రాజకీయ వివాహం-3

0
10

[box type=’note’ fontsize=’16’] యువత ఆలోచనా ధోరణులకు దర్పణం పడుతూ, వారి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనంద్ వేటూరి అత్యంత ఆసక్తికరంగా సృజించిన నవల ‘రాజకీయ వివాహం‘. ఇది మూడవ భాగం. [/box]

అధ్యాయం- 3

[dropcap]ఆ[/dropcap] రోజు రాత్రంతా ఆలోచించిన తరువాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా ఈ వివాదం పైన అవగాహన పెంచుకుని, ఎంతవరకు నిజం ఉందో తేల్చుకోవాలని అనుకుంది. దానికి ఆమె తన వయసు ప్రపంచం పట్ల తనకున్న జ్ఞానం సరిపోదేమో అని అభిప్రాయపడింది. సహజంగా తను పుట్టిపెరిగిన వాతావరణం ఇప్పటివరకూ ఈ భూవివాదాలు ఇంకా వాటికి సంబధించిన ఇతరమైన అంశాల గురించి తెలుసుకునే అవకాశం కలిగించలేకపోయాయి.

ఎప్పుడైనా కానీ ప్రతీ అంశం మీదా రెండు రకాలైన విభిన్నమైన వాదనలు ఉంటూ ఉంటాయి, తరచి తరచి చూస్తే రెండూ వేటికవే గొప్పగా అనిపిస్తాయి, అయినప్పటికీ నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది, అది సమస్యను అనుభవించిన వాళ్ళకు లేదా సృష్టించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఆమె ఈ విషయాన్ని ఇంకా కూలంకషంగా చర్చించడానికి ప్రొఫెసర్ వరదరాజన్‌ను సంప్రదించాలి అనుకుంది, అసలు సమస్య మూలాల నుంచీ వెళ్తే కానీ సమస్య పరిష్కారంపట్ల ఒక స్పష్టమైన అభిప్రాయం ఏర్పడదు. ఈ విషయం గ్రహించిన ఆమె తన కాలేజీ లోని ‘చరిత్ర విభాగం’ దగ్గరకు వెళ్లి ప్రొఫెసర్ వరదరాజన్ ఎక్కడున్నాడో తెలుసుకుని అక్కడకి వెళ్ళింది. తాను ప్రొఫెసర్‌తో మాట్లాడదాం అనుకున్న విషయం ఆమె సిద్ధార్థకు తెలియకుండా జాగ్రత్త పడింది. లేదంటే బహుశా ఇక్కడికి కూడా అతను మీడియా ప్రతినిధులు వచ్చే ఏర్పాటు చేస్తాడు అని ఆమె భయం. ఈ మధ్య ఎలా తెలిసిందో తెలీదు కానీ, సిద్ధార్థకూ తనకూ మధ్య ఒక స్నేహపూర్వక సంబంధం ఉన్నట్లుగా కొంతమంది మీడియావారికి తెలిసింది. దానిపై పెద్దగా కథనాలేమీ రాకపోయినప్పటికీ, జాగ్రత్తగా ఉండడం మంచిది కదా. అంతేకాకుండా మీడియా వారితో సిద్ధార్థ రహస్యంగా సంప్రదింపులు జరపడం తాను చూసానని గెస్ట్ హౌస్‌లో పని చేసే అబ్బాయి చెప్పాడు.

పోలీస్ వారికన్నా మీడియా ఇంకా భయంకరమైనది అని ఆ అబ్బాయి తన భయాన్ని కూడా ప్రియాంకతో చెప్పాడు. ఆమె వరదరాజన్ దగ్గరకు చేరుకునేప్పటికి, ఆయనేదో పుస్తకం చదవడంలో సుదీర్ఘంగా మునిగి ఉన్నారు.

“నమస్తే సర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు క్షమించాలి” వినయంగా ఆయన ముందున్న కుర్చీలో కూర్చుంటూ ఆయనతో అన్నది ప్రియాంక.

వారిద్దరూ ఇప్పుడు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలోని హిస్టరీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన లైబ్రరీలో ఉన్నారు. అది చాలా పురాతనమైన లైబ్రరీ, ప్రపంచ దేశాల చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్న తేడా లేకుండా, తన దగ్గరున్న గ్రంథాలలో ఇముడ్చుకున్న ఆ ప్రదేశం ఒక జ్ఞాన భాండాగారం లాంటిది. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలు, గ్రంథాలు, జర్నల్స్ మరియు ఆర్కైవ్స్ అన్నీ అక్కడ లభ్యమవుతాయి.

అందులో ఒక మూలగా ఎవరూ లేని ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు ప్రొఫెసర్ వరదరాజన్. ఆయనకు భారతీయ భాషలన్నిటిలో కూడా కొంతవరకు ప్రవేశం ఉండడం విశేషం. ఆయన కూర్చున్న ప్రదేశానికి రెండు వైపులా, పెద్ద పెద్ద ర్యాక్స్ పుస్తకాలతో సర్దబడి ఉన్నాయి. ఒక్కోదాని పొడవు దాదాపు ముప్పై అడుగుల పైనుంటుంది. ఆయన ఆ రెండు ర్యాక్స్‌కు మధ్య ఉన్న వాక్ వే కి దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అక్కడ మిణుకు మిణుకుమంటున్న ట్యూబ్ లైట్ కాంతి ఆయన ముఖంపైన పడి, ఆయనకు అదొకరకమైన తేజస్సు కలిగిస్తున్నట్లు ఉంది.

ఆయన తను చదువుతున్న పుస్తకం కింద పెట్టి తన కళ్ళ అద్దాలలో నుంచి ఆమెకేసి చూస్తూ చెప్పాడు “ నా విద్యార్థులు నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చెయ్యరు. కానీ నా దగ్గరకు చాలామంది తక్కువగా వస్తూ ఉంటారు. ఎవరెలా ఒచ్చినా కానీ వారికి తగిన రీతిలో నా జ్ఞానం ఉపయోగపడాలి అని నేను ఆకాంక్షిస్తూ ఉంటాను. అందులోనూ నీలాంటి సామాజిక దృక్పధం ఉన్న వ్యక్తులకు, నేను ఎప్పుడూ అందుబాటులో ఉండాలి అన్నది నా కోరిక.” ఆయన చెప్పినదానికి ఆమె ఆలోచనగా తల పంకించింది. “ఆ ఆకాంక్షతోనే మొన్న మీరు రాహుల్ నిర్వహించిన సభలో పాలుపంచుకున్నారా?” ఆయన వంక సూటిగా చూస్తూ అడిగింది ప్రియాంక.

దానికి ఆయన కొద్దిగా అయినా చలించకుండా చిన్నగా నవ్వుతూ “ అక్కడికి రమ్మని నన్ను ఆహ్వానించినది నువ్వే అన్న విషయం మర్చిపోయావా ప్రియాంకా. మరి నన్ను ప్రశ్నించే ముందు నిన్ను నువ్వే ఆ ప్రశ్న ఎందుకు వేసుకోలేదు?” ఆమెను అడిగాడు ప్రొఫెసర్ వరదరాజన్, దానికి ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు.

ఆయనే మళ్ళీ “చూడమ్మా, నీకూ అతనికీ మధ్య ఎటువంటి సంబంధాలైనా లేదా గొడవలైనా ఉన్నాయేమో నాకు తెలీదు. మీ ఇద్దరి తండ్రులూ రాజకీయ ప్రత్యర్థులు అయినంత మాత్రాన మీరు కూడా ప్రత్యర్థులు అవ్వాలనే నిబంధన ఏమీ లేదు. నేను కేవలం నా జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడానికి మాత్రమే జీవిస్తున్నాను, అది ప్రపంచానికి ఉపయోగపడాలి, నాకు అంతకన్నా ఆశలు లేవు ఆశయాలు లేవు, కోరికలు అసలే లేవు. అందుకే నువ్వు కూడా వేరే ఏ ఆలోచనలూ పెట్టుకోకుండా వీలైతే రాహుల్‌కు సహాయపడడానికి ప్రయత్నించు. అతనిలో నిబద్ధత ఉంది అని నువ్వు భావిస్తే మాత్రమే” తను చెప్పదలుచుకున్నది చెప్పి ముగించాడు.

ఆమె ఆయనవంక ప్రశ్నార్ధకంగా చూసింది. రాహుల్ వైపు ఈయన ఇంతగా ఆకర్షితుడు అవ్వడానికి కారణం ఏమై ఉంటుందో ఆమెకు అంతుపట్టడం లేదు.

“అదంతా పక్కనపెడితే మీరు అన్నట్లుగా రాహుల్ లోనే కనుక అటువంటి దృక్పథం ఉంటే ఎందుకు ఒక వర్గం ప్రజల్లో ఆయనపట్ల వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాకుండా పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఇతనిది దుందుడుకు స్వభావం, అనే అభిప్రాయంలో ఉన్నారు. అస్సలు ఇలాంటి రాజకీయాలు అవన్నీ ప్రజలకు అవసరమా? దీనివల్ల మనం ఎంత సమయం నష్టపోతున్నాము, ఇవేమీ ఎవరూ కూడా అస్సలు ఆలోచించరా?” కొద్దిగా ఆవేశంగా అడిగింది

“నువ్వు మళ్ళీ వేరేదారిలో వెళ్తున్నావు ప్రియాంకా, చరిత్రను మనం చూస్తే కనుక, ఇటువంటి నైజాన్ని పెంచి పోషించినది, పోషించబోయేది ప్రజలు మాత్రమే. ప్రజలకు తమ నరనరాల్లో రాజకీయం ఇంకిపోయింది. అస్సలు జగమంతా ఎంతో ఇష్టంగా ఆడే ఈ ఆటలో అందరికన్నా ఎక్కువగా లాభపడేది వారు మాత్రమే. వినడానికి కటువుగా అనిపించినా ఇది నిజం. అందుకే ఇటువంటి వారి నుంచి ఏమీ ఆశించకుండా మనకు సరి అనిపించింది చెయ్యడం మంచిది. నా దృష్టిలో రాహుల్ చేస్తున్నది కూడా ఇదే” అని ఆమెతో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ప్రొఫెసర్.

ఆయనను చూస్తే ప్రియాంకకు జాలేసింది, బహుశా బయటి ప్రపంచం ఆయనకి దూరంగా ఉండడానికి ఆయనలో కటువుగా అనిపించే ఈ స్వభావమే కారణం అయ్యుంటుంది అని ఆమెకు అనిపించింది. వ్యవస్థలో ఉంటూ దానిని బాగుచెయ్యలేక ఇలా తమలో తాము మథనపడుతూ, తమదైన ప్రపంచంలో విహరిస్తూ ఉండేవారి మనోవేదనకు పరిష్కారం ఎవరు చూపుతారు.

“ఏమైనా కానీ ప్రజలపట్ల ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తోంది” కొంచెం దిగులుగా అతనితో అంది ప్రియాంక, ఇంతలో ఆయన చేతి గడియారం శబ్దం చెయ్యడంతో ఆయన లేచి, “నేను ఇంటికి వెళ్తున్నాను ప్రియాంకా, మనం ఈ సంభాషణను తర్వాత కొనసాగించవచ్చా” తన ఎదురుగా ఉన్న ర్యాక్స్‌ను దాటుకుని ముందుకు కదులుతూ ఆమెను అడిగాడు. ఆయన టేబుల్ పై ఉంచిన పుస్తకాన్ని తీసుకుని ఆయన్ని అనుసరించింది.

“సర్ మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతోపాటుగా మీ ఇంటికి రావచ్చా. నాకు ఈ రోజు క్లాసెస్ కూడా పెద్దగా లేవు.” ఇద్దరూ లైబ్రరీ దాటుకుని హాల్ వే వైపు వెళ్లారు. ఆయనను తన ఇంటికి వస్తాను అని అడిగినది బహుశా ఈమె ఒక్కత్తేనేమో. కొంచెం అలోచించి ఆయన సరే అన్నాడు. ఆయన ఆలోచన ఆమె కొద్దిగా అర్ధం చేసుకోగలిగింది.

సహజంగా ఎక్కువ పుస్తక పఠనం చేసే వాళ్ళు అంత త్వరగా ఇతరులను కలవడానికి ఇష్టపడరు. తమతో ఉండడం వలన ఎదుటివారికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని వారి భయం. ఇద్దరూ బిల్డింగ్ బయటనున్న రోడ్ దాటుకుని ఫ్లవర్ గార్డెన్ అవతల ఉన్న పార్కింగ్ లాట్ వైపు వెళ్ళారు. ఫ్లవర్ గార్డెన్ మధ్యలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని విగ్రహం ఎంతో నిర్మలంగా దర్శనం ఇస్తోంది. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడు గంటలు అవుతోంది.

వారిద్దరూ ప్రొఫెసర్ కార్లో అక్కడ నుంచి బయటకు వెళ్ళడం గమనించాడు గెస్ట్ హౌస్‌లో పనిచేసే అబ్బాయి. ఒక్కోసారి ఆమె మధ్యాహ్నం భోజనానికి రావడానికి లేట్ అయితే అతనే కేరియర్ సద్ది తీసుకువస్తూ ఉంటాడు. కారు ముందుకు సాగిపోతూ ఉంటె అతను చిన్నగా నిట్టూర్చి గెస్ట్ హౌస్‌ దారిపట్టాడు.కొంతమంది ప్రముఖులకు అన్ని సౌకర్యాలతో కూడిన గెస్ట్ హౌస్‌ ఏర్పాటు చేస్తుంటారు కళాశాల యాజమాన్యంవారు. ప్రియాంకకు ఇష్టం లేకపోయినప్పటికీ నకునారెడ్డి బలవంతంగా వారితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేసాడు.

***

ప్రొఫెసర్ వరదరాజన్ ఇల్లు ఊరికి కొద్దిగా దూరంగా హిల్ సైడ్ కౌంటీలో ఉంది. ఆయన ఇంటిచుట్టూ విచిత్రంగా కొబ్బరి చెట్లు ఉండి, కోనసీమ ప్రాంతాన్ని తలపిస్తోంది. ఇటువంటి ప్రదేశంలో ఉండడం వల్లనేమో ప్రొఫెసర్ పెద్దగా మాట్లాడడు, ఆయన జీవితం ప్రకృతితో మమేకం అయిపోయినట్లు ఉంటుంది. చల్లటిగాలి అక్కడ నిరంతరాయంగా వీస్తూనే ఉంటుంది. తనంతట తానుగా శ్రద్ధ తీసుకుని ఆ పూలతోటను ఆయన పెంచుతాడు అన్న విషయం ఆ ఇంటి తోటమాలి నుంచి తెలుసుకుని ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది.

రిటైర్మెంట్ అయ్యిన తరువాత ప్రభుత్వోద్యోగులు చేసే పనిని ఆయన ఇప్పుడే చేస్తున్నారు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది. ఆ ప్రదేశంలో సెల్‌ఫోన్ నెట్వర్క్ కూడా అప్పుడప్పుడూ మాత్రమే తగులుతూ ఉంటుంది. వద్దన్నా వినకుండా ప్రొఫెసర్ గారి తల్లి ప్రియాంకతో బలవంతంగా అక్కడ భోజనం చేయించింది. ఎందుకో ఆమె ప్రవర్తన ప్రియాంకకు విచిత్రంగా అనిపించింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడని తన తనయుడు, ఒక్కసారిగా ఒక అమ్మాయిని తమ ఇంటికి తీసుకురావడంతో ఆమె మనసులో కొత్త ఆలోచనలు కలిగి ఉండవు కదా అని ప్రియాంక భయం.

అందుకే ఆమెతో పెద్దగా వాదనలూ మాటలూ పెట్టుకోకుండా, తప్పించుకుని భోజనాన్ని పూర్తిచేసింది. ఆ తరువాత కొంతసేపటికి తన పూలతోటను చూపించడానికి ప్రొఫెసర్ ప్రియాంకను తీసుకురావడంతో తన మనసు కుదుటపడింది. ఆయన మెల్లిగా నడుస్తూ అక్కడున్న ప్రతీమొక్క యొక్క ప్రత్యేకతలు, పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తున్నాడు. ఏదో ఆలోచిస్తున్న ప్రియాంక “ఈ భూమి మీకు ఎలా సంక్రమించింది” ఒక్కసారిగా బులెట్ లాగా ఆయనను ప్రశ్నించింది. ఆయన కొద్దిగా అయోమయంగా చూసాడు.

“ఎందుకు హటాత్తుగా నీకా ప్రశ్న అడగాలి అనిపించింది” తమకు కొంత దూరంలో ఉన్న సిమెంట్ బెంచీ వైపు దారి తీస్తూ అడిగాడు వరదరాజన్.

“నేనసలు మీదగ్గరకు వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నది ఈ విషయం గురించే, కానీ మన మాటలు మధ్యలో మర్చిపోవడం జరిగింది. ఎవరైనా సరే ఎవరినైనా సరే మరుపుకు గురిచేయ్యగలిగే స్వభావం ఈ ప్రదేశంలో ఉందేమో” ఆమె స్వరం ఆ సమయంలో కొద్దిగా గంభీరంగా ధ్వనించింది.

“అది సరే నువ్వు ఏ ఉద్దేశంతో ఈ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావో నేను అడగచ్చా?” ఆమెతో అన్నాడు.

“ఇందులో తెలుసుకోవడానికి ఏముంది సర్, ప్రభుత్వం వారు కొత్తగా భూసంస్కరణలు చేపడుతున్నారు అంతేకాకుండా, గత ప్రభుత్వంలో కేటాయించిన భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. దానిపై చాలామంది అసంతృప్తితో కోర్టులను ఆశ్రయిస్తున్నారు, ఇవన్నిటికీ అంతనేదే లేదన్నట్లు అనిపిస్తోంది. ఎందుకు తమ సొంతమైనదాన్ని వేరే వారి శ్రేయస్సు  పేరు చెప్పి లాక్కుంటూ ఉంటే ఊరుకోవాలి. రాహుల్ తండ్రి తన సొంతవాళ్లకు ఇవ్వడానికి ఈ స్థలాలు ప్రజలనుంచి స్వీకరిస్తున్నాడన్నది ఎంతవరకు నిజం. అస్సలు ఈ భూమి ఎవరిది” ఈసారి గంభీరమైన ఆమె స్వరం, ఆవేదనతో కూడిన ఆవేశానికి దారితీసింది.

“ఇవన్నీ అందరినీ వేధించే ప్రశ్నలే వీటికి సమాధానం నీకు తెలియాలంటే నీకు భూమియొక్క మూలాల గురించి తెలియాలి. ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చాలావరకూ యుద్ధాలు, వివాదాలూ, సమస్యలూ అన్నీ కూడా భూమివల్లనో నీరు వల్లనో వచ్చాయి, ఒకవేళ మరే కారణం వల్లైనా వివాదాలు సంభవించినప్పటికీ వాటిలో అంతర్లీనంగా ఈ రెండు అంశాలు ఉండడం గమనించదగిన అంశం. ఇవి గతంలో సంభవించాయి, ఇక ముందర కూడా వస్తాయి, వస్తూనే ఉంటాయి.

ఎందుకంటే ఏవిధంగా అయితే జీవించడానికి శ్వాస అవసరమో, అదే విధంగా మన ఉనికి ఎన్నో తరాలకి, యుగాలకి గుర్తుండడానికి భూమి అవసరం. దానికోసమే పోరాటాలూ, మారణహోమాలూ. కుట్రలూ, కుతంత్రాలూ జరిగాయి. ఎన్నో రాజ్యాలు ఉద్భవించాయి, మరెన్నో రాజ్యాలు నశించాయి. దీనంతటికీ చరిత్రే సాక్ష్యం. గ్రీస్, రోమన్, బ్రిటీష్, పెర్షియన్, మంగోల్, ఈజిప్షియన్, టర్కిష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణలు అనేకం. ఎవరి చరిత్రను చూసినా మనకు అర్ధమయ్యేది ఒక్కటే.

ఎవరైతే సహజవనరులను ప్రజల సహకారంతో తమ చెప్పుచేతల్లో పెట్టుకోగలుగుతారో వారు మాత్రమే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. అంతమాత్రమే కాకుండా తగినన్ని వనరులు సమకూర్చుకోవడం ద్వారా తమ ప్రాంతాన్ని విస్తరించుకుంటూ పోతూ ఒక పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపిస్తారు. అటువంటివారికి ప్రపంచం అణిగిమణిగి ఉంటుంది. మనదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత, రాక ముందర పరిస్థితులు నువ్వు గమనించినట్లైతే కనుక, అప్పట్లో ఎవరైతే తమకు విధేయులుగా ఉండి, కప్పం కట్టడానికి సిద్ధంగా ఉంటారో, వారికి మాత్రమే భూమిపై అధికారాన్ని కట్టబెట్టేది బ్రిటిష్ సామ్రాజ్యం.

ఇటువంటివారు బ్రిటిష్ అనే ఒక మహా సామ్రాజ్యానికి తమని తాము సామంత రాజులుగా పరిగణించుకునేవారు. వీరు మన దేశస్తులు అయినప్పటికీ తమ ప్రాంతంలోని ప్రజలను పీడించి బ్రిటీష్ వారికి సహకరించేవారు. స్వాత్రంతోద్యమం పుంజుకున్న కాలంలో చాలావరకూ ఇటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాలు ఏలుకునే ప్రతినిధులు మాత్రమే ఉన్నారు.

ఆ ప్రదేశంలో ఉన్న చాలామందికి తాము అక్కడికి చెందినవారము కామేమో అనే భ్రమ కలిగించేలా చేసారు. దీనికి బ్రిటీష్ ప్రభుత్వం తమ లాభాపేక్షతో సహకరించింది. ఇలా సామంతరాజుల నుండి ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెందారు. తమ తరువాత కాలంలో వారు బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు అయ్యారు.” ఆయనతో మాట్లాడుతుంటే ఆమెకు సమయం తెలియడం లేదు.

చుట్టూ చీకట్లు కమ్ముకున్నా ఆమె గమనించలేకపోయింది. పూలతోటలో ఉన్న నియాన్ లైట్లు ఒక్కసారిగా వెలగడంతో ఆమె ఈ లోకంలోకి వచ్చింది. అప్పుడే ఒక చల్లటి గాలి తిమ్మెర ఆమెను మెల్లగా తాకుతూ వెళ్లి ఆహ్లాదపరిచింది. ఆమె చేతి గడియారం ఆరు గంటల నలభై నిమిషాలు సూచిస్తోంది.

“అయితే మీ ఉద్దేశం ప్రకారం ప్రస్తుతం ప్రజల దగ్గర ఉన్న స్థలాలన్నీ వారివి కావంటారా. ఒకవేళ అలా కాని పక్షంలో వారికి అవి ఏ విధంగా సంక్రమించి ఉంటాయి.”  ఆయనను తిరిగి ప్రశ్నించింది ప్రియాంక.

“స్థూలంగా చెప్పాలంటే అంతే. కొంతమంది స్వార్ధ రాజకీయనాయకులు స్వాతంత్ర్యానంతరం దౌర్జన్యంగా ప్రజల దగ్గరనుంచి లాక్కోవడం. మరికొంతమంది భూస్వామ్య వ్యవస్థ స్థాపించి తిరిగి ఆ స్థలాలను ప్రజలకు కట్టబెట్టాలి అనుకోవడం ఇదంతా శతాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ, దీనికి తోడుగా తమతమ వాదనలను బలపరుచుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఒకొక్క మహానుభావుని పేరు చెప్తూ వారు చెప్పిన విషయాన్ని తమ వాదనను బలపరిచే విధంగా మార్చుకుంటున్నారు.

అందుకే మనం అర్థం చేసుకోవలసినది ఏంటంటే భూమికి ఎప్పుడూ శాశ్వతమైన యజమాని ఉండడు. ఎవరిలో అయితే స్వార్థం ప్రబలుతుందో వారు వివిధ అంశాలను తమకు అనుకూలంగా మలచుకుని పోరాటానికి దిగుతారు. అవతలి పక్షంలో కూడా స్వార్థపరులుంటే అది యుద్ధానికి దారితీస్తుంది, లేదంటే దురాక్రమణకు దారితీస్తుంది. ఏది ఏమైనా చివరగా నష్టపోయేది అమాయక ప్రజలు మాత్రమే. ఇది గ్రహించిన చాల మంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.” ఆయన లేచి కొద్దిగా ముందుకు కదిలి అక్కడున్న వాక్ ట్రాక్ దగ్గరకు వెళ్ళారు.

చిన్నగా మెరుపులు కూడా మెరవడం మొదలు పెట్టాయి. ఆయనతో మాట్లాడుతుంటే ఒక మహాజ్ఞానితో మాట్లాడుతున్న అనుభూతి కలిగింది ప్రియాంకకు.

“మరి ఈ అమాయక ప్రజలలోనే కొందరు తమ శాశ్వతమైన భూయాజమన్యం పైన పటిష్టమైన విశ్వాసం కలిగి ఉన్నారే. వారు రాహుల్ తండ్రిని వ్యతిరేకించడంలో ఎటువంటి తప్పు కనిపిస్తోంది మీకు” ఆమె ఆయనను ఎదురు ప్రశ్నించింది.

“ఇక్కడ నువ్వు అర్ధం చేసుకోవలసినది ఏంటంటే ప్రియాంకా ముఖ్యంగా భారతదేశం అనేది తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. దానికి కారణం విస్తారమైన భూభాగం అనంతమైన జీవనదులు. ఈ భాగాల్లోని ప్రజలు వ్యవసాయం తమ జన్మహక్కుగా భావిస్తారు, అటువంటివారు పారిశ్రామికీకరణ కోసం భూమి లాక్కొనబడుతోంది అనే అపోహలో ఉంటారు. ఆధునిక పద్ధతులకు అలవాటుపడడానికి వారికి కొంత కాలం పడుతుంది.

ఇటువంటివారిని తమ ప్రలోభాలతో ఇతరమైన వాదనలతో తమవైపు మళ్ళించుకుంటారు కొంతమంది స్వార్థపరులు, వారికి అనుగుణంగానే ఈ అమాయక ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు, వీరిని కూడా పూర్తిగా అమాయకులు అని అనుకోలేము. సాధ్యమైనంతవరకు ఇందులో ప్రతీ వ్యక్తి కొంతవరకూ తమ స్వార్థం కోసం ఆలోచిస్తాడు, ఎన్ని అనుకున్నా కానీ ఇది ఎప్పటికీ పరిష్కారం కాని ఒక చిక్కుముడి లాంటిది.” దీర్ఘంగా నిశ్వసించించాడు వరదరాజన్.

“చూస్తుంటే మీరు జోగేశ్వరరావు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు ఉందే” ఆయన వంక నవ్వుతూ చూస్తూ అడిగింది ప్రియాంక.

“హహ నేను ఎవరికీ సపోర్ట్ కాదు ప్రియాంక, అస్సలు ఆయన నా రాష్ట్రం వాడు కూడా కాదు, నేనెందుకు ఆయన్ని బలపరచడానికి ప్రయత్నిస్తాను చెప్పు. ఇది తరతరాలుగా పునరావృతం అవుతున్న చరిత్ర అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దీనికెవరూ అతీతులు కారు” ఆయన స్వరం ధృఢత్వాన్ని సంతరించుకుంది. వీరిద్దరూ ఈ సంభాషణలో ఉండగా ఒక వ్యక్తి హడావిడిగా వీరిదగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు మెరుపులు ఉధృతంగా రావడమే కాకుండా సన్నగా తుంపర్లు కూడా రావడం ప్రారంభించాయి.

“ఏమైపోయావ్ ప్రియాంకా నీకోసం ఎంతసేపని వెతకాలి ఎక్కడ వెతకాలి, ఫోన్ కూడా జవాబివ్వడం లేదు, స్విచాఫ్ అని వస్తోంది కూడా”హడావిడిగా అంటున్న సిద్ధార్థను చూసి ఆమె అర్ధం చేసుకుంది, ఇందాకా గార్డెన్ లోకి రావడానికి ముందు లివింగ్ రూమ్లో మర్చిపోయింది, ఛార్జింగ్ లేకపోవడం వలన అది స్విచాఫ్ అయిపోయి ఉంటుంది. ప్రొఫెసర్‌తో మాటల్లో పది ఆమె ఫోన్ విషయం మర్చిపోయింది.

“ఏమైంది సిద్ధార్థ్ ఏమిటా కంగారు, అస్సలు నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలిసింది” ఆశ్చర్యంగా అతనిని అడిగింది ప్రియాంక

“మీ గెస్ట్ హౌస్ లో పని చేసే రాజు చెప్పాడు, నువ్వు ప్రొఫెసర్ గారి కారులో వెళ్ళడం తను చూసానని” మధ్యలో ఊపిరి తీసుకోవడానికి అన్నట్లుగా ఆగాడు సిద్ధార్థ.

“ఇంతకీ సంగతేంటి” కుతూహలం తట్టుకోలేనట్లుగా సిద్ధార్థను కుదుపుతూ అడిగింది ప్రియాంక.

“హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది, నీ ఫోన్‌కి ప్రయత్నిస్తే అందుబాటులో లేదని వస్తోందని నాకు కాల్ చేసారు. మీ ఫాదర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందట” హడావిడిగా చెప్పాడు సిద్ధార్థ్. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసి భోరున వర్షం కురవడం ప్రారంభించింది.

***

తను ఏమి వింటున్నదో ఆమెకు ఒక్కసారిగా అర్థం కాలేదు. విన్నతరువాత ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. కాళ్ళూ  చేతులూ వణకడం ప్రారంభించాయి. ఆమెను ఒక్కసారి గట్టిగా కుదిపి వర్షం పడుతున్న చోటినుంచి ఇంట్లోకి ప్రొఫెసర్ సహాయంతో తీసుకువచ్చాడు. బయట ఇంకా కుండపోతగా వర్షం కురుస్తోంది. మరొక ఐదు నిమిషాల్లో ప్రొఫెసర్ గారు మరియు వారి తల్లి ఎంత వారిస్తున్నా వినకుండా ఆ వర్షంలోనే సిద్ధార్థతో బైక్ మీద బయల్దేరింది.

సిద్ధార్థ్ తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి హైదరాబాద్ ఫ్లైట్‌కి టికెట్ బుక్ చెయ్యమన్నాడు. ఆఖరి ఫ్లైట్ ఎనిమిదింపావుకి ఉందని అది కూడా ఈ వాతావరణం వల్ల రద్దయ్యే అవకాశం ఉందని తెలుసుకున్నాడు. అయినా కానీ దేవుడి మీద భారం వేసి బుక్ చేసాడు. ఆ వెంటనే గెస్ట్ హౌస్‌కి ఫోన్ చేసి రాజుతో మాట్లాడి ప్రియాంకకు అవసరమైన లగేజ్ తీసుకురమ్మని చెప్పాడు. వారిద్దరూ అప్పుడే ఆ వర్షంలోనే బైక్ పైన శరవేగంతో ‘మీనంబాకం’ లోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపుగా వెళ్తున్నారు.

తన జెర్కిన్ తీసి ఆమెకు అందించాడు సిద్ధూ ఆమె మనసంతా ఎదో లాగా ఉంది. విమానాశ్రయానికి వెళ్ళేదారిలో రెండు సార్లు ఆమెను ఓదార్చడానికి బండి ఆపవలసిన అవసరం వచ్చింది, అలాంటి వాతావరణంలో కూడా సిద్ధార్థ్ ఆమెను సముదాయించడానికి ప్రయత్నించాడు. హడావిడిగా బైక్ పార్క్ చేసి డిపార్చర్ దగ్గరున్న వ్యక్తి  వద్దకు వెళ్ళాడు సిద్ధూ, వాతావరణం కారణంగా ఫ్లైట్ రెండు గంటల లేట్ అన్న విషయాన్ని చెప్పాడు ఆ వ్యక్తి.

ఈలోపు రాజు తెచ్చిన లగేజ్ అతడి దగ్గర నుంచి తీసుకుని అతడిని పంపించేసి సిద్ధూ దగ్గరకు వచ్చింది ప్రియాంక. అతను చెప్పినది విన్న తరువాత ఆమెకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు, ఎందుకో ఈ సమయంలో ఆమెకు ఇంటికి కానీ, తన తల్లికి కానీ ఫోన్ చెయ్యాలి అనిపించలేదు. ఫోన్ చేస్తే ఎటువంటి విషయం వినాల్సివస్తుందో అని ఆమె భయం.

“అసలు ఎలా జరిగింది. ఏమి జరిగింది” చాలా సేపటినుంచి రోదించడం తప్ప మరే పనీ చెయ్యని ఆమె నోటివెంట వచ్చిన మాటలవి. ఇద్దరూ ఎయిర్‌పోర్ట్ లోని డొమెస్టిక్ డిపార్చర్స్ లాంజ్‌లో కూర్చుని ఉన్నారు. ఆరోజు వాతావరణం వల్లనో మరింక దేనివల్లనో కానీ అక్కడ చాలా తక్కువమంది ప్రయాణికులు విమానం కోసం నిరీక్షిస్తున్నారు.

“ఏం జరిగిందో నాకు తెలీదు కానీ, ఎవరో ప్రసాద్ గారని మీ జె.హెచ్. పార్టీ ఎం.ఎల్.ఏ అట ఫోన్ చేసుకుని వచ్చారు, బాగా సీరియస్ స్ట్రోక్ అయితే కామినేని హాస్పిటల్స్‌లో జాయిన్ చేసారని చెప్పాడు. నేను అంతకు మించి విషయాలేమీ తెలుసుకోలేదు. వెంటనే నీ గురించి వెతకడం ప్రారంభించాను.” ఆమె ఇంకేమీ మాట్లాడలేదు, ఏమైనా తింటావా అన్నదానికి కూడా సమాధానం చెప్పలేదు. ఇంక ఆమెను కదిలించడం ఇష్టం లేక తన మొబైల్ తీసి అందులో ఏదో ఒక గేమ్ ఆడుకుంటున్నాడు సిద్ధార్థ.

పక్కనే ఉన్న లేడీస్ రూమ్‌కి వెళ్లి పూర్తిగా తడిసిపోయి ఉన్న డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఈలోపులో అక్కడే ఉన్న టీవీలో నకునారెడ్డి గారిని హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్న దృశ్యాలు ఏదో ఒక ఛానల్ ప్రసారం చేస్తోంది. ఆమెను కూడా అక్కడ ఉన్న ఒకరిద్దరు గుర్తుపట్టినట్లుగా ఉన్నారు, అయినా కూడా వారు ఆమె దగ్గరకు రావడానికి సాహసించలేదు. ఆమె ఇప్పుడు ఎటువంటి స్పందనలు లేని రీతిలో ఉంది. తన చిన్నతనమంతా తండ్రి సంరక్షణలోనే పెరిగింది.

నకునారెడ్డి తండ్రి ఒక రైతు అయినప్పటికీ తన కుమారుని బాగానే చదివించాడు. బయట ప్రపంచానికి రాజకీయ నాయకుడిగా తెలిసిన నకునారెడ్డి వేరు, తనకు తెలిసిన తన తండ్రి నకునారెడ్డి వేరు. తను తన తండ్రి నుంచి చాలా విషయాలు నేర్చుకుంది. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఓర్పు, ఏ సమయంలో ఐనా స్పష్టత కోల్పోకుండా ఉండే నిగ్రహం. తనకు తన తల్లి కంటే తండ్రితోనే ఎక్కువ అనుబంధం ఉంది, బహుశా ఆడపిల్లలకి తండ్రి, మగపిల్లలకు తల్లి ఎక్కువగా చేరువవుతారు అన్న విషయం నిజమేనేమో అనిపిస్తుంది.

తాను ఒక ముఖ్యమంత్రి కుమార్తెను అనే గర్వం కలగకుండా, విదేశాలకూ ఇతర రాష్ట్రాలకూ పంపకుండా, తన రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఆమెను చదివించడం, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఆమె భావిస్తూ ఉండేది. అసలు తను చదివిన పాఠశాలలో చాలామంది తోటి విద్యార్ధులకు తను నకునారెడ్డి కుమార్తె అనే విషయమే తెలీదు. ఏరోజూ ఆయన తనకు సలహా ఇవ్వడానికి కానీ, తన రాజకీయాల గురించి ఆమెతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించలేదు. ఆయన మాటల్లోనూ చేతల్లోనూ ఎప్పుడూ కార్యదక్షత కనిపించేది.

ఎవరి తండ్రి గురించి వారు ఇలానే అనుకుంటారేమో తనకు తెలీదు కానీ తనకు తెలిసి ప్రపంచంలో ఇంతటి గొప్ప వ్యక్తిని తను ఇప్పటివరకూ చూడలేదు. అలాంటిది ఈ రోజు ఆయనకు గుండెపోటు వచ్చిందంటే ఆమె హృదయానికి చెప్పలేని బాధ కలిగింది. సహజంగా ఆయన ఆరోగ్యవంతుడే అతిగా ఉద్రేకపడే వ్యక్తి కూడా కాదు, మరెందుకు ఇలా జరిగిందో తనకు అర్థం కావడం లేదు. ఆమెకు ఒక్కసారిగా తండ్రిని చూడాలనే ఆత్రుత ఎక్కువయ్యింది.

“నువ్వు కూడా నాతో రావచ్చు కదా” ఆమె అన్న మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సిద్ధార్థ. ఆమె వైపు చూసి భుజలెగరేసాడు.

“నాకెందుకో నువ్వు ఒంటరిగా వెళ్తేనే మంచిదేమో అనిపిస్తోంది ప్రియాంకా. నేను ఇందాకా ప్రసాద్ గారి పీఏకి తెలియజేశాను ఫ్లైట్ వివరాలు. మిగిలినదంతా ఆయన చూసుకుంటాను అన్నాడులే. అయినా మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె అంతగా భయపడవలసిన అవసరం లేదనుకుంటాను కదా” ఆమె ముఖంలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు సిద్ధార్థ. ఆమె అప్పటికి కూడా ఏమీ మాట్లాడాలేదు.

తనే చివరగా అన్నాడు “అయినా నేనిక్కడ చక్కబెట్టవలసిన పనులు చాలానే ఉన్నాయి. నువ్వు ధైర్యంగా వెళ్లి మీ నాన్నగారికి సపోర్ట్‌గా ఉండు. ఇంకా వేరే విషయాలు ఆలోచించకు నేను కూడా వీలు చూసుకుని వస్తాను” ఈ మాటలు అతను చెప్తూండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. వర్షం కూడా కొద్దిగా తగ్గి చిన్నచిన్నగా కురుస్తోంది. చివరగా ఒక్కసారి సిద్ధూతో మాట్లాడి చెకిన్ వైపు సాగింది ప్రియాంక.

***

ఇది జరిగిన వారం రోజులలో తన ఆరోగ్యం కొంతగా కుదుటపడడంతో నకునారెడ్డిని తన నివాసానికి తరలించారు. ప్రస్తుతానికి పెద్దగా సమస్య ఏదీ లేనప్పటికీ మళ్ళీ మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆయనకు ప్రమాదం తప్పదని అందుకే ఆయనను ఉద్రేకపరిచే విషయాలకు దూరంగా ఉంచమని సలహా ఇచ్చారు ఆసుపత్రి యాజమాన్యంవారు, ఇంకా ఆయనను ఆపరేట్ చేసిన కార్డియాలజిస్ట్. తండ్రికి అవసరమైన మెడికేషన్ అందేలా తానే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటోంది ప్రియాంక.

ఇంటికి తీసుకు వచ్చిన తరువాత ఒక రోజు ముఖ్యమంత్రి జోగేశ్వరరావు గారు కూడా పరామర్శించడానికి వచ్చారు. ఆ సమయంలో ఆయనతో పాటుగా రాహుల్ కూడా ఉండడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో పని మీద హైదరాబాద్ వచ్చానని, విషయం తెలుసుకుని చాలా బాధపడ్డానని, అంకుల్‌ను చూడకుండా ఉండలేకపోయాను అని కూడా చెప్పాడు. అతడు ఈ మాటలు అనడం కూడా ఆమెకు వింతగా అనిపించింది. ఏదేమైనా తమ తండ్రులు ఇద్దరూ ఒక వూరు వారు కావడం వల్ల ఒచ్చిన అభిమానం అయ్యుంటుంది అని ఆమె సరిపెట్టుకుంది.

కానీ రాజకీయంగా చూస్తుంటే కనుక ఇద్దరూ బద్ధ శత్రువులుగానే కనిపిస్తూ ఉంటారు, వ్యవహరిస్తూ ఉంటారు, మరి ఈ వ్యత్యాసాలు ఎలా సాధ్యమయ్యాయో ఆమెకు అర్ధం కాలేదు. అందుకే రాహుల్ మాటలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను తమ ఇంటికి రావడం ఏదో మూల ఆమెకు ఆనందం కలిగించింది, బహుశా వయసు వల్ల వచ్చిన ఆకర్షణ దీనికి కారణం కావచ్చు. తాను ఈ ఆలోచనల్లో ఉండగానే రాహుల్ వెళ్ళిపోయాడు. తన తల్లి సుమిత్ర ఈ సంఘటన వల్లనో మరింక దేనివల్లనో కొద్దిగా అధ్యాత్మిక ప్రపంచం వైపు మొగ్గు చూపింది. ఎవరికైతే ఏ పని చెయ్యడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందో అటువంటి పనులు వారి ఇచ్ఛానుసారం చెయ్యడం ప్రియాంక ఎప్పుడూ వారించలేదు.

తను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచీ ఇద్దరు ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె పెద్దగా స్పందించలేదు, ఈ సమయంలో తండ్రి పూర్తిగా కోలుకోవడమే తనకి ముఖ్యం అని ఆమె నిర్ణయించుకుంది. అందుకే వారు ఫోన్ చేసినప్పుడు పొడిపొడిగా మాట్లాడి సంభాషణ ముగించేసింది. హాస్పిటల్‌లో ఉండగా ఎమ్మేల్యే ప్రసాద్ గారి పీఏ తమకు అన్ని విషయాల్లోనూ బాగా సహకరించాడు. తన తండ్రిని చూడ్డానికి వచ్చిన కొందరు అతని విషయంలో జాగ్రత్తగా ఉండమని, అతను చాలా సందర్భాల్లో పొలిటికల్ లాబీయిస్ట్ కింద వ్యవహరించాడు అని అన్నారు.

అయినా కానీ ఆమె వారి మాటలను పెద్దగా పట్టించుకోలేదు, అతను తను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచీ తనకు ఎంతో హెల్ప్ చేసాడు. తనకు అవసరం లేకపోయినప్పటికీ ‘జెహెచ్’ పార్టీ నాయకులు ఇంకా తన తండ్రికి సన్నిహితులు అందరి గురించి తెలుసుకోవడంలో ఆమెకు సహయం చేసాడు. ఆమెకు ప్రస్తుతానికి వీరిమీద ఆసక్తి లేకపోయినా వారి పుట్టుపూర్వోత్తరాలు ఆమెకు తెలుసుకోక తప్పింది కాదు. అయితే ఈ సందర్భంగా ఆమెకు ప్రసాద్ గారు మాత్రం కనిపించలేదు, పీయే శరత్‌ను అడిగితే ఆయన అర్జెంట్ పని మీద విదేశాల్లో ఉన్నారని, ఆ పర్యటన ముగియగానే వచ్చి నకునారెడ్డి గారిని కలుస్తారని చెప్పాడు.

హాస్పిటల్‌లో ఉండగానే రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు ఎమ్మేల్యే ప్రసాద్. చెప్పినట్లుగానే మరొక వారం రోజుల తరువాత ప్రసాద్ గారు నకునారెడ్డిని పరామర్శించడానికి వచ్చారు. వచ్చిన సమయంలో ఆయన నకునారెడ్డితో కొంత సమయం వ్యక్తిగతంగా చర్చించారు. ఏం జరుగుతుందో ప్రియాంకకు అర్థం కాలేదు. అతను బయటకు రాగానే తన తండ్రి విషయంలో శరత్ చాలా హెల్ప్ చేసాడని ఆమె అతనికి చెప్పింది.

ఆమె ఒకసారి వీలైతే తమ ఇంటికి రావాలని ప్రియాంకతో చర్చించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయని ఆమెతో అన్నాడు. ఈ విషయం ఆమెకెందుకో సందేహంగా అనిపించింది. అయినప్పటికీ వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఎందుకో ఆయన అంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఆమెకు అనిపించలేదు. ఆయనిల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది, ఆరోజు ఆమె వాళ్ళింటికి వెళ్ళింది. తాను హైదరాబాద్ వచ్చి దాదాపుగా నెలరోజులు అవుతోంది. ఆమెకు కూడా అక్కడ బోర్ కొట్టడం ప్రారంభించింది. తన తండ్రి మెల్లమెల్లగా కోలుకుంటున్నాడు.

ఆమె వెళ్లేసరికి ఎమ్మెల్యే ప్రసాద్ తన కోసమే ఎదురుచూస్తున్నాడు అన్నవిషయం తెలిసింది. ఆరోజు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కాన్సిల్ చేసుకున్నాడు అని ఆయన పీఏ శరత్ చెప్పాడు. తనని హాల్‌లో ప్రసాద్‌తో వదిలేసి శరత్ అక్కడ నుంచి నిష్క్రమించాడు.

“మీ నాన్నగారిమీద నీ అభిప్రాయం ఏంటి?” ఆయన మొట్టమొదటి ప్రశ్నే చాలా సూటిగా అడిగాడు.

“అంటే ఏ విషయం గురించి మీరు అడుగుతున్నారు సర్. నన్ను కనిపెంచి పెద్దచేసి ప్రపంచమంటే ఎలా ఉంటుందో తెలియచేసిన ఆయన పై గౌరవం తప్ప వేరే అభిప్రాయం కలిగే అవకాశం ఉండదు.” ఆమె ఆయన ప్రశ్నకు చాలా ఘాటుగా స్పందించినట్లు భావించింది.

“చూడు ప్రియాంకా నువ్వు నన్ను సర్, గీర్ అని గౌరవంగా పిలవక్కర్లేదు. నాకు నీ వయసున్న కూతురు ఉంది. యు కెన్ కాల్ మీ అంకుల్. ఈ ప్రశ్న నిన్ను అడగడంలో నా ఉద్దేశం ఆయన రాజకీయ జీవితం గురించి నీకేమైనా అవగాహన ఉందా. ఆయన మిత్రులెవరు, శత్రువులెవరు అనే విషయాలు నీకు తెలుసా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే” ఆయన కొంచెం నెమ్మదిగా ఆమెకు సమాధానం చెప్పాడు.

“ఓహ్ అదా. దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదంకుల్. సహజంగా నాన్నగారు నాతో ఎప్పుడూ ఇలాంటి విషయాలు చర్చించరు. ఇంకా నా మటుకు నేనైతే టీవీ, మీడియా ఇటువంటి వాటికి దూరంగా ఉంటాను. నాకు తెలిసిన ప్రపంచం అంతా పుస్తకాల్లోనే ఉంది. అంతేకాకుకండా ఆ పుస్తకాల్లో కూడా నేను వర్తమానం కన్నా చరిత్రకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను” ఆమె తన తండ్రి గురించి తనకు తెలియని విషయాలు లేవన్నంత స్పష్టంగా చెప్పింది.

“ఒహో అలాగా. అయితే నీకిప్పుడు వర్తమానంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నువ్వు టీవీలు చూడకపోవడం వల్లన నీకు చాల విషయాలు తెలియకపోయి ఉండచ్చు. కానీ ప్రస్తుత కాలంలో అవి మన ఉనికికి చాలా అవసరం అన్న విషయం మనం మర్చిపోకూడదు.” ఆమెతో అన్నాడు. ఇంతలో అక్కడ కాఫీ సర్వ్ చెయ్యబడడంతో వారి మధ్య సంభాషణ తాత్కాలికంగా ఆగింది.

“ఇంతకీ ఏ విషయం గురించి మీరింత ప్రత్యేకంగా చెప్తున్నారు.” అర్ధం కానట్లుగా అడిగింది ప్రియాంక.

 “మీ నాన్నగారికి హార్టెటాక్ రావడానికి కారణం ఏంటో నీకు తెలుసా?” ఆయన అడిగిన ప్రశ్నకు ఆమెలో కుతూహలం ఇంకా ఎక్కువయ్యింది. పూర్తిచేసిన కాఫీ కప్‌ను కింద పెడుతూ అడిగింది ప్రియాంక.

“విషయం ఏంటో కొంచెం వివరంగా చెప్పండంకుల్, నాకిదంతా కొంచెం కొత్తగానూ, వింతగానూ అనిపిస్తోంది.”

“మీ తండ్రిగారికి రాజకీయంగా చాలమంది శత్రువులున్నారమ్మా. అంతేకాకుండా సొంత పార్టీలో కూడా ఆయనపట్ల కొంత వ్యతిరేకత ఉంది. ఆయన ప్రత్యర్దుల్లో అత్యంత ముఖ్యుడు మరెవరో కాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్ష నాయకుడైన శ్రీ జోగేశ్వరరావు గారు” ఆయన చెప్పిన విషయం వినగానే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.

“పైకి కనిపించకపోయినా ఇద్దరిలో శత్రుత్వం ఉంది. ఒకే ఊరివారు అయినప్పటికీ ఇద్దరి ధోరణుల్లో చాలా వ్యత్యాసం ఉంది. మా పార్టీవారని కాదు కానీ మీ తండ్రిగారంటే నాకెప్పుడూ అభిమానమే. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆదర్శాలనూ గౌరవిస్తాను. నాకు చేతనైనంతవరకు ఆచరించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ జోగేశ్వరరావు అలాకాదు, అతనికి ప్రజలన్నా వారి అభివృద్ది అన్నా పెద్దగా పట్టింపు లేదు, చాలావరకు ప్రాజెక్టుల్లో అవకతవకలు చేసి స్విస్ బ్యాంకుల్లోని తన ఖాతాలకు నల్లధనాన్ని తరలించుకున్నాడు.

గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వం చేపట్టే ప్రతీ పనికీ అడ్డంగా నిలిచేవాడు. చాలాసార్లు మీ తండ్రిగారి విషయంలో బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉండేవాడు. అటువంటి సందర్భాల్లో కొన్నిసార్లు మీ తండ్రిగారికి వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరం వస్తూ ఉండేది. దానికి కారణం భూషణరావు లాంటి పారిశ్రామికవేత్తలతో నకునారెడ్డి గారికి ఉన్న సాన్నిహిత్యం. చాలావరకూ ప్రభుత్వ ప్రాజెక్ట్లు అన్నీ అప్పట్లో భూషణరావుకే దక్కుతూ ఉండేవి. అందులో ముఖ్యమైనవి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు.” ఆయన కొద్దిగా ఆగడంతో ఆమె ప్రశ్నించింది.

“ఈ భూషణరావు ఎవరూ. ఈయనకీ మా డాడీకి ఏ విధంగా పరిచయం ఏర్పడింది.” ఆమెకు ఈ విషయాలన్నీ ఆసక్తిగా అనిపించడం ప్రారంభించాయి.

“భూషణరావు పుట్టుపూర్వోత్తరాల గురించి ఎవరికీ పూర్తిగా తెలీదు. అయితే ఒక రాజకీయ నాయకుడి హత్యతో అతను వెలుగులోకి వచ్చాడు. తొంభైల కాలంలో అతడొక చిన్న సివిల్ కాంట్రాక్టర్ గా ప్రారంభించి, ఇప్పుడు దేశంలోనే అత్యంత కీలకమైన ఇరిగేషన్, థర్మల్ పవర్, ఇతర సహజ వనరులకు సంబంధించిన ప్రాజెక్ట్లు చేసే స్థాయికి ఎదిగాడు. మన జెహెచ్ పార్టీ మూడవసారి పవర్లోకి వచ్చాక భూషణరావు మీ డాడీతో సత్సంబంధాలు పెంచుకున్నాడు. అప్పటికే చాలా హత్యల్లో అతని హస్తం ఉందనే పుకారు ఉంది.

అయితే అతను ఎంత నీచుడైనప్పటికీ పనిలోమాత్రం చాలా చురుకుగా ఉండి ప్రభుత్వానికి అవసరమైన నిర్మాణాలు, కట్టడాలు నిర్మించడంలో వేగవంతంగా ఉండేవాడు. దీనివల్లే నకునారెడ్డి గారు భూషణరావు పట్ల ఆకర్షితులయ్యారు. దాన్ని ఆసరాగా తీసుకుని అతను ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ చేజిక్కించుకునేవాడు. తనకి ఎదురొచ్చినవారి అడ్డు తొలగించుకుంటూ ముందుకు సాగిపోయాడు. నెమ్మదిగా అతని విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. అతని అకృత్యాలకు అంతులేకుండా పోయింది.

దాదాపు పది హత్యలతో అతనికి సంబంధం ఉందన్న విషయం తెలిసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కకేసు కూడా అతనిమీద ఫైల్ చెయ్యబడలేదు. మనపార్టీలో కూడా చాలామంది అప్పట్లో ముఖ్యమంత్రి గారు భూషణరావు చేతిలో కీలుబొమ్మగా మారిపోవడమే ఇందుకు కారణం అని మీ నాన్నగారి పైన దుమ్మెత్తిపోశారు. ఇది అదునుగా తీసుకుని అప్పటి ప్రతిపక్ష నాయకుడు జోగేశ్వరరావుగారు మీ డాడీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున దుష్ప్రచారం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో అశోక్ త్యాగీ అనబడే ఐఎఎస్ ఆఫీసర్ భూషణరావు కనష్ట్రక్షన్స్‌కి అడ్డుపడగా అతడిని నడిరోడ్డుమీద చంపించాడు.

ఇది అందరికీ తెలిసినా కానీ భూషణరావుకి ఎవరూ ఎదురెళ్ళలేకపోయారు. అటువంటి సమయంలో ఈ దుర్ఘటనను తనకు అనుకూలంగా మలచుకోవడానికి జోగేశ్వరరావు ఇదంతా ప్రభుత్వం యొక్క అసమర్థత అని, ఇదిలాగే ఉంటే భవిష్యత్తులో ఎంతో మంది నిజాయితీపరులైన ఐఎఎస్‌లనూ పబ్లిక్ సర్వెంట్స్‌నూ కోల్పోతామని, ప్రజలకు పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం పైన నమ్మకం పోతుందనే నినాదాన్ని లేవదీశాడు. అప్పట్లో నీకు తెలుసో తెలీదో కానీ ఈ కేస్ చాలా సంచలనం సృష్టించింది. మన పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయి గత ఎన్నికల్లో ఓడిపోవడానికి చాలా వరకూ ఈ అశోక్ త్యాగీ హత్యకేసు కారణం.

అయితే ఎన్నికలు రావడం వలన తాత్కాలికంగా నిలిచిపోయిన ఆ కేస్‌ను జోగేశ్వరరావు కొంత సమయం తీసుకుని మళ్ళీ తను పవర్ లోకి వచ్చాక తిరగదోడడం ప్రారంభించాడు. అందులో భాగంగానే సీబీఐకి ఈ కేస్ అప్పగించడం జరిగింది. జోగేశ్వరరావు తన పవర్ ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ మీ నాన్నగారికి చార్జ్‌షీట్ ఇచ్చేలా చేసాడు.

ఇప్పటికే కొంత లాండ్ భూషణరావు నుంచి జోగేశ్వరరావు ప్రభుత్వం చేజిక్కించుకున్న కేస్ హైకోర్టులో హియరింగ్‌లో ఉందని భూషణరావు మీ తండ్రిపై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాడు. దానికి తోడుగా ఈ సీబీఐ చార్జ్‌షీట్‌తో ఆయనకు ఒక్కసారిగా ఒత్తిడి అధికమై అది గుండెపోటుకు దారితీసింది” సుదీర్ఘ ప్రసంగంలా అనిపించిన తనకు తన తండ్రి గురించి తెలియని కథను ఆమెకు చెప్పాడు ప్రసాద్. అంతసేపూ ఆయన చెప్పినది ఏదో లోకంలో ఉండి వింటున్నట్లుగా విన్నది ప్రియాంక.

“మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే సిబిఐ చార్జ్షీట్ వల్లనే మా నాన్నగారు అస్వస్థతకు గురైనట్లు అర్ధమవుతోంది. ఇంతకీ అందులో ఏమి అంశాలు మెన్షన్ చేసారు అంకుల్” ఆమె మెల్లిమెల్లిగా ఈ ప్రపంచంలోకి లాగాబడుతున్నట్లు అనిపించింది. “ఏమోనమ్మా ఆ విషయాలు నాకు తెలీవు. నేను దాన్ని చూడను కూడా చూడలేదు. అంతా శరత్ చూసుకుంటాడు. నీకేమైనా వివరాలు కావాలంటే అతడిని అడుగు” తన నిస్సహాయతను బయటపెట్టాడు ప్రసాద్.

“సరేకానీ అంకుల్ ఇప్పుడు పని కట్టుకుని నన్ను ఇంటికి పిలిపించి మరీ ఈ విషయం చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి?” కొంచెం చురుగ్గా చూస్తూ అడిగింది ప్రియాంక.

“నీకు చెప్పడం తప్పంటావా, మీ తండ్రి విషయంలో ఎటువంటి కుట్ర జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదంటావా?” కొంచెం ఉద్వేగంతో అడిగాడు ప్రసాద్. ఆ సమయంలో ఆయన స్వరంలో ఎదో చెప్పలేని అభ్యర్ధన ధ్వనించింది.

“అలా అని కాదు కానీ ఇప్పటివరకు నేను మా డాడీ విషయాల్లో జోక్యం కలిపించుకోలేదు. ఇప్పుడు మీ మాటలు వింటూంటే నాకేదో చెప్పలేని ఆసక్తి కలుగుతోంది.” ఇప్పటికే చాలా సమయం అయినట్లుగా ఆమె గ్రహించింది. ఈయన మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నాడేమో అని ఆమెకు అనిపించింది.

“ఇంక నీ దగ్గర దాచి ఉంచి లాభం లేదు అనే విషయం నాకు అర్ధం అయ్యిందమ్మా. నిన్ను ఇక్కడికి పిలిపించడం వెనక ఒక ముఖ్య కారణం ఉంది. నీతో ఈ విషయాలన్నీ చర్చించి మీ నాన్నగారి పరిస్థితి వివరించమని పార్టీ హై కమాండ్ నన్ను ప్రోత్సహించింది.” ఉన్న విషయాన్ని బయటపెట్టాడు ప్రసాద్. “నాకు అర్థం కాలేదంకుల్, నాకు వివరించమని ఎందుకు చెప్పారు. వారి ఉద్దేశం ఏమయ్యి ఉంటుంది.” ఆయనవంక ప్రశ్నార్ధకంగా చూస్తూ అడిగింది ప్రియాంక.

“కొన్ని నిజాలు చాలా కఠినంగా ఉంటాయమ్మా. ఎంత సమర్థుడైనా కొన్ని విషయాల్లో తన సానుకూలతవల్ల మీ తండ్రి గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి కారణం అయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ నాయకత్వంలో కొనసాగడం కొంచెం కష్టం. అందుకే పార్టీ హై కమాండ్, పార్టీలో ఇతర సీనియర్ నాయకులతో పాటు నా కోరిక కూడా ఒకటే. మీ తండ్రి స్థానంలో నువ్వు పార్టీలోకి రావడం.” ఒక్కసారిగా బాంబు పేలినట్లుగా ఉలిక్కిపడింది ప్రియాంక.

“సారీ అంకుల్. అది ఈ జన్మలో జరగదు.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here