రక్త సంబంధం

6
14

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు రచించిన ‘రక్త సంబంధం’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap] ఇంట ఆ రోజు ఎవరో చనిపోయారనటానికి గుర్తుగా ఇంటిముందు షామియానా, దాని కింద మండి ఆరిపోయి సగం కాలిన మూడు కట్టెలు, తెల్లటి బూడిద కుప్ప ఉన్నాయి. ప్లాస్టిక్ కుర్చీలు షామియానా కింద అద్దెలద్దలుగా పెట్టివున్నాయి.

ఆ ఇంటి ముందు నుంచి వెళుతున్నవాళ్లు, ‘ఎవరో పోయినట్టున్నారు’ అనుకుంటూ వెళుతున్నారు.

ఆ బజారు వాళ్ళు మాత్రం ‘ఆ ఇంట్లో ఆ ముసలాయన రాత్రి పోయినట్టున్నాడు’ అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు.

ఆ ముసలాయనకు ఒక పేరుంది, ‘పరంధామయ్య’ అని. కానీ కొంతకాలంగా ఆ వీధిలో ఆయన ముసలాయన గానే ప్రసిద్ధుడు. పరంధామయ్యకు ఎనభై ఎనిమిదేళ్లు ఉంటాయి.

రెండు నెలలుగా మంచంలో ఉన్నాడు. ఎలాగూ కొద్ది రోజులలో పోతాడని అందరూ అనుకుంటూనే ఉన్నారు గనుక ఆయన చావు ఎవ్వర్నీ ఆశ్చర్య పరచలేదు. ‘అయ్యో పాపం’ అని అనుకున్న వాళ్లు కూడా లేరు. బయటివాళ్ళేంటి, ఇంట్లో వాళ్లు కూడా ఎవరూ అలా అనుకోవటం లేదు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. భార్య పోయి రెండేళ్ళయింది.

ఆమె పక్షవాతంలో కొంచెం తీసుకొని తీసుకొనిపోయిందని ‘మొండి ప్రాణాలు త్వరగా పోవు’ అని విసుక్కున్నారు కోడళ్లు. “ఎప్పుడూ నేనే చేయాలా” అని పెద్దకోడలు – “పెద్దకోడలంటే తప్పదు మరి” అని నడిపి కోడలు – “నేను చిన్నదాన్ని, పెద్దవాళ్లు ఇద్దరుండగా నాకు అంత బాధ్యత ఎందుకుంటుంది” అని చిన్నకోడలూ వంతులు పడి పంతాలకు పోయి కీచులాడుకునేవారు. “కోడళ్ళుండగా ఆడపిల్లలం మాకేం బాధ్యత ఉంటుందీ – చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళేవాళ్ళమేగాని – అయినా రేపు వాళ్ళ ఆస్తులు తినేది వాళ్ళేగా – వాళ్ళే చేయని” అంటూ తొంగి చూడను కూడా చూడలేదు కూతుళ్ళు. ఎలాగోలా ఆమె దాటిపోయింది. ఆ తర్వాత పరంధామయ్య వంతు వచ్చింది. వృద్ధాప్యపు బాధలు, నిరాదరణ తాలూకు మానసిక క్షోభ.. అనుభవించటం అయాక ఇప్పుడు ఆయనా పోయాడు.

‘పెద్దవాళ్ళ చావు పెళ్ళితో సమానం’ అంటూ ఆయన పోయినందుకు అందరూ పండుగ చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నుంచి కొంచెం బలువుగా ఉండటంతో కొడుకులు, కోడళ్ళు, కూతుళు, అల్లుళ్లు అందరూ వచ్చారు. వాళ్లు వచ్చింది ‘అయ్యో – ఇంటిపెద్ద ఇకవెళ్ళి పోతున్నాడే రెండు రోజులు దగ్గరుండి ఆయన్ని చూసుకుందాం – ఆయన సేవ చేద్దాం’ అని కాదు. ఆయన సంపాదించిన భూమి, పుట్ర, పొలం, మామిడితోట, బాంకుల్లో లోపాయికారిగా దాచిన డబ్బులు.. ఇవన్నీ మనం దగ్గర లేకుంటే ఎవరి హస్తగతమవుతాయో, ఎవరు రహస్యంగా ఏం రాయించుకొని ఎక్కడ సంతకాలు పెట్టించుకుంటారో ననే ఆరాటంతో, భయంతో పరుగులు పెడుతూ వచ్చారు. అత్త పోయినప్పుడు కోడళ్లు అలాగే చేసారు. ఇంటిముందు శవం ఉండగానే గప్‌చిప్‌గా ఆమె గదిలోకి వెళ్లి బంగారం, డబ్బులు ఎక్కడైనా దాచిందేమోనని పెట్టెలు, ఆ పెట్టల్లో వున్న చీర మడతలు, అలమారాలు, దేవుడి పుస్తకాలు దులిపి ‘అక్కడా’ వెతికారు ఒకళ్ళ తరువాత ఒకళ్ళుగా. ఆమె ఉండగా ఎవరికీ ఆమె వస్తువులను తాకటానికి ధైర్యం చాలేది కాదు. అంత గంభీరంగా, పద్ధతిగా, ఆత్మస్థయిర్యంలో ఉండేది మనిషి. ప్రాణాలతో వున్న వ్యక్తిని గౌరవించినా గౌరవించక పోయినా చచ్చి శవమయాక ఆ ‘శవాన్ని’ గౌరవించాలన్న సంస్కారం, మానవత్వ సూత్రం ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు, అదేంటో! గౌరవించకపోగా, పోయాక తిట్టుకుంటారు, ఆ మనిషికి వినపడదు కదా అని! వదిలిపోయిన వస్తువుల కోసం, నగలు, నాణాల కోసం దొంగ చూపులతో ఇల్లంలా వెతుకుంటారు, ‘శవం కళ్లు తెరిచి చూడలేదు కదా’ అని.. అంతకన్నా ఘోర అవమానం శవానికి మరొకటి ఏముంటుంది? బ్రతికున్నప్పుడు ఎంతమందినో గజగజ లాడించిన పులి లాంటి మనిషి అయినా సరే చచ్చిపోయి శవమయ్యాక అందరికి అలుసే – ప్రతొక్కడికీ ‘ఇప్పుడు అదొక కట్టె’ అన్న చులకన భావమే. ‘ఏమి చెయ్యలేదు మనని’ అన్న ఎగతాళి నవ్వులే ముఖం మీది మూతుల మీద. ప్రస్తుతం పరందామయ్య ఇంటి లోపలి వాతావరణం కూడా అలాగే వుంది. అన్నదమ్ములు ముగ్గురూ మధ్య హాల్లో కుర్చీలు వేసుకొని కూర్చుని ఆస్తులు, రాతకోతలు గురించే మాట్లాడుకున్నారు.

వాళ్ళ నోట్లో నుంచి వస్తున్న ప్రతి మాటకు క్రియ మాత్రమే వాళ్ళది; కర్తలు నేపథ్యంలో మాత్రమే వుంటారు గనుక బయటికి కనబడరు. వాళ్ళ స్వరాలు వీళ్ళ గొంతుల్లో ధ్వనిస్తుంటాయి, అంతే!

“అన్నయ్యా – ఇంక నాన్న పరిస్థితి రోజుల్లో అన్నట్లే ఉంది. ఆయన ఉండగానే, ఎక్కడ ఆయన సంతకాలు అవసరమైతే అక్కడ వేలిముద్రలయినా వేయించుకోగలిగితే పంపకాల విషయంలో రేపు ప్రోబ్లమ్ ఏమీ లేకుండా వుంటుంది కదా – పెద్దవాడివి నువ్వే ఆలోచించాలి” అన్నాడు పరంధామయ్య గారి చిన్నకొడుకు ప్రకాశం.

“నా పెద్దరికం ఇప్పుడు పంపకాల దగ్గరికి వచ్చేసరికి గుర్తుకొచ్చిందా? బాధ్యతలు నా మీద వేసినప్పుడు ‘అయ్యో పాపం అన్నయ్య ఒక్కడే బరువు మోస్తున్నాడు. పెద్దవాడు’ అని అనిపించలేదా.. అందుకే ఇప్పుడు నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. ఆస్తిలో సింహభాగం నాకు రావాలి” అన్నాడు పెద్ద కొడుకు విశ్వనాథం.

దాంతో రెండో కొడుకు వెంకట రమణకు రోషం పొడుచుకొని వచ్చింది. “అమ్మా, నాన్నా నీ దగ్గర ఉన్నంత మాత్రాన అన్నీ నువ్వు చేసినట్లేనా అన్నయ్యా? వాళ్ళను మధ్య మధ్య మేమూ తీసుకెళ్లి ఉంచుకున్నాం. జబ్బులు చేసినప్పుడు మేమూ చూసుకున్నాం. అవన్నీ నీకు కనిపించవు, నీ లెక్కలోకి రావు” అన్నాడు. అలా కాసేపు వాదించుకున్న తర్వాత అంతవరకూ అటే చెరొక చెవీ పడేసి వుంచిన పరంధామయ్య గారి ఆడపిల్లలు లేచి రంగంలో ప్రవేశించారు.

“ఆడపిల్లలమయినంత మాత్రాన మమ్మల్ని చిన్నచూపు చూసి మాకేమీ ఇవ్వమంటే మేము ఊరుకోం అన్నయ్యా. అమ్మ పోయినప్పుడు కూడా ఆమె వంటి మీది బంగారం అంతా వదినలే పంచుకున్నారు. మాకేదో ఇంత ముష్టి రాల్చినట్లు రాల్చి..” అన్నారు కోరస్‌గా.

వాళ్ళ వాదనలు, చర్చోపచర్చలు అలా నడిస్తుండగా ఆ ఇంటి కోడళ్ళూ ఏదో పెద్ద పనిలో ఉన్నట్టు నటిస్తూనే ఆ మాటలను చాటుగా వినటం మొదలుపెట్టారు. అలా మాట్లాడుకొని సర్దుబాట్లు, ఎగ్రిమెంట్లు, సంతకాలు వంటిపనులన్ని ముగించుకొని ఇక ‘ఆయన చావే తరువాయి’ అన్నట్టు ఎదురుచూస్తూ కూర్చున్నారు; ‘ఎక్కవ రోజులు ఉండాల్సి వస్తే కుదరదు – ఆఫీసు పని వుంది’ అని ఒకరూ, పిల్లలకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయని మరొకరూ – ఇలా ఎవరి పనుల లిస్టు వాళ్లు చదువుతూ. అలాంటి సుపుత్రులను కష్టపెట్టడం ఎందుకు అనుకున్నాడో ఏమో పరందామయ్య మూడోరోజు పరలోకయాత్రకు ప్రయాణమై వెళ్ళిపోయాడు.

***

పరంధామయ్య గారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో ఇంటిముందు ఆటో ఆగింది. అందులో నుంచి ఓ 50 ఏళ వ్యక్తి ముందు దిగాడు. తర్వాత చెయ్యి సాయం ఇచ్చి ఓ వృద్దుడిని మెల్లిగా ఆటోలో నుంచి దింపాడు, బాగా నడుము ముందుకు వంగిపోయిన ఆ వృద్ధుడు చేతి కర్ర సాయంతో అడుగులో అడుగేస్తూ లోపలికి వచ్చాడు పక్కనున్న వ్యక్తి ఒక రెక్క పట్టుకుంటే.

ఎంతసేవటినుంచి ఆయన ఏడుస్తున్నాడోగానే – గుమ్మంలో అడుగుపెట్టాక ఆయన దుఃఖం అధికమై పరంధామయ్య శవాన్ని చూసేసరికి కట్టలు తెంచుకుంది, ‘బాబాయ్’ అంటూ! ఆయన్ని చూడగానే ఆశ్చర్యపోయారు (పరంధామయ్య కొడుకులు).

పెద్దాయన మాత్రం చేతికర్ర శబ్దం వచ్చేలా కిందపడేసి ‘అన్నయ్యా’ అంటూ శవం మీద వాలిపోయి చిన్నపిల్లాడిలా ఏచ్చాడు.

“నాన్నా! ఊరుకోండి” అంటున్నాడు పక్కనున్న ఆ వ్యక్తి.

“మా అన్నయ్య రా. నేనూ ఆయన తోడబుట్టిన వాళ్ళం. చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం, పోట్లాడుకునే వాళ్ళం. అన్నయ్య నా చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ ఎక్కడి కెళ్ళినా తన వెంట తీసుకెళ్ళేవాడు. దారిలో నా కాల్లో ముల్లు గుచ్చుకుంటే తీసేవాడు. నేను కిందపడి దెబ్బలు తగ్గిలించుకుంటే ‘చిన్న దెబ్బెలేరా తమ్ముడూ.. తగ్గిపోతుంది.. నేను మంత్రం పెట్టాగా’ అనేవాడు. ఇలా ఒకటా రెండా?” అంటూ బావురుమన్నాడు ఆయన.

ఆ దృశ్యం చూసి అక్కడ ఉన్న ఆడా మగా బంధుమిత్రులందరూ ఆశ్చర్యపోయారు. పోయిన ఆయనకి 88 ఏళ్ళు. ఈయనకి అంతకన్నా ఓ రెండేళ్ళు తక్కువుంటాయేమో.. ఆయన చెబుతున్న ఆ బాల్య జ్ఞాపకాలు ఎప్పటివో- ఏ 7 దశాబ్దాల కిందటివో – పోయిన ఆయన దాదాపు పూర్ణాయుష్కుడు – ఈయనేమో కాటికి కాలు జాపుకొని కూర్చున్న వాడిలా ఆయనకన్నా కొంచెం పెద్దగానే కనబడుతున్నాడు. ఇంకొద్ది రోజుల్లోనే ఆయన వెనకనే తనూ వెళ్ళిపోబోతున్నాడని తెలుసు! అయినా పట్టలేని ఆ ఏడుపు ఏంటి? ఇంతకాలం తర్వాత ఆ బాల్య జ్ఞాపకాలను తలుచుకోవటం ఏంటి? ఏంటి ఈ అనుబంధం! విచిత్రంగా వుంది. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు, ఇంతటి అనుబంధాలూ చూద్దామన్నా కనిపించటం లేదు. ఆ రోజుల్లోనే ఇలాంటివన్నీ! అనుకుంటున్నారు బుగ్గలు నొక్కుకుంటూ.

పరంధామయ్య కొడుకులకు సైతం జగన్నాథం బాబాయి ఈ వయసులో ఇలా కర్ర సాయంతో అంత దూరం నుంచి ప్రయాణం చేసి రావటం ఆశ్చర్యంగా అనిపించింది. దానికి సమాధానంగా అన్నట్టు జగన్నాథం గారి కొడుకు పార్వతీశం పెద్దనాన్న కొడుకుల నుద్దేశించి  – “పెద్దనాన్న పోయాడని చెప్పినప్పటి నుంచే నాన్న ఒకటే ఏడుపు, ‘నన్ను అన్నయ్య దగ్గరికి తీసుకెళ్ళండిరా’ అంటూ ఒకటే గోల. ఈ వయసులో నువ్వు వెళ్ళలేవు నాన్నా అంటే వినలేదు. బాడీని వీడియోలో చూపిస్తాంలే నాన్నా అంటే కోపంతో మామీద రంకెలేసాడు. ‘అవతల మనిషి చనిపోతే ఫోటోల్లో, వీడియోల్లో చూడటం ఏంటిరా? మీకసలు బుద్ధుందా- ఇదేమన్నా సినిమానా తెర మీద చూడటానికి!’ అని కోపం చేసి ‘మీరు రాకున్నా నేను వెళతాను’ అంటూ బయలుదేరితే కూడా నేను వచ్చాను!” అన్నాడు.

ఆ కాలం నాటి మనుషులైన ఆ అన్నదమ్ముల అనుబంధం చూస్తూ ఎవరికి వాళ్ళు ఆలోచనల్లో పడ్డారు అన్నదమ్ములు ముగ్గురూ, ఒకరిముఖాలు ఒకరు చూసుకుంటా లోలోపల ఏదో అపరాధభావం కదలాడుతుండగా.

***

పరంధామయ్య గారి కర్మకాండ ముగిసింది.

పన్నెండవ రోజు ఆశీర్వచనం సందర్భంలో తన పాదాలకు వంగి దండం పెడుతున్న అన్న కొడుకులు ముగ్గురినీ దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకుంటూ- “ఆ తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది మీ తరం. తరాలు మారినా అనుబంధాలూ, ప్రేమల్లో మార్పు రాకుడదు నాన్నా. మీరు ముగ్గురు అన్నదమ్ములూ కలిసిమెలిసి ఒక్క మాట మీద అన్నట్టు వుండాలి. మీ తోడబుట్టిన ఆడపిల్లలని మీతో సమంగా చూసుకోవాలి. అప్పుడే మా అన్నయ్య, మీ నాన్న అయిన ఆయన ఆత్మకు శాంతి లభిస్తుంది. మేము అలాగే ఉండేవాళ్ళం. డబ్బుదేముంది నాన్నా – ఈ రోజుంటుంది, రేపు పోతుంది. కొడుకులు, బిడ్డలు ఉన్నది ఆస్తిపాస్తులు పంచుకోవటానికి మాత్రమే కాదు; అనుబంధాలను పంచుకోవటానికి కూడా. అందులోనూ రక్త సంబంధాల మాటే వేరు. కట్టె కాలే వరకూ అవి మనను వదిలి పెట్టిపోకూడదు” అంటూ చెప్పాడు జగన్నాథం. ఆ మాటలతో దుఃఖం లోనుంచి తన్నుకొని వచ్చింది ఆ అన్నదమ్ములు ముగ్గురిలో. ‘బాబాయ్’ అంటూ ఆయన గుండెల మీద వాలిపోయారు. బాబాయ్ అలా మాట్లాడుతుంటే అవి ఇన్నాళ్లు తండ్రి తమతో అనలేక గుండెలోనే దాచుకున్ని మాటల్లా అనిపించాయి వాళ్ళకు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here