రామం భజే శ్యామలం-14

2
6

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంaకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]‘ఇ[/dropcap]ది ఇలాగే జరిగి ఉంటుంది… తప్పనిసరిగా ఇలాగే అయి ఉంటుంది.. మరోలా జరిగి ఉండే అవకాశమే లేదు. అశోకుడు ఇలాగే చేసి ఉంటాడు. మొక్కలు నాటి ఉండకపోవచ్చు. కచ్చితంగా చెట్లే నాటి ఉండే అవకాశమున్నది. అయోధ్య బౌద్ధ మతకాలానికి చెందిన నగరమే తప్ప రామాయణానికి సంబంధం ఉండకపోవచ్చును. సింధు నాగరికత తుఫాను వల్ల కానీ, భూకంపాల వల్ల కానీ, వాతావరణంలో మార్పుల వల్ల కానీ, కరోనా లాంటి మహమ్మారి వల్లకానీ, యుద్ధాల వల్ల కానీ, ప్రళయం వల్ల కానీ అంతమై ఉండవచ్చును. వీటిలో ఏదో ఒకటి కచ్చితంగా జరిగి ఉంటుంది. ఆర్యులు ఇరాన్‌లోని ఈశాన్య ప్రాంతం నుంచి కష్టపడి భారత్‌కు వచ్చారు. కానీ వారికి ఎక్కడా హరప్పా, మొహంజొదారో ఛాయలు కనిపించనైనా లేదు. కానీ పక్కనే అనుకొని ఉన్న పంజాబ్‌లో సెటిలై వ్యవసాయాన్ని కనిపెట్టారు. చైనాలో లభించిన చిత్రలిపి.. చరిత్రకారులకు అర్థమైంది. కానీ సింధు లోయలో లభించిన చిత్రలిపిని మాత్రం చరిత్రకారులు అర్థంచేసుకోలేకపోయారు.’ ఇలా చెప్పుకొంటూ పోతే చాలా చాలా చెప్పుకోవచ్చు. మన దేశ చరిత్రకారులు మన దేశ ప్రాచీన చరిత్రను నిర్వచించిన తీరు ఇది. అంతర్జాతీయ చరిత్రకారులు యావత్ ప్రపంచంలోనే అనేక రాజ్యాల చరిత్రను చాలా స్పష్టంగా ధ్రువీకరిస్తారు. కానీ, మన దేశంలో మాత్రం చరిత్ర ఇలాగే చెప్తారు.

ఒక ఉదాహరణ చెప్తాను .. హెచ్ హెచ్ విల్సన్ అని ఓ దొరవారున్నారు. ఆయనగారు పురాణాలకు సంబంధించి ఓ కాలనిర్ణయం చేశారు. ఆ పుస్తకం పేరు ‘ది పురాణాస్’. అందులో ఏం చెప్పారో మీరే చదవండి.

1. బ్రహ్మ పురాణం: ఈ పురాణం 13 లేదా 14 వ శతాబ్దంలో రచించి ఉండవచ్చు.

2. పద్మ పురాణం: పద్మ పురాణంలోని ఏ భాగం కూడా పన్నెండవ శతాబ్దానికి ముందు రచించినదని చెప్పడానికి వీలులేదు. చివరి భాగములు 15, లేక 16 శతాబ్దాలలో రాయబడి ఉండవచ్చును.

3. విష్ణు పురాణం: ఈ పురాణంలో చెప్పిన అంశాలు ప్రజల్లో ప్రసిద్ధంగా ఆచరణలో ఉన్నవి. ఇందులో చెప్పిన రాజుల చరిత్రలు పరంపరగా ప్రజల్లో చెప్పుకొంటున్నారు. వీటి గురించి బోధించే నీతి, నియమాలతో కూడిన ప్రవర్తన స్పష్టంగా, స్థిరంగా కనిపిస్తున్నది. దీని ప్రాచీనత్వాన్ని గురించి వివాదపడటం తెలివిహీనమైన పని. క్రీస్తు శకానికి పూర్వం కనీసంగా మూడు శతాబ్దాలకు ముందే దీన్ని రాసి ఉండవచ్చు

4. వాయు పురాణం: ఇది అతి ప్రాచీనమైన, నమ్మకమైన విషయములతో కూడుకొన్న ఆదిపురాణాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు

5. భాగవతం: ఇది పన్నెండో శతాబ్దంలో వోపదేవుడనే వ్యక్తి రాసినాడని తెలియవస్తున్నది. దేవీ భాగవతాన్ని ఆధునిక కాలంలో పద్ధెనిమిది పురాణాల్లో ఒకటిగా చేర్చారు.

6: నారదీయ పురాణం: నారదీయ పురాణం చివరలో ‘ఈ పురాణమును గోవులను చంపువారు, దేవ దూషణ చేసేవారి ముందు చదువరాదని’ పేర్కొన్నారు. దీంతో మహమ్మదీయులు మాత్రమే గోవులను చంపువారు కాబట్టి.. ముస్లింల దండయాత్ర జరిగిన తరువాతి కాలంలోనే అంటే..16 లేదా 17 వ శతాబ్దంలో ఈ రచన చేసి ఉంటారు.

7. మార్కండేయ పురాణం: మార్కండేయ పురాణానికి ఒక తేదీ అని చెప్పడానికి వీలుకాదు. ఇది ఇటీవలిదని చెప్పడానికి సందేహించాల్సి వస్తున్నది, బ్రహ్మ నారదీయ పురాణాలకంటే చాలా ప్రాచీనమైంది. మతశాఖల పక్షపాతం లేదు కాబట్టి భాగవతం కంటే పాతది కావచ్చు. అదే సమయంలో పురాణ లక్షణాలను కొన్నింటిని మాత్రమే చెప్పారు కాబట్టి.. కథలు, సంప్రదాయాలను చేర్చుకొనే స్వభావమున్నందున అతి ప్రాచీనమని చెప్పడానికి వీలు లేదు. తొమ్మిది లేదా పదో శతాబ్దంలో రచించి ఉండవచ్చని ఊహించవచ్చు.

8. అగ్నిపురాణం: మన శకం (అంటే క్రీస్తుశకం..) ప్రారంభమైన చాలా కాలం తరువాత రాసి ఉండవచ్చు.

9. భవిష్య పురాణం: ఈ పురాణం భవిష్యత్ విషయాలను గురించి చెప్తుంది. మత్స్య పురాణం దీని గురించి ప్రస్తావించింది. కానీ ఇలాంటి గ్రంథం ఉంటుందన్నది సందేహాస్పదమే.

10. బ్రహ్మ వైవర్తపురాణం: ఇది పాతదని చెప్పడానికి అవకాశమే లేదు.

11. వరాహ పురాణం: ఇది బహుశా 12వ శతాబ్దం ఆరంభం నాటి రామాయణ కాలాన్ని సూచించవచ్చును.

12. స్కాంద పురాణం: ఈ పురాణంలోని కాశీఖండం.. గజినీ  మహమ్మద్ కాశీ దండయాత్రకు పోలి ఉండటం వల్ల ఇటీవలి కాలానిదేనని నమ్మాలి.

13. వామన పురాణం: పురాతనమని చెప్పడానికి తగిన వాసనలేవీ ఈ పురాణానికి లేవు. ఇది ఇటీవలి కాలానికి చెందినవే. మూడునాలుగు శతాబ్దాల కింద.. ఓ కాశీ పండితుడు ఏదో తన ఆనందంకోసం రాసి ఉండవచ్చు.

14: కూర్మ పురాణం: ఈ పురాణాన్ని రాసిన కాలం ఎక్కువ దూరంలో లేదు. 

15: మత్స్య పురాణం: ఇది ప్రాచీనమైంది కాదు.

16: గరుడపురాణం: అసలు గరుడపురాణం ఉన్నదనటమే సందేహాస్పదం.

17. బ్రహ్మాండపురాణం: ఇది అసలు న్యాయమైన పురాణాల్లో భాగంగా అంగీకరించడానికి వీలేలేదు.

18. లింగపురాణం: ఇది పాతదని చెప్పడానికి అవకాశం లేదు. చాలా ఆధునిక కాలంలో రాశారు.

ఇవన్నీ విల్సన్ దొరవారు తమ పురాణాల పుస్తకంలో రాసిన మాటలు. ఈయన ఏదోవిధంగా అన్ని పురాణాలను తిరస్కరించాడు. తాను ఈ పుస్తకం రాసిన నాటికి సుమారు రెండుమూడు వంద ఏండ్లకు ముందు మాత్రమే పుట్టుకొచ్చినవిగా చెప్పుకొంటూ వచ్చాడు. వీటిలో దేనికి కూడా (విష్ణుపురాణాన్ని ఎందుకో వదిలిపెట్టాడు) పురాతనమైనది అని చెప్పడానికి హేతువు ఏదీ లేదని చెప్పుకుంటూ వచ్చాడు. కొన్నింటిని పురాణాలే కాదన్నాడు. ఇంతకు ముందు చెప్పినట్టు నారదీయ పురాణంలో గోవధ ప్రస్తావన ఉన్నది కాబట్టి.. గోవులను చంపేవారు ముస్లింలేనని నిర్ధారించి.. ముస్లింల కాలానికి ఆ పురాణాన్ని తీసుకొని పడేశాడు. అన్నింటికంటే విచిత్రమైంది.. విడ్డూరమైంది మరొకటున్నది. వరాహ పురాణం 12వ శతాబ్దంలో రాశారని చెప్పాడు. అక్కడితో ఆగితే బాగుండేదేమో.. కానీ దొరవారు.. ఈ వరాహ పురాణకాలంలోకి (తాను నిర్ధారించిన) రామాయణ కాలాన్ని కూడా లాక్కొచ్చిపడేశాడు. రామాయణం క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం ఆరంభంలో జరిగిందని, ఆ కాలాన్ని ఇది ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్నాడు. దీనికి విల్సన్ దొరవారి ప్రాతిపదిక ఏమిటో అర్థం కాదు. బ్రిటిష్ వాడు తమ నాగరికతకంటే ఇతర జాతులవారి నాగరికతలు తక్కువ చేయడానికి.. నీచంగా చూపించడానికి చేయాల్సినన్ని ప్రయత్నాలు చేశాడు. పాశ్చాత్య పండితుల పరిశోధన ధోరణి అంతా ఈ దిశగానే సాగింది. కానీ మన జాతివారు ఆ ప్రయత్నాలను తిప్పికొట్టి మన చరిత్రను పునర్నిర్మించాల్సిన బాధ్యతను విస్మరించలేదు. కానీ, మనవారి గొంతును అధికారంలోవున్న పరాయివారు, వారికి అండగా నిలిచిన మనవారూ నొక్కివేశారు. నిజాలను చెప్పే స్వరాలు ఎవరికీ వినబడకుండా, వినబడ్డా అవహేళనకు గురయ్యేట్టు చేశారు.. వాస్తవానికి భారతయుద్ధానికి చాలాకాలం క్రితమే వ్యాసుడు ఈ పురాణాలను చెప్పాడు. సృష్టి ప్రారంభమైనప్పటినుంచి కాల పరిణామ క్రమంలో జరిగిన అనేక ముఖ్యాంశాలను ఇందులో ప్రస్తావించాడు. విఖ్యాత చరిత్రకారుడు కోట వెంకటాచలం గారి విశ్లేషణ ఒకసారి చదవండి. ‘ఈ కాలమునకు మానవ చరిత్రను వ్రాయు సంకల్పముతో మన వేదశాస్త్ర పురాణేతిహాసాది వాఙ్మయమును మొట్ట మొదట పరిశోధింప మొదలిడినవారు పాశ్చాత్య విద్వాంసులు. మన గ్రంథ సముదాయమును బఠింపమొదలిడు నాటికి వారి మనములందు రూఢములైయుండిన భావములకనుగుణంగా మన గ్రంథములు లేవయ్యెను. భారతీయ వాఙ్మయమున యిప్పటి సృష్టి ప్రారంభకాలము నూట తొంబదియైదు కోట్ల సంవత్సరములకు మించి యుండెను. వారు దానిని జీర్ణింపజేసుకొనలేకబోయిరి. వారి మతగ్రంథమైన బైబిలు ప్రకారం వారు తెలిసికొని రూఢీగా నమ్మియుండిన సృష్టి కాలము ఆరువేల సంవత్సరములకు తక్కువగా నుండెను. రెంటికిని బోలిక యెక్కడను గనుపట్టకుండెను. తమ మతగ్రంథములోని సృష్టికాలము తప్పని చెప్పుటకు వారికిష్టముగాకుండెను. వారి సృష్టి కాలమునకు భారతవర్షములో వైవస్వత మన్వంతరమున 28వ మహాయుగములోని ద్వాపరాంత సంధియందు చంద్రవంశంలోని కురువంశ సంభూతుడును, పాండురాజు, ధృతరాష్ర్టులకు పితామహుడును, భీష్ముడికి తండ్రియైన శంతనమహారాజు రాజ్యం చేస్తున్నట్టు పురాణములలో చెప్పబడియుండుటయే గాక, వైవస్వత మన్వంతర ప్రారంభమునుండియు చెప్పబడియుండుటయు, అంతకు పూర్వము సృష్ట్యాది నుండియు రాబడిన రాజవంశ పరంపరలను జెప్పబడి యుండుట జూచి వానిని మనస్సున పట్టించుకొనుటకసమర్థులైనందున మతి చెడినవారై వానినెట్లయినను ద్రోసివేయ మార్గమన్వేషించ మొదలిడి.. వానినన్నింటినీ అతిశయోక్తులనిరి. అనాగరికుల అంధ విశ్వాసమనిరి. కవి కల్పితములనిరి. ప్రక్షిప్తములనిరి. వ్యాస విరచితములు కావనిరి. నిన్నమొన్న రాసినవని అనిరి. వాటి ప్రమాణమును నిరసించుతూ త్రోసివేయజూచిరి’ భారతదేశంలో అత్యంత ప్రామాణికుడైన గొప్ప చరిత్రకారుడు, పరిశోధకుడు.. అయిన కోట వెంకటాచలంగారి మాటలివి. న్యాచురల్‌గానే ఈ తరం హేతువాదులకు ఇవి ఎలాగూ నచ్చవు. తిప్పికొడితే ఓ ఐదొందలేండ్ల క్రితం కండ్లు తెరిచి..తమను తాము సూపర్ ఇంలెక్చ్యువల్స్‌గా ప్రకటించుకొని.. ఈ ప్రపంచంలో తమకు తెలిసినవి మాత్రమే సత్యాలని.. మిగతావన్నీ అసంగతాలని తిరస్కరించారు. వీళ్ల తెలివి ఏపాటిదంటే.. అనాదిగా ఉన్న వేదాలను పశువుల కాపర్లు అప్పుడప్పుడూ పాడుకొనేవాళ్లని వెక్కిరించారు. క్రీస్తుకు పూర్వం 1400లో భారతయుద్ధం జరిగిందని, ఆ తర్వాతే రామాయణం జరిగిందని చెప్పుకొంటూ వచ్చారు. మన చరిత్రకారులు ఈ మాటల్ని నెత్తినెక్కించుకొని.. ఇదే మన చరిత్ర అంటూ ఊరేగుతారు.

దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉన్నదంటే.. వీళ్లు సృష్టించిన సోకాల్డ్ ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిలైన రాజుల్లో రాముడు, కృష్ణుడు ఉన్నారని నిరూపించడానికి  మహాప్రయత్నమే జరిగింది.  మన చరిత్రను తక్కువచేసి చూపించడానికి ఈ కాలాలను ముందుకు జరిపిన మేధావులు పాశ్చాత్యులే. పరాయోడు నష్టం చేశాడు.. సరే.. మనవాళ్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాతైనా మేలుకొన్నారా అంటే అదీ లేదు. భారతదేశంలో అత్యంత విఖ్యాతమైన జవహర్‌లాల్ యూనివర్సిటీ చరిత్ర ఆచార్యులు రోమిలా థాపర్ ‘ఏన్షియంట్ ఇండియా’ అని ఒక పాఠ్యపుస్తకం రాశారు. పాలుగారే ఆరోతరగతి విద్యార్థుల మెదళ్లలోకి చరిత్రను ఎక్కించడం లక్ష్యంగా రాసిన పుస్తకం ఇది. ఇందులో కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే.. పరస్పర విరుద్ధ అంశాలు ఎన్నో ఈ చిన్న పుస్తకంలోనే చాలాచోట్ల కనిపిస్తాయి. ఇందులో చర్చించుకోదగిన అంశాలు రెండు ప్రధానంగా నాకు కనిపిస్తున్నాయి.

ఇది ఆరోతరగతి ఓల్డ్ సిలబస్ విద్యార్థులకోసం ఎన్సీఈఆర్టీ రూపొందించిన చరిత్ర పుస్తకంలోని అంశాలు.  ఆమె రాసిన హిస్టరీ ఆఫ్ ఇండియా అన్న గ్రంథం మరొకటి ఉన్నది. దానిపై తరువాత చర్చించుకోవచ్చు. ఈ అంశంలో భారతదేశం చరిత్ర, మనిషి పరిణామ క్రమం, సింధులోయ నాగరికత, ఆర్యుల దండయాత్ర, అశోకుడు.. ఇలా చరిత్ర పాఠాలను థాపర్ రాశారు. భారతదేశంలో అతి పురాతనమైన నగరం మొహంజొదారో అని చెప్పారు. ఇందులోని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తే ‘సింధ్ ప్రాంతంలోని సింధు నదీతీరంలో ఈ నగరం ఉన్నది. సింధులోయలోనే మరో నగరం హరప్ప. ఈ నాగరికత పైన సింధ్, బలూచిస్తాన్ నుంచి కింద పంజాబ్ తూర్పు, పడమర.. ఉత్తర రాజస్థాన్, కథియావార్, గుజరాత్ దాకా విస్తరించింది. ఇక్కడి ప్రజలకు రాయడం తెలుసు, వీరికి చిత్రలిపి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తూ చరిత్రకారులు ఈ లిపిని చదువలేకపోయారు. నైలునది, టిగ్రిస్ వంటి నదీతీరాల్లో నాగరికత విలసిల్లిన టైవ్‌ులోనే హరప్పా నాగరికత కూడా అభివృద్ధి చెందింది. సుమారుగా క్రీస్తు పుట్టడానికి 4500 సంవత్సరాల క్రితం ఈ నగరం ఉన్నది. ఈజిప్టులో అభివృద్ధి చెందిన సుమేరియన్లతో హరప్పా ప్రజలు వ్యాపారం చేశారు. రాజస్థాన్‌లో ఇప్పటిలాగా ఎడారి లేదు. వీళ్లు అత్యద్భుతమైన నగరాలను నిర్మించారు. భవంతులను నిర్మించారు. ఇండ్ల నిర్మాణానికి ఇటుకలు తయారుచేశారు. ఇండ్ల కోసం కలపను కూడా వాడారు. చాలా ఆకర్షణీయమైన భవనాల నిర్మాణం జరిగింది. అద్భుతమైన వ్యవసాయం చేశారు. లోహాల నుంచి ఆభరణాలను తయారుచేసుకోవడం వీరికి తెలుసు. వ్యవసాయోత్పత్తులను ఓడల ద్వారా ఇతర దేశాలకు రవాణాచేసేవారు.’  ఇది స్థూలంగా సింధులోయ నాగరికతకు సంబంధించిన రోమిలా థాపర్ వివరణ.

ఇంత గొప్ప నాగరికత.. దాదాపు వెయ్యేండ్లపాటు వర్థిల్లిందని ఈ పుస్తకంలోనే చెప్పారు. ఇలాంటి నాగరికత ఎలా అంతమయ్యిందయ్యా అంటే.. థాపర్ చెప్పిన మాటలివి. ‘భారతదేశ చరిత్రలో సింధునాగరికత అంతం కావడం అత్యంత విషాద సన్నివేశం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు భారతదేశానికి వలస వస్తున్న సమయంలోనే సింధు నాగరికత అంతమైంది. ఇది ఎలా అంతమైందంటే.. వరదల వల్ల కావచ్చు. ఏదైనా తీవ్రమైన అంటువ్యాధి ప్రబలి యావత్ సింధులోయ సమాజం అంతరించి ఉండవచ్చు. లేకపోతే వాతావరణంలో మార్పు కారణంగా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఎడారిలా మారిపోయి హరప్పా, మొహంజొదారో నగరాలు అంతమై ఉండవచ్చు. లేకపోతే ఎవరైనా ఈ నగరాలపై యుద్ధం చేయడం వల్ల అంతమై ఉండవచ్చు.’ ఇది ఈ నాగరికత అంతానికి మన చరిత్రకారులు విశ్లేషించిన కారణాలు.

సాధారణంగా ఎక్కడైనా పురాతత్త్వ పరిశోధనలు జరిగినప్పుడు ఒక ఎముక దొరికితేనే.. ఆ ఎముక కలిగిన వ్యక్తి ఆడా, మగా.. ఎన్నేండ్ల వయసులో చనిపోయారు.. ఎలా చనిపోయారన్న విశ్లేషణ చేస్తున్నారు కదా.. మరి సింధులోయలో హరప్పా మొహంజొదారో నగరాలు అంతమైతే ఎలా అంతమైనాయో ఇన్నేండ్లయినా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆ మధ్య అక్కడ రేడియేషన్ ఎఫెక్టులు ఇప్పటికీ కనిపిస్తున్నాయని రష్యా శాస్త్రవేత్తలు ఒక వ్యాసం రాశారు. కనీసం దీనిపైనైనా పరిశోధన చేయాలి కదా.. ఒక సమాజం అంతానికి వీలు కలిగించే అన్ని కారణాలనూ ఒకదాని వెంట ఒకటి రాసి పడేసి ఈ కారణాలన్నింటిలో ఏదైనా కావచ్చని ఆరోతరగతి పిల్లవాడికి చెప్తే వాడి మెదడు చిట్లక మానుతుందా? చరిత్రను విశ్లేషించే పద్ధతి ఇలాగే ఉంటుందేమో ఆధునిక చరిత్రకారులు చెప్పాలి. వాతావరణంలో మార్పువల్ల ఆ ప్రాంతం ఎడారిగా మారి ఉంటుంది అని మరోవాదన. మనకు ప్రస్తుత కాలంలో కనిపిస్తున్న థార్ ఎడారి రాజస్థాన్‌లోనే ఉన్నది. ఘగ్గర్ నది ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతం ఎడారిగా మారిందని చెప్తారు. నిజమే కావచ్చు. కానీ.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి.. క్రీస్తుకు పూర్వం నాలుగువేల నుంచి పదివేల సంవత్సరాల మధ్యలో ఏర్పడినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తారు. కానీ ఆధునిక కాలంలో మొహంజొదారోకు లింక్ చేయడం కోసం మరో కథనాన్ని పుట్టించి థార్ పుట్టుక కాలాన్ని క్రీపూ వెయ్యి నుంచి 1900 మధ్యకు లాక్కొని తెచ్చిపెట్టారు. ఎందుకంటే బైబిల్ లెక్క ప్రకారం క్రీస్తుకు పూర్వం 4500 సంవత్సరంలో ప్రళయం వచ్చింది. కాబట్టి అంతకుముందు చరిత్ర చెప్పడానికి వీల్లేదు. అందువల్ల మొహంజొదారో నాగరికతను క్రీపూ నాలుగువేలకు జరిపితే మరింత పురాతనమయ్యే అవకాశముంటుంది. అందుకే.. మొహంజొదారో క్రీపూ 2500 ముందుకు  వచ్చింది. 1500 కు ఆర్యులు వచ్చారు. సరస్వతి నది 1500 లో ఎండిపోయింది.  థార్ ఎడారీ 1500 లో ఏర్పడింది. ఇదీ సీక్వెన్స్..

ఇందులోనే మరో అనుమానం. హరప్పా మొహంజొదారో ప్రజలకు రాయడం తెలుసని రోమిలాథాపర్ చెప్పారు. చిత్రలిపి ఉన్నదనీ అన్నారు. కానీ దురదృష్టవశాత్తూ మన చరిత్రకారులు దాన్ని చదువలేకపోయారట. చైనాలోని క్లాసిక్ చిత్రలిపి భేషుగ్గా అర్థమవుతుంది. మనది మాత్రం అర్థం కాదు. పోనీ.. మొదట్లో తెలియలేదనుకొందాం. అప్పటి చరిత్రకారులకు అర్థం కాలేదని అనుకొందాం. కానీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సింధులోయలో లభించిన లిపిపై పరిశోధన జరిగింది. డాక్టర్ ఎన్‌ఎస్ రాజారాం ఈ లిపిని డీకోడ్ చేశారు. సంస్కృతానికి దగ్గరగా ఉన్నదని కూడా తేల్చారు. ఆ తరువాతైనా దీనిపై పరిశోధన జరపాల్సి ఉండింది కదా.. దీన్ని ఎందుకు అంగీకరించలేదు? మన ప్రాచీన చరిత్రను, మూలాలను అన్వేషించడంలో భేషజాలు ఎందుకు ఉండాలి? మన బేసిక్స్ మనకు గర్వకారణం కాదా? ప్రేరణ కాదా? 

ఇదే పుస్తకంలో మరో అంశం ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం. దీనికి సంబంధించి రోమిలా థాపర్ ప్రతిపాదించిన కొన్ని అంశాలు చూద్దాం. ‘మొహంజొదారో అవశేషాలు బయటపడేంతవరకూ కూడా భారత చరిత్ర ఆర్యుల దండయాత్రతోనే మొదలైందని భావిస్తూ వచ్చాం. ఆర్యులు భారతదేశం అవతలి ప్రాంతాలనుంచి అంటే ఇరాన్‌కు ఈశాన్య ప్రాంతం నుంచి కాస్పియన్ సముద్రం గుండా వచ్చి భారత్‌లో సెటిల్ అయ్యారు. ముందుగా పంజాబ్‌లో వీళ్లు స్థిరపడ్డారు. తరువాత ఢిల్లీ దాకా వలసవెళ్లారు. నాలుగు వేదాలు వీళ్లే రాసుకొన్నారు. సరస్వతి నదీతీరంలో నాగరికతను అభివృద్ధి చేసుకొన్నారు. సింధు నాగరికతతో వీళ్లకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్లు భారత్‌కు వచ్చిన తొలిరోజుల్లో ఎలాంటి నగర నిర్మాణాల గురించి తెలియదు. తరువాత నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందారు. వీళ్లు అద్భుతమైన నగరాలను నిర్మించడానికి తర్వాత కనీసం వెయ్యి సంవత్సరాలు పట్టింది. వ్యవసాయం చేశారు. వ్యాపారం చేశారు. నగరాలను కూడా నిర్మించడం మొదలుపెట్టారు. మొత్తంమీద భారతదేశానికి ఒక చరిత్రనంటూ సృష్టించారు.’ ఇదీ రోమిలా థాపర్ ఆర్యుల దాడి గురించి రాసిన మాటలు..

ఇందులోనూ మళ్ళీ కొన్ని అనుమానాలు పుట్టుకొస్తాయి. ఆర్యులు అనేవారు ఇరాన్‌లోని ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చారని థాపర్ రాశారు. హరప్పా మొహంజొదారో నాగరికత క్రీపూ. 1500 సంవత్సరంలోనో.. దరిదాపుల్లోనో అంతమైంది. (రకరకాల కారణాల వల్ల).. వాతావరణ మార్పు వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారిపోయిందన్నది ఒకానొక సిద్ధాంతం. సింధు నాగరికత పైన బలూచిస్తాన్ నుంచి కింద గుజరాత్ వరకు విస్తరించింది కదా.. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారిందా? కేవలం షుగ్గర్ నది ఇంకిపోయిన ప్రాంతమే ఎడారిగా మారిందా? ప్రస్తుతం మనకు కనిపిస్తున్న థార్ ఎడారి ప్రాంతం మాత్రమే సింధునాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతమా? ఎందుకంటే.. సింధునాగరికత అంతం.. భారత్‌కు ఆర్యుల రాక ఇంచుమించు ఒకేసారి జరిగిందని థాపర్ కానీ.. అంతకుముందు చరిత్రకారులందరి వాదన. ఈ ఆర్యులకు సింధు నాగరికతతో ఎలాంటి పరిచయం ఎందుకు లేదన్నది ప్రశ్న. ఇరాన్ నుంచి భారత్‌వైపు రావాలంటే.. ఎక్కడైతే సింధు నాగరికత అభివృద్ధి చెందిందో ఆ ప్రాంతం దాటకుండా రావడానికి ఎంతమాత్రం వీలులేదు. ఒకసారి గూగుల్ మ్యాప్‌ను చూస్తే గూగుల్ తల్లి ఇదే చెప్తుంది. కానీ.. ఇరాన్ నుంచి భారత్‌కు వలసవచ్చినారంటున్న ఆర్యులకు అప్పుడప్పుడే అంతమవుతున్న, మైన సింధు నాగరికత ఆనవాళ్లైనా కనిపించలేదా?

రెండో అనుమానం ఏమిటంటే.. ఈజిప్టులోని సుమేరియన్లతో హరప్పా, మొహంజొదారో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాపారం చేశారని థాపర్ ఇదే పుస్తకంలో పిల్లలకు పాఠం చెప్పారు. సంతోషం. ఈ వ్యాపారులు సుమేరియన్‌కు ఎట్లా వెళ్లారన్నది ప్రశ్న. మధ్యలో ఇరాన్ తగలకుండా పోవడం సాధ్యం కాదు. భూమార్గంలో వెళ్తే కచ్చితంగా ఇరాన్ మీదుగా వెళ్లాలి.. సముద్రమార్గం ద్వారా వెళ్లాలన్నా ఇరాన్ సరిహద్దులను తాకుతూనే వెళ్లాలి. ఇంత పెద్ద వ్యాపారం చేసినవారికి ఇరాన్‌లో ఉన్నారని చెప్తున్న ఆర్యులు ఎప్పుడూ తగులలేదా? వారితో హరప్పా ప్రజలు వ్యాపారం చేయలేదా? ఇరాన్‌లో ఉన్న సదరు ఆర్యులకు సింధు సమాజం గురించి తెలిసే అవకాశమే లేకుండా పోయిందా?

ఆర్యులు వచ్చిన తర్వాత మొట్ట మొదట పంజాబ్‌లో స్థిరపడ్డారని రోమిలా థాపర్ రాశారు. పంజాబ్ తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో సింధు నాగరికత అభివృద్ధి చెందిందని కూడా ఆమే అంతకుముందు పాఠంలో చెప్పారు. ఆర్యులు పంజాబ్ వచ్చేసరికి అక్కడ ప్రజలు లేరా? వారు సింధు నాగరిక సమాజానికి చెందిన వారు కాదా? వారే అయితే.. ఆర్యులు తిరిగి అద్భుత నిర్మాణాలు చేపట్టడానికి వెయ్యేండ్లు ఎందుకు పట్టింది?.. అప్పటికే సింధు ప్రజలు అద్భుతమైన భవనాలు.. నగరాలు నిర్మించారని చెప్పుకుంటున్నాం కదా. కొత్తగా వీరు ఆయుధాలు, పనిముట్లు, వ్యవసాయం వంటివి కనిపెట్టడం ఎందుకు అవసరమైంది. అంటే పంజాబ్‌లో ఆర్యులు వచ్చినప్పుడు అది ఎడారిగా మారి ఉండి ఉండాలి. ఆ ఎదారిలోకి  వీరు వచ్చి ఆ ప్రాంతాన్ని అత్యాధునిక వ్యవసాయక్షేత్రంగా మలచి ఉండాలి. ఏమో మరి.!!!!. .

వాతావరణంలో మార్పుల కారణంగా షుగ్గర్ నది అలియాస్ సరస్వతి నది ఇంకిపోవడం వల్ల ఆ ప్రాంతం అంతా ఎడారిగా మారి సింధు నాగరికత అంతమైందన్నది చరిత్రకారుల వాదన. అలాంటప్పుడు ఆ తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన ఆర్యులనబడేవారు సరస్వతి నదీతీరంలోనే జీవించారని రాశారు. ఆ తరువాత అది ఎండిపోయిందన్నారు. ఈ రెంటిలో ఏది రైటు.. ఏది రాంగు.. ఎవరు చెప్పాలి?

క్రీస్తుపూర్వం 1500లో ఆర్యులు వచ్చారని వీరే చెప్తారు. వచ్చేనాటికి వీరికి నగర జీవితం గురించి తెలియనే తెలియదు.. తెలుసుకోవడానికి కనీసం వెయ్యేండ్లు పట్టిందనీ వీరే చెప్తారు. కానీ క్రీస్తు పూర్వం 1400 (ఆర్యులు వచ్చిన వందేండ్లకే) సంవత్సరం లో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని లెక్కలు చెప్తారు. నగరజీవితం గురించి ఎంతమాత్రం తెలియని ఆర్యులు ఇక్కడికి వచ్చిన వందేండ్లకే కురు మహాసామ్రాజ్యం స్థాపించి.. మహాసంగ్రామం చేశారా. మహా మారణ హోమం జరిగిందా?

ఈ చరిత్రను ఏ సిరాతో రాశారో.. అంతుపట్టని సందేహాలు.. జవాబులు లేని ప్రశ్నలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here