రామం భజే శ్యామలం-45

0
9

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణంలో మనకు రెండు ప్రధాన నగరాలు చర్చలోకి వస్తాయి. అందులో ఒకటి అయోధ్య. ఇది సరయూ నది తీరంలో ఉన్నది. దీని ఆనవాళ్లు.. జియోగ్రాఫికల్ డాటా మనకు స్పష్టంగానే తెలుస్తున్నది. రామాయణంలో అత్యంత ముఖ్యమైనది.. కీలకమైన భూమికను నిర్వహించింది లంక. సీతాదేవిని అపహరించుకొనిపోయిన రావణుడు ఏలిన ఈ లంకా నగరం ఎక్కడ ఉన్నది? రామాయణంలో ఆయా సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చిన లంకకు సంబంధించిన అంశాలు.. వెల్లడించిన వివరాలను బట్టి భారతీయ చరిత్రకారులు, పాశ్చాత్య చరిత్రకారులు, మధ్య, దక్షిణాసియా పరిశోధకులు, రష్యన్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు లంకానగరాన్ని గురించి రకరకాలుగా ప్రతిపాదించారు. మధ్యప్రదేశ్ నుంచి దక్షిణాన జీరో డిగ్రీ అక్షాంశ రేఖవరకు ఉన్న ప్రాంతాలలో కొన్నింటిని రావణుడి లంకగా కొందరు నిర్ధారణకు వచ్చారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కానీ, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కానీ దీనిపై పలు సదస్సులు కూడా నిర్వహించింది. ఒక్కొక్కరు రామాయణంలోకి ఒక్కో అంశాన్ని ప్రాతిపదిక చేసుకొని లంకాన్వేషణ చేశారు. వీటన్నింటిపై మరికొంత విశదంగా చర్చించాల్సిన అవసరం ఉన్నదనిపించింది.

1988 నవంబర్ 2 నుంచి నాలుగో తేదీ వరకు ధార్వాడ్‌లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి. ఇందులో కే రామకృష్ణారావు ఒక పరిశోధనాపత్రం సమర్పించారు. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడ రావణుడి లంకను ప్రతిపాదించారో వాటి వివరాలు వెల్లడించారు.

రచయిత వారి రచన లంకను ప్రతిపాదించిన ప్రదేశం
1. సి.వి. వైద్య ది రిడిల్ ఆఫ్ ది రామాయణ సిలోన్ (ప్రస్తుత శ్రీలంక)
2. ఎస్.బి. దీక్షిత్ భారతవర్షీయ భువర్నన (మరాఠీ) సిలోన్ (ప్రస్తుత శ్రీలంక)
3. ఎం.ఎస్ ఆనే రామాయణ ట్రెడిషన్ ఇన్ సిలోన్ సిలోన్ (ప్రస్తుత శ్రీలంక)
4. టి. పరమశివ అయ్యర్ రామాయణ అండ్ లంక ఈక్వటార్‌పైన లింగ ఆర్చిపిలాగో (లింగ ద్వీపం)
5. ఎన్.ఎస్ అధికారి లంక ఆఫ్ రావణ ఇండోనేషియాలోని సుమత్ర
6. వి.హెచ్. వడార్ సిచ్యుయేషన్ ఆఫ్ రావణాస్ లంక మాల్దీవ్ ద్వీపాలు
7. సి.ఎన్. మెహతా సుందరకాండ ఆర్ ది ఫ్లైట్ ఆఫ్ హనుమాన్ టు లంక వయా సుందా ఐలాండ్ బై ఎయిర్ రూట్ ఆస్ట్రేలియాలో ఒక ప్రాంతం
8. హెచ్. జాకోబీ డెస్ రామాయణ (ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్) అస్సాం
9. విష్ణుపంత్ కరండికర్ కోటెడ్ బై కిబే నర్మదకు సమీపంలోని మహేశ్వర దగ్గర
10. మాధవరావు వినాయక్ కిబే రావణాస్ లంక డిస్కవర్డ్ వింధ్య పర్వత శ్రేణుల్లోని అమరకంఠక
 11. జోగేశ్ చంద్రబోస్ ఏ నోట్ ఆన్ రావణాస్ లంక ఇన్ సెంట్రల్ ఇండియా వింధ్య పర్వత శ్రేణుల్లోని అమరకంఠక
12. ఎఫ్.ఇ. ఫర్గిటర్ ది జియోగ్రఫీ ఆఫ్ రామాస్ ఎక్సైల్ సిలోన్ (ప్రస్తుత శ్రీలంక)
13. ధని నీవత్ ది రామ జాతక లంక్‌లసక్ (మాలే ద్వీపకల్పం)
14. సచ్చిదానంద సహాయ్ ద ఖే థురఫి జంబూద్వీపానికి ఆవల
15. జి.ఎస్.సంపత్ అయ్యంగార్ కిష్కింధ టు లంక ఈక్వేటార్‌వద్ద మునిగిపోయిన ఒక నగరం
16. డి.పి. మిశ్రా ది సర్చ్ ఫర్ లంక గోదావరినదీముఖంలో మునిగిపోయిన ఓ నగరం

1980వ దశకం ప్రారంభంలో రామాయణంపై విస్తృత పరిశోధనలు చేసి ‘వాస్తవ రామాయణ్’ ను రచించిన డాక్టర్ పీవీ వర్తక్ రామాయణంలోని లంకకు సంబంధించిన వివిధ పేర్లను ఆధారం చేసుకొని వివిధ ప్రాంతాలను లొకేట్ చేసేందుకు ప్రయత్నించారు. రావణుడి లంకకు సంబంధించి పీవీ వర్తక్ ఆరు ప్రాంతాలను ప్రతిపాదించారు. ఈ ఆరింటిలో ఏదో ఒకటి రావణుడి లంకగా ఆయన భావించారు. వీటిలో మొదటిది నేటి మధ్యప్రదేశ్. రెండోది పశ్చిమ సముద్రతీరంలో శాస్తి, మూడోది ముంబై, నాలుగోది ఒడిశా, ఐదు గుజరాత్ లేదా మహారాష్ట్ర, ఆరోది ఆంధ్రప్రదేశ్.

రావణుడి లంక భారత్‌కు బయట ఎక్కడా లేదని.. మనదేశంలోనే ఒక ప్రాంతంలో ఉన్నదని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ సంకాలియా అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్‌కు తూర్పు, ఒడిశా దక్షిణ ప్రాంతం.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలను కలిపి రావణుడి లంకగా ఆయన ప్రతిపాదించారు. సంకాలియాకు ముందు 1940 అయ్యర్ అనే పరిశోధకుడు, 1941లో మాధవరావు వినాయక్ కిబేలు ప్రస్తుత శ్రీలంక.. రావణుడి లంక కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు తూర్పున ఉన్న ఇంద్రాణా హిల్స్‌ను లంకగా భావించాడు అయ్యర్… వింధ్య పర్వత శ్రేణుల్లోని అమర కంఠకాన్ని (మధ్యప్రదేశ్‌లోని శాదల్ జిల్లా) లంక అని 1941 లో కిబే పేర్కొన్నాడు.

రెండువేల సంవత్సరాల క్రితంనాటి టోలెమి ప్రపంచమ్యాప్‌లో తప్రోబన అనే ద్వీపం మ్యాప్ ఉన్నది. ఇది ఆధునిక శ్రీలంకను పోలి కనిపిస్తున్నది. తరువాతి కాలంలో ఇదే ప్రాంతం సుమత్రగా పిలువబడుతున్నది. యురోపియన్లు ఫాంటమ్ ఐలాండ్ అన్నారు. దీన్ని కూడా కొందరు రావణుడి లంకగా భావించారు.

శ్రీలంక విషయానికి వచ్చినప్పుడు మొదట్లో దీన్ని శిలాద్వీపమని పిలిచారు. ఆ తర్వాత అరబ్బులు సెరిండిబ్ అని పిలిచారు. యురోపియన్లు సిలోన్ అని అన్నారు. క్రీస్తుశకం 8 నుంచి 12 శతాబ్దాల మధ్య రామాయణాన్ని పలు ప్రక్రియల్లో రచించిన కొందరు భారతీయ రచయితలు శ్రీలంకను, సింహళ ద్వీపాన్ని వేరువేరుగా భావించారు. 9వ శతాబ్దంలో మురారి తన అనర్ఘ రాఘవంలో రాముడు శ్రీలంకను వదిలేసిన తర్వాత సింహళద్వీపాన్ని దాటుకొంటూ వెళ్లాడు అని పేర్కొన్నాడు. రాజశేఖరుని బాలరామాయణంలో సింహళకు దక్షిణాన లంక ఉన్నట్టుగా పేర్కొన్నాడు. సింహళరాజును, లంక రాజును వేర్వేరుగా ప్రస్తావించాడు. ఇందులో రావణుడు స్వయంగా సింహళ రాజు గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. రాముడు పుష్పక విమానంలో బయలుదేరినప్పుడు ఆకాశం నుంచి విభీషణుడు సింహళ మండలాన్ని సీతకు చూపించిన సందర్భంలో, రాముడు వెనుకకు తిరిగి లంకను చూపిస్తూ.. విభీషణుడి నూతన రాజధాని లంక అని చెప్పినట్టు రాజశేఖరుడు తన బాలరామాయణంలో రచించాడు. రాజశేఖరుడి కావ్య మీమాంసలో లంకను రావణుడి రాజధానిగా చెప్తూ.. సింహళ రావణుడి ఆధీనంలో ఉన్న ప్రాంతంగా చూపించాడు.

మరో ప్రముఖ పరిశోధకుడు నీలేశ్ నీలకంఠ్ ఓక్ గణాంకాల ప్రకారం రామాయణం జరిగిందే పన్నెండువేల సంవత్సరాల క్రితం. అప్పటికి సముద్రమట్టం ఇప్పటికంటే చాలా చాలా కిందకు ఉన్నది కాబట్టి.. (ఓషనోగ్రఫీ ప్రకారం) శ్రీలంక.. భారతదేశంతో భౌగోళికంగా కలిసే ఉన్నదని పేర్కొన్నారు. శ్రీలంకకు, భారత్‌కు భూమార్గంలో కనెక్టివిటీ ఉన్నప్పుడు అక్కడ సేతు నిర్మాణం జరిగే అవకాశమే లేదని ఆయన అభిప్రాయం. నీలేశ్ ఓక్ పరిశోధన ప్రకారం ప్రస్తుత శ్రీలంక లంక కాదు. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు చెప్పిన దిశలో దక్షిణాన మహేంద్రగిరి నుంచి దక్షిణంవైపు లంకకు హనుమంతుడు వెళ్లాడు. కాబట్టి.. ప్రస్తుత లంక శ్రీలంక అయ్యే అవకాశం లేదని నీలేశ్ ఓక్ కచ్చితమైన అభిప్రాయం. ఈయన లెక్కల ప్రకారం భారతదేశంలో కురుక్షేత్ర, ఉజ్జయిని, అవంతి, లంక ఒకే రేఖలో ఉన్నాయి. ఇందులో లంక.. నిరక్ష అంటే.. సున్న/సున్న అక్షాంశ రేఖాంశాలపై ఉన్నదని నీలేశ్ అభిప్రాయం. దీని ప్రకారం రావణుడి లంక అన్నది నిరక్ష అంటే.. భారతదేశానికి పూర్తిగా దక్షిణాన కిందివైపు ఈక్వెటార్‌పై ఉన్నదని నీలేశ్ పేర్కొన్నారు.

కురుక్షేత్ర, ఉజ్జయిని, అవంతి ఒకే రేఖపై ఉండటం కరెక్టే కావచ్చు. కానీ అది ప్రస్తుత ప్రైమ్ మెరిడియన్ రేఖ కాదు. మనకు జీరో/జీరో అక్షాంశ రేఖాంశాలు నల్ ఐలాండ్ వద్ద ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో, పశ్చిమాఫ్రికా తీరంలో ఘనా దేశానికి దక్షిణాన 614 కిలోమీటర్ల దూరంలో జీరో/జీరో అక్షాంశ రేఖాంశాల కోఆర్డినేట్ ఉంటుంది. ఇందులో జీరో లాటిట్యూడ్ లైన్ భారతదేశానికి దక్షిణాన కింది నుంచి వెళ్తుంది. కురుక్షేత్ర, ఉజ్జయిని, అవంతి నుంచి వచ్చే నిలువు రేఖ లాంగిట్యూడ్ దీనికి కలవచ్చేమో కానీ.. ఇది జీరో కావడానికి వీలు లేదు. నీలేశ్ ఓక్ లంకను లొకేట్ చేసిన ప్రాంతం.. లాటిట్యూడ్ (అక్షాంశం) సున్నా డిగ్రీలు అవుతే.. రేఖాంశం సుమారు 75.7849 డిగ్రీలుగా ఉన్నది. అలాంటప్పుడు నిరక్ష పై లంక ఉన్నదని అనడం సమంజసం కాదు. నీలేశ్ ఓక్ చర్చ ప్రకారం నిరక్ష అంటే జీరో అక్షాంశం మాత్రమే కావాలి. ఈయన గణాంకాల ప్రకారం కురుక్షేత్ర, ఉజ్జయిని, అవంతి, లంక రేఖాంశం ప్రాచీన ప్రైమ్ మెరెడియన్ రేఖ అయి ఉండవచ్చు. దీని గురించి జియాలజిస్టులు నిర్ధారణ చేయాల్సి ఉన్నది.

ఈ మొత్తం వివరాలద్వారా ఒక అంచనాకు వస్తే రావణుడి లంకకు సంబంధించి రెండు ప్రాంతాల లొకేషన్లు ప్రధానంగా వాదానికి నిలబడుతున్నాయి. ఒకటి సంప్రదాయంగా అందరూ భావిస్తున్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తున్న శ్రీలంక. మరొకటి భారతీయ ప్రాచీన ప్రైమ్ మెరెడియన్ రేఖ నుంచి జీరో అక్షాంశంపై ఉన్న ప్రాంతం.

భారతదేశంలో కన్యాకుమారి 08.0883 అక్షాంశంపై ఉన్నది. భూమి.. పోల్ నుంచి పోల్ వరకు 40,008 కిలోమీటర్లు=360 డిగ్రీలు. అంటే 40,007.863 కిలోమీటర్లు. అప్పుడు కన్యాకుమారి 08.0883 డిగ్రీలు = 898.87668 కిలోమీటర్లు అంటే సుమారు 900 కిలోమీటర్లు. ఈ విధంగా లెక్కించినప్పుడు కన్యాకుమారి నుంచి నిరక్ష పై లంక ఉన్నదంటూ చెప్తున్న ప్రాంతం 900 కిలోమీటర్లు ఉంటుంది.

ఈ రెండింటిలో రావణుడి లంక ఏమిటన్నది అనుకోవడానికి ముందు పలు అంశాలను ప్రస్తావన చేయాల్సి ఉన్నది. వాల్మీకి రామాయణం ప్రకారం సుందరకాండలో హనుమంతుడు మహేంద్రపర్వతం మీది నుంచి లంకకు వంద యోజనాలు ప్రయాణం చేశాడు. మహాభారతం వనపర్వంలో కూడా ఇదే ప్రస్తావన భీమాంజనేయుల మధ్య సంవాదం జరిగినప్పుడు వస్తుంది. అంటే యోజనాల ప్రమాణం రామాయణ మహాభారత కాలాల నాటికి మారలేదన్నమాట. యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన వర్ణన ఉన్నది.

‘ఉత్సాహవంతులైన, ఏనుగులతో సమానులైన వానరులు మొదటి దివసమునందు పదునాలుగు యోజనములు సేతువు నిర్మించారు. అదేవిధముగా రెండో రోజున ఇరువది యోజనాలు సేతువును నిర్మించారు. అట్లే మూడవ రోజున తొందరపడుచూ సముద్రములో ఇరువదియొక్క యోజనముల సేతువును నిర్మించారు. పిమ్మటి నాలుగో రోజున ఇంకను ఇరువది రెండు యోజనముల సేతువును కట్టిరి. ఐదవ రోజున సముద్రపు అవతలి ఒడ్డును చేరినట్లు ఇరువది మూడు యోజనములు కట్టిరి. మొసళ్లకు నివాసస్థానమైన ఆ సముద్రము మీద నలుడు నిర్మించిన అందమైన, శోభాయుక్తమైన ఆ సేతువు ఆకాశమునందలి నక్షత్ర మార్గము వలె కనపడును. నలుడు నిర్మించిన ఆ సేతువు పది యోజనముల వెడల్పు, నూరు యోజనముల పొడవు ఉండెను.’

దీని ప్రకారం రామసేతువు నూరు యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పుగా నిర్మించారు. ఇప్పుడు ఈక్వెటార్‌పై ఉన్నదని చెప్తున్న లంకను గనుక పరిగణనలోకి తీసుకొన్నట్టయితే.. సౌత్ టిప్ నుంచి ఈక్వెటార్ 900 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఒక యోజనం ప్రమాణం తొమ్మిది కిలోమీటర్లు. వానరసేన ఐదోరోజున 23 యోజనాల మేర పది యోజనాల వెడల్పుతో సేతువు నిర్మించిందని వాల్మీకి రాశాడు. ఈక్వెటార్ దూరాన్ని ప్రమాణంగా తీసుకొన్నప్పుడు ఒక యోజనం 9 కిలోమీటర్లుగా భావిస్తే.. వానరసేన ఆ ఒక్క రోజున 23 x 10 యోజనాలు (207 x 90 కిలోమీటర్లు) అంటే.. 18,630 చదరపు కిలోమీటర్ల దూరం అన్నమాట. ఒక్క రోజులో పద్ధెనిమిది వేల ఆరువందల చదరపు కిలోమీటర్ల మేర సేతువును నిర్మించడం మనుషులకు ఎంతమాత్రం సాధ్యం కానేకాదు.

ప్రస్తుతం ఉన్న శ్రీలంకను రావణుడి లంకగా భావించనట్లయితే.. మనకు రామసేతువు కనిపిస్తున్న ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకు దూరం 36 కిలోమీటర్లు. ఈ మేరకు మాత్రమే మనకు సేతువు కనిపిస్తున్నది. కానీ.. రాముడు మహేంద్రగిరి నుంచి సేతువు నిర్మించినట్టుగా ఉన్నది. మహేంద్రహిల్స్ ప్రస్తుత తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్నది. ఇక్కడి నుంచి మహేంద్రగిరి మీదుగా సేతువు నిర్మించిన నలుడికి సముద్రుడు తక్కువ లోతు ఉన్న ప్రాంతం మీదుగా కట్టాలని దారి చూపించాడు. యుద్ధకాండలో ఈ ప్రస్తావన స్పష్టంగానే ఉన్నది. సేతువు నిర్మించిన తరువాత అది ఆకాశం నుంచి చూస్తే నక్షత్రాకారంలో ఉన్నదని కూడా విస్పష్టంగానే వాల్మీకి పేర్కొన్నాడు. అంటే సేతు నిర్మాణం నేరుగా ఋజు మార్గంలో జరగలేదన్నది స్పష్టం. నలుడు సేతువును తక్కువ లోతు ఉన్న ప్రాంతం మీదుగా నక్షత్రాకారంలో జిగ్‌జాగ్ గా నిర్మించాడని అర్థం. ఈ క్రమంలో లెక్కించినట్లయితే మహేంద్రగిరి నుంచి సౌత్ టిప్‌కు.. అక్కడినుంచి రామేశ్వరం.. ధనుష్కోడి మీదుగా. మన్నార్ దాటి లంకలోకి సముద్రంలో తక్కువ లోతు ఉన్న ప్రాంతం మీదుగా సేతువు నిర్మించి ఉండవచ్చు. ప్రస్తుతం ఉన్న ధనుష్కోడి, మన్నార్ కూడా సేతువులో భాగమేనని ఓషనోగ్రఫీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సేతు నిర్మాణం బలిష్ఠంగా ఉండటం వల్ల కాలక్రమంలో ధనుష్కోడి, మన్నార్‌లు ల్యాండ్ మార్కులుగా మారిపోయి ఉండవచ్చు. ఎందుకంటే.. వీటిదగ్గర మనకు లభించే సాయిల్.. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న సేతువుమీద లభిస్తున్న సాయిల్ ఒకటే కావడం గమనార్హం. ఇది మ్యాన్‌మేడ్ వంతెన అన్నది నాసా సహా పలువురు శాస్త్రవేత్తలు రుజువుచేశారు. 2017 డిసెంబర్ 11న సైన్స్ చానల్ దీనిపై స్పష్టమైన డాక్యుమెంటరీ కూడా ప్రసారం చేసింది. మనకు ఇప్పుడు కనిపిస్తున్నది ధనుష్కోడి నుంచి మన్నార్ వరకు ఉన్న సేతువు మాత్రమే. జియాలజిస్టుల లెక్క ప్రకారం లెక్కించినట్లయితే అప్పటి కాలంలో ఈ దూరం ఎంత అన్నది తేల్చాల్సి ఉన్నది. వాస్తవంగా యోజన ప్రమాణాన్ని లెక్కించినట్టయితే లక్షల సంఖ్యలో ఉన్న వానరసేనకు ఇక్కడ సేతు నిర్మాణం పెద్దగా కష్టమయ్యే అవకాశం లేదు. దీని నిర్ధారణపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. యోజన ప్రమాణాన్ని సరిగ్గా తేల్చడంతోపాటు ఓషనోగ్రఫీ ప్రకారం సముద్రమట్టంలో వచ్చిన మార్పులు.. భూమిలోని పొరల్లో వచ్చిన మార్పులను గణించి ఒక స్పష్టతకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. లంక అన్నది ద్వీపం కాబట్టి.. దాని కోఆర్డినేట్లు గణనీయంగా మారి ఉండే అవకాశం కచ్చితంగా ఉన్నది.

ఈ దూరాలు.. కిలోమీటర్ల లెక్కలు కొంతమేరకు గజిబిజిగానే ఉండవచ్చు. కానీ.. ప్రస్తుతం ఉన్న శ్రీలంకే రావణుడి లంక అనడానికి ఇతరత్రా అనేకానేక అంశాలు హేతువులుగా కనిపిస్తున్నాయి. రావణుడి లంకను గురించి రకరకాల చర్చలు జరిగాయి. వాల్మీకి రామాయణంలో సుగ్రీవుడు దక్షిణం వైపు వానరసేనను పంపించినప్పుడు ఒక సరళ రేఖలో వెళ్లాలని ఎక్కడా నిర్దేశించలేదు. సుగ్రీవుడు దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలను వర్ణించినప్పుడు వింధ్య పర్వతాలకు కింది వైపు ఉన్న అనేక ప్రాంతాలను చర్చించాడు. వింధ్యకు కింద పశ్చిమాన మలయాద్రి పర్వతం దగ్గరినుంచి దండకారణ్యం, ఆంధ్ర, ఒరిస్సా, ఇలా విస్తారమైన భూభాగాన్ని చర్చించుకొంటూ వచ్చారు. మిగతా మూడు దిక్కులకు పంపించినప్పుడు ఒక పరిమిత భూభాగం కాకుండా విశాలమైన భూభాగాన్ని విస్తారంగా వర్ణించాడు. వానరసేన కూడా అదే పద్ధతిలో సీతాన్వేషణ చేసుకొంటూ వెళ్లింది. ఇందులో కొన్ని అంశాలను ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది.

  1. కిష్కింధకాండలో సుగ్రీవుడు చెప్పిన వివరాల ప్రకారం లంకాద్వీపం త్రికూట పర్వతం మధ్యలో ఉన్నది. ఈ త్రికూట పర్వతం ఇవాళ్టి శ్రీలంకలో ఉన్నది.
  2. పరాంతక చోళ చక్రవర్తి (907-950 సీఈ) తన 25వ పట్టాభిషేక సంవత్సరంలోని 193వ రోజున కన్యాతీర్థం, తిరుచిరాపల్లిలో తులాభారం సమర్పించాడు. ఇందుకు సంబంధించిన వివరాలు తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో భద్రపరచి ఉన్న వేలాంజరి రాగి శాసనంలో ఉన్నాయి. ఇది ప్రాచీన తమిళభాషలో ఉన్నది. పురాతత్వశాఖ దీన్ని దేవనాగరిలోకి అనువదింపజేసింది. ఈ శాసనంపై ‘రమ్యే శ్రీరామతీర్థే కపివర నికరై బద్ధ సేతు ప్రబంధే’ అని రాసి ఉన్నది. పరాంతక చోళ చక్రవర్తి.. తాను కోతులు నిర్మించిన సేతు ప్రబంధమున్న శ్రీరామతీర్థంలో ఉన్నట్టుగా అందులో తెలిపాడు. కన్యాతీర్థం అంటే కన్యాకుమారి ప్రాంతం. దీని ప్రకారం సేతువు ఉనికి మనకు కన్యాకుమారి నుంచి ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ సేతువు ఉన్న రామతీర్థమనే ప్రాంతంలో బంగారు నాణాలతో చక్రవర్తి తులాభారం సమర్పించాడట. ఇదే రామతీర్థం గురించి యుద్ధకాండ 123వ సర్గ 10 నుంచి 12వ శ్లోకాలలో రాముడు సీతకు వివరంగా చెప్పాడు. సేతు బంధనం ప్రారంభించిన ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదని అభివర్ణించాడు.
  3. శ్రీలంకలోని పలు ప్రాంతాలు రామాయణ ఆనవాళ్లను ప్రతిఫలిస్తున్నాయి. సీతా ఏలియా, రావణుడి విమానాశ్రయం, విమానానికి సంబంధించిన నమూనాలు ఇక్కడ లభించడం గమనార్హం. శ్రీలంక పార్లమెంట్‌లో విభీషణుడు చిత్రపటాన్ని మనం చూడవచ్చు.
  4. ఇది చాలా ముఖ్యమైంది. సుగ్రీవుడు దక్షిణం వైపు వెళ్తున్న వానరసేనకు అగస్త్యుడి గురించి వివరంగా చెప్పాడు. మనకు అగస్త్యతార ఉన్నమాట వాస్తవమే. ప్రస్తుతం అగస్త్యతారను (క్యానపస్) గురించి మాట్లాడుకుంటుంటాం. దక్షిణంవైపు ఉన్న పోల్‌స్టార్‌ను భారతీయులు అగస్త్యతార అని పిలుస్తారు. అయితే వాల్మీకి రామాయణంలో అగస్త్యుడు ఋషి సత్తముడిగా కనిపిస్తాడు. రాముడిని కలిసి పవర్‌ఫుల్ వెపన్స్‌ను అందించినవాడు అగస్త్యుడు. యుద్ధానికి రాముడిని ప్రేరేపించిన వారిలో అగస్త్యుడు ఒకరు. ఈ వివరాల గురించి తరువాత చర్చించవచ్చు. రామరావణ యుద్దం జరుగుతున్నప్పుడు కూడా యుద్ధరంగానికి వచ్చి రాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించి వెళ్లాడు. అంటే ఆ కాలానికి అగస్త్యుడు పోల్‌స్టార్‌గా లేడు. జీవించి ఉన్న మనిషిగానే ఋషిగానే ఉన్నాడు. కాబట్టి అగస్త్య పోల్‌స్టార్‌ను ఆధారం చేసుకొని లంకను లొకేట్ చేయడం సరికాదు. సాధ్యం కాదు.
  5. మహా భాగవతంలోని దశమస్కందంలో బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరివెళ్లాడు. బలరాముడు వెంకటాద్రిని దర్శించుకొన్నతరువాత కంచి, కావేరి, శ్రీరంగం, దక్షిణ మధురను దర్శించుకొన్నాడు. సముద్రతీరంలో ఉన్న సేతువును సందర్శించాడు. అక్కడ భూరిగా దానధర్మాలు చేశాడు. ఆ తర్వాత వేగై, తామ్రపర్ణి, కన్యాకుమారి, తిరువనంతపురం వెళ్లాడు. అందులో ఆయన దక్షిణ మధురను సందర్శించి అక్కడినుంచి రావణుడి లంకకు వెళ్లినట్టుగా ఉన్నది. దక్షిణ మధుర అంటే మదురై క్షేత్రమే. ఎందుకంటే ఉత్తరాన మధురానగరం ఉన్నది. సేతువు దర్శనం తరువాతే రామేశ్వరం దగ్గర వైగై నది  బంగాళాఖాతంలో కలుస్తుంది. సేతువు తరువాతే వేగై, కన్యాకుమారికి వెళ్లాడు. అంటే.. రామేశ్వరం దగ్గరే సేతువు ఉన్నది కానీ, ఈక్వేటర్ దగ్గర లేదు అని రుజువు చేస్తున్నది.

భిన్నవాదాలు, భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న శ్రీలంకే రావణుడి లంకగా అత్యధికులు నిర్ధారణకు వచ్చారు. శ్రీలంకలో దొరికిన అనేక ఆనవాళ్లపై జపాన్ శాస్త్రవేత్తలు కార్బన్ డేటింగ్ చేసి రామాయణ కాలంనాటివిగా కూడా తేల్చిచెప్పారు. కాబట్టి.. శ్రీలంకే రావణాసురుడి లంకగా రుజువవుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here