రామం భజే శ్యామలం-16

0
11

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్య నేను ఓ క్యాంటిన్‌కు వెళ్లా.. రాత్రి కావడంతో పెద్దగా కస్టమర్లు లేరు. బేరర్‌కు ఏదో ఆర్డర్ ఇచ్చి కూర్చొన్నా. కాసేపటికి ఆర్డర్ తెచ్చిచ్చిన బేరర్.. బేరాలేవీ లేకపోవడంతో నా ఎదురుగా ఉన్న సీట్లో కూర్చొని మాటలు కదిపాడు. ముందుగా మీదే వూరు సర్.. అన్నారు. నేను క్యాజువల్‌గా మాది వరంగల్ అని చెప్పా. వరంగల్ అసలుపేరు ఏమిటో మీకు తెలుసా సర్ అన్నాడు. నాకు తెలియదు.. నువ్వు చెప్పు అన్నా.. అప్పుడు అతను చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు.

‘సర్..వరంగల్ అసలుపేరు ఔరంగాబాద్. ఔరంగజేబ్ మొదలు ఆ ఊరు కడితే కాకతీయ రాజు వచ్చి వరంగల్ చేసినాడు. గోల్కొండ కోట వాళ్లే కట్టారు. ఢిల్లీ రాజుమీద యుద్ధ చేసింది ఎవరనుకొన్నారు.. ఝాన్సీరాణి. ఆమె పుట్టింది ఎక్కడనో తెలుసా? కన్యాకుమారిలో. అక్కడి నంచి ఆమె ఢిల్లీ రాజు మీదకు యుద్ధానికి పోయింది. మధ్యలో మహారాష్ర్ట వచ్చినప్పుడు ఒక పొల్లగాడు తగిలినాడు. అతని పేరు శివాజీ.. ఇద్దరూ కలసి ఢిల్లీ రాజు మీద యుద్ధం చేసినారు.. ఢిల్లీ రాజు వీళ్లను ఓడించినాడు. వీరపాండ్య కట్ట బ్రహ్మన్న ఎవరో తెలుసా.. ఆణ్ణి మించినోడు దేశంలోనే లేదు.. బ్రిటిషోణ్ణి పిలిచి.. అరే.. ఉరి వెయ్యరా..  అని వాడే ఉరేసుకొన్నాడు……’ ఇలా చరిత్ర ప్రసంగ పరంపర నిరాఘాటంగా కొనసాగుతూనే ఉన్నది. నేనే నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డా. ఇదంతా చూస్తే ఏదో జంధ్యాల సినిమాలో సీన్‌లా అనిపించింది.

కానీ.. ఈ మధ్య చరిత్ర పుస్తకాలను అధ్యయనం చేస్తుంటే.. మన సోకాల్డ్ చరిత్రకారుల తీరు ఇలాగే కనిపించింది. వాళ్లు ఎవరినైతే ప్రమోట్ చేయాలనుకొన్నారో.. ఎవరికైతే మార్కెటింగ్ చేయాలనుకొన్నారో.. వారి జీవితాలను వైభవోజ్వల ఘట్టంగా చెప్పుకొచ్చారు. కానివాళ్లను, కాదనుకొన్నవాళ్ల చరిత్రలను చరిత్రే కాదు పొమ్మన్నారు. మిథ్య అన్నారు. అంతగా చెప్పాల్సి వస్తే.. వక్రీకరించారు. అడ్డగోలు వ్యాఖ్యానాలు చేశారు. అడ్డదిడ్డంగా కథనాలు అల్లారు. వ్యక్తిత్వ హననం చేశారు. వారి చరిత్ర కాలాన్ని ఇష్టమొచ్చినట్టు మార్చేశారు.

ఈ వక్రీకరణకు కేంద్రబిందువులుగా నిలిచింది మార్క్సిస్టు, ఇస్లామిస్ట్ చరిత్రకారులు. వారి ప్రధాన లక్ష్యం ఈ దేశంలో వేల ఏండ్లుగా ఆరాధనీయుడుగా.. ఆదర్శపురుషుడుగా పూజలందుకొంటున్న రాముడి చరిత్రను నామరూపాలు లేకుండా చేయడం. అదేసమయంలో రాముడికి సమాంతరంగా మరొకరాజును తెచ్చి సింహాసనంపై కూర్చోబెట్టడం, రాముడికి ప్రత్యామ్నాయంగా ఆరాజును ప్రజల హృదయాలలో సుస్థిరంగ నిలపటం, రాముడు, రామాయణం ప్రాధాన్యాన్ని దెబ్బతీయటంద్వారా ఈదేశ ధార్మిక అస్తిత్వాన్ని సమూలంగా తుడిచిపెట్టి కొత్త రూపు సృష్టించటం… ఇందుకోసం వారు రాయని రాతలు లేవు.. చేయని వ్యాఖ్యానాలు లేవు. రాముడిని భారతీయుల మనసుల్లోంచి చెరిపేయడానికి వారికి దొరికినవాడు అశోకుడు. అంతే.. అశోకుడ్ని మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే.. లక్షమందిని నిర్దాక్షిణ్యంగా చంపినా సరే అతనికంటే ఘనుడైన రాజు అతనికి పూర్వం, కానీ తర్వాత కానీ లేరని ప్రచారం చేశారు.

రామాయణం విషయంలో వీళ్లు చేసిన సూత్రీకరణలు కొన్ని..

౧. అయోధ్య అన్నది లేనేలేదు. అది ఒక బౌద్ధ క్షేత్రం

౨. రామాయణమే మిథ్య అది చరిత్రకాదు.. పుక్కిటి పురాణం

౩. భారతం తర్వాత రామాయణం జరిగింది

౪. రాముడు దుర్మార్గుడు..రావణుడు సద్గుణ సంపన్నుడు. సీతను ఎత్తుకుపోవడం తప్ప అతను చేసిన పొరపాటేమీ లేదు.

౫. క్రీస్తుపూర్వం ౧౨ శతాబ్దపు ఆరంభంలో రామాయణం జరిగింది

౬. రామాయణం సీతారాములు.. రావణుడి కథకాదు. ఉత్తరభారతదేశపు వ్యవసాయం చేసేవారికి.. దక్షిణ భారతంలో ఆహార అన్వేషణ చేస్తూ జీవించే జాతుల మధ్య జరిగిన యుద్ధం.

౭. ఆర్యులు ద్రావిడులపై చేసిన దుర్మార్గపు యుద్ధం

౮. రాముడు దళిత ద్వేషి. అన్యాయంగా శంబూకుడనే దళితుడిని హతమార్చాడు

౯. సొంత భార్యనే అడవులకు వెళ్లగొట్టినవాడికి నైతికత ఏమున్నది?

౧౦ ప్రపంచంలో తొలి యాసిడ్ దాడి శూర్ఫణకపైనే జరిగిందని భావించాలి.

౧౧. రాముడు ఏకపత్నీవ్రతుడు కాదు.. నలుగురు భార్యలున్నారు.

౧౨. అసలు రామాయణం అన్నది భారతదేశంలో జరుగనే లేదు.. ఏ ఇండోనేషియాలోనో జరిగింది

౧౩. ఇంతకీ రాముడికి సీత ఏమవుతుంది?

ఇట్లా ఎన్నెన్నో రాతలు రాశారు. వ్యాఖ్యానాలు చేశారు. రాముడి పేరెత్తితేనే శివాలూగిపోయేవారు ఇవాళ్టికీ ఉన్నారు. రామాయణాన్ని తిడితే.. రాముడిని ఏకిపారేస్తే నేను చాలా సంతోషిస్తానంటూ గర్వించే మహానుభావులు.. మహాకవులమని చెప్పుకొనేవారూ ఉన్నారు. రామయణంలో లేనివన్నీ సృష్టించి, తమ కుళ్ళునంతా రామయణానికి ఆపాదించి అవేనిజమని నమ్మించి రామాయణమంత ఘోరమయిన రచన, ఘోరమయిన ఆదర్శం, ఘోరమయిన సమాజం మరొకటిలేదని, దాన్ని నమ్మేవారు మూర్ఖులని నిరూపించాలని సాహిత్యంతో సహా ప్రతి మాధ్యమాన్ని వాడుకుంటున్నారు.

మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ దేశంలో రాముడిపై జరిగినంత దాడి, దుష్ర్పచారం, దుర్వ్యాఖ్యానం.. కృష్ణుడిమీదనో.. ఇతర పౌరాణిక వ్యక్తులపైనో.. జరుగలేదు. కారణం రాముడు వేల సంవత్సరాలుగా కోట్లాది భారతీయుల నాలుకలపై నర్తిస్తున్న మంత్రం కాబట్టి. ఇంత దాడి చేసినా.. రాముడిని భారతీయుల హృదయ ఫలకంనుంచి చెరిపివేయడం సాధ్యం కాలేదు.

సరే.. మన సోకాల్డు చరిత్రకారులు చెప్పిందే కొద్దిసేపు విందాం. వాళ్ల వాదనల్లో మొట్టమొదటిది రామాయణం చరిత్రకానే కాదు. రాముడు అనేవాడు లేనేలేడు. అంతా మిథ్య. చరిత్ర కానప్పుడు మన దేశస్థులు ఇన్ని వేల సంవత్సరాలుగా రాముడిని చారిత్రక పురుషుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఇది మొదటి ప్రశ్న.

రామాయణాన్ని ఇతిహాసమని పేర్కొన్నారు కదా.. ఇతిహాసమంటే అర్థం నాకు తెలిసినంతవరకు.. సరళంగా ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఇలా జరిగింది’ అని అర్థం. జనరల్‌గా ఒక ఘటన జరిగింది. కొన్ని ఘటనలు జరిగాయి. ఈ ఘటనల సమాహారమే కదా చరిత్ర అంటే.. మరి ఇతిహాసాన్ని చరిత్ర కాదనడంలో అర్థమేమున్నది? పండితులెవరైనా చెప్పాలి.

పోనీ ఎవరైనా బుద్ధి తక్కువై ఇతిహాసమని ప్రచారం చేశారని కొద్దిసేపు అనుకొందాం. రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి (ఈ రామాయణాన్ని ఒరిజినల్‌గా రాసిన రచయిత) ఎవరిదైనా కథ రాయాలని అనుకొన్నాడట. ఈ భూమ్మీద చాలా చాలా గొప్పవాడైన వ్యక్తి గురించి ఈ కథ ఉండాలని కోరుకొన్నాడు. అలాంటివాడు ఎవరున్నాడని.. తనలాగే మరో తపఃశాలి అయిన నారదుడిని అడిగాడు. బాలకాండలోని మొదటి శ్లోకాల సారాంశం యథాతథంగా కొంచెం ఓపిగ్గా చదవండి. ‘దేవర్షీ భూలోకంలో ఈనాడు మంచి గుణములూ, గొప్ప పరాక్రమము కలవాడు, ధర్మము తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కు మరియు దృఢమైన సంకల్పము కలిగినవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు? మంచి నడవడిక కలవాడు, సర్వ ప్రాణులకు హితము చేయువాడు, విద్వాంసుడు, అసాధ్యములైన కార్యములు కూడా సాధించు సామర్థ్యము కలవాడు, తనను చూచువారికి అందరికీ ఒకే విధముగా ఆనందము కలిగే రీతిలో కనబడువాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు? ధైర్యము కలవాడు, కోపమును జయించినవాడు, ప్రశస్తమైన కాంతి కలవాడు, అసూయ లేనివాడు అయిన మహాత్ముడు ఎవడున్నాడు. ఎవరు యుద్ధములో కోపము వచ్చి నిలిచినచో చూచి దేవతలు కూడా భయపడతారు? మహర్షీ.. ఇట్టి గుణములున్న మనుష్యుని గూర్చి తెలుసుకొనుటకు నీవు సమర్థుడవు.. నేనీ విషయమును వినగోరుచున్నాను’ అని అడిగాడట. వాల్మీకి రామాయణంలోని తొలి ఐదు శ్లోకాల సారాంశమిది. అప్పుడు నారదుడు.. వాల్మీకితో ఫలానా సరయూ నది తీరంలో కోసలరాజ్యమనేది ఒకటి ఉన్నది. దానికి క్యాపిటల్ అయోధ్య అనే నగరం ఉన్నది. దాన్ని ఇక్ష్వాకు వంశస్థులు పాలించారు. అందులో రాముడు అనేవాడు చాలా గొప్పవాడు. లోకమంతా ప్రసిద్ధుడైనవాడు.. అని రాముడి కథను బ్రీఫ్ చేశాడు.

ఇక్కడ వాల్మీకి విస్పష్టంగా భూమ్మీద ఉన్న వాళ్లలో గొప్పవాడెవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఇదిగో ఫలానావాడు ఉన్నాడు.. వాడి కథ అద్భుతమైందని నారదుడు చెప్పుకొచ్చాడు. దీన్ని నువ్వు రాయవయ్యా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాడు. భూమ్మీద ఒక వ్యక్తికి సంబంధించిన కథ రాస్తున్నానని.. ఈ కథకు తనకు ఫలానా వ్యక్తి సోర్స్‌గా పనిచేసినట్టు వాల్మీకి మొదటి పది శ్లోకాల్లోనే వివరణ ఇచ్చుకొన్నాడు. ఒకచోట జరిగిన కథను కావ్యంగా మలచి మనకు అందిస్తే దాన్ని చరిత్ర అనకుండా మిథ్య అని ఎలా అంటాం. అక్బర్ చరిత్రను అక్బర్‌నామా ద్వారానో.. అశోకుడి చరిత్రను రాళ్లు రప్పలపై రాసిన రాతల ద్వారానో ఖరారుచేశారు కదా.. మరి ఒక రచయిత తాను రచనను రాయడానికి ముందే.. ఉపోద్ఘాతంలో తాను ఎవరి గురించి రాస్తున్నాడో.. అది ఎంతవరకు రియలిస్టిక్ క్యారెక్టరో.. ఆ వ్యక్తిత్వం గురించి తనకు ఎవరు చెప్పారో డొంకతిరుగుడు లేకుండానే చెప్పాడు కదా.. దాన్ని చరిత్ర అని అనరాదా? యుద్ధకాండలోని చివరి రెండు శ్లోకాలలో ఇది పూర్వము జరిగిన కథ. దీన్ని చదివినా.. విన్నా చాలా సంతోషంగా ఉంటారు అని ఫలశ్రుతి చెప్పాడు వాల్మీకి.

సదరు రామాయణాన్ని రాసిన రచయితే.. ఇది ఈ భూమ్మీద జరిగిన కథరా నాయనా అని చెప్తుంటే.. కాదు అని అనడానికి ప్రాతిపదిక ఏమిటి? నిజమే..చరిత్ర అంటే అది ఎట్లా అవుతుంది అని నిరూపించాలి. అలాగే కాకపోతే.. కాదు అని అయినా నిరూపించాలి కదా. ఒకసారి జరిగిందని.. మరోసారి జరుగలేదని.. ఇంకోసారి ఇలా జరిగి ఉండవచ్చని అనడంలో అర్థం ఏమిటి?

రామాయణాన్ని వాల్మీకి చరిత్ర అని స్పష్టంగా చెప్పాడు. దీన్ని సహేతుకంగా రామాయణం కాలంతోపాటుగా నిర్ణయంచేసింది. వికిపీడియాలు చూసి.. అందులో జేఎన్‌యూ మేధావులు బౌద్ధుల నగరం అయోధ్య (దానికి ఇంకోపేరేదో చెప్పారు లెండి.. దాని గురించి తరువాత చర్చించుకొందాం.) అని నమ్మితే అంతకంటే మూర్ఖులు ఉంటారని నేననుకోను. ఇందుకు వాల్మీకి రామాయణంలోనే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి.

సరయూ నదీ తీరంలో కోసలదేశం ఉన్నది. ఇందులోని అయోధ్య దీనికి రాజధాని. ౧౨ యోజనాల పొడవు, మూడు యోజనాల వెడల్పు విస్తీర్ణం కలిగిన నగరం అయోధ్య. ఇక్కడ ఒక యోజనం అంటే సుమారు ౧౨ కిలోమీటర్లు ఈ ప్రకారంగా అయోధ్య మొత్తం విస్తీర్ణం ౫౧౮౪ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇంత స్పష్టంగా వాల్మీకి అయోధ్య విస్తీర్ణాన్ని వర్ణించాడు. ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా విస్తీర్ణం ఇందులో బహుశా సగం కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది.

ఈ నగరం జూదమాడే పీటమాదిరి ఆకారంలో ఉన్నదని కూడా వాల్మీకి చెప్పాడు. ఇవాళ్టి అయోధ్య మ్యాప్‌చూస్తే క్యాసినో టేబుల్ మాదిరిగానే గోచరిస్తుంది.

అయోధ్య ఉనికి మనకు ఇంత విస్పష్టంగా వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. అయోధ్యనుంచే సరయూ నది ఉత్తర తీరాన దశరథుడు అశ్వమేథం చేశాడని వాల్మీకి చెప్పాడు. కానీ.. మన చరిత్రకారులు అయోధ్యను బుద్ధుడి కాలానికి తీసుకొచ్చి పడేశారు. బుద్ధుడి కాలం వచ్చేసరికి అయోధ్య రూపురేఖలు మారి ఉండటంలో అనుమానం లేదు. ఎక్కడి త్రేతాయుగం? ఎక్కడి బుద్ధుడు.. ఎక్కడి శ్రావస్థి.. ఎక్కడి సాకేతపురి.. బౌద్ధంలో, జైనంలో పేర్కొన్న అయోజినే అయోధ్య అని మన చరిత్రకారులు వ్యాఖ్యానించారు. వీరికి వాల్మీకి చెప్పిన చరిత్ర రుచించలేదు. ఇవాల్టికీ మీరు గూగుల్ చేస్తే ఈ విషయాన్ని తేలిగ్గానే అర్థంచేసుకోవచ్చు. బౌద్ధ, జైన గ్రంథాల్లో రాసినవాటిని వీరు చరిత్రగా ఖరారుచేస్తారు. వాల్మీకి రాసిన రామాయణాన్ని మాత్రం విశ్వాసంగా మాత్రమే చెప్పి కొట్టిపారేస్తారు. అయోధ్య నగరాన్ని మనువు తన సంకల్పబలంచేత నిర్మించాడని వాల్మీకి రాశాడు. వాల్మీకి మాత్రమే కాదు.. మనకు తమిళంలో కంబ రామాయణంకానీ, తులసీదాస్ రామచరిత మానస్ కానీ అయోధ్య వైభవాన్ని, కోసల రాజ్య వైభవాన్ని అద్భుతంగా వివరించి చెప్పాయి. కానీ మన ఆధునిక చరిత్రకారులు అయోధ్యను బౌద్ధక్షేత్రంగా విలసిల్లిందని చెప్పడానికి బాగానే ప్రయత్నించారు. మన చరిత్రకారులు రాసిన పుస్తకాలను సంగ్రహించిన ఆన్‌లైన్ విజ్ఞాన సర్వస్వం వికిపీడియా ఏం చెప్తున్నదో ఒక్కసారి అవధరించండి. అయోధ్య క్రీస్తు పూర్వం ౬వ శతాబ్దం నుంచి ౫వ శతాబ్దం వరకు బౌద్ధక్షేత్రంగా విలసిల్లింది. దీన్ని ప్రసేనజిత్తు అనేవాడు పాలించాడు. అతనికాలంలో ఈ నగరాన్ని సాకేతపురంగా పిలిచారు.

Archaeological and literary evidence suggests that the site of present-day Ayodhya had developed into an urban settlement by the 5th or 6th-century BC. The site is identified as the location of the ancient Saketa city.. Ancient Buddhist texts, such as Samyutta Nikaya, state that Saketa was located in the Kosala kingdom ruled by Prasenajit (or Pasenadi; c. 6th–5th century BC,) The 2nd century geographer Ptolemy mentions a metropolis “Sageda” or “Sagoda”, which has been identified with Saketa. The earliest inscription that mentions Saketa as a place name is dated to the late Kushan period: it was found on the pedestal of a Buddha image in Shravasti, and records the gift of the image by Sihadeva of Saketa.

ఇక్కడే ఒక సందేహం కలుగుతున్నది. క్రీస్తుకు పూర్వం ఐదో శతాబ్దంలో బుద్ధుడు పుట్టి.. నాలుగో శతాబ్దంలో మహానిర్యాణం పొందాడని మన చరిత్రకారులే చెప్తారు. అలాంటప్పుడు బుద్ధుడు పుట్టడానికి ముందే సాకేతపురం బౌద్ధ క్షేత్రమెలా అయింది.The Buddha (also known as Siddhartha Gotama or Siddhartha Gautama or Buddha Shakyamuni was a philosopher, mendicant, meditator, spiritual teacher, and religious leader who lived in Ancient India (c. 5th to 4th century BCE)He is revered as the founder of the world religion of Buddhism.

రాముడి అయోధ్యను మసిపూసి మారేడుకాయ చేసేందుకు జరిగిన ప్రయత్నంగా దీన్ని భావించాలా? బుద్ధుడు జన్మించాక ఈ సాకేత పురానికి వచ్చివెళ్లాడంటే.. ఓకే.. కానీ.. అంతకుముందే బౌద్ధక్షేత్రంగా ఉన్నదన్న అర్థం ధ్వనించేలా చరిత్రని చెప్పడం విడ్డూరం కాదా?

అయోధ్య అన్నది నిస్సందేహంగా అత్యంత పవిత్ర నగరం. అద్భుతమైన ఆధ్యాత్మిక, రాజధర్మ, సాంస్కృతిక నగరం. ధర్మానికి మూలవిరాట్‌స్వరూపుడైన శ్రీరామచంద్రుడు జన్మించిన నగరం కాబట్టే.. ఆ తర్వాతి కాలంలో బౌద్ధం ఇక్కడ అస్తిత్వాన్ని పొందింది. రిషభదేవుడితో సహా ఐదుగురు జైన తీర్థంకరులు ఈ నగరంలోనే జన్మించి జైన మతాన్ని విశ్వవ్యాప్తంచేశారు. స్వామి నారాయణ్ ఇక్కడే తన బాల్యాన్ని గడిపి.. నేడు ప్రపంచవ్యాప్తంగా అక్షర్‌ధామ్ యజ్ఞానికి ఊపిరులూదారు. శ్రీవైష్ణవమతానికి చెందిన పన్నెండుగురు ఆళ్వారులు అయోధ్యను సందర్శించి దివ్య ప్రబంధాలను ప్రపంచానికి అందించారు.

( ఇంకావుంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here