శ్రీరాముడికి సమర్పించిన అక్షర సుమాలు – రామకథాసుధ

0
10

[dropcap]“ప[/dropcap]దికొంపలును లేని పల్లెలైనను రామభజన మందిరముండు వరలు గాత..” అని అంటారు ప్రసిద్ద నాటక రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఒక పద్యంలో. చిన్నచిన్న ఇళ్ళు పది ఒకచోట ఉంటే అది ఊరుగా అవుతుంది. అటువంటి చిన్న ఊరిలో కూడా రామమందిరం ఉంటుందట. అంటే రాముడు ఇంటింటా కొలువైన దైవం అని కవి భావం. రాముడు, సీత, రామాయణం, సీతారాముల కళ్యాణ ఉత్సవాలు, రామకోటి రాయటం ఇవన్నీ తెలుగువారి జీవితంలో ముడివడిపోయిన విషయాలు. సెల్ ఫోన్‌లు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాసే సంస్కృతి తగ్గిపోయింది గానీ, ఒకప్పుడు ఉత్తరం రాసేటప్పుడు పై భాగంలో ‘శ్రీరామ’ అని రాసి మొదలు పెట్టేవారు. వివాహ ముహూర్తం నిర్ణయిస్తూ శుభలేఖలు వంటివి రాసేటప్పుడు ఇప్పటికీ శ్రీరామ అనే మొదలు పెట్టి రాస్తున్నారు.

అటువంటి రామాయణం గురించిన సంకలనం తీసుకురావాలనుకోవటం సత్సంకల్పం. ఆ ప్రయత్నం చేశారు ‘రామకథాసుధ’ సంకలనకర్తలు శ్రీయుతులు కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్, కొల్లూరి సోమ శంకర్‌లు. రామాయణంలో ఉన్నది ఉన్నట్లు రాస్తే వారి సొంతం ఎందుకవుతుంది? రచయితలు అందరూ రామాయణాన్ని వారి వారి మనో దృష్టులతో దర్శించి, వారి వారి దృక్పథంతో ఇందులోని కథలన్నీ రచించారు. రచయితలు అందరూ ఎవరికి వారు విడివిడిగా కథాంశాలను ఎన్నుకుని రచించినా వాటన్నిటినీ ఒక వరసలో పెట్టి దండగా గుదిగుచ్చి పాఠకులకు అందించారు సంకలనకర్తలు. ఇందులో కథలను రెండు విభాగాలుగా ఏర్పరిచారు. మొదటిది రామాయణ ఆధారిత కథలు, రెండవది రామాయణాంశాలు నేపథ్యంగా గల సామాజిక కథలు. ఇందులోని ప్రతి కథా విశిష్టమైనదే!

“పర్జన్య గర్జన వంటి ఆ ఫెళఫెళార్భటికి సమస్త చేతనా ప్రపంచమూ సంభ్ర చకితమై సంమ్మోహితమైపోయింది..” అంటూ మొదలవుతుంది ముళ్ళపూడి వెంకట రమణ రచించిన ‘సీతా కళ్యాణం’ కథ. మొదటి వాక్యంతోనే పాఠకుల మనసు సమ్మోహితమైపోతుంది ఆ భావనాశైలికి. అక్కడ నుంచీ మన కళ్ళు అసంకల్పితంగా తర్వాతి వాక్యాల వంక పరుగులు తీస్తాయి. కథ మొత్తం చదవగానే సీతారాముల కళ్యాణం మన కళ్ళ ఎదురుగానే జరిగినట్లు, మనం కనులారా దర్శించినట్లు మైమరచిపోతాము.

శివధనుస్సు ఎక్కుపెట్టే క్రమంలో కుడికాలి బొటనవేలికి విల్లు నిలబెట్టి ఆకర్ణాoతం లాగబోవటంలో అంగవిన్యాసం వర్ణన చదువుతుంటే మనో ఫలకంలో శ్రీరాముడి రూపం కదులుతూ ఉంటుంది. “నా కుమార్తె సీతను రాముడికిచ్చి వివాహం చేయ సంకల్పించాను” అని జనక మహారాజు ప్రకటిస్తూ ఉంటే “మా తండ్రిగారి అనుమతి లేనిదే పాణిగ్రహణం సంభావ్యం కాదు” అని రాముడు అనటంతో అయన పితృవాక్య పరిపాలన కైక రెండు వరాలు కోరకముందే మనకి అర్థమైపోతుంది.

జనక మహారాజు పంపించిన వార్త విని దశరథుడు మిథిలకు ప్రయాణం అవటం, నాలుగు రాత్రుళ్ళు, నాలుగు పగళ్ళు ప్రయాణించి మిథిలకు చేరుకోవటం, మహర్షుల అధ్వర్యంలో నలుగురు రాకుమారులకీ నలుగురు కుమార్తెలను ఇచ్చి జనకుడు వివాహతంతు జరిపించటం మొదలైన ఘట్టాలతో సాగిపోతుంది కథ. నలుగురి కళ్యాణాలు ముగియటంతో కథ ఆగిపోతుంది. కథ పూర్తి చేసేటప్పటికి భారతీయ వివాహ సంస్కృతి ఎంత పవిత్రమైనదో, ఎంత గొప్పదో అర్థం అవుతుంది. “వివాహం అనేది మా వ్యక్తిగత వ్యవహారం, పెద్దల ప్రమేయం ఇందులో అనవసరం, అవసరమైతే సహజీవనం కూడా చేస్తాం, మా ఇష్టం” అంటూ విపరీత పోకడలు పోయే నేటి యువతరం తప్పక చదవవలసిన కథ ఇది.

వాల్మీకి అనగానే మనకు వెంటనే రామాయణం గుర్తుకు వస్తుంది. అది కాకుండా ‘యోగ వాశిష్ఠం’ అనే మరో గ్రంథం కూడా రచించాడు వాల్మీకి మహర్షి. ఇది వేదాంత గ్రంథం. శ్రీరాముడు రకరకాల ప్రశ్నలు వేయటం, వాటికి వశిష్ఠుడు సమాధానాలు ఇవ్వటం.. ఇలా వశిష్ఠరామ సంవాదంగా ఉంటుంది ఈ గ్రంథం. దీనికే అఖండ రామాయణం, వశిష్ఠ గీత వంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ యోగ వాశిష్టం ఆధారంగా యల్లాప్రగడ సంధ్య రచించిన కథ ‘శ్రీరాముని చింతన’.

విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్ధం శ్రీరాముడిని తనతో పంపించమని దశరథుడిని అడిగినప్పుడు “కొద్దికాలం నుంచీ రాముడు ఏదో చింతనతో అన్యమనస్కుడై ఏకాంతవాసం చేస్తున్నాడు” అని చెబుతాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ పై రాముడు సభలోకి వస్తాడు. అక్కడ “ఈ సంసారంలో సుఖం ఎక్కడ ఉంది? చిదాభాసం అంటే ఏమిటి?” మొదలైన ప్రశ్నలు అడిగితే వశిష్ఠుడు వివరించి చెబుతాడు. సందేహ నివృత్తి అయిన తర్వాత యాగరక్షణ కోసం బయలుదేరుతాడు రాముడు. క్లుప్తంగా ఇదీ కథ. ఈ కథను అర్థం చేసుకోవటానికి కొంత మానసిక పరిణితి అవసరం. సాదాసీదా కథల లాగ కాకుండా ఆలోచింపజేసే రచన ఇది.

కథ, నవల, వ్యాసం, కల్పన, క్రైమ్, వైజ్ఞానిక, వక్తిత్వ వికాస వంటి వివిధరకాల విభాగాల్లో రచన చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కస్తూరి మురళీకృష్ణ. ఈయన రచించిన ‘ప్రేమాగ్ని పరీక్ష’, ఒక వైవిధ్యభరితమైన అంశాన్ని తీసుకుని కథగా మలచిన రచన. సీత అగ్నిప్రవేశం ఇతివృత్తం. సామాన్యంగా అనిపించే ఇతివృత్తాన్ని తన శైలిలో విశ్లేషించారు. రావణ సంహారం తర్వాత రాముడు సీత శీలం నిరూపించుకోమని అడిగినప్పుడు హనుమంతుడికి, విభీషణుడికి, వానరులకి ఎవరికీ రుచించలేదు రాముడి ప్రవర్తన. ఈ మాత్రం దానికి వారధి నిర్మించటం దేనికి? అంత పెద్ద యుద్ధం చేయటం దేనికి? అనుకున్నారు.

భర్త ఇష్టప్రకారం సీత అగ్నిలో దూకింది. అగ్నికి కూడా ఆమెను తాకటానికి భయంవేసి పవిత్రంగా తెచ్చి అప్పగించాడు. తనను సామాన్యురాలిలా సందేహించి, అగ్నిపరీక్షకు గురి చేసిన రాముడితో సీత ఏమీ జరగనట్లు ఎలా ఉండగలుగుతుంది? అనే సందేహం అందరికీ! కానీ అడిగే ధైర్యం లేదు. అయోధ్యకు వచ్చిన తర్వాత ఊర్మిళ కూడా అక్కగారి దగ్గర ఇదే సందేహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు సీత చెప్పిన సమాధానం విన్న ఊర్మిళకి అగ్నిపరీక్ష కన్నా గొప్పగా భర్త ఆమెని రక్షించినట్లు అర్ధమౌతుంది. అదేమిటో చెప్పేస్తే కథలో పట్టు పోతుంది. కనుక కథ చదివి తెలుసుకోవాల్సిందే! సీతారాముల ప్రేమకు అసలైన నిర్వచనంలా నిలుస్తుంది ఈ కథ.

పక్షిరాజులు సంపాతి, జటాయువుల సోదరప్రేమను తెలియజేసే కథ గోనుగుంట మురళీకృష్ణ రచించిన ‘భాతృ ప్రేమ’. రామాయణంలో సోదరులు చాలామంది ఉన్నారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే కాక, లవకుశులు, వాలిసుగ్రీవులు, రావణ కుంభకర్ణ విభీషణులు, సీరధ్వజుడు (జనకుడు), కుశ ధ్వజుడు; ఖరదూషణులు; అగస్త్యుడు, సుదర్శనుడు (తెలుగు రామాయణాల్లో అగస్త్యుడి తమ్ముడి పేరు చెప్పలేదు, అగస్త్యభ్రాత అని మాత్రమే చెప్పారు. కానీ సంస్కృత రామాయణంలో అగస్త్యుడి సోదరుడి పేరు సుదర్శనుడు అని ఉన్నది) మొదలైనవారు.

జనకుడు తన తమ్ముడి కుమార్తెలైన మాండవి, శ్రుతకీర్తిలను భరత శతృఘ్నులకు భార్యలుగా నిర్ణయించేటప్పుడు తమ్ముడి అభిప్రాయం అడగడు. కుశధ్వజుడు కూడా అన్నగారి నిర్ణయానికి అంగీకరిస్తాడు గానీ ఎదురు చెప్పడు. వాలీ సుగ్రీవుల విషయంలో కూడా సుగ్రీవుడు వానరరాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు వాలి వచ్చి చూసి తనను మోసం చేసాడని తమ్ముడి మీద ఆగ్రహిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు “నాకు ఇష్టం లేకపోయినా మంత్రులందరూ నన్ను పట్టాభిషిక్తుడిని చేసారు. నన్ను క్షమించు. ఈ రాజ్యం నీదే! నేను ఎప్పటిలాగే నిన్ను సేవించుకుంటూ ఉంటాను” అని ఎంతో వినయంగా అన్నకు చెబుతాడు. అయినా వాలి వినడు అనుకోండి! అలాగే రావణుడు కుంభకర్ణుడిని యుద్దానికి వెళ్ళమని చెప్పినప్పుడు, కుంభకర్ణుడు సీతను రాముడికి అప్పగించటమే క్షేమం అని అన్నకు హితవు చెప్పి చివరకు “నేను నీకు సోదరుడను. నా శక్తి మేరా యుద్ధం చేసి నీకు సంతోషం కలిగిస్తాను” అని చెప్పి యుద్ధానికి వెళతాడు. అన్నకోసం ప్రాణం అర్పిస్తాడు. కాబట్టి వారివారి వ్యక్తిగత స్వభావాలు ఎలా ఉన్నా సోదరప్రేమ విషయంలో మాత్రం అందరూ ఆదర్శప్రాయంగానే నిలిచారు.

సరే! అవన్నీ పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే సంపాతి జటాయువులు ఒకసారి సూర్యమండలం దగ్గరకు వెళ్లి రావాలని పందెం వేసుకుంటారు. కానీ సూర్యుడి ప్రచండవేడిని తట్టుకోలేక సంపాతి శరీరం కాలిపోతున్నట్లు ఉంటుంది. కిందకు చూస్తే జటాయువు గింగిరాలు తిరుగుతూ పడిపోవటం కనిపిస్తుంది. సంపాతిలో సోదర ప్రేమ పొంగిపోతుంది. పసివాడు, బాల్యచాపల్యం చేత తెలిసో తెలియకో పందెం కాశాడే అనుకో, తనెందుకు అంగీకరించాడు? అనుకుంటాడు. జటాయువు అప్పటికే వృద్ధుడు. వార్ధక్యం వలన రావణుడితో ఎక్కువ సేపు పోరాడలేక పోతాడు అని చెబుతాడు వాల్మీకి అరణ్యకాండలో. అటువంటి జటాయువు అన్న దృష్టిలో పసివాడు, బాల్యచాపల్యం చేత పందెం కాశాడట. మనసులో ప్రేమ ఉంటే తనకన్నా చిన్నవాళ్ళు పసివాళ్ళుగానే కనిపిస్తారు. ఇది మానవులకే కాదు, పశుపక్ష్యాదులకు కూడా సహజం.

వెంటనే సంపాతి తన రెక్కలతో తమ్ముడిని కప్పేస్తాడు. ఫలితంగా సంపాతి రెక్కలు కాలిపోతాయి. జటాయువు మాత్రం రెక్కలతోనే స్పృహ తప్పి పడిపోతాడు. తర్వాత అనేక సంఘటనలు జరిగిపోతాయి. చివరికి శ్రీరాముడికి చేసిన రవ్వంత సాయం కూడా అనంతమైన ఫలం ఇస్తుంది అంటూ ఈ కథను ముగిస్తాడు రచయిత. వీరిద్దరి ఉదంతం అరణ్యకాండలో కొంత, కిష్కింధకాండలో కొంత ఉంటుంది. ఆ సన్నివేశాలు అన్నీ ఒకచోట చేర్చి, కొన్నిచోట్ల కథను వేగంగా నడిపిస్తూ, అవసరమైన చోట వివరంగా చెబుతూ మొత్తం కథ ఒకేసారి జరిగింది అన్నట్లు చక్కగా వర్ణించారు రచయిత.

సామాజిక కథల్లో పాణ్యం దత్తశర్మ రచించిన ‘యతోధర్మ స్తతోజయః’ అనే కథ చాలా బాగుంది. ఇది నిరుపేద సుగాలీల కుటుంబంలో జరిగిన కథ. నాలుగైదు పేజీలలోనే ఒక నిండు జీవితాన్ని చూపిస్తారు రచయిత. కథా నాయకుడు లఖియా వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టి కష్టపడి అంచెలంచెలుగా పైకొచ్చి ప్రభుత్వోద్యోగం సాధిస్తాడు. అతడికి సహకరించింది అన్న, వదిన. అన్న కూలి పనికి వెళుతుంటే వదిన వడలు, బజ్జీలు చేసి సంపాదించి లఖియాని చదివిస్తూ ఉంటారు. ఒకరోజు అన్న చెప్పులు కనబడకుండా పోతాయి. వెతుక్కుని వెతుక్కుని ఊరుకుంటాడు.

లఖియాకి ఉద్యోగం వచ్చేనాటికి అన్న వదిన నడివయసు దాటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. వారిని తన దగ్గరకు వచ్చేయమంటాడు లఖియా. సరేనని తమ్ముడి దగ్గరే ఉంటారు. ఒకరోజు లఖియా గదిలో ఒక దృశ్యం చూసి, భర్తను పిలిచి చూపిస్తుంది వదిన. అక్కడ బీరువా పక్కన ప్రేముకి ఎవరో ఎత్తుకు పోయారనుకున్న అన్న చెప్పుల జత అందంగా అమరిఉండి కనిపిస్తుంది. వాటికీ ఒక చెమ్కీల ముత్యాలదండ వేసి ఉంటుంది. “నన్ను రాముడిని చేసి నువ్వు భరతుడిలాగా అయ్యావా నాయనా!” అంటూ తమ్ముడిని గుండెకు హత్తుకుంటాడు అన్న. తర్వాత ఇద్దరి పేరు మీద ఉన్న స్థలాన్ని అమ్మి అన్న కొడుకు పేరుతో అతడి చదువు సంధ్యల కోసం డబ్బు బ్యాంక్‌లో వేస్తాడు లఖియా. వాస్తవానికి తండ్రి ఆస్తి కొడుకులందరికీ చెందుతుంది. కానీ చట్టం వేరు, ధర్మం వేరు. తన భాగం వదలుకుని అన్నకొడుకు కోసం ఆసరా కలిపిస్తాడు. ధర్మంగా ఆలోచిస్తాడు లఖియా.

ఇంకా చినవీరభద్రుడు రచించిన ‘రాముడు కట్టిన వంతెన’, సింగరాజు నాగలక్ష్మి రచించిన ఎవరూ ఊహించని ‘ఊర్మిళ’ గురించిన కథ, సింగంపల్లి అప్పారావు రచించిన ‘రామరాజ్యం’, ఆవుల వెంకట రమణ రచించిన ‘వందే దశరథాత్మజం’ ఒకటా, రెండా! ప్రతి కథా ఆణిముత్యమే! అన్నం ఉడికిందో లేదో చూడటానికి రెండు మెతుకులు పట్టుకుంటే చాలు, అర్ధమైపోతుంది. అదే విధంగా ఈ సంకలనంలో అసంకల్పితంగా ఏదో ఒక పేజీ తీసి నాలుగు లైన్లు చదివితే చాలు, పుస్తకం స్థాయి అర్థమైపోతుంది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవటమే కాదు, తెలిసినవారికి బహుమతిగా కూడా ఇవ్వటానికి అన్నివిధాలా అర్హమైనది.

***

రామకథాసుధ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here