రామం భజే శ్యామలం-41

3
9

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణాన్ని ఒక మిథ్‌గా కొట్టిపారేసేవాళ్లు.. దాని చారిత్రక మౌలిక స్వరూపాన్ని అధ్యయనం చేసి ఎరుగరు. రామాయణ కాలం నాటి ప్రపంచ స్వరూపాన్ని కండ్లకు కట్టినట్టుగా ఎలా వర్ణించారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. మన చరిత్రకారులు సెక్యులరిస్టులు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్‌డ్ ఇంటెలెక్చువల్స్ వీటి జోలికి కూడా పోరు. ఎందుకంటే.. చదివితే.. చర్చించాలి. చర్చిస్తే అంగీకరించాలి. అంగీకరించడం వారికి సుతరామూ ఇష్టం ఉండదు. అందుకని నిజమైనా.. కాకపోయినా.. అంతా ట్రాష్ అనేయాలి. తిట్టాలి. కొట్టిపారేయాలి. నిందించాలి. ఎందుకంటే.. సంస్కృతాన్ని నాశనంచేశారు. క్లాసిక్‌లను కాకుండా చేశారు. ఇక వీళ్లు ఏది చెప్తే అదే వేదం. అందుకే రామాయణంలోని చారిత్రక ఆనవాళ్లపై ఈ మాత్రమైనా చర్చించేది. రామాయణంలో సుగ్రీవుడి అట్లాస్ ఆనాటి యావత్ ప్రపంచ రూపాన్ని మన కండ్లముందుంచుతుంది. ఆనాడు ప్రపంచంలో ఉన్న జాతులు, ప్రాంతాలు, నదీనదాలు, పర్వతాలు, ప్రజల గురించి సుగ్రీవుడు రాముడి ముందే తన సైన్యానికి వివరించిన తీరు అబ్బురమేస్తుంది.

సీతాన్వేషణ.. రామాయణంలో అత్యంత కీలక ఘట్టం. వాలి వధ అనంతరం సుగ్రీవుడి పట్టాభిషేకం జరిగిన తర్వాత వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం ముగిసేంతవరకు రామలక్ష్మణులు, సుగ్రీవుడు వేచిచూశారు. వర్షరుతువు వెళ్లిపోయి శరద్రుతువు ప్రారంభం కాగానే సీతాన్వేషణకు కార్యాచరణ ప్రారంభమైంది. ఈ కార్యాచరణకు సుగ్రీవుడు నాయకత్వం వహించాడు. అతను సీతాన్వేషణకు వానరులను పంపించిన విధానాన్ని కానీ చూస్తే ఆయనకున్న భౌగోళిక జ్ఞానాన్ని గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది. ప్రపంచంలో అనేకానేక దేశాలు, ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కో దిక్కుకు వెళ్లిన సైనికులకు వర్ణించి మరీ చెప్తాడు. ఎంతదూరం వరకు వాళ్లు వెళ్లగలరో కూడా వివరిస్తారు. ఆయా ప్రాంతాల్లో చాలావాటిని ఇప్పటికీ మనం ఐడెంటిఫై చేయవచ్చు. సుగ్రీవుడు రామలక్ష్మణులను మొదటిసారి కలిసినప్పుడు సీతాన్వేషణకు ఇచ్చిన హామీ మేరకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు తన సైన్యాన్ని పంపించాడు.

సుగ్రీవుడు తన వానరసేనను పూర్తిగా నాలుగు భాగాలుగా విభజించాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు ఒక్కో బృందాన్ని పంపించాడు. ఒక్కో బృందానికి ఒకరిని నాయకుడుగా నియమించాడు. వాళ్లు వెళ్లే దిక్కులో.. ఏయే ప్రాంతాలు ఉన్నాయో వివరంగా వెల్ల్లడించాడు. తూర్పువైపు భారత ఉపఖండం నుంచి ఆండెస్ దాకా ఏమేమి ఉన్నాయో చెప్పుకుంటూ వచ్చాడు. దక్షిణం వైపు అంటార్కిటికా వరకు ఏయే దేశాలున్నాయో డిస్ర్కైబ్ చేశాడు. పశ్చిమం వైపు ఆల్ప్స్ దాకా ఏమున్నాయో వివరించాడు. ఉత్తరంవైపు ఆర్కిటిక్ దాకా ఏయే దేశాలున్నాయో చెప్పాడు.

ఇది ప్రపంచ పటం. ఇందులో హైలైట్‌ చేసిన ప్రాంతం మినహా మిగతా భూభాగాన్ని యావత్తూ సుగ్రీవుడు వర్ణించాడు. ఒక్కో దిక్కుకు వెళ్లిన బృందాలకు ఒక్కో నాయకుడిని ఎంపికచేసినట్టు ముందుగా చెప్పుకున్నాం కదా. వీటిలో తూర్పువైపు వెళ్లిన బృందానికి వినతుడు నాయకుడు. తూర్పువైపు వానరులు వెళ్లిన వివరాలు ఈ కింది మ్యాప్‌లో ఉన్నాయి.

వానరులు తూర్పువైపు వెళ్లిన భూభాగంలో రెడ్, ఎల్లో మార్క్ చేసిన ప్రాంతాలన్నీ భారతీయులకు సంబంధించిన జీన్స్ సంకేతాలు. భారతీయుల జీన్స్ ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా దాకా విస్తరించి ఉన్నాయి. ఆస్ట్రేలియా దగ్గర దాదాపు 65 వేల సంవత్సరాల క్రితం మానవ ఉనికి ఉన్నట్టు మనకు సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని పనామాలో 50 వేల సంవత్సరాల క్రితం మనిషి ఉనికి ఉన్నట్టు ఇప్పటి శాస్త్రవేత్తలు రుజువులు చూపుతున్నారు. చిలీలో కూడా 33 వేల ఏండ్లనాడు మానవ ఉనికి ఉన్నట్టు చెప్తున్నారు. ఈ విధంగా చూస్తే వాల్మీకి రామాయణం కాలం నాటికి మానవ ఉనికి ఉన్న ప్రాంతాలకు సుగ్రీవుడు వెళ్లమన్నాడు. అప్పటికే మానవ ఉనికి ఉన్నదన్నది స్పష్టమైంది కాబట్టి మనం సుగ్రీవుడి భౌగోళిక విశ్లేషణ గురించి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేలేదు. సుగ్రీవుడు తూర్పున పెరు, చిలీ దాకా జియోగ్రఫీని, మైల్‌పోస్టులను సంపూర్ణంగా వివరించాడు. అంతేకాదు సముద్ర మార్గాన్ని కూడా సుగ్రీవుడు సంపూర్ణంగా విశ్లేషించాడు. ఆయా ప్రాంతాల్లో జాతులు ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాడు. సుగ్రీవుడు వర్ణించిన కొన్ని భౌగోళిక ద్వీపాలు నాడు భౌగోళికంగా కలిసిపోయి ఉన్నాయి. సముద్రమట్టం దాదాపు 140 మీటర్ల మేర కిందకు ఉండటం వల్ల ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలు ద్వీపాలుగా కాకుండా భౌగోళికంగా కలిసిపోయే ఉన్నాయి. దీనిపై మరింత లోతుగా మనం విశ్లేషించడానికి ముందు తూర్పు వానరసేనకు నాయకత్వం వహించిన వినతుడికి సుగ్రీవుడు చెప్పిన వివరాలు ఒకసారి చదువాలి. రామాయణంలోని కిష్కింధకాండ లోని 40వ సర్గలోని యథాతథ అనువాద భాగమిది. ‘ఓ వానరోత్తమా? నీవు దేశమును, కాలమును, నీటిని గుర్తించి కార్యమును నిర్ణయించుటలో సమర్థుడవు. సూర్యచంద్రులతో సమానులైన, బలవంతులైన లక్షమంది వానరులు కలిసి నీవు శైలముల తోనూ, వనములతోనూ, అడవులతోనూ నిండిన తూర్పుదిక్కునకు వెళ్లుము. అక్కడ గిరి దుర్గముల యందు వనములందు, నదులందు సీతను, రావణుని స్థానమును వెదకుడు. రమ్యములైన గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు నదులను, మణులవంటి నిర్మలమైన ఉదకము గల శోణ నదమును, యమున పర్వతమును, మహీనదిని.. శైలములతోనూ అడవులతోనూ ప్రకాశించుచున్న కాలమహీనదిని బ్రహ్మమాల.. విదేహ, మాళవ, కాశీ, కోసల, పుండ్ర, అంగదేశములను మగధ దేశములోని, మహా గ్రామములను కోశకారులనే రాజుల రాజ్యమును, వెండి గనులు గల దేశమును సీత కొరకై వెదకుడు.’…

సుగ్రీవుడు ఈ చెప్పిన దేశాలన్నీ కూడా మనకు ఈ రోజుకూ స్పష్టంగానే కనిపిస్తాయి. ఇక్కడ పేర్కొన్న నదులన్నీ కూడా ఇప్పుడు కూడా సజీవంగా ప్రవహిస్తూ మన అస్తిత్వానికి ప్రతీకలుగా ఉన్నాయి. మొన్నమొన్నటిదాకా రాజ్యాలుగా ఉన్నవే ఇవన్నీ. ఈ నదులు, అడవులు ఇప్పటికీ మనం చూస్తున్నవే.

సుగ్రీవుడు చెప్పిన మరిన్ని మాటలను ఒక్కసారి చదవండి. ‘ఓ వానరులారా.. సముద్రములో మునిగి ఉన్న పర్వతములను, పట్టణములను.. దీర్ఘమైన మందర పర్వతాగ్రమున ఆశ్రయించి కొందరు నివసించుచుందురు. వారిలో కొందరికి చెవులు ఉండవు. కొందరికి పెదవులు ఉండవు. కొందరి ముఖములు ఇనుప ముఖముల వలె భయంకరముగా ఉండును. వాళ్లు మహా వేగము కలవారు. వారికి ఒక పాదము ఉండును. నాశము లేని (చంపుటకు శక్యం కాని) బలవంతులైన కొందరు మనుష్యులను తినివేయుదురు. కొందరు కిరాతకుల శిరస్సులు తీక్షణముగా పొడవుగా ఉండును. బంగారు ఛాయగల కొందరు చూచుటకు అందముగా ఉందురు. ద్వీపములలో నివసించు కొందరు కిరాతులు పచ్చి చేపలను తిందురు. నరవ్యాఘ్రములు అనుపేరు గల భయంకరులైన కొందరు నీటి మధ్యలో సంచరించుచుందురు. వీరి స్థానములన్నింటినీ మీరు వెదకవలెను. ఆ స్థానములు చేరుటకు పర్వతముల మీదుగా వెళ్లవలెను. కొన్నిచోట్ల తెప్పలచేతను, మరికొన్నిచోట్లకు ఎగురుచూ వెళ్లవలెను.’

మనం లావోస్‌కు వెళ్తే పొడవు మెడలు ఉన్న కొన్ని తెగలకు చెందిన ప్రజలు, ఇండోనేషియాలో చెవులు జారిపోయి ఉన్న ప్రజలు, దక్షిణ అమెరికాలో గడ్డం కింద చెక్క పెట్టుకొని దాన్ని కిందకు జారేట్టు చేసుకొనే జోయే జాతికి చెందిన ప్రజలు ఉన్నారు. ఇంకొన్ని జాతుల ప్రజలు పెదాలను సాగదీసుకొని వాటిని రకరకాల దంతపు పరికరాలతో అలంకరించుకొంటారు. మరికొందరేమో పెదాలను కట్‌చేసుకొని చెవుల్లాగా కనిపించేట్టుగా చేసుకొంటారు. కొందరికి ఇవి సంప్రదాయం. మరికొందరికి అలంకారం. వీరిలో చాలా చాలా జాతులకు చెందిన వారు ఇప్పటికీ మనకు కనిపిస్తారు. ఇప్పుడే ఇన్ని రకాల జాతుల ప్రజలు ఉంటే.. రామాయణ కాలంలో మరింకెన్ని తెగలకు చెందిన వారున్నారో సుగ్రీవుడు మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. మనం ఇప్పుడు మాడ్రన్ వరల్డ్‌లో ఇప్పుడు చెవులకు, ముక్కులకు, కాకుండా పెదాలకు, నాలుకకు, బొడ్డుకు కూడా అలంకరణలు పెట్టుకోవడాన్ని చూస్తూనే ఉన్నాం.

తూర్పు ప్రపంచం గురించి సుగ్రీవుడు చెప్పిన మరిన్ని అంశాలను పరిశీలిద్దాం. ‘మీరు ప్రయత్నవంతులై అందరూ కలిసి ఏడు రాజ్యములతో ప్రకాశించుచున్న యవ ద్వీపమును, బంగారు గనులతో నిండిన సువర్ణ ద్వీపమును, రజత ద్వీపమును, వెదకుడు. యవ ద్వీపమును దాటి శిశిరమను పర్వతమున్నది. దేవతలకు, దానవులకు నివాసస్థానమైన ఆ పర్వత శిఖరము స్వర్గమును స్పృశించుచుండును. ఈ ద్వీపములలోను, పర్వత, దుర్గములయందు, జలప్రపాతములయందు, వనములలోనూ కీర్తిమంతురాలైన సీతకోసం వెదకుడు.’

రెండువేల సంవత్సరాల క్రితం నాటి మ్యాప్‌ను మనం పరిశీలిస్తే.. అనేక విషయాలు తెలుస్తాయి. అందులో మనకు అనేక గనులు మనకు కనిపిస్తున్నాయి. భారతదేశంలో లభించే బంగారానికి పూర్వకాలంలో వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకొన్నామో వాటి పేర్లపైనే పిలిచేవాళ్లం. ఉదాహరణకు.. జాంబూనగర్ బంగారం, సువర్ణద్వీప బంగారం.. ఇలా.. కొన్నిచోట్ల బంగారాన్ని పారుచాప్ అని కూడా పిలిచినట్టుగా కనిపిస్తుంది. ఈ పారుచాప్ ఇవాళ్టికీ థాయ్‌లాండ్‌లో ఉన్నది. ఇక్కడినుంచి బంగారం మనం తెచ్చుకొన్నాం. భారతదేశంనుంచి అనేక వస్తువులను ఎగుమతిచేసి వాటి బదులు బంగారాన్ని తెచ్చుకొన్నాం. ఈ థాయ్‌ల్యాండ్‌లో ఏడు ద్వీపాలు ఉన్నాయి. ఈ ఏడు ద్వీపాలకు సంబంధించిన రాజముద్రల్లో సంస్కృతానికి సంబంధించిన పదాలు ఇవాళ్టికీ స్పష్టంగా కనిపిస్తాయి. ‘జయరాయ’, ‘కలిమంథన్ ఉత్తర’, ‘బాలిద్వీపజయ’ ఇలాంటి పేర్లు కనిపిస్తాయి. జావా ఎంబ్లమ్ చూస్తే అందులో ‘శక్తి, భక్తి, ప్రజ’ అన్న పేర్లు కనిపిస్తాయి. పాపా (పపువా) రాజముద్ర ‘కార్యస్వాదయ’ అన్న పదాలు కనిపిస్తాయి. ఇండోనేషియన్ ఎంబ్లమ్ లో ‘బిన్నేక తుంగల ఇక’ అంటే భిన్నత్వంలో ఏకత్వం అని అర్థం. ఈ విధంగా సుగ్రీవుడు ఏయే ప్రాంతాల్లో ఏమేమి ఉన్నాయో వివరిస్తూ వెళ్లాడు. పర్వతాలు, కొండలు, సముద్రాలు, అడవులను ఇలా విశ్లేషించాడు. యవ ద్వీపమంటే జావా ద్వీపమే.

సుగ్రీవుడు మరిన్ని ప్రాంతాల గురించి కూడా చర్చించాడు. ‘అక్కడ నుంచి ఎర్రని నీరు గల శీఘ్రముగ ప్రవహించే శోణనదిని చేరి అక్కడినుంచి సిద్ధులు, సారణులు నివసించు సముద్రము అవతలి ఒడ్డుకు చేరి, దాని రమ్యములైన తీర్థములలోనూ విచిత్రములైన అడవులలోనూ సీతను, రావణుని వెదకవలెను. పిమ్మట భయంకరములైన సముద్రద్వీపములనూ, గాలిచే కదల్చబడి, ధ్వనిచేయుచూ చాలా భయంకరమైన తరంగములతో నిండిన సముద్రమును వెదకుడు. అక్కడ చాలా కాలమునుంచి ఆకలితో బాధపడుచున్న పెద్ద పెద్ద దేహములు కల అసురులు, బ్రహ్మదేవుడి అనుజ్ఞచేత నిత్యమూ తమ సమీపమునకు వచ్చినవారిని నీడను పట్టి లాగి తినుచుందురు. మహాసర్పములకు నివాసస్థానమైన మేఘము వంటి మహాధ్వని గల ఆ మెదధిని తీరమార్గముననే, లేదా ఉపాయముచేత దాటి, దాని తర్వాత ఎర్రని జలం కల లోహితమను పేరు గల భయంకరమైన సముద్రముచేరి అక్కడ చాలా పెద్దదైన ఆకూట శాల్మరీ వృక్షమును చూడగలరు.’ అన్నాడు.

ఇందులో లోహితమనే సముద్రం అంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని కోరల్ సముద్రం. ఇందులోని నీరు పసుపు, ఎరుపు కలగలిసి కనిపిస్తాయి. ఇక్కడ శాల్మరీ వృక్షం కనిపిస్తుందని సుగ్రీవుడు చెప్పాడు. శాల్మరీ అన్న సంస్కృత శబ్దానికి బొటానికల్ పేరు సల్మాలియా మలబారి కట్రాలియా అంటే భౌతిక నామం బాంబాక్స్ సీబా.. అనే ఎర్రని పూలు పూసే పొడవైన చెట్టు. ఇది తూర్పు ఉత్తర ఆస్ట్రేలియాలో ప్రసిద్ధమైన చెట్టు. ఇది ప్రధానంగా సిల్క్ కాటన్ చెట్టు. సాధారణంగానే దాదాపు 80 అడుగుల పొడవుగా ఎదుగుతుంది. విష్ణుపురాణంలో ఆస్ట్రేలియాను శాల్మరీ ద్వీపంగా అభివర్ణించారు.

సుగ్రీవుడు చెప్పిన కొన్నింటికి మనకు పూర్తి ఆధారాలు కనిపించకపోవచ్చు. ఎందుకంటే.. సముద్రం రామాయణ కాలంనుంచి దాదాపు 140 మీటర్ల ఎత్తుకు ఎదిగింది. దీనివల్ల అనేక ద్వీపాలు సముద్రంలో కలిసిపోయాయి. భూభౌగోళిక స్వరూపం సంపూర్ణంగా మారిపోయింది. కానీ మనకు ప్రతీకాత్మకంగా చెప్పవచ్చు.. సుగ్రీవుడి మాటల్లో కొన్ని అంశాలను పరిశీలించుకుంటూ వెళ్దాం. ఇది చదవండి.

‘అక్కడ కైలాస పర్వతము వలె ఉన్న గరుత్మంతుడి గృహము మీకు కనబడును. రత్నములచేత అలంకరించబడిన ఆ గృహమును విశ్వకర్మ నిర్మించెను. అక్కడ పర్వతముల వంటి ఆకారములతో భయంకరముగాఉండు అనేక విధములైన రూపములు కల మహాబలశాలులైన మందేహులనే రాక్షసులు చూచువారికి భయము కలిగించుచు.. పర్వత శిఖరములమీదుగా వేలాడుచుందురు. ఆ రాక్షసులు ప్రతిదినము.. సూర్యోదయ సమయమున సూర్యునిచేత తపింపజేయబడి.. బ్రహ్మతేజస్సులచేత కొట్టబడినవారై నిత్యము.. సముద్రజలములో పడిపోవుచుందురు. మరల లేచి పర్వత శిఖరములమీద వేలాడుచుందురు.’

ఇక్కడ కైలాస పర్వతం వలె ఉన్న గరుత్మంతుడి గృహం అన్నాడు. ఇదంతా రత్నాలచేత అలంకరించబడి ఉన్నదన్నాడు. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రింపీ పిరమిడ్. ఇది ఒక వైపు నుంచి చూస్తే పెద్ద పక్షి ఆకారంలా కనిపిస్తుంది. ముందు పెద్ద పర్వతంలా ఉన్న ఇది తరువాతి కాలంలో పిరమిడ్‌గా మారి ఉండవచ్చని యురోపియన్ చరిత్రకారులు కొందరు చెప్తారు. దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద గుహలు, పర్వతాలు మనకు కనిపిస్తాయి. పెరు, చిలీ సమీపంలో.. భయంకరమైన గుహలు.. ఉంటాయి. ఇప్పటికీ అక్కడ చాలామంది సాహసికులు యాత్రలు చేస్తుంటారు. ఈ గుహలు అనేక ఆకారాల్లో మనకు కనిపిస్తాయి. వాటిలో పక్షి ఆకారం కూడా ఒకటి.

ఈ పర్వతాలపై పెద్ద పెద్ద గబ్బిలాలు వేల సంఖ్యలో రాత్రి వేళల్లో వేలాడుతూ ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడి కాంతికి తట్టుకోలేక నీట పడిపోతుంటాయి. మళ్లీ రాత్రి కాగానే పైకి వస్తుంటాయి. ఇవి చూస్తేనే చాలా చాలా భయంకరంగా ఉంటాయి. రామాయణ కాలంలో ఈ ప్రాంతం జంతువుల రాజ్యంగా ఉండిఉండవచ్చు. వీటినే సుగ్రీవుడు రాక్షసులుగా అభివర్ణించాడు. ప్రపంచంలో ఇంత భయంకరంగా ఉండే గబ్బిలాలు ఎక్కడా కనిపించవు. భయంకరమైన గబ్బిలాలు (వాంపైర్ బ్యాట్స్) దక్షిణ అమెరికాలో మాత్రమే ఉంటాయి. ఇవి రక్తం తాగి మాత్రమే బతుకుతాయి. అవి జంతువుల రక్తం కావొచ్చు. మనుషుల రక్తం కావొచ్చు. అందుకే వీటిని సుగ్రీవుడు మందేహ రాక్షసులని పిలిచాడు.

ఆ తర్వాత సుగ్రీవుడు క్షీరసాగరం గురించి చెప్పాడు. అక్కడ ఎంత అందంగా ఉంటుందో వివరించాడు. ‘మీరు తెల్లని మేఘమువంటి కాంతి కలది.. తరంగములతో ముత్యాల హారమువలె ఉన్నది అయిన క్షీరసముద్రమును చూడగలరు. ఆ క్షీర సముద్ర మధ్యమునందు.. ఋషభమనే తెల్లని పర్వతమున్నది. ఆ పర్వతము మీద దివ్యమైన సువాసన గల పుష్పించిన వృక్షములు దట్టముగా ఉండును. దానిపైననే బంగారు కింజల్కములు గల ప్రకాశించుచున్న వెండి పద్మములతోనూ రాజహంసలతోనూ అందముగా ఉన్న సుదర్శనమను ప్రసిద్ధనామము గల సరస్సుఉన్నది. దేవతలు, సారణులు, యక్షులు, కిన్నెరులు.. వానరులు సంతోషముతో క్రీడింపవలెనను కోరికతో ఆ సుదర్శన సరస్సు వద్దకు వెళ్లుచుందురు. అప్పుడు క్షీర సముద్రమును దాటి వెళ్లి.. వెంటనే అందరికీ భయము కలిగించు జలసముద్రమును చూడగలరు. ఆ సముద్రములో ఔర్వ రుషి కోపము వలన పుట్టిన అశ్వముఖము కల గొప్ప తేజస్సు ఉన్నది. స్థావర జంగమములతో కూడి మహావేగముతో కలిగిన సముద్రజలము ఆ తేజస్సుకు ఆహారము అని చెప్పెదరు. అక్కడ వడవాగ్నిని చూచి ఏమీ చేయజాలక సముద్రములోని ప్రాణులు అరుచుచుండు ధ్వని వినబడును. మధురమైన ఉదకము గల ఆ సముద్రము ఉత్తరతీరమునందు పదమూడు యోజనములు వ్యాపించి బంగారు కాంతి కల జాతరూపశీలము అను మహాపర్వతము ఉన్నది. మీకు అక్కడ వేయి పడగలు గల భూభారమును వహించు ఆదిశేషుడు ఆ పర్వతాగ్రముపై కూర్చుండి కనబడును. సమస్త దేవతలచే నమస్కరించబడిన ఆ ప్రభువు చంద్రుని కాంతి వంటి కాంతితో ప్రకాశించుచుండును. పద్మ పత్రముల వలె విశాలములైన నేత్రములు గల ఆ దేవుడు.. నల్లని వస్త్రము ధరించి యుండును.’

ఇక్కడ క్షీరసాగరం అంటే పసిఫిక్ మహాసముద్రమే. దీన్ని దాటుకొనే దక్షిణ అమెరికాకు వానరులు వెళ్లారు. ఈ పసిఫిక్ సముద్రంలో మధ్యలో ఒక మహాపర్వతం కనిపిస్తుంది. హవాయి ద్వీపాలకు 2600 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగుభాగంలో 5100 మీటర్ల నుంచి పైకి ఎదుగుతూ వచ్చింది. సుగ్రీవుడు రామాయణంలో చెప్పిన పర్వతం ఇదే. దేవరాక్షసులు మధించిన క్షీరసాగర మథనం ఇక్కడే జరిగిందా? ఈ పర్వతమే మంథరమా అన్నది పరిశోధిస్తే తేలుతుందేమో.

ఈ పసిఫిక్ సముద్రం మధ్యలో పాలినేషియా పేరుతో అనేక ద్వీపాలు ఉన్నాయి. హవాయి, న్యూజిలాండ్ వీటిలో కొన్ని. వీటిపై ఉషి రింగ్లెబ్ అనే మహిళ పరిశోధన చేసింది. ఈ పరిశోధన ప్రకారం పాలినేషియా భాషల్లో చాలా పదాలు సంస్కృతంతో కలుస్తున్నాయి. సివ అన్న పదాన్ని నృత్యానికి ప్రతీకగా వాడుతారు. మరికొందరు హివ అని కూడా ఇదే అర్థంలో వాడుతారు. ఈ రెండు పదాలు కూడా నటరాజస్వామి అయిన శివుడి రూపంతో సరిపోలుతున్నాయి.

సుగ్రీవుడు ఇదే సమయంలో మరోమాట కూడా చెప్పాడు. ‘మూడు తలలు గల చుట్టూ వేదిక కట్టిన ఒక బంగారు తాళ వృక్షము ఆ మహా పర్వతము పైభాగమునందు కేతువుగా స్థాపించబడినది. ఈ తాళ వృక్ష విమానమును.. దేవతలు తూర్పుదిక్కున చేసి ఉన్నారు. దాని తర్వాత బంగారు ఉదయ పర్వతము శోభతో ప్రకాశించుచుండును. బంగారు వికారము శ్రేష్ఠము వేదికలతో కూడినది. నూరు యోజనములు పొడవు గలది అయిన దాని ఆకాశమును స్పృశించుచూ ప్రకాశించుచుండును.. అది బంగారు వికారమైనది. దివ్యములు సూర్యునితో సమానములు అయిన పుష్పించిన సాల తాళ తమాల కర్ణికార వృక్షములతో ప్రకాశించుచుండును.’ అని చెప్పాడు.

దక్షిణ అమెరికాలో ఆండిస్ ప్రాంతంలో ఒక పర్వతం ఉన్నది. దీనిపైన మనకు ఒక త్రిశూల ఆకారం కనిపిస్తుంది. ఒక వేదికపై పెట్టినట్టుగా స్పష్టంగా చెక్కబడి ఉన్నది. దాని పేరు పరాకస్ కాండెలెబ్రా. సుగ్రీవుడు చెప్పిన ఉదయ పర్వతం సంకేతాలు యథాతథంగా ఈ కాండెలెబ్రాతో సరిపోలుతున్నాయి. ఈ త్రిశూలం బంగారు రంగులో ఉంటుంది. ఈ త్రిశూలాకారం 600 నుంచి 800 అడుగుల ఎత్తు కలిగి.. 2 నుంచి 3 అడుగుల లోతు కలిగి ఉంటుంది. సముద్రం నుంచి 12 మైళ్ల వరకు కనిపిస్తుంది. దీని గురించి అమెరికన్ల చరిత్రలో కానీ, యురోపియన్ల చరిత్రలో కానీ ఎక్కడా చెప్పలేదు. పెరూ స్థానికులను విచారించినప్పుడు వారు కూడా దీని గురించి చెప్పలేకపోయారు. దీని గురించి రామాయణంలో మాత్రమే కనిపిస్తుంది. ఈ పర్వతాన్ని దేవతలు నిర్మించారని చెప్పారు.

ఇది సుగ్రీవుడు చెప్పిన అట్లస్‌లో తూర్పు ప్రపంచం. మిగతా దిక్కుల గురించి తరువాతి వ్యాసాల్లో చర్చించుకొందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here