రామం భజే శ్యామలం-33

0
7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]భా[/dropcap]రతదేశం పవిత్రమైన భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా?

ఒక్కసారి ఈ మ్యాప్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. ఆశ్చర్యమేస్తుంది. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అద్భుతమైన జియోగ్రాఫికల్‌ స్ట్రక్చర్‌ ఉన్న దేశం భారతదేశం. ఉత్తరాన కశ్మీర్ నుంచి ఈశాన్యం దాకా సంపూర్ణంగా పెట్టని కోటలా ఉన్న హిమాలయాలు… అత్యంత దుర్గమ స్థావరాలు. తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల్లో అంతులేని మహాసముద్రాలు ఈ దేశాన్ని సహజ సిద్ధమైన కోటగా మలిచాయి. హిమాలయాల వైపునుంచి ఎవరైనా ఈ దేశంలోకి రావాలంటే, చాలా కష్టమైన పని.. తరచూ వరదలు.. మంచు చరియలు విరిగిపడటం వంటి వాటి వల్ల అటునుంచి భారత్‌లోకి రావడం దుర్లభం. ఒక వాయవ్య దిశలో తప్ప మరే దిశనుంచి భారతదేశం లోపలికి ప్రవేశింప వీలులేని పరిస్థితి.

మనదేశంలో చొరబాట్లకు సంబంధించిన చరిత్రను ఒకసారి గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.. తురుష్కులు, యవనులు.. మరెవరైనా సరే ఈ వాయవ్య భూభాగం నుంచే ఈ దేశంలోకి చొరబడ్డారు. అలెగ్జాండర్‌ కూడా ఇటువైపు నుంచే దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అక్కడే పురుషోత్తముడు అతడిని అడ్డుకొన్నాడు. మహమ్మద్‌ ఘజ్‌నీ.. సోమ్‌నాథ్‌ దాకా వచ్చిందీ ఇక్కడి నుంచే. భారతదేశంలో మరో విశేషమేమిటంటే.. ఉత్తరాన ప్రపంచంలోనే అత్యంత ఎత్తెన హిమాలయ పర్వత శ్రేణులను తప్పిస్తే.. కింద కన్యాకుమారి వరకూ భారీ కొండప్రాంతాలు ఏవీ కనిపించవు. మధ్య భారతంలో వింధ్య సానువులు కొంతమేర ఉన్నప్పటికీ కూడా అవి ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య రాకపోకలకు అవరోధంగా ఉన్నవేం కావు. దేశంలో ప్రధానమైన భూభాగం మొత్తం మైదాన ప్రాంతమే. 80 శాతం భూభాగం వ్యవసాయానికి అత్యంత అనువైనది కావడం మరో ముఖ్యమైన విశేషం. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికతకు ఆలవాలమైన నదీతీరాలు మన దేశంలోనే ఉన్నాయి.

హిమాలయాల్లో పుట్టిన నదులన్నీ కూడా భారతదేశంలోకి ప్రవహిస్తాయి. హిమాలయాలకు పైనున్న ప్రాంతం అంతా నీరులేని ఎడారి ప్రాంతమే. దాదాపు రెండున్నరవేల కిలోమీటర్ల మేర ప్రవహించే గంగానది…. ప్రపంచంలో ప్రతి పన్నెండు మందిలో ఒకరికి జీవనాధారమైంది. సమస్త ఉత్తర భారతదేశానికి ప్రాణాధారమైన జలసంపత్తి గంగ. సింధు నాగరికత అంతా సరస్వతీనదీ తీరంలో అభివృద్ధి చెందింది. దక్షిణ భారతాన్ని కృష్టా గోదావరి, కావేరి సుసంపన్నం చేశాయి. ఇంత అద్భుతమైన సహజవనరులు దేశమంతటా విస్తరించి ఉంటే.. ఇక కరువుకు, కాటకానికి ఆస్కారమెక్కడిది? దారిద్ర్యానికి చోటెక్కడిది? మనదేశ సహజ వనరులకు సంబంధించి ముఖ్యంగా గంగాబేసిన్‌ గురించి చెప్పుకోవాలంటే అసాధారణమైంది. ఇది భారతదేశాన్ని అత్యంత ప్రాచీనకాలం నుంచి సుసంపన్నం చేస్తున్నది. దాదాపు నలఖై కోట్ల మంది ప్రజలు ఈ నదీతీరాన జీవిస్తున్నారంటే దాని వైభవం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అరుదైన జంతురాశికి, అంతులేని పక్షి సంపదకు, అపూర్వ వృక్ష సంపదకు కోట్ల ఎకరాల వ్యవసాయానికి ఆలవాలమైంది. ప్రపంచంలో నదులు ఎన్నో ఉండవచ్చు. కానీ ఎక్కడా లేని అద్భుతమైన పవిత్రమైన వాతావరణం గంగాతీరం లోనే మనకు కనిపిస్తుంది. అనుభవంలోకి వస్తుంది. దాదాపు 21 వేల చదరపు కిలోమీటర్ల సుదీరమైన పరీవాహక ప్రాంతం.

సుమారుగా పన్నెండున్నర వేల అడుగుల సగటు లోతు.. ఉత్తరాన హిమాలయ శ్రేణుల్లోనుంచి మొదలై.. అనేక నదులను అనుసంధానం చేసుకొంటూ.. బంగ్లాదేశ్‌ దాకా విస్తరించిన అత్యద్భుతమైన మహానదీ తీరప్రాంతం. ప్రత్యక్షంగా, పరోక్షంగా రోజువారీ అవసరాలకోసం మిలియన్ల కొద్దీ భారతీయులు నూటికి నూరుశాతం ఆధారపడి ఉన్న పరీవాహక ప్రాంతమిది. ఇక్కడ వ్యవసాయం… అటవీప్రాంతం… వన్యప్రాణి సమూహం… అన్నీ అద్భుతాలే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచంలో అతి పెద్ద జీవ సాంద్రత కలిగిన ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే అది గంగాతీరమే. అందుకే ఆమె తల్లి అయింది. దేవత అయింది. పూజనీయురాలైంది.

ప్రపంచంలో వేలకొలది నదుల్లో లేని ప్రత్యేకత గంగకు మాత్రమే ఉన్నది. గంగానదిలోని జలానికి ఉన్నంత స్వచ్ఛత మరేనదికి లేదు. ఆధ్యాత్మికంగా ఎన్నైనా కథలు, స్థలపురాణాలు చెప్పుకోవచ్చుకానీ.. ఈ నదికి ఉన్న ప్రత్యేకత, గొప్పతనం వేరే ఉన్నది.

ఇక్కడ ఈ నదికి సంబంధించిన చర్చకూడా అందుకే. భారతదేశం చరిత్ర సమస్తం ఈ నది కేంద్రకంగా నిర్మాణమైందనడంలో సందేహం లేదు. అందుకే ఈ నదీ ప్రస్తావన ఇక్కడ తీసుకొని రావాల్సి వచ్చింది. ప్రాచీన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది కాబట్టే దీని గురించిన చర్చ అవసరమనిపించింది. ఆధునిక నదుల అనుసంధానానికి మూలమైన నదీ నిర్మాణం గంగా ప్రవాహం కాబట్టే ఇది… ఈ దేశ చరిత్రలోని ప్రతిపేజీలో ఉనికిని చాటుకొంటున్నది. గంగ నిన్న మొన్న పుట్టిన నది కాదు.

ముందుగానే చెప్పుకున్నట్టు హిమాలయాల్లో జన్మించి.. కిందకు ప్రవహించింది గంగ. వేదకాలంనుంచే గంగ మన దేశంలో అత్యద్భుతమైన నాగరిక సమూహానికి ప్రాణాధారమైంది. రుగ్వేదంలోనే మనకు నదీస్తుతి మంత్రబద్ధంగా కనిపిస్తుంది. ఈ నదీస్తుతిలో తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తున్న నదుల పేర్లు ప్రస్తావనకు వస్తాయి. “వీరులారా మీ వంశగ్భహం, మీ పవిత్ర స్నేహం, మీ సంపద అంతా జాహ్నవి ఒడ్డున ఉన్నాయి.” అని గంగ గురించి వివరణ ఉంటుంది. దాని తరువాతి రెండు వరుస శ్లోకాలలోనే గంగలో ఉండే డాల్ఫిన్‌ చేపల గురించిన వ్రస్తావన ఉన్నది. భారతదేశ అద్భుతమైన ప్రాచీన చరిత్రకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఎప్పటి వేదం? ఎప్పటి రామాయణం? ఎప్పటి భారతం? ఇవన్నీ గంగా బేసిన్‌లో విలసిల్లిన నాగరికతలే కదా… ఇప్పటికీ.. ఢిల్లీ, కాన్పూరు, వారణాసి, అలహాబాద్‌, పాట్నా, కోల్‌కతా వంటి మహానగరాలన్నీ ఈ బేసిన్‌లో అభివృద్ధి చెందినవే కదా.. ఇవాళ ఈ చరిత్రంతా ఏమైపోయింది? ఈ తరానికి ఏమైనా తెలుసా? గంగ అంటే ఏ హరిద్వార్‌కో.. కాశీకో, ప్రయాగ్‌రాజ్‌కో వెళ్లి నాణాలు వేసి దండంపెట్టి రావడం కాదుకదా..? మనదేశ చరిత్రకు ఆధారభూమిక గంగ. మీరు భారతదేశ ప్రాచీన గ్రంథాలలో ఏ గ్రంథాన్నైనా తీసుకొని చూడండి. గంగ రిఫరెన్స్‌ లేకుండా ఉండటం చాలా చాలా అరుదు. ఏ ఒక్క పుస్తకమైనా.. గంగ, యమున, సరస్వతి ప్రస్తావన లేకుండా ఉన్నాయా? సింధు నాగరికత సరస్వతీ తీరంలో విలసిల్లింది కాదా? ఈ త్రివేణుల గురించి చదువుతుంటే ఆశ్చర్యమేస్తుంది. ఎంత నాగరికత, ఎంత విజ్ఞానం, ఎంత సంపద ఈ నదీతీరాల్లో విస్తరిల్లింది? ఇంత సుసంపన్న నాగరికత కలిగిన భౌగోళిక ప్రాంతం.. కేవలం మూడు వందల సంవత్సరాల కాలంలో ఎంత దారుణంగా విధ్వంసమైంది? ఇదెలా సాధ్యపడింది? తలచుకుంటేనే విస్మయం కలుగుతుంది.

ఇవాళ్టి ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతశ్రేణిలోని గ్లేసియర్‌ (హిమానీనదం) గంగోత్రి దగ్గర భాగీరథిగా ఉద్భవించిన గంగ… దేవప్రయాగ దగ్గర అలకనందతో కలిసిపోతుంది. అక్కడి నుంచి బద్రీనాథ్‌మీదుగా హరిద్వార్‌లో పూర్ణ గంగగా మారిపోతుంది.

హరిద్వారం దగ్గర గంగ ఎంత స్వచ్చంగా ఉంటుందంటే.. నది అడుగుభాగం సైతం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నీటికి రంగు, రుచి, వాసన ఉండవని సైన్స్‌ చెప్తుంది. అలాంటి కలుషితం లేని నీటిని మనం ఇక్కడ చూడవచ్చు. మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత కోసి, గోమతి, శోణ వంటి ఉపనదులు గంగతో సంగమిస్తాయి. అలహాబాద్‌ దగ్గర యమున, సరస్వతి సంగమిస్తాయి. యమున పెద్ద నదే కానీ.. సాంకేతికంగా గంగకు ఉపనదే. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కొద్దీ నదులు గంగలో సంలీనమవుతాయి. బెంగాల్‌ వరకు అప్రతిహతంగా ప్రవహించే గంగ.. బెంగాల్‌లో రెండుగా చీలిపోతుంది. ఒకదానికి హుగ్లీ అని పేరు. మరో పాయ గంగగా ముందుకు సాగిపోతుంది. ప్రస్తుత బంగ్లాదేశ్ లోకి ప్రవేశించిన తర్వాత సముద్రంలో విలీనమవుతుంది. ఈ నదీపరీవాహక ప్రాంతమంతా అద్భుతమైన పచ్చదనంతో విలసిల్లుతున్నది.

మన ప్రాచీన నాగరికత ఇంతగా సంపన్నం కావడానికి ఒక ప్రధాన స్రవంతి గంగ అని చెప్పటం అత్యుక్తి ఎంతమాత్రం కాదు. ఈ గంగను అసాధారణ రీతిలో ఆయా భూభాగాల మీదుగా ప్రవహింపజేసినవాడు భగీరథుడు. ఇతని ప్రయత్నం వల్లనే గంగ అన్ని వేల కిలోమీటర్ల మేర ఇవాల్టికీ ప్రవహిస్తున్నది. గంగా నది వల్లనే ఈ దేశం ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించింది. ఈ భగీరథుడు శ్రీరామచంద్రుడి ముత్తాత. అందుకే రామాయణం మన దేశ చరిత్రకు మూలాధారమైంది. రామాయణం, రాముడు, అయోధ్య కేంద్రకంగానే భారతదేశ చరిత్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉన్నది. చరిత్రపురుషుడైన రాముడి కాలం నుంచి భారతదేశ రూప స్వభావాలు ఎలా పరినామం చెందుతూ వచ్చినవో లోతుగా చర్చ జరిగితే… అంతర్లీనంగా ఉండి అఖండభారతాన్ని ఒక్కతాటిపై నిలుపుతున్న సూత్రమేమిటన్నది అర్థమవుతుంది. ఇందుకోసమే ఈ రచయిత ఈ వ్వాస పరంపరను తన తండ్రి ఆజ్ఞపై ప్రారంభించింది. గురువుల ఆశీస్సులతో కొనసాగిస్తున్నది. రామాయణాన్ని తిరస్కరించి… రాముడిని ఛీత్కరించి భారతదేశ చరిత్రనిర్మాణం చేయడం అసంభవం. రాముడు దేవుడు.. కాదు.. అన్న మీమాంస పక్కనపెట్టి. రాముడు ఈ దేశాన్ని ఏలిన గొప్ప చక్రవర్తిగా చూసిననాడు.. అయోధ్యనుంచి లంక వరకు పాదయాత్రచేసి అఖండభారతం లోని జన పదాలను, వివిధ జాతుల సమూహాలను ఏకం చేసిన వైనాన్ని పరిశోధించిననాడు ఈ దేశానికి తన మూలాల అన్వేషణ తేలికగా సాధ్యపడుతుంది. రామాయణంలోని అనేకానేక అంశాలు మన దేశంలోని ప్రాచీన శాస్త్ర సాంకేతిక, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక జనజీవన అంశాలన్నింటినీ విప్పిచెప్తుంది. ఒక్కొక్క అంశాన్ని మనం పరిశీలించుకొంటూ పోతే… ఆశ్చర్యం వేస్తుంది. ఇందులో మొదటగా మనం చర్చించుకోవలసింది రామాయణ కాలంలోనే జల వనరుల వినియోగం గురించిన స్పృహ గురించి. గంగా ప్రవాహాన్ని తాను అనుకున్న దిశలో పయనింపజేయడం అన్నది ఎంత కష్టమో… భగీరథుడి ప్రయత్నం ద్వారా రామాయణ చరిత్ర చెప్తుంది.

“ఆకాశంబునుంచి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి పయోధినుండి పవనాంధోలోకమున్‌ చేరె గంగా…….” అని భర్తృహరి అన్నాడు.

ఇది గంగావతరణం గురించిన సన్నివేశం… ఆకాశం నుంచి శివుడి శిరస్సు.. అక్కడి నుంచి హిమాలయాలు, భూమి.. ఇలా పయనిస్తూ పయనిస్తూ వెళ్లిందిట. ఇది సాధారణంగా గంగ గురించిన వర్ణనాత్మక పద్యం. కానీ.. వాస్తవంగా గంగా ప్రవాహాన్ని ఏ విధంగా భగీరథుడు ఆయా భూభాగాల్లో మలుచుకుంటూ వెళ్లాడు. ఇదొక అద్భుత చరిత్ర. మన సమాజానికి జల వనరులు ఎంత ముఖ్యమో రాముడి పూర్వీకులకు బాగా తెలుసు. తమ ప్రజలకు జలవనరులను సమృద్ధిగా అందించడానికి సగర చక్రవర్తి, అంశుమంతుడు (రాముడి ముత్తాతలు) తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వాళ్లకు సాధ్యపడలేదు. ఆ తర్వాత భగీరథుడు ఎక్కడో ఉన్న గంగను భూమార్గం పట్టించాడు. రామాయణం బాలకాండలో వాల్మీకి విశ్వామిత్రుడిచేత గంగను భగీరథుడు ఎలా తీసుకొచ్చాడో స్పష్టంగా వివరిస్తాడు. దీన్ని కథలా కాకుండా క్రిటికల్‌గా అధ్యయనంచేస్తే.. ఇందులోని శాస్త్రీయత ఏమిటన్నది మనకు అర్ధమవుతుంది. గంగ కోసం ఏడాదికిపైగా భగీరథుడు తపస్సు చేశాడట. మనకు వేదకాలం నుంచి తపస్సు అన్నది తరచూ వినవచ్చే పదమే. తపస్సు అంటే.. ముక్కుమూసుకొని మెడిటేషన్‌ చేయడం కాదు. తపస్సు అంటే సాధన. తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించడం కోసం చేసే పరిశోధన. ఈ పరిశోధన ఫలితమే తపఃఫలం. తపస్సు గురించి మనం ఏ విధంగా ఆలోచించినప్పటికీ.. తేలే అంశం ఇదే. మేధావులైన మన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల ద్వారానే అంతులేని విజ్ఞానాన్ని ఈ దేశంలో కుప్పలుపోసి ఉంచారు. మనమే ఆ కుప్పల్లోంచి కావాల్సింది గ్రహించలేకపోతున్నాం. దాన్ని చెత్తకుప్పగా గార్బేజి బిన్‌లో పడేస్తున్నాం. సరే ఈ విషయం కాసేపు పక్కన పెడదాం.

రామాయణ కాలంలోనే.. రాముడికంటే చాలా ముందే.. భగీరథుడు తన పూర్వికులు పూర్తిచేయలేని మహత్తర కార్యాన్ని పూర్తిచేయడానికి పూనుకున్నాడు. అదే జలవనరులను సమస్త ప్రజానీకానికి అందించడం. ఇదే మనకు రామాయణంలో గంగావతరణ ఘట్టంగా కనిపిస్తుంది. భగీరథుడు ఏడాదిపాటు ప్రయత్నించి గంగను వ్రసన్నంచేసుకున్నాడు. ఆ గంగ ప్రవాహం మొదలైంది. ఆ గంగకు మొదటి అనకట్ట శివుడి జటాజూటం. మన పరిభాషలో చెప్పాలంటే.. ఇది భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టు. ఇక్కడ గంగను భగీరథుడు నిలువరించాడు. ఈ శివుడు జటాజూటం నుంచి తిరిగి కిందకు వదిలాడు. ఒక్కసారి జటాజూటం విచ్చుకున్న మహా దేవుడి రూపాన్ని చూడండి.. అఖండ భారత స్వరూపం గోచరిస్తుంది. శివుడు నీటిని దిగువకు వదిలినప్పుడు ఏడు ప్రవాహాలుగా గంగ విడిపోయింది. అంటే మనం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు వదులుతున్నప్పుడు వేర్వేరు రిజర్వాయర్లకు కాల్వల ద్వారా పంపించినట్లే.. గంగ కూడా శివుడి జటాజూటం నుంచి ఏడు కాల్వలుగా విడిపోయింది. వీటిలో వ్లాదిని, పావని, నళిని అన్న పేర్లున్న పాయలు.. తూర్పువైపు ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధునది అన్న పాయలు పశ్చిమం వైపు ప్రవహించాయి. ఏడో ప్రవాహం ప్రధాన పాయగా మారింది. ఇది భగీరథుడు చూపించిన మార్గంలో పయనించింది. ఈ గంగలో చేపలు, తాబేళ్లు, మొసళ్లు, పాములు కూడా ఉన్నాయట. ఈ గంగ కొన్ని చోట్ల వేగంగా, మరికొన్నిచోట్ల నెమ్మదిగా.. ఒకచోట వంకరగా… ఇంకోచోట స్టైయిట్‌గా ప్రవహిస్తూ దిగువకు కొనసాగిందిట. మధ్యలో జహ్ను మహర్షి ఆశ్రమం అడ్దువస్తే దాన్ని ముంచెత్తింది గంగ. ఆగ్రహించిన సదరు మహర్షి గంగను తాగేశాడు. భగీరథుడు మళ్లీ బతిమాలుకొంటే.. ఆయన చెవిలోంచి గంగను విడిచిపెట్టాడట. దీన్ని గమనిస్తే.. ఒక టన్నెల్ లోకి నీరు ప్రవహించి.. బయటకు వచ్చినరీతి అనిపిస్తుంది. గంగా ప్రస్థానంలో ఇది మరో మినీ ప్రాజెక్టుకు వ్రతీకాత్మకంగా కనిపిస్తుంది. అక్కడినుంచి గంగ తన గమ్యాన్ని చేరుకున్నది. ఈ మొత్తం వృత్తాంతాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే. ఒక రాజు అంటే పాలకుడు తన ప్రజలకోసం సాగు, తాగు నీరు సౌకర్యం కల్పించడం ఎంత ప్రధానమో అర్ధమవుతుంది. నీటికి అడ్డుకట్ట వేయడం.. నీటి ప్రవాహంలో ముంపు ప్రాంతాలు.. నిర్వాసితులు… వారిని బుజ్జగించి, ఒప్పించి నీటి ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లడం ప్రతీకాత్మకంగా కనిపిస్తుంది. జలవనరులు ప్రజలకు అందిస్తే పితృదేవతలు కూడా సంతృప్తి పడతారనేది కూడా గొప్ప పుణ్యకార్యంగా చెప్పడమే. జలవనరుల ప్రాధాన్యం గురించి రామాయణమే స్పష్టంగా చెప్పింది. ఇదంతా బాలకాండలో విశ్వామిత్రుడిచేత వాల్మీకి పలికించిన మాటలే.

ఈ గంగను ఆనాడు భగీరథుడు అఖండభారత భూమిపై ప్రవహింపజేశాడు కాబట్టి… ఒక గొప్ప నాగరిక సమాజం సంపద్విరాజమానమైంది. అపూర్వ సంపదను సృష్టించింది. పరిశోధనలకు, విజ్ఞానానికి ఆలవాలమైంది. చివరకు ముష్కరుల దోపిడీకి కూడా డెస్టినేషన్‌గా మారింది. మన ఇతిహాసాలను చరిత్రను ఈ కోణంలో ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక సరికొత్త రూపంలో.. స్వజాతీయులచేత భారతదేశ చరిత్రను పునర్లిఖించుకోవాల్సిన అవసరం, పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు నాంది రామాయణం కావాలి. ఈ రామాయణంపై మరిన్ని వ్యాసాలు… రాబోయే వారాల్లో…

***

యావత్ స్థాస్యంతి గిరయః. సరితశ్చ మహీతలే .. తావత్ రామయణి గంగా లోకేశు ప్రచరిష్యతి.

***

Image Courtesy: Internet, Swadhayaya Resource Centre,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here