రామం భజే శ్యామలం-54

0
9

[box type=’note’ fontsize=’16’] దాదాపుగా అయిదువందల ఏళ్ళ నిర్విరామ పోరాటఫలితంగా అయోధ్యలో రామజన్మభూమి భవ్యమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ సందర్భంగా, అసలు ఈ దేశానికి శ్రీరామచంద్రుడు ఆత్మగా ఎలా ఎదిగేడు? ఎందుకని నోరుండి మెదడులేని ప్రతివాడూ వివేచనాశూన్యంగా శ్రీరామచంద్రునికి వ్యతిరేకంగా దుర్వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిలో రాముడిని కించపరచి తక్కువ చేయాలని చూస్తున్నారు? ఇలాంటి అనేక చారిత్రిక, ధార్మిక, సామాజిక, రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే ప్రయత్నం శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న ఈ వ్యాస పరంపర. [/box]

[dropcap]రా[/dropcap]మాయణంలో అత్యంత టిపికల్ క్యారెక్టర్.. అతి తక్కువ నిడివి ఉన్న పాత్ర ఒకటి ఉన్నది. బాలకాండలో ప్రారంభమై .. బాలకాండతోనే ముగుస్తుంది. కానీ మొత్తం రామాయణానికి ఈ ఒక్క పాత్ర కీలకమైనది. రావణ వధకు బీజం వేసింది. రాముడి ప్రస్థానాన్ని శాసించింది. రాముడిని అస్త్ర శస్త్రాలతో శక్తిమంతుడిని చేసింది. సీతారాములను ఒక్కటిగా ముడివేసింది. శివ కార్ముకాన్ని విచ్ఛేదన చేయించి సమస్త లోకానికి విశ్వ నాయకుడిని పరిచయం చేసింది. ఇక ఆ తరువాత ఆ పాత్ర అవసరం వాల్మీకికి లేకుండా పోయింది. ఆ పాత్ర విశ్వామిత్రుడు. రామాయణంలో ఆయా సందర్భాలను బట్టి అనేక కథలు చోటు చేసుకొన్నవి. ఇందులో భగీరథుడి గంగావతరణం.. తరువాత అత్యంత ప్రేరణాత్మకమైన కథ విశ్వామిత్రుడిదే. రాముడి వ్యక్తిత్వానికి విశ్వామిత్రుడి జీవితం మరింత మెరుగులు దిద్దింది. ఒక సామాన్యమైన వ్యక్తి.. జీవితంలో ఒక్కొక్క దానిని జయించుకొంటూ ముందుకు సాగి.. బ్రహ్మర్షిత్వాన్ని సాధించటం విశ్వామిత్రుడి గాథలోని అత్యంత ప్రధానాంశం. భారతీయ సనాతన ధర్మానికి అనుసరణీయమైన వర్ణాశ్రమ ధర్మం యొక్క మూల లక్ష్యానికి నిదర్శనం. విశ్వామిత్రుడి గాథ ఒక్కటి చాలు.. మనిషి జీవన విధానం, జీవించాల్సిన విధానం గురించి ఈ దేశం ప్రపంచానికి చూపిన మార్గమేమిటో తెలుసుకోవటానికి.

రాముడు అప్పుడప్పుడే నూనూగు మీసాలు వస్తున్న వయసులో ఉన్నాడు. సరిగ్గా ఆ సందర్భంలో రాముడి జీవితంలోకి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. సిధ్ధాశ్రమంలో తాను చేస్తున్న యాగానికి రక్షకులు కావాలని వస్తాడు. నిజానికి.. ఆయన దగ్గరే బోలెడు ఆయుధాలు అప్పటికే ఉన్నాయి. ఒక్కటి ప్రయోగించినా చాలు.. యాగ రక్షణ తేలికగా అయిపోతుంది. కానీ పనిగట్టుకొని వచ్చి.. రామ లక్ష్మణులను తీసుకొనిపోయాడు.. ఆయుధాలు ఇచ్చాడు. యాగం విజయవంతంగా ముగిసింది. తర్వాత మిథిలకు వెళ్తే అక్కడ గౌతముడి కుమారుడు శతానందుడు.. ఈ విశ్వామిత్రుడి వాస్తవ కథను రాముడికి చెప్తాడు.

కుశనాభుడనే ఓ రాజున్నాడు. ఆతని కొడుకు గాథి. ఈ గాథి కుమారుడే విశ్వామిత్రుడు. చాలా ఏండ్ల పాటు ఈ విశ్వామిత్రుడు రాజుగా రాజ్యం చేశాడు. ఒక రోజు బయలుదేరి మందీ మార్బలాన్ని వెంటేసుకొని నగరాలు, రాష్ట్రాలు, నదులు, గిరులు, ఆశ్రమాలు.. ఇలా అన్నీ తిరిగాడు. తిరిగి తిరిగి.. అలసిపోయి.. దారిలో ఉన్న వసిష్ఠుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆయన విశ్వామిత్రుడికి ఆతిథ్యమిస్తానన్నాడు. నువ్వు చేసిన స్వాగత సత్కారాలు నాకు చాలు. ఆతిథ్యమెందుకన్నాడు విశ్వామిత్రుడు. కానీ.. వసిష్ఠుడు పట్టు వదలకపోవడంతో ఆతిథ్యం స్వీకరించాడు. వసిష్ఠుడి దగ్గర ఓ ఆవు ఉన్నది. దాని పేరు శబల. అది విశ్వామిత్రుడి టీం అందరికి సుష్టుగా భోజనం పెట్టిందిట. అంటే దాని సాయంతో వశిష్ఠుడు విందు ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ విశ్వామిత్రుడి ఆ ఆవు కావాలనిపించింది. తపస్సు చేసుకొనేవాడికి ఇంత పాడి ఇచ్ఛే ఆవు ఎందుకయ్యా.. నాకు ఇచ్చేయి అన్నాడు. అట్లెట్లా కుదురుతుందయ్యా ఇది నాది. నీలాంటోళ్లు చాలామంది వస్తుంటారు.  వాళ్లకు విందు ఇవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. నేను దీనిపైనే ఆధారపడి ఉన్నా.. నీకివ్వడం కుదరదు అన్నాడు. ఆ రోజుల్లో సాత్వికాహార విందు అంటే.. పాలు, వెన్న, పరమాన్నం, ఆయాసం, భక్ష్యాలు (మిఠాయిలు), ఇవే. పిజ్జాలు, బెర్గర్ల కాలం కాదు. పన్నీర్ అయిన పాలు లేకుండా కాదనుకోండి… వీటన్నిటికీ ఆవు ఇచ్చే పాడి మాత్రమే ప్రధానం. అందువల్లనే గోవు మనకు కడుపు నింపే అమ్మ అయింది. అమ్మ అంటే ప్రకృతి. దేవత. అందువల్లనే ఈ దేశంలో గోపూజ అతి ముఖ్యమైనది. ప్రధానమైనది. అందువల్లనే ఆవును విశ్వామిత్రుడు అడిగాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. విశ్వామిత్రుడు బలవంతంగా శబలను తీసుకొని వెళ్లబోయాడు. వశిష్ఠుడు తన తపోబలంతో ఆయన్ను నిలువరించాడు. విశ్వామిత్రుడి అహం దెబ్బ తిన్నది. నేను ఓడిపోవడం ఏమిటి? వెంటనే తాను వసిష్ఠుడు అంతటి వాడిని కావాలనుకొన్నాడు. ఇంకేం తానూ తపస్సు మొదలు పెట్టాడు. కొన్నేండ్లకు ధనుర్విద్యలోని రహస్యాలన్నింటినీ సాంగోపాంగముగా సాధించాడు. వాటన్నింటితో మళ్లీ వశిష్ఠుడి ఆశ్రమంపై దాడిచేశాడు. తపోవనాన్ని దగ్ధం చేశాడు. వసిష్ఠుడు తన బ్రహ్మదండముతో వాటన్నింటినీ నిర్వీర్యం చేశాడు. ఆగ్నేయ, వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషికాస్త్రములు నశించాయి. వందలాది అస్త్రాలు ఆ బ్రహ్మదండం మింగేసింది. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని కూడా వశిష్ఠుడి బ్రహ్మదండం మింగేసింది.

విశ్వామిత్రుడు తీవ్రంగా అలసిపోయినాడు. విసిగిపోయినాడు. నా బలం ఏబలమయ్యా.. వసిష్ఠుడి తపోబలం ముందు ఎందుకూ పనికిరాకుండా పోయింది. నేను కూడా నా ఇంద్రియాలను నిగ్రహించుకొని వసిష్ఠుడి లాగా ఎదుగుతానని గట్టిగా సంకల్పించాడు. అంతే.. తపస్సు చేయడం మొదలుపెట్టాడు. గృహస్థాశ్రమాన్ని కొనసాగిస్తూనే తపస్సు చేశాడు. చాలాకాలం తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి.. ‘కుశిక నందనా.. నీవు తపస్సుచేత రాజర్షులు చేరగల్గిన లోకములను జయించినాడు. ఈ తపస్సుచేత నీవు రాజర్షివైనావు’ అని చెప్పాడు. విశ్వామిత్రుడికి కోపం వచ్చింది. ఇంత తపస్సు చేస్తే.. నన్ను రాజర్షే అంటారా? లాభం లేదు.. ఇంకా తపస్సు చేయాలని నిశ్చయించుకొని కొనసాగించాడు. ఈలోపు త్రిశంకువనే రాజుకు యజ్ఞం చేసి శరీరంతో సహా స్వర్గానికి వెళ్లాలన్న కోరిక పుట్టింది. వంద యజ్ఞాలు చేశాడు. కానీ కోరిక తీరలేదు. దారి చూపాలని వసిష్ఠుడి దగ్గరకు వెళ్తే కాదన్నాడు. వసిష్ఠుడి కొడుకుల దగ్గరకు వెళ్లాడు. వాళ్లూ కాదన్నారు. పైగా శపించారు. దీంతో ఈ త్రిశంకువు విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్లాడు. శత్రువు శత్రువు మిత్రుడన్న సామెతలాగా త్రిశంకువును ఆయన చేరదీశాడు. అతనిచేత యజ్ఞం ప్రారంభింపజేశాడు. మునులను పిలిపించాడు. వసిష్ఠ కుమారులు రానన్నారు. ఇలాంటి కార్యాన్ని చేయడం తప్పన్నారు. తీవ్రమైన కోపంతో వారిని విశ్వామిత్రుడు శపించాడు. మిగతా మునులంతా ఈ విశ్వామిత్రుడి కోపానికి భయపడి ఆయన చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డారు. యజ్ఞం ఎంత చేసినా దాని హవిస్సులను స్వీకరించడానికి దేవతలెవరూ రాలేదు. దీంతో తన తపః ఫలాన్ని అంతా ధారపోసి.. త్రిశంకువును స్వర్గానికి పంపించారు. కానీ.. అక్కడ దేవతలు అతడిని రానివ్వలేదు. పైగా తలకిందులుగా చేసి కిందకు తోశారు. దీంతో విశ్వామిత్రుడికి మరింత కోపం వచ్చింది. త్రిశంకువును మధ్యలోనే నిలిపేశాడు. చుట్టూ నక్షత్రమండలాన్ని సృష్టించాడు. కృత్రిమ స్వర్గాన్ని సృష్టించాలని ప్రయత్నించగా దేవతలు వచ్చి వారించారు. అయ్యా.. ఇలా సశరీరంతో రావడానికి ఇతను అనర్హుడు.. నీకు తెలుసు కదా.. అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు వెనక్కి తగ్గాడు. కానీ.. త్రిశంకువు శాశ్వతంగా స్వర్గం నందు నివసించాలని, తాను సృష్టించిన నక్షత్రాలన్నీ శాశ్వతంగా ఉండాలని డిమాండ్ చేశాడు. దీంతో.. జ్యోతిశ్చక్రానికి అవతల (అంటే సౌరమండలానికి బయట) ఈ నక్షత్రాలన్నీ ఉంటాయి. వాటి నడుమ ఈ త్రిశంకువు ఉంటాడని హామీ ఇచ్చారు దేవతలు. ఇట్లా ఆయన తపస్సు అంతా వృథా అయిపోయింది.

ఇంక లాభం లేదనుకొని.. విశ్వామిత్రుడు వెనక్కు వెళ్లనేలేదు. తిరిగి తపస్సు ప్రారంభించాడు. అక్కడ శునశ్శేపుడనేవాడు వచ్చాడు. అంబరీషుడు చేస్తున్న యజ్ఞంలో తనను యజ్ఞపశువుగా చేస్తున్నాడని.. తనను రక్షించాలని వేడుకొన్నాడు. అతడిని రక్షించడానికి విశ్వామిత్రుడు కొన్ని మంత్రాలను ధారపోశాడు. ఆ తరువాత పుష్కరక్షేత్రంలో మళ్లీ తపస్సుచేశాడు. కొన్నేండ్ల తరువాత బ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ఋషివి అయినావన్నాడు. అక్కడితో విశ్వామిత్రుడు తృప్తి పడలేదు. తపస్సు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈలోపు మేనక వచ్చి ఆయన తపస్సును విఘ్నం చేసింది. ఆమె మీద మోహంతో పదేండ్లపాటు తపస్సును విడిచిపెట్టాడు. తరువాత అయ్యో నా లక్ష్యమేమిటి? నేను చేస్తున్నదేమిటని రియలైజ్ అయ్యాడు. మేనకను పంపించి వేసి కౌశిక నదీతీరం చేరి ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన టార్గెట్ ఒక్కటే.. వసిష్ఠుడిని మించినవాడు కావాలని. చాలాకాలం తర్వాత మళ్లీ బ్రహ్మ వచ్చి నువ్వు ఇక మహర్షివైనావని అన్నాడు. దీంతో విశ్వామిత్రుడు నేను జితేంద్రియుడనైనట్టేనా అని అడిగాడు. ఇంకా కాలేదు. ప్రయత్నించు అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎలాంటి ఆలంబనం లేకుండా గాలిమాత్రమే భోజనం చేస్తూ.. ఎండాకాలంలో పంచాగ్ని మధ్య, వానాకాలంలో ఆరుబయట, శీతాకాలంలో నీళ్లలో ఉండి మరింత ఘోరంగా తపస్సు చేశాడు. ఈసారి ఆయన తపస్సును రంభ విఘ్నపరచింది. విశ్వామిత్రుడు కోపం పట్టలేక రాయి కమ్మని శపించాడు. ఆ వెంటనే పశ్చాత్తాపం చెందాడు. తాను జితేంద్రియుడనైనానని అనుకోవడం వాస్తవం కాదని తెలిసికొన్నాడు. మళ్లీ తపస్సు కొనసాగించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించాడు. ఆహారాన్ని పరిత్యజించాడు. పూర్తి మౌనవ్రతంతో తపస్సు కొనసాగించాడు. ఏండ్లపాటు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ వచ్చి.. నీవు బ్రహ్మర్షివైనావు అని చెప్పాడు. నువ్వు కాదు.. చెప్పాల్సింది.. వసిష్ఠుడు చెప్తే ఓకే అన్నాడు. వసిష్ఠుడు స్వయంగా వచ్చి.. ‘నీవు బ్రహ్మర్షివి’ అని చెప్పాడు.

ఇది వాల్మీకి శతానందుడిచేత చెప్పించిన విశ్వామిత్రుడి చరిత్ర. ఈ కథలో ఆధ్యాత్మిక భావనానుభూతులను కాసేపు పక్కన పెడదాం. ఒక సామాన్య మానవుడిగా విశ్వామిత్రుడిని చూసినప్పుడు అతను మూర్తీభవించిన తపస్సులాగా మనకు దర్శనమిస్తాడు. తాను అనుకొన్నది సాధించడానికి ఎంత కష్టపడటానికైనా వెనుకాడలేదు. ఒక సామాన్యమైన వ్యక్తి మహామానవుడిగా ఎదిగి వచ్చిన తీరుకు విశ్వామిత్రుడి జీవితం ఉదాహరణ. గమ్యాన్ని చేరుకోవడంలో దారి మధ్యలో ఎదురైన విఘ్నాలను ఒక్కొక్కటిగా తొలగించుకొంటూ ముందుకు సాగిపోయాడు. తనలోని కోపము, కామము, మద, మాత్సర్యం వంటివాటినన్నింటినీ ఒక్కటొక్కటిగానే విడిచిపెట్టి.. తనను తాను జయించుకొంటూ.. లోకాన్ని జయించాడు. ఆయన మార్గంలో చాలాసార్లు తీవ్రమైన వైఫల్యాలను చవిచూడాల్సి వచ్చింది. విశ్వామిత్రుడు అప్పటికే రాజు. ఇంత కష్టపడాల్సినంత అవసరం లేదు. కానీ.. ఒకదాన్ని సాధించాలని సంకల్పించిన తరువాత ఒక్కఅడుగు కూడా వెనక్కు వేయలేదు. వైఫల్యమైన ప్రతిసారీ మళ్లీ మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టుకొంటూ వచ్చాడు. అయ్యో ఇంతచేసినా సక్సెస్ కావడంలేదని తన రాజ్యానికి తిరిగి వెళ్లిపోలేదు. పైనుంచి పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచి నడక ప్రారంభించాడు. మరింత తీవ్రంగా ముందుకు సాగాడు. ఒక్కొక్క మెట్టూ ఎక్కుకుంటూ గమ్యాన్ని చేరుకున్నాడు. రాజు రాజర్షి అయినాడు. రాజర్షి ఋషి అయినాడు. ఋషి మహర్షి అయినాడు. మహర్షి బ్రహ్మర్షి అయినాడు. బ్రహత్వాన్ని పొందడం కోసం విశ్వామిత్రుడు ఎదిగివచ్చిన క్రమమిది. ఇక్కడ బ్రహ్మత్వమంటే అల్టిమేట్ నాలెడ్జి.. ఇంటెలెక్చువల్ అని అర్థం. అసాధారణ ప్రతిభానైపుణ్యాలను సాధించినవాడనే అర్థం. బ్రహ్మత్వం అంటే బ్రాహ్మణం అంటే అర్థం ఇదే. అంతేకానీ.. ఏదో కులంలో పుట్టాడని బ్రాహ్మణుడని చెప్పలేదు మన పూర్వీకులు. ఇది కులం కాదు. వర్ణం. భూమి మీద పుట్టినవాడు ఎదిగే క్రమాన్ని బట్టి వర్ణం నిర్ధారణ అవుతుంది. భారతీయ సనాతన ధర్మం చెప్పింది ఇదే. ఇందుకు విశ్వామిత్రుడి జీవితమే ఉదాహరణ. బ్రిటిషోడు వచ్చిన తర్వాత వాడికి అర్థం కాక.. ముక్కుసైజును బట్టి జాతిని.. వృత్తిని బట్టి కులాన్ని డిసైడ్‌చేస్తే.. అదంతా భారతీయ ధర్మం చెప్పిందంటూ ఓ రాయి నెత్తినపడేసి.. కొన్ని తరాలను స్వధర్మానికి దూరంచేశారు.

మనకు జీవితంలో అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. పరీక్షల్లో ఫెయిలవుతారు. ఉద్యోగంలో వైఫల్యాలు ఎదురవుతాయి. జీవితంలో ఆర్థిక, హార్థిక సమస్యలు ఎన్నో వస్తాయి. సాధించాలనే విల్‌పవర్ బలంగా ఉంటే.. ఇవన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి. అంతిమంగా లక్ష్యాన్ని చేరుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అందుకు విశ్వామిత్రుడే మనందరికీ ప్రేరణ. ఉత్ప్రేరకం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here