“ఈ సమయంలో మనం ఇక్కడికి రావడం అవసరమా చెప్పు” సిద్ధార్థతో చిరాకుగా చెప్పింది ప్రియాంక. ఎంత వద్దన్నా వినకుండా తనని బలవంతం చేసి తాజ్ బంజారా రెస్టారెంట్‌కి తీసుకువచ్చాడు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో భయాందోళనలు అధికం అవుతున్నాయి. దానికి కారణం ఏమిటని ఆమె సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోంది.
బయట తిరిగితే ఎక్కడ పత్రికా విలేఖరులు తమను ప్రశ్నించి విసిగిస్తారో అని ఆమె సాధ్యమైనంతవరకు పార్టీ ఆఫీసుకు, తన పర్యటనలకు మాత్రమే పరిమితం అయ్యి ఉంటోంది. ఈ మధ్య తనకు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కల్పించాడు సిద్ధార్థ. అతను కూడా సాధ్యమైనంత ఎక్కువగా తనకు సహకరిస్తూనే వస్తున్నాడు. తన ఎలెక్షన్ కాంపెయిన్‌ని సమర్ధిస్తున్న పెట్టుబడిదారులుతో రెండు మూడుసార్లు సమావేశం ఏర్పాటు చేశాడు సిద్ధార్థ.
తన కన్నా తాను ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళు చూపిస్తున్న అత్యుత్సాహం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది, తాను ముఖ్యమంత్రి అయ్యిన తరువాత తన నుంచి ఎటువంటి లాభాలు పొందాలని వారు ఆశిస్తున్నారో కానీ, పైకి మాత్రం సమాజసేవ, ప్రజాసేవకి కంకణం కట్టుకుని ఉన్నట్లు ఉంటాయి వారి మాటలు.
గతంలో తన తండ్రి నకునారెడ్డి విషయంలో కూడా భూషణరావు ఇదే విధంగా అప్రోచ్ అయ్యి ఉంటాడు, అయితే అతనికి దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉండడం వలన అతను తన తండ్రి ఓడిపోయిన కొంతకాలానికి అధికార పక్షంతో చేరిపోయి తన కాంట్రాక్టులు నిలుపుకోగలిగాడు. మరి వీరు అందరి సంగతీ కూడా అలాగే ఉంటుందేమో అని ఆమెకు అనిపిస్తోంది. పైగా తనకి రాష్ట్ర భవిష్యత్తు మీద అత్యధిక శ్రద్ధ వహిస్తున్న ఎన్నారైల నుంచి కూడా విరివిగా విరాళాలు అందుతున్నాయి, కానీ వీటిని పార్టీవారు కనస్ట్రక్టివ్ ఫోర్సు కోసం కాకుండా పబ్లిసిటీ కోసం ఉపయోగిస్తున్నారు. రెండు మూడు సార్లు వాగ్వివాదం అయినప్పటికీ వారితో ఏకీభవించక తప్పలేదు.
“ఇది కూడా మన కాంపెయిన్‌కి ఉపయోగపడే ఒక పబ్లిసిటీ అనుకో, అందుకే ఇక్కడికి మన ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళను కూడా దూరంగా ఉంచాను. ఇక్కడ మనల్ని ఎవరూ డిస్టర్బ్ చెయ్యరు” ఆమె వంక సరదాగా చూస్తూ చెప్పాడు. తాజ్ బంజారా రెస్టారెంట్‌లో ప్రశాంతమైన వాతావరణంలో రెస్టారెంట్‌లో కూర్చుని ఉన్నారు వారిద్దరూ.
“అంటే కొంపతీసి ఇక్కడకి కూడా మీ విలేకరులనీ వాళ్ళని పిలిపించావేంటి. ఏదో ఒక ఆలోచన లేకుండా నువ్వు ఏ పనీ ఊరికే చెయ్యవు కదా. సరదాగా రెస్టారెంట్ లో లంచ్ చేద్దాం అని నువ్వు అన్నప్పుడే ఇలాంటి వ్యవహారం ఏదో ఉంటుందని నాకు అనుమానం కలిగింది. ఇంకెందుకు ఆలస్యం ఎక్కడున్నారో బయటికి రమ్మను వాళ్ళకి కావలసిన ఇంటర్వ్యూ ఇచ్చేస్తే పనైపోతుంది. మనం భోజనం చేసి ఇంటికెళ్ళిపోదాం” అతనితో వెటకారం నిండిన స్వరంతో అన్నది ప్రియాంక.
“హ హ నా మీద చాలా గొప్ప అభిప్రాయమే ఉంది ప్రియాంకా నీకు. ప్రతీదానికీ ఏదో కారణం ఉండి తీరాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ రాజకీయాల్లోకి రావడానికి ముందర నుంచీ మనం స్నేహితులం కదా అప్పటి నుంచీ కనీసం మనం మనసువిప్పి మాట్లాడుకోవడానికి కూడా సరిగ్గా సమయం దొరకలేదు.
ఎంతసేపు పని పని పని అంతే, దానివలనే ఒత్తిడి అధికమై మనం ఏం మాట్లాడుతున్నాం అనేదాని మీద నియంత్రణ లేకుండా పోతోంది అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అసలు సెలవలు అనేవే లేని నీ పొలిటికల్ లైఫ్‌లో ఈ సండేని రిజర్వ్ చేయించుకున్నాను. కాబట్టి ఇప్పుడు నువ్వొక మామూలు ఉద్యోగిగా అన్ని టెన్సన్స్ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి” అతని స్వరంలో నిజాయితీ ధ్వనించిన నిజాయితీకి ఆమె చలించిపోయింది.
“ఏమిటో నువ్విలా కూడా మాట్లాడగలవు అని నాకు అనిపించలేదు. ఒకసారి నీ పాకెట్స్ చూడనీ” అతని వంక సీరియస్ గా చూస్తూ అంది ప్రియాంక.
“ఎందుకు” ఒక్కసారిగా ఆమె అడిగేసరికి అయోమయంగా ఆమె వంక చూస్తూ అడిగాడు సిద్ధార్థ
“ఎందుకేమిటి, కాసేపట్లో ఏదో డ్రింక్ ఆర్డర్ చేస్తావ్. నేను గమనించకుండా ఉన్న సమయంలో నీ జేబులో ఉన్నది తీసి అ గ్లాస్లో వేస్తావ్. నేను డ్రింక్ పూర్తిగా తాగేసిన తరువాత గ్లాస్ ఆఖరిలో అది నాకు కనపడుతుంది. అప్పుడు దాన్ని చూసి నేను ఆశ్చర్యపోవాలి. అంతే కదా నీ ఉద్దేశం” అతని వంక చలాకీగా చూస్తూ అంది ప్రియాంక.
“నా జేబులో ఉన్నది ఏంటి, నీ గ్లాస్‌లో వెయ్యడం ఏంటి. నువ్వు ఆశ్చర్యపోవడం ఏంటి? నాకేమి అర్థం కాలేదు” ఆమె వంక అయోమయంగా చూస్తూ అడిగాడు సిద్ధార్థ
“అదే బాబూ, నువ్వు ప్రపోజ్ చెయ్యడానికి తెచ్చిన రింగ్. ఎన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూడలేదు” అతన్ని చూసి సరదాగా టీజ్ చేస్తూ అన్నది. అంతే ఒకసారి అతడు పగలబడి నవ్వాడు, చాలా సేపు అలా నవ్వుతూనే ఉన్నాడు. ఆమె కూడా అతడిని వారించకుండా ఆసక్తిగా చూస్తోంది, కాసేపటికి అతను సద్దుకున్నాడు.
“కమాన్ ప్రియాంక ఈజ్ దిస్ యువర్ అయిడియా ఆఫ్ రొమాన్స్. నాకు అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఇంతకాలం టైం వేస్ట్ చెయ్యను, నువ్వు కనిపించిన మొట్టమొదటి రోజే నీకు చెప్పేవాడిని ఈ విషయం నాకన్నా నీకే బాగా తెలుసు. లేదంటే ఇంతకాలం మన మధ్య ఇంత ఉన్నతమైన స్నేహం కొనసాగి ఉండేది కాదు. ఏమంటావ్” అడిగాడు సిద్ధార్థ. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా అతని వంక అలాగె రెప్ప ఆర్పకుండా చూస్తోంది.
“సరే అయితే నీ ఐడియా ఆఫ్ రొమాన్స్ ఏంటి?” కాసేపటి తరువాత ఆసక్తిగా అడిగింది ప్రియాంక.
“అది చెప్పడానికి ఒక అనువైన సమయం సందర్భం ఉండాలి. ఎప్పుడైనా అలాంటిడి సంభవిస్తే తప్పకుండా చెప్తాను. సరే ఇంతకాలం మనం ఎవరి పనుల్లో వాళ్ళు చాలా చాలా బిజీగా తిరిగాము కదా కనీసం స్నేహితులు అని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు మనకి.
ఉన్నవారిని కూడా సాధ్యమైనంత దూరంగా ఉంచుతున్నాం. అందుకే ఈరోజు మనకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి, మన ఇద్దరి ఉమ్మడి స్నేహితుడు ఒకరిని ఇక్కడికి ఆహ్వానించాను. నువ్వు అభ్యంతరం చెప్పావని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నాను” వారు కూర్చున్న టేబుల్ దగ్గర అప్పటికే అన్ని రకాల ఆహారపదార్థాలు అందంగా పొందికగా అమర్చబడి ఉన్నాయి. ఆమె అర్థం కానట్లుగా అతని వంక చూసింది.
ఇంతలో ఆమెను ఆశ్చర్యానికి గురి చేస్తూ అక్కడికి రాహుల్ ప్రవేశించడంతో ఆమెకు నోట మాట రాలేదు. ఇంత సులువుగా ఎవరికీ తెలీకుండా హోం మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆంతరంగిక సమావేశాలకు, విందులకు వినోదాలకూ వస్తాడు అని ఆమె అనుకోలేదు. అందులోనూ జోగేశ్వరరావు చనిపోయిన దగ్గర నుంచీ అతనిలో ఒక రకమైన ధృడత్వం, కరుకుతనం గమనించింది ఆమె. అలాంటి రాహుల్‌ను కూడా తమతో విందుకి ఆహ్వానించ గలిగాడు అంటే సిద్ధార్థ చాలా విషయాలు ముందుగానే అలోచించి పెట్టుకుంటున్నాడు అన్నమాట.
అయితే ప్రతీ విషయం బయటపడే వరకూ అతడు ఏమి చేస్తున్నాడు అన్నది అంతుపట్టడం లేదు. మొదటిసారి తాను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఒప్పుకున్నప్పుడు జరిగిన పత్రికా విలేఖరుల సమావేశం ఆమెకు గుర్తొచ్చింది. రాహుల్ వారిద్దరినీ పలకరిస్తూ వచ్చి సిద్ధార్థ పక్కగా కూర్చున్నాడు. తాను వారిద్దరికీ అభిముఖంగా కూర్చుంది ప్రియాంక.
ముగ్గురూ కొంతసమయం నిశ్శబ్దంగా ఉన్నారు. ఏదైనా అవసరమైతే పిలుస్తామని వెయిటర్‌ను కూడా దూరంగా ఉంచారు వారు ముగ్గురూ. అక్కడికి కొంచెం దూరంలో ఆ హోటల్ బ్రాంచ్ యొక్క మేనేజర్‌కి వీరు ముగ్గురినీ ఒకేచోట చూసేసరికి ముచ్చెమటలు పోసాయి. వీళ్ళదేమి పోయింది ఇష్టానుసారంగా అలా వస్తారు వెళ్ళిపోతారు, అభిమానులు కానీ, విలేకరులు కానీ ఇతరులు ఎవరికైనా కానీ వీరి విషయం తెలిసి వీరి మీదకి ఎగబడి చిన్న అనుకోని సంఘటన జరిగినా తమ హోటల్ ఇమేజ్ మొత్తం నాశనం అవుతుంది. అందుకే సెక్యూరిటీ ప్రాబ్లెం వస్తే ఎలా హాండిల్ చెయ్యగలుగుతాం అని అతను ఆందోళన చెందుతూ అక్కడే పచార్లు చేస్తున్నాడు.
“హోం మంత్రిగారికి మిత్రులను కలుసుకునే అంత తీరిక కూడా ఉంటుందని నేను ఊహించలేదే” సిద్ధార్థ వంక చూస్తూ అన్నది ప్రియాంక
“ఇక్కడికి నేను హోంమంత్రి కింద వస్తే మీరు నా మిత్రులు అవ్వరు, నా రాష్ట్ర ప్రజలు అవుతారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం నాకుంది కదా, అందుకే ఈ రోజు మీ బాగోగులు చూసుకుందామని నాకు పనులున్నా కానీ తీరిక చేసుకుని మరీ వచ్చాను. ఇక్కడికి వచ్చే ముందరే ఒక ఇనాగరేషన్ ఫంక్షన్‌కి కూడా వెళ్లి వచ్చాను” వారి వంక చూస్తూ చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాడు రాహుల్.
సిద్ధార్థ ప్రియాంక ఎలా స్పందిస్తుందా అని భయంగా ఎదురు చూస్తున్నాడు
“కేవలం మీ కంటిచూపుకే ఆరాటపడే కొన్ని కోట్లమంది ఉన్న ఈ రాష్ట్రంలో మేమంటే ఎందుకో ఆ ప్రత్యేకమైన అభిమానమో తెలుసుకోవచ్చా” సూటిగా అడిగింది. అక్కడ వాతావరణం గంభీరంగా మారడం సిద్ధార్థ గమనించాడు
“అంటే నేను మీమీద అభిమానం చూపకపోతే మీరు కొన్ని కోట్లమంది నా మీద చూపించవలసిన అభిమానాన్ని ఎత్తుకుపోతారు కదా, అందుకే నాకు వేరే దారిలేదు” తాను కూడా అంతే సూటిగా చూస్తూ సమాధానం చెప్పాడు.
ప్రియాంక ఇంకా ఏదో మాట్లాడబోతుంటే సిద్ధార్థ కలిపించుకుని “ఓకే, ఓకే ఇక్కడికి ప్రజలతో హోంమంత్రి ముఖాముఖీ శీర్షిక ముగిసింది. ఇంక మన తదుపరి కార్యక్రమం ముగ్గురు పూర్వ మిత్రుల వ్యాహ్యాళి” అతను ఆ మాటలు అనేసరికి అక్కడి వాతావరణం తేలికైంది. ముగ్గురూ ఒక్కసారిగా మనస్పూర్తిగా నవ్వారు
“అది సరే సిద్ధూ నువ్వు ఇలాంటిదేదో ప్లాన్ చేయ్యాలనుకుంటే ఇంట్లోనే కలిసేవాళ్ళం కదా, ఇలా పబ్లిక్ ప్లేస్‌లో ఎందుకు. పాపం హోం మంత్రి గారు చూడు ఎవరైనా తనని గమనించి ఎక్కడ మీదపడతారో అని ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచీ భయం భయంగా చూస్తున్నారు” అన్నది ప్రియాంక. రాహుల్ ఆమె వంక సీరియస్‌గా చూసాడు, ఆమె అది పట్టించుకోనట్లు ముఖం తిప్పుకుంది
“ఓకే ఎనఫ్” ప్రియాంకను వారించి, “అయినా మీద పడేవారికి ఇల్లు, పబ్లిక్ ప్లేస్ అని తేడా ఏముంది, ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని ప్రతీచోటా నిఘా వేసే ఉంచుతారు” సిద్ధార్థ అనడంతో రాహుల్, ప్రియాంక ఇద్దరూ ఒకసారి తమ చుట్టూ పరిశీలించారు “హహ ఇప్పుడెవరూ లేరులెండి. మనం లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం” అని సిద్ధార్థ చెప్పడంతో తాత్కాలికంగా వారిమధ్య సంభాషణకు అంతరాయం కలిగింది.
“మీ గణేష్ ఏమయ్యాడు ఈ మధ్య కనపడడం లేదు, ఇదివరకు ఏ పని చేసినా మీరిద్దరూ కలిసే చేసేవారు కదా, నువ్వు హోం మంత్రి అయ్యిన దగ్గరనుంచీ అతని అవసరం పెద్దగా రాలేదా మీకు” రాహుల్‌ను ఉద్దేశించి అడిగాడు సిద్ధార్థ
“అలా ఏమీ లేదు, నేను హోం మినిస్టర్ అయ్యిన తరువాత హైదరాబాద్‌లో ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసాము, దానికి వాడే మేనేజర్ కింద ఉండి పార్టీకి బ్యాక్ ఎండ్‌గా పనిచేస్తూ ఉండేవాడు. మరి ఇప్పుడు ఏమయ్యాడో తెలీదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ముఖ్యమైన పనిమీద ఉన్నాను అంటాడు, ఎప్పుడు వస్తున్నావ్ అంటే కూడా సమాధానం చెప్పడు. సరే నా పనుల్లో నేను బిజీ ఐపోయి ఇంకా వాడి గురించి పట్టించుకునే తీరిక లేకుండా పోయింది” చెప్పాడు రాహుల్.
ప్రియాంక ఏమీ మాట్లాడుకుందా నిశ్శబ్దంగా ఉండడం గమనించి “ఈ మధ్య మీకు బాగా పాపులారిటీ పెరిగినట్లు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ముందుకు నడిపించడంలో కృతకృత్యులయ్యారు అనుకుంటాను” ప్రియాంక వంక చూస్తూ అడిగాడు రాహుల్. వాళ్ళిద్దరూ అక్కడున్న వంటకాల్లో తమకు తోచినది తమ పళ్ళెంలో వేసుకుని తింటున్నాం అన్నట్లుగా ఉన్నారు.
అయితే వారికి తిండి మీద ధ్యాస లేదు అన్నట్లుగా ఉన్నది అక్కడి వాతావరణం. ఎంత కాదనుకున్నా తమ మధ్య ఈ రాజకీయాల ప్రస్తావన రాకుండా ఉండదు అని వారి ముగ్గురికీ కూడా అర్థం అయ్యింది. ఇంక చేసేదేమీ లేక సిద్ధార్థ కూడా నిశ్శబ్దంగా తింటున్నాడు.
“పాపులారిటీ ఏముంది రాహుల్ గారు. పని చేసినా పెరుగుతుంది, పని చేస్తున్న వాళ్ళపై టీవీ ఇంటర్వ్యూలో కామెంట్ చేసినా పెరుగుతుంది. కానీ దేనివల్ల ప్రజలకి ఉపయోగమో ఒక్కసారి తెలుసుకొగలిగితే మనం చేస్తున్న పనికి సార్థకత లభిస్తుంది” ఆమె కూడా రాహుల్ పంథాలోనే వెళ్తూ మాట్లాడింది.
“అంటే మీరు సమ్మెలు చేయించడం తప్పు కాదు కానీ, దానిని వ్యతిరేకిస్తే తప్పా. ఎవరి డిఫెన్స్ వాళ్ళు చూసుకోవాలి కదా. అయినా ప్రియాంక, నీ ఉద్దేశం అయితే నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక పక్క ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అంటూ మరో పక్క వారిలో అకారణంగా విద్వేషాలు రెచ్చగొట్టి సమ్మెలు అవీ చేయిస్తూ ప్రతీపనిలో అడ్డుపడుతూ ఉంటావ్.
నీ కనస్ట్రక్టివ్ ఫోర్సు సంగతి ఏమైంది, ఒకప్పుడు ఎంతో మంది వాలంటీర్లు ప్రభుత్వ విధానాల్లో లోపాలను పసిగట్టి తెలియజేస్తే నేను మనసులో చాలా సంతోషించాను. ప్రజల్లోకి నువ్వు చొచ్చుకునిపోయిన విధానం చూసి ఆశ్చర్యపోయాను.కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి మీ ఇన్వెస్టర్స్ చెప్పినట్టల్లా, చెప్పిన చోటల్లా భూముల కోసం ఎగబడుతున్నావ్. దీంట్లో ప్రజలకి మేలు ఎంతుందో నువ్వే ఆలోచించు.
ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థమే కదా భూములను అక్వైర్ చేసేది. ఆ సౌకర్యాలు పరిశ్రమలు కావచ్చు మరింకేమైనా కావచ్చు. అది ప్రభుత్వ విధానాల్లో భాగమే అవుతుంది. అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలాంటి రాజకీయాలు చెయ్యడం నాకు నచ్చలేదు” ఆమెతో అన్నాడు రాహుల్. ఆమె ఏమి సమాధానం చెప్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు సిద్ధార్థ.
“రాహుల్! అడిగావు కాబట్టి చెప్తున్నాను, నేను ఎప్పుడూ విద్వేషాలు రెచ్చగొట్టలేదు. నా దగ్గరకు వచ్చినవారిని సమర్థించడానికి మాత్రమే ప్రయత్నించాను. వారు చెప్పినదాంట్లో కొంతైనా నిజం లేకపోతే నేను ముందుకు వెళ్ళను. ఇక సమ్మెలు అనేవి ఏ సమయంలో అయినా అనివార్యమైనవి అని నేను ఈ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే తెల్సుకున్నాను. తమ సమస్యలు ఒకొక్కరు ఒకొక్క రకంగా వ్యక్తపరుస్తారు.
నువ్వు కూడా ఒకప్పుడు వరదరాజన్‌గారి విషయంలో సమ్మె చేశావని మర్చిపోకు. ఒక సమస్య ప్రజలందరిదీ అని అభిప్రాయం కలిగినప్పుడు దాని కోసం ఎంతవరకు వెళ్తారు అనేది మన చేతుల్లో లేదు. ఇకపోతే ఇన్వెస్టర్స్ సంగతి అంటావా నేను మా ఇన్వెస్టర్స్ చేతిలో కీలుబొమ్మను అని నువ్వు భావిస్తే, నువ్వు మీ భూషణరావు చేతిలో తోలుబోమ్మవు అని నేను అనుకోవాల్సివస్తుంది.
ఆ ధరణికోట ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడానికే అతను మీ పార్టీలో చేరాడు అని అందరికీ తెలుసు, నువ్వు అతని ప్రోద్బలం మీదటే ఆ పనులు వేగవంతం చేశావని అని కూడా అందరికీ తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ఉన్న మనలాంటి వాళ్లకి ఫ్రీ విల్ అనేది ఉండదు రాహుల్. నీ ఇన్వెస్ట్మెంట్ కన్నా నా ఇన్వెస్ట్మెంట్ గొప్పది అని నిరూపించుకోవడానికే సమ్మెలు చేస్తూ ఉంటాము, మొత్తం మీద ఏ ప్రభుత్వం అయినా మోర్ ఆర్ లెస్ క్యాపిటలిస్ట్ మీద ఆధారపడి గవర్నమెంట్ రన్ చేస్తూనే ఉండాలి.
ఎందుకంటే పనిచేసే కార్మికులు వందలమంది ఉంటారు, కానీ పనిచ్చేవారు లేకపోతే వీరి పరిస్థితి ఏంటి. ప్రభుత్వానికి వీరి అవసరం ఉంది, ప్రజలకి వీరి అవసరం ఉంది. అందుకే వీరిద్దరికీ మధ్య వారధిగా ఉండవలసినదే మనం చెయ్యవలసిన పని. ఇది మా నాన్నగారు ఆఖరి రోజుల్లో నాకు నేర్పిన విషయం. నిజంగా నాకు ఈ విషయం నచ్చినా నచ్చకపోయినా నా ఆలోచనలనీ, అనుభవాలనీ దీనికి జోడించి నచ్చినట్లు ప్రవర్తించడం తప్ప నాదగ్గర ప్రత్యామ్నాయం లేదు.
నా లక్ష్యం ఏంటో నేను క్లియర్‌గా మా మేనిఫెస్టోలో తెలియజేస్తాను, స్వశక్తి ఉండాలి, దానికి ప్రోత్సాహం కావాలి. అర్థమైన వాళ్ళు నాకు సహకరిస్తారు, కాని వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఎకనామిక్ మోడల్‌ను సపోర్ట్ చెయ్యక తప్పదు. ప్రొడక్టివిటీ అన్నది ఇన్వెస్ట్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎనీవే ప్రజల్లో ఇప్పుడు చైతన్యం వచ్చిందని నాకు తెలుసు ఇక ఆఖరిన వారు ఎవరిని ఎన్నుకున్నా నాకు పెద్ద సమస్య లేదు. నా లక్ష్యంలో నేను సగం విజయం సాధించినట్లే” కొంచెం ఉద్వేగంగా చెప్పింది. వారిద్దరూ ఆమె చెప్పినదానికి నోటమాట రాకుండా అయిపోయి చాలాసేపు నిశ్శబ్దంగానే ఉండిపోయారు.
“ఈ రోజు మనం కలుసుకోవడం మంచిదే అయ్యిందని నా అభిప్రాయం. మీరిద్దరూ ఒకరి అంతరంగం ఒకరు తెలుసుకున్నారు కదా. దానివల్ల ప్రజలకో మీకో ఎవరికో ఒకరికి లాభం చేకూరి ఉంటుంది.” అతను ఇలా అంటూండగానే ఒక పెద్ద వెలుగు వెలిగినట్లు ముగ్గురూ గమనించారు. ఒక పత్రికా విలేఖరి ఎవరో రహస్యంగా తాము ముగ్గురూ మాట్లాడుకున్నది ఫోటో తీసాడు. చూస్తోంటే అతను చాలా సేపటినుంచీ అక్కడే ఉన్నట్లు అనిపిస్తోంది. అతడిని పట్టుకోమని హోటల్ వాళ్ళని అలర్ట్ చేసే లోపే అతను అక్కడ నుంచి ఉడాయించాడు.
***
ఖైరతాబాద్లోని పరిసారాలన్నీ హడావిడిగా గాలిస్తున్నారు వారిద్దరూ “అతను ఇక్కడ ఉంటాడని నీకెలా తెలుసు చక్రీ” అడిగాడు జగదీశ్వరరావు.
“అతని పేరు అప్పన్న అని మన రికార్డ్స్‌ను బట్టి తెలిసింది కదా సర్. ఆ రోజు కాంటీన్లో మీరు నాకు ఫోటోలు చూపించినప్పుడు పెద్దగా అనుమానం రాలేదు. కాకపోతే ముంబై హాస్పిటల్‌లో సూరి ఆక్సిడెంట్ గురించి తెలుసుకున్న తరువాత మళ్ళీ ఆ ఫోటోలు చూస్తుండగా ఎక్కడో ఇతడిని చూసాను అని నాకు అనిపించింది. ఆలోచిస్తే ఇతడిని ఒక కేసులో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు గుర్తొచ్చింది. లోకల్‌గా కొంతమంది గూండాలతో ఇతనికి పరిచయం ఉంది. ఇతను బాగా చదువుకున్నాడు హైప్రోఫైల్ నేరాలు చెయ్యడంలో సిద్ధహస్తుడు. ఇతని అసలు పేరేంటో ఎవరికీ తెలీదు. చాపర్ పూర్తిగా ధ్వంసం అయిపోవడం వలన ఇతని శరీరం కూడా గుర్తుపట్టలేని రీతిలోకి వెళ్ళిపోయింది. అందుకే మనం ఇన్వెస్టిగేషన్ టైంలో ఇతడి గురించి పట్టించుకోలేదు. అస్సలు మీరు అమెరికా నుంచి తెప్పించిన ఫోటోల వల్లనే కదా ఇతడిని ఈ కేసుకు మనం లింక్ చెయ్యగలిగాం” చెప్పాడు చక్రధర్. వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి జోగేశ్వరరావు గారి కేసుని ఎలాగైనా తిరిగి రీ-ఓపెన్ చేయించాలనే పట్టుదలలో ఉన్నారు.
“రెండు మూడు సార్లు నేను రాహుల్‌ని అతని స్నేహితుడు గణేష్ గురించి ప్రశ్నించగా అతను ఎక్కడున్నాడో తనకి కూడా తెలీదని. ముంబై హాస్పిటల్‌లో తన పేరు మీద గణేష్ రూమ్ బుక్ చెయ్యడంలో తనకి ఎలాంటి సంబంధం లేదని, కాకపోతే గణేష్‌కి తాను ఆ అధికారం ఇచ్చినట్లుగా చెప్పాడు.
గణేష్ ఎందుకు మరి ఆ హాస్పిటల్ రూమ్ బుక్ చేసి ఉంటాడు అన్నది మనకి కేవలం అతను మాత్రమే సమాధానం చెప్పగలడు. ఇప్పుడు అతనెక్కడున్నాడో రాహుల్‌కి కూడా తెలీదు అంటున్నాడు, అసలే అతను పోలిటీషియన్ కదా అతడిని ఎక్కువసార్లు ప్రశ్నిస్తే మనకే రిస్క్ అని పెద్దగా ఇంక అతడిని అడగలేదు. కనుక మనం మనకున్న ఆఖరి లీడ్ ఈ అప్పన్న గురించి మాత్రమే తెలుసుకోగలము అంతే”. ఖైరతాబాద్‌లో అప్పన్న ఉండే ఇంటిని మొత్తానికి తెలుసుకున్నారు వారిద్దరూ
“ఉస్కా బీవీ అభీ యహా నహీ రెహ్తా సాబ్. ఓ సారా సామాన్ నికాల్ కే ఘర్ ఛోడ్ దియా. ఒకళ్ళు ఎవరో వచ్చి ఆమెకు దుబాయిలో నౌకరీ ఇప్పిస్తామని చెప్పి తీసుకుపోయిండ్రు సాబ్.” అతని ఇంటికి పక్కన ఉన్న తావీజులు అమ్మే ఒక ముసలి తాత చెప్పాడు.
“పోనీ వాళ్ళకి చుట్టాలు ఎవరైనా ఉన్నారా” అడిగాడు చక్రధర్.
“వో సబ్ హమ్కో నహీ మాలుం సాబ్. ఆ రోజు కూడా ఉదయం సమయంలో వారు వచ్చారు కనుకనే నాకు తెలిసింది” చెప్పాడు అతను. జగదీశ్వరరావు వారిస్తున్నా వినకుండా తాళం వేసున్న ఆ ఇంటిని తలుపుని బద్దలకొట్టుకుని లోపలికి వెళ్ళాడు చక్రధర్.
“ఓహ్ మై గాడ్” లోపలి వచ్చిన వెంటనే అతని నోటి నుంచి వచ్చిన మొదటి మాట అది. కారణం ఆ ప్రదేశం మొత్తం నాలుగైదు కంప్యూటర్‌లూ వాకీటాకీలు, ఇతర కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ చిందరవందరగా పడి ఉన్నాయి. ఏంటీనాలతో చిందరవందరగా పడి ఉన్న కాగితాలతో అదొక చిన్నన సైజు ప్రయోగశాలలాగ ఉంది. అక్కడ నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా సమాచారం అందజేయగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు గమనించారు. సరే అని డిపార్ట్మెంట్ వారికి అక్కడ ఇన్ఫర్మేషన్ తెలియజేసి అక్కడ ఉన్న సామాగ్రి అంతా తమ వేర్ హౌస్‌కి షిఫ్ట్ చేసే ఏర్పాటు చేసారు.
వారు తిరిగి వెళ్తున్న సమయంలో “అయితే ఆమెను దుబాయికి తరలించింది కూడా మిస్టర్ X అయ్యుంటాడు అంటారా. మరి సూరి గురించిన ఇంకా మనకి ఎటువంటి వివరాలు తెలియవు అంటే వారి తల్లిదండ్రులు కానీ ఇంకా ఇతర వివరాలు కానీ తెలీవు. ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ తప్ప మనుషులెవరూ దొరకలేదు.ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అంటారు” అర్థం కానట్లుగా అడిగాడు చక్రధర్. తమకి విలువైన ఇన్ఫర్మేషన్ దొరికినప్పటికీ అతనికి ఎందుకో సంతృప్తిగా అనిపించలేదు.
“సూరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకాలన్నా, ఆక్సిడెంట్ సమయంలో గణేష్ అక్కడికి ఏ విధంగా చేరుకున్నాడు అని తెలుసుకోవాలన్నా, రాహుల్‌కి తెలీకుండా సూరి పేరు మీద హాస్పిటల్ రూమ్ ఎందుకు తీసుకున్నాడు అని మనకి తెలియాలన్న, ఈ కేసుకీ వేరే కేసులకీ లింక్ మనకి దొరకాలన్నా ఆ గణేష్ మనకి దొరకాలి. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అన్న వివరాలు మనకి తెలియాలి” డ్రైవింగ్ చేస్తూ చెప్పాడు జగదీశ్వరరావు. ఏదో ఆలోచిస్తున్న చక్రధర్‌కి అనుకోకుండా ఆరోజు పత్రికల్లో ప్రచురింపబడిన తాజ్ రెస్టారెంట్ లోని రాహుల్, సిద్ధార్థ, ప్రియాంకల ఫోటో కనిపించింది. ఒక్కసారిగా అతని ముఖం ప్రకాశవంతం అయ్యింది.
“సార్, ఎలాగో మనకి రాహుల్ హెల్ప్ చెయ్యట్లేదు కదా. ఈ విషయంలో మనం ఎందుకు ప్రియాంక గారి హెల్ప్ తీసుకోకూడదు. ఈ ఫోటో చూడండి ఒక్కసారి వీరు ముగ్గురూ పాత కాలంలో స్నేహితులు, వీరితో పాటుగా గణేష్ కూడా అదే కాలేజీలో చదివేవాడు. కనుక అతను ఏమై ఉంటాడో ప్రియాంకకు తెలిసే ఛాన్స్ ఉంది కదా” కొత్త విషయం కనిపెట్టినట్లు ఉత్సాహంగా చెప్పాడు చక్రధర్.
“పర్ఫెక్ట్ అదే సరైన పద్ధతి. మనకి డెఫినెట్‌గా ప్రియాంక నుంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంతకీ ప్రియాంకకూ గణేష్ గతంలో స్నేహితులని నీకెలా తెలుసు” అర్థం కానట్లుగా అడిగాడు జగదీశ్వరరావు
“సోషల్ నెట్వర్కింగ్ సార్. సోషల్ నెట్వర్కింగ్. ఇందులో ఎవరికీ ప్రైవేట్ లైఫ్ అన్నదే లేదు” చెప్పాడు చక్రధర్. ఆయన చిన్నగా నవ్వి ఫోన్ లోనే ప్రియాంకతో అప్పాయింట్మెంట్ ఫిక్స్ చేసి నేరుగా ప్రియాంక వాళ్ళ ఇంటికి పోనిచ్చాడు.
గతంలో నకునారెడ్డిని అశోక్ త్యాగీ కేసు విషయంలో ప్రశ్నించడానికి రెండు మూడు సార్లు జగదీశ్వరరావు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. తాను వెళ్ళేసరికి ప్రియాంక టీవీలో ఏదో న్యూస్ ఆందోళనగా చూస్తోంది
“విశాఖపట్నం ధరణికోటకి కొంచెం దూరంలో గవర్నమెంట్ ఏరియాలో లభించిన గణేష్ మృతదేహం. ఈ వార్త విన్న హోం మంత్రి రాహుల్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇతను హోం మంత్రి రాహుల్ గారికి అంతరంగిక మిత్రుడు అవ్వడం వలన హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకునే పనిలో ఉన్నారు హోం మంత్రిగారు” తమ చెవులను తానే నమ్మలేకపోయారు చక్రధర్, జగదీశ్వరరావులు ఇద్దరూ. ప్రియాంక వారు వచ్చిన విషయం కూడా గమనించకుండా అలాగే టీవీ చూస్తోంది. అదే సమయంలో అక్కడికి చేరుకున్నాడు సిద్ధార్థ.
(సశేషం)