‘రామకథాసుధ’ నాకెందుకు నచ్చిందంటే..

0
10

[వృత్తి రీత్యా ఫిజిక్స్ లెక్చరర్, ప్రవృత్తి రీత్యా మంచి చదువరి అయిన శ్రీ రాణీ నరసింహ మూర్తి ‘రామకథాసుధ’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు.]

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం. ‘రామకథాసుధ’ పుస్తకం గురించి మిత్రులు కొల్లూరి సోమ శంకర్ గారి ఫేస్‍బుక్‍ వాల్‍పై చూసి ఆసక్తి కలిగి, కొనుక్కున్నాను. పుస్తకం చదివాకా, బాగుందని సోమ శంకర్ గారితో చెబితే, ఆయన సమీక్ష లాంటిది వ్రాయమని కోరారు. నాకు చదివే అలవాటు ఉంది కానీ వ్రాసే నైపుణ్యం లేదు.

ముందుగా రాముని గురించి ఇన్ని కథలు ఒకే చోట చేర్చడం నాకు బాగా నచ్చింది. అందుకు ప్రకాశకులకి, సంపాదకులకి అభినందనలు.

సంధ్యా యల్లాప్రగడ గారి ‘శ్రీరాముని చింతన’ ఒక కొత్త కోణాన్ని చూపించింది. తత్త్వ చింతన వివరణ బాగుంది.

ముళ్ళపూడి వెంకట రమణ గారి ‘సీతాకళ్యాణం’ అద్భుతం. 1959లో వ్రాసిన కథ ఇప్పుడు చదవగలగడం పూర్వజన్మ సుకృతం.

చుండూరు జనార్దన గుప్త గారి ‘సీత పాదాభివందనం’ కథ పెదవుల పైకి చిరునవ్వుని తెచ్చింది.

సింగరాజు నాగలక్ష్మి గారి ‘ఊర్మిళ’ చిన్నప్పుడు హిందీలో చదివిన మైథిలీ శరణ్ గుప్త గారిని గుర్తుకు తెచ్చింది.

ఎం. లక్ష్మీదేవి గారి ‘మాండవి’ కథలో పాత్ర చిత్రన చాలా బాగుంది. మాండవి దృక్కోణాన్ని బాగా విశదీకరించారు. సరస్వతీ దేవిని కోరిన కోరిక ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేసింది.

ఎల్లోరా గారి ‘లక్ష్మణ గడ్డ’ కథని తమిళనాడులో తంజావూరు దగ్గర కూడా చిన్న చిన్న గ్రామాలలో చెప్పుకుంటారు. అక్కడ గోదావరి బదులు తంజావూరు ప్రాంతం అని చెబుతారు.

నారాయణ శర్మ గారి ‘రేగుపళ్ళ రుచి’ కథ రుచిగా ఉంది. భోజనానికి మంచి రుచి ఏర్పడేది ప్రేమ వల్లనే.

గోనుగుంట మురళీకృష్ణ గారి ‘భ్రాతృప్రేమ’ జటాయువు, సంపాతీల ఔన్నత్యాన్ని తెలియజేసింది.

సిహెచ్.వి. బృందావనరావు గారి ‘కౌగిలి’ కథలో ‘బుస కొడుతున్నట్లు అడిగాడు లక్ష్మణుడు’, ‘పాము  పడగ దించుకున్నట్లు చల్లబడ్డాడు లక్ష్మణస్వామి’ ప్రయోగాలు అద్భుతం.

మద్దుల లక్ష్మీనారాయణ గుప్త గారి ‘విభీషణుని భక్తి’ మొదట 1966లో ప్రచురితమైనది. దాదాపు 50 ఏళ్ళ తరువాత ఈ కథని చదవగలిగేలా చేసిన సంపాదకులకి ధన్యవాదాలు.

బలభద్రపాత్రుని రమణి గారి ‘లోహజంగుడు’ నారాయణమంత్ర శక్తిని తెలియజేసింది. భమిడిపాటి గౌరీశంకర్ గారి ‘సీత చెప్పిన సత్యం’ ఆత్మవిశ్వాసం ఆవశ్యకతను తెలియజేస్తింది.

కస్తూరి మురళీకృష్ణగారి ‘ప్రేమాగ్ని పరీక్ష’ కథ సీత మాటల వల్ల ఊర్మిళ దృష్టి మారేలా చేయగలిగింది.

శ్రీనివాస దీక్షితులు గారి ‘కరుణించవా శివా’ కథలో సంభాషణలు చాలా సరళంగా ఉన్నాయి. శివుడిని, రాముడిని ఒకే చోట దర్శించగలిగాం.

కుంతి గారు రాసిన ‘న్యాసం’ కథతో శ్రీరామరాజ్యం ప్రారంభమైంది. ‘రామరాజ్యం’ కథలో శింగంపల్లి అప్పారావు గారు – గుమ్మడికాయతో రాజు యొక్క ఉదారతను ప్రజలు ఎలా అలుసుగా తీసుకుంటారో వివరించడం బాగుంది.

పరశురాం గారి ‘హనుమంతుని స్వప్నము’ కథ ద్వారా 53 ఏండ్ల క్రితం పత్రికలలోని తెలుగును చదవగలిగాము.

‘ఘటన’ కథలో శ్యామల గారు తిప్పడి భార్య పాత్ర ద్వారా చెప్పించిన మాటలు అక్షర సత్యాలు.

డా. లత గారి ‘రామాయణంలో రజని’ కథలో సంభాషణలు చాలా బాగున్నాయి.

సామాజిక రామాయణం విభాగంలోని ఆవుల వెంకటరమణ గారి ‘వందే దశరథాత్మజం’ కథలో నాయనమ్మ మొత్తం రామాయణాన్ని మనవడికి విశదీకరించిన తీరు చాలా బాగుంది.

1946 నాటి ‘సాక్షి వ్యాసాలు’లో భాగంగా ‘ఒక కథ’ చదవగలిగే అదృష్టం మాకు కలిగించినందుకు సంపాదకులకు ధన్యవాదాలు. పానుగంటి లక్ష్మీనరసింహం గారు చెప్పిన ఒక వాక్యం ఇప్పటికీ relevant గా ఉంది. ‘మగనికిఁ దనకుఁ దవ్వెడు బియ్యము కుతకుత లాడించుటకే యీ కాలపుఁ గుల కాంతల కోపిక లేదు’.

మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథ ‘ఔనౌను’ కరుణరసాత్మకంగా ఉంది. ఆ కథలోని పాత్ర చిత్రణ సమకాలీనతను కలిగి ఉంది.

మిగతా రచయితలు నన్ను క్షమిస్తే ఈ సంకలనంలోని అద్భుత కథగా ‘వారాది రాముడు’ నా వ్యక్తిగత ఎంపిక. చదువుతున్నంత సేపూ కళ్ళమ్మట నీళ్ళు ఆగలేదు. ఇది కొన్ని వందల ఏండ్ల క్రితం వ్రాసినట్టు అనిపించింది. నంద్యాల సుధామణి గారికి నా అభినందనలు.

పి.వి. ప్రభాకర మూర్తి గారి కథలో ‘రామమాడ’ దొరికిన ఆ పైడితల్లి జీవితం ధన్యం. టెంపోరావు గారి కథలు కొన్ని చిన్నప్పుడే చదివాను. ‘రామలీల’ కథ హృద్యంగా ఉంది.

‘యతోధర్మస్తతో జయః’ కథ నా వ్యక్తిగత ఎంపికలో రెండవ స్థానంలో నిలుస్తుంది. పాణ్యం దత్తశర్మ గారికి నా అభినందనలు.

వాడ్రేవు చినవీరభద్రుడు గారి ‘రాముడు కట్టిన వంతెన’ కథలో – చిన్న పిల్లల విషయంలో రామాయణం కాస్తా పవర్ రేంజర్స్ గా మారడం బాగుంది.

‘రామ కథాసుధ’ వేదాంతం శ్రీపతిశర్మ గారి కథ. ఓ. హెన్రీ మార్కు ముగింపుతో బాగుంది.

మొత్తం మీద ఆసక్తిగా చదివించే పుస్తకం ‘రామకథాసుధ’. అయితే పుస్తకంలో రచయితల మెయిల్ ఐడి కాని, ఫోన్ నెంబర్లు కాని ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది.

***

రామకథాసుధ (కథా సంకలనం)
సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 215
వెల: 175/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here