కోన్వస్మిన్ సాంప్రతం లోకే.. రామం భజే శ్యామలం పుస్తకానికి ముందుమాట.

0
11

[dropcap]మా[/dropcap] జీవితంలోకి రామాయణ చైతన్యం ప్రవహించింది మా పితామహులు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్య స్వామివారి వల్ల. వారి జీవితంలో అనేకమార్లు రామాయణ ప్రవచనం అద్భుతంగా కొనసాగింది. మా నాయనగారు కూడా రామాయణ ప్రవచనాన్ని 1948లో ముత్యంపేటలో చేశారు. 1947లో మేము రజాకార్ల గొడవల వల్ల వరంగల్లు పట్టణంలో ఉండలేక, మాకు ప్రేమపాత్రులైన వదాన్యులు శ్రీ ఎర్రబెల్లి వెంకటేశ్వర్‌రావు గారి ఆశ్రయంలో వారి గ్రామం కల్లెడలో ఐదారు నెలల పాటు ఉన్నాం. ఆ నాళ్లలో ఉదయం కుమారులకు ద్రావిడ భాషలోని వైష్ణవ సంప్రదాయ గ్రంథాలను అధ్యాపన చేయిస్తూ పది గంటలవేళకు గడిలో పైన హాలులో భగవద్విషయము అంటే నమ్మాళ్వారుల దివ్య ప్రబంధం, తిరువాయి మొఝి వ్యాఖ్యానం.. కాలక్షేపంగా అనుగ్రహించేవారు. సాయంకాలం మూడు నాలుగు గంటల ప్రాంతంలో శ్రీమద్రామాయణం కాలక్షేపం అందించేవారు. నేను సుమారు 11 ఏండ్ల ప్రాయంలో ఉన్నాను. భగవద్విషయ సందర్భంలో నేను అందుకొన్నది తక్కువే అయినా.. సాయంకాలం రామాయణ కాలక్షేపంలో నా మనస్సు, చైతన్యం తడిసి నూతనత్వాన్ని పొందినయి. ఇదొక అద్భుతమైన సన్నివేశం.

శ్రీవైష్ణవులకు రామాయణం దీర్ఘ శరణాగతి రచన. పరమ ప్రామాణికమైనది. దీనిని ప్రవచించినప్పుడు తాతగారు ప్రధాన కథను వివరించడమే కాకుండా దానిలోని ఔపనిషదమైన, సంప్రదాయ పరమైన, ధర్మశాస్త్ర సంబంధమైన మానవ చైతన్య ఉన్మీళనానికి సంబంధించిన విశేషాలు అనుగ్రహించేవారు. ఇది కాక, కథాగమనం వెనుకాల ప్రసరించే జీవుని ఈశ్వరాభిముఖ ప్రయాణానికి సంబంధించిన అనేక రహస్యార్థాలను వివరించేవారు. ఆ వయస్సులో వారి మధురమైన కంఠం ప్రవచన సందర్భంలోనూ ఒక గాన లక్షణం కలిగిన వచన విన్యాసమే. తెలుగు భాష యొక్క మాధుర్య సంవాదము అన్నీ నా మనస్సులో గూడు కట్టుకొన్నవి. ఆ తరువాత నా జీవితంలోని ప్రతి ఘట్టంలోనూ, నా సాహిత్య సాధనలోని ప్రతి సన్నివేశంలోనూ, నా సాహిత్య వివేచనలోని విశిష్టాంశాలను ప్రకటించడంలోనూ మా తాతగారి ముద్ర ఉంటూ వచ్చింది.

నేను జీవిత భావనల అన్వేషణలో ఎన్నో తీర్థ యాత్రల్లో ప్రయాణించడం జరిగింది. శ్రీమాత, శ్రీ అరవిందులు, ఆధునిక భారతీయ మహర్షులైన శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, రమణ మహర్షి, పరమహంస యోగానంద, కందుకూరి శివానందమూర్తి, దయానందులు, రాజా రామ్మోహన్ రాయ్, బంకించంద్ర చటర్జీ, స్వామి శివానంద, స్వామి చిన్మయానంద, జిడ్డు కృష్ణమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ.. ఇంకా అనేకమంది ఆధునిక భారతీయ చైతన్యాన్ని దీప్తినందించిన మహానుభావులు.. వీరందరూ నాకు తీర్థ స్థలాలైనారు. ప్రతి తీర్థ స్థలంలోనూ నేను ఒదిగిపోయాను. ఎదిగిపోయినాను. ఎంతోకొంత సంగ్రహించుకొన్నాను. నా జీవన సూత్రానికి సమన్వయం కుదుర్చుకొన్నాను.

అందువల్ల నాకు 70 ఏండ్లకు పైగా సాగిన సాహిత్య సాధన, సరస్వతీ సమర్చన, రస ధ్వని మార్గం అన్నీ ఆధ్యాత్మిక సాధనలో భాగమే అయినాయి. నేను ఎక్కడా ఇతర అంశాలకు, లౌకిక ప్రయోజనాలకు అవకాశం ఇవ్వలేదు.

ఇక రామాయణం సంగతి. మన దేశంలో రాముడు ఇంటింటా ప్రతి కుటుంబంలోనూ తానొకడైనవాడు. సీతమ్మ తల్లీ అంతే. ‘తెలుగు దైవంబు, భద్రాద్రిపై నెలకొన్న రామయ్య’ అన్న కవి.. తెలుగు భాష, భాషీయులలో రాముడికున్న ప్రాధాన్యాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఈ మాట తెలుగువాళ్లు ఎట్లా అనుకొంటున్నారో.. భారతదేశంలో అన్ని భాషా ప్రాంతాల్లో అలానే అనుకొంటున్నారు. రాముడు లేకుండా సంస్కృత కావ్య ప్రవాహం లేదు. వాల్మీకి దర్శించిన రాముడు.. దేశంలో వేలమంది కవులకు తన సత్య పరాక్రమంతో, తన ధర్మ పరాక్రమంతో దర్శనమిచ్చాడు. తమసానదిలో వాల్మీకి స్నానం చేస్తున్నప్పుడు ఆ తమస స్వచ్ఛమై, అకర్దమమై, ప్రసన్నాంబువై తన్మనుష్య మనోయథా.. సత్పురుషుని మనస్సువలె అనుభవంలోకి వచ్చింది. ఈ సత్పురుషుడు శ్రీరాముడే. కోన్వస్మిన్ సాంప్రతం లోకే.. అని ప్రశ్నించిన వాల్మీకి.. లోకంలో ఆదర్శంగా జీవిస్తున్న పదహారు గుణముల పరిపూర్ణ రూపుడైన మహాపురుషుడి గూర్చి వివరించమని కోరినాడు. ఇక్కడ తన్మనుష్య శబ్దము.. ముందున్న మూడు విశేషణాలు.. కావ్యానుభవానికి సంబంధించనివే అయినా, ఈ మాట రెండు పొరలను కలిగి ఉన్నవి. సత్ శబ్దము సృష్ట్యాది అయిన చైతన్యమని స్ఫురింపజేస్తుంది. సత్ పదార్థము ఉనికిని సూచిస్తుంది. సదేవ సోమ్య ఇదమద్ర ఆసీత్.. సృష్ట్యారంభంలో తొలుత సత్తు మాత్రమే ఉన్నది. ఇది ఒక వేద మహర్షికి కలిగిన అనుభవం. మరొక మహర్షికి అసద్వా ఇదమద్ర ఆసీత్.. అని అసత్తే ముందున్నదని దర్శనం కలిగింది. నాసదీయ సూక్తంలో నాసదాసీత్, నోసదాసీత్.. అంటే సృష్ట్యాదిలో అసత్తు లేదు.. సత్తు లేదు. ఇది మరొక అనుభవం. ఈ మూటికీ.. వైరుధ్యమున్నా.. అది దృశ్యమానమే కానీ, పారమార్థికం కాదు. సంకల్పం వల్ల సృష్టి ప్రారంభమైతే, ఆ సంకల్పానికి ముందున్నది అసత్తు. సంకల్పము సత్పదార్ధము. ఈ రెంటి అస్తిత్వాల నడుమ అసత్తు ఉన్నది. వాయిడ్ అంటే శూన్యస్థితి. మహాయోగి శ్రీ అరవిందులు సృష్ట్యాదియందు ఉన్న స్థితిని తమ మహా కావ్యం సావిత్రి ప్రారంభంలో వర్ణించారు. ఈ అసత్తు సత్తుగా పరిణమించే స్థితిని మొదటి సర్గ అంతా వెల్లడిస్తుంది. ఆయన మార్గంలో నడిచిన నా సాంపరాయంలోనూ సదసద్వివేచనం.. వాటి ఉనికిని గూర్చిన చర్చతోనే కావ్యం మొదలవుతుంది. అయితే, వాల్మీకి వాడిన సత్ శబ్దము.. అగ్రమున ఉన్నది. ఈ అగ్రము అంటే తొలి క్షణం. ఆరంభ లిప్త. దానికి ముందు ఒక అభావ స్థితి. దాని తర్వాత విస్తరించిన ఈ జగత్తు. భగవంతుడు సృష్టించాడా? సృష్టిగా పరిణమించినాడా? అన్న ప్రశ్నకు భాషా భేదాలను వదిలేస్తే, ఆ గ్రంథ గ్రంథిని విడదీయడం కష్టం.

తన్మనుష్య శబ్దానికి వాల్మీకి నారదుని ప్రశ్నించిన మహాపురుషుడు ఆదర్శ పురుషుడు, మహామానవుడు అన్నది ఒక స్థాయి అయితే సద్రూపమైన భగవంతుడే అని రెండవ అర్థం. క్రౌంచవధకు ముందే వాల్మీకికి రెండు స్తరాలలోని అనుభవం అతని అంతరంగాన్ని ఆవరించి ఉన్నది. అందువల్ల క్రౌంచవధ సన్నివేశంలో ఆయన ద్వా సుపర్ణా సయుజా సఖాయా.. అన్న ఉపనిషత్తు వర్ణించిన రెండు పక్షుల సన్నివేశాన్ని ప్రతిఫలింపజేసుకొన్నాడు. ఈ మంత్రం జీవేశ్వరులను ప్రతీకాత్మకంగా వెల్లడిచేస్తున్నది. జీవుడు లౌకికంగా కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడు సాక్షీభూతంగా అవికారంగా, అపరిణామంగా వ్యక్తమవుతున్నాడు. ఈ కథ రెండవ స్తరంలో కామ మోహితమైన అనగా కర్మఫలాను షన్ని అయిన జీవుని సూచించగా మిగిలిన పక్షి సాక్షీభూతంగానే ఉన్నది. ఇక్కడ పక్షిని కొట్టిన కిరాతుడు కర్మఫల దాతయైన సగుణ బ్రహ్మము. సాక్షిగా నిలచినది నిత్యమైన ఆత్మ పదార్థము. శ్రీమద్రామాయణంలో సగుణ నిర్గుణ బ్రహ్మముల వ్యక్త అవ్యక్త స్థితిని సూచిస్తూ సాగిపోయింది. ఇక్కడ వాల్మీకి పొందిన శోకం.. అనాది వాసనాలభ్యమైన జన్మ జన్మాంతరాలకు సంబంధించిన జీవుని శోకం కాగా.. మరొకస్థాయిలో కావ్య స్తరంలో అది జగదుఃఖమవుతున్నది. జగత్తు దుఃఖమంటే కవి జీవితంలో తనచైతన్య పరిమితులను దాటి.. విశ్వచైతన్యంలో లీనమై అక్కడి సమగ్రమైన అనుభవాన్ని తనదిగా చేసుకొని తానే అది అవటం. శ్లోకం పలికినప్పుడు అక్కడ వాల్మీకి లేడు. కవి లేడు. ఛందస్సు లేదు. ఉన్నదల్లా ఆవిష్కారం పొందిన మహా సరస్వతి మాత్రమే.

నా కవితన్ విశాల జఘనా ఒక ఔచితి లేదు భాష లే
దాకృతి లేద ఊరక రసాత్మతనే ప్రవహించి పోదు నీ
వాకృతి అందమాచిన రసాత్మవు…

అన్నటువంటి పద్యంలో చెప్పిన తాదాత్మ్య స్థితి ఇదమిత్థమని చెప్పటానికి వీలులేని సన్నివేశం. అందుకే వాల్మీకికి ఆ శ్లోకం పలికిన తర్వాత ఇదేమిటి.. నేనిలా పలికాను అని ఆశ్చర్యం కలిగింది. దానిలోని సమాక్షర పదత్వము మొదలైన అంశాలు ఆయన ఊహించి కల్పించినవి కావు. అది అలా వ్యక్తమైంది. ఇలా ఆవిర్భావం పొందిన మహాసరస్వతిని అనుసరించి చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించాడు. ఇది కవి పొందిన ఉన్మనీ దశకు సంకేతమైన స్థితి. అందువల్ల ఉన్మనీ దశకు చేరిన వ్యక్తి వాక్కులో అనృతము సంభవింపదు. అతనికి స్వీకరించిన వస్తువు అన్ని పార్శ్వాలనుండి, లోతులనుండి తెలియవస్తుంది. దీనినే బ్రహ్మ వివరించినాడు. ఇటువంటి ఉన్మనీ దశలోని కావ్యము లోకమునకు సృష్టికి బలం కలిగిస్తుంది. ఇక్కడ సృష్టి అంటే వ్యక్తమైన పరమాత్మ. రామాయణం చివరి శ్లోకంలో బలం విష్ణోః ప్రవర్ధతాం.. అన్నచోట బలము పెరుగుట అంటే సృష్టి వికాసానికి హేతువైన చైతన్యం వెల్లడి కావడమని అర్థం. ఒకానొక ఉపనిషత్తులో విష్ణువు యొక్క బలమేమిటని ప్రశ్నించి ఆ బలము తపస్సు అని వెల్లడించారు. వాల్మీకి గురువు నారదుడు అంతర్ముఖంగా తపస్వి. బహిర్ముఖంగా స్వాధ్యాయ నిరతుడు. అది కారణంగానే ఈ తపశ్శక్తి చేత విశ్వరూపయైన వాక్కు తన చతుర్ముఖాలతో అంతశ్చేతనలో సదా జాగృతమై ఉంటుంది.

ప్రస్తుత వ్యాస సంకలనం రామం భజే శ్యామలం అన్నది సంవత్సరం పాటు చిరంజీవి కోవెల సంతోష్ కుమార్ రచించిన సంకలనం. తాతగారి కాలక్షేపం ముందు రామాయణ సందర్భంలో కొన్ని ప్రార్థనాశ్లోకాలు చదివేవారు. వాల్మీకిని గూర్చినవి మూడు ఆంజనేయుని గూర్చినవి ఆరు, శ్రీరాముని గూర్చినవి మూడు. రాముని గూర్చిన ప్రార్థనాశ్లోకాలలో వేదమే రామాయణంగా అవతరించిందని చెప్పే శ్లోకం ఉంటుంది. వేదము మంత్రమై, రామాయణం కావ్యమైంది. యావత్ తాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావత్ రామాయణీ గంగా లోకేశు ప్రసరిశ్యతి.. భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతసేపూ రామాయణ రూపమైన గంగ ప్రసరిస్తూనే ఉంటుంది. చివరి శ్లోకంలో వైదేహీ సహితం సురదృమతలే.. అన్నదానిలో రామాయణంలో ధర్మ ప్రవర్తకుడైన శ్రీరాముడు గురువవుతున్నాడు.

వైదేహీ సహితం సురదృమతలే, హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం
అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం

ఈ శ్లోకంలో వైదేహీ దేహాతీతమైన చైతన్యానికి సంకేతం. శ్లోకంలో చెప్పబడని లక్ష్మణుడు స్వామి ప్రవృత్తిలో ప్రసరింపజేసే లక్షణానికి సంకేతం. భరతాదులలో శతృఘ్నుడూ ఉన్నాడు. మునులూ ఉన్నారు. శివాంశసంభూతులైన ఆంజనేయుడు తొలుతటి శ్రోత అవుతున్నాడు. ఇందరికి కూడా గురుస్థానంలో రాముడు పరమార్ధబోధ చేస్తున్నాడు. ఆధ్యాత్మ రామాయణం మొదలైన గ్రంథాలు ఈ అంశాన్ని వెల్లడి చేశాయి. దీని చివర ఉన్న రామం భజే శ్యామలం అన్న మాట రామునియందు శ్యామలత్వాన్ని తెలియజేస్తుంది. ఆత్మనః ఆకాశః సంభూత అన్న తైత్తిరీయ వాక్యం, అనంతమైన సృష్టి ఆవిష్కారానికి ఉపాదాన కారణంగా ఆకాశాన్ని తెలియజేస్తుంది. ఈ ఆకాశమే అనంతత్వానికి గుర్తు. ఆత్మ యొక్క తొలి ఆవిష్కారం ఆకాశంగానే జరిగింది. ఈ కారణంచేత తెలిసియో తెలియకయో ఈ రచయిత రాముని పరబ్రహ్మముగానే భావిస్తున్నాడు. మనుష్యత్వము కేవలం వ్యావహారికమైన సత్యమే.

విష్ణువు అవతారాలలో శ్రీనారసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు మాత్రమే గురు తత్వాన్ని ప్రత్యక్షంగా వెల్లడిచేసేవి. మరొక అంశం విష్ణువు అవతారాలలో నారసింహ, పరశురామ అవతారాలలో శివలక్షణం కూడా కనపడుతుంది. ఇది సనాతన ధర్మము. విస్తరించుకొంటున్న క్రమంలో అక్కడక్కడా సూచితమయ్యే సమన్వయ సూక్తం.

చిరంజీవి సంతోష్ కుమార్ ఈ 55 వ్యాసాలలో భారతీయ సంస్కృతి మూలాలను పట్టుకొని కాలముననుసరించి అది ఎలా వ్యాఖ్యాతమైందో వెల్లడించే ప్రయత్నం చేశాడు. మన చరిత్ర, సంస్కృతి.. పాశ్చాత్యుల రాక వల్ల వారెరిగిన పరిమిత కాలంలోకే కుదింప జేసే ప్రయత్నం జరిగింది. అనాదియైన వేదాన్ని సంకుచితమైన కాలంలోనే రచింపబడ్డట్టుగా తేల్చివేశారు. రామాయణ మహాభారతాల కాలాన్ని కూడా క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దంలోకే కుదించారు. బుద్ధుని కాల నిర్ణయంలోనూ ఎన్నో భేదాలున్నాయి. ఈ ముళ్ల పొదను కదలించి చరిత్ర విషయంలో తన ఉపపత్తులతో కొన్ని శాస్త్రీయ నిర్ణయాలు చేసినాడు. ఈ నిర్ణయాలతో భేదించేవారుండవచ్చు. అంగీకరింపనివాళ్లు కూడా ఉండవచ్చు. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కోట వెంకటాచలం మొదలైనవారు కొందరు తప్ప ఈ విషయంలో జాతీయ ప్రభుత్వ పక్షాన చెప్పుకోదగిన కృషి జరుగలేదు. పురాతత్త్వ శాస్త్ర తవ్వకాలు జరుగలేదు. విశిష్టమైన పరిశోధనలు జరుగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్టుగా ఉన్నది స్థితి. సాంస్కృతిక విషయంలో ప్రభుత్వం ఒక సమూహానికి వ్యతిరేకంగా నిర్ణయాలను చేసి ఒక అస్తిత్వాన్ని మటుమాయం చేసే ప్రయత్నం జరిగింది. ఇదంతా సంతోష్ కుమార్‌కు ఈ రచనకు ప్రేరణ ఇచ్చిన అంశం. అక్కడక్కడ కొంత ఆవేశం పెల్లుబికినట్టు కనిపించినా, అనేక అంశాలు లోతుగా పరిశీలించి చర్చించి నిర్ణయం చేసే ప్రయత్నం జరిగింది. మొత్తం ఈ పరిశోధన గ్రంథానికి రామాయణం మూలస్థానమైంది. రాముడు భారతీయ జీవనానికి మూలస్థానంగా స్వీకరింపబడ్డాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అతని ప్రధాన కర్తవ్యాలైనాయి. దేశంలోని అనేక రకాల జనులను జాతులను సభ్యతలను రాజ్య వ్యవస్థలను ఏకీకృతంచేసి సమన్వితమైన ఒక భారత దేశాన్ని ఆయన నిలబెట్టాడు. దాంపత్య ధర్మం కుటుంబ సంబంధం ఇంకా ఇతర అంశాలు ఏవి శిథిలమైతే.. పురాతనమైన భారతీయ జీవన వ్యవస్థ కూలిపోతుందో.. అలాంటి వాటిని రాముడు, రామాయణము ఎలా నిలబెట్టాయో నిరూపించాడు. పాశ్చాత్య నాగరకతా వృద్ధివల్ల కామానుభవములో కట్టుబాట్లు తెంచుకొనే ప్రయత్నం జరిగినప్పుడు అవి ఎలా నిలబడవలెనో.. రామాయణం ద్వారా ఏ సందేశం ప్రసారమవుతున్నదో ఈయన నిరూపించాడు.

ఆమె చెప్పెడు వేదాంతమది యెఱుంగ
ఈమె చెప్పెడు కామంబు నెది యెఱుంగ
మనుజడను నేను, మనుజ ధర్మంబు నాది
ఇల అధర్మంబు ఛాయ సహించుటెఱుంగ

అని అన్న శ్రీరాముని పలుకు భూమి మీద ఉన్నంత వరకు మనుజుడు ధర్మానికి కట్టుబడవలసి ఉంటుంది అనే భావనను మధించి వెన్నలాగా వెలికితీశాడు.

దాంపత్యంలోని పరస్పర అనుబంధం, అనురాగం, సమర్పణ సీతారాముల జీవనంలో ఎలా వ్యక్తమైందో చిరంజీవి సంతోష్ కుమార్ స్పష్టంగా నిరూపించాడు. రావణుని వ్యక్తిత్వాన్ని అనేక ఇతర గ్రంథాలలో పెంచిన సందర్భాన్ని ఖండించి వాల్మీకి చెప్పినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నిరూపించాడు. రామాయణ పరిశీలనలో సంతోష్ కుమార్ ఎక్కడా అతిశయోక్తులకు, గ్రంథానికి బయట కల్పింపబడిన భావనలకు లొంగిపోలేదు. అయితే రామాయణ కావ్యం ఇతిహాసం పురావృత్తం ఇన్ని వేల ఏండ్లుగా మహర్షుల తపస్సులచేత పునీతమై దివ్య జీవన వ్యాఖ్యానంగా ఎదిగిపోయిన అంశాన్ని విస్తరించకపోయినా, కాదనలేదు. ఈ సందర్భంగా నా పుత్రుడు సంతోష్ కుమార్‌ను ప్రపితామహుల ఆశీర్వచనాలు, మహర్షుల తపస్సు, ధర్మం మీద ఉండే పట్టుదల ముందుకు నడిపించగలవని ఆశీర్వదిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here