రామం భజే శ్యామలం-53

0
7

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]వా[/dropcap]ల్మీకి రామాయణాన్ని సీతాయాశ్చరితం మహత్ అని అన్నాడు. సీత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలంటే మొత్తం రామాయణాన్ని అవగాహన చేసుకోవాలి. ఆనాటి సమాజంలో సీతకు ఉన్న ప్రాధాన్యం.. స్త్రీలకు ఉన్న ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టపడుతుంది. ఇది భారతదేశ ఆధ్యాత్మిక, తాత్త్విక, సాంస్కృతిక భూమికలన్నింటికీ ఆధారభూతమై ఉంటుంది. మన ఇతిహాసాలు కానీ, పురాణాలు కానీ, వేదోపనిషత్తులు కానీ, చరిత్ర కానీ.. ఏవైనా.. ఈ మౌలికమైన సూత్రం నుంచి దూరంగా లేవు. విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు నవల చివరన.. కథానాయకుడు ధర్మారావు.. భార్య అరుంధతితో.. ‘అవును నీవు మిగిలితివి.. ఇది నా జాతి శక్తి. నా అదృష్టము. నీవు మిగిలితివి.’ అని అంటాడు. నిజంగా ఇది భారత జాతి శక్తే. దాంపత్య ధర్మం అన్నది.. వేల సంవత్సరాలుగా ఈ దేశానికి అమేయమైన శక్తిగా నిలిచి ఉన్నది. ఆ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయబూనిన ప్రతిసారీ ‘సర్వ’ నాశనం తప్పటం లేదు. ఈ ధర్మానికి నాయిక స్త్రీయే. ఈ స్త్రీయే భారతదేశ ధర్మాలన్నింటికీ అత్యున్నతమైన పరదేవతాస్థానంలో కొలువై ఉన్నది. ఈ స్త్రీయే బ్రహ్మ సృష్టికి కావాల్సిన విజ్ఞానమై సరస్వతిగా విరాజిల్లింది. ఈ స్త్రీయే సృష్టి నిర్వాహకుడు నారాయణుడి చెంతన సిరియై వెలుగొందింది. ఈ స్త్రీయే.. లయకారకుడికి శక్తిగా మారి నడిపించింది. ఈ దేశంలో స్త్రీకి ఉన్న ప్రాధాన్యమిది. అనసూయ, అరుంధతి, లోపాముద్ర, ద్రౌపది, సీత.. ఇలా అందరూ సాక్షాత్ ప్రకృతి స్వరూపాలు. ఆమె సృష్టిస్తేనే ఈ సృష్టికి స్థితి కలిగింది. ఆమె నడిపిస్తేనే.. సృష్టి కొనసాగుతున్నది. ఆమె సంకల్పమాత్రం చేతనే సృష్టి లయమైపోతున్నది. ఈ సమస్త సృష్టికి ఆమే మూలాధారం. పురుషుడు ఒక ఉపకరణం మాత్రమే. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వాళ్లు మాట్లాడే మాటలుగా అనిపించవచ్చు. కానీ.. సాధారణ పరిభాషలో మాట్లాడినా కూడా ఇదొక్కటే నిజం.

ఎందుకంటే ‘ఆమె’ అత్యంత శక్తిమంతమైన ఆకాంక్షకు, సంకల్పానికి ప్రతిరూపం. అది నిరంతరం ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. అది అగ్ని లాంటిది. ‘అగ్నిమీళే పురోహితం’ అని వేదం తొలి మంత్రం ఘోషిస్తున్నది. మహాదేవుడు ఆజ్ఞాచక్రంలో మూడో కన్ను తెరిచి ప్రళయాన్ని సృష్టించాడు. నారాయణుడి చేతిలోని అగ్ని సుదర్శనం. సీత అగ్ని పునీత, ద్రౌపది అగ్ని సంభవ. ఈ భూమి అంతరాంతరాళలో అగ్ని పొరలు తెరలు తెరలుగా ఉన్నాయి.. వాటిపైనే భూమి తిరుగుతున్నది. భూభ్రమణానికి, పరిభ్రమణానికి కూడా ఈ అగ్ని పొరలే మూలాధారాలు. ఈ సమస్తమైన శక్తికి అగ్నియే ప్రాణాధారం. అగ్రం నయతి అగ్ని.. అంటే ముందుండి నడిపించేవాడు అగ్ని అని అర్థం. అంటే లీడర్. ఈ అగ్ని పొరల్లోనుంచి ద్రౌపది జనించింది. తపస్సు అనేది అగ్నే. అసాధారణ ఆకాంక్షతో.. సాధించాలనే తపన ఏదైనా సరే ఈ అగ్నికి ప్రతిరూపం ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ముందుండి నడిపించేది అన్నది. ఈ అగ్ని పొరలపైనున్న పృథ్విలో సీత లభించింది. వీరిద్దరి శోకం భూమిపై మహా విలయకారణమైంది. భూమిపైనుంచి ఆకాశం వైపు ప్రజ్వరిల్లేది అగ్నిజ్వాల ఒక్కటే. ఇది బలమైన ఆకాంక్షకు, సంకల్పానికి ప్రతీక. మన శరీరంలోపల ఆకాంక్షలు కూడా అగ్నిలాగానే ప్రజ్వరిల్లుతుంటాయి. యావత్ ప్రపంచంలోని వందకు పైగా సంప్రదాయాలు ఈ అగ్నిని పూజిస్తాయి. సద్గురువులు శివానందమూర్తిగారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. ‘నువ్వు సుఖంగా ఉండాలని బలంగా కోరుకో.. కచ్చితంగా సుఖపడతావు. మార్గం అదే కనిపిస్తుంది.’ అని. ఇదే సంకల్పం. ఈ సంకల్పం ఎంత బలంగా ఉంటే.. అంత బలంగా ప్రభావితం చేస్తుంది. సీత సంకల్పించింది. రాముడు చేశాడు. మహా రాక్షస సంహారం జరిగింది.. ఇది రామాయణంలోని మరో కోణం. రామాయణం అంతటా ఇదే కనిపిస్తుంది. అందుకే రామాయణాన్ని అర్థం చేసుకోవడానికే శక్తి కావాలి అనేది.

రామాయణాన్ని ఒకచోట మాత్రం వాల్మీకి.. సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. అంటే ఇది సీత చరిత్ర అని. కానీ, రామాయణంలో ఇలా ఎక్కడా కనిపించదు. విశ్వనాథ సత్యనారాయణ వారు.. రామాయణ శబ్దాన్ని విశ్లేషించారు తన రామాయణ ప్రసంగాల్లో.. ‘రామాయణం సంధి చెయ్యాలంటే రామ+అయనం. మొదటి శబ్దం అకారాంత పుంలింగం. it is a short vowel and the second letter also begins with a short owel. they both mix and become long vowel. దీని పేరు సవర్ణదీర్ఘ సంధి. అందుచేత రామ+ఆయనం= రామాయణం. ఆ ‘రా’ వెనుక ‘మా’ ఉంటే, ఈ ‘న’ ణ అవుతుంది. ఇంతే కాకుండా యింకో చమత్కారం ఉందిక్కడ. ఈ సవర్ణ దీర్ఘసంధిలోనే ఇది చూడండి. అ+అ=ఆ; ఆ+ఆ=ఆ. రెండూ ఒకటే.. అక్కడ రెండు పొట్టి అచ్చులున్నా దీర్ఘమే వస్తుంది. రెండు దీర్ఘాలున్నా దీర్ఘమే వస్తుంది. మొదటిదాని చివర దీర్ఘముండి, రెండవదాని ముందు హ్రస్వమున్నా దీర్ఘమే వస్తుంది. రామ+ఆయనం=రామాయణంలో రామా+ఆయనం.. రామా అంటే స్త్రీ.. లోకంలో సీతమ్మను మిగిలిస్తే స్త్రీ ఎవరు? కనుక స్త్రీ శబ్ద వాచ్యురాలు తల్లి యొక్కతే. అందుచేత రామాయణం అంటే సీతాచరిత అన్నమాట’. సంస్కృతం భాషను డెరివేటివ్ లాంగ్వేజి అని బ్రిటిష్‌వాళ్లు అన్నారు. ఎందుకంటే.. ఈ భాషలో అన్ని శబ్దాలు రెండు రకాలుగా ఉంటాయి. ఆఖ్యాతజములు, ధాతుజములు అని. ఆఖ్యాతజములంటే వెర్బ్స్ నుండి పుట్టకుండా వాటంతటవే పుట్టినవి. ఆయనం అంటే గమనం అని అర్థం. సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తూ ఉంటే అది ఉత్తరాయణం.. ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తూ ఉంటే.. దక్షిణాయనం అని అంటారు. ‘అయి’ అనేది ఒక ధాతువు. దీనికి వెళ్లుట, నడక అన్న అర్థాలున్నాయి. కాబట్టి.. రామాయణం అంటే.. రాముడి గమనం, సీతా గమనం అన్న రెండు అర్థాలు ధ్వనిస్తాయి.

అత్యంత అద్భుతమైన రచనాశిల్పంతో మర్యాదాపురుషోత్తముడి చరిత్రను ఇతివృత్తంగా తీసుకొని ఆదికావ్య నిర్మాణం చేసిన వాల్మీకి రుణం తీర్చుకోవడానికి మనకు శక్తి చాలదు. ఇక్కడ మరొక ఉదాహరణ చెప్తాను. తల్లి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లాడు. ఇక్కడ వాల్మీకి వాడిన శబ్దం ‘బలాత్’. అంటే బలాత్కారంగా ఆమెను తీసుకొని వెళ్లాడని అర్థం. సీతాదేవిని లంకలోకి తీసుకొని వెళ్లిన తరువాత ఆమెను వెంటపెట్టుకొని అంతఃపురాలను, భవనాలను, తోరణాలు, కుడ్యాలు, వనాలు అన్నింటినీ చూపించాడట. అసలే బలాత్కారంగా తీసుకెళ్లిన తల్లికి ఇవన్నీ ఇంత విపులంగా చూపించడం సాధ్యమేనా? పంచవటిలోనుంచి అమ్మవారిని ఎత్తుకొని వచ్చినప్పుడు ఆమె నిందిస్తుంది. తిరస్కరిస్తుంది. బెదిరిస్తుంది. కానీ.. అదే అమ్మవారికి లంకంతా చూపించాడు. చివరకు అశోకవనంలో కూర్చోబెట్టాడు. ఇదంతా ఏమిటన్న ప్రశ్నకు ‘బలాత్’ అన్న శబ్దమే జవాబివ్వాలి. ‘బల్’ అన్న ధాతువుకు సంస్కృతంలో ‘ప్రాణము’ అన్న అర్థమున్నది. ఈ భాష ధాతు జనితమని ముందే అనుకొన్నాం. తల్లి వాడి ప్రాణాలలోనే ఉన్నదని అర్థం. బలాత్ అంటే ప్రాణాత్ అని అర్థం. భారతీయ అధ్యాత్మిక, తాత్త్విక చింతనకు మూలాధారం అయింది కాబట్టే ఈ భాష దేవభాషగా ప్రసిద్ధి చెందింది. దీన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోకపోతే.. రామాయణమే కాదు.. భారతదేశంలోని ఏ ఒక్క గ్రంథాన్నైనా అర్థం చేసుకోవడం కష్టమే. దీనితోపాటు మన సంప్రదాయంలో రహస్య కథా కథన సంవిధానం ఉన్నది. ఈ రెండింటి గురించి అర్థం చేసుకోకుండా మన పూర్వికుల రచనలను వివేచించడం తెలివితక్కువ పనే అవుతుంది. వ్యాసుడు వేదాలను ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం.. అన్న మూడు స్తరాలలో అవగాహన చేసుకోవాలి అన్నాడు.. వేదాలే కాదు.. మన ఇతిహాసాలు, పురాణాదులు.. ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు అన్ని కూడా ఈ సంవిధానంలోనే రచించినవి. వాల్మీకి రాసిన రామాయణం వీటన్నింటికీ ఆది రచన. అందుకే వాల్మీకి తన ఇతిహాసానికి సీతాయాంశ్చరితం మహత్ అని పేరు పెట్టడం వెనుక అర్థాన్ని లోతుల్లోకి వెళ్లి అధ్యయనం చేయాలి.

రామాయణం దివ్యజీవన వికాసానికి ప్రతీక. వాల్మీకి తన రామాయణం గురించి తానే స్పష్టంగా చెప్పుకున్నాడు.. రామాయణంలో రాముడి కథ ఎంత ప్రధానమో.. సీత కథ అంతే ప్రధానమన్నాడు.. భూమ్మీద రాముడు దుష్టశిక్షణ కోసం అవతరిస్తే.. ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవటానికి ప్రధానంగా సహకరించింది సీతాదేవే.. సీత లేకుంటే రావణ సంహారమనే కార్యం నెరవేరేదే కాదు. గగన తలంలో వేయికిరణాలతో ప్రకాశించే సూర్యుడే నారాయణుడు. సౌరమండలం మధ్యలో ఈయన ఉంటాడు. ఈ సూర్యనారాయణుడు తానే నాలుగు వ్యూహాలుగా మారి, నాలుగు వేదాలుగా మారి రామలక్ష్మణభరతశతృఘ్నులుగా పుట్టారట. వాల్మీకి బాలకాండలో ఈ విషయాన్ని స్పష్టంగానే చెప్పాడు. నారాయణుడు తనకు తానే నాలుగుగా విడిపోయి.. నలుగురిగా జన్మించాడు. రామావతార కథ భూమ్మీద దైవశక్తులను బలపరచటానికి, రాక్షస శక్తులను బలహీనం చేయటానికి ఉద్దేశించిందే..

ఏపున మంటినుండి యుదయించిన జానకి మింటినుండి ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి ఋగధ్వజములందు నుండి ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ
వాపృతి పండు వెన్నెల మయంబుగ జేసెద రాత్మరోదసిన్

అని విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము కల్యాణ ఖండంలో పేర్కొన్నారు. రాముడు ఆకాశం నుంచి దిగివచ్చిన చైతన్యమైతే.. సీతాదేవి భూమి నుంచి ఉబికి వచ్చిన మహాశక్తి.. భూమ్యాకాశాల మధ్య విశ్వశ్రేయస్సును సాధించాలన్న లక్ష్యమే ఈ ఇద్దరి అవతారం. భూమ్యాకాశాల సమాహరణం గురించి వేదాల నుంచి కూడా మనవాళ్లు చెప్తూనే ఉన్నారు. ఈ రెండింటి మధ్య మధ్య సమన్వయం ఆత్మరోదసిని పండువెన్నెల మయం చేస్తున్నదన్నాడు. భూమ్యాకాశాల మధ్య కలయికే ఈ సమస్త విశ్వానికి, సృష్టి వికాసానికి హేతువయితున్నది. ఇక్కడ భౌతిక శాస్త్రం చెప్పేమాట కూడా ఇంచుమించు ఇలాంటిదే. భూమి పరాశక్తి. అందులోని విత్తు మూలాధారం. ప్రాణం. ఈ ప్రాణానికి జీవం పోసేది సూర్యుడు. ప్రత్యక్ష నారాయణుడు. సూర్యుడి కిరణ ప్రసారంతో జరిగే సంయోజక్రియ చేత విత్తు మొక్కవుతుంది. చెట్టవుతుంది. వృక్షమవుతుంది. మహావృక్షమై నిలుస్తుంది. ఈ విత్తు మూలాధారం నుంచి ఆకాశం వైపు ఊర్థ్వముఖంగా ఎగుసుకొంటూ పోతుంది. ఆయన కిరణాలు పృథ్వి ముఖంగా దిగివస్తూ ఉంటాయి. ఆమె శక్తి. ఆయన ఆధారం. ఇవి రెండూ అభిన్నమైనవి. పరస్పర పూరకములైనవి. ఆది దంపతులు కూడా అభిన్నమైన శక్తి. భారతీయ దాంపత్య ధర్మం అన్నది కూడా ఈ అభిన్నత్వానికి ఇంకా చెప్పాలంటే.. భిన్నంగా కనిపించే ఏకత్వానికి ప్రతీక. భిన్నత్వంలో ఏకత్వం అంటే.. మనం జనరల్‌గా అనుకొనే దేశంలోని రకరకాల సమాజాలు, సంస్కృతుల మధ్య అంతర్లీనంగా కనిపించే ఏకత్వం కాదు. ఇదిగో ఈ ద్యావాపృథివీ సమాగమమే భిన్నంగా కనిపించే అభిన్నం.

అందుకే సీతాదేవిని పరదేవతగా మన మహర్షులు భావించారు. అయోధ్యకాండలో రాముడు నేను అడవికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు.. అక్కడికి వచ్చి ఏం కష్టపడతావు అన్నాడు. అప్పుడు సీతాదేవి ఏమయ్యా.. నువ్వు ఇప్పుడంటే వనవాసానికి వెళ్లాలని బయలుదేరావు. అది కూడా కైకేయి చెప్తేనే. నాకు వనవాసానికి వెళ్లాలని ఎప్పుడో డిసైడ్ అయి ఉంది. మిథిలలో ఉన్నప్పుడే.. చిన్నప్పుడే నాకు మా పండితులు సూచించారు. కాబట్టి.. నేనెప్పుడో అడవికి వెళ్లడం నిశ్చయం చేసుకొన్నాను. నువ్వేం బాధపడొద్దు.. నేనూ నీతో వస్తాను అన్నది. రాముడి కంటే ముందే సీతాదేవి వనవాస దీక్ష ఖరారైంది. ఈ విషయం ఆమెకు ముందే తెలుసు. అందుకే దశరథుడి ఆజ్ఞ గురించి చెప్పగానే ఆమె తొట్రుపడలేదు. ఆయనతో బయలుదేరడానికి తానూ రెడీ అయింది. రాముడు రకరకాలుగా చెప్పినా వినలేదు. ఆయనకు స్పష్టంగా చెప్పింది. నేను నీకంటే ముందు నడుస్తూ.. దారిలో ఎలాంటి కంటకాలు లేకుండా చేస్తానని.. ముళ్లను, రాళ్లను తీసివేసి నీ దారిని సుగమం చేస్తానని పేర్కొన్నది. ఆమె వనవాసానికి వెళ్లకపోతే.. రామాయణమే లేదు. రాక్షస సంహారం లేనేలేదు. అందుకే ఆమే ఈ ఇతిహాసానికి నాయిక అయింది. శతకంఠ రామాయణం ఆదిపరాశక్తే సీతాదేవిగా అవతరించి రాముడికంటే ముందే లంకకు చేరుకొని సర్వ రాక్షస సంహారానికి పునాది వేసిందని వివరించింది. పంచవటి నుంచి లంకవరకు జరిగిన అన్ని ఘటనల్లో మనకు ఈ విషయం స్పష్టంగా గోచరిస్తుంది. ఆమె వెళ్తూ వెళ్తూ దారిలో సంకేతాలు వదిలేసి వెళ్లింది. మొదట జటాయువు అడ్డుకొన్నాడు. తరువాత కిష్కింధ దగ్గర నగలను విడిచిపెట్టడం ద్వారా వానరులతో కనెక్ట్ కావడానికి బీజం వేసింది. సీతారాముల కలయిక ఈ పరమ ప్రయోజనాన్ని సాధించటం కోసమేనన్నది స్పష్టం. వనవాసానికి రాముడితో బయలు దేరటం మొదలుకొని, మాయలేడి కావాలని కోరటం వంటివన్నీ కూడా రావణ సంహారానికి సీతాదేవి చేసుకుంటూ పోయిన దారిలో భాగమే.. తాను చెప్పినట్లుగానే ఆమె ముందే లంకకు చేరుకుంది.. రాక్షస శక్తులను బలహీనం చేసింది. త్రిజట లాంటి రాక్షసుల్లో కలలో కూడా నిద్ర లేకుండా చేసింది.. విభీషణుడి లాంటి సాత్వికులను రావణుడి నుంచి దూరం చేసింది. రావణుడికి సైతం భయాన్ని కలిగించింది. రావణుడికి అనుకూలంగా సీత మనస్సు మార్చుదామనుకొన్న రాక్షస స్త్రీల మనస్సులనే తనకు అనుకూలంగా మార్చివేసింది. ప్రతి జీవి యందు కూడా ఆధ్యాత్మిక స్పృహ అంతరాళలో నిబిడి ఉంటుందన్న భారతీయ తత్త్వ చింతనకు ఇది ఉదాహరణ. రామాయణ కల్పవృక్షంలోని సుందరకాండలో రాక్షస స్త్రీలలో ప్రఘస అన్న ఆమె సీతతో ఇలా అన్నదంట.

శివ మహాకార్ముకచ్ఛేత్త యెవ్వాడని

కన్న తండ్రికిని దుఃఖంబు తొలుత

శివ మహాకార్ముచ్ఛేత్త వీడంచు భా

ర్గవ రామునకు దుఃఖంబు పైన

తగమహాటవి జంకతాళివి మరితాళి

కట్టిన వాని దుఃఖంబు మరియు

నీవన్న దలమున్కలౌ వలపైన రా

క్షసరాజునకును దుఃఖంబు పెచ్చు

ఇంక మామాట చెప్పగానేల రేపు
వరుగు తినిపించెదవు మమ్ము పరమదుఃఖ
మయ విచిత్రలోకేశ్వరీ! మాయవై సు
ఖంబు చూపించెదవును దుఃఖంబు నెఱపి

ఈ ఒక్క పద్యం చాలు రామాయణంలో సీతాదేవి సమస్త కార్యనిర్వాహణ చేసిందని చెప్పడానికి. యుద్ధకాండలో సీతాదేవి ప్రభావమంతా మనకు మరింత విశదంగా కనిపిస్తుంది. రావణసంహారం జరిగింది. సీతాదేవి అగ్నిప్రవేశ సందర్భమిది. ఆమె అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడుతుంటే మౌనంగా చూస్తున్న రాముడిని చూసి లక్ష్మణుడికి కూడా కోపం వచ్చింది. అప్పుడు ఆమె రాముడికి జవాబిచ్చింది. కల్పవృక్షంలోని ఈ పద్యాన్ని గమనించండి.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. వాల్మీకి రామాయణాన్ని దివ్యజీవన దార్శనికతతో అనుభూతి చెంది ఆవిష్కారమైన మహాకావ్యం కాబట్టి.. దీన్ని ఉదాహరణగా చెప్తున్నాను. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన సందర్భంలో చేసిన ప్రసంగంలో సీతానామక యోగాన్ని నాగులనుంచి తెలుసుకొన్నానని చెప్పారు. సీతాయాశ్చరితంమహత్ ఉపన్యాసం లోనూ.. కల్పవృక్ష రహస్యాలలోనూ దీని ప్రస్తావన చేశారు. అందువల్లనే కల్పవృక్షాన్ని ప్రస్తావించాల్సి వస్తున్నది. ఈ పద్యాన్ని గమనించండి.

ఆడది యింతసేయుననుటన్నది యున్నదెయంచు నన్ను నూ
టాడితి, కైక కోరక మహాప్రభు నీవని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసుర సంహరణంబులేద యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్

అన్నదిట సీతాదేవి. అంతా నేనే చేశాను పొమ్మన్నది. అంతేకాదు.. నీ దారిన నువ్వు.. నా దారిన నేను వుంటే ఈ సృష్టి, ఈ ప్రపంచం మునిగిపోదా.. మనం కొంతకాలం విడిపోతేనే ఇంత నాశనమైంది. నీకు సృష్టిమీద దయలేదన్నమాట. నేనగ్ని ప్రవేశం చేస్తే ఏమవుతుంది. నీవు భార్యారహితుడవవుతావు. లోకమేమవుతుంది.. ఎవరికి కావాలి ఈ రాజ్యం? అన్నది. ఈ సమస్త విశ్వ శ్రేయస్సుకు పరస్పర పూరకాలైన ప్రకృతి పురుషులు వేరు కావడం ఎంత వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ రెండు వాక్యాలు చాలవా? ప్రకృతి విధ్వంసం ఈ విశ్వాన్ని ఎంత నాశనం చేస్తున్నదో మనకు తెలియంది ఏమీ కాదు. ఈ దేశంలో సమాజ జీవన వికాసానికి మూలమైన దాంపత్య ధర్మాన్ని విచ్ఛిన్నం చేసిన ఫలితాల్ని మనం చవిచూస్తూనే ఉన్నాం. సృష్టి మొదలైన నాటినుంచి ఉన్న ప్రకృతి పురుషుల సంబంధమిది. ఈ బంధాన్ని వేరు చేశాడు రావణుడు. ఈ ప్రకృతి పురుషులను పార్వతీ పరమేశ్వరుల లాగా, లక్ష్మీనారాయణులలాగా సంభావించారు పరమపురుషులు. పార్వతి, లక్ష్తీ తత్త్వ భావాలను పరమేశ్వర, నారాయణ తత్త్వ భావాలనుంచి వేరుచేయాలని చూశాడు రావణుడు. వేయి పడగలులో చెప్పినట్టు ఇది మన జాతి శక్తి. దీన్ని నాశనం చేయాలని చూస్తే వాళ్లే నాశనమైపోతారు. రావణుడు అలాగే పోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here