రామం భజే శ్యామలం-38

0
6

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]శ్రీ[/dropcap]రామచంద్రుడి వ్యక్తిత్వాన్ని డ్యామేజీ చేయడానికి పుట్టుకొచ్చిన మరో కథ సీతా పరిత్యాగం. ఇది రామాయణ ఉత్తరకాండలో పొందుపరచిన సన్నివేశం. రాముడు చెప్పుడు మాటలు విని భార్య సీతాదేవిని అడవుల్లో.. ఆశ్రమాల్లో వదిలేశాడని ఈ కథ సారాంశం. వదిలేసిన సమయంలో ఆమె గర్భవతి. తనకోసం రాజభోగాలన్నీ వదిలేసుకొని అడవులపాలై.. అష్టకష్టాలు పడి.. రావణుడు ఎత్తుకొనిపోతే.. అశోకవనంలో శింశుపా వృక్షం కింద కనాకష్టం పడి అల్లల్లాడిపోయిన తల్లిని ఎవరో ఏదో అన్నారని అడవుల్లో వదిలేయడం ఏం మంచిపని? సీతాదేవి మహాసాధ్వి కదా.. అలాంటి మహా ఇల్లాలిని అడవుల్లో వదిలేయడానికి రాముడికి మనసెలా ఒప్పింది? దీనికి సంబంధించిన పూర్వాపరాలను ఒకసారి చూద్దాం.

ఉత్తరకాండ.. రాముడి పట్టాభిషేకం తరువాత జరిగిన కొన్ని కథల సమాహారం. మూలకథతో ఎలాంటి సంబంధం లేని కథలన్నీ ఇందులో ఉంటాయి. సినిమా క్లైమాక్స్ అయిపోయి శుభం కార్డు పడిన తర్వాత.. మళ్లీ కథ మొదలైనట్లు.. ఉత్తరకాండలోని కథలు ఉంటాయి. ఉత్తరకాండలోని 43వ సర్గ.. 12 నుంచి 23 శ్లోకాల వరకు మాత్రం తీసుకొందాం. రాముడు అప్పుడే సీతాదేవి దగ్గర ప్రియమైన భాషణముచేసి వచ్చాడు. ఆమె ఋషుల ఆశ్రమాలకు వెళ్లాలని కోరిక ఉన్నట్టు చెప్తుంది. అలాగే పంపుతానని హామీ ఇచ్చిన రాముడు బయటకువచ్చి స్నేహితులతో కలిసి ముచ్చట్లు పెడుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి భద్రుడు అనే గూఢచారి.. మరికొందరు గూఢచారులు రాముడిని కలవడానికి వచ్చారు. రాజ్యంలో ఎవరెవరు ఏమనుకొంటున్నారో రాముడికి విశదీకరిస్తుంటారు. అందులో భద్రుడు ఏం చెప్పాడో ఒకసారి చదవండి. ‘రాజా! నాలుగు వీధుల మొగలలోనూ, వీధులలోనూ, వనములలోనూ.. ఉద్యానములలోనూ కలిసి.. మంచిగానూ.. చెడ్డగానూ ఏమి చెప్పుకొనుచున్నారో వినుము. రాముడు సముద్రము మీద ఎవ్వరూ చేయజాలని సేతుబంధము చేసినాడు. ఇట్టిదానిని పూర్వులెవ్వరూ కానీ, దేవతలు కానీ దానవులు కానీ విని ఉండరు. ఎదురింప శక్యముకాని సేనావాహన సహితుడైన రావణుణ్ణి చంపినాడు. వానరులను, భల్లూకములను, రాక్షసులను కూడా వశము చేసికొనినాడు. రాముడు యుద్ధమునందు రావణుణ్ణి చంపి సీతను తీసుకొని.. రావణ స్పర్శ వలన కలిగిన కోపము లెక్కచేయక (విడిచి) ఆమెను మరల తన ఇంటికి చేర్చినాడు. అతని హృదయమునందు సీతాసమాగమము వలన ఏమి సుఖము కలుగునో! రావణుడు బలాత్కారముగా ఒడిలో కూర్చుండబెట్టుకొని హరించి లంకకు తీసుకొనిపోయి అశోకవనమును చేర్చగా రాక్షసుల వశురాలైపోయిన ఆ సీతను గూర్చి రాముడు ఏవగించుకొనకుండగా ఎట్లుండగలుగుచున్నాడో! మన భార్యల విషయమునందు కూడా మనము సహించవలసి ఉండును. రాజు యెట్ల చేయునో.. ప్రజలు కూడా అట్లే అతనిని అనుసరించి ప్రవర్తించుచుండురు కదా. రాజా! అన్ని నగరాలలోనూ, గ్రామాలలోనూ, పౌరులు ఈ విధముగా, అనేక విధములైన మాటలు చెప్పుకొనుచున్నారు.’

రాముడు అతడు చెప్పిన మాటలు విని చాలా దు:ఖితుడై ‘ఇది యెట్లు నాకు చెప్పుడు’ అక్కడనున్న మిత్రులందరినీ అడిగెను. వాళ్లందరూ శిరస్సులతో భూమిని స్పృశించి నమస్కరించి వినమ్రులై ‘యితడు చెప్పినది నిజమే; అసత్యము కాదు’ అని రామునికి బదులు చెప్పిరి. శత్రు సంహారకుడైన రాముడు అప్పుడు వాళ్లందరు చెప్పిన మాటలు విని ఆ స్నేహితులనందరినీ పంపివేసెను.

ఇది ఉత్తరకాండలో సీతా పరిత్యాగానికి సంబంధించిన మూలహేతువు. మామూలుగా మనం ఎన్టీవోడి లవకుశ సినిమా చూసినప్పుడు ఒక రజకుడు తప్పతాగి భార్యను వదిలేసిన సందర్భంలో ఇలాంటి మాటలన్నట్టు విన్నాం. వాల్మీకి పేరుతో రచింపబడిన ఈ ఉత్తరకాండలో రాముడి రాజ్యంలోని ప్రతి ఒక్కరూ ఇలాగే మాట్లాడుకుంటున్నట్టు చెప్తున్నారు. ప్రజలు అందరూ తనను తిట్టుకుంటున్నారని తెలియగానే.. తమ్ముళ్లను పిలిచి తెల్లారేసరికి సీతను అడవుల్లో వదిలేసి రమ్మన్నాడు. అది కూడా గంగానదికి అవతలి తీరంలో ఉన్న తమసానదీ తీరంలో ఉన్న వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని మరీ చెప్తాడు.

ఇక్కడే ఆశ్చర్యమేస్తుంది. శంబూక వధ సన్నివేశంలో రాజైన రాముడు దోషం వల్ల గ్రామాల్లో, నగరాల్లో బాలలు చనిపోతున్నారన్నారు. ఇక్కడేమో.. ప్రజలంతా రాముడిని సీతను వెనుకకు తీసుకొచ్చాడంటూ ఛీ కొడుతున్నారన్నారు. ఆశ్చర్యం కాక మరేమిటి? మరి పదకొండువేల సంవత్సరాలు ప్రజలంతా ఉదయం, పగలు, రాత్రి.. రాముడు.. రాముడు.. రాముడు అంటూ నిరంతరం స్మరిస్తూ ఉన్నారని యుద్ధకాండలో రాసిందంతా అబద్ధమేనా? ఇవాళ్టికి కూడా సీతారాముల దాంపత్యం ఆదర్శమని మనం కొలుస్తున్నాం కదా.. చెప్పుడు మాటలు విని భార్యను అడవుల్లో వదిలేసిన వాడు ఆదర్శుడు ఎలా అయినాడు? వాళ్ల దాంపత్యం ఆదర్శమెట్లా అయినది.. ఉత్తరకాండ కల్పితం కాకపోతే.. ఈ సీతా పరిత్యాగమనే కథ ఉత్తరకాండపై మరికొన్ని సందేహాలను రేకెత్తిస్తున్నది. వీటిని ఒకసారి పరిశీలిస్తే.. ఉత్తరకాండను వాల్మీకికి ఆపాదించి పెద్ద కుట్రకు తెరలేపారన్నది స్పష్టంగానే అర్థమవుతుంది.

వాల్మీకి రామాయణాన్ని రాయడానికి పూనుకోవడానికి ముందు.. నారదుడిని పిలిచి ‘దేవర్షీ.. భూలోకములో ఈనాడు మంచి గుణములూ, గొప్ప పరాక్రమమూ కలవాడు, ధర్మము తెలిసినవాడు, కృతజ్ఞుడు, సత్యమైన వాక్కు, మరియు దృఢమైన సంకల్పము కలవాడు అయిన మహాపురుషుడు ఎవడున్నాడు’ అని అడిగాడు. అప్పుడు నారదుడు రాముడు అనేవాడు కోసలదేశాన్ని పాలించాడు. అంటూ రాముడి కథ మొత్తాన్ని సమగ్రంగా వివరిస్తాడు. మొదటి సర్గలో నారదుడు చెప్పిన రాముడి కథలో ఉత్తరకాండ ప్రస్తావన మచ్చుకు కూడా లేనే లేదు. రాముడి కథను చెప్పి.. నారదుడు వెళ్లిపోతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి..రాముడి చరిత్రమును నారదుడి నుంచి విన్నది విన్నట్టుగా చెప్పుము. లక్ష్మణ సహితుడైన రాముడు, సీత, భరతాదులు, రాక్షసులు వీరందరి చరిత్రము రహస్యమైనదైనయు, ప్రకాశమైనదైనను నీకింతవరకును తెలియనది కూడా ఇప్పుడు స్పష్టముగా తెలియును. అని మార్గదర్శనం చేసి వెళ్లిపోయాడు. మూడవ సర్గలో చివరి రెండు శ్లోకాలలో ఒకదానిలో సీతను త్యజించే విషయము, మరో దానిలో ఉత్తరకాండ ప్రస్తావన ఉన్నది. నాలుగో సర్గలో కుశలవుల ప్రస్తావన వచ్చింది. దీనిపై పరిశోధన సవ్యంగా జరుగలేదు కాబట్టే.. భారతీయ చరిత్ర విధ్వంసకులకు రాముడిని నిందించడానికి అవకాశం దొరికింది. ఈ విషయంలో నాకు కలిగిన సందేహమేమిటంటే.. బాలకాండ ఒకటి, మూడవ సర్గలో రామాయణం గురించిన సంక్షిప్త వర్ణన సమస్త రామాయణాన్ని కండ్లముందు పరచినట్టు వివరించిన వాల్మీకి సీతను త్యజించిన సన్నివేశాన్ని మాత్రం ఏకవాక్యంతో ఎందుకు రాశాడు? చిట్టచివరి శ్లోకంలో ఉత్తరకాండలో మున్ముందు రాముడి చరిత్రను రచించాడని అంటీముట్టనట్టుగా కేవలం ప్రస్తావనతో ఎందుకు సరిపెట్టాడు. మూల కథతో సంబంధం లేకుండా మూడో సర్గలోని 37, 38 శ్లోకాలు కనిపిస్తాయి. నాలుగో సర్గ కుశలవుల రామాయణ గానంతో సాగుతుంది. ఇది ఎంతవరకు ప్రక్షిప్తమన్నది పెద్దలే తేల్చాల్సిన విషయం.

ఈ సందర్భంలోనే మరో సందేహం ఇక్కడ వ్యక్తమవుతుంది. వాల్మీకి రామాయణం రాసింది.. నారదుడు చెప్పిన కథను అనుసరించి. ఇది తొలి సర్గలో విస్పష్టంగా ఉన్నది. నారదుడు కూడా సంపూర్ణంగా రామకథను వాల్మీకికి వివరించాడు. ఈ భూలోకంలో గొప్ప మహాపురుషుడు ఎవడున్నాడని వాల్మీకే నారదుడిని అడిగాడు. అంటే.. వాల్మీకి రాముడి కాలం నాటి వాడు కాడని భావించాల్సిందే కదా.. నారదుడు చెప్తేనే కదా.. రాముడంతటి మహాపురుషుడు భూమండలాన్ని ఏలిన విషయాన్ని తెలుసుకొని.. వాల్మీకి రామాయణ రచన సాగించింది! బ్రహ్మ కూడా చెప్పింది అదే కదా.. నారదుడి నుంచి విన్నది విన్నట్టు రాయమన్నది.. అలాంటప్పుడు ఉత్తరకాండలో రాముడు సీతాదేవిని వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి రమ్మని ఎందుకు చెప్పినట్టు? ఎలా చెప్పినట్టు? బాలకాండ నుంచి.. యుద్ధకాండ వరకు రామచంద్రుడి జైత్రయాత్రను ముందుకు నడిపించింది.. అస్త్ర శస్త్రాలను అందించి మార్గదర్శనం చేసింది ఋషులే. వసిష్ఠుడి నుంచి భరద్వాజుడి దాకా పదులకొద్దీ ఋషులు రాముడి ప్రయాణంలో తారసపడ్డారు. ఎక్కడ కూడా వాల్మీకి రాముడికి తారసపడలేదు. అంటే రాముడి కాలం తరువాత వాల్మీకి ఉన్నాడా? నారదుడి నుంచి కథను విని రామాయణాన్ని రచించాడా? అదే నిజమైతే.. రాముడు సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి రమ్మని చెప్పడం ఏవిధంగా సమంజసమవుతుంది? రాముడు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు గుహుడు దాటించింది కూడా గంగానదినే. గంగకు ఆవల భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్లి కొన్నిరోజులున్న రాముడు తమసా తీరం గురించిన ప్రస్తావన అప్పుడు మాత్రం ఎందుకు చేయలేదు. అంటే అప్పటికి రాముడికి వాల్మీకి తారసపడలేదనే కదా అర్థం! రాముడి కాలంలో వాల్మీకి లేనే లేనప్పుడు సీతను రాముడు త్యాగం చేయడమేమిటి? ఆ త్యజించడం కూడా వాల్మీకి ఆశ్రమంలో చేయడమేమిటి? అక్కడ కుశలవులు పుట్టడమేమిటి? ఆ కుశలవులు రామాయణ గానం చేయడం.. సీత భూదేవి ఒడిలోకి చేరడం.. అసంబద్ధంగా అనిపించడంలేదా? ఉత్తరకాండతోపాటుగా, బాలకాండలోని నాలుగో సర్గ కూడా ప్రక్షిప్తమని భావించడానికి ఆస్కారం లేదా? పెద్దలైనవారు వివరిస్తే బాగుంటుంది.

ఇక్కడ మరో సన్నివేశం గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నది. అయోధ్యకాండలో సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరిన తర్వాత భరద్వాజాశ్రమానికి చేరడానికి ముందు.. లక్ష్మణుడిని అయోధ్యకు తిరిగి పంపాలని రాముడు ప్రయత్నిస్తాడు. ఇది అయోధ్యకాండలోని 53వ సర్గ. ఇందులో రాముడు లక్ష్మణుడితో ఏమంటున్నాడో చదువండి. ఇది యథాతథ రామాయణ మూలానువాదమని గ్రహించండి.

‘లక్ష్మణా! మహారాజునకు ఇప్పుడు దు:ఖముతో నిద్రపట్టదు. కైకేయి మాత్రం తన కోరిక తీరుటచే సంతోషించుచుండును. ఆ కైకేయి భరతుడు వచ్చిన పిమ్మట రాజ్యము కొరకై మహారాజు ప్రాణములు తీసివేయదు కదా! ఆ రాజు కామబుద్ధి కలవాడై కైకేయికి లొంగిపోయినాడు. ఇపుడు నానుండి కూడా దూరమైనాడు. దిక్కులేక వృద్ధుడై ఉన్న ఆ రాజు ఏమి చేయగలడు?

ఈ కష్టమును, రాజు బుద్ధిలో కలిగిన ఈ భ్రాంతిని చూడగా అర్థ ధర్మముల కంటే కూడా కామమే గొప్పదని నాకు అభిప్రాయము కలుగుతున్నది. మన తండ్రి నన్ను విడిచివేసినట్లు.. ఎంత తెలివి తక్కువవాడైననూ.. మరొకడు ఎవరైనా ఆడుదాని మాట విని తన యిష్టము ప్రకారము ప్రవర్తించు కుమారుని విడిచిపెట్టునా? కైకేయి కుమారుడైన భరతుడు ఒక్కడే భార్యాసహితుడై మహారాజు వలె ఐశ్వర్య సమృద్ధమైన కోసల దేశమును సుఖముగా అనుభవింపగలడు. రాజు వయస్సు చేత మరణించును. నేను అరణ్యములో ఉన్నాను. అందుచే ఆ భరతుడు రాజ్యమునకు అంతకును ప్రధానుడైన రాజు కాగలడు. అర్థ ధర్మములు విడిచి కామమునే అనుసరించువాడు, దశరథ మహారాజు వలె శీఘ్రముగా ఆపదలలో చిక్కుకొనును. ఈ కైకేయి దశరథుని చావునకు, నా వన గమనమునకును, భరతుని రాజ్యమునకు మన యింట చేరినదని అనుకొనుచున్నాను’ అని చాలా బాధ పడినాడు. ఇది అయోధ్యకాండలోని 53 వ సర్గలోని 6 నుంచి 14 శ్లోకముల సారాంశం. రాముడు లక్ష్మణుడితో మాట్లాడిన ఈ మాటలను మరొక్కసారి లోతుగా చదవండి. ఇందులో ప్రత్యేకంగా గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. తన తండ్రి అయిన దశరథుడు కామానికి లొంగిపోవడం వల్ల తాను అడవులపాలైనానని, భరతుడు భార్యతో రాజ్యాన్ని ఏలుతాడని రాముడు బాధపడ్డాడు. అంతకుమించి ఎంత తెలివి తక్కువవాడైనా.. ఆడుదాని మాట విని యిష్టం ప్రకారం ప్రవర్తించే తనను విడిచిపెట్టుకుంటాడా? అని కూడా అన్నాడు. ఇప్పుడు చెప్పండి.. తనను తండ్రి విడిచిపెట్టడం సరికాదనడానికి రాముడు చూపించిన ప్రాతిపదిక.. సీత విషయంలోనూ వర్తిస్తుంది కదా.. జనం ఏదో మాట్లాడారని తన యిష్టసఖి.. తాను చెప్పినట్టల్లా నడుచుకొనే సతి అయిన సీతను రాముడు పరిత్యజిస్తాడా? ఒక సామాన్య మానవుడిగా తండ్రి చేసిన పనిని, సవతి తల్లి చేసిన పనిని నిందించిన రాముడు.. భార్య విషయంలో అదే తప్పు ఎందుకుచేస్తాడు? ఉత్తరకాండ ప్రక్షిప్తం కాకపోతే!

ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని యుద్ధకాండలోని 117వ సర్గలో రామచంద్రుడే స్పష్టంగా చెప్పాడు. నేను మనిషిని. రాముడిని.. దశరథుడి కుమారుడిని అని. రాముడి దైవ స్వరూప స్వభావ రీతులు.. భక్తి పారవశ్యం.. ఇతరత్రా అంశాలపై తరువాతి వ్యాసాల్లో విపులంగా చర్చించవచ్చు. రామాయణంలో తాను పుట్టిననాటినుంచి కూడా రాముడు పూర్తిగా మానవుడిగానే వ్యవహరించాడు తప్ప దేవుడిగా మిరాకిల్స్ చేయలేదు. అద్భుతాలు సృష్టించలేదు. మనిషిగా సుఖ దు:ఖాలు, కోపావేశాలు, ప్రేమానురాగాలు అన్నింటినీ ప్రదర్శించాడు. రామరావణ యుద్ధం ముగిశాక, రావణ సంహారం జరిగాక సీత విషయంలో తానే ముందుగా ఆందోళన పడ్డాడు. సీతను ఈ విధంగానే తిరిగి స్వీకరిస్తే లోకం ఏమనుకుంటుందోనని భయపడ్డాడు. ఇది సమాజంలో జరిగే సర్వ సాధారణ విషయమే. తాను తిరిగి వెళ్లి రాజయ్యాక ప్రజలు ఏమీ అనుకోవద్దనే లక్ష్యంతోనే సీతను తానిష్టం వచ్చిన చోటుకు వెళ్లాలని సూచించాడు. ఆ మహాతల్లికి కోపం వచ్చింది. ఏమయ్యా.. ఇంతకాలం నాతో కలిసి ఉన్నావు. జీవితం గడిపావు.. సంసారం చేశాము.. నా గురించి నువ్వు తెలుసుకున్నదింతేనా? రావణుడు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నేను అశక్తురాలిని.. అంతగా ఆలోచించేవాడివి.. నన్ను వెతకడానికి.. రావణుణ్ణి చంపడానికి ఎందుకింత కష్టపడ్డావు.. అప్పుడే వదిలేస్తే పోయేది కదా..’ అని కూడా ఆగ్రహించింది. ఆ తర్వాత అగ్ని పరీక్షకు సిద్ధమైంది. అగ్నిప్రవేశం చేసింది. ఇక్కడ అగ్ని పరీక్ష అంటే మరేదో అనుకుంటే పొరపాటే. మనకు పురాణేతిహాసాల కాలం నుంచి ప్రతిజ్ఞలు, పరీక్షలు సమాజంలో అంతర్భాగంగా ఉన్నవే. ఒట్టువేయడం.. ప్రతిజ్ఞలు చేయడం సామాన్యమే. నిప్పులమీద నడిచే సంప్రదాయం కూడా ఈ కోవలోకి చెందిందే. ఇవాల్టికీ అనేక సమాజాల్లో ఇలాంటి ప్రమాణాలు చేయించుకోవడం.. ప్రతిజ్ఞలు చేయించడం, పరీక్షలు పెట్టి.. నిగ్గు తేల్చడం కనిపిస్తూనే ఉంటాయి. సీతాగ్నిపరీక్ష కూడా అలాంటిదేమోనని నా బలమైన అభిప్రాయం. ఆనాడు అమలులో ఉన్న అనేకానేక ప్రాయశ్చిత్తాలలో, ప్రతిజ్ఞలలో ఇదికూడా ఒకటని నమ్మకం కూడా. పైగా ఋగ్వేద కాలం నుంచి కూడా యావత్ ప్రపంచంలోని అనేక జాతులు అగ్నిని పూజిస్తూ వచ్చాయి. పవిత్రంగా, పరిశుద్ధంగా భావిస్తూ వచ్చాయి. ఋగ్వేదం ప్రారంభమే అగ్నిమీళే పురోహితం అని మొదలవుతుంది. రామచంద్రుడు కూడా సీతకు ఇలాంటిదే ఒక పరీక్ష పెట్టి.. అందరితోనూ ఆమెను మహా తేజోమూర్తి అని అనిపించిన తర్వాత కానీ ఆమెను అయోధ్యకు తీసుకొనిరాలేదు. ఈ కథ అంతా అయోధ్య వాసులకు భరతుడి ద్వారా హనుమంతుడు సవివరంగా చెప్పాడు కూడా. ఆ రోజుల్లో ధర్మానికి, నమ్మకాలకు కట్టుబడి ఉండే సమాజం కోసల సమాజం. అలాంటి సమాజం ఇటువంటి ప్రాయశ్చిత్తాలను, ప్రతిజ్ఞలను మరింత నిష్ఠగా ఆచరిస్తుంది. విశ్వసిస్తుంది. అలాంటప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొని వచ్చిన సీతపై ఆ సమాజం తిరిగి ఎలా అపవాదు మోపుతుంది? ఆల్రెడీ పరీక్ష పెట్టిన రాముడు చెప్పుడు మాటలు విని మహాసాధ్విని ఎందుకు వదిలేస్తాడు? అదీ పదకొండువేల సంవత్సరాల తర్వాత.!

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉదాహరణలు చెప్పుకుంటూపోవచ్చు. మిథిలలో సీతాదేవిని పరిణయమాడిన క్షణం నుంచి పట్టాభిషేకం వరకు కూడా వారిద్దరి అన్యోన్యత, ప్రేమ, ఆప్యాయతల గురించి.. దాంపత్య జీవనం గురించి కొల్లలుగా ఉదాహరణలు చెప్పవచ్చు. వారిద్దరి దాంపత్యజీవనం లోకానికి ఎందుకు ఆదర్శ ప్రాయమైందో మరోసారి చర్చించుకోవచ్చు. ఇంత అద్భుతమైన జీవనాన్ని గడిపి వేల ఏండ్లపాటు తమ జాతిపై చెరగని ముద్రవేసుకొన్న సీతారాములపై అడ్డగోలుగా అపవాదులు మోపడానికి ఉత్తరకాండ అనే ఒక విద్వేష పర్వాన్ని సృష్టించారు. మూలకథతో సంబంధంలేని కథలను అందులో చొప్పించారు. అందులో ఒకటి సీతా పరిత్యాగం. ఒక తప్పుడు కథను కల్పించి.. దాన్ని మాత్రమే విపరీతంగా ప్రచారంలోకి తెచ్చి.. రాముడు దుర్మార్గుడని చిత్రించే కుట్ర ఈ దేశంలో బలంగా జరిగింది. పురుషోత్తముడైన రామచంద్రుడి శిఖరసమానమైన ఔన్నత్యం ముందు ఇలాంటి కుట్రలు ఎందుకు నిలుస్తాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here