“ధ్వంసం కాగా మిగిలి ఉన్న ఆ చాపర్‌ని తిరిగి అసెంబుల్ చేసారు, అదింకా మన వేర్‌హౌస్ లోనే ఉంది కదా”

“అవును సర్”

“మరింకా టైం వేస్ట్ చెయ్యకు పద పద” అని అతని హడావిడి చేసారు. ఆయన ఉత్సాహం చూసి చక్రి కూడా హుషారుగా ఆయన వెనుక పరుగుతీసాడు.

ఇద్దరూ మరికొన్ని నిమిషాల్లో అదే ప్రదేశంలో వేరే బిల్డింగ్ లో ఉన్న వేర్‌హౌస్ దగ్గరకి వెళ్ళాడు. రకరకాల కేసులకి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు అన్నీ అక్కడ దాచి ఉంచబడతాయి. అన్నీ  తిరిగి పర్యవేక్షించడానికి వీలుగా ఆధునిక పద్ధతిలో కంప్యూటరైజ్ చెయ్యబడి ఉంటాయి. కొంత అన్వేషణ తరువాత వారు ఆ చాపర్ యొక్క శకలాలు ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళారు. అక్కడున్న ప్రతీ భాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు.

“ఎస్ కమాన్ ఐ గాటిట్” అని ఒక చిన్న సెన్సార్‌ను బయటకు తీసాడు జగదీశ్వరరావు.

“ఏమిటి సార్ ఇది. ఇందాకా మీ ఫోన్‌లో మీకేదో మెసేజ్ వచ్చినట్లు ఉంది”

“ఎస్ చక్రధర్. నా అనుమానమే నిజం అయ్యింది. మనకి అనానిమస్ టిప్ అందిన తరువాత నాచిరెడ్డి మనకి కో-ఆపరేట్ చెయ్యట్లేదని, ఎప్పటికైనా ఈ కేసు మూతపడిపోతుంది అని  తెలుసుకున్న నేను ఆ టిప్ ద్వారా మనకి లభించిన సెల్ ఫోన్ స్థానంలో వేరే డమ్మీ సెల్‌ను మన డిపార్ట్మెంట్‌కు అందించాను. ఒరిజినల్ సెల్ఫోన్‌ను పూర్తిగా రికవర్ చెయ్యమని అమెరికాలో ఉన్న మా అమ్మాయికి పంపించాను. ఆమె తన స్నేహితుల సహాయంతో పూర్తి డేటా రికవర్ చేసి మనకి ఈ ఇమేజస్ పంపింది” అని ఫ్లైట్ స్కీమాటిక్స్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు అందులో ఒక చోట ఎర్రటిమార్కు  చెయ్యబడి ఉంది. జగదీశ్వరరావు చేతులో ఉన్నది ఆ మార్క్‌కి సంబంధించిన విడిభాగం అని చక్రధర్ తెలుసుకోగలిగాడు.

“ఇంతకాలం మన వాళ్ళు రికవర్ చేసిన డేటా అంతా ఆ డమ్మీ ఫోన్ లోది అన్నమాట. ఇప్పటివరకూ నాకు తప్ప మూడోకంటి వాళ్ళకి ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇప్పుడు నీకు తెలిసింది అంతే.” చెప్పాడు జగదీశ్వరరావు.

“సరే ఈ వీకెండ్ నీ ప్రోగ్రామ్స్ ఏంటి” మళ్ళీ ఆయన సడెన్‌గా అతడిని అడిగాడు.

“పెద్దగా ఏమీ లేవు సార్. మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, మా అమ్మగారు పెళ్లిచూపులు అంటూ ఓ తెగ నస పెడుతున్నారు ఒకసారి చూసి వద్దాం అని అనుకుంటున్నాను. ఎందుకు సార్” అడిగాడు చక్రధర్.

“సరదాగా ఈ వీకెండ్‌కి మనమిద్దరం కలిపి ముంబై వెళ్దామని” అతని వంక చూస్తూ అన్నాడు జగదీశ్వరరావు.

“ముంబై ఆ, ఎందుకు సార్” తన కుతూహలం ఇంకా ఎక్కువగా అడిగాడు చక్రధర్.

“ఏమీ లేదయ్యా ముంబైలో బీచ్ ఫెస్టివల్ జరుగుతోందట, అక్కడ నీకెవరైనా అమ్మాయిలు నచ్చితే పెళ్లిచూపులూ అవీ లేకుండా డైరెక్ట్‌గా పెళ్లి చేసేసుకోవచ్చు” చక్రధర్ వంక చూసి కన్నుకొట్టి చెప్పాడు ఆయన. చిన్నగా నవ్వాడు చక్రి. వయసులో పెద్దవారు అయినా తన మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం ఆయనలోని ప్రత్యేకత, అదే తనకి ఆయనలో నచ్చే లక్షణం.

***

“మనకి ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు కనుక మనం వీళ్ళతో చేతులు కలపక పోతే ఈ రాష్ట్రంలో మన ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది” ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి ప్రసాద్ గారి ఇంటికి రమ్మని సిద్ధార్థ ప్రియాంకకి కాల్ చేసాడు.

వాళ్ళ ఇంటిదగ్గర అధిక సంఖ్యలో కారులు ఉండడం ఆమె గమనించింది, లోపలికి వెళ్తున్న సమయంలో ఆమెకు ఎందుకో తెలీదు కానీ తాను ఈరోజు ఏదో పెద్ద విషయం తెలుసుకోబోతోంది అని అనిపించింది. ప్రసాద్ గారితో పాటు జె.హెచ్. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కట్టకట్టుకుని అక్కడికి చేరుకున్నట్లు ఉన్నారు. వెళ్లి చూసేప్పటికి అక్కడ కమ్యూనిస్టు నాయకులతో కలిపి ‘ఆదిత్య నారాయణ’ గారు కూడా కనిపించారు.

కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కూడా గత ఎలక్షన్స్‌లో రెండు సీట్లు లభించాయి. జె.హెచ్. పార్టీకి ఇంకా కమ్యూనిస్ట్ నాయకులకూ మధ్య ఈ సమావేశం ఏర్పాటు చెయ్యడానికి వెనక ‘ఆదిత్య నారాయణ’ గారి హస్తం ఉందని ఆమె తెలుసుకుంది.

“చూడండి మేడం, నాకు మీ నాన్నగారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయన దృష్టిలో కార్మికులకు, కర్షకులకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, భూముల సేకరణ, పారిశ్రామికీకారణ పేరిట అరుదైన వనాలను హరించివేయడం ఇవన్నిటి గురించీ మనం ఆలోచించకూడదు అంటారా? ఉదాహరణకి ధరణికోట ప్రాజెక్ట్ తీసుకుందాం మొట్టమొదట భూసేకరణ దగ్గర నుంచీ ఆ ప్రాజెక్ట్‌లో అడుగడుగునా అవినీతి జరుగుతూనే వస్తోంది.

ఇది ఈ నాటిది కాదు గత ఎన్నికలకి ముందర నుంచీ జరుగుతున్న విషయం. ఈ రాజకీయాలు అవీ పక్కన పెడితే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మాణం జరగడం నిజం కాదంటారా?” అడిగాడు ఆ ఇద్దరి నాయకుల్లో ఒక్కడు. ఆదిత్య నారాయణ ఆమె వంక ఆసక్తిగా చూస్తున్నాడు.

గతంలో రాహుల్ ఆ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించబోయే సమయంలో ఆయన గిరిజనులను ఉద్దేశించి మాట్లాడడం ఆమెకు జ్ఞప్తికి వచ్చింది. ఒకప్పుడు వారిని వ్యతిరేకించిన సిద్ధార్థ ఇప్పుడు వారితో కలిపి పని చెయ్యాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు.

“ఏమో సార్ నాకు మీ అంత అనుభవం లేదు కానీ, చాలా వరకూ విషయాల్లో ప్రజాభిప్రాయం కొంతమంది పెద్దల సూచనల మేరకు ఏర్పడుతూ ఉంటుంది అని నా అభిప్రాయం. మరి అనుభవం ఉన్న అటువంటి పెద్దల ఏయే కారణాల వల్ల, లేదా ప్రయోజనాల వల్ల అటువంటి అభిప్రాయలు తాము ఏర్పరుచుకుని  ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తూ ఉంటారో నాకైతే ఎప్పటికీ అర్థం కాదు” ఆమె ‘ఆదిత్య నారాయణ’ వైపు చూస్తూ సూటిగా అన్నది. ఆమె చేసిన వ్యాఖ్యను ఆయన పెద్దగా పట్టించుకున్నట్లు లేదు.

“సరే మీరు ప్రజలకు న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు కదా, మరి దానికోసం సమ్మెలు అవీ చెయ్యడం ఎందుకు. మీకు నిజంగా సేవ చెయ్యాలని ఉంటే వై డోంట్ యూ జాయిన్ ఇన్ అవర్ కనష్ట్రక్టివ్ ఫోర్స్. అంటే విమర్శ అనేది ముఖ్యమే, కానీ దానికి తోడుగా మన శక్తి మేరకు అందరికీ ఉపయోగపడే క్రియాశీలకమైన పరిష్కార మార్గం చూపడం కూడా ముఖ్యమే కదా.

ప్రతీ పని వెనకా అంతిమ లక్ష్యం ‘ప్రోగ్రెస్’ అవ్వాలన్నదే నా ఆకాంక్ష, అందుకు మీరు సహకరించగలిగితే మీతో చేతులు కలపడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు” కొంచెం సేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. ప్రసాద్ గారు కూడా కమ్యూనిస్ట్ నాయకులతో కలవడం వల్ల మాత్రమే రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోగలుగుతాం అనడంతో ఆమెకు వాళ్ళతో ఏకీభవించక తప్పలేదు. ఒకవేళ తను వాళ్ళతో కలిసి పనిచెయ్యాల్సివచ్చినా అందులో అంతర్లీనంగా తన లక్ష్యం ఉండేలా ఆమె చూసుకోవాలి అనుకుంది.

ఎవరికి తెలుసు వాళ్ళతో ఉండడం వలన తనకి వాళ్ళని కూడా మార్చే అవకాశం లభిస్తుందేమో. తన అంతిమ లక్ష్యం వ్యతిరేకతను అంతం చెయ్యడమే కదా. అక్కడున్న ఇద్దరూ వాళ్ళలో తర్జనభర్జనలు పడిన తరువాత తాము అందుకు అంగీకరిస్తున్నట్లుగా తెలిపారు, అయితే ప్రొటెస్ట్స్ విషయంలో తమ పధ్ధతి మార్చుకోవడానికి వాళ్ళు అంత సుముఖంగా ఉన్నట్లు ఆమెకు అనిపించలేదు.

అటువంటి పక్షంలో ఆ ప్రొటెస్ట్స్ జరిగే ప్రదేశంలో అంటే ధరణికోట దగ్గర సాధ్యమైనంత వరకు తమ కన్‌స్ట్రక్టివ్ ఫోర్సు ఉద్యోగులు, వాలంటీర్లు ఉండే విధంగా చూడాలి అని ఆమె ప్రతిపాదించింది, అంతే కాకుండా అందరు తాము ఆ ప్రొటెస్ట్‌లో పాల్గోవడానికి గల కారణం ఏంటో తెలిపే విధంగా ఒక పత్రం కూడా రాయాలి అని చెప్పింది. దీనికి వాళ్ళు అన్యాపదేశంగానే అంగీకరించినట్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here