రామం భజే శ్యామలం-11

1
6

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణంలో మనకు మూడు రకాల రాజ్యవ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి అయోధ్య. రెండు కిష్కింధ, మూడు లంక. ఈ మూడు రాజ్యవ్యవస్థల మౌలిక స్వరూపం రాచరికమే. కానీ.. మూడూ కూడా భిన్నమైన దృక్పథాలు కలిగినవి. ఒకటి ప్రజాస్వామిక రాజరికమైతే.. మరొకటి అనార్కిజం (అరాచకం). మూడోది పూర్తిగా నియంతృత్వం. లంకలో మనకు కనిపించేది ఈ నియంతృత్వమే. అక్కడి రాజు రావణుడు. తాను ఏదైనా అనుకుంటే అది జరగాల్సిందే. అది మాత్రమే జరుగాలి. ఆయనకు ఓ రాజసభ, మంత్రులు, సేనాధిపతులు, దండనాయకులు.. పురోహితులు.. ఇట్లా సవాలక్ష మంది ఉంటారు. కానీ.. వీరంతా కూడా రావణుడి లాగానే ఆలోచించాలి. రావణుడు ఏం అనుకుంటాడో దాన్ని మాత్రమే సలహాగా ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి.. ఏం చేయాలో రావణుడు ముందే ఫిక్స్ అయిపోతాడు. అయినా.. రాజసభను సమావేశపరుస్తాడు. ఓ సుదీర్ఘ ప్రసంగం ఇస్తాడు. వారందరి ఆలోచనల ప్రకారమే తాను పరిపాలన సాగిస్తున్నట్టు చెప్తాడు. రాజ్యానికి ఒక పెద్ద ఆపద వచ్చింది.. దాన్ని ఎలా పరిష్కరించాలో చెప్పండి.. మీరు చెప్పినట్టు చేద్దాం అంటూ అడుగుతాడు. సభలో ఉన్నవారంతా రాజు గురించి తెలుసు కాబట్టి.. అతని ఆలోచన మేరకే సలహాలిస్తారు. వీరంతా కూడా రావణుడికి ఇన్‌సైడర్లుగానే ఆలోచిస్తారు. ఆ ఆలోచనలనే రావణుడికి చెప్తారు. నువ్వే రైటు.. నువ్వే రైటంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. ఎవరైనా పొరపాటున ఇందుకు భిన్నంగా మాట్లాడారో.. వారి గతి అంతే. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న మౌలిక సూత్రాన్ని లంకలో మంత్రులు, సేనాధిపతులు అనబడే ఉద్యోగులు ఆనాడే అద్భుతంగా ఆచరించి చూపారు. ఇన్ని వేల ఏండ్ల తరువాత కూడా ఈ సూత్రం మనకు సార్వకాలీనంగా వర్తిస్తున్నది. తప్పు చేసినా బాజాప్తా మందీమార్బలాన్ని వెంటేసుకొని వెళ్లి మరీ చేస్తాడు. ఇందుకు సంబంధించి ఒకట్రెండు ఉదాహరణలు ..

రాముడు అడవిలో ఉన్నప్పుడు రావణుడి చెల్లె శూర్పనఖ.. రాముడిపై మోహంతో వచ్చింది. ముందు మంచిగా చెప్పిచూశాడు రాముడు. వినకపోతే పరాభవించి పంపించాడు. ఈ శూర్పనఖ వెళ్లి రావణుడితో ఒకటికి రెండాకులు ఎక్కువ కలిపి చెప్పింది. సీత అందంగా ఉంటుందని.. రెచ్చగొట్టింది. ఆ కాలంలో బహుభార్యత్వం తప్పు కాదు. ఆ సంప్రదాయం ఉన్నది. అయినా రాముడు ధర్మం అంటూ.. గిరిగీసుకొని ఒక్క భార్యే చాలనుకున్నాడు. చెల్లె వచ్చి విషయం చెప్పినప్పుడు ఆమెను మందలించకపోగా.. సహజంగానే విమనైజర్ (స్త్రీలోలుడు) అయిన రావణుడు సీతను ఎత్తుకొచ్చాడు. అప్పుడే మారీచుడు సలహా ఇచ్చాడు. బాబూ.. విశ్వామిత్రుడి టైంలోనే నన్ను, నా తమ్ముణ్ణి ఆ రాముడు ఆగమాగం చేశాడు. నా తమ్ముడేమో ఖతమయ్యాడు. నేనేమో చావుతప్పి కన్నులొట్టపోయి బతుకుజీవుడా అంటూ వచ్చాను. తర్వాత జనస్థానంలో నీ గవర్నర్లు.. మహావీరులైన ఖరదూషణులను మట్టుపెట్టారు. మనకెందుకీ కిడ్నాపులు.. వేధింపులు? అని బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ వినలేదు. చంపుతానన్నాడు. నీ చేతుల్లోకంటే.. ఆ రాముడి చేతిలో చావడం బెస్ట్ అంటూ వెళ్లిపోయాడు. ఈ రావణుడేమో సీతమ్మను ఎత్తుకొచ్చాడు. అశోకవనంలో ఓ చెట్టుకింద కూర్చోబెట్టాడు. ఓ వందమంది మందీమార్బలాన్ని వెంటేసుకొని సీత దగ్గరకు రావడం.. తన సొంతం కమ్మని ఆమెను బెదిరించడం రోజూవారీ పనిగా పెట్టుకున్నాడు. తాను చేసిందీ.. చేస్తున్నది తప్పని తెలిసినా.. తనను ఎవడేం చేస్తాడులే అన్న అహంతో బహిరంగంగానే తప్పుచేస్తూ పోయాడు. దాని పరిణామం ఆంజనేయుడు ఒక్కడే వచ్చి తన ముద్దుల కొడుకు అక్షయుడితోపాటు సమస్త లంకాద్వీపాన్ని కకావికలంచేసి పోయాడు. అటు రాముడేమో.. సముద్రానికి అవతలివైపు కాచుకొని ఉన్నాడు.. ఈ పరిస్థితిలో రావణుడు ఓ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. అందరూ హాజరయ్యారు. యుద్ధకాండలోని ఆరోసర్గలోని సందర్భమిది. ‘ఆ వానరుడు.. దేవతలకు కూడా ఎదిరింప శక్యంకాని లంకలోకి రావడమే కాకుండా చైత్యప్రాసాదాన్ని విధ్వంసంచేశాడు.. గొప్ప రాక్షస వీరులను చంపివేసినాడు. లంకాపట్టణాన్నంతా వ్యాకులం చేశాడు. ఇప్పుడు నేనేమి చేయాలి? ఈ నగరానికి, ఈ రాజ్యానికి ఏమి చేస్తే మంచిది? ఏది మనకు హితమైనది.. ఆలోచన వల్లనే విజయం సిద్ధిస్తుందంటారు? మీ ఆలోచన ఏమిటో చెప్పండి? రాముడి విషయంలో ఏం చేద్దామో ఆలోచించండి. మీరంతా ఆలోచించి ఇప్పుడు చేయాల్సిన కార్యాన్ని చెప్తే.. దాన్నే నేను అంగీకరించి చేస్తాను’ అని అన్నాడు. దాంతో సభలో ఉన్న రావణుడి మంత్రులు, సేనాధిపతులు.. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. నీలాంటివాడు దిగులు పడటమేమిటని ప్రశ్నించారు. పాతాళంలో పన్నగులను జయిస్తివి. కైలాసం దగ్గర నీ అన్న కుబేరుణ్ణే చెమటలు కక్కించి పుష్పకంతో సహా సంపదంతా దోచేశావు.. నీకెందుకంత బెంగ అన్నారు. మయుణ్ణి భయపెట్టి మండోదరిని భార్యగా చేసుకొన్నావు. నీకేం తక్కువయ్యా మేమంతా లేమా’ అన్నారు. జస్ట్ నీ కొడుకు ఇంద్రజిత్ ఒక్కడు చాలు.. ఆ రాముణ్ణి.. వానరులను సమూలంగా నాశనం చేసేస్తాడు అని అన్నారు. ఆఫ్టర్‌ఆల్ ఒక సామాన్య మానవుడి నుంచి నీకు ఆపద వచ్చింది. దీని గురించి నువ్వు ఆందోళన చెందకు మేమున్నాం. దుర్ముఖుడు, ప్రహస్తుడు, వజ్రముఖుడు, వజ్రహనువు.. ఇలా ప్రతి ఒక్కరూ.. రెచ్చిపోయి.. నేనొక్కడినే చాలంటే.. నేనొక్కడినే చాలన్నారు. వజ్రహనువు అనేవాడైతే.. బాస్ ప్రాపకం కోసం ఇంకొంచెం ముందుకుపోయి.. మీరంతా హాయిగా ఇండ్లకు పొండి. మద్యపానం తాగుతూ.. ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేయండి. వాళ్ల సంగతి నేను చూసొస్తానన్నాడు. రావణుడి ఈగో సంతృప్తి చెందింది. అంతా తానేమనుకుంటున్నాడో అదే చెప్పారు. సమస్య ఎక్కడ మొదలైంది? దానికి పరిష్కారమేమిటన్న విషయం గురించి ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఒకే ఒక్కడు విభీషణుడు మాత్రం లేచి.. పరిస్థితిలోని తీవ్రతను వివరించే ప్రయత్నంచేశాడు. ఒకే ఒక్కడు వచ్చి ఇంత విధ్వంసం సృష్టించాడంటే.. అంతా వస్తే ఎట్లా ఉంటుందో ఆలోచించాలన్నాడు. అప్పుడొకడు.. అరెరె.. కొంచెం ఏమరుపాటుగా ఉన్నప్పుడు ఆ హనుమంతుడు అట్లా చేయగలిగాడే కానీ.. మనం కన్ను తెరిస్తేనా..? అన్నాడు. సీతను వెంటనే వెనక్కి తీసుకొని వెళ్లి అప్పగించండంటూ బుద్ధి చెప్పడానికి విభీషణుడు ప్రయత్నిస్తుండగానే రావణుడు సభలోనుంచి లేచి వెళ్లిపోయాడు. తర్వాత ఇంటికి పోయి కూడా విభీషణుడు చెప్పాడు. రావణుడికి ఈ ఒక్క విభీషణుడి మాటలు మాత్రమే నచ్చలేదు. నన్ను భయపెడుతున్నావా? అన్నాడు. ఇంద్రజిత్తేమో.. బాబాయి అని కూడా చూడకుండా ఏయ్.. ఇలా మాట్లాడతావా అంటూ ఆక్షేపించాడు. విభీషణుడు మాత్రమేం చేస్తాడు.. లంకను వదిలి సముద్రం ఇవతలికి వచ్చేశాడు. లంకలో రావణుడి డిక్టేటర్‌షిప్‌కు ఇది ఉదాహరణ. అతను చేసిన తప్పులకు.. అతని నిరంకుశ ఆధిపత్య ధోరణికి లంక.. భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది.

***

ఇక కిష్కింధ విషయానికి వద్దాం. దీన్ని మనం పూర్తిగా ఒక రాజ్యంగా చెప్పలేం. ఎందుకంటే మా రాజ్యంలో కిష్కింధ ఒక భాగమని రాముడే వాలితో అన్నాడు. కిష్కింధను ఒక సామంత రాజ్యంగా భావించినా.. వాలి ఒక అరాచకవాది. రావణుడు కనీసం మంత్రులతో మాట్లాడనైనా మాట్లాడాడు. వాలికి అదేమీ పట్టదు. అత్యంత అరాచకం. తాను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగాల్సిందే. లేకుంటే.. తమ్ముడైనా సరే హతమార్చడానికి వెనుకాడడు. అందుకే వాలి ముందు మాట్లాడటానికి ఎవరూ సాహసించరు. చెప్పింది నోరుమూసుకొని విని పాటించడమే విధి. ఓసారి దుందుభి అని ఒక శత్రువు వాలిని చంపడానికి వచ్చాడు. వాలి వాడితో యుద్ధానికి దిగాడు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఓ గుహలో దూరారు. లోపలికి పోతూ పోతూ.. నేను వచ్చేదాకా నువ్వు గుహబయట కాపలా ఉండు అంటూ తమ్ముడు సుగ్రీవుడికి చెప్పాడు. ఈ సుగ్రీవుడేమో.. ఏడాదిపాటు అక్కడే ఉండీ..ఉండీ.. అన్న బయటకు రాకపోవడంతో.. గుహలోంచి రక్తం బయటకు ధారగా రావడంతో ఆందోళన పడి గుహకు రాయి అడ్డంపెట్టి తిరిగివచ్చాడు. అంతా కలిసి వాలి చనిపోయాడనుకున్నారు. సుగ్రీవుడిని రాజుగా బాధ్యతలు తీసుకోవాలని పట్టుబట్టి తీసుకొనేలా చేశారు. కొన్నాళ్లకు సదరు వాలి.. ఆ దుందుభిని చంపి.. గుహకు అడ్డంగా పెట్టిన రాయిని నానా తంటాలు పడి పగులగొట్టుకొని ఇంటికి వచ్చాడు. అక్కడ సీన్ చూసేసరికి చాలా కోపం వచ్చింది. సుగ్రీవుడు అప్పటికీ వచ్చి.. అన్నను రమ్మని.. సింహాసనంపై కూర్చోమని చెప్పడానికి బాగా ట్రైచేశాడు. కానీ అతని మాట వినలేదు. సుగ్రీవుడిని చితక్కొట్టి రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. అతని భార్య రుమ ను చెరబట్టాడు. తర్వాత రామలక్ష్మణులు వచ్చినప్పుడు.. సుగ్రీవుడు రెండోసారి యుద్ధానికి వచ్చినప్పుడు వాలి భార్య తార వద్దని వారించింది. లంకలో విభీషణుడిలాగానే, వాలికి తార మంచి చెప్పడానికి ప్రయత్నించింది. ఆమె మాటనూ వినలేదు. ఇది కిష్కింధలో వాలి వ్యక్తిత్వం.

***

ఇక అయోధ్య విషయానికి వద్దాం. ఇక్కడి రాజు దశరథుడు. అప్పటికే చానా ఏండ్లు పరిపాలించాడు. పరిపాలనపై విసుగుపుట్టింది. నలుగురు కొడుకులు ఎదిగివచ్చారు. ఒకరికి పట్టాభిషేకం చేద్దామనుకొన్నాడు. నలుగురిలోనూ బెస్ట్ ఎవరని బేరీజు వేసుకున్నాడు. చివరకు రాముడిని ఎంచుకొన్నాడు. ఈ రాముడు ఎలాంటివాడు? అని ఆలోచించాడు. ‘నలుగురు సోదరులలో కూడా అధిక గుణవంతుడు, మహాతేజశ్శాలి. సౌందర్యశాలి. పరాక్రమవంతుడు. అసూయ లేనివాడు. గుణములలో నాతో సమానమైనవాడు. ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో ఉంటాడు. చాలా మృదువుగా మాట్లాడతాడు. ఎవరైనా పరుషంగా మాట్లాడినా.. ప్రత్యుత్తరం చెప్పడు. ఉపకారులను ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు. అపకారాలను వెంటనే మరచిపోతాడు. ఎప్పుడు కూడా అసత్యం చెప్పడు. కోపాన్ని జయించినవాడు. దయ కలిగినవాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. ఎలాంటి అనారోగ్యం లేనివాడు. వాక్చాతుర్యం కలిగినవాడు. ఏ దేశమునందు ఏ కాలంలో ఏ పనిచేయాలో తెలిసినవాడు. పైగా అయోధ్య ప్రజల్లో ఎంతో ప్రేమను పొందినవాడు. దుష్టులను నియంత్రించడంలోనూ.. మంచివాళ్లను రక్షించడంలోనూ నేర్పరి. ఎవరిని ఎలా నిగ్రహించాలో బాగా తెలిసినవాడు. డబ్బును ఎలా ఖర్చు చేయాలో.. ఎలా పొదుపుచేయాలో బాగా తెలిసినవాడు. ఏనుగులు, గుర్రాలను లొంగదీసుకొనగలిగిన నేర్పరి. ప్రపంచంలోని ధనుర్వేద వేత్తలలో రాముడు శ్రేష్టుడు. సైన్యాన్ని నడిపించడంలో అతడిని మించినవాడు లేడు. యుద్ధములో సురాసురులు కూడా రాముడిని ఎదిరించి నిలువలేరు. గర్వము, మత్సరం లేనివాడు. ఏ ప్రాణిని కూడా అవమానించడు. కాలాన్ని బట్టి వైఖరి మార్చేవాడు ఎంతమాత్రం కాడు. అతని వల్ల ఈ అయోధ్యకు మేలు జరుగుతుంది. ఈ విశ్వానికి మేలు జరుగుతుంది. సమస్త ప్రజలకు మేలు జరుగుతుంది.’ ఇంత లోతుగా అయోధ్య దేశాధిపతి దశరథుడు తన వారసుడిని ఎంపిక చేసేముందు ఆలోచించాడు. ఆ తరువాతే నిర్ణయించాడు. ముందుగా పురోహితులైన వశిష్ఠుడు, వామదేవుడితో మాట్లాడాడు. చర్చించాడు. నిజానికి నేరుగా తాను ఎవరిని అనుకుంటే వారికి పట్టాభిషేకం చేసెయ్యొచ్చు. ఆక్షేపించేవారు కూడా ఉండరు. ఎందుకంటే రాజరిక వ్యవస్థ మౌలిక లక్షణమే అది. కానీ దశరథుడు ఆ పని చేయలేదు. అందర్నీ పిలిచాడు. మంత్రులు, సేనాపతులు, పురోహితులే కాదు.. సామంతులు.. సామాన్య ప్రజలనూ పిలిపించాడు. నగరాల్లో ఉండే అధికారులను పిలిపించాడు. గ్రామాల్లో ఉండే అధికారులను పిలిపించాడు. మాతామహుడు, వియ్యంకుడిని (కేకయరాజును, జనకమహారాజు) ఓ పెద్ద ఉపన్యాసం చెప్పాడు. ‘సభికులారా? ఈ ఉత్తమరాజ్యాన్ని మా పూర్వులు చక్కగా పాలించారు. నేను కూడా వాళ్ల దారిలో నడుస్తూ.. అత్యంత జాగ్రత్తగా పరిపాలన సాగించాను. నా జీవితమంతా కూడా తెల్ల గొడుగు కిందే జీర్ణమైపోయింది. (తెల్లగొడుగు అంటే రాజుగారికి పట్టే ఛత్రం) ఇక ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకొని.. నా పెద్ద కొడుకు రాముడు దేవేంద్రుడితో సమానుడు. ఇతడు రాజు అయితే రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తాడు. మంచి రాజుగా మీ ఆదరాభిమానాలు పొందుతాడని నాకు విశ్వాసమున్నది. అందువల్ల అతడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నా.. ఇది దేశానికి మంచి ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నా.. మీ ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. ఇతరత్రా ఆలోచన ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా తెలియజేయండి. పక్షపాతములేని మధ్యస్థులు లోతుగా ఆలోచించి నిర్ణయిస్తేనే దేశాభ్యుదయం సాధ్యపడుతుంది’ అని దశరథుడు అందరినీ కోరాడు. దశరథుడి మాట వినడంతోనే సభలోని వారంతా కూడా ‘బాగున్నది బాగున్నది’ అంటూ సంతోషంతో కేరింతలు కొట్టారు. ‘రాజా నువ్వు చాలా ఏండ్లున్న వృద్ధుడవైపోయావు. ఇక మహావీరుడు, మహాబలశాలి అయిన రాముడికి అధికారం అప్పగించు. అతడు శ్వేతచ్ఛత్రధారి అయి ఏనుగుపై వెళ్తుంటే చూడాలని ఉన్నది’ అని ముక్తకంఠంతో అన్నారు. రాముడి పేరు చెప్పగానే జనం అంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో దశరథుడు లోపల సంతోషం కలిగినా.. అంతకంటే పెద్ద అనుమానం కలిగింది. ‘ఇదేంటయ్యా.. ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడటంలేదు. రాముడి పేరు చెప్పగానే ఆహా ఓె అంటూ జేజేలు కొడుతున్నారు. ఇప్పటివరకు నేను ధర్మబద్ధంగానే పరిపాలిస్తున్నా కదా.. నా మీద కానీ, నా పాలన మీద కానీ మీకు అసంతృప్తి ఏదైనా ఉన్నదా? నాకు అనుమానంగా ఉన్నది.’ అని అన్నాడు. తానెప్పుడు గద్దె దిగిపోతానా అని మిగతావాళ్లంతా ఎదురుచూస్తున్నట్టున్నది.. అన్న సందేహం కలిగింది. తాను దుర్మార్గంగా పరిపాలిస్తున్నానా? అన్న ఆందోళన కలిగింది. అప్పుడు అంతా కలిసి.. అయ్యో రాజా.. నీ పరిపాలనపై మాకేం అనుమానం లేదు. రాముడు చాలా గొప్పవాడు. అతను అధికారంలోకి వస్తే ఈ దేశం మరింత సౌభాగ్యవంతమవుతుంది. అభివృద్ధి చెందుతుంది. అందుకే రాముడిని రాజును చేయాలని కోరుతున్నాం. మీ పాలనలో మేం చాలా సుఖంగా ఉన్నామని అన్నారు. ఆ తర్వాత కానీ రాముడిని రాజును చేయడానికి దశరథుడు ముందుకు రాలేదు. ఒక రాజ్యంలో రాజు తన వారసుడిని ఎంపిక చేయడానికే గ్రామస్థాయి నుంచి రాజధాని దాకా అన్ని స్థాయిల్లోని ప్రజలను సంప్రదించాడంటే.. అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.

***

కొద్దిగా మన దేశం స్వతంత్రమయ్యే సందర్భంలో రాజుగారు ఎలా ఎమర్జ్ అయ్యారో ఒకసారి చూద్దాం. 1926 నాటికే నెహ్రూ కాంగ్రెస్‌పై తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించాడు. 1928లో మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1929లో తండ్రి నుంచి వారసత్వంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సాధించుకున్నాడు. అక్కడి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో కానీ తన పట్టును, కుటుంబ పట్టును పోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అప్పటికే నెహ్రూ సోవియట్ రష్యా ప్రభావంలో పడిపోయాడు. పరోక్షంగానైనా సోవియట్ రష్యా భావజాలంతోనే భారత జాతీయ ఉద్యమంలో తన పాత్ర పోషిస్తూ వచ్చాడు. మహాత్మాగాంధీని అన్ని విధాలా ప్రభావితం చేశాడు. తన పట్టునుంచి చేజారిపోకుండా జాగ్రత్తపడ్డాడు. ముందుగా కాంగ్రెస్‌లో సోవియట్ బ్లాక్‌ను ఒకదాన్ని ప్రారంభించాడు. చైనా, రష్యాల ప్రేమలో ఎంతగా పడ్డాడంటే ఆయన విధానాలు, చర్యలు అన్నీ కూడా సోవియట్ యూనియన్‌కు అనుకూలంగానే సాగాయి. చైనా భారతదేశంపై యుద్ధం చేయకపోయి ఉంటే, చైనా, రష్యాల మధ్య విభేదాలు రాకపోయి ఉంటే భారతదేశం కచ్చితంగా కమ్యూనిస్టు దేశంగా మారిపోయి ఉండేది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. 1925లో నెహ్రూ తన భార్య కమలా నెహ్రూ చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్లాడు. 1927 ఫిబ్రవరిలో బ్రసెల్స్‌లో కోమింటర్న్ (కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్) సంస్థ సదస్సు జరిగింది. ఇది సోవియట్ యూనియన్‌కు అనుబంధ సంస్థ. ప్రపంచమంతటా సోవియట్ కమ్యూనిజాన్ని స్థాపించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. రక్తపాతం జరిగైనా సరే.. రష్యా మార్కు కమ్యూనిజం స్థాపించడమే ఈ సంస్థ ఉద్దేశం. సోవియట్ రష్యా విప్లవం చరిత్ర చదివితే ఇదంతా స్పష్టంగానే అర్థమవుతుంది. ఈ సదస్సులో నెహ్రూను సంస్థ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఒక్కసారి గౌరవాధ్యక్షుడవడంతోనే నెహ్రూ ఎంతగా ఉత్కంఠకు గురయ్యాడంటే.. ఆ తర్వాత ఆజీవన పర్యంతం అంటే 1964లో ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయన సోవియట్ బాట వీడలేదు. ఒక విధంగా సోవియట్ చెప్పినట్టల్లా నడుచుకున్నాడనే భావించాలి. దేశంలో ఎవరి మాటా వినలేదు. తను చెప్పిందే శాసనమన్నట్టుగా జాతీయోద్యమాన్ని, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశ పరిపాలనను కొనసాగించాడు. 1927లో తండ్రి మోతీలాల్‌తో కలిసి మాస్కో వెళ్లాడు. అక్కడ మూడురోజులపాటు కమ్యూనిస్టు నాయకులు నెహ్రూ బ్రెయిన్‌వాష్‌ చేశారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నెహ్రూ ఉన్నట్టుండి సాయుధ పోరాటం చేయాలన్న మాటలు మాట్లాడాడు. ఓ సైనిక వ్యవస్థ ఏర్పాటుకు కూడా పూనుకున్నాడు. ఈ విషయంలో మహాత్మాగాంధీకి ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. చివరకు నెహ్రూ ముందు గాంధీ ఏమీ చేయలేక నామమాత్రమయ్యారు. క్రమంగా నెహ్రూ.. జాతీయోద్యమాన్ని తన నియంత్రణలోకి తీసుకొచ్చుకున్నాడు. ఒక సంపన్న కుటుంబం, ఉన్నతవర్గం నేపథ్యం నుంచి వచ్చిన వాడు నెహ్రూ. అంతకుమించి ఆధిపత్య ధోరణి ఉన్న వ్యక్తిత్వం కలిగిన నెహ్రూను సోవియట్ ప్రభావం మరింత నిరంకుశంగా మార్చివేసింది. 1929లో తన తండ్రి మోతీలాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ అధ్యక్షపదవిని స్వీకరించాడు. అప్పటినుంచే ఆ పార్టీలో నెహ్రూ కుటుంబ పాలనకు బలమైన బీజం పడింది. దేశ విభజనకు పూర్వం మూడుసార్లు నెహ్రూ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1929, 1936, 1946లో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడు సార్లు కూడా పార్టీ జనామోదంతో ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. 1946లోనైతే నెహ్రూ పరిస్థితి మరీ దారుణంగా ఉండింది. ఆయన్ను నామినేట్ చేయడానికి సైతం ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకలేదు. చివరకు గాంధీజీయే సీడబ్ల్యూసీ ద్వారా నెహ్రూను నామినేట్ చేయించాల్సి వచ్చింది. గాంధీపై నెహ్రూ ఒత్తిడి అంతగా ఉన్నది. సాధారణంగా పీసీసీ అధ్యక్షులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారు. అప్పుడు దేశవ్యాప్తంగా పదిహేనో పదహారో పీసీసీలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కదాని ప్రెసిడెంట్ కూడా నెహ్రూను నామినేట్ చేయలేదు. అయినా నెహ్రూనే అధ్యక్షుడిగా అయ్యాడంటే ఏ స్థాయిలో చక్రం తిప్పాడో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌లో ఉంటూనే సోవియట్ బ్లాక్‌ను నడిపించాడు. ఫారిన్ పాలసీ బ్లాక్‌ను నడిపించాడు. వీటిల్లో తన దోస్తులను ఏర్పాటుచేసి నడిపించాడు. తన విధానాలను కచ్చితంగా ఆమోదించాల్సిందేనని ఒక విధంగా అల్టిమేటమే ఇచ్చాడు. రెండోసారి 1936లో పార్టీ అధ్యక్షుడయ్యాక అధికారం వైపు పావులు కదిపాడు. ప్రావిన్సులకు జరిగిన ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించాడు. ఈ ఎన్నికల్లో ముస్లిం లీగ్‌ను నమ్మించి దారుణంగా మోసం చేశాడు. యునైటెడ్ ప్రావిన్సుకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినప్పటికీ కాంగ్రెస్, ముస్లింలీగ్ కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేయాలని మౌఖికంగా అంగీకారానికి వచ్చారు. నెహ్రూ.. జిన్నాకు ఈ అంశంలో హామీ ఇచ్చాడు. ఈ హామీ మేరకు ముస్లిం రిజర్వేషన్ స్థానాల్లో కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లలో పోటీచేసింది. బహుశా వందసీట్ల కంటే తక్కువ. ఫలితాలు వచ్చేసరికి పన్నెండు స్థానాల్లో ఎనిమిదింటిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏడింటిలో పూర్తి మెజార్టీ రాగా, పంజాబ్‌లో ఒక చిన్న పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ ఫలితాలతో నెహ్రూలో ఆధిపత్య ధోరణి ఏస్థాయిలో పెరిగిందంటే.. జిన్నాకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కాడు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో ముస్లింలీగ్ కు 108 సీట్లకు మించి రాలేదు. చివరకు జిన్నాతో మాట్లాడటానికి కూడా నెహ్రూ ఇష్టపడలేదు. ఈ పరిణామం భారతదేశ జాతీయ ఉద్యమంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ముస్లింలీగ్ మతపరమైన మిలిటెన్సీవైపు మళ్లింది. జిన్నా ఇస్లాం నినాదం ఎత్తుకున్నాడు. ఆ నినాదంపైనే ముస్లిం లీగ్‌ను బలోపేతం చేశాడు. చివరకు ఇదే.. భారత విభజనకు దారితీసింది.

ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చక్కగా నడుస్తున్నాయి. సర్దార్ పటేల్ వంటి ప్రాక్టికల్ నేతల మార్గదర్శనంలో పరిపాలన సాగుతున్నది. అప్పటికే నెహ్రూకు సోవియట్ యూనియన్ నెహ్రూకు అంతర్జాతీయ నేతగా ఓ కిరీటాన్ని పెట్టింది. దాంతో ఆయన మరింత పట్టు బిగించాడు. ఆ ఇమేజ్ నిలబెట్టు కోవడానికి జీవితమంతా తాపత్రయపడ్డాడు. విదేశాంగ విధానం, ఆర్థిక విధానాలంటూ రూపకల్పన చేశాడు. కాకపోతే స్వాతంత్య్రానంతరం వీటిలో ఏ ఒక్కదాన్నీ ఆయన అమలుపరుచలేదు. 1942లో బ్రిటన్‌కు ఎలాంటి మద్దతు ఇవ్వరాదని నెహ్రూకు కోమింటర్న్ ద్వారా పరోక్ష ఆదేశాలు అందాయి. దీంతో చక్కగా నడుస్తున్న ప్రభుత్వాలను నెహ్రూ ఏకపక్షంగా రద్దుచేశాడు. గాంధీ కూడా చూస్తూ ఉండిపోయాడు. బ్రిటన్ సైన్యంలో కూడా చేరకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రెండు పరిణామాలతో అస్సాం, ఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ వంటి చోట్ల ఇస్లాం ప్రభుత్వాలు వచ్చాయి. దీంతో బెంగాల్‌లోకి పెద్ద ఎత్తున ఇస్లామిక్ వలసలు మొదలయ్యాయి. అటు సైన్యంలో చేరకూడదన్న నిర్ణయాన్ని పటేల్, రాజాజీ, రాజేంద్రప్రసాద్ వంటి నాయకులు వ్యతిరేకించినా.. నెహ్రూ వినలేదు. దీంతో ముస్లింలీగ్ పెద్ద ఎత్తున బ్రిటిష్ సైన్యంలో చేరింది. ఇండియన్ బ్రిటిష్ ఆర్మీలో 34 శాతానికి తన బలాన్ని పెంచుకున్నది. ఇది సహజంగానే పాలకవర్గంపై మతపరమైన ప్రభావాన్ని చూపించింది. మరోవైపు ఈశాన్య భారతంలో ఆదివాసిస్థాన్ కోసం ఉద్యమం మొదలైంది. దీన్ని సమర్థిస్తూ రీడ్ అనే బ్రిటన్ అధికారి ఎలిజబెత్ రాణివారికి రిపోర్టు కూడా రాశారు. అదృష్టవశాత్తూ అది కార్యరూపం దాల్చలేదు. ముస్లింలీగ్ బలపడ్డకొద్దీ విభజనవాదం అంతే స్థాయిలో బలపడింది. చివరకు దేశం విడిపోయింది.

దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాతైనా సరే అందరినీ కలుపుకుని పోయాడా అంటే అదీలేదు. తన అంతేవాసి వీకే కే మీనన్ విషయంలో స్కాం బయటపడినా సరే ఎవరిమాటా లెక్కచేయకుండా రక్షణ మంత్రిని చేసిన డిక్టేటర్ నెహ్రూ.. కశ్మీర్, చైనా.. విద్యావిధానం, ఆర్థిక విధానం.. లౌకికవాదం.. ఇలా ఏ ఒక్క విధానంలోనూ ఏ ఒక్కరి మంచిమాటా చెవికెక్కించుకోలేదు. అందరితో చర్చించినట్లే నటించి తాననుకున్నదే చేశాడు. ఆయన అనంతరం ఆయన కూతురు ఇందిర నాలుగాకులు ఎక్కువే చదివింది. తన అధికారం కోసం ఏకంగా దేశంలో ఎమర్జెన్సీయే విధించింది. తాను కాకుండా దేశంలో ఏ ఒక్క నాయకుడిని కూడా ఎదుగకుండా చక్రబంధం వేసింది. ఆమె కొడుకు సంజయ్‌గాంధీ రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా వ్యవహరించిన తీరు బహిరంగ రహస్యమే. చివరకు నెహ్రూ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేని పరిస్థితి ఇవాళ నెలకొన్నది. స్వతంత్రభారతంలో నెహ్రూ లిఖించిన ప్రజాస్వామ్యమనే రాజరిక వ్యవస్థ స్వరూపము.. స్వభావము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here