రామం భజే శ్యామలం-32

2
7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]దే[/dropcap]శ ప్రాచీన చరిత్ర, సంస్కృతి గురించి బాగానే చర్చించాం. చరిత్ర ప్రాచీనమనడానికి ప్రాతిపదిక ఏమిటి? రాముడు ప్రాచీనుడనో.. భారతీయులకు మూలపురుషుడనో చెప్పడానికి హేతువు ఏమిటి? భారతీయులు చరిత్ర కాలనిర్ణయం ఏ విధంగా చేశారు. ఇది పెద్ద ప్రశ్న. జ్యోతిషం అంటే.. పనికిరానిదంటారు. పంచాంగం అంటే వేస్ట్ అని కొట్టిపారేస్తారు. పురాణాలు, ఇతిహాసాలు.. అంతకుముందున్న వేదాలు ఎందుకూ కూడా కొరగాకుండా పోయాయి. బైబిల్ టెస్ట్‌మెంట్‌లో చెప్పినట్టు క్రీస్తు పుట్టడానికి నాలుగువేల నాలుగు వందల సంవత్సరాల క్రితం జూన్‌లోనో.. జూలైలోనో ప్రళయం వస్తే.. భూమంతా నాశనమైపోతే.. నోవా అనేవాడు కొంతమందిని ఆ ప్రళయంలో ఎక్కించుకొని కాపాడితే.. అక్కడినుంచి మాత్రమే చరిత్ర మొదలైంది. అలాగే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. దాన్ని బేస్ చేసుకొనే చరిత్రను నిర్మాణం చేసుకొంటూ పోయారు. ఈ నోవా కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. మన వటపత్రశాయి భావన.. ప్రళయం వచ్చినప్పుడు సప్తఋషులు పడవలో సురక్షితంగా వెళ్లడం వంటి వాటినుంచి స్వీకరించినవే.. సరే ఇదంతా ఒక కథ అనుకుందాం. భారతీయులు తమ పూర్వికుల కాలనిర్ణయాన్ని ఏ విధంగా చేశారు. దివారాత్రులను ఏవిధంగా కొలిచారు. సృష్టి పరిణామసిద్ధాంతాన్ని ఏవిధంగా ప్రతిపాదించారన్న అంశాన్ని చర్చిద్దాం.

మన చరిత్రకారుల కాల నిర్ణయ విధానానికి ప్రధాన భూమిక ఆర్కియో ఆస్ట్రానమీ. ఇది కొత్తగా అనిపించవచ్చు. కానీ మన వారు అనుసరించింది ఈ ఆర్కియో ఆస్ట్రోనమీ గురించే. మన ప్రాచీన గ్రంథాలన్నింటిలోనూ ఖగోళ పరిశోధనలకు సంబంధించిన అనేకానేక ఉదాహరణలు కనిపిస్తాయి. మన పురాతన చరిత్రను తెలుసుకోవడానికి ఈ పరిశోధనలే ఆధారభూమికలు. లోతుగా విశ్లేషిస్తే.. మన భూమి 23 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇది ఉత్తర అర్ధగోళాన్ని సూచిస్తుంది. దీని భ్రమణం ఆకాశంలో ఒక పాయింట్‌ను సూచిస్తుంది. ఈ పాయింట్‌ను ఇప్పుడు పోలారిస్ అంటారు. భూమి 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది. మనం బొంగరాన్ని తిప్పుతున్నప్పుడు.. అది ఒక వేగంతో తిరుగుతూనే.. కొద్దిసేపటి తరువాత అదే వేగంతో చుట్టూ ఒక రౌండ్ పూర్తిచేస్తుంది. అదే విధంగా భూమి పోలారిస్‌ను సూచించే పాయింట్.. 25,700 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఇది 3000 బీసీకి ముందు టూబన్ స్టార్ లేదా ధ్రువ పాయింట్‌ను సూచిస్తుంది. తరువాత 14వేల ఏండ్ల తరువాత వేగ నక్షత్రం లేదా అభిజిత్ పాయింట్‌ను సూచిస్తుంది. ఈ పాయింట్‌నే మనం ధ్రువ నక్షత్రం అని పిలుస్తాము. భూమి తిరుగుతున్నా.. అది ఈ పోలారిస్‌నే ఉత్తరంవైపు చూపిస్తుంది. భారతీయ ఖగోళ శాస్త్ర పరిశోధనను తెలుసుకొనే ముందు మనం ఈ ధ్రువ నక్షత్రం గురించి తెలుసుకోవడం అత్యవసరం. కాల పరిణామాన్ని తెలుసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

మన ప్రాచీన మేధావులు ఆకాశాన్ని పలు విభాగాలుగా విభజించారు. ఒక్కో విభాగం 13⅓ డిగ్రీలకు ఒకటిగా ఉంటుంది. తూర్పు హారిజోన్ నుంచి మొదలు పెట్టి మొదటి 13⅓ డిగ్రీ విభాగం దగ్గర తేజస్సుతో కనిపించిన నక్షత్రాన్ని గుర్తుగా చేసుకొని విభాగాన్ని ఫిక్స్ చేశారు. ఆ తరువాత రెండో 13⅓ డిగ్రీ దగ్గర కనిపించిన నక్షత్రాన్ని గుర్తించి రెండో విభాగంగా మార్క్ చేశారు. ఈ విధంగా తూర్పు నుంచి పశ్చిమ హారిజోన్ వరకు పగలు కనిపించే సగభాగంలో ఒక్కో విభాగం దగ్గర బ్రైట్‌గా కనిపించిన నక్షత్రాలను ఒక్కొక్కటిగా గుర్తిస్తూ వచ్చారు. అదేవిధంగా రాత్రి కనిపించే మిగతా అర్ధభాగాన్ని కూడా ఇదేవిధంగా విభజించారు. ఆకాశం మొత్తం 27 భాగాలుగా డివైడ్ అయింది. ఈ 27 భాగాలను 13⅓ తో గుణిస్తే 360 డిగ్రీలుగా వస్తుంది. ఆకాశాన్ని 27 భాగాలుగా విభజించడానికి మన శాస్త్రవేత్తలు మొత్తం 27 నక్షత్రాలను గుర్తించారు. ఆయా డిగ్రీల్లో తేజోవంతంగా కనిపించిన నక్షత్రాలనే వీరు పరిగణనలోకి తీసుకొన్నారు. ఉదాహరణకు అల్‌డేబరాన్ అనే అరబిక్ పేరు గల నక్షత్రం ఉన్నది. దీన్ని భారతీయులు రోహిణి అని పిలుస్తారు. తరువాతి విభాగంలో ఉన్న తారను స్పికా అంటారు. మనం చిత్ర అంటాము. తరువాతి నక్షత్రం పేరు జెటా పైసియన్.. ఈ నక్షత్రాన్ని మనం రేవతి అని పిలుస్తాం. ఈ విధంగా ప్రతి నక్షత్రాన్ని ఐడెంటిఫై చేశారు. ఇది ఔటర్ సర్కిల్.. ఇందులో నక్షత్రాలుంటాయి. తరువాత మన శాస్త్రవేత్తలు ఇన్నర్ సర్కిల్‌ను గుర్తించారు. ఈ సర్కిల్‌లో మాసాలు ఉంటాయి. చిత్త నక్షత్రం కింద చైత్రమాసం ఉంటుంది. మనకు పూర్ణ చంద్రుడు చిత్త నక్షత్రంమీద ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు చైత్ర మాస పౌర్ణిమ కింద లెక్క. అలాగే ఫల్గుణి లో పౌర్ణమి వస్తే ఫాల్గుణ మాస పౌర్ణమి, మఘ లో పౌర్ణమి వస్తే మాఘ పౌర్ణమి అన్నట్టుగా మన భారతీయ శాస్త్రవేత్తలు కాలాన్ని, రోజులను, నెలలను గుర్తించేవారు. ఒకసారి 360 డిగ్రీలను 27 భాగాలుగా విభజించి ఒక్కో భాగంలో ఉన్న నక్షత్రానికి ఒక్కో పేరు పెట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వాటిని ఎలా గుర్తించారు? అంటే.. తూర్పు హారిజోన్ నుంచి విభజించుకొన్న మొత్తం విభాగాల్లో ఏ విభాగంలోనైతే ఆరోజు చంద్రుడు కనిపిస్తాడో ఆ విభాగంలోని నక్షత్రం ఆరోజు ఉన్నట్టు లెక్క అన్నమాట. ఉదాహరణకు చంద్రుడు రేవతి నక్షత్రం ఉన్న విభాగంలో కనిపిస్తే.. ఆరోజు రేవతి ఉన్నదని అర్థం.

మన శాస్త్రవేత్తలు 30 డిగ్రీల విభాగంలో కూడా ఆకాశాన్ని విభజించారు. వాటినే రాశులుగా మనం పిలుస్తున్నాం. ఈ నక్షత్రాల గురించిన వివరాలన్నీ కూడా సూర్య సిద్ధాంతం, వేదాంగ జ్యోతిష గ్రంథాల్లో మనం చూడవచ్చు. వేదాంగ జ్యోతిషం అన్నది 1400 బీసీ నాటిదని తెలుస్తున్నది. దాంట్లో ఉన్న నక్షత్రాలనే మనం ఇప్పుడు పరిగణనలోకి తీసుకొంటున్నాం. ఇక సూర్య సిద్ధాంతం అన్నది 700 బీసీ నుంచి 400 బీసీ మధ్యలో రచించిన గ్రంథంగా భావిస్తున్నారు. ఇందులోనూ నక్షత్రాల వివరాలున్నాయి. ఈ రెండు గ్రంథాల్లోనూ నక్షత్రాలను గురించిన గుర్తింపు వివరాలు సరిపోలుతున్నాయి. కొన్ని ముఖ్యమైన నక్షత్రాల గురించి ఉదహరిస్తే సూర్య సిద్ధాంతంలో ఈటటౌరీ నక్షత్రాన్ని కృత్తిక అన్నారు. ఆల్ఫాటౌరీని రోహిణి అన్నారు. ఇలా అన్ని నక్షత్రాలుగా గుర్తించారు.

ఈ నక్షత్రాలను బట్టి మన మేధావులు కాలనిర్ణయాన్ని చేసుకొంటూ వెళ్లారు. ఉదాహరణకు శ్రీరామచంద్రుడినే తీసుకొందాం. రాముడు చైత్రమాసంలో పుట్టాడని వాల్మీకి రాశాడు. చైత్ర మాసంలో చంద్రుడు చిత్త నక్షత్రంలో ఉంటాడు. చిత్త నక్షత్రానికి ఆపోజిట్‌లో అంటే 180 డిగ్రీలలో అశ్విని నక్షత్రం ఉంటుంది. చంద్రుడికి ఎదురుగా సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడు అశ్వినిలో ఉన్నాడన్నమాట. ఈ విధంగా మనవాళ్లు కనుక్కొనేవాళ్లు. ఇటీవల కొందరు అతి తెలివి వాదనచేస్తూ..ఆకశంలో రాశులూలేవు, ఆ రాశిలో ప్రవేశించటమూ లేదు అంటూ కాలర్లెగరేస్తున్నారు. పాపం వారికి భూమి మీద అక్షాన్శ రేఖాంశాలూ, భూమధ్యరేఖలూ కనిపిస్తున్నాయి, సూర్యుడు వాటిని దాటుతొంటే సమయం లెక్కించటానికి. ఇలాంటి వీర్రి మొర్రి వాదనలతో వారు ఏదోరకంగా ప్రాచీనశాస్త్రాలను ప్రజల దృష్టిలో చులకన చేయాలని తపనపడుతున్నారు.

‘ఆషాఢ మాసంలో వర్ష ఋతువు వస్తుంది’ అని మహాకవి కాళిదాసు మేఘదూతంలో పేర్కొన్నాడు. అప్పుడు సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. కానీ, ప్రస్తుతం సూర్యుడు మృగశిర నక్షత్రంలో ఉన్నప్పుడు వర్ష ఋతువు మొదలవుతుంది కదా..! అంటే.. రెండు అంశాల మధ్య చాలా అంతరం ఉన్నది. కాళిదాసు రాసినప్పుడు ఆషాఢమాసంలో వర్ష ఋతువు వచ్చినమాట వాస్తవమే. ప్రస్తుతం కాలగమనంలో మార్పు సంభవించింది. నక్షత్రాలకు సంబంధించి మనం గణించే ప్రెసిషన్ రేటు ఒక్కో నక్షత్రానికి 960 సంవత్సరాలు ఉంటుంది. ఈ గణాంకాలను బట్టి కాళిదాసు చేసిన నిర్ధారణ రెండువేల ఏండ్లకు ముందరిదని మనం గుర్తించవచ్చు. ఈ విధంగా నక్షత్రాల కదలికలు.. రాశుల గమనాలను బట్టి.. ఇప్పటినుంచి కొన్ని వేల ఏండ్లనాటి కాలాన్ని కూడా కచ్చితంగా నిర్ధారించవచ్చు. ఈ పద్ధతినే మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు.. అనేక మంది రాజుల చారిత్రక కాలాన్ని నిర్ధారించడానికి వినియోగించుకుంటూ వచ్చాం. ఇందులో నిర్హేతుకమైనది ఏమీ లేదు. ఇది అశాస్త్రీయం అనడానికి ప్రాతిపదిక అంతకంటే లేదు.

ఇదంతా ఎందుకు చర్చిస్తున్నారని అనవచ్చు. ఇప్పుడు ఈ లెక్కపత్రాలేమిటని చికాకు కూడా పడవచ్చు. కానీ మనకు ప్రాచీన చరిత్ర, నాగరికత, సంస్కృతి అన్నవి లేనేలేవని.. మన ప్రాచీన గ్రంథాలన్నీ ప్రామాణికం కానే కావని తేల్చిపారేసి.. ఎవరో యురోపియన్ చరిత్రకారులు రాసిన చరిత్రను మనం చదువుకుంటున్నాం కాబట్టి.. మనకు ఇంతకాలంగా ఎవరూ చెప్పని మన నాగరికత గురించిన మూలాల అన్వేషణలో భాగంగానే ఈ చర్చ కొనసాగుతున్నది. మన భారతీయ నాగరికత ప్రాచీనతకు మూలమైంది సూర్య సిద్ధాంతం నిర్ధారించిన కలియుగ ప్రారంభం. సూర్య సిద్ధాంతం ప్రకారం అరుదైన గ్రహాల సమ్మేళనం జరగడం ద్వారా కలియుగం ప్రారంభమైంది. శని, గురువు, అంగారకుడు, బుధుడు, కుజుడు, రవి, చంద్రుడు.. ఇవన్నీ రేవతి నక్షత్రంలో కలిశాయి. ఈ కలయిక 25 వేల ఏండ్లకు ఒకసారి జరగుతుంది. ఈ గణాంకాల ప్రకారం ఈ తేదీ 18 ఫిబ్రవరి 3102 బీసీతో కలుస్తుంది. ఇది.. కలియుగం మొదలైన రోజు. మహాభారతంలో దీనికి సంబంధించిన ఒక వివరణ ఉన్నది. ఇంద్రుడికి స్కంధుడికి మధ్య ఒక చర్చ జరుగుతుంది. ‘అభిజిత్‌కు పోటీగా కృత్తిక వనానికి వెళ్లడం వల్ల అభిజిత్ ఆకాశం నుంచి జారిపడ్డాడు’ అని (అరణ్యపర్వం (230, 811)) నక్షత్రాలు ఎక్కడైనా కిందపడతాయా? ఇది ఒక ఖగోళ సంకేతాన్ని తెలియజేస్తున్నది. అభిజిత్ నక్షత్రం 15000 సంవత్సరాల క్రితం మనకు ధువ్ర నక్షత్రంలా ఉండేది. అది చాలా ఏండ్లపాటు అలాగే ఉండటంతో అభిజిత్‌నే పోల్‌స్టార్‌గా మహాభారత కాలం నాటికి పరిగణలోనికి తెచ్చారు. కానీ.. ఆ సమయంలో అభిజిత్ పోల్‌స్టార్ ప్రదేశంలో లేకపోవడం వల్ల 90 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు కదలడంతో ఆకాశం నుంచి జారిపడ్డట్టుగా ప్రతీకాత్మకంగా చెప్పారు. మన రచనలన్నీ కూడా ఈ ప్రతీకాత్మకతకు, రహస్య కథాకథన సంప్రదాయానికి అనుసరిస్తూ రచింపబడ్డవే. 24 వేల ఏండ్ల క్రితం కృత్తిక గ్రీష్మ ఋతువులో ఉండేది. అంటే.. మన ఋషులు (శాస్త్రవేత్తలు, మేధావులు, జ్ఞానులు ఏవైనా పేర్లు పెట్టుకోవచ్చు) 24 వేల ఏండ్ల నుంచి ఖగోళాన్ని గమనిస్తున్నారు. శోధిస్తున్నారన్నమాట.

మన భారతదేశ వాస్తవిక చరిత్రకు సంబంధించిన కాలనిర్ణయాన్ని నిర్ధారించడానికి ఇంతకంటే గొప్ప కొలబద్ద ఏముంటుంది? మన ఖగోళ పరిశోధనలోని శాస్త్రీయతను మించింది ప్రపంచంలోనే లేదు. మీరు ప్రపంచంలోని ఏ ఒక్క దేశ చరిత్రనైనా గమనించండి. కాలాన్ని పరిశీలించండి. ఏ ఒక్కటి కూడా స్పష్టంగా.. ఆక్యురేట్‌గా ఫలానా తేదీన ఫలానా ఘటన జరిగినట్టు చెప్పిన దాఖలా ఒక్కటంటే ఒక్కటి కనిపించదు. ఆధునిక కాలం అంటే ఓ నాలుగైదు వందల ఏండ్లకు మించి కచ్చితమైన చరిత్రను నిర్మించింది లేనేలేదు. రోదసి గురించి, భూమిని గురించి భూమిపై పరిపాలించిన రాజుల గురించి.. విస్పష్టంగా.. కచ్చితమైన తేదీలతో నిరూపించింది భారతీయులు.. వారి మేధ మాత్రమే. పైన పేర్కొన్న ఉదాహరణలు కేవలం పరిచయమాత్రంగా మనవాళ్లు చెప్పిన కొన్ని అంశాలు మాత్రమే. ఇంత స్పష్టంగా మనవాళ్లు ఆకాశాన్ని, పగలు, రాత్రులను విభజించి.. సూర్య చంద్రుల గమనాన్ని బట్టి లెక్కలు వేసుకొని క్యాలెండర్ రూపకల్పన చేసుకొన్నారు. దీన్ని ప్రాతిపదిక చేసుకొని మన చరిత్రను మనం ఎందుకు మళ్లీ పరిశోధించవద్దు? వేదాల్లో అన్నీ ఉన్నాయిష అని ఓ కవి వికృతంగా వెటకారం చేశాడు. ఓ సంపాదకుడు వేదాల్లో అన్నీ ఉంటే.. వాటిపై పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవచ్చు కదా అని రాశారు. ఆయన అన్నది నిజమే. ఎందుకు పరిశోధించవద్దు? మరోసారి ఇక్కడ ప్రతిపాదిస్తున్నా.. మన ప్రాచీన గ్రంథాలు మహా అయితే.. అయిదువేలో.. పదివేలో ఉంటాయి. ఒక్కో పుస్తకాన్ని అనువాదం చేయడానికి మహా అయితే ఐదు లక్షలు ఖర్చు పెట్టండి.. అంతా కలిపినా ఐదువేల కోట్లు అవుతాయి. ఇంత ప్రాచీన నాగరికత మూలాల అన్వేషణకు ఐదువేల కోట్లు పెద్ద బడ్జెట్టా?

***

Image Courtesy: Internet, Swadhayaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here