రామం భజే శ్యామలం-17

1
8

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణ, భారతేతిహాసాల కాలనిర్ణయం చేయడానికి మన చరిత్రకారులకు మనసు రాలేదు. ఎందుకంటే.. వాటి కాలనిర్ణయం చేస్తే  భారతదేశ చరిత్ర అత్యంత ప్రాచీనమైనదని ఒప్పుకోవలసి వస్తుంది. ఇది  వారికి ఎంతమాత్రం సమ్మతం కాదు. బైబిల్‌లో చెప్పినట్టు కీస్తుకు పూర్వము 4500 సంవత్సరం దాటి ముందుకు పోవడానికి వీలులేదన్నట్టుగా చరిత్రకారులు ఫిక్స్ అయిపోయారు. భారతదేశంలోని అందరు రాజుల కాలాలను తదనుగుణంగా ముందుకు తీసుకొని వచ్చారు. బుద్ధుడి కాలనిర్ణయాన్ని కూడా దాదాపు రెండువేల  ఏండ్లకు ముందుకు జరిపారు. సింధు నాగరికతను సదరు క్రీస్తుపూర్వము 4500కు దరిదాపుల్లోకి తెచ్చిపెట్టి.. వారి తర్వాత ఆర్యుల సిద్ధాంతాన్ని చెక్కి.. అక్కడి నుంచి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాల కాలాన్ని నిర్ధారిస్తూ పోయారు. మొత్తం మీద వీటన్నింటి వయసు తిప్పి కొడితే మూడువేల సంవత్సరాలు కూడా లేవని చెప్పడం వీరి ఉద్దేశం. ఈ మొత్తం వ్యవహారంలో వీరికి రాముడిని ఎక్కడ తెచ్చిపెట్టాలో అర్థం కాలేదు.

భారతానికి తరువాతే రాముడిని తీసుకొచ్చి తెచ్చిపెట్టారు. మహాభారతం తరువాతే రామాయణం రాసి ఉంటారని, ఉండి ఉండవచ్చని.. ఇంకాస్త ముందుకువెళ్తే.. కచ్చితంగా ఇదేనంటారు. 12వ శతాబ్దపు తొలి అర్థభాగంలో రామాయణ రచన సాగిందని చెప్పేందుకే నేటి ఎక్కువ మంది చర్రితకారులు కటిబద్ధులై ఉన్నారు. ఇవన్నీ చాలా చిన్నగానే మనకు అనిపించవచ్చు. కానీ.. చిన్న చిన్నగానే మన చరిత్ర విధ్వంసం జరిగిందని చెప్పడానికి.. ప్రతి అంశాన్నీ స్పృశించాల్సి వస్తున్నది. పండితుల్లాగా లోతైన చర్చలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న అంశాలే మన చరిత్ర ప్రామాణికతను నిరూపిస్తుంది. రామాయణం రాముడి చరిత్ర కాదు.

భారతం కౌరవ పాండవుల చరిత్ర కాదు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు.. పుక్కిటి కథలు కావు. మంత్రాలు మాత్రమే కాదు. బుద్ధుడు సిద్ధార్థుడి చరిత్ర కాదు. మౌర్యులు, చాళుక్యులు, పల్లవులు, చోళులు, శాతవాహనులు, కాకతీయులు.. ఇవన్నీ వారి వారి చరిత్ర కాదు. ఇదంతా భారతదేశ చరిత్ర. దీన్ని వక్రీకరించడంలో మన చరిత్రకారులు అందివచ్చిన ఏ ఒక్క అంశాన్నీ వదిలిపెట్టలేదు. వాళ్లు చరిత్రలోని వంకరలను కొన్నైనా చూపించడానికే ఇంతగా తపనపడేది.

మళ్లీ అసలు విషయానికి వద్దాం. నాకు అంత చరిత్ర తెలియదు.. దాని గురించిన అవగాహన ఉన్నవాణ్ణీ కాదు. కానీ చిన్నప్పటినుంచీ భారతదేశానికి ఆదికావ్యం రామాయణమని, ఆదికవి వాల్మీకి అని చెప్పుకొంటూ వచ్చారు. నాకు తెలిసింది, ఇంతకాలం నుంచి నమ్ముతున్నదీ ఇదే. కానీ తాజా చరిత్రకారులు  చెప్తున్న మాటలు మహాభారతం తరువాత 12వ శతాబ్ది తొలి అర్ధభాగంలో రామాయణ రచన జరిగిందని . మహాభారతం తరువాత రామాయణం రచించి ఉండి ఉంటే.. వాల్మీకి ఆదికవి ఎలా అయ్యాడు? వ్యాసుడిని ఆదికవి అనాలి కదా? ఇది నిజమేనా? ఎలా తెలుసుకోవాలి? మళ్లీ మనకు రామాయణమే ప్రమాణం. ఎందుకంటే.. మనం వేరే సోర్సులు, రిసోర్సులు వెతకాల్సిన అవసరం లేనేలేదు. బాలకాండలోనే రామాయణం ప్రారంభంలోనే ఒక సన్నివేశమున్నది. రామాయణాన్ని రాయడానికి తగిన కథాగమనం చెప్పిన నారదుడు వెళ్లిపోగానే.. వాల్మీకి తమసానదీ తీరంలో స్నానానికి వెళ్తాడు. అక్కడ వనమంతా తిరుగుతూ. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే ఎలాంటి ఎడబాటు లేకుండా చక్కగా కూస్తూ గాల్లో తిరుగుతున్న క్రౌంచ పక్షులను చూసి సంతోషపడతాడు. ఇంతలోనే ఒక బోయవాడు వేటకోసం వచ్చి.. చాలా మనోహరంగా ఉన్న క్రౌంచ పక్షుల్లో ఒక మగపక్షిని చంపేశాడు. బోయవాడు (నిషాదుడు) మగపక్షిని చంపడంతో.. ఆడ క్రౌంచపక్షి దీనంగా  ఏడ్వసాగింది. ఆ సన్నివేశ వర్ణనను వాల్మీకే చేశాడు. యథామూల అనువాదాన్ని పుల్లెల శ్రీరామచంద్రుడు గారుచేశారు. ఒకసారి చదవండి..

‘క్రూరమైన నిర్ణయము కలవాడు, పశుపక్ష్యాదుల విషయమున నిష్కారణముగ ద్వేషముతో ప్రవర్తించువాడు అయిన ఒక బోయవాడు, ఆ మహర్షి చూచుచున్నాడనెడు సంకోచమైనను లేక ఆ జంటలో మగపక్షిని చంపెను(10). ఆ నిషాదుడు కొట్టగా రక్తసిక్తమై నేలపై పడి పొరలుచున్న ఆ మగపక్షిని భార్యయైన ఆడ క్రౌంచపక్షి చూచినది. తనపై ఎంతో ప్రేమ కలిగినది, తననుండి ఎడబాటు ఎరుగనిది, అందమైన రెక్కలు ఎల్లని తలయుగలది, కామముచే మదించినది అయిన మగపక్షితో వియోగము చెంది ఆ క్రౌంచి అతి దీనముగా ఏడ్వసాగినది (11, 12). బోయవానిచే పడగొట్టబడిన ఆ పక్షిని చూడగనే ధర్మాత్ముడైన ఆ వాల్మీకికి జాలి కలిగెను. ఆ మహర్షి ఏడ్చుచున్న క్రౌంచిని చూచి, దయగలవాడై, ఆ పక్షిని రతి కాలమందు చంపుట ధర్మముకాదు. అని తలచుచు ఇట్లు పలికెను(13, 14).

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ సమాః

యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్

నిర్భాగ్యుడైన ఓ బోయవాడా! నీవు క్రౌంచపక్షి దంపతులనుండి మన్మథపరవశమైన ఒకదానిని చంపితివి. అందుచే నీవు చాలకాలము జీవించకుందువుగాక! ఈ విధముగ పలికి తన నోటినుండి వెలువడిన వాక్యమును పరిశీలించుకొనెను. ఆ మహర్షి మనస్సులో, ఈ పక్షియొక్క శోకముచేత దుఃఖితుడనైన నా నోటినుండి ఇదేమి! ఈవిధమైన వాక్యము వెలువడినది? అను ఆలోచన కలిగెను (15, 16).

మహాపండితుడు, బుద్ధిమంతుడు అయిన ఆ మునిపుంగవుడు ఒక  నిశ్చయము చేసికొని శిష్యునితో ఇట్లు పలికెను (17).

నేను శోకారుడనై ఉండగా నా నోటి నుండి ఈ వాక్యము బయలుదేరినది.  ఇది నాలుగు పాదములలో, ఒక్కొక్క పాదమునకు సమానమైన  అక్షరములతో కూర్చబడినది. వీణ పై కూర్చి గీతవాద్యములతో పాడుటకు అనుకూలముగా ఉన్నది. కావున దీనికి శ్లోకమను పేరుతో ప్రసిద్ధి రావలెను. మరొక పేరుతో కాదు(18).

వాల్మీకి మాటలను విని శిష్యుడు  అత్యుత్తమమైన మా నిషాద ఇత్యాది వాక్యమును స్వీకరించెను, అనగా దానిని కంఠస్థము చేసికొనెను. వాల్మీకి అందులకు సంతసించెను (19).

ఇక్కడ రెండు అంశాలను ప్రస్తావించాల్సి ఉన్నది. తన కండ్లముందు అనూహ్యంగా జరిగిన ఒకానొక సన్నివేశాన్ని చూసినప్పుడు తనకు తెలియకుండానే దాని ప్రతిస్పందన వచ్చింది. అది నాలుగు పాదాలు.. ప్రతి పాదంలో సమానమైన అక్షరాలతో కూర్చిన వాక్యం వచ్చింది. దీన్ని శ్లోకం అని భవిష్యత్తులో అంటారు అని విస్పష్టంగా వాల్మీకి చెప్పారు. అంటే..

అంతకుముందు శ్లోకమనేది లేదు. ఇదే అదికావ్యమైంది. ఇక భారతం రామాయణం కంటే ముందు అన్న మాటకు అర్థమే లేదు కదా.. పైగా మహాభారతం అరణ్యపర్వంలోనే రామాయణం ప్రస్తావన ఉన్నది. ఇక రామాయణ కాలనిర్ణయాన్ని భారతం కంటే ఎలా ముందుకు జరుపుతారు? ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇక వాల్మీకి ఒక మునిగా.. బోయవాడు పక్షులను చంపడాన్ని చూసి కావ్యగానం చేసినట్టుగా ఆయన రాసుకొన్న రామాయణంలోనే ఉన్నది. కానీ మనవాళ్లు వాల్మీకినే బోయవాడిగా చిత్రించారు. చరిత్రలో నిజమే అయి ఉంటే తప్పకుండా చెప్పాల్సిందే. కానీ, వాల్మీకి స్వయంగా తాను ఓ బోయవాడు క్రౌంచ పక్షిని చంపుతుండగా చూడటం వల్లనే శ్లోకం పుట్టిందని చెప్తుంటే కొత్త కథకు ఆస్కారం ఎక్కడ ఉంటుంది?

ముందే చెప్పినట్టు మహాభారత యుద్ధం క్రీస్తు పుట్టడానికి పూర్వం 3138వ సంవత్సరంలో జరిగినట్టు యావత్ప్రపంచం అంగీకరించిన సత్యం. మన సోకాల్డ్ చరిత్రకారులకు తప్ప.. పాశ్చాత్య చరిత్రకారులు కూడా అంగీకరించిన సత్యమే ఇది. దీన్ని మన చరిత్రకారులు క్రీస్తు పూర్వం 1400 తరువాతి కాలానికి తెచ్చి పెట్టారు. ఎందుకంటే.. ఆర్యుల దండయాత్ర  సిద్ధాంతాన్ని నిజం చేయాలి కాబట్టి. రామాయణం కూడా ఆ కోవలోనే ముందుకొచ్చింది. పోనీ వీళ్లు రాసిన చరిత్రకు ప్రామాణికం ఏదయ్యా అంటే.. మొఘలులైతే అక్బర్ నామాలు.. బాబర్ నామాలు ఉంటాయి. రాత ప్రతులు ఉంటాయి. రామాయణ భారతాలకు మాత్రం వాటి మ్యానుస్క్రిప్టులు పనికిరావు. అవన్నీ మిథ్య అంటారు. మళ్లీ వీళ్లే రామాయణం గురించి వ్యాఖ్యానాలు చేస్తారు. .

Rama, the heir of the king of Kosala, married Sita, the princess of Videha. Rama’s stepmother wanted her own son to succeed to the throne of Kosala and contrived successfully to have Rama, Sita, and Lakshmana (one of Rama’s younger brothers) banished for fourteen years. This exile took the three of them into the forests of the peninsula where they lived as hermits. But Ravana – the demon king of Lanka (Ceylon) – kidnapped Sita. Rama organized an army, taking the assistance of Hanuman, the leader of the monkeys. A fierce battle was fought against Ravana, in which the demon king and his army were destroyed and Sita was rescued. Sita had to prove her innocence by undergoing the fire ordeal, and was eventually reunited with Rama. The fourteen years having ended, Rama, Sita, and Lakshmana returned to Kosala and were warmly welcomed. Rama was installed as king, and his reign is associated with prosperity and justice. To this day the term Ramarajya (the reign of Rama) is used to describe a utopian state.

The description of Rama crossing the peninsula and conquering Ceylon is clearly a representation of Aryan penetration into the peninsula. As the southward movement of the Aryans is generally dated to about 800 B.C. the original Ramayana must have been composed at least fifty or a hundred years later. An earlier date for the original Ramayana is possible if it is conceded that the conflict between Rama and Ravana is a description of local conflicts between the agriculturists of the Ganges valley and the more primitive hunting and food-gathering societies of the Vindhyan region. The transference of these events to a more southerly location and the reference to Ceylon may have been the work of an editor of a later period.

రామాయణమంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని అన్నాడట వెనకట ఎవరో.. ఈ రామాయణ చరిత్ర చెప్పిన చరిత్రకారిణి మరెవరో కాదు.. ది గ్రేట్ రోమిలా థాపర్. ఈమె మాత్రమే కాదు. కోశాంబి వంటి చరిత్రకారులంతా ఇంచుమించుగా ఇదే వాదాన్ని పదే పదే వినిపిస్తూ వచ్చారు. ఇందులోనే తాను చెప్పిన దాంట్లోనే భిన్నవాదనలు వినిపించడంలో ఎంతమాత్రం వెనుకంజవేయని మేధావులు వీరు. సీతారాములు.. సీతను కిడ్నాప్ చేయడం.. రాముడు పోయి వానర సైన్యం సహాయంతో రావణుడిని హతమార్చి భార్యను తీసుకొచ్చుకోవడం కథ అని ఆమే రాశారు. దాని కొనసాగింపుగా వింతవాదన లేవదీశారు. ఆర్యులు క్రీస్తుపూర్వం 800లో దక్షిణాపథానికి టూర్‌చేశారట! ఆ తర్వాత వందేండ్లకు రామాయణం రాశారన్నది ఈమె సూత్రీకరణ. ఎప్పుడు రాశారన్నది మనకు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే రామాయణం అన్నికాలాల్లో, అన్ని యుగాల్లో.. అన్ని సందర్భాల్లో.. ఇవాళ్టికీ రాయబడుతూనే ఉన్నది కాబట్టి. అన్నింటికంటే ఘోరమైన ఆరోపణ ఏమిటంటే.. రామ, రావణ యుద్ధమనేది.. గంగాతీరంలోని వ్యవసాయం చేసేవారికి, వింధ్య ప్రాంతంలోని ఆహార అన్వేషకుల సమాజానికి మధ్య జరిగిన స్థానిక ఘర్షణ (లొల్లి) కావచ్చు అంట. తర్వాతి కాలంలో వింధ్య ప్రాంతంలో జరిగిన ఘటనలను ఎడిటర్ (ఈ మహానుభావుడు ఎవరో తెలియదు..) సిలోన్ (ప్రస్తుత లంక)కు షిఫ్ట్ చేశాడట. ఎందుకు చేశాడో తెలియదు. రామాయణంలోని బాలకాండ నుంచి.. యుద్ధకాండ వరకు.. ఆ తర్వాత ఉత్తరకాండ వరకూ తీసుకొన్నా కూడా.. ఈ రకమైన ఇంటర్‌ప్రిటెషన్‌కు ఏ కొంచెమైనా ఆస్కారమున్నదా? ఈ రకమైన పైత్యపు వ్యాఖ్యానాన్ని పాఠ్యాంశంగా చేసి పిల్లలకు బోధించడం ఎంత దారుణం?

ఇంతేనా.. రామాయణం 300 రకాల పాఠాంతరాలున్నాయని ఒకడు రాస్తాడు. వీటిలో చాలావాటిని వాల్మీకే రాశాడని కూడా చెప్తాడు. జైన రామాయణం అన్నది మరొకటి ఉన్నది. దాని ప్రకారం దశరథుడు సాకేతనగరానికి రాజు. అతనికి నలుగురు రాణులు.. నలుగురికి నలుగురు కొడుకులు. ఈ నలుగురు రాణులు అపరాజిత, సుమిత్ర, సుప్రభ, కైకేయి. వీరిలో అపరాజితకు పుట్టినవాడు రాముడు. ఈ రాముడికి మైథిలి, ప్రభావతి, రతినిభ, శ్రీదమ అనే నలుగురు ‘ప్రధాన’ రాణులు ఉన్నారట.. ప్రధానం కానివారెందరున్నారో సదరు రచయిత మెన్షన్ చేయలేదు. వీరిలో మైథిలే సీత. లక్ష్మణుడు రావణుడిని చంపాడట. ఈ లక్ష్మణుడు, రావణుడు నరకానికి వెళ్లారట. ఇందులో రావణుడు తీర్థంకరుడిగా తిరిగి వస్తాడట.

ఆహా.. రామాయణం ఎంత అద్భుతంగా రూపాంతరం చెందింది. మనం ఏ పూర్వ పుణ్యం చేసుకున్నామో కానీ.. మన చరిత్రకారులు ఈ కథనాన్ని ప్రామాణికంగా తీసుకొని మన మెదళ్లకు ఎక్కించలేదు. బౌద్ధం, జైనం దేశంలో విస్తరించి.. వారి రచనలు వెలుగులోకి వచ్చేదాకా అయోధ్య స్థానంలోకి సాకేతపురి పేరు ప్రస్తావనకు రానేలేదు. బౌద్ధ వాఙ్మయంలోనూ.. జైన వాఙ్మయంలోనూ పుట్టుకొచ్చిన ఈ పేరునే ఆ తర్వాత మన కవులు అందిపుచ్చుకొని రాయడం మొదలుపెట్టారు. కాళిదాసాదులు కూడా రాముడిని సాకేతరాముడిగా మార్చేశారు. రాముడు మన మూల పురుషుడు. రాముడి చరిత్రను తెలుసుకోవడమంటే.. అధ్యయనం చేయడమంటే.. మన ప్రాచీన చరిత్రను, నాగరికతను తెలుసుకోవడమే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జాతి సంస్కృతిని, జనజీవన విధానాన్ని అధ్యయనం చేయడమే.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here