రామం భజే శ్యామలం-27

3
7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]ఆ[/dropcap] మధ్య ఓ వాట్సాప్ గ్రూప్‌లో ఓ చర్చ జరిగింది. వేదం అనేది మతం అని.. వేద మతంలో దయ, ప్రేమ, కరుణ అనే పదాలకు తావులేదని.. బుద్ధుడు వచ్చిన తర్వాతే.. సోకాల్డ్ పదాలు ఈ వేదాలలో, ఉపనిషత్తులలో చేర్చారని.. ఆ పదాలను భారత్ పర్యటనకు వచ్చిన ఏసుక్రీస్తు అందిపుచ్చుకొని ప్రపంచానికి చాటాడని.. ఒకరు చర్చ మొదలుపెట్టారు. కొందరు దాని ఈకలు లాగడం మొదలుపెట్టారు. అహింస, ప్రేమ, కరుణ, దయ లాంటి పదాలు వేదాలలో లేకపోతే.. ఈ పదాలను ఒక్కసారిగా బుద్ధుడు చెప్పేసరికి ఆనాటి పండితులు.. ఆందోళన చెంది ఆ మాటల్ని తమ వేదాలు.. ఉపనిషత్తులు.. పురాణాల్లో చెప్పుకొంటూ వచ్చారని. బుద్ధుడు క్రీస్తుకు పూర్వం 13-15వ శతాబ్దాల మధ్యలో పుట్టిఉన్నట్టు అంగీకరిస్తే.. అప్పటికి భారతదేశంలో పండితులు ఇంకా ఉపనిషత్తులు రాస్తూనే ఉన్నారని.. ఆ రాస్తున్నవారికి బౌద్ధానికి సంబంధించిన కమ్యూనికేషన్ చేరి.. అందులోని అంశాలను తమ పుస్తకాల్లోనూ చొప్పించారని పేర్కొన్నారు. మరొకాయన అసలు వేదాలలో సామాజిక విలువలు లేవని.. యజ్ఞయాగాదుల గురించి మాత్రమే చెప్పారని.. కానీ బుద్ధుడు మానవుడి గురించి చెప్పాడని..  క్రీస్తు వచ్చి బుద్ధుడిని కనుగొన్నాడని.. ఆయన సమాధి ఇక్కడెక్కడో ఉన్నదని ప్రపంచ ప్రఖ్యాత దృశ్యమాధ్యమ సంస్థ బీబీసీ దీన్ని ప్రసారం చేసిందని కూడా సగర్వంగా చెప్పుకుంటూ వచ్చారు. మధ్యలో కొందరు పండితులు ఈ విచిత్రమైన చర్చలో కాలుపెట్టి సమాధానం చెప్పాలని ప్రయత్నించారు. కానీ వీళ్ల మాటల్ని వినిపించుకొనే నాథుడే లేకుండాపోయాడు. వాళ్లు ఏది ఉదహరించినా.. అవన్నీ బుద్ధుడి తర్వాతే జొప్పించినవని తేల్చిపారేశారు. ఇక్కడ ఆ పండితులు సమాధానాలు చెప్ప ప్రయత్నించడాన్నిచూస్తేనే నాకు బాధ కలిగింది. వారు ఏమి సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా.. ఎదుటివారు ‘వినయంగా’నే ఖండించారు. కానీ.. సదరు చర్చ ఏమీ తేలకుండానే అర్ధంతరంగా ముగిసిపోయింది. ఇదంతా ఎట్లా ఉంటుందంటే.. మీకేం తెలుసు.. నిమ్మకాయ పులుసు అన్నట్టు.. నీ దగ్గర ఏమీ లేదు అని నేనన్నానంటే.. లేదన్నమాటే.. నువ్వు ఏం చెప్పినా అంగీకరించేది లేదు. నిన్ను ఒప్పుకుంటే.. దేశాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. దేశంలోని అనాది సంస్కారాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి.. నీకు ఏమీ రాదు.. అందువల్ల నువ్వేమి చెప్పినా అది తప్పే. మేము చెప్పిందే రైటు.. మేము ఫలానా జరిగి ఉండవచ్చు అని చెప్తే.. అది జరిగినట్టే భావించాలి. ఒప్పుకోవాలి. బుద్ధుడు వచ్చి చెప్పిన తర్వాతే.. మీకు జ్ఞానోదయమై.. మీ పుస్తకాల్లో రాసుకొన్నారు. మేము చెప్తున్న కొద్దీ మీరు రాసుకొంటూనే ఉన్నారు. వాటన్నింటినీ కలుపుకొని.. మీరు వేదమో.. ఉపనిషత్తో.. మరొకటో.. ఏదో పేర్లు పెట్టుకొని.. మాదే ప్రాచీనం అంటూ చెప్పుకుంటుంటారు.. ఇదీ వారి వాదన. అద్భుతం.. వండర్‌ఫుల్..  కూపస్థ మండూకం అన్న ఒక మాట ఉన్నది. అంటే బావిలో కప్ప అని అర్థం. ఈ మాటను బుద్ధుడికి ముందు రాశారో.. వెనక రాశారో నాకు తెలియదు కానీ.. ఇది ఒక సంస్కృత జాతీయం. సదరు బావిలో ఉన్న కప్ప ఆ నీళ్లలో ఉంటూ చుట్టూ ఉన్న ఎడ్జ్‌లకు తాకి వెనక్కి వస్తుంది. ఆ గోడ బద్దలు కొట్టుకొని అది రాదు.. రాలేదు. దానికి అదే ప్రపంచం. అది దాటి బయటకు వస్తే మహాసముద్రంలో పడిపోవాల్సి వస్తుందేమోనని భయం. కాబట్టి.. సముద్రం అన్నది వేస్ట్.. నేనున్న బావే గొప్పది.. అని అనుకుంటుంటుంది. ఏ చర్చకైనా మౌలికంగా ఒక ప్రాతిపదిక ఉంటే.. హుందాగా సాగుతుంది. ఎంతసేపూ ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉండి.. దాన్నుంచి బయటపడలేక.. ఏదోరకంగా.. ఏ రకంగానైనా తమ వాదనను సమర్థిస్తుంటారు కొందరు. ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరు. మీ వాదనకు హేతువు ఏది అనేవారు.. తమ వాదనకు ప్రాతిపదిక ఏమిటన్నది చెప్పలేరు. వాళ్లకు అనుకూలంగా ఏదైనా వాదిస్తారు. ఇదంతా యురోపియన్ జీవన విధానంలో ఒక అంతర్భాగమైన అంశం.

ఈ చిత్రమైన చర్చ.. నాలో విచిత్రమైన.. వ్యంగ్యమైన ప్రశ్నను రేకెత్తించింది. ఇది పూర్ణపురుషోత్తముడైన గౌతమబుద్ధుడ్ని.. ఆయన ఉన్నతిని అగౌరవపరచడం ఎంతమాత్రం కాదు. కానీ.. ఈ చర్చ నా మనసులో సృష్టించిన కల్లోలానికి ఫలితం. అందుకే ముందే చెప్తున్నా.. త్వమేవ శరణం మమ.. అని బుద్ధుడిని ప్రార్థిస్తున్నా. వేరే అనుకోవద్దు.. ఈ మాట కూడా బుద్ధం శరణం గచ్ఛామికి పర్యాయం అని భావించవచ్చు. గౌతమ బుద్ధుడు పుట్టడానికి ముందు సమాజం అన్నది ఒకటి ఉన్నదా? ఉంటే అది అనుసరించిన మతం ఏమిటి? ఆ మతం ప్రబోధించిన జీవన మార్గం ఏమిటి? దాదాపు 29 సంవత్సరాలపాటు గౌతమ బుద్ధుడు అదే ధార్మిక సమాజంలో జీవించి ఉన్నాడు కదా. గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అనుసరిస్తూ ఉన్న మతం ఏమిటి? వేదమతమా? హిందూ మతమా? మరింకేదైనా ఉన్నదా? ఈయన సదరు మతాన్ని అనుసరించి.. వివాహం చేసుకున్నాడు కదా? ఆయన వేదమార్గాన్ని లేదా.. హిందూ మార్గాన్ని.. అనుసరించి చేసుకున్నాడా? దాని పద్ధతి ప్రకారమే చేసుకున్నాడా? లేదా? ఆయన వివాహం చేసుకున్నప్పుడు ఏవైనా మంత్రాలు చదివి ఉండవచ్చా? ఒకవేళ మంత్రాలు చదివితే.. అవి ఏమిటి? ఎక్కడినుంచి వచ్చాయి? వాటి అర్థాలు ఏమిటి? ఆయన దాంపత్య ధర్మాన్ని పాటించాడు కదా.. ఒక కుమారుడు కూడా కలిగినాడు. గృహస్థాశ్రమం లేదా దాంపత్య ధర్మం గురించి ఎక్కడ చెప్పబడింది? దీనివెనుక ఉన్న భావన ఏమిటి? ఇందులో ప్రేమ, దయ, కరుణ అన్న భావనలు ఉన్నాయా? లేవా? ఈ దాంపత్య ధర్మం అన్నది వేదమతం లేక ధర్మం, లేక హిందూ మతం లేక ధర్మం లోనిదా? కాదా?    

అంతెందుకు? సిద్ధార్థుడు రాజభవనం వదిలి వీధిలోకి వచ్చినప్పుడు ఒక శోకతప్తమైన అంతిమయాత్రను చూశాడు. చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబసభ్యులు అంత్యక్రియలకు తీసుకొని వెళ్తుండగా వారిలో వ్యక్తమైన అనంతమైన దు:ఖానికి విచలితుడై రాజ్యాన్ని, రాజభవనాన్ని విడిచి ఆ దుఃఖానికి కారణాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. సిద్ధార్థుడు గౌతముడిగా సాగిన ప్రస్థానంలో తొలి అడుగు ఇదే. ఈ దుఃఖానికి ప్రాతిపదిక ప్రేమ, దయ, కరుణ అన్నవి కావా? వేదమతం సామాజిక విలువల గురించి చెప్పనే చెప్పనప్పుడు.. దాని గురించిన ఆలోచనే చేయనప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు ఎందుకు జరిపేవారు? లుంబిని వనం సమీపంలో ఉత్తర క్రియలు నిర్వహించడంపై దివ్యావదానం అన్న శ్రీలంక బౌద్ధ మత గ్రంథాల్లో చర్చించారు. (దీని ఇంగ్లీషు ప్రతి అందుబాటులో ఉన్నది) ఈ ఉత్తర క్రియలకు ప్రాతిపదిక ఏమిటి? ఒక జీవుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అతడు దుఃఖితుడై ప్రేత రూపంలో చరించకుండా.. ప్రశాంతచిత్తంతో ప్రయాణించడానికి వీలుగా ఉత్తరక్రియలు నిర్వహించాలని వేదోక్తి. ఆ జీవుడికి సదరు కుటుంబ సభ్యులు చేసే ఉత్తర క్రియల వెనుక ప్రేమ, దయ, కరుణ అన్న భావన ఉన్నవా? లేవా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. నాకేమో ఆ వేదాలలో చెప్పిన సూక్తుల గురించి (మంత్రాలు) గురించి ఎంతమాత్రం తెలియదు.

మరొక వాదన ఏమిటంటే.. వేదాలలో సామాజిక విలువలు లేవు.. యజ్ఞయాగాల గురించి మాత్రమే చెప్పారని బీబీసీ వాడు చెప్పాడట. ఇంతకీ ఈ యజ్ఞ యాగాలు అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? ఏ ప్రయోజనాన్ని ఆశించి చేస్తారు? ఏమీ ఉబుసుపోక.. దగ్గర్లో ఉన్న కొన్ని కొమ్మల్ని నరుక్కొని వచ్చి.. చలినెగళ్లు వేయడం కాదు కదా..  యజ్ఞం చేయడమంటే? యజ్ఞంలో బలులు ఇస్తారు.. ఇంకేదో చేస్తారు.. ఇవన్నీ దేనికి చేస్తారు. యజ్ఞం అన్న మాటకు మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి.. దేవపూజ, రెండు.. దానం, మూడు.. సంగతీకరణం.. సంగతీకరణం అంటే.. సంఘటనమని అర్థం. ధర్మాన్ని పాటించే ప్రజాసమూహ ప్రయోజనం కోసం సంఘటితం చేయడమే యజ్ఞమని అన్నారు. ఈ యుగంలో సంఘటనానికి మించిన శక్తిమంతమైంది లేదు. అలాంటి సంఘటనం యొక్క ప్రయోజనం కోసం చేసేది యజ్ఞమని అన్నారు. కొంచెం డైల్యూట్‌చేసి మన వ్యవహారంలో చెప్పాలంటే లోక కల్యాణం కోసం అని అర్థం. ఈ యజ్ఞం గురించే కదా వేదం ఘోషించింది. లోకకల్యాణంలో.. ప్రజాసమూహ ప్రయోజనాలు నెరవేరాలనడంలో సామాజిక విలువలు ఉన్నట్టా లేనట్టా? మరింత విప్పి చెప్పాలా? పెద్దలు చెప్పాలి!

ఒకాయన అంటాడూ.. ఎవరైనా ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు.. ఆ సిద్ధాంతం తమ సిద్ధాంతంలో లేకపోయి ఉంటే.. వెంటనే.. దాన్ని లిఫ్ట్ చేసి.. జాగ్రత్తగా తమ పుస్తకాల్లో జొప్పించి.. ఇదిగో మా దగ్గరే ఉన్నది అని ఈ భారత పండితులు ‘వింత సమర్థన’ చేస్తారట. విస్మయాశ్చర్యాద్భుతపూర్వ వాదన ఇది. వీటిల్లో ఈ మార్పులు చేర్పులు చేసింది ఎవరు? ఇంత గొప్ప ఆలోచన వచ్చిన సదరు ఎడిటర్ ఎవరు? వీళ్లకూ తెలియదు. బట్ట కాల్చి మీదేయడం వీరికి అలవాటైన లక్షణమే. అందువల్లే ‘బుద్ధుడు పుట్టి పెరిగి.. పెద్దై. బోధి చెట్టుకింద జ్ఞానం సంపాదించి చెప్పిన తర్వాత.. ఎవరో ఒక ఎడిటర్‌కు ఉన్నట్టుండి బుద్ధిపుట్టి.. అరెరే.. ఈ బుద్ధుడు ఇట్లా చెప్తాడేమిటి? మనకు దయ, జాలి, ప్రేమ, కరుణ అనే సరికొత్త పదాలను చెప్తున్నాడేమిటి.. వీటిని మన పుస్తకాల్లోనే జోడిస్తే పోలా.. అని ఆ గీతల్లో కొన్ని గీతలు యాడ్ చేశాడు. మేం చెప్తున్నాం కదా.. మీరు చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే’ అని చెప్పేస్తారు. సదరు ఎడిటర్ ఎవరో బుద్ధుడే వచ్చి చెప్పాలి మరి.. ఆ ఎడిటర్ ఇదే పనిమీద కాచుక్కూచుని ఉన్నాడేమో తెలియదు. ప్రపంచానికి బౌద్ధం ప్రేమైక మార్గదర్శనం చూపించిందనడంలో సందేహం అక్కర్లేదు. సర్వజీవుల పట్ల ప్రేమ, దయ చూపించాలని చెప్పిందనడంలోనూ అభ్యంతరం లేదు. కానీ.. అంతకుముందు ఎవరూ చెప్పలేదు. అసలు ఆ పదాలకు నిఘంటువుల్లో ప్లేస్ లేనే లేదనడంలోనే చిక్కు వచ్చిందంతా?

నాకు తెలిసినంత వరకు ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు రాసినప్పుడు.. (సారీ.. ముఖతః చెప్పినప్పుడు).. ఈ దేశంలోనికి బ్రిటిష్‌వాడు వచ్చి ఉండలేదు. మనవాళ్లకు అప్పటికి బ్రిటిష్‌వాడికి ఉన్నంత తెలివితేటలు రాలేదు. ఒకరు చెప్పినదాన్ని ఇంకొకదానిలోకి ఇరికించి చెప్పుకోవాల్సిన అగత్యం పట్టలేదు. మరి భారతంలో కొన్ని కథలు చేర్చారు కదా? అని అంటారు. దీనికి ఆధారభూమిక ఏమిటి? అని ప్రశ్నిస్తే ప్రధాన కథ కాకుండా మధ్యలో పిట్టకథలు రావడమేంటి? మన నవలలు అట్లా ఉండవు కదా.. భారతం మాత్రం అట్లా ఎట్లా ఉంటుంది. అంటే పిట్టకథలన్నీ చొప్పించినట్లేనని కన్‌ఫాం చేయాల్సిందేనంటారు. ఈ పిట్టకథలు చేర్చారా లేదా అంటే.. చేర్చారనే వాళ్లకూ తెలియదు.. చేర్చలేదనే వారికీ తెలియదు. కానీ ఇతిహాసమైన భారతంలో ప్రధాన ట్రాక్‌కు మధ్యలో ఈ సైడ్ ట్రాక్ ఎందుకు వచ్చింది? (‘పోకిరి’ సినిమాలో బ్రహ్మానందం అలీ ట్రాక్‌లాగా) దానికి అనేక కారణాలు ఉన్నాయి. నాది చిన్న బుర్ర. ఆ బుర్రకు తెలిసిన విషయం ఏమిటంటే.. ఇతిహాసాల వంటివాటిల్లో ప్రధాన కథనానికి సమాంతరంగా ఉపాఖ్యానాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ఉపాఖ్యానాలన్నీ కూడా.. అంతర్లీనంగా ప్రధాన కథతో సింక్రనైజ్ అయి ఉంటాయి. మహాభారతమే తీసుకొంటే.. అందులో గరుడోపాఖ్యానం ఉంటుంది. ఈ గరుడోపాఖ్యానం ఒక విధంగా మహాభారత కథేనని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇందులో వినతకద్రువలు.. కుంతి గాంధారీలకు ప్రతీకలు. ఇలా కథనాన్ని విశ్లేషించుకొంటూపోతే.. మహాభారతంలోని మౌలిక అంశాన్ని గరుడోపాఖ్యానం ముందుగానే వివరిస్తుంది. ఉదంకుడి కథ అలాంటిదే. ఆనాడు ప్రింటింగ్ ప్రెస్‌లు లేవు కాబట్టి.. ముఖే ముఖే సరస్వతి అన్నారు. ఒక ముఖం నుంచి మరో ముఖానికి నాలెడ్జి ట్రాన్స్‌మిట్ అవుతూ పోయింది. 

న హింస్యాత్ సర్వభూతాని.. అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఒక్క జంతువును కూడా చంపవద్దు అని. దీన్ని దయ అని కరుణ అని అంటారని అనుకుంటా.. ఈ మంత్రం ఎక్కడిది? బుద్ధుడి తర్వాత సృష్టించిందా? భగవద్గీత అనేది భారతంలో ఒక పార్ట్. శ్రీకృష్ణుడు చెప్పాడని వ్యాసుడనే ఆయన రాశాడు. ఈ భారతాన్ని ఒక శ్లోకముంటే.. వెయ్యి శ్లోకాలు చేశారని.. లక్ష శ్లోకాలు చేశారని కోటి శ్లోకాలు కూడా చేశారని చెప్తారు. ఈ భారతం, లేదా రామాయణం బుద్ధుడికంటే ముందు పుట్టాయా? తరువాత పుట్టాయా? భారతీయులైనవారి కాలనిర్ణయ గణాంకాలను కొద్దిసేపు పక్కన పెడదాం. వీరు నెత్తిన పెట్టుకొనే యూరోపియన్ల చరిత్రకారుల లెక్కల ప్రకారమే గౌతమ బుద్ధుడు, వేదాలు, భారత రామాయణాల కాలాన్ని పరిశీలిద్దాం. బుద్ధుడు క్రీస్తుపూర్వం 500-400 మధ్యలో ఈ భూమ్మీద నడయాడారు. ఈ కాలానికి ‘ఉండవచ్చు’ అన్న ఊహే తప్ప.. స్పష్టమైన ఆధారాలు వీరికి (యురోపియన్ చరిత్రకారులకు) దొరకలేదు. మనవాళ్లు చెప్పిన కాలాన్నిఅంగీకరించే పరిస్థితి లేదు. సరే.. ఈ ‘ఫలానా సమయంలో పుట్టి ఉండవచ్చు’ అన్న మాటనే అంగీకరిద్దాం. మరోవైపు. భారతదేశంలోని సోకాల్డ్ చరిత్రకారులు, లిబరల్స్, హేతువాదులు, మేధావులు అని చెప్పుకొనేవారంతా పూజించే మ్యాక్స్ ముల్లర్ లెక్కల ప్రకారం వేదాలు క్రీస్తుపూర్వం 1500 లో రాశారని కదా మనం నమ్మేది. ఆర్యులు భారతదేశానికి దండెత్తివచ్చి.. (యురోపియన్ ఏఐటీ స్కీం) ఎక్కడినుంచో ఇక్కడికి సంస్కృతాన్ని పట్టుకువచ్చి.. వేదాలు రాయించారన్నది కదా..  వాదన.  వేదాలు అనబడే ఈ పుస్తకాలను 1500 లో వ్యాసుడో.. ఇంకెవరో రాశారనుకొందాం. ఇక మహాభారతం లేదా జయం.. అన్నదాన్ని క్రీస్తుపూర్వం 1400, రామాయణం అలియాస్ సీతాయాశ్చరితం మహత్ అన్నదాన్ని భారతం తరువాత క్రీస్తు పూర్వం 1200 లో రాశారని ఏన్షియంట్ ఇండియా గ్రంథంలో రోమిలాథాపర్ అనే చరిత్రకారిణి రాశారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే బుద్ధుడికంటే దాదాపు ఓ ఎనిమిది వందల ఏండ్లకు పూర్వం భారత రామాయణాలు రాసి ఉండాలి కదా.. లేదా చెప్పి ఉండాలి కదా.. మరి వాటిల్లో ప్రేమ, దయ, కరుణ అన్న పదాలు లేవా? వెయ్యేండ్ల తరువాత వాటిల్లో జొప్పించారా? దీనికి ఆధారమేమిటి? పోనీ.. వీళ్లన్నట్టుగా జొప్పించారే అనుకొందాం.. ఎక్కడో మధ్యలో ఒకటోఅరో కథనాలను (వీరి టెర్మినాలజీ (జాగ్రత్తగా) ప్రకారం) జొప్పించి ఉండాలి. మరీ మొదటిశ్లోకం నుంచి జొప్పించరు కదా? అలాంటప్పుడు రామాయణం రాసిన వాల్మీకి తొలి శ్లోకం ‘మానిషాద ప్రతిష్ఠాంతాం’ అన్న శ్లోకంలోని అపారమైన కరుణ రసానికి ప్రాతిపదిక ఏమిటి? ఎట్లా వచ్చింది?

ఒకాయన అభిప్రాయం ఏమింటే.. ‘మీరు చెప్పినట్టే బుద్ధుడు క్రీస్తుపూర్వం 13, 15 శతాబ్దాల మధ్య పుట్టినట్టు అంగీకరిస్తే.. ఉపనిషత్తులు ఇంకా అప్పటికి రాస్తూనే ఉండి ఉంటారు కదా.. అందువల్ల బుద్ధుడి బోధనలను అందులో చేర్చి ఉండవచ్చుకదా’ అని ఈ ‘వచ్చు’లు చెప్పుకుంటూ వచ్చారు. భారతీయుల కాల నిర్ణయాన్ని అంగీకరించడం అంటూ జరిగితే.. ఏదో ఒకదానికి కట్టుబడాల్సి ఉంటుంది. యురోపియన్ చరిత్రకారులు బుద్ధుడి కాలనిర్ణయం ముందుకు జరిపిన పాపానికి భారత దేశ చరిత్ర దాదాపు 12 వందల సంవత్సరాలు నష్టపోయింది. భారతీయ చరిత్రకారులు చెప్పినట్టు భారతీయ గణాంకాల ప్రకారం కాలగణన చేస్తే.. బుద్ధుడి కాలం వెనక్కిపోతుంది. దాంతోపాటే.. మిగతా అన్నీ కూడా వెనక్కి వెళ్తాయి. అలా కాకుండా బుద్ధుడు పుట్టిన కాలాన్ని మాత్రమే వెనక్కు తీసుకొనిపోయి.. మిగతావన్నింటినీ యురోపియన్ చరిత్రకారుల లెక్కల ప్రకారం చూస్తామంటే ఎట్లా సాధ్యం? కోట వెంకటాచలం గారి లాంటి ప్రసిద్ధ చరిత్రకారులు చెప్పినట్టు క్రీస్తుపూర్వం 1887లో బుద్ధుడు జన్మించాడని అంగీకరిస్తే.. (ఇదే వాస్తవం.. దీన్నే అంగీకరించాలి.. దీనికి సంబంధించిన లెక్కలు గత వ్యాసాల్లో చూసుకోవచ్చు) వేదకాల ప్రామాణ్యం కూడా అదే రేషియోలో వెనుకకు వెళ్తుంది. ఈ లెక్కల ప్రకారం బుద్ధుడు కలియుగం (క్రీస్తుపూర్వం 3102) ప్రారంభమైన తర్వాత ఇక్ష్వాకు వంశంలో 24 వ రాజు. ఇక్ష్వాకు వంశం అంటే అయోధ్యనేలిన శ్రీరామచంద్రుడిదే. ఇది సంపూర్ణ గణాంకాలు సహా తేలిన విషయం. అలాంటప్పుడు రాముడి జీవిత కాలంలో ఉన్నదంతా కరుణే కదా.. చివరకు లంకలో యుద్ధ రంగంలో ఒక్కో రాక్షసుడు చనిపోతున్న ప్రతిసారీ రాముడు ఎంతో బాధపడుతుంటాడు. ఒక వ్యక్తి చేసిన నేరానికి ఇందరు చనిపోవాల్సి వస్తున్నదే అని ఆవేదన చెందుతాడు. ఇంతకంటే కారుణ్యమైంది ఏమున్నది. కైక, భరతుడు, లక్ష్మణుడు, గుహుడు, శబరి, సుగ్రీవుడు, జటాయు, సంపాతి.. ఇలా రాముడు దయ చూపని జీవులేరి?

ఇక్కడ మరొక్క విషయం చెప్పాల్సి ఉన్నది. ఋగ్వేదంలోని దశమ మండలంలోని ఒక స్మృతిగీతమిది.

వర్చస్సుకోసం, బలం కోసం, శక్తికోసం
ఈ మృతవీరుని హస్తం నుంచి ధనస్సును గ్రహిస్తున్నాను
మీరూ, మేమూ మనం విశ్వమంతా నిండిన
వైరి చక్రాన్ని అతిక్రమిస్తాము
ఇతన్ని మాతృభూమి ఒడిలోకి
అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం
శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగేదాకా
విచ్ఛిత్తి నుంచి రక్షించనీ
పృథివీ ఇతన్ని బలంగా నొక్కకు
ఊపిరి పీల్చుకోనీ
సులభంగా, సుకుమారంగా ప్రవేశించనీ
అవనీ! తల్లి బిడ్డను పొత్తిళ్లలో
ఒదిగినట్టు ఒదిగించుకో – (ఋగ్వేదం 18-9.10.11) (భావుకసీమ, సుప్రసన్న, పు. 127 నుంచి)

ఒక వీరుడు మరణిస్తే అతని అనుచరులు అతని మరణం నుంచి ప్రేరణ పొందుతూ.. అంత్యక్రియలు చేస్తున్న వర్ణనకు తెలుగుసేత ఇది. ఈ చర్చకంతటికీ ఈ ఒక్క సమాధానం చాలదా? తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగించుకోవడం అన్న మాటకు అర్థం ప్రేమ కాదా? ఇందులో ఒక్కో పదం ఒక్కో భావనకు ప్రతీక. దీన్ని కూడా బుద్ధుడి తరువాతే రాశారనే వారికి ఏమీ చెప్పలేం.

ఈ దేశాన్ని గురించి భావన చేస్తున్నప్పుడు క్షణక్షణం ఒక్కో ప్రశ్న మౌలికంగా తలెత్తుతున్నది. ఇదే సందర్భంలో తలెత్తిన మరో ప్రశ్న.. మతం. మన దేశాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన పెను విధ్వంసక అస్త్రమిది. వేద మతం.. హిందూ మతం అన్నారు. ఎవరైనా పొరపాటున హిందూ అనేది మతం కాదు.. జీవన విధానం.. వేదం అనేది మతం కాదు సంస్కృతి లేదా ధర్మం ఇలాంటి మాటలు మాట్లాడితే పిచ్చోళ్ల కింద జమకడతారు. ఇది కూడా బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన నెత్తిన వచ్చి పడ్డ పిడుగు. ఏదో తమ ధర్మాన్ని పాటించుకొంటూ.. తమదైన మార్గంలో నడుస్తున్న ప్రజలను మతమనే ఊబిలోకి తోసేసి ఊపిరాడకుండా చేశారు. మొదట్లో మనవారికి ఏమీ అర్థం కాలేదు. కొత్తగా వచ్చిన వాళ్లు వేదమతం అంటారు.. హిందూమతం అంటారు.. ఏమిటిదని తల బద్దలు కొట్టుకున్నారు. మనం ఒక్క దేవుణ్ణే పూజించం.. ఒక్క పద్ధతినే పాటించం.. మనం మనలోపల ఏ అభిప్రాయమైతే ఉన్నదో.. దాని ప్రకారం నడుచుకొంటున్నాం కదా.. శివాయ విష్ణురూపాయ.. శివరూపాయ విష్ణవే.. అన్నారు. శ్రీలక్ష్మీం.. కమల ధారిణ్యై, సింహవాహిన్యై అని ఒక్కటిగానే భావిస్తున్నాం కదా.. మన జీవితంలోని అనేకానేక అంశాలతో ముడిపడి ఉన్న అత్యున్నతమైన భావనే కదా భగవంతుడు. మరి ఈ మతం ఎక్కడిది? అంటే ఈ దేశంపై ప్రయోగించిన కల్చరల్ వెపన్ ఇది. కులము, మతము.. ఈ రెండూ కూడా మన దేశంపై సూపర్ ఇంపోజ్ చేయబడ్డవే..  18, 19 శతాబ్దాల వరకు కూడా మన దేశంలో కులం అన్న మాట లేదు. మొఘలుల సామ్రాజ్యం పతనమై.. మరాఠాల సామ్రాజ్యం పతనమై.. బ్రిటిష్‌వారి సామ్రాజ్యశక్తుల రాజ్యం వచ్చిన తర్వాతే.. ఆయా వృత్తులు చేసేవారిని, వారి వృత్తుల పేర్లపైనే కులాలుగా మార్చి.. కులవ్యవస్థ వేళ్లూనుకొన్నది. రామాయణం అరణ్యకాండలో భరతుడితో శ్రీరామచంద్రుడు అంటాడు. ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిని ఉత్తమ పనుల్లో.. మధ్యమ నైపుణ్యం కలిగిన వారిని మధ్యమ పనుల్లో.. అధమ నైపుణ్యం కలిగినవారిని అధమ పనుల్లో నియమిస్తున్నావు కదా అని. ఇక్కడ అధమ అంటే నీచమని కాదు.. తక్కువ.. చిన్న అని అర్థం. నైపుణ్యాన్ని ఆధారం చేసుకొని ప్రజలను ఆయా వర్గాలుగా విభజించారే తప్ప.. ఈ కుటుంబంలో పుట్టావు కాబట్టి.. ఇదే పనిచేయాలని రాముడూ చెప్పలేదు.. ఆనాటి రావణుడూ చెప్పలేదు. మనకు సావరిన్ స్టేట్ అనే మాట తెచ్చిపడేశారు. రిలీజియన్, క్యాస్ట్.. ఇవన్నీ మనం అడక్కుండానే వాడెవడో వచ్చి.. ఇదిగో మీ దేశంలో దీన్ని మతం అనండి.. దీన్ని కులం అనండి.. దీన్ని జాతి అనండి. మీ చరిత్రను మేం రాసి చెప్తున్నాం. దాన్ని చదువుకొండి.. తరించండి అని చెప్తే.. వాడికి విగ్రహాలు పెట్టి.. క్షీరాభిషేకాలు చేసి.. వాడు చెప్పింది చదువుకుంటూ ధన్యులమవుతున్నాం.

ఈ మతం అన్న మాట తెల్లోడు వచ్చేంత వరకు కూడా మనకు తెలియదు. ఇది లాటిన్ పదం. రిలిజియో అన్న లాటిన్ పదమే మతంగా ట్రాన్స్‌ఫామ్ అయింది. పవిత్రమైన వాటికి గౌరవం ఇవ్వడం, దేవతలను పవిత్రంగా ప్రార్థించడం అన్న అర్థంలో ఈ పదాన్ని వాడేవారు. మనిషికి, దేవతలకు మధ్య బాధ్యత, బంధం అన్న భావన నుంచి ఈ రిలీజియో అన్న మాట పుట్టుకొచ్చింది.  16, 17 శతాబ్దాల మధ్యన ఈ రిలీజియో పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. సైనికులు ప్రమాణం చేస్తున్నప్పుడు దానికి కట్టుబడి ఉండటం అన్న భావనకు రిలీజియో అన్న పదాన్ని జూలియస్ సీజర్ వినియోగించాడట. రోమన్ ప్రకృతి శాస్త్రవేత్త ప్లీనీ.. రిలీజియో అన్న మాటను ఏనుగులపై వాడాడు. జోసెఫ్ కాంప్‌బెల్, టామ్ హార్పర్ వంటివారు కూడా ఈ పదాన్ని విశ్వాసము, నమ్మకమూ అన్న అర్థంలో వాడుకుంటూ వచ్చారు. లాటిన్ పరిభాషలో రిలిజియో అన్న మాటకు మనస్సాక్షి, హక్కు, నైతిక బాధ్యత అన్న అర్థాలు ఉన్నాయి. మనదేశంలో దేవుని ఆరాధన అన్నది వ్యక్తిగత ధర్మంగానే పరిగణించారు తప్ప.. సామాజిక అంశంగా ఎప్పుడూ గుర్తించలేదు. రోమన్లు దేవతల పట్ల సంబంధాల సందర్భంలో కట్టుబాటుగా ఈ రిలిజియో మాటను వాడారు. క్రీస్తుశకం 1500 వరకు కూడా రిలీజియన్ అన్న మాటకు ప్రాచుర్యం రాలేదు.  యూరప్ దేశాలలో క్రీస్తుశకం 1500 లలో.. పరిపాలనలో చర్చి ఆధిపత్యాన్ని తగ్గించడానికి చర్చికి.. పౌర అధికారుల మధ్య అంతరాన్ని సూచించేందుకు రిలీజియన్ అలియాస్ మతం అన్న మాటను వినియోగించారు. 17వ శతాబ్దంలో క్రైస్తవ మత విభజన, ప్రొటెస్టెంట్ల సంస్కరణ వాదం, ప్రపంచీకరణ వంటి పరిణామాల నేపథ్యంలో రిలీజియన్ అన్న మాటను మతమనే అర్థంలో విస్తృతంగా వాడటం ప్రారంభమైంది. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణలో ఇది అత్యంత ప్రముఖ పాత్ర పోషించింది. యురోపియన్ భాషలు కాని భాషా సంస్కృతులను మతాలుగా పరిగణించారు. జాతి అన్న నిర్వచనమూ దీంతోపాటే వచ్చింది. వాస్తవానికి అంతకుముందు బైబిల్ ఖురాన్‌లలో కూడా మతం అన్న మాట లేదు. హిబ్రూలో మతానికి సమానమైన పదం కనిపించదు. జూడాయిజం.. దేశం, జాతి, మతం వంటి  ప్రత్యేక గుర్తింపులను చూడదు. యూదులు తమ గుర్తింపును ఒక జాతీయ భావనతో చూశారే తప్ప మత ప్రాతిపదికన చూడలేదు. వీరు తప్పనిసరిగా ఒక సిద్ధాంతాన్ని నమ్మడం కానీ.. నియంత్రిత ఆచారాలను  పాటించడం కానీ చేయరు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాడు.. తాను ఆక్రమించుకున్న అన్ని దేశాల్లోనూ ఈ మతమనే మహమ్మారిని వ్యాప్తిచేశాడు. పర్యవసానంగా దేశంలో సమాజం విచ్ఛిన్నమవడానికి కారణమైంది. మనదేశంలో మతమన్నదే లేనప్పుడు వేదమతం, హిందూమతం, శైవమతం, వైష్ణవమతం, శాక్తేయ మతం అన్న భావనలకు ఆస్కారమెక్కడిది? యూరోపియన్ చరిత్రకారుల మాయ పొరలు వీడనంతకాలం ఈ దేశంలో వితండవాదనలు.. వింత సమర్థనలు కొనసాగుతూనే ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here