రాజకీయమా నీ పేరేమిటి?

0
10

[dropcap]ఆ[/dropcap] రోజు అన్ని టి.వి. ఛానెల్సులో లైవ్ టెలికాస్టు అవుతోంది. అది మాజీ మంత్రి మండోదర్రావు కొడుకు, కోడలు గారి పునర్మిలనం. మహిళా సమాజాలు, సంఘసేవ చేసే కార్యకర్తలు హడావిడిగా ఉన్నారు. వారి కృషి ఫలితమే ఈనాటి సంరంభానికి మూలం అన్న ఆనందం వాళ్ల మొహాల్లో తాండవిస్తుంది. టి.వి.ఏంకర్సు ఇనుమడించిన ఉత్సాహంతో తమ వాక్చాతుర్యంతో పేట్రేగిపోతున్నారు. పత్రికా విలేకర్లు తమ అడ్డదిడ్డమైన ప్రశ్నలు గుప్పించి ఆ జంటను తికమక పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఊర్లో పెళ్లయితే కుక్కలకు సందడి అన్నట్టుంది అక్కడి వాతావరణం. ఇంత జరుగుతున్నా ఆ ప్రెస్సు కాన్ఫరెన్సుకు మూలస్తంభాలయిన మాజీ మంత్రి దంపతులు కానరావడం లేదు.

మహిక ముందు మైకు పెట్టడం జరిగింది. తెల్లని ఆమె మోముని నల్లని నిడుపాటి కురులు కప్పేట్టుస్తుంటే ఎడమ చేతితో సుతారంగా నెట్టేస్తుంది. షేపు చేసిన నల్లటి కనుబొమ్మలు విల్లుని పోలి ఉన్నాయి. పెదవులు ఎర్రగా మెరుస్తూ బృహన్నలను కూడా బూజు వదిలించుకొని రారమ్మని అంటున్నాయి. అధరాలు విడీవిడనట్లు అతి సుతారంగా చిరునవ్వు చిందించామె. తెల్లని పళ్ల వరుస తళుక్కుమంది. ఆమె చిత్రరంగంలో ప్రవేశించి ఉంటే నేటి మేటి తారలు బిచానాలు ఎత్తేసి తమతమ రాష్ట్రాలకు పారిపోయి ఉండేవారు. అందాలపోటీకి వెళ్లి ఉంటే మిస్ ఇండియా టైటిలు రావడం ఖాయం. మైకు వట్టుకొన్న మహిక ఆలోచనలు వెనక్కు మళ్లాయి.

***

మహిక సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగిన సద్గుణశీలి. ఆమె తలిదండ్రులు మధ్యతరగతి మాసవులు. ఒకే ఒక కూతురిని అల్లారుముద్దుగా పెంచారు. ఆమె చదువులో ఫస్టు, వకృత్వపు పోటీల్లో బెస్టు. ఆమెను ఆదర్శ మహిళగా ఆరాధిస్తారు తోటి వాళ్లు. భార్య మీది మోజు కొద్దీ విరించి మహికను సృష్టించి భూలోకాన వీణ లేని వాణిగా అవతరింపజేసాడా అన్న అనుమానం రాక మానదు. ఆమె సుగుణాలను, అణకువను చూసి మంత్రిగా ఉన్న మండోదర్రావు తన కోడలిగా చేసుకున్నాడు. ధీషణ్ అందగాడే కాని చదువులో లాస్టు, ఆటపాటల్లో వరస్టు. ఆడపిల్లలని వల వేయడంలో మాత్రం బెస్టు.

కన్నుల కాంతులు మిన్నుల తాకగా పున్నమి వెన్నెల వెలవెలబోయెను అన్నట్లు అత్తారింట అడుగుబెట్టింది మహిక. కనులు మూసిన తెరచిన కానిపింతువు… ఇంట నడయాడినట్టులె ఇందువదన అని ఆమె కొంగు పట్టుకొని తిరిగాడు భర్త. మండోదర్రావు అనుకొన్నట్లే ధీషణ్ తిరుగుళ్లు మానేసి మహిక మత్తులో మునిగి తేలాడు. రెండు కాలండర్లు చిరిగాయి. ‘పెళ్లాం కొంగు విడిచిపెట్టవురా హెహెహె’ అని గేలి చేస్తుండేవారు మిత్రబృందం. ‘అదేమిట’ని అడిగాడు అమాయకుడు. ‘హెన్ పెక్‌డు హజ్బెండురా నాన్నా కాస్త మా వైపు బెండవురా బ్రదరూ’ అని బ్రతిమాలారు. ధీషణ్ మారలేదు. మంత్రిగారి కొడుకు చేజారిపోతున్నాడు, ఇలా అయితే తమ ఆటలు సాగవని ఫ్రండ్సు ప్రయాసపడసాగారు. వాళ్లంతా ఒక మంత్రాంగం రచించి బర్త్‌డే పార్టీ అని దూరాన ఉన్న రిజార్టుకి తీసుకుపోయారు. కార్డ్సు ఆడదామన్నారు. కాదన్నాడు. మందు ఇచ్చారు. వద్దన్నాడు. కేకు కట్ చేసి నోట్లో పెట్టారు. పొలబారితే కూల్ డ్రింకు తాగించారు. అంతే నిద్రాదేవత ఆవహించింది. నిజానికి నిద్రాదేవత కాల్ గర్ల్ రూపంలో వచ్చింది. కెమేరాలు క్లిక్ మన్నాయి.

రెండు నెలలు గడిచాయి. ధీషణ్‌కి ఫోను వచ్చింది. ఒక అపరిచిత యువతి తనను కలవాలనుకొంటుంది. సంగతేమిటని అడిగాడు. ముఖాముఖి కలుస్తే తప్ప ఫోనులో చెప్పాల్సిన విషయం కాదని చెప్పిందామె. అప్పుడప్పుడు తండ్రి నియోజకవర్గం నుండి ఆర్తులు ఫోనుచేసి సహాయం అర్ధించడం మామూలే. అపరిచితను కలిసాడు. ‘తనిప్పుడు ఒట్టిమనిషి కాదు నెల తప్పాను. అది చెప్పడానికి వచ్చాను. నన్ను ఆదుకొనుమా’ అంది ఆ నాటి కాల్ గర్ల్.

‘నీ బిడ్డకు తండ్రెవరు చెప్పు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను’ అన్నాడా అమాయకుడు. ‘ఆ తండ్రివి నీవే’ అని బాంబు పేల్చింది నెరజాణ. ‘ఛఛ’ అని కొట్టిపారేశాడు ధీషణ్. ‘నీ తండ్రికి చెప్తా, వీలయితే ఛీఫ్ మినిష్టరుని కూడా కలుస్తాను’ అని కోటింగు ఇచ్చిందామె. ‘ఋజువులేమిటి’ అని అడిగాడు. ఫోటోలు చూపించింది జాణ. షాక్ తిన్నాడు ధీషణ్. పేరుకి బృహస్పతి కాని బుద్ధి లేకపోయిందా బడుద్దాయికి. దుష్ట చతుష్చయం లాంటి మిత్రులు పన్నిన ఉచ్చులో చిక్కడిపోయాడా అల్పజీవి. గత్యంతరం లేక వాళ్లకు కాంట్రాక్టులిప్పించడంలో, లైసెన్సులు శాంక్షను చేయించడంలో తలమునకలయిపోయాడు. మళ్లా పాత మిత్రులు, పాత అలవాట్లు అతని జీవితంలో ఒక భాగమయిపోయారు.

ధీషణ్ వ్యవహారం మండోదర్రావుకు మింగుడుపడలేదు. తన పేరు చెప్పి పైరవీలు చేస్తున్నాడు. నియోజకవర్గం నుండి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా అయితే రాబోయే ఎన్నికలలో గెలుపు మాటెరుగు, ధరావత్తు కూడా దక్కదు. ముఖ్యమంత్రి అతి త్వరలోనే మంత్రిమండలిలో మార్పులు చేయబోతున్నాడు. హోం గాని ఆబ్కారీ శాఖ కోసం చక్రం తిప్పుతున్నాడాయన. రోళ్లు బద్దలు చేసే రోహిణీ కర్తెలు. ఎండలు మండిపోతున్నాయి. తనకు son stroke తప్పనట్లుంది పుత్రరత్నం ఘనకార్యాలకు. తనికి ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది. భార్య మీద మండిపడ్డాడు. ఆమె అలనాటి అనసూయ కాదు. మాటకు మాట ఒప్పజెప్పింది. మండోదర్రావు తెగేదాకా తాడు లాగాడు. నీటనున్న మొసలిని వదిలేసాడు. గట్టున మేస్తున్న హరిణ శాబకంపై వేటు వేసాడు. భర్తకు వత్తాసుపలికింది అనసూయ. ఆ ఊర్లోనే ఉంటున్న కూతురు, ఆమె భర్త కూడా ఇంటికోడలిని తప్పుపట్టారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు పాపం ఆ ఇల్లాలు బిత్తరపోయింది. అల్లారుముద్దుగా పెరిగిన అబల ఆమె. రాజకీయాలు తెలియవు. భర్తతో మొరబెట్టుకొందామె. ధీషణ్ అలనాటి అనుంగు చెలికాడు కాదు ఇప్పుడు.

వివాహజీవితం సుఖవంతంగా సాగిపోవాలంటే రెండు రహస్యాలున్నాయి.

ఒకటి తప్పు నీదయితే ఒప్పుకో.

రెండు ఒప్పు నీదయితే నోరు మూసుకో.

ధీషణ్ తప్పు ఒప్పుకోలేదు సరికదా భార్యను నోరు మూసుకోమన్నాడు. ఇంటా, బయటా మహికకు ఉండేలు దెబ్బలు తప్పలేదు. అందరి దృష్టిలో ఏడంతస్థుల మేడ, ఎయిరు కండిషన్డు కారు, ఏడు వారాల నగలు, ఎంచడానికి వీల్లేని దాంపత్య జీవితం కనబడుతున్నాయే తప్ప అభాగ్యురాలు అనుభవిస్తున్న ఆవేదన ఎందరికి తెలుసు. కాని కన్నవారు అమె అగచాట్లు కర్ణాకర్ణిగా విన్నారు, వచ్చారు. వెండి గ్లాసులో వేడి పాలు తాగేకన్నా మట్టిపిడతలో మజ్జిగ తాగడమే మంచిదని మహికను తీసుకుపోయారు.

వారాలు, నెలలు గడుస్తున్నాయి. కాని మహిక అత్తవారింటి నుండి గాని ఫోను గాని, భర్త వద్ద నుండి పిలుపు రాలేదు. ఆమె ఎన్ని సార్లు ఫోను చేసినా ఫలితం జీరో. నిశ్శబ్దం నీళ్లు నములుతుండగా దోసిట్లో కాలం కరిగి తరిగి పోయింది. పేరుకు ఇది సభ్య సమాజం అన్న మాటే గాని అందులో అసభ్యులెక్కున. కన్నవారింట నెలల తరబడి ఉన్న మహికను మాటల తూటాలతో తూట్లు పొడవసాగారు. ఇదంతా చూసిన ఆమె మేనమామ తనకు తెలిసిన వకీలుని సంప్రదించాడు. అతగాడికి ప్రాక్టీసు తక్కువ, పోలిటిక్సు ఎక్కువ. అపొజిషను పార్టీకి ఉప్పు అందింది. గృహహింస చట్టం, కట్టం వేధింపుల సెక్షన్సు ఈ దేశంలో క్షమించరాని నేరాలు. పోలీసుల పాలిట అవి కల్పతరువు, కామధేనువులు. ఎదవ నా కొడుకులు పారేసిన ఎంగిలాకులు ఏరుకొన్నారు. అసెంభ్లీ అట్టుడుకి పోయింది. మంత్రి పదవికి రాజీనామా చేసాడు మండోదర్రావు. భార్యతో జైలుపాలయ్యాడు. అండరుగ్రౌండుకి వెళ్లిపోయిన ధీషణ్‌కి వలవేసి చిప్పకూడు తినిపిచారు. ఆఖరికి ఆడబడుచు, ఆమె భర్తను కూడా కటకటాల పాలు చేసారు రక్షకభటులు. చాలా రోజులకి అనారోగ్యం అన్న మానవతా దృష్టి కోణంపై వాళ్లకు బెయిలు లభించింది.

మూడేళ్లు గడిచాయి. ఎలక్షన్లు వచ్చాయి. పార్టీ టికెట్ దొరకలేదు మండోదర్రావుకి. తన వెనుక తోకాడించుకోని తిరిగే చంచాలు మొహాలు చాటేసారు. మంత్రి పదవి పోయినా, శాసనసభ్యుడు కాకపోయినా బాధించలేదు కాని తన ప్రత్యర్ధి తన నియోజకవర్గం నుండి ఎన్నికయి రావడం పెద్ద షాకయింది ఆ రా.నా.కి. I can certainly tell that politics is the most uncertain game అని తన రాజకీయ గురువు అన్న మాటలు నిజమయ్యాయి.

మహిళా సంఘాలు, న్యాయమూర్తుల చొరవ మూలాన ధీషణ్, మహికలకు రాజీ కుదిగింది. కేసులు ఉపసంహరించుకొందామె. అదే ఈ నాటి ప్రెస్సు కాన్ఫరెన్సుకి మూలం. మీడియాకి న్యూసులు లేక గోళ్లు గిల్లుకొంటున్న తరుణంలో ఈ దంపతుల పునర్మిలనం ప్రధాన ఆకర్షణ అయింది.

***

“మాట్లాడండి మేడం…” అన్న పాత్రికేయుడి పిలుపుతో ఆమె ఆలోచనలకు ఆనకట్ట పడింది

మిత్రద్రోహానికి బలయిన తన భర్త తనని దూరం చెయ్యడం, అన్యుల మాటలకు తలొగ్గి తను న్యాయస్ధానం ఆశ్రయించడం అంతా ఒక పీడకల. తమలోని భేదాభిప్రాయాలు సమసిపోయాయి కాబట్టి అత్తారింట కోడలిగా కాకుండా కన్నకూతురిల మసలుకొంటానని ప్రకటించిందామె.

హోమం కాల్చారు. యజ్ఞ క్రతువులు గట్రా అయ్యాయి.

కధ సుఖాంతం అయింది అనుకొంటే పొరబాటు. అసలు కథ ఇక్కడ నుండే ఆరంభమవుతుంది.

ఈ మూడేళ్లు మండోదర్రావు ఖాళీగా కూచోలేదు. తన నియోజకవర్గంలో పల్లెపల్లె కాలినడకన, మండుటెండలో తిరిగాడు. తమ రాష్ట్రం పట్ల కేంద్రం చేసే సవత్తల్లి చేష్టలు ప్రజలకు చాటేందుకు సభలు, ర్యాలీలు నిర్హహించాడు. పార్టీ పట్ల తన విధేయతని ప్రదర్శించాడు. ఏటా జరిగే పార్టీ సమావేశాల్లో కార్యకర్తలను కూడగట్టుకొని శ్రమించాడు. రాజ్యసభకు రాష్ట్రం కోటా నుండి పంపిస్తే వందకోట్లు ఇస్తానన్న లిక్కరుకింగు చేతులెత్తేసాడు. హతాశుడయి ఉన్న ముఖ్యమంత్రితో లాబీయింగు జరిపాడు మండోదర్రావు. ఈసారి జరిగే రాష్ట్ర ఎన్నికలకు కోడలికి పార్టీ టికెట్ ఇచ్చే ఒప్పందం జరిగింది. ఆరేళ్లపాటు హాయిగా భార్యామణితో దేశరాజధానిలో ఉండోచ్చు. ఎమ్యెల్యేగా పోటీ చేయనున్న మహికకు ఎటువంటి సహాయ, సహకారాలు లభించవు. ఓడిపోతే ఊరులోని దుశ్సాసనులచేత వలువలు ఊడదీయిస్తాడు. ఒకవేళ గెలిస్తే అసెంబ్లీలో ఉన్న ఐదేళ్లు ధీషణ్ పైరవీలు కొనసాగుతాయి. స్కాంలలో చిక్కుకుంటే కోడలే జైలుకు వెళ్తుంది. తన కత్తికి రెండు వైపులా పదునే. కట్టుకొన్న పెళ్లాం పక్కింటాడితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా సహించవచ్చు కాని పదవి లేకుండా ఉండడం సాధ్యం కాదు రా.నా.కి.

రాక్షసీ నీ మరో పేరే రాజకీయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here