రాజకీయ వివాహం-15

0
9

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది 15వ భాగం. [/box]

అధ్యాయం- 15

[dropcap]చా[/dropcap][dropcap][/dropcap]లా రోజులుగా తనని ఈ వ్యక్తి ఫాల్లో అవుతున్నట్లుగా గుర్తించాడు ప్రతాప్. ధరణికోటకు సంబంధించిన ప్రాజెక్ట్ పనులు చూసుకోమని తండ్రి తనను విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఉండవలసినదిగా కోరాడు. మొదట్లో యాదృచ్ఛికం అనిపించి తను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తి తనని నీడలా వెంటాడుతూ ఉండడం వలన ప్రతాప్ అనుమానించాడు. అందుకే తనకు బాగా పరిచయం ఉన్న సుదర్శన్‌ను ఈ విషయంలో సహాయం చెయ్యవలసినదిగా కోరాడు. వాళ్ళిద్దరూ ‘ది పార్క్’ హోటల్‌లో రహస్యంగా కలుసుకున్నారు.

“మొదట్లో మనం రెగ్యులర్‌గా వెళ్ళే హోటల్‌లో నన్ను కలుసుకున్నాడు, నాకు దాంట్లో పెద్దగా విచిత్రం అనిపించక పట్టించుకోలేదు. ఆ సమయంలో ముంబై హాస్పిటల్‌లో నన్ను చూసానని, నాతోపాటు జానీ కూడా ఉన్నాడని ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో నేను కొంచెం తాగి ఉండడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను సుకన్య గురించి కూడా ఆరా తీయడం మొదలుపెట్టాడు.

ఈ జానీగాడేమో ఎప్పుడూ ఇలాంటి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటాడు. అస్సలు ఆ సూరిగాడు తప్పించుకోవడానికి కూడా వీడే కారణం. ఇప్పుడేమో నాన్నగారు రాజకీయాల్లో పడిపోయి ఈ గొడవలేమీ పెద్దగా పట్టించుకోకుండా, ఎప్పుడు చూసినా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇప్పుడేమి చెయ్యాలో నాకు సలహా ఇస్తావని నిన్ను పిలిచాను, వీడిని ఏమి చెయ్యాలంటావ్” అడిగాడు ప్రతాప్, అతని ముఖం చూస్తే కొద్దిగా భయపడినట్లు అనిపిస్తోంది.

“మీరేమీ వర్రీ అవ్వకండి, సుకన్య ఆక్సిడెంట్‌ను, దానితోపాటుగా మీ నాన్నగారు చేయించిన ఆక్సిడెంట్ వరదరాజన్ కేసును మన వరకు ట్రేస్ చెయ్యడం అన్నది దాదాపు అసాధ్యం. సిబిఐ వాళ్ళే క్లోజ్ చేసిన ఈ కేసులో ఒక యువకుడు ఎంత వరకూ సాల్వ్ చెయ్యగలుగుతాడు. అయినా ప్రభుత్వం మొత్తం మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు దేనికి భయపడుతున్నారు. అతడి అడ్డును ఏ విధంగా తొలగించుకోవాలో, మీరు నన్ను సహాయం కోరడం నాకే చాలా విచిత్రంగా అనిపించింది. నాకన్నా మహామహులైన పనివాళ్ళు మీదగ్గర ఉన్నారు కదా” అన్నాడు సుదర్శన్.

అతని ఉద్దేశం ఏంటో గ్రహించిన ప్రతాప్ “నిజమే అనుకో, కానీ త్వరలోనే జరగబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పనులు అన్నీ ఆపేయ్యమని డాడ్ ఆర్డర్ చేసారు. అందుకే మా వర్క్ ఫోర్సు అంతా కూడా చాలా కాలంగా పనిలేకుండా ఉన్నారు” చెప్పాడు.

“ఇంతకీ మిమ్మల్ని వెంటాడుతున్న ఆ వ్యక్తి ఎవరు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాడా?” కుతూహలంగా అడిగాడు సుదర్శన్.

“చూడ్డానికి అలా అనిపించడం లేదు కానీ ఎవరో అతడిని మన మీదకు ఉసిగొల్పుతున్నారని నా అనుమానం, అసలు సుకన్య విషయంలో పెద్ద బాస్ చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది” విస్కీ సిప్ చేస్తూ అన్నాడు ప్రతాప్.

కొంత సమయం తరువాత “ఇతడు నీకేమైనా తెలుసేమో ఒక్కసారి చూడు” తన సెల్ ఫోన్‌లో ఉన్న ఫోటోను సుదర్శన్ ముందు ఉంచుతూ అన్నాడు ప్రతాప్. మొదటిసారి తను ఎప్పుడూ వెళ్ళే హోటల్‌లో గణేష్ తనని కలిసినప్పుడు అనుకోకుండా తీసిన ఫోటో అది.

అందులో ఉన్న గణేష్‌ను గుర్తుపట్టిన సుదర్శన్ చెప్పాడు “ఇతను నాకు తెలుసు, పరిచయం లేదు కానీ. ప్రస్తుతం మీ నాన్నగారి పార్టీకి చెందిన వాడే. రాహుల్‌కి అంతరంగిక మిత్రుడు, పేరు గణేష్. ఇతడు నీ వెంటపడుతున్నాడు అంటే జె.హెచ్. పార్టీలో ఎవరో నీ గురించి ఆరా తీయమని పంపి ఉండాలి. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద తామే నిఘా పెట్టడం సాధారణంగా జరగదు కదా. అది అంతర్గత కలహాలకు దారితీసి ప్రభుత్వం పడిపోయే స్థాయికి తీసుకువస్తుంది.

అందులోనూ గతంలో మీ నాన్నగారు జె.హెచ్. పార్టీని సపోర్ట్ చేసినవారు కదా, మీరు అధికార పక్షంతో చేతులుకపడంతో మిమ్మల్ని ఎలాగైనా డిఫేం చెయ్యాలనో, లేదా అనుమానం కలిగో మీమీద కేసు బనాయించడానికి ట్రై చేస్తున్నారు. నా అనుమానం నిజమైతే త్వరలోనే వీళ్ళు సిబిఐ వాళ్ళను కూడా కాంటాక్ట్ చేస్తారు. ఇప్పటివరకు నీ గురించి అతనికి ఎంత సమాచారం తెలిసి ఉంటుందని నీ అంచనా” అడిగాడు సుదర్శన్

“అతడు ముంబై హాస్పిటల్ గురించి మాత్రమే మాట్లాడాడంటే, అక్కడ సూరిగాడిని చంపింది మనమే అని వాడికి తెలిసే అవకాశం లేదు. సుకన్య తల్లిదండ్రులతో మాట్లాడి ఉంటాడు, వాళ్ళదగ్గర నుంచి పెద్దగా సహాయం అంది ఉండదు, అందుకే నా వెనక పడుతున్నాడు. మరి ఇతని విషయం పెద్ద బాస్‌కి చెప్పాలా వద్దా?” అర్థం కానట్లుగా అడిగాడు ప్రతాప్

“ఎప్పుడు చూసినా పెద్ద బాస్ అంటూ ఉంటావ్, ఇంతకీ ఎవరు అతడు” అడిగాడు సుదర్శన్

“అతని వివరాలు నాకు కూడా పూర్తిగా తెలీవు, ఆ వ్యవహారం మొత్తం నాన్నగారే చూసుకుంటారు. ఎప్పుడు ఏదైనా అవసరం ఉన్నా నాన్నగారినే కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు. సరేలే ఇది ఆయనకి చెప్తేనే మంచిది. ఈ పార్టీ వ్యవహారాలూ తలనొప్పి అంతా ఎందుకు చెప్పు. మనమెందుకు టెన్షన్ పడాలి.

నీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయనే నిన్ను రమ్మని అడిగాను. నీవల్ల అతను జె.హెచ్. పార్టీ వాళ్ళ ప్రోద్బలం మీద వచ్చి ఉంటాడని అర్థమయ్యింది. మిగతా విషయాలు డాడ్ చూసుకుంటారు” అతను అలా అనడంతో ఇంక వారి మధ్య సంభాషణ ముగిసింది.

మరి కొంత సేపు అక్కడే ఉండి తరువాత బయటపడ్డాడు సుదర్శన్. అప్పుడు రాత్రి సమయం తొమ్మిది గంటలు అయ్యింది. తన కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక నెంబర్‌కి ఫోన్ చేసాడు సుదర్శన్.

 “ఆ మేడం, నేను సుదర్శన్ ని గుర్తుపట్టారా” అవతలి వ్యక్తి సమాధానం చెప్పిన తరువాత “ఏమి లేదు మేడం, నాచిరెడ్డిగారి భార్య కేసుని పరిశోధించమని మీరు పంపిన మీ స్నేహితుడు కష్టాల్లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఆయన విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది” కొంతసేపు అవతలి వ్యక్తి ఏదో మాట్లాడుతూ ఉంటే నిశ్శబ్దంగా వింటున్నాడు సుదర్శన్.

“ఆహా అలా ఏమి లేదు మేడం, నేను ఇదివరకే చెప్పాను కదా నాకు బెనిఫిట్స్ కన్నా ఎవరికి ఏ సమాచారం ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుని వారికి అందించడం ముఖ్యం. నాదగ్గర ఉన్న క్రెడిబుల్ సోర్సెస్ ప్రకారం మీ ఫ్రెండ్ సేఫ్టీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నా అభిప్రాయం, ఇంకా భూషణరావు కాకుండా ఒక కొత్త వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ ఐనట్లు నాకు అనిపిస్తోంది” అవతలి వ్యక్తి ఏదో మాట్లాడిన తరువాత ఆఖరిగా అన్నాడు సుదర్శన్

“ఒకే మేడం, నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను. దీనివల్ల నాకెలాంటి బెనిఫిట్ వస్తుందో మీరే ఆలోచించండి. ఆ తరువాత మీ ఇష్టం” అని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసాడు సుదర్శన్. ఇంటికి వెళ్లి ఇంక ఆ విషయం అక్కడితో మర్చిపోయి, ఆ మరుసటి రోజు జరగబోయే రాలీని ఏ విధంగా కవర్ చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు.

***

“వాడు మనకి ఇలా అడ్డుపడతాడని నేను అస్సలు ఊహించలేదు. సరే నువ్వేమీ భయపడకు. నీ పనుల మీద కాన్సంట్రేట్ చెయ్యి. అస్సలే రేపు చాలా పెద్ద ప్రొటెస్ట్‌ని ఎదురుకునే అవకాశం ఉంది. దాన్ని ఎలా డీల్ చెయ్యాలో ఆలోచించు. ఈ విషయం నేను అవసరమైన వాళ్ళతో డిస్కస్ చేసి ఏమి చెయ్యాలో నిర్ణయిస్తాను” ఫోన్‌లో భూషణరావు స్వరం గంభీరంగా ధ్వనించింది.

ఆయన మాటలు విన్న తరువాత తనకు కొంచెం భరోసాగా అనిపించి హాయిగా నిద్రపోయాడు ప్రతాప్. ఆ మరుసటి రోజు ధరణికోట ప్రాజెక్ట్ పనులు నిలిపివేయ్యాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు, వాటికి అధ్యక్షత వహించినది జె.హెచ్. పార్టీ వారు కావడం ఇక్కడ విశేషం. ఇప్పటివరకూ తన కనుసన్నల్లో మెలిగిన పార్టీవారు, కొత్తగా కమ్యూనిస్టుల చేరికతో పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోయారు.

సిద్ధార్థను కూడా వాళ్ళు పట్టించుకునే స్థితిలో లేరు, ఇంక ప్రియాంక విషయం అయితే చెప్పనే అవసరం లేదు. అయితే ఈ ఉద్యమానికి ప్రజలనుంచి మంచి స్పందన రావడం జె.హెచ్. పార్టీకి లాభదాయకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఆపివేయ్యాల్సిన స్థితికి ప్రభుత్వం చేరుకుంది.

జరుగుతున్న పరిణామాలు అన్నిటినీ నిశ్శబ్దంగా గమనిస్తోంది ప్రియాంక, అయినా కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. కానీ ప్రజలు ఈ విషయంలో తమని సపోర్ట్ చెయ్యడం ఎందుకో ఆమెకు చాలా బాధాకరంగా అనిపించింది, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఎవరి లక్ష్యం ఏంటో ఆలోచించడానికే ఆమెకు భయంగా ఉంది.

ఈ సందర్భంగా రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరగడం, పోలీసులకు నిరసనకారులకూ మధ్య గొడవలు జరగడం సంభవించింది. అనుకోని చోట్ల అనవసరమైన ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారని అభివృద్ది నిరోధకులని ప్రభుత్వం బహిరంగంగా జె.హెచ్. పార్టీవారిని విమర్శించింది.

“తమ హయాములో ప్రభుత్వంచే కేటాయించబడిన భూమిలోనే ప్రస్తుతం నిర్మాణం పనులు చేపడుతున్నప్పటికీ జె.హెచ్. పార్టీవారు అధికార దాహంతో, అభివృద్ది సాధిస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల ఓర్వలేని తనంతో కొంతమంది శ్రామికనేతలతో చేతులు కలిపి ఇలాంటి సంఘ విద్రోహక చర్యలకు పాల్పడడం ఏమంత మంచి విషయం కాదు.

ప్రజలేమైనా వెర్రివాళ్ళు అనుకుంటున్నారా, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే ప్రతిపక్షంగా మారినప్పుడు ప్రజా వ్యతిరేక చర్యలు అయిపోయాయా. దీనికి తోడుగా ‘అందరికీ భూమి’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తే వినే స్థానంలో ప్రజలు లేరు. ఇది కేవలం రాజకీయ లబ్దికోసం చేసేదేనని జ్ఞానం ఉన్న ఏ ఒక్కరికైనా అర్థం అవుతుంది, కనుక జె.హెచ్. పార్టీవారు ఈ చర్యలు మానుకుంటే మంచిది. లేదంటే అంతంత మాత్రంగా ఉన్న వారి పార్టీ రాబోయే ఎలక్షన్స్‌లో పూర్తిగా అడ్రెస్ లేకుండా పోతుంది” ఒక టీవీ ఛానెల్ తో జరిగిన ఇంటర్వ్యూలో రాహుల్ బహిరంగంగా తమ పార్టీని ఘాటుగా విమర్శించడం ప్రియాంక దృష్టిలో పడింది.

ఒకరకంగా చెప్పాలంటే రాహుల్ ధరణికోట ప్రాజెక్ట్‌ను తన తండ్రి పరువు, ప్రతిష్ఠ తన రాజకీయ ఉనికికి ప్రేస్టీజ్ ఇష్యూగా తీసుకున్నాడు, అందుకే తమ ఉద్యమాలతో కొద్దిగా దెబ్బతిన్న అతడి ఇమేజ్‌ను కాపాడుకునే పనిలో పడ్డాడు. తను ఏదైతే జరగకూడదు అని ఇంతకాలం కోరుకుందో ఆఖరికి తన వల్లనే ఆ పని జరగడం ఆమెకు మింగుడుపడకుండా ఉంది. అయితే ఇది గమనించిన సిద్ధార్థ ఆమెకు ఈ సమయంలో అండగా నిలిచాడు.

ఈ సభలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించడంలో అతను కూడా భాగస్వామిగా ఉన్నాడు అన్న విషయం ఆమెకు తెలిసినా కానీ ఎందుకో అతని చర్యలను ఆమెను సమర్ధించుకోగలుగుతోంది. ఈ ఉద్యమం వేడిలోనే తను తమ ఎలక్షన్స్‌కి సంబంధించిన పొలిటికల్ కాంపైన్ కూడా ప్రారంభించాడు సిద్ధార్థ, అందుకు హైదరాబాద్‌లో ఒక మంచి ఏరియాలో పెద్ద ఆఫీస్ కూడా తీసుకున్నాడు.

తాము జరపబోయే కార్యక్రమాలు, తమ పార్టీకి సంబంధించిన మొత్తం సమాచారం ఇవన్నిటితోపాటు తమని సపోర్ట్ చేసే ఇన్వెస్టర్స్ వీళ్ళందరితో మాట్లాడడానికి, సంప్రదింపులు జరపడానికి, టీవీ ఛానెల్స్ వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికీ వగైరా అన్ని విషయాలకూ దాన్నొక వేదికగా వాడుకుంటున్నాడు సిద్ధార్థ.

చూస్తుంటే ఎన్నికల వేడి అప్పుడే రాజుకున్నట్లు ఉంది. ఎన్ని చేసినా కానీ ఆఖరికి పదవి దక్కించుకోవడమే తమ అంతిమ లక్ష్యం కావడం ఆమె ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఇదే విషయంపై సిద్ధార్థతో పలుమార్లు వాగ్వివాదం పెట్టుకుంది, అయితే ప్రతీసారి అతనే విజేతగా మారి తాను అతనికి సహకరించేలా చేసుకోగలిగాడు. ఇవన్నిటి మధ్యా ఆమెకు గణేష్ గురించి పట్టించుకునే తీరికే లేకుండా పోయింది.

***

“మనం ఎక్కడికి వెళ్తున్నామో నీకేమైనా ఐడియా ఉందా. ఓ పొలాలలోనికీ, అడవిల్లోకి తీసుకువెళ్లిపోతున్నావ్” అడిగాడు గణేష్ తన ముందర పరుగులాంటి నడకతో సాగిపోతున్న దుర్గాభవానిని అందుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు అతను.

“నువ్వేమి ఖంగారు పడకు, ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ప్రదేశాలు, కాకపోతే ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేదనుకో. ఐనప్పటికీ నాకు ఇవన్నీ బాగానే గుర్తు” ఇంకా ముందరకి వెళ్ళిపోతూ చెప్పింది ఆమె. ప్రతాప్ ఉండే హోటల్ మేనేజర్‌తో మాట్లాడగా ఆఖరిసారి అతను సుకన్యను తీసుకుని ఆ హోటల్‌కి వచ్చాడని, కేంద్రమంత్రి నాచిరెడ్డి భార్య అవ్వడం వలన ఆమెను రెండు మూడు సార్లు టీవిలో చూసివుండడం వలన గుర్తుపట్ట గలిగాను అని చెప్పాడు.

ప్రతాప్ అక్కడికి వచ్చినప్పుడు అతనితో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళలో ఒకరు టెన్నిస్ ప్లేయర్ చరణ్ అని చెప్పాడు మేనేజర్. అయితే రెండవ వ్యక్తి ఎవరనేది అతను గుర్తుపట్టలేకపోయాడు. వాళ్ళు మాట్లాడుకున్న మాటలను బట్టి వాళ్ళు ధరణి కోట ఏరియా దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటున్నట్లుగా తెలుసుకున్నానని కూడా చెప్పాడు.

రాంపండుతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఏమైనా తనిఖీ చేస్తే తనకి సుకన్య మరణానికి ముందర ఆమె కిడ్నాప్ గురించి తెలిసే అవకాశం ఉందనుకున్నాడు, ఇంతలో అనుకోకుండా తనకు దుర్గ నుండి ఫోన్ వచ్చింది. ఆ రోజు ట్రైన్ నుండి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ తనతో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదని ఆమె అతడిని ప్రశ్నించింది.

ఏమి చెప్పాలో తెలీక సరేలే ఎలాగో తను కూడా ఈ ప్రాంతానికి చెందినదే కదా ఆమెకూడా తనకి ఈ ప్రాంతంలో తనిఖీ చెయ్యడానికి ఉపయోగపడుతుంది అని ఆమెను తీసుకుని ఒక కార్ హైర్ చేసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. హైవే మీద ఒక ధాబా దగ్గర కార్ పార్క్ చేసి అక్కడ నుండి కాలినడకన వాళ్ళు లోపల అడవిలాంటి ప్రాంతానికి వెళ్తున్నారు. ఆమె ఉత్సాహంగా ముందుకు సాగిపోతోంది.

“అది సరే నువ్వు హైదరాబాద్ లో ఎక్కడ ఉండేదానివి? ఆ రోజు ట్రైన్లో అంతసేపు మాట్లాడుకున్నాం కానీ నీ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయాను” ఆమెను చేరుకుంటూ అడిగాడు గణేష్. వాళ్ళిద్దరూ పిక్నిక్‌కి వచ్చినట్లు సరంజామా అంతా తీసుకుని వచ్చారు.

“తెలిసిన వాళ్ళు ఒకళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ కింద ఉంటున్నాను, అదేమీ పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదులే” అన్నది ఆమె.

“ఇది చాలా నిర్జనమైన అడవిలాగ లోపలి వెళ్తే క్రూరమృగాలు అవీ వెంటపడచ్చేమో” భయం వ్యక్తం చేసాడు గణేష్.

“డోంట్ వర్రీ. ఇలాంటి సమయాల్లో ఉపయోగపడడానికి నా దగ్గరున్న బ్యాగ్‌లో బేర్ గ్రిల్స్ సర్వైవల్ కిట్ ఉంది” కిలకిలా నవ్వుతూ చెప్పింది. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళగానే వాళ్లకి ఒక కాలిబాట లాంటిది కనిపించింది. నాలుగు చక్రాల వాహనాలు కూడా అక్కడకి తరచుగా వస్తూ వెళ్తున్నట్లు టైర్ గుర్తులు కూడా వారికి అక్కడ కనిపించాయి.

ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తూ “ఇంతలోపలికి అడవిలో ఈ ప్రదేశం, ఈ కాలిబాటలూ ఉంటాయని ఇక్కడే పుట్టిపెరిగిన ఎవరికైనా తెలిసే అవకాశం లేదే, మరి నువ్వు అంత స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నావ్” అర్థంకానట్లుగా అడిగాడు గణేష్

“మా స్థలం కూడా ఇక్కడే ఉంది. మా నాన్నగారు ఇక్కడ పనిచేసే సమయంలో మా అన్నయ్యతో కలిసి నేను ఇక్కడికి ఒకటి రెండు సార్లు వచ్చాను అందుకే నాకీ ప్రదేశం అంతా బాగా గుర్తుంది” ఆమె వంక నమ్మశక్యం కానట్లుగా చూసాడు గణేష్

“నీకొక అన్నయ్య కూడా ఉన్నాడా. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏమి చేస్తూ ఉంటాడు” ఆమెను అడిగాడు

“వివరాలెందుకులే కానీ మా అన్నయ్యతో నాకు ఈ మధ్య కాలంలో పెద్దగా సంబంధాలు ఏమీ లేవు. ఎవరి దారి వారిది, ఆఖరిసారి అతడిని మా తండ్రి చనిపోయినప్పుడే చూసాను. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలీదు” చెప్పింది దుర్గ, ఆమె గురించి తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఈ ట్రిప్ ఆసక్తికరంగా మారుతోంది అనిపిస్తోంది అతనికి.

“అది సరే మనం కలుసుకుని దాదాపు ఆరు నెలలు అవుతోంది కదా అప్పటినుంచీ నువ్వు వైజాగ్ లోనే ఉంటున్నావా. నేనైతే అవసరం కొద్దీ నా రాజకీయ వ్యవహారాలు, నా స్నేహితుల కోరిక మీదట పనులన్నీ మానుకుని ఇక్కడ ఉండవలసి వచ్చింది. మరి నీకేమో హైదరాబాద్‌లో ఏదో న్యూస్ ఛానెల్‌లో ఉద్యోగం ఉందన్నావ్. దాని సంగతి ఏమైనది, మళ్ళీ నువ్వు హైదరాబాద్ వెళ్ళలేదా?” తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కొంత దూరం ముందుకు వెళ్లి అక్కడ నుంచుని దూరంగా కనిపిస్తోన్న కొండలను చూస్తోంది.

అక్కడ నుంచి చూస్తే దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో లోయలో ఉన్నట్లుగా కనిపిస్తోంది ఒక పెద్ద భవనం. బైనాక్యులర్స్‌తో పరిశీలించిన ఆమెకు దాని దగ్గర రెండు మూడు పాతబడిన వాహనాలు కూడా కనిపిస్తున్నాయి. ఆమె ఏమి చూస్తోందా అని కుతూహలంగా ఆమె చేతిలోనుండి బైనాక్యులర్స్ తీసుకుని తను కూడా ఆసక్తిగా చూసాడు గణేష్.

“త్వరలోనే ఈ బంగాళా కూడా ధ్వంసం అవ్వబోతోంది. ఇక్కడికి కొంత దూరంలోనే ప్రభుత్వం వారు పైలెట్ ప్రాజెక్ట్‌గా నిర్మించబోతున్న వ్యర్ధ నిర్వహణ ప్రాజెక్ట్ రాబోతోంది. ఒకరకంగా మా నాన్నగారు చనిపోవడానికి కారణం కూడా ఈ ప్రాజెక్ట్ దానికి సంబంధించిన భూమి అని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా సాగిస్తున్నారు చాలామంది కాంట్రాక్టర్స్” ఆమె ఈ మాటలు అనడంతో అతని ఆశ్చర్యం అధికం అయ్యింది.

చూడ్డానికి సామాన్యమైన ఆడపిల్ల లాగ కనిపించిన ఆమెకు ప్రభుత్వ వ్యవహారాల మీద ఇంత అవగాహన ఉంటుంది అని అతను అనుకోలేదు. ఆమెను ఉద్దేశించి అడిగాడు

“ఓ మై గాడ్, నీకు ఇన్ని విషయాలు తెలుసని నేను అస్సలు అనుకోలేదు, ఈ ప్రాజెక్ట్ విషయంలోనే నేను రాహుల్ కలిపి చాలా సార్లు ఇక్కడ సభలు నిర్వహించాము. ఆ తరువాత నుంచీ నేను ఇక్కడ ఉండిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్‌లో ఏమి జరుగుతోంది అన్న విషయం నాకు పెద్దగా ఐడియా లేదు. ఇందాకా నిన్ను ఓ ప్రశ్న అడిగినట్లు ఉన్నాను దానికి నువ్వింకా జవాబు చెప్పలేదు?” ఆమె వంక చూస్తూ అడిగాడు.

“నీ అన్ని ప్రశ్నలకు సమాధానం మనం వెళ్తున్న ఆ బంగళాలో లభిస్తుంది” ఆ లోయలోకి నెమ్మది నెమ్మదిగా దిగడానికి ప్రయత్నిస్తూ చెప్పింది దుర్గ. ఆడపిల్ల అయినా తానే ఇంతగా ధైర్యం చేసి అక్కడికి వెళ్తూంటే తను ఇంకా ఇక్కడే ఉండడం ఇష్టం లేక అతను కూడా ఆమెను అనుసరించాడు గణేష్ “ఇంతకీ ఆ భవనం ఎవరిదీ, మనమేమి రిస్ట్రిక్టెడ్ ఏరియాలో లేము కదా” వేగంగా ముందుకు సాగిపోతున్న ఆమెతో ఆందోళనగా అన్నాడు గణేష్. అతని మాటలు పట్టించుకోకుండా ఆమె లేడిపిల్లలా చెంగు చెంగున ఎగురుకుంటూ ఇంకా దట్టంగా కనిపిస్తోన్న ఆ లోయలోకి వెళ్ళిపోతోంది.

అతడు కూడా ఇంక మాటలు తగ్గించి ఆమెను చేరుకోవడానికి తన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. మొత్తానికి ఇంకొక నలభై నిమిషాలు వ్యయప్రయాసల తరువాత వారిద్దరూ అక్కడికి చేరుకోగలిగారు. దూరం నుంచి చూస్తే చూస్తే అదొక నాలుగంతస్తులు పెద్ద భవంతి లాగ కనిపిస్తోంది. బాగా పరిచయం ఉన్నట్లు ఆమె అక్కడ పదిహేను అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల వెడల్పూ ఉన్న ఇనపగేటును తోసుకుని లోపలి ప్రవేశించింది.

తాము ఇందాక వచ్చిన అడవి దగ్గర నుంచి ఇక్కడివరకూ కూడా కాలిబాట ఉండడం, దాని పక్కనే వాహనాలు రాకపోకలకి సూచకంగా గుర్తులు కనపడడం అతను గమనించాడు

“కొంపతీసి ఈ భవనం కూడా మీదే అనవు కదా?” అమెతూ కూడా లోపలి వెళ్తూ సరాదాగా ప్రశ్నించాడు. ఆమె చిన్నగా నవ్వింది. లోపలికి వెళ్ళిన తరువాత అతనికి విశాలమైన హాల్ స్పేస్ దానికి కొంచెం ఎదురుగా మొదటి అంతస్తు వరకూ వ్యాపించి ఉన్న పెద్ద మెట్లు కనిపించాయి

“వావ్ ఇంత పెద్ద బిల్డింగ్ ఇక్కడ ఉందని నమ్మడానికే అసాధ్యంగా ఉంది. దీని సంరక్షణ బాధ్యతలు ఎవరు చూసుకుంటూ ఉంటారో కదా” ఆశ్చర్యపోతూ అన్నాడు గణేష్.

“సుకన్య గురించిన వివరాలు నువ్వెంతవరకూ సేకరించావు” ఒక్కసారిగా ఆమె అడిగేసరికి అతను తన చెవులను తానే నమ్మలేకపోయాడు.

“అవును నేను ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపోయాను. ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలుసు” ఆశ్చర్యం రెట్టింపు అవుతుంటే అడిగాడు. తనకి హోటల్ మేనేజర్ ప్రతాప్ వాళ్ళూ మాట్లాడుకున్నది ఈ ప్రదేశం అని చెప్పడం గుర్తొచ్చింది, ఒక్కసారిగా అతని ముఖం ప్రకాశవంతం అయ్యింది.

అవును ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ బంగళాలో ఆమెను కిడ్నాప్ చేసినా ఎవరికీ తెలీదు, అసలు ఇక్కడ ఇతరులెవరూ ఉన్న సూచనలు కూడా కనిపించడం లేదు. బహుశా కిడ్నాప్ చేయబడిన సుకన్య తప్పించుకుంటూ ఉంటె ఆక్సిడెంట్ చేసి చంపించి ఉండాలి. మరి దీనికి వెనక అసలు కారణం ఏంటి, ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయించారు. ప్రతాప్‌కి ఆమెను కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం ఉంటుందని అతను అనుకోలేదు, ఎందుకంటే అతనికి స్త్రీ వ్యామోహం ఉంది కానీ అతనికి కిడ్నాప్ చేయించే అవసరం ఏముంటుంది. ఆఖరి సారిగా సుకన్య కనిపించిన హోటల్‌లో ప్రతాప్‌తో పాటుగా వచ్చిన ఆ మూడవ వ్యక్తి ఎవరు. అన్నే ప్రశ్నల కిందే అనిపిస్తున్నాయి అతనికి.

“నాకు నువ్వేమి చేస్తున్నావో, ఎవరి గురించి అన్వేషణ సాగిస్తున్నవో, నిన్ను ఎవరు పంపించారో అంతా తెలుసు” అతని వంక చూస్తూ చెప్పింది ఆమె. ఆ సమయంలో ఆమెను చూస్తుంటే కొత్తగా అనిపించింది గణేష్, అంతేకాకుండా అతని శరీరం కొద్దిగా కంపించినట్లుగా కూడా అనిపించింది.

“ఎలా తెలుసు. అసలు ఇంతకీ ఎవరు నువ్వు, నీకూ ఈ ప్రదేశానికి సంబంధం ఏంటి” ఆందోళన అధికం అవుతూండగా అడిగాడు .

 “నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇందాకా నేను చెప్పినట్లుగా నీ అన్ని ప్రశ్నలకీ సమాధానం ఇక్కడే దొరుకుతుంది” ఆమె మొదటి అంతస్తులోకి వెళ్ళడానికి మేడమెట్లు ఎక్కుతూ చెప్పింది. ఆశ్చర్యంగా ఆమెను అనుసరించాడు గణేష్.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here