రామం భజే శ్యామలం-25

2
9

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కోసారి తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే.. చాలా విచిత్రమనిపిస్తుంది. ఈ భూ ప్రపంచంలో లేనివి ఉన్నట్టు.. ఉన్నవి లేనట్టు ప్రచారం చేయడం కేవలం మనదేశంలోనే సాధ్యమనుకొంటా. మన చరిత్రను చూస్తుంటే.. అంతా ఇట్లా తల్లకిందులుగానే కనిపిస్తుంది. వేల ఏండ్లుగా దేశమంతా నెత్తిన పెట్టుకొని పూజించే వాడినేమో పనికిరానివాడంటారు. లేని చెడ్డతనాన్ని ఆపాదించడానికి తెగ ప్రచారం చేస్తుంటారు. మరోపక్క అత్యంత దుర్మార్గుడైన వాడినేమో.. ది గ్రేట్ అని సూపర్ ప్రమోట్‌ చేస్తారు. అత్యద్భుతమైన చరిత్రను దారుణంగా వక్రీకరించారు. వందలమంది రాజులున్నా.. ఒక్క రాజు చరిత్ర కూడా పాఠాల్లో కనిపించదు. పుస్తకాల్లో కనిపించదు. ప్రచారం చేయరు. వారికి సంబంధించిన చారిత్రక జ్ఞాపకాలను పట్టించుకోరు. రాజుల సంగతి సరేసరి.. ఈ దేశంలో అసాధారణమైన రీతిలో రాజ్యాలను ఏలిన.. యుద్ధాలు చేసిన రాణులు ఎందరో ఉన్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎవరైనా చెప్తే దేశంలో ఓ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు. తెలుగువారి దగ్గరకు వచ్చేసరికి ఓ రుద్రమదేవి గురించి మాట్లాడతారు. కొండొకచో ఒక పద్మావతి పేరు వినపడుతుంది. అది కూడా ఈ మధ్య సినిమా రావడంతో.. అదీ వివాదాస్పదం కావడంతో ఎక్కువమందికి తెలిసింది తప్ప ఏ ఒక్కరికీ తెలియదు. పైగా ఈ దేశం మహిళలను దారుణంగా అణచివేసిందని.. పురుషాధిక్య సమాజమన్నారు. ఆడవాళ్లను వంటింటి కుందేళ్లని ఎద్దేవా చేశారు. అసలు సమాన హక్కులే లేవని ఊదరగొట్టారు. భారతదేశ చరిత్రలోనే మహిళలకు ఎలాంటి హక్కులు లేవంటూ నోటికి ఏది వస్తే అదే రాశారు. గమ్మత్తేమిటంటే కొన్నింటిని మహిళామణులే రాశారు. రష్యా, చైనా, యూరప్‌నుంచి అక్కడి చరిత్ర పుస్తకాలనుంచి కార్బన్ పేపర్లు తెచ్చుకొని అచ్చొత్తించారు. ఆయా దేశాల్లో అణచివేత ధోరణులన్నీ ఈ దేశంలో ఉన్నట్టుగా భ్రమింపజేశారు. కానీ ఏ ఒక్కరికైనా తెలుసా.. ఈ దేశంలో మహిళ పరిస్థితి ఏమిటన్నది? ఈ దేశంపైకి ముస్లింలు రావడానికి ముందు ఎలా ఉన్నది.. తరువాత ఎలా మారింది.. తెల్లవాళ్లు వచ్చిన తర్వాత ఎట్టా మారింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది? కానీ.. అందరికీ తెలిసింది మాత్రం ఒక్కటే.. మహిళలను ఈ దేశంలో చేతులు కాళ్లు కట్టిపడేసి స్వేచ్ఛ అన్నది లేకుండా చేశారని.. ఈ పేరుతో ఫెమినిజంను ఇంపోర్ట్ చేసుకున్నారు. స్వేచ్ఛ పేరుతో విశృంఖలత్వాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. కుటుంబవ్యవస్థ పోయింది. నెహ్రూ గారి పుణ్యమా అంటూ విడాకుల ట్రెండ్ మొదలైంది. మహిళలను ఈ దేశం మొదట్నుంచీ అణచివేసిందన్న థియరీకే మనం ఫిక్స్ అయిపోయాం. మనలో చాలామంది (హేతువాదులు, నాస్తికులు కూడా (కుటుంబ సభ్యులకోసమైనా.. వారి కోరికలు తీర్చే పేరుతోనైనా సరే) చాలామంది గుళ్లూ గోపురాలకు వెళ్తుంటారు. గర్భగుడిలోకి వెళ్లి.. శివుడో.. మాధవుడో.. మహాదేవియో.. ఎవరో ఒకరిని చూసి.. దండం పెట్టుకొని.. అర్చనాదులు చేసుకొని తిరిగివస్తామే తప్ప ఇంకేమీ చూడం. ఈ మధ్య ట్విట్టర్‌లోనో.. ఫేసుబుక్కుల్లోనో.. ఏన్షియంట్ హిస్టరీ పేరుతో ఫొటోలు పెడితే.. లైకులు.. షేర్‌లు.. రీట్వీట్‌లు.. కామెంట్లు పెడుతున్నాం. కానీ.. ఒక్కో గుడిలో.. ఒక్కో స్తంభంపై కనిపించే ఒక్కో శిల్పం ఈ దేశ చరిత్రను.. నాగరికతను, జనజీవనాన్ని సవివరంగా విప్పి చెప్తాయన్న సంగతిని మనలో ఒక్కరంటే ఒక్కరు గమనిస్తున్నామా? కామాశోకుడని పేరు తెచ్చుకొన్న ఒక నిరంకుశ రాజు.. షాజహాన్ అనే విమనైజర్ వరకు కొందరు మూర్ఖులు ఆడవాళ్లను ఎలా చూశారో.. ఈ దేశంలో సమాజమంతా ఆడవాళ్లను అలాగే చూసిందని చెప్పుకొంటూ వచ్చారు. ఈ దేశంలోకి ముస్లింల దండయాత్రలు మొదలుపెట్టేంతవరకు స్త్రీపురుషుల మధ్య భేదాభిప్రాయాలు లేనేలేవు. పని విభజన కూడా లేదు. అన్ని పనులు అందరూ చేశారు. సమాజంలో స్వేచ్ఛగా వ్యవహరించారు. హోయసల, కంచి, ఎల్లోరా.. తమిళనాడు, కాకతీయులు, కళింగ, గయ, భారత, రామాయణం.. ఒక్కటేమిటి.. కాందహార్ నుంచి ఖజురె మీదుగా కన్యాకుమారిదాకా ఎక్కడికైనా వెళ్లండి.. ఎన్నైనా చూడండి. మన దేశంలో మహిళలు శతాబ్దాల నాడే జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశారు. యుద్ధ విద్యలు నేర్చారు. యుద్ధాలుచేశారు. వ్యవసాయపనులు చేశారు. పంటలు పండించారు. మార్కెటింగ్‌ చేశారు. గుర్రపుస్వారీ చేశారు. అసలు వాళ్లు చెయ్యనిదేమున్నది కనుక.. మాతృదేవోభవ అని వేదమే చెప్పిందే.. ఇంతకంటే ఏం కావాలి?

పెండ్లిళ్లలో మొగుణ్ణి స్వేచ్ఛగా.. కండిషన్లు పెట్టి మరీ ఎంపిక చేసుకునే పద్ధతి మనదేశంలో తప్ప ఇంకెక్కడ ఉన్నది? రాముడు శివధనుస్సు విరిస్తేనే సీత పెండ్లి చేసుకున్నది. అర్జునుడు మత్స్య యంత్రాన్ని పడగొడితేనే ద్రౌపది వరించింది. స్వయంవరం ఆనాడు మహిళలకే ఉన్నది తప్ప మగవాళ్లకు లేనేలేదు. వేదాలు ఆడవాళ్లు చదువకూడదని అన్నారంటూ పిచ్చిమాటలు ప్రచారంచేశారు. యాజ్ఞవల్క్యుడి భార్య మైత్రేయి మెటాఫిజిక్స్‌లో స్కాలర్. మైత్రేయి, గార్గి మధ్య సంవాదం గురించి బృహదారణ్యకోపనిషత్తులో ప్రస్తావన ఉంటుంది. యాజ్ఞవల్క్యుడు కూడా సైంటిస్టే. ఆయన పునర్జన్మ.. చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు అన్న అంశాలపైన పరిశోధన చేసినవాడు. మన దేశంలో మహిళలు ఎప్పటికప్పుడు.. ఏ కాలానికి ఆ కాలానికన్నట్టుగా ఆధునిక పోకడలు పోయినవారే తప్ప ముక్కుమూసుకొని ఇంట్లో ఓ మూలకు పడిఉన్నవారు ఎంతమాత్రం కానేకాదు. వరంగల్ రామప్ప దేవాలయం 1120లలో నిర్మించారు. ఆలయంపై ఉన్న మదనిక శిల్పాల్లో ఒక శిల్పం హైహిల్స్ వేసుకొని కనిపిస్తుంది. హోయసల శిల్పాల్లో కూడా ఇదేరకమైన శిల్పం కనిపిస్తుంది. చాలాచోట్ల మేకప్ వేసుకొంటున్న శిల్పాలూ కనిపిస్తాయి.

దేశంలోకి ముస్లింల దండయాత్రలు మొదలైన తరువాతే.. పరదా వ్యవస్థ వచ్చింది. ముస్లిం సైనికులు, దేశంలో ఎక్కడికక్కడ చొచ్చుకొని వచ్చి.. ఊళ్లమీద పడి దోచుకొంటూ.. ఆడవాళ్లను విచక్షణ లేకుండా అత్యాచారాలకు గురిచేస్తుంటే.. తప్పనిసరిగా పరదా సిస్టమ్‌ను అలవరచుకోవాల్సి వచ్చింది. పెండ్లిచేస్తే విడిచిపెడతారేమోనని.. వీలైనంత తొందరగా పెండ్లిళ్లు చేసే ఆచారమూ అప్పుడే మొదలైంది. అష్టవర్షాత్ భవేత్ కన్యా అన్న మాట కూడా అప్పుడు పుట్టిందే.. అంతకు ముందు ఈ మాట ఉన్నట్టు కనిపించదు. బ్రిటిష్‌వాళ్లు వచ్చిన తర్వాతనే దేశంలో పురుషాధిక్యత పెరిగిపోయిందేమో. తర్వాత అవి ఇంపోజ్ అయ్యాయి. నిజానికి ఈ దేశంలో రాజులను మించిన రాణులు మహారాణులు ఎందరో ఉన్నారు. మగవాళ్లను మించి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని.. యుద్ధరంగంలో నిలుచుని పోరాడినవారు చాలామంది ఉన్నారు. వారిలో కొందరి గురించి చదువుకొందాం.

విష్ఫల:

మనకు ఋగ్వేదంలో విష్ఫల అనే రాణి గురించిన ప్రస్తావన ఉన్నది. ఈ మహారాణి యుద్ధ విద్యలు నేర్చుకొని యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్నది. యుద్ధంలో ఒక కాలు కోల్పోతే.. ఇనుప కాలు చేయించుకొని తొడిగించుకొని.. తిరిగి యుద్ధ రంగానికి వెళ్లింది. మహిళల సాధికారతకు తొలి ఉదాహరణ.. స్ఫూర్తి ఇది. సాయిస్వరూప అయ్యర్ ఈమె పాత్రను మరింతగా విపులీకరిస్తూ అవిశి అనే గ్రంథాన్ని రచించారు కూడా. ఇటీవలే ఈ గ్రంథం విడుదలైంది.

రుద్రమదేవి (1263-1289):

మొఘలుల కాలం మొదలైన తర్వాత దేశంలో తొలి మహారాణి రజియా సుల్తానా (12361240) కాగా.. ఆ తరువాత రెండోరాణి కాకతీయ రుద్రమదేవియే. దాదాపు 26 సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన సామ్రాజ్ఞి. తన రాజ్యంలో ల్యాండ్ ట్యాక్స్ రెవెన్యూను అమలుచేసింది రుద్రమదేవి. గణపతిదేవుడి తర్వాత తిరుగులేని మహారాణిగా ఏలుబడి చేసిన మహిళ. తన రాజ్యంలో భాగమైన నిడుదవోలుకు చెందిన తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడిని వివాహమాడింది. కాకతీయ కోటకు సప్త కోటలు నిర్మించిన రాణి. యుద్ధవిద్యలు నేర్చిన వీరవనిత. చివరకు యుద్ధరంగంలో యుద్ధం చేస్తూనే వీరమరణం పొందిన మహారాణి రుద్రమ. నేటి నల్లగొండజిల్లా చందుపట్ల దగ్గర రుద్రమ యుద్ధరంగంలో చనిపోయినట్టు శాసనం కూడా ఉన్నది.

ఝాన్సీ లక్ష్మీబాయి (1828-1858):

వారణాసిలో జన్మించిన లక్ష్మీబాయి.. షూటింగ్, కత్తియుద్ధం, గుర్రపుస్వారీ వంటి అనేక విద్యల్లో ఆరితేరిన రాణి. పదహారేండ్ల వయసులో ఝాన్సీ మహారాజు రాజా గంగాధర్‌రావును వివాహం చేసుకున్నది. వీరికి ఒక అబ్బాయి జన్మించి చిన్న వయసులోనే చనిపోయాడు. కొద్దికాలానికే గంగాధర్‌రావు అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు లక్ష్మీబాయి.. దామోదర్‌రావు అనే ఒక పిల్లవాణ్ణి దత్తత తీసుకొని వారసుడిగా ప్రకటించారు. అప్పటికి వారసులు లేని రాజ్యాలను లాక్కొంటూ వస్తున్న బ్రిటిష్ వాళ్లు ఝాన్సీని కూడా కబ్జా పెడదామని ప్రయత్నించారు. అప్పుడు లార్డ్ డల్హౌసీ దామోదర్‌రావును వారసుడిగా గుర్తించలేదు. దీంతో లక్ష్మీబాయి ఝాన్సీని వదులుకోలేక సైన్యాన్ని కూడగట్టుకొన్నది. ఈమె సైన్యంలో ఎంతోమంది అమ్మాయిలు కూడా యుద్ధవిద్యలో శిక్షణ తీసుకొన్నారు. ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యం బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటుచేసింది. ఈ తిరుగుబాటులో బ్రిటిష్ పౌరులు, సిపాయిలు, బ్రిటిష్ మహిళలు చాలామంది చనిపోయారు. మే 1857లో భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్య్ర సంగ్రామం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగింది. లక్ష్మీబాయి స్ఫూర్తితో దేశమంతటా తెల్లవాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చెలరేగాయి. దాదాపు సంవత్సరంపాటు బ్రిటిష్‌వాళ్లు ఈ తిరుగుబాట్లను అణచివేయడానికి చాలా చాలా కష్టపడ్డారు. లక్ష్మీబాయి యుద్ధంలో ఓడిపోయి.. గ్వాలియర్‌కు వెళ్లి అక్కడ తాంతియాతోపేను కలిసి ఆయన సహకారం తీసుకొన్నది. చివరకు గ్వాలియర్‌లో జరిగిన యుద్ధంలో 1858 జూన్ 18 నాడు మరణించింది.

పద్మావతి (13వ శతాబ్దం):

రాణి పద్మిని లేదా పద్మావతి.. సింహళ రాజకుమారి. ఈమె అత్యంత సౌందర్యవతి. అసాధారణ అభిమానవతి. యుద్ధంలో ఈమెకు సాటిలేరని ప్రతీతి. చిత్తోడ్ రాజు రతన్‌సేన్ చిలుక రాయబారం పంపించి.. ఆమె పెట్టిన షరతులన్నింటిలోనూ పాల్గొని.. జయించి.. చివరకు స్వయంవరం ద్వారా అమె చేతిని అందుకొన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్‌పై దాడిచేసి కోటను బద్దలు కొట్టలేక బయటినుంచి దిగ్బంధంచేశాడు. దీంతో రతన్‌సేన్ కోటను తెరుచుకొని ఖిల్జీపై యుద్ధంచేసి ఓడిపోయి మరణించాడు. సుల్తాన్ చేతికి చిక్కకుండా ఉండేందుకు పద్మావతి, ఆమె సహచరులు సజీవదహనం చేసుకొన్నారు.

రాణి చెన్నమ్మ (1778-1829):

కర్నాటక బెల్గాంలోని కాకటి ప్రాంతంలో జన్మించిన చెన్నమ్మ చిన్నప్పటినుంచి కత్తియుద్ధంలో, విలువిద్య వంటి వాటిలో పూర్తిస్థాయి శిక్షణ పొందింది. పదిహేనో ఏట కిత్తూరు రాజ్యానికి చెందిన దేశాయి వంశానికి చెందిన రాజా మల్లాసర్జాను వివాహం చేసుకొన్నది. 1824లో భర్త, కుమారుడు చనిపోవడంతో రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్లనుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత చెన్నమ్మపై పడింది. దీంతో చెన్నమ్మ.. తన భర్త మొదటి భార్య కొడుకైన శివలింగప్పకు రాజ్యాభిషేకం చేసింది. కానీ, బ్రిటిష్ కంపెనీ ఈ దత్తతను అంగీకరించలేదు. అప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి గవర్నర్‌గా, అడ్మినిస్టర్‌గా లార్డ్ డల్‌హౌసీయే ఉన్నాడు. శివలింగప్పను బహిష్కరించాలని ఆదేశించారు. బ్రిటిష్ అధికారాన్ని అంగీకరించాల్సిందిగా ధార్వాడ్ కలెక్టర్ జాన్ థాక్రే, కమిషనర్ చాప్లిన్ ఆదేశాలిచ్చారు. దీంతో రాణి చెన్నమ్మ తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ వాళ్లు 20, 797 మంది సైన్యం, 437 గన్నులు, గుర్రాలు ఇతర మందుగుండు సామగ్రితో చెన్నమ్మ రాజ్యం కిట్టూరుపై యుద్ధంచేశారు. 1824 అక్టోబర్‌లో జరిగిన ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు చాలా సైన్యాన్ని పోగొట్టుకొన్నారు. థార్వాడ్ కలెక్టర్ జాన్ థాక్రే కూడా ఈ యుద్ధంలో చనిపోయాడు. దీంతో మరింత సైన్యంతో బ్రిటిష్‌వాళ్లు తెగబడ్డారు. రెండోసారి జరిగిన యుద్ధంలో థామస్ మన్రో మేనల్లుడు చనిపోయాడు. చివరకు చెన్నమ్మను బ్రిటిష్‌వాళ్లు బంధించి బెయిల్ హెంగల్ కోటలోని జైల్లో బంధించారు. ఆ జైల్లోంచి కూడా తప్పించుకోవడానికి చెన్నమ్మ ప్రయత్నించింది. చివరకు 1829లో చెన్నమ్మ మరణించింది. ఇక్కడ అర్థం కానిదేమంటే.. 1824లోనే ఈస్ట్ ఇండియా కంపెనీపై కిత్తూరు రాణి చెన్నమ్మ యుద్ధం చేసింది. ఈ యుద్ధం గురించి చరిత్ర ఎందుకు చెప్పుకోవడంలేదు? తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా 1857నే ఎందుకు మన చరిత్రకారులు చెప్తుంటారు?

అహల్యాబాయి హోల్కర్ (1725-1795) :

మాల్వా సామ్రాజ్యానికి చెందిన హోల్కర్ వంశ మహారాణి. ఎనిమిదేండ్ల వయసులో ఖండేరావు హోల్కర్‌ను వివాహం చేసుకొన్నది. 1751లో కుంభర్‌లో జరిగిన యుద్ధంలో ఖండేరావు చనిపోయాడు. అప్పటికి అహల్యాబాయికి 21 ఏండ్లు. కుమారుడు రావు హోల్కర్‌కు పట్టాభిషేకం చేశారు. 1767లో చనిపోయాడు. తరువాత అహల్యాబాయి తానే స్వయంగా అధికారాన్ని చేపట్టింది. మరాఠా సామ్రాజ్యంలో భాగంగా ఉన్న మాల్వా ఉండటంతో తాను అధికారం చేపడతానని మరాఠా చక్రవర్తిని కోరింది. ఆమెకు అనుమతి ఇవ్వడంతో 1767 డిసెంబర్‌లో ఆమె ఇండోర్ రాజ్యాధికారాన్ని చేపట్టింది. ప్రజలను ఎంతో దయ, కరుణతో పరిపాలించింది. రాజ్యంలో సంపదను పెద్ద ఎత్తున పెంచింది. వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో సంపద గణనీయంగా పెరిగింది. నేరాల రేటును బాగా తగ్గించింది. ఆమె రాజ్యంలోని వ్యక్తులే.. తమ దగ్గర విపరీతంగా పెరుగుతున్న సంపద గురించి పీష్వాకు సమాచారం ఇచ్చి అతణ్ణి అహల్యాబాయి పైకి ఉసిగొల్పారు. దీంతో సంపదను సీజ్ చేస్తానని పీష్వా మహారాణికి నోటీసులు పంపించాడు. ఆమె దీనికి సానుకూలంగా స్పందించి తమ రాజ్యంలో అదనంగా ఉన్న సంపదను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే వీటిని ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని కోరింది. రాణి తనకు షరతులు విధించడంపై పీష్వా ఆగ్రహించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. అహల్యాబాయి కూడా వెనక్కి తగ్గలేదు. అమ్మాయిలతో చిన్న సైన్యాన్ని తయారు చేసింది. పీష్వాకు కబురు పంపించింది. ‘నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నా. యుద్ధరంగానికి రా చూసుకొందాం. కానీ ముందుగా ఒకమాట. నన్ను బలహీనురాలివనుకుంటున్నావేమో.. నేనెంత బలహీనురాలినో చూపిస్తా రా.. మగవాళ్లమీద యుద్ధంలో నేను ఓడిపోతే.. నాకు జరిగే నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు ఓడిపోతే.. ఎప్పటికీ తలెత్తుకోలేవు’ అని సవాలు విసరడంతో పీష్వా బిత్తరపోయాడు. ఆమె ధైర్యానికి, సాహసానికి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆమెకు సందేశాన్ని పంపించాడు. తాను యుద్ధం చేయాలనుకోలేదని.. కుమారుడు చనిపోవడంతో సానుభూతి వ్యక్తం చేయడానికి వస్తున్నానని చెప్పాడు. పీష్వా అహల్యాబాయి వద్దకు వచ్చి.. నెలరోజులపాటు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషంగా వెళ్లిపోయాడు. 70 ఏండ్ల వయసులో అహల్యాబాయి చనిపోయింది.

మీరాబాయి (15వ శతాబ్దం):

రాజస్థాన్‌లో జన్మించిన రాణి మీరాబాయి.. తాతగారి దగ్గర పెరిగింది. ఆమె మంచి గాయకురాలు. ఆమె స్వరం.. అందానికి ముగ్ధులు కాని రాజులు లేరు. జోథ్‌పూర్ రాజ్య స్థాపకుడు రావు డూడా రెండవకొడుకు రతన్‌సింగ్ కూతురు మీరా. మేవాడ్ రాజు మీరా తాతగారి దగ్గరకు వచ్చి తన కొడుక్కు మీరాను ఇవ్వమని కోరాడు. అప్పటికే మీరా సంగీతంతోపాటు విలువిద్య, కత్తియుద్ధం వంటి యుద్ధ విద్యలు, గుర్రపుస్వారీ వంటివన్నింటిలోనూ ఆరితేరింది. అదే సమయంలో శ్రీకృష్ణ భావనలో పెరగటంతో ఆమె పూర్తిగా కృష్ణుడి భక్తురాలైంది. కృష్ణభక్తిలో మునిగిపోవడంతో ఆమె సాధారణ మనిషిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేకపోయింది. కానీ.. తాత మాటకు కట్టుబడి పెండ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ కృష్ణుడిపై భక్తి ప్రేమ తగ్గలేదు. ఆమె బావ ఒకరు మీరా కృష్ణభక్తి నచ్చక విషప్రయోగం చేసి ఆమెను చంపించాడు. 1547లో మీరా చనిపోయింది.

సంయుక్త (1150-1192):

కన్నౌజ్ రాజు రాజా జయ్‌చంద్ కూతురు. రాజ్‌పుత్ వీరుడైన పృథ్వీరాజ్ చౌహాన్‌ను వివాహం చేసుకొన్నది. ఢిల్లీ, అజ్మీర్‌ను ఏలిన రాజు పృథ్వీరాజ్ చౌహాన్. పృథ్వీరాజ్, సంయుక్తల ప్రేమకథ అజరామరమైంది. సంయుక్తను పృథ్వీరాజ్‌ను ప్రేమిస్తున్నదని తండ్రి జయ్‌చంద్‌కు తెలియడంతో ఆమెకు స్వయంవరాన్ని ఏర్పాటుచేశాడు. రాజులందరినీ పిలిచిన జయచంద్ పృథ్వీరాజ్‌ను పిలవలేదు. పైగా ప్యాలెస్‌కు బయట ద్వారపాలకుడిగా విగ్రహం చేయించి పెట్టి అవమానించాడు. ఈ విషయం తెలుసుకున్న సంయుక్త.. స్వయంవరం నాడు.. రాజులందరినీ వదిలేసి నేరుగా పృథ్వీరాజ్ విగ్రహం దగ్గరకు వెళ్లి దానికి వరమాల వేసింది. అప్పటికే అక్కడికి వచ్చిన పృథ్వీరాజ్ సంయుక్తను తన గుర్రంపై ఎక్కించుకొని వెళ్లిపోయాడు. ఇంతకంటే గొప్ప ప్రేమకథ ఏముంటుంది చెప్పండి? వీరికి మాత్రం తాజ్‌మహల్ వంటి సమాధి మందిరం లేదు.

దుర్గావతి (1524-1564):

రాజ్‌పుత్ కుటుంబం హీరత్‌రాయ్ కుటుంబంలో జన్మించిన దుర్గావతి.. దళపతిషా ను పెండ్లి చేసుకున్నది. ఇతను గోండ్ వంశానికి చెందిన సంగ్రామ్షా కుమారుడు. 1550లో భర్త చనిపోవడంతో దుర్గావతి రాజ్యాధికారాన్ని చేపట్టింది. అధికారులు, మంత్రుల సహకారంతో రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించింది. సుసంపన్నం చేసింది. ఈ రాజ్యంపై కన్నేసిన ఖ్వాజా అబ్దుల్ మజీద్ అసఫ్‌ఖాన్ దీనిపై దాడిచేయడానికి సిద్ధపడ్డాడు. దుర్గావతి కూడా యుద్ధం చేయడానికి రంగంలోకి దిగింది. కానీ, మొఘలులపై యుద్ధం చేయడం కష్టమని మంత్రులు రాణి దుర్గావతికి సలహా ఇచ్చారు. కానీ ఆమె యుద్ధానికే పూనుకొన్నది. ఓ పక్క సుశిక్షితులైన సైన్యం, ఆధునిక ఆయుధాలతో మొఘలులు.. మరో పక్క సంప్రదాయ యుద్ధరీతులు మాత్రమే తెలిసిన దుర్గావతి సైన్యం.. సంప్రదాయ ఆయుధాలు.. బలహీనులపైన బలవంతుడు చేసిన యుద్ధమిది. ఈ యుద్ధంలో దుర్గావతి సైన్యాధ్యక్షుడు అర్జున్‌దాస్ వీరమరణం పొందడంతో ఆమే నాయకత్వం వహించి ముస్లిం సేనలను తరిమికొట్టింది. యుద్ధంలో గెలిచింది.

తారాబాయి (1675-1761):

ఛత్రపతి శివాజీ కొడుకు రాజారాం భార్య తారాబాయి. మొఘలుల రాజ్యంలో ఆరు ప్రావిన్సులను గెలిచిన ఏకైక మహారాణి. 1700లో రాజారాం మహారాజ్ చనిపోవడంతో తారాబాయి రాజ్యాధికారాన్ని చేపట్టింది. తన కుమారుడు శివాజీ2 ను రాజును చేసి.. ఆమె గార్డియన్‌గా వ్యవహరించింది. మొఘలుల నుంచి మరాఠాల స్వాతంత్య్ర పోరాంలో కీలక పాత్ర పోషించింది. రాజారాం మహారాజ్ చనిపోయిన తర్వాత ప్రజలందరినీ చైతన్యపరిచి.. ఔరంగజేబును ముప్పుతిప్పలు పెట్టింది. మరాఠాలను నిబద్ధతతో నిలబడేలా చైతన్య పరిచింది. అద్భుతమైన స్ఫూర్తిని రగిలించింది. ఈమె రాజ్యంలో ఉన్న పన్హాలా, విశాల్‌గఢ్‌లను ఆక్రమించాలని సైన్యాన్ని పంపించాడు. కానీ.. తారాబాయి సైన్యం తిరుగులేని రీతిలో ఔరంగజేబు సైన్యాన్ని తరిమితరిమి కొట్టింది. ఆమె నాయకత్వంలో మరాఠాసైన్యం అత్యంత బలంగా, పటిష్ఠంగా రూపుదిద్దుకొని.. మొఘలుల సైన్యానికి సింహస్వప్నంగా మారింది.

అబ్బక్కాదేవి (15-16వ శతాబ్దం):

కర్ణాటకలోని తులునాడుకు చెందిన చౌతా వంశానికి చెందిన అబ్బక్క రాణి ఉల్లాల్ రాజ్యానికి రాణిగా వ్యవహరించింది. ఉల్లాల్‌ను స్వాధీనం చేసుకోవడానికి పోర్చుగీసులు చాలాసార్లు ప్రయత్నించినా.. అబ్బక్క వారిని విజయవంతంగా తిప్పికొట్టింది. మొదటిసారి అడ్మిరల్ డామ్ అల్వారో డ సిల్వేరియా (1555) ఉల్లాల్‌పైన దాడిచేశాడు. ఇతను మంగళూరు కోటను స్వాధీనంచేసుకొన్నాడు. కానీ అబ్బక్క అలర్ట్ అయి.. అతణ్ణి.. అతడి సైన్యంపై పోరాడి గెలిచింది. ఆ తర్వాత మూడేండ్లకు 1558లో జనరల్ పిక్సోటో ఉల్లాల్‌పై దాడిచేశాడు. పూర్తిస్థాయి ఆయుధాలతో, సుశిక్షితులైన సైన్యంతో యుద్ధం చేసి.. ఉల్లాల్ కోటను ఆక్రమించుకొన్నాడు. కోటనుంచి తప్పించుకొన్న అబ్బక్కబాయి బయట ఒక మసీదులో ఉండి.. అదే రోజు రాత్రి రెండు వందలమంది తన సైన్యాన్ని తిరిగి సమీకరించుకొని.. తన కోటపైనే మెరుపుదాడిచేసింది. జనరల్ పిక్సోటాను చంపేసింది. కొందరు పోర్చుగీసు సైనికులను యుద్ధఖైదీలుగా బంధించింది. మిగిలినవారు పారిపోయారు. ఆ తర్వాత అబ్బక్కాబాయి పోర్చుగీసులను తరిమి కొట్టి.. మంగళూరు ఫోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఉల్లాల్ కోటను గెలుచుకోవడానికి పోర్చుగీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

అక్కాదేవి (1010-1064):

కర్ణాటక చాళుక్య వంశానికి చెందిన మహారాణి. కిశుకాడు ప్రాంతాన్ని ఏలిన రాణి. మంచి అడ్మినిస్ట్రేటర్‌గా, సమర్థమైన పాలకురాలిగా పేరు ప్రఖ్యాతులున్న రాణి. అందుకే ఆమెకు ‘గుణదబేదంగి’ (గొప్ప అందంతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి) అని ఆమెను కొనియాడేవారు. ఆమె రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా.. రాజ్యంలో అందరికీ విద్యను ప్రోత్సహించింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు అందించింది. జైనులు, హిందువుల ప్రార్థనామందిరాలకు డబ్బులు ఇచ్చింది. 1022లో దొరికిన ఒకశాసనంలో అక్కాదేవిని యుద్ధంలో సాహసవంతురాలైన వీరనారిగా పేర్కొన్నారు.

వేలు నాచ్చియార్ (1730-1790):

ఈస్ట్ ఇండియా కంపెనీపై మొట్టమొదటిసారి తిరుగుబాటుచేసిన రాణి వేలు నాచ్చియార్. తమిళనాడులోని రామ్నాడు రాజు ఏకైక కూతురు కావడంతో యువరాజుగా పెరిగింది. మార్షల్ ఆర్స్ట్‌లో శిక్షణ పొందింది. దీంతోపాటు విలువిద్య, కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి యుద్ధవిద్యల్లో కూడా ఆరితేరింది. భారతదేశానికి బ్రిటిష్ వాళ్లు అప్పుడప్పుడే వస్తున్న కాలం. ఆర్కాట్ నవాబు మహ్మద్ అలీఖాన్ వల్లఝాకు మైసూరు రాజు హైదర్‌అలీ, ఫ్రెంచి వాళ్లను గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకు బ్రిటిష్ వాళ్ల సహాయం తీసుకొన్నాడు. మరోవైపు వేలు నాచ్చియార్ ముత్తువడు గనతపెరియను పెండ్లి చేసుకొన్నది. ఇతను శివగంగ రాజు. 1772లో బ్రిటిష్, ఫ్రెంచి వాళ్ల మధ్య జరుగుతున్న ఘర్షణలో ముత్తువడు చనిపోవడంతో కూతురును తీసుకొని తప్పించుకొని అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేలు నాచ్చియార్ 1780లో హైదర్ అలీ సహాయంతో తిరిగి బయటకు వచ్చింది. ఆమె అజ్ఞాతంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున సైన్యాన్ని సమకూర్చుకుంది. ఒక్కసారిగా పెద్ద సైన్యంతో ముందుకు వచ్చింది. వేలు నాచ్చియార్ బయటకు రావడంతోనే బ్రిటిష్ ఆయుధాగారాన్ని కనుక్కొన్నది. తన సైనిక కమాండర్లలో ఒకరైన కోయిలి ఈ ఆయుధాగారంపై ఆత్మాహుతి దాడిచేసి తనను తాను పేల్చుకొని ఆయుధాగారాన్ని పేల్చేసింది. మరో ఆయుధాగారంపై వేలు నాచ్చియార్ దత్తత తీసుకొన్న కూతురు ఉదయ్‌యాల్.. ఆత్మాహుతి దాడిచేసి పేల్చేసింది. ఆమెకు నివాళిగా వేలునాచ్చియార్ పెద్ద మహిళా సైన్యాన్ని తయారుచేసింది. తీవ్రమైన పోరాటం చేసిన తరువాత శివగంగను స్వాధీనం చేసుకొన్నది. ఆ వెంటనే ఆర్కాట్ నవాబును అరెస్టుచేసి ఖైదుచేసింది. బ్రిటిష్‌వాళ్లు శివగంగను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించిన తరువాత కానీ ఆర్కాట్ నవాబును వేలు నాచ్చియార్ విడిచిపెట్టలేదు.

బేగం హజ్రత్ మహల్ (19 వశతాబ్దం):

అవధ్ రాజు వాజిద్ అలీషా భార్య. బ్రిటిష్ వాళ్లు అవధ్‌రాజును సింహాసనం నుంచి దించి.. అవినీతి ఆరోపణలు చేసి రాజ్యం నుంచి బహిష్కరించారు. కానీ, హజ్రత్‌మహల్ తన కొడుకును రాజు చేసి.. గార్డియన్‌గా ఉంటూ రాజ్యాన్ని పరిపాలించింది. 1857లో సైన్యాన్ని సమీకరించి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తొలి స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించింది. చిన్హత్ యుద్ధంలో గెలిచింది. దీంతో పారిపోయిన బ్రిటిష్‌సైన్యం లక్నో రెసిడెన్సీలో దాక్కున్నది. హజ్రత్‌మహల్ లక్నో రెసిడెన్సీని దిగ్బంధం చేయడంతో బ్రిటిష్ పాలకులు అవధ్‌పై పాక్షిక అధికారం ఇవ్వడానికి ప్రతిపాదించారు. కానీ, ఆమె అందుకు అంగీకరించకుండా బ్రిటిష్‌వారిపై యుద్ధానికే సిద్ధపడింది. రెండేండ్లపాటు యుద్ధం కొనసాగించిన హజ్రత్‌మహల్ చివరకు వాళ్ల సాయుధసంపత్తి ముందు నిలువలేకపోయింది. 1859లో నేపాల్‌కు వెళ్లి అక్కడే స్థిరపడి.. 1879లో చనిపోయింది.

కాశ్మీర్ రాణులు:

కాశ్మీర్ రాజ్యాన్ని ఏలిన రాణుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సుగంధాదేవి, దిడ్డాదేవి, ఇష్ణాదేవి, వక్పుస్త, యశోవతి వంటి రాణులు కాశ్మీర్ రాజ్యాన్ని ఏలారు. కాశ్మీర్‌ను పరిపాలించిన మహారాణుల్లో రాణి యశోవతి మొదటి రాణి. మహాభారత కాలంలో మగధరాజు జరాసంధుడు.. కాశ్మీర రాజు గోనందుడి కుమారుడు దామోదర్ సైన్యం సాయంతో మథురపై యుద్ధంచేశాడు. ఆ యుద్ధంలో దామోదర్‌ను కృష్ణుడు హతమార్చాడు. ఆ తర్వాత యశోవతి తన కుమారుడిని సింహాసనంపై కూర్చోబెట్టి.. తాను రాజ్యం చేసింది. యశోవతి దాదాపు పదిహేనేండ్లు పరిపాలించింది. ఈమె చరిత్రను కల్హణుడు తన రాజతరంగిణి లో ఈమె చరిత్రను రికార్డుచేశాడు. ఆమె అత్యంత సమర్థురాలైన పరిపాలకురాలిగా పేరుతెచ్చుకొన్నది. రాణి దిడ్డాదేవి కాశ్మీర్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. దాదాపు యాభై ఏండ్లపాటు పరిపాలించి కాశ్మీర్‌లు సుస్థిరతను పాదుకొల్పిన రాణి దిడ్డాదేవి.

Coins of Rani Sugandha Devi

ఈ మొత్తం రాణుల చరిత్రను చూస్తే ఎంతో ప్రేరణ కలుగుతుంది. కొంత జాగ్రత్తగా గమనిస్తే.. బ్రిటిష్‌వాళ్లు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. భర్తలు చనిపోవడమో సంభవించినప్పుడు.. రాణులు అంత:పురానికి పరిమితం కాలేదు. బేలగా ఉండిపోలేదు. రాజ్యాధికారాన్ని చేపట్టి.. తమ అసాధారణ పాటవాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శత్రుమూకలను తరిమికొట్టారు. గెరిల్లా యుద్ధంచేశారు. ఆత్మాహుతి దాడులకూ వెనుకాడలేదు. ఇలాంటి వారి చరిత్ర మనకు ప్రేరణ కానక్కరలేదా? స్ఫూర్తి కానవసరంలేదా? మరి నెహ్రూ అండ్‌ కో.. హబీబ్‌ థాపర్ బృందం భారతదేశ చరిత్రపుటల్లో ఈ మహారాణులకు ఒక్క పేజీ కూడా కేటాయించలేకపోయారే. పైగా అసలు భారతదేశంలో ఆడవాళ్లకు ఎలాంటి హక్కులు, స్వేచ్ఛలేకుండా అణచివేశారని రాసుకొంటూ వచ్చారే.. దీన్ని ఏమనాలి? ప్రపంచంలో అసలైన ఫెమినిజం మనదేశంలో మాత్రమే ఉన్నదనడానికి ఈ రాణుల చరిత్ర చాలదా?

***

Images Courtesy : Internet, Swadhyaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here