ప్రాంతీయ సినిమా -13: వారి దారి ఎడారి

0
9

[box type=’note’ fontsize=’16’] “ప్రభుత్వం ఎర వేయాల్సింది తాయిలాలతో ప్రేక్షకుల్ని కాదు. క్వాలిటీ సినిమాలు ఉత్పత్తి చేయగల తగిన టాలెంట్‌ని, మౌలిక సదుపాయాల్నీ అభివృద్ధి చేసే చర్యలు తీసుకోవడమే” అంటున్నారు సికందర్ రాజస్థానీ సినిమాలను విశ్లేషిస్తూ. [/box]

[dropcap]యూ[/dropcap]రప్ దేశాల్లో ఎనభై శాతం ఆక్రమిస్తున్న హాలీవుడ్ సినిమాల ధాటికి అక్కడి ప్రాణప్రదమైన నేటివ్ కళ ప్రపంచ సినిమా (వరల్డ్ మూవీస్) అల్లల్లాడుతున్నట్టు, మనదేశంలో ఉత్తరాది ప్రాంతీయ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడలేక అవస్థలు పడుతున్నాయి. చివరికి ప్రాంతీయ అస్తిత్వాలని కూడా వదులుకుని బాలీవుడ్ మార్కు ఫక్తు కాలక్షేప మసాలాలుగా మారిపోతున్నాయి. ఇలాగైనా ప్రాంతీయంగా కొంకణి, మణిపురీ, అస్సామీ, ఒరియా మొదలయిన ప్రధాన భాషల్లోనే కాదు, ఉప ప్రాంతీయాలైన తుళు, భోజ్‌పురీ, కోసలీ, సంబల్‌పూర్ వంటి భాషల్లో సైతం సినిమా రంగాలు వర్ధిల్లుతూండగా, దేశంలో ఒక ప్రధాన ప్రాంతీయ భాష అయిన రాజస్థానీలో మాత్రం సినిమాలు కమర్షియల్‌గానూ దిక్కూ దివాణం లేకుండా వున్నాయి. ఏమంటే బాలీవుడ్ సహా టాలీవుడ్, కోలీవుడ్ వంటి కమర్షియల్ సినిమాల షూటింగులకి లోకేషన్లు అద్దె కిచ్చుకునే కేంద్రంగా మారింది రాజస్థాన్. ఇలా వందలాది బయటి సినిమాలు ఇక్కడ షూటింగులు జరుపుకున్నాయి, ఇంకా జరుపుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సంబడం చాలనుకుంటోందే గానీ, గర్వించదగ్గ బహుముఖ సాంస్కృతిక విశిష్టతలు గల తన జాతికి ఒక సమగ్ర సినిమా రంగాన్ని అభివృద్ధి చేసివ్వాలన్న ఇంగిత జ్ఞానంతో ఎప్పుడూ లేవు.

ప్రారంభం 1942లోనే (‘నిజరానో’) జరిగినా దానికి అర్థం లేకుండా పోయింది. నిజమైన ప్రారంభం 1961 లోనే జరిగింది. ‘బాబాసా రీ లాడ్లీ’ అనే బి. కె. ఆదర్శ్ రంగుల్లో తీసిన చలనచిత్రం విజయ ఢంకా మోగించింది. దాంతో మరిన్ని సినిమాలు ఆ దశాబ్ద కాలంలో తీస్తూపోయారు ఇతర నిర్మాతలూ దర్శకులూ. రాజస్థానీ సినిమాలు కొన్ని ప్రాంతీయ సినిమాల్లాగా వివిధ సామాజిక ఇతివృత్తాల జోలికి పోకుండా – ఎక్కువగా సంసార పక్షమైన కుటుంబ కథా చిత్రాలుగానే హిందీ సినిమాల సరళిలో తీస్తూపోయారు. సుపటార్ బేటీ, ప్యారీ బేటీ, లాజ్ రఖో రాణీ సతీ, సతీ సుహాగన్, హమారీ ప్యారీ చనానా, ఎడ్యుకేటేడ్ బినానీ… ఇలా ఎన్నో. ఆఖరికి 2016లో తీసిన లాడ్లీ కూడా లేడీస్ సినిమానే. వీటి మధ్య అప్పుడప్పుడు రాజూ రాథోడ్, ఫియర్ ఫేస్, దంగల్, స్టూడెంట్ లైఫ్ వంటి యాక్షన్ సినిమాలు, భక్తి సినిమాలూ వస్తూంటాయి.

1961 – 1989 ల మధ్య మూడు దశాబ్దాల కాలంలో 42 సినిమాలు మాత్రమే తీశారు. అంటే ఏడాదికి ఒకటిన్నర సినిమా. తర్వాత 1990 -1999 మధ్య ఏడాదికి సగటున ఐదు సినిమాలు తీశారు. కానీ 2000 నుంచీ నేటివరకూ 42 సినిమాలు మాత్రమే తీయగలిగారు. అంటే ఏడాదికి రెండుంపావు సినిమాలు. ఈ డిజిటల్ యుగంలో మరీ వెనకబడి పోయారు.

కారణాలు అనేకం చెప్పుకుంటారు: టాలెంట్ లేక చవకబారు సినిమాలు తీయడం, అవి విడుదలయ్యే పరిస్థితి లేకపోవడం, దీంతో నిర్మాతలు ముందుకు రాకపోవడం వంటివి. రంగంలో బీకే ఆదర్శ్, రాజ్ నహతా, జతిన్ కుమార్ అగర్వాల్, అజయ్ చౌదరీ, భాను ప్రకాష్ రాఠీ, నావల్ మాథుర్, నీలూ వాఘెలా, గజేంద్ర శ్రోత్రియా వంటి ప్రముఖులైన నిర్మాతలు, దర్శకులూ వున్నా, వారిలో ఉత్సాహం లేదు. డజను మంది ప్రముఖ దర్శకులూ, వంద మంది స్థానిక ఆర్టిస్టులున్నా స్తబ్దుగా వుంటారు.

రాజస్థానీ సినిమాలని ప్రోత్సహించాలని 2008లో ప్రభుత్వం తీసుకున్న ఏకైక చర్య, లక్ష లోపు జనాభా వున్న పట్టణాల్లో వినోద పన్ను రద్దు చేయడం. ఇదేమీ సినిమా హాళ్ళకి ప్రేక్షకుల్ని రప్పించలేదు. ప్రేక్షకులకి హిందీ సినిమాల క్వాలిటీయే నచ్చుతోంది. ప్రభుత్వం ఎర వేయాల్సింది తాయిలాలతో ప్రేక్షకుల్ని కాదు. క్వాలిటీ సినిమాలు ఉత్పత్తి చేయగల తగిన టాలెంట్‌ని, మౌలిక సదుపాయాల్నీ అభివృద్ధి చేసే చర్యలు తీసుకోవడమే. మల్టీప్లెక్స్‌ల రాకతో రాజస్థానీ సినిమాల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. అవి బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల జోరుని పెంచడంతో, రాజస్థానీ సినిమాలని ప్రదర్శించక పోవడంతో, స్థానిక పరిశ్రమ చావుబతుకుల దశకి చేరుకుంది.

ఇది కాస్తా అంతిమ యాత్ర దశకి చేరుకోకుండా కొందరు నిర్మాతలు, దర్శకులు ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు చేశారు. సినిమాల నిర్మాణాలకి సబ్సిడీలు ఇవ్వడం, మల్టీప్లెక్సులు సహా అన్ని థియేటర్లలో రాజస్థానీ సినిమాలకి ఒక ఆటని తప్పని సరి చేయడం. ఇది కూడా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. కనీసం ఏడాదికి వంద షోలు ప్రదర్శించుకుంటామన్నా ఉలుకూ పలుకూ లేదు ప్రభుత్వం నుంచి. రాజస్థానీ సినిమాలు ప్రదర్శించుకోవాలంటే థియేటర్ల యాజమాన్యాలకి ముందు ఎదురు డబ్బిచ్చుకుని తర్వాత వసూళ్లు రాబట్టుకోవాలి. అదే బాలీవుడ్ సినిమాలు ప్రదర్శించాలంటే మాత్రం పరుగులు పెట్టి యాజమాన్యాలు బాలీవుడ్ నిర్మాతలకి ఎదురు డబ్బులిచ్చుకుంటున్నారు. ఇదేం తమాషా అని స్థానిక నిర్మాతలు వాపోతున్నారు.

మూడేళ్ళ క్రితం ఐదు లక్షలు సబ్సిడీ ఇవ్వడానికి ముందుకొచ్చింది. దీనికి ‘యూ’ సెన్సార్ సర్టిఫికేట్ వుండాలన్న నిబంధన విధించింది. ‘యూ’ సర్టిఫికేట్ తో భక్తి సినిమాలు తీసి బాగుపడలేమని, యువతని ఆకర్షించే సినిమాలు తీయక తప్పదనీ నిర్మాతలు పట్టుబట్టారు. ప్రభుత్వం వినిపించుకోలేదు. అతి కష్టంగా ఓ ముగ్గురు నిర్మాతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మూడేళ్ళలో మూడు సినిమాలు తీసి, కిందామీద పడి సబ్సిడీ తీర్థం పుచ్చుకోగాలిగారు. ఈ సబ్సిడీ తీర్థం ప్రక్రియ కూడా చాంతాడంత వుంటుంది. దీంతో నిర్మాతలెవరూ ఈ తీర్థం ఛాయాలక్కూడా రావడం లేదు. సబ్సిడీ కమిటీలో నిపుణుల పానెల్ అని, డిస్ట్రిబ్యూటర్లని కూడా వేశారు. వీళ్ళకి సినిమా నిర్మాణం, కళలు, సాంకేతికాలూ ఏమీ తెలీక తలనొప్పులు సృష్టిస్తూంటారు.

బాలీవుడ్ ఆర్భాటాల ముందు స్థానిక పరిశ్రమ వెలవెల బోతోంది. ప్రతీ బాలీవుడ్ సినిమాల ప్రమోషన్లకి అట్టహాసంగా బాలీవుడ్ స్టార్స్ విమానాల్లో ఎగిరి వచ్చి జైపూర్‌లో వాలిపోతూంటారు. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో ప్రోగ్రాములు పెట్టి మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జిగేలుమంటారు. వాళ్లకి లభించే పబ్లిసిటీ, బిజినెస్ చూసి స్థానిక నిర్మాతలు దీన వదనాలతో వుంటారు. కోట్లాది రూపాయల బడ్జెట్లతో బాలీవుడ్ నుంచి వచ్చిన యూనిట్స్‌తో షూటింగులు భారీ ఎత్తున జరుగుతూంటాయి. నిత్య కల్యాణం పచ్చతోరణం లాగా రాజస్థాన్‌ని కళకళ లాడించేస్తూంతారు బాలీవుడ్డీయులు. తాము మాత్రం పుట్టిన గడ్డ మీద ఏమీ చేయలేక, థార్ ఎడారిలాగా మారిన తమ పరిస్థితిని చూసుకుని జాలిపడుతూంటారు రాజస్థానీ నిర్మాతలు, దర్శకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here