రాజేశ్వరి – రత్నావళి

0
7

[dropcap]చ[/dropcap]లం గారు రచించిన ‘మైదానం’ నవలలో ‘రాజేశ్వరి’ పాత్ర, విశ్వనాథ సత్యనారాయణగారు ‘చెలియలికట్ట’ అనే నవలలో సృష్టించిన ‘రత్నావళి’ పాత్రకంటె ఎంతో మెరుగైనదని, ఫేస్‍బుక్ సాహిత్యం గుంపులో ఒకరు అనగా, వారికి జవాబుగా ఆ రెండు పాత్రలను గూర్చి ఇటీవల నేను చేసిన తులనాత్మక పరిశీలన ఇది.

రాజేశ్వరి:

ఆమె ఏమైనా చదివిందో లేదో, నిరక్షరాస్యురాలో తెలియదు. అమీర్ చూపులతో, చేతలతో ఆకర్షింపబడి కుటుంబ అస్తిత్వాన్ని వదలి అతని వెంట వెళ్ళింది. ఆమె మాటల్లో చెప్పాలంటే “అతని పాదసేవకి, అతనితో సుఖదుఃఖాలు పంచుకునేందుకు, అతని ఆజ్ఞలే, అతని దయే,అతని పూజే నా మతంగా, నా ధర్మంగా, నా ఆనందంగా, నా జీవనాన్ని అర్పించేందుకు, అతను నన్ను ప్రేమించనీ, చంపనీ, పాలించనీ వొదిలెయ్యనీ” అలా సిద్ధపడి వెళ్ళింది రాజేశ్వరి. ఈ మాటలు చదివినప్పుడు ప్రియుడి పట్ల రాజేశ్వరి కంటే పతివ్రతా సూత్రాలను పాటించిన కథానాయిక మరెవ్వరూ లేరు అనిపిస్తుంది. ఆమె అలా వెళ్ళినట్లు ఎవరికీ తెలియదు. బంధువులు పుట్టింటికి వెళ్ళిందని లోకానికి చెప్పుకున్నారని పాఠకులకు ఆమె మేనమామ ద్వారా తెలుస్తుంది. అమీర్‌తో వెళ్ళిన రాజేశ్వరి నదీతీరంలో ఇసుకదిబ్బల్లో, గుడిసెలో, అర్ధనగ్నంగా బ్రతికేందుకు శ్రమపడి, అతని పట్ల మోహం వదులుకోలేక సంతోషంగా అలవాటు పడింది. అతడు ఎవరిపైనో మోజుపడితే, ఆమెను సతీ సుమతిలాగా అతనికి అమర్చి పెట్టింది. అతడు ముద్దుచేస్తే సంతోషించింది. అమీర్ తనను కొడితే ఎంత బలమో అని సంతోష పడింది. తన భర్త మీద ఈర్ష్యపడితే ఆ పొసెసివ్‌నెస్‌కి సంతోషించింది.

మాతృకాంక్ష అనే సహజాతం వల్ల గర్భం తీయించుకోమంటే బాధపడింది. కానీ అమీర్ సాన్నిధ్యం కోసం ఆ కాంక్షను కూడా చంపుకుంది. అమీర్ తన తాత్కాలిక రక్షణకోసం ఉంచిన మీరాతో సుఖించింది. అతని సంతోషం కూడా తన సంతోషం అనుకుంది. ఈర్ష్యాళువు అయిన అమీర్ చివరకు ఆమె మీద ఉన్న ప్రేమ కారణంగా మీరాను, రాజేశ్వరిని చంపలేక, తనను తానే కత్తితో పొడుచుకుని చనిపోయాడు. అతన్ని ‘నేను చంపానంటే నేను చంపాను’ అని ఒప్పుకొని మీరా, రాజేశ్వరి ఇద్దరూ పోలీసులకు చిక్కారు. ఎవరికి శిక్షపడిందో నవలలో లేదు. రాజేశ్వరికి ఉద్వేగం తప్ప విచక్షణ లేదు. అమీర్ జీవనం కోసం ఏం చేస్తాడో నవలలో లేదు. జీవనం కోసం రాజేశ్వరి ఏ ప్రయత్నం చేయలేదు. లోకంలో ఎవరూ అనుభవించనంత సుఖం వారు అనుభవించారని రాజేశ్వరి కథనం. తన భౌతిక సౌఖ్యాలన్నింటిని వదులుకొని, ఆమీరు ఎటువంటి బాధ్యతనూ అంటగట్టకుండా, చెప్పినమాట విని పడిఉండి, ఏ విషయాన్నీ ప్రశ్నించని రాజేశ్వరికి హృదయం అయితే చాలా విశాలమే. బుద్ధిమాత్రం అసలు ఉందో లేదో తెలియదు. అమీర్‌పై పట్టరాని మోహంలో పడిన ఆమె కుటుంబం గూర్చి ఆలోచించక పోవచ్చును. కానీ నవల ఆరంభం నుండి చివరి వరకూ ఏ సందర్భంలోనూ ఆమెకు తన భవిష్యత్తు పట్ల కూడా ఎటువంటి బాధ్యత, ఆలోచన ఉన్నట్లు కనిపించదు. గతంలో, వర్తమానంలో తన ప్రవర్తన దాని పర్యవసానం పట్ల అవగాహన కానీ కనిపించదు. ఆత్మపరిశీలనం అన్న మాట ఆమె ఏనాడూ విన్నట్టు కూడా లేదు. సహజంగా ప్రాణులన్నింటికీ ఉండే ఆత్మరక్షణ సహజాతమైనా ఉందో లేదో తెలియదు.

రాజేశ్వరి నవల ప్రారంభంలో ఎలా ఉందో చివరికి కూడా అలాగే ఉంది. ఆ పాత్రలో ఎటువంటి పరిణామం లేదు. చలం కల్పించాలని చెప్పిన స్త్రీ శరీరానికి వ్యాయామం, ఆమె మెదడుకి జ్ఞానం తన కథా నాయిక రాజేశ్వరికి కల్పించలేదు. అలాగే ఆయన స్త్రీకి ముఖ్యమని చెప్పిన విద్య, స్వతంత్ర ఆర్జన ఈమెకు లేవు. రాజేశ్వరికి చదువుకోవాలనే కోర్కె కూడా కలగలేదు. హృదయానికి, శరీరానికి అనుభవం మాత్రం తన నాయికకు పుష్కలంగా కల్పించాడు చలం. ఆరోగ్యకరంగా బ్రతకటానికి అవసరమైనవి ఏమీ లేని కారణంగా అమీర్ రాజేశ్వరిల సంబంధం ప్రేమ బంధంతో మొదలైనప్పటికీ, స్త్రీ పురుషుల మధ్య ఉండకూడదు అని చలం చెప్పిన అధికారబంధమే మిగిలింది. ఆమె గర్భాన్ని ఉంచుకోవాలా/వద్దా/మీరాతో అనుబంధం ఉండాలా వద్దా అనే విషయాల్లో అమీర్‌కు స్థిరనిర్ణయాలు ఉన్నాయి. అది అధికారబంధపు ఫలితమే. చివరకు అది అమీర్, రాజేశ్వరిల అంతిమ స్థితికి దారితీసింది. తెలుగుతీరాలు బ్లాగులో రాసినట్లుగా ఆమె నశించిపోయింది. ఇటువంటి స్త్రీని ఇష్టపడే పురుషులు, స్త్రీలు, పాత్రను సృష్టించిన రచయిత, స్త్రీ సౌఖ్యాన్ని సంక్షేమాన్ని కోరే వారేనా? స్త్రీ స్వాతంత్య్రం అనే ముసుగులోని బానిస కాదా రాజేశ్వరి వంటి స్త్రీ. స్త్రీ స్వాతంత్ర్యమంటే, లైంగిక స్వాతంత్ర్యం మాత్రమేనా? వ్యక్తిత్వ రాహిత్యమేనా? ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ‘కాదు’ మాత్రమే!

రత్నావళి:

మరిది రంగారావు చేతలతో, అతడు అందించిన పుస్తకాలను చదివి అతని సిద్ధాంతాలకు వశమై, భర్త మాట మేరకు, అతడు, గ్రామంలో అందరూ చూస్తూ ఉండగా తన కుటుంబ అస్తిత్వాన్ని వదలి మరిదితో వెళ్ళిపోయింది. ఒకసారి అతనితో వెళ్ళటానికి నిశ్చయించుకున్న తరువాత, ఆమె తన భర్తతో భార్యగా మెలగలేదు. తనకు, మరిదికి మధ్యగల సంబంధాన్ని దాచే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఈ సందర్భంలో చలం చెప్పిన సూనృతం రత్నావళిలో కనిపిస్తుంది. చెన్నపట్నంలో రంగడితో ఆమె మాటలాడే సందర్భంలో, అతడు అందగాడనీ, తన భర్తకంటే ఎక్కువ సుఖపెడతాడనీ, అతని మాటలవల్ల ఆశపడినట్లుగా పాఠకులకు తెలుస్తుంది. రంగడు ఆమెను తన మిత్రులతో పరిచయం చేసి వారిలో ఎవరిని ఆమె ఇష్టపడితే వారికి ఇచ్చి వివాహం చేస్తానని అంటాడు. అతని మిత్రులను చూసి వారు తనకు తగరని నిర్ణయించుకుంది. రంగడు పెళ్లాడతాను అన్నప్పుడు ప్రేమ ఉన్నప్పుడే పెళ్ళి అనే అతని సిద్ధాంతాన్ని అతనికి గుర్తుచేసి, ఇరువురి మధ్య వస్తూ పోతూ ఉన్న ప్రేమను చర్చిస్తుంది. చెన్నపట్నంలో రంగడు ఆమెకు వీలైనంత సుఖజీవితాన్ని ఏర్పరచాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆమె భర్త అనుమతితో తాను తెచ్చుకొన్న నగలను అమ్మి జీవికకు లోటులేకుండా చేసింది. కుటుంబ పోషణలోనూ, నగలు పెట్టుకోక పోవటంలోనూ కూడా స్త్రీ పురుషులు సమానం అని ఆచరణాత్మకంగా చేసి, చూపింది.

ప్రతిష్ఠాపురంలో రత్నావళిని భర్త కొట్టినప్పుడు అతన్ని మళ్ళీ కొట్టింది. అప్పుడు ఆమె ఎక్కువ చదువుకోలేదు. చదువుకొన్న తరువాత చెన్నపట్నంలో రంగడు ఆమెను కొట్టినప్పుడు నిశ్శబ్దంగా ఊరుకోలేదు. ప్రియుడి బలం చూసి పొంగిపోలేదు. తాను చేసింది తప్పు అని అతని చేతనే ఒప్పించింది. ప్రతిష్ఠాపురంలో సముద్రపు ఒడ్డుకు రంగారావుతో విహారానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రేమ, పెండ్లి గూర్చి రంగడితో చర్చించింది. వారి ఇరువురి అనుబంధం రంగడి సిద్ధాంత బోధతోనే ప్రారంభం అయింది. అదే చివరి వరకు కొనసాగింది. రత్నావళి తన బుద్ధిబలంతో, సహజ తర్కంతో ప్రతిసారి రంగడి సిద్ధాంతాలకు బలమైన పునాదులు లేవని తాను తెలుసుకొని, రంగడికి తెలియజేసింది. ఆ విధంగా ఆమె తాను తప్పు చేశానని తెలుసుకుంది. దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవటానికి చదువుకోవటం ప్రారంభించింది. చదువుకున్నాక, ఆమెకు తన ధర్మంలో తాను చేసినది దిద్దుకోరాని తప్పు అని గ్రహించింది. ప్రతిక్షణమూ పశ్చాత్తాపంతో కుమిలిపోయింది.

చెన్నపట్నం చేరిన అనతికాలంలోనే, రంగడిపై ఆధారపడటంలోని ప్రమాదాన్ని గుర్తించింది. విద్వాన్ పరీక్షకు కట్టి, ఉద్యోగంలో కుదురుకొని, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించింది. అంతవరకూ తన నిస్సహాయత్వం వల్ల అతనితో జీవించిన రత్నావళి, ఆపై కేవలం రంగడిపై దయతో అతనితో కలిసి జీవితాన్ని కొనసాగించింది. అతడు కూడా తన తప్పును తాను గ్రహించేటట్లుగా చేసింది. రంగడిలో కూడా పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఇద్దరూ కలిసి ధనాన్ని పొదుపుచేశారు. తనకు చదువు చెప్పిన ముకుందరావుతో సహా రంగారావు స్నేహితులను కూడా తన ఆలోచనలతో బాగు చేసింది. మేనల్లుడు నీలాంబరం చదువుకు ఆర్థిక సహాయం చేసింది. చివరకు ప్రతిష్ఠాపురం చేరి, తన భర్త సీతారామయ్యను తనకు తద్దినాలు పెట్టేందుకు అతని కుమారునికి అనుమతి ఇవ్వమని కోరి తన సంపాదననంతా అతనికి అందజేసింది. చెలియలికట్ట దాటిన సముద్రంలో కలిసిపోయింది. రంగడు కూడా ఆమె బాటనే అనుసరించాడు. ఏ లోకజ్ఞానం లేని, అమాయకమైన పసిఇల్లాలుగా ప్రారంభమైన రత్నావళి జీవితం, కథ పూర్తి అయ్యే సరికి జ్ఞాన సముపార్జన చేసి, విదుషియైన ఉత్తమ వ్యక్తిగా రూపొందింది. నవలలోని అన్ని పాత్రలకంటే గొప్పదనాన్ని సంతరించుకుంది. తనను తాను బాగు చేసుకోవటమే కాక, తన చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయపడింది. చిత్రంగా చలం చెప్పిన స్త్రీకి విద్య, ఆమె మెదడుకు వ్యాయామం, ఆమె హృదయానికి అనుభవం, ఆర్థిక స్వాతంత్య్రం అన్నీ రత్నావళికి ఉన్నాయి. విశ్వనాథవారు తన పాత్రకు వాటి నన్నింటిని కలుగజేశారు.

ఇంత అభివృద్ధిని ఇచ్చిన రచయిత ఆమెను ఎందుకు ఆత్మహత్య పాలుజేశారనేది కొందరి ప్రశ్న. సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఉత్తమ రచయిత వాటిని చూసి కలవరపడతాడు. వాటిని వస్తువుగా రచన చేయకుండా ఉండలేడు. కాని సమస్యలకు పరిష్కారాలను తమ కళారూపాల్లో చూపడు. చూపకూడదు. ఎందుచేతనంటే సమస్యలకు పరిష్కారమనేది, ఆయా వ్యక్తుల పరిస్థితులు, వ్యక్తిత్వాలు, ఎటువంటి వ్యక్తులు ఆ పరిస్థితిలో ఇమిడి ఉన్నారు మొదలైన అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. అందుకులోబడి నిజజీవితంలో వ్యక్తులు తమ నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఉత్తమ రచయిత తన కళారూపంలో అంతర్లీనంగా కొన్ని విలువలను సమాజానికి తెలియజేస్తాడు. విలువలు వ్యక్తులకు వంటపట్టినప్పుడు వారు సంస్కారవంతులౌతారు. అప్పుడు విపత్కర పరిస్థితుల్లో తీసుకొనే నిర్ణయాలు ఉన్నతమైనవిగా ఉంటాయి. క్రమక్రమంగా సమాజంలో మార్పుకలిగే అవకాశం ఉంటుంది.

తన ధర్మాన్ని సాహిత్యం ద్వారా చక్కగా తెలుసుకున్న రత్నావళి, మొదటినుండి సూనృతం కలవ్యక్తిగా విశ్వనాథ చూపిన రత్నావళి, తను చేసిన తప్పు దిద్దుకోలేనిదిగా గ్రహించిన రత్నావళి, అప్పటినుండి సన్న్యాసినిగా జీవించిన రత్నావళి తన పశ్చాత్తాప భారాన్ని సహించలేక మరణించింది. పశ్చాత్తాప భారమేమిటో తెలుసుకోవాలంటే దోస్తవిస్కీ రచించిన ‘నేరము – శిక్ష’ నవలలో రాస్కల్నికోవ్ పాత్రను గుర్తుచేసుకుంటే చాలు. రత్నావళి ఎదుర్కొన్న సమస్యను ఎదుర్కొన్న వారందరూ మరణించ నక్కరలేదు. వారి మనసుకు ఉన్న స్థితిని బట్టి, వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు.

‘మైదానం’ నవలలో నాయికా నాయకులు జీవించే పరిస్థితులు వాస్తవానికి ఎంతో దూరంగా, ఒకానొక కాల్పనిక లోకంలా ఉంటాయి. ‘చెలియలికట్ట’లో పరిస్థితులు లోకసహజంగా ఉంటాయి. అందువల్ల తాము చేసిన పనిలోని కష్టసుఖాలు, దాని పరిణామాలు వారికి తెలిసి వచ్చే అవకాశం కలిగింది. ఇలా వాస్తవిక సంఘజీవన చిత్రణ ద్వారా విశ్వనాథ సాధించినది ఎంతో ఉంది. ఆ కారణంగా సందర్భానుసారంగా ప్రేమ, మోహం, కామం, వివాహం, సంసారం, స్త్రీపురుష వ్యక్తిగత సంబంధం, సమాజంలో దాని ప్రాధాన్యం, మొదలైన ఎన్నో విషయాలపై రచయిత చక్కని చర్చను చేశారు. ఇలా ఆయా విషయాలను తెలుసుకొన్న స్త్రీ పురుషులు ఎవరూ నియతి లేని బ్రతుకు జోలికి పోరు. అదే రచయిత ఆశయం. రత్నావళి మరణించిందా, లేదా అన్న విషయం ఇక్కడ ప్రధానం కాదు. ఆ పాత్ర స్వభావానుసారంగా మరణించటం అనివార్యం. అంతే! కాని మంచి మార్గం తప్పిన వారందరూ మరణించాలనేది ఆ నవల సందేశం కాదు. అటువంటి ప్రమాదకర మార్గంవైపు ఎవరూ వెళ్ళకూడదనేది విశ్వనాథ హృదయంలోని ఆకాంక్ష.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here