రామం భజే శ్యామలం-50

0
9

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణంలో సీతా స్వయంవరం ఎప్పుడు జరిగింది? ఆ స్వయంవరానికి శ్రీరాముడు అటెండ్ అయ్యాడా? అదే స్వయంవరంలో రాముడు శివధనుర్భంగం చేశాడా? శివధనుర్భంగం టైంలోనే రావణుడిని రాముడు చూశాడా? పరుశురాముడు కూడా ఇదే టైంలో అక్కడికి వచ్చాడా? ఇవన్నీ ఏకకాలంలో జరిగినవి కావు…

ఆశ్చర్యమేయవచ్చు. ఇదేమిటి? విచిత్రమైన వాదన అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. మనకు రామాయణాన్ని రామాయణంగా ఎన్నడూ.. ఎవరూ చెప్పలేదు. వాల్మీకి రామాయణాన్ని రాశాడన్న ఒక్కమాట తప్ప రామాయణంలోని రాముడి చరిత్రను కథలు కథలుగా మార్చేశారు. అనుసృజనలు చేశారు. తమ చిత్తానికి తోచినట్లు కల్పనలను, భావోద్వేగాలను జొప్పించారు. వాటినే ప్రచారంలోకి తీసుకొచ్చారు. చివరకు ఈ కల్పనలు, సృష్టించిన సన్నివేశాలే వాస్తవ రామాయణంగా భావించే దశకు చేరుకున్నాం. చాలామందికి మూల రామాయణాన్ని గురించిన ఆనుపానులు తెలియకుండాపోయాయి. దీంతో అవాకులు చవాకులు పేలేవారు రెచ్చిపోతున్నారు. వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చెప్పేవారే కరువయ్యారు. రామాయణ ప్రసంగాలు చేస్తున్నవారు సైతం ఈ కల్పనల మాయలో పడిపోయారు. వాల్మీకి రామాయణంలో ఏమి రాశాడో.. బాల కాండ నుంచి యుద్ధకాండ వరకు… దాన్ని ఎలాంటి అనుసృజనలకు తావివ్వకుండా నేటి తరానికి చెప్పడంలో సమస్య ఏమిటి? సీతారాముల వివాహం ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? మనదేశంలో దాంపత్య ధర్మానికి వీళ్లే ఎందుకు రోల్‌మోడల్ అయ్యారు? ఇన్ని వేల ఏండ్ల తరువాత కూడా సీతారాములను, వారి దాంపత్యాన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకొంటున్నాం? ఒకరేమో భార్యను అడవుల్లో విడిచిపెట్టాడు అంటారు? అగ్ని ప్రవేశం చేయించాడంటారు? లవకుశ లాంటి సినిమాలు.. రామాయణ్ లాంటి సీరియళ్లు.. కొత్తగా వచ్చే గ్రాఫిక్‌ల మాయలు రాముడి చరిత్రను చిత్రవిచిత్రాలుగా మార్చేశాయి. ఇంత జరిగాక కూడా సీతారాములు ఈ దేశం ఆసేతు హిమాచలం అంతా తామే అయి ఆవరించి ఉండటం ఎలా సాధ్యమైంది?

వాల్మీకి రామాయణం ప్రాతిపదికన సీతారాముల చరిత్రను మనం అధ్యయనంచేస్తే.. సీతా స్వయంవరానికి, సీతారాముల వివాహానికి ఏడాదికి పైగా గ్యాప్ ఉన్నది. సీతను వివాహం చేసుకోవడానికో.. స్వయంవరంలో పాల్గొనడానికో.. రాముడు మిథిలకు వెళ్లలేదు. మిథిలలో రాజర్షి జనకుడి దగ్గర ఉన్న మహా ధనుస్సును చూడటానికి మాత్రమే రాముడు వెళ్లాడు. అక్కడ ధనుస్సును చూశాక దాన్ని ఎక్కుపెట్టాల్సి వచ్చింది. అప్పటికి సీతాస్వయంవరం జరిగి చాలాకాలమైంది. సిద్ధాశ్రమంలో విశ్వామిత్రుడి యాగాన్ని మారీచ సుబాహుల నుంచి రక్షించిన అనంతరం తరువాత ఏమి చేయాలని ప్రశ్నించారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో (వాల్మీకి రామాయణం, బాలకాండ, 31వ సర్గ 5 నుంచి 13 శ్లోకాలు) ‘రామా! మిథిలాధిపతి యైన జనకుడు మిక్కిలి ధర్మసంమతమైన యజ్ఞము చేయనున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్లుచున్నాము. నీవు కూడా మాతో అచటికి వచ్చినచో అచట ఆశ్చర్యకరమైన ధనుస్సును చూడగలవు. అప్రమేయమైన బలము గలది, భయంకరమైనది, గొప్ప ప్రకాశము గలది అయిన ఆ ధనుస్సును పూర్వము దేవతలు జనకుని పూర్వులకు యజ్ఞసదస్సులో ఇచ్చిరి. దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ, ఆ ధనుస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనిలేదు.’ అని అన్నాడు. ఇందులో విశ్వామిత్రుడికి డైరెక్ట్ కానీ, ఇన్‌డైరెక్ట్ సెన్స్ కానీ ఏమీ లేదు. ఇక్కడ సీతాస్వయంవర ప్రస్తావన ఎంతమాత్రం లేదు. రాముడిని పరోక్షంగా తీసుకొని పోవాల్సిన అవసరం విశ్వామిత్రుడికి ఎంతమాత్రం లేదు. విశ్వామిత్రుడి మాటలను విన్న రామలక్ష్మణులు ఆయన్ని అనుసరించి మిథిలకు బయలుదేరారు. అక్కడ జనకుడు చేసిన యజ్ఞంలో పాల్గొన్నారు. సినిమాలో చూపినట్టు మిథిలలో ఎంటర్‌ కాగానే సీతను రాముడు చూడటం.. ఓరకంట శృంగారభావాలను ఒలికించడం వంటి సన్నివేశాలు ఏవీ ఇక్కడ జరుగలేదు. కామ్‌గా జనకుడు చేసిన యజ్ఞంలో రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో కలిసి పాల్గొన్నారు. యజ్ఞం పూర్తయ్యాక జనకుడు విశ్వామిత్రుడితో (బాలకాండ 66వ సర్గ.. మధ్యలో ఉన్న ఈ 30 సర్గలలో అహల్య, భగీరథ, విశ్వామిత్ర ఉదంతాలు ఉపాఖ్యానాలుగా వస్తాయి.) నీకింకేం చేయాలని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ‘దశరథుని పుత్రులు, క్షత్రియులు, లోక ప్రసిద్ధులు అయిన ఈ రామలక్ష్మణులు నీ వద్ద ఉన్న శ్రేష్టమైన ధనుస్సును చూడదలచుకున్నారు. ఆ ధనుస్సును చూపుము. నీకు భద్రమగుగాక. దానిని చూచి కోరిక తీరగా వారి ఇష్టము ప్రకారం తిరిగి వెళ్లెదరు’ అని అన్నాడు. ఇదంతా ఫేస్ టు ఫేస్ జరిగిందే తప్ప స్వయంవరం అన్నది అక్కడ అప్పుడు జరగటంలేదు. అప్పుడు జనకుడు ఆ ధనుస్సును గురించిన చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు. అది తన దగ్గరకు ఎలా వచ్చిందో చెప్పాడు. తనకు నాగేటి చాలులో సీత దొరకడంతో ఆమెను తన కుమార్తెగా పెంచుకొన్నానని చెప్పాడు. ‘మహామునీ! భూతలమునుండి ఆవిర్భవించి నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహము చేసుకొనుటకు ఎందరో రాజులు వచ్చిరి. ఆ రాజులందరును వచ్చి కన్యనిమ్మని కోరగా ఈమె వీర్యశుల్కయని చెప్పి నేను వారికీయలేదు. పిమ్మట ఆ రాజులందరును కలిసి తమ బలమెంతయున్నదో పరీక్షించుకొనగోరి మిథిలకు వచ్చిరి. తమ బలమును పరీక్షించదలచిన వారికి ధనుస్సును చూపగా దానిని పట్టుకొనుటకు కానీ, కదల్చుటకు కానీ వారికి సాధ్యము కాలేదు. ఆ రాజుల బలము అల్పమైనదని తెలిసికొని నేను వారికి సీతనీయ నిరాకరించితిని.. ఆ రాజులందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి. ఇది తమకు జరిగిన అవమానమని భావించి కోపముతో మిథిలాపురిని బాధించిరి. వారి ముట్టడిలో సంవత్సరము గడువగా నగరంలో ఉన్న జీవనోపకరణములన్నియు తరిగిపోయినవి. దానితో నేను తపస్సుచేసి దేవతలనందరినీ అనుగ్రహింపమని కోరగా వారు నాకు చతురంగబలమును ఇచ్చి సహాయం చేసిరి. ఆ రాజులందరు యుద్ధమునందు పరాజితులై దిక్కులు పట్టి పారిపోయిరి. ఓ మునిశ్రేష్ఠా! మిక్కిలి ప్రకాశించు ఆ శివధనుస్సును రామలక్ష్మణులకు కూడా చూపెదను. రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినచో అయోనిజయగు సీతను రాముడికి ఇచ్చెదను’. అని అన్నాడు.. ఇదీ సీతా స్వయంవరం జరిగిన తీరు. మిగతా రాజులందరూ స్వయంవరంలో పాల్గొన్నప్పుడు రాముడు లేనేలేడు. జనకుడు బలపరీక్షను ఏర్పాటు చేయటం.. దానివల్ల ఏడాదిపాటు నానా అవస్థలు పడటం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తరువాత ఎంతోకాలానికి వచ్చిన రాముడికి కూడా పోయిందేమిలే అన్నట్టు ధనుస్సును చూపించడానికి ఒప్పుకొన్నాడు. ‘నువ్వడిగావు కాబట్టి రాముడికి ‘కూడా’ చూపిస్తా.. ఎక్కుపెడితే సీతను ఇస్తాను’ అనటంలో జనకుడిలో ఒక నిర్లిప్తతే కనిపిస్తుంది. అప్పుడు కూడా విశ్వామిత్రుడు సీతావివాహ ప్రస్తావన చేయలేదు. ధనుస్సును రాముడికి చూపాలని అడిగాడు. జనకుడు మంత్రులను పంపించి ధనుస్సును బలిష్ఠులైన మనుషుల సాయంతో ఎనిమిది చక్రాల పెట్టెను తెప్పించాడు. ధనుస్సును తెచ్చాక కూడా జనకుడు మళ్లీ అన్నాడు.. ఈ ధనుస్సును ఎక్కుపెట్టడం సుర, అసుర, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులకే సాధ్యం కాదు.. ఇక మనుషుల వల్లేమవుతుంది? అయినా చూపించు అన్నాడు. విశ్వామిత్రుడు రాముడిని ధనుస్సును చూడమని రాముడిని కోరాడు. అప్పుడు రాముడు ‘బ్రహ్మర్షీ ఇపుడీ శ్రేష్టమైన ధనుస్సును హస్తముతో స్పృశించెదను. దీనిని కదుల్చుటకు సాధ్యమైనచో ఎక్కుపెట్టుటకు ప్రయత్నించెదను’ అన్నాడు. అప్పుడు రాముడు ధనుస్సును అనాయాసంగా ఎక్కుపెట్టి ఆకర్ణాంతం నారిని లాగగా అది విరిగిపోయింది. ఇదీ శివధనుర్భంగ వృత్తాంతం. ఇక్కడ సీతాస్వయంవరం.. రాజులు ఎక్కుపెట్టడం.. రావణుడు రావడం.. సీతను చూడటం ఇదంతా ఎక్కడున్నది?

ఆ తరువాత కూడా జనకుడు మాట్లాడుతూ ఇట్లా జరుగుతుందని నేననుకోలేదన్నాడు. సీతను ఇవ్వాలని నిర్ణయించాడు. కానీ రాముడికి తన తండ్రి దశరథుడి ఆమోదం ముఖ్యం కావడంతో జనకుడు మంత్రులను దశరథుడి దగ్గరకు పంపించాడు. ఆయన నాలుగు రోజులు ప్రయాణంచేసి మిథిలకు వచ్చాడు. ఆయన అంగీకారంతో సీతారాముల వివాహం జరిగింది. వారితోపాటు మిగతా తమ్ములు, సీత సోదరీమణుల వివాహాలూ జరిగాయి.

ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే.. రామాయణంలో విశ్వామిత్రుడి పాత్ర ఇక్కడితో ముగిసిపోయింది. ఆ తరువాత ఆయన ఎక్కడా, ఏ సన్నివేశంలోనూ కనిపించలేదు. రాముడిని భావి యుద్ధానికి సన్నద్ధం చేయడమే కాకుండా.. రాముడనే ఒక మహా శక్తిశాలి ఉనికిని ప్రపంచానికి తెలియజెప్పటమనే లక్ష్యాన్ని విశ్వామిత్రుడు సంపూర్ణం చేశాడు. రామలక్ష్మణులకు అత్యంత ముఖ్యమైన ఆయుధాలను సమకూర్చిపెట్టాడు. మారీచుడి ద్వారా రావణుడికి రాముడనే వీరుడు తనకు ప్రతీఘాతశక్తిగా పుట్టుకొచ్చాడని తెలిసేలా చేశాడు. జనకుడి భవనంలో ఉన్న శివధనుస్సును ఎక్కుపెట్టించడం ద్వారా లోకానికి రాముడి శక్తిని పరిచయం చేశాడు. వివాహం అన్నది దీనికి కొనసాగింపే. విశ్వామిత్రుడి లక్ష్యం రాముడిని శత్రు నాశనం దిశగా నడిపించడమే. ఆ పని పూర్తిచేశాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు మనకు ఎక్కడా కనిపించలేదు. ఏ రకంగా చూసినా రాముడి ప్రస్థానం రావణ సంహారం వైపు మాత్రమే నడిచింది.

ధనుర్భంగం తరువాత జనకుడు దశరథుడిని రప్పించడానికి మంత్రులను పంపిచాడని మాత్రమే బాలకాండ 67వ సర్గలో ఉన్నది. కానీ, తాను తండ్రి చెప్తే తప్ప సీతను వివాహం చేసుకోవడం కుదరని పని అని రాముడు కరాఖండిగా చెప్పాడు. ఈ విషయం సీతాదేవి స్వయంగా అరణ్యవాసంలో అనసూయను కలిసినప్పుడు ఆమెతో చెప్పింది. అయోధ్యకాండ 118వ సర్గలో సీత చెప్పిన మాటలివి ‘మహా బలశాలీ, పరాక్రమవంతుడు అయిన రాముడు రెప్పపాటు కాలములో దానిని వంచి నారి ఎక్కించి పూరించెను (లాగెను) రాముడు దానిని పూరించుచుండగా ఆ వేగమునకు అది మధ్యలో రెండు ముక్కలయ్యెను. అప్పుడు పిడుగు పడుచున్నప్పుడు వలె భయంకరమైన శబ్దము కలిగెను. సత్య ప్రతిజ్ఞ గల నా తండ్రి నన్ను రామునకు ఇచ్చుటకై జలకలశమును గ్రహించెను. అప్పుడు రాముడు తన తండ్రీ, ప్రభువు అయిన దశరథ మహారాజు అభిప్రాయము తెలుసుకొనకుండగా, నా తండ్రి ఇచ్చుచున్న నన్ను స్వీకరించలేదు. పిమ్మట నా తండ్రి వృద్ధుడైన మామగారు దశరథ మహారాజును పిలిపించి బుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన రామునకు నన్ను ఇచ్చెను.’

సీతారాముల వివాహం జరిగిన తీరు ఇది. శివధనుస్సును చూడటానికి వెళ్లిన రాముడు, సీతాదేవిని తండ్రి అంగీకరించిన తర్వాతే పెండ్లి చేసుకున్నాడు. బాలకాండ చివరిశ్లోకంలో వారిద్దరి మధ్య ప్రేమను గురించి చెప్తాడు.

‘ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి,
గుణై రూప గుణైశె్చైవ భూయ ఏవాభ్యవర్ధత
తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే’

‘తండ్రి అంగీకరించిన వధువు అగుటచేతను, ఆమెకు గల రూపసద్గుణాదుల చేతను రామునకు సీతపై గాఢానురాగము కలిగెను. సీతకు మాత్రము రాముడు తనకు భర్త అను ఒక్క కారణముచేతనే రామునిపై రెట్టింపు ప్రేమ ఉండెడిది.’

ప్రేమించుకోవడాలు.. ఎత్తుకెళ్లడాలు మనకు భారత కాలంలో కనిపించాయే తప్ప.. రాముడి కాలంలో కనిపించలేదు. పెండ్లి చేసుకున్న తరువాతే భర్తను ప్రేమించింది సీత. అతనిలోని సద్గుణాలను గ్రహించిన తరువాత ఆ ప్రేమ మరింత రెట్టింపయింది. సీతను రాముడు అదేవిధంగా ప్రేమించాడు. ముందుగా వివాహానికి తండ్రి అనుమతి తీసుకొన్నాడు. తన తండ్రి ఆమోదం పొందాడు. తండ్రి మీద ఉన్న విశ్వాసం, గౌరవం, పూజనీయ భావం అలాంటిది. తండ్రి అంగీకరించడం అంటే ఆమె ఎంతో ఉన్నతురాలని అర్థమే. వివాహం చేసుకొన్న తరువాత ఆమె రూపలావణ్యమే కాదు.. సద్గుణాల వల్ల కూడా ప్రేమ రెట్టింపయింది.

ప్రేమ అన్నది చాలా విచిత్రమైన బంధం. ఈ ప్రేమ దృఢంగా ఉన్నంత వరకు ఎవరూ దుస్సాహసానికి పాల్పడరు. ఇది వీక్ అయినప్పుడే సంసారంలో తేడా కొడుతుంది. భార్యాభర్తలు ఎంత అరుచుకున్నా.. కొట్టుకున్నా.. అలిగినా.. కోపతాపాలకు లోనైనా.. అంతర్లీనంగా ప్రేమ బలంగా ఉన్నంతవరకు కుటుంబానికి, సమాజానికి ఎలాంటి విఘాతం కలుగదు. వ్యవస్థ బలంగా ఉంటుంది.

సీతారాముల దాంపత్యం కూడా ఇదేవిధంగా సాగింది. వీళ్లు మనుషులు కారు.. మానవాతీతులు అని మనం అనుకుంటే వీరి జీవితం మనకు ఆదర్శం కాదు. వీళ్లు మనుషులు కాబట్టే.. మనలో ఒకరిగా జీవించారు కాబట్టే వారు మనకు ఆరాధ్యులయినారు. వారి జీవితం మనకు అనుసరణీయమైంది. ఇది మనకు రామాయణంలో అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంది. కోపతాపాలు, బాధ, అనుమానం.. ఇలా అన్ని పార్శ్వాలు మనకు సీతారాముల దాంపత్యంలో అగుపిస్తాయి.

రాముడిని అరణ్యానికి పొమ్మన్నాడు దశరథుడు. ఆయనేమో నారచీరలు కట్టుకొని రెడీ అవుతున్నాడు. సీత వచ్చింది. నేనూ వస్తానంది. నువ్వెందుకు.. అమ్మవాళ్ల దగ్గర ఉండు.. అరణ్యంలో బతకడం కష్టం అన్నాడు. బతిమాలింది.. బామాలింది.. అన్నేండ్లపాటు నిన్ను విడిచి ఎట్లా ఉండను అన్నది.. అయినా రాముడు ఒప్పుకోలేదు. చివరకు సీతకు కోపం వచ్చింది. ఏమయ్యా ఆడుదానిలా మాట్లాడుతున్నావ్.. నన్ను విడిచిపెడదామనుకొంటున్నావా అని నిందించింది. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 30వ సర్గలో సీత పలుకులు చదవండి. ‘రామా! నీవు పురుష శరీరము గల స్త్రీవి. అట్టి నిన్ను విదేహదేశ రాజు, మిథిలాధీశుడయిన నా తండ్రి ఏమనుకొని అల్లునిగా చేసికొనినాడో తెలియదు.. నన్ను తీసుకొని వెళ్లకపోవుటకు వేరే కారణముండవలెను. నీవు తప్ప వేరే గతిలేని నన్ను ఈ విధముగా పరిత్యజించి వెళ్లవలెనని అనుకొనుచున్నావే’ అని సీరియస్‌గానే మాట్లాడింది. నువ్వుండగా నాకేం కష్టం వస్తుందయ్యా.. నీతోనే నా జీవితం అని తేల్చి చెప్పింది. ఇంక రాముడు ఒప్పుకోక తప్పలేదు. అంతేకాదు.. అరణ్యానికి వెళ్లిన తర్వాత సీతారామలక్ష్మణులు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఋషులు, మునులు, అడవిలోని ప్రజలు అంతా వచ్చి.. ఈ రాక్షసులు మమ్మల్ని బతకనీయడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తారు. ఆ రాక్షసులను చంపి మిమ్మల్ని కాపాడతానని రాముడు వాళ్లకు ప్రామిస్ చేస్తాడు. అప్పుడు సీతకు ఆందోళన కలుగుతుంది. ఏమయ్యా రామయ్యా.. నువ్వు వనవాసానికి వచ్చినవు కదా.. మళ్లీ ఆయుధాలు పట్టి.. రాక్షసులను చంపుతానంటావే.. అహింసా వ్రతం ఆచరించు అని అంటుంది. అరణ్యకాండ తొమ్మిదో సర్గలో సీత మాటలివి.. ‘దండకారణ్యంలో నివసించు ఋషులను రక్షించుటకై ‘యుద్ధములో రాక్షసులను సంహరించెదను’ అని నీవు ప్రతిజ్ఞ చేసినావు. ఈ కార్యము పూర్తిచేయుటకే నీవు సోదరునితో కలిసి ధనుర్బాణములు ధరించి దండకారణ్యమునకు బయలుదేరినావు. నీవు ఆ విధముగా బయలుదేరుట చూడగానే సదా నీ క్షేమమును గూర్చి మాత్రమే ఆలోచించు నా మనస్సు చింతాకుతలమైనది’ అని బాధపడింది. ‘ఆయుధమెక్కడ? వనమెక్కడ? క్షత్రియ ధర్మమెక్కడ? తపస్సెక్కడ? ఇదంతా పరస్పర విరుద్ధంగా ఉన్నది. మనము ఇప్పుడు దేశ ధర్మమును పూజించవలెను. ఆయుధము పట్టుట వలన మనస్సు వికారము చెందును. నీవు తిరిగి అయోధ్యకు వెళ్లిన పిమ్మట అక్కడ క్షత్రియ ధర్మమును పాటించవచ్చును.’ అని ఆమె వారించింది. నీకేమైనా అయితే నేనేం కావాలి అన్నట్టుగా ఆందోళన చెందింది. ఇదే సీత ఖరదూషణాదులను హతమార్చిన తరువాత వచ్చిన రాముడిని పరిగెత్తుకొంటూ వచ్చి కౌగిలించుకొని ఆనందపడింది. అరణ్యకాండ 30వ సర్గ ‘శత్రువులను సంహరించి మహర్షులకు ఆనందము కలిగించిన భర్తను చూచి సీత సంతోషించుచు.. అతనిని కౌగిలించుకొనెను. సీత రామునిచే వధింపబడిన రాక్షసులనందరినీ చూచి చాలా సంతోషించెను. రామునకు ఏ విధమైన వ్యథ కలుగకపోవుటను కూడా చూచి సంతోషించెను. రాక్షస సముదాయమును సంహరించుటచే అనందించుచున్న మహర్షులచేత గౌరవింపబడుతున్న రాముణ్ణి, చంద్రుని వంటి ముఖకాంతి గల సీత మరల మరల కౌగిలించుకొని సంతోషముతోనుండెను’

ఎంత అద్భుత సన్నివేశమిది. భర్త విజయాన్ని ఇంతకంటే గొప్పగా ఆస్వాదించడం సాధ్యమా? అంతకుముందు చంపడానికి వెళ్తానంటేనే భయపడిన భార్య.. గెలిచి వచ్చిన రాముడిని పదే పదే.. కౌగిలించుకొని ఆనందించింది.

చిన్న చిన్న సంతోషాలు.. సరదాలు, ఆనందాలను కూడా వాల్మీకి అద్భుతంగా మన కండ్ల ముందుంచాడు. సీతారాములు అత్రి ఆశ్రమానికి వెళ్లి అక్కడ అనసూయాదేవిని దర్శించుకొన్న తరువాత, ఆమె సీతాదేవికి బట్టలు, అలంకారాలు, శరీరకాంతిని ఇనుమడింపజేసే లేపనాలు.. ఇలా అనేకం ఇచ్చింది. సీతకు ఎంతో సంతోషమేసింది. వాటిని కట్టుకొన్నది. భర్త రాముడి దగ్గరకు వెళ్లి ఒక్కటొక్కటిగా చూపిస్తూ.. ఎంతో ఆనందపడింది. భార్యాభర్తల మధ్య ఉండే సామాన్యమైన అంశాలనెన్నింటినో వాల్మీకి చూపించాడు. రాగద్వేషాలనూ స్పష్టంగా చెప్పాడు. ఏమీ దాయలేదు. పంచవటిలో మారీచుడు మాయలేడిలా వచ్చాడు. సీత దాన్ని కావాలని కోరింది. రాముడు వెళ్లాడు. మారీచుడు హా లక్ష్హణా, సీతా అని అరిచాడు. అది విన్న సీత భర్తకు ఏదో అయిపోయిందని ఆందోళన చెంది.. లక్ష్మణుడిని పొమ్మన్నది. అతను కదలలేదు. కోపంతో ఆమె అతడిని తీవ్రస్థాయిలో నిందించింది. నన్ను పొందాలనుకొంటున్నావు నీవు అందుకే వెళ్లటంలేదంటూ ఆక్షేపించింది. అతను చెప్పిచూశాడు. ఆమె మరింత కోపంతో సామాన్య స్త్రీ.. భర్త ఆర్తనాదాలు విని విచక్షణ కోల్పోయి ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది. అతను ఏమీ చేయలేక బయలుదేరి వెళ్లాడు. ఇక్కడ ఆమెకు ముఖ్యమైంది తన భర్త ఏదో ఆపదలో ఉన్నాడన్నదే. ఆ ఆపద నుంచి కాపాడటానికి లక్ష్మణుడిని పంపించడమే. తన మాట వినకపోయేసరికి ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది. కండ్లు ఎర్రబడ్డాయి. లక్ష్మణుడిని తిట్టేసింది. ఇదంతా కామన్‌గా మన సొసైటీలో జరిగే సన్నివేశమే. సీత మాటలు విన్న తరువాత లక్ష్మణుడు అక్కడినుంచి బయలుదేరి వెళ్లాడే తప్ప గుమ్మం ముందు ఎలాంటి గీత గీయలేదు. వెనక్కి చూసుకుంటూ.. ఆందోళనతో వెళ్లాడని మాత్రమే వాల్మీకి చెప్పాడు. మరి లక్ష్మణరేఖ అన్న మాట ఎక్కడినుంచి వచ్చిందో.. ఎప్పుడు వచ్చిందో.. ఎలా రామాయణంలో ఇన్‌కార్పొరేట్ అయిందో తెలియదు.

తరువాత రావణుడు వచ్చినప్పుడు కానీ, అశోకవనంలో రావణుడు తనతో మాట్లాడినప్పుడు కానీ, తనను తాను అసర్ట్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. రాముడు ధనుర్బాణాలు పట్టుకొని నిలుచుంటే.. ఈగ వజ్రాన్ని మింగిన తీరుగ నీ జీవితం అంతమవుతుందని హెచ్చరిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ సీత రాముడి గురించి వర్ణించిన తీరు అపూర్వం. అద్భుతం.

అంతా అయిపోయింది. రావణుడు అంతమయ్యాడు. అంతా జరిగాక రాముడు సీతను స్వీకరించకుండా నీ ఇష్టమొచ్చినచోటికి వెళ్లమన్నాడు. ఆమె ఊరుకోలేదు. తీవ్రంగా స్పందించింది. ‘వీరుడా! ఒక సామాన్య పురుషుడు సామాన్య స్త్రీతో పలుకుచున్నట్లు పలుకుచున్నావేమి? ఓ మహాబాహూ! నేను నీవు అనుకున్నట్లు ప్రవర్తించిన దానను కాను. నన్ను విశ్వసింపుము. నా సచ్చరిత్రపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను. ప్రాకృత స్త్రీల ప్రవృత్తిని బట్టి నీవు స్త్రీజాతినే శంకించుచున్నావు’ అని చాలా ఆవేదనతో, ఆగ్రహంతో మాట్లాడి ఆ తరువాత అగ్ని పరీక్షకు సిద్ధమైంది. ఆ తరువాత ఆమెను గ్రహించినప్పుడు రాముడు సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చింది. ఆ తరువాత దంపతులిద్దరూ అయోధ్యకు బయలుదేరారు.

పతివ్రత అంటే.. మొగుడు ఏమిచెప్పినా మాట్లాడకుండా.. కష్టపెట్టినా బదులు చెప్పకుండా.. అన్నింటిని మునిపంట దాచుకొని రోజూ కాళ్లకు దండాలు పెడుతూ ఉండటం కాదు. పతి తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించడం.. సరైన దారిలో నడిపించడం, భర్తకు విజయం సిద్ధించినప్పుడు ఆ విజయాన్ని అతనికి రెట్టింపు కలిగేలా సెలబ్రేట్ చేసుకోవడం, భర్త తల్లిదండ్రుల పట్ల, తన తల్లిదండ్రుల పట్ల గౌరవపురస్సరంగా మెదలటం, తను సంతోషంగా ఉండటం. అతనిని సంతోషపెట్టడం.. ఇవీ పతివ్రత లక్షణాలు. దాంపత్య ధర్మంలోని మౌలిక సూత్రాలు. సీతాదేవి పట్ల రాముడి అనురాగం ఏ విధంగా వ్యక్తమైందో వచ్చే వారం వ్యాసంలో చర్చించుకొందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here