రామమూర్తి పంతులుగారితో 36 గంటలు

1
7

[box type=’note’ fontsize=’16’] ఆగష్టు 29వ తేదీ శ్రీ గిడుగు రామ్మూర్తి జయంతి. నేడు ‘తెలుగు భాషా దినోత్సవం’గా జరుపుకుంటున్న సందర్భంగా ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రికలో 10 డిసెంబర్ 1935 నాడు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రచురించిన వ్యాసాన్ని సంచిక పాఠకులకు కోసం ప్రత్యేక వ్యాసంగా అందిస్తున్నాము. [/box]

[dropcap]న[/dropcap]వంబరు యిరవై మూడో తేదీ శనివారం సాయంత్రం రమారమి యెనిమిది గంటలవేళ, పర్లాకిమిడిలో, నేను, రావుసాహేబు,  శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారి యింటికి వెళ్ళాము. ఇరవై అయిదో తేదీ, సోమవారం, ఉదయం, అలాగే యెనిమిది గంటల వేళ, మళ్ళీ అక్కణ్ణుంచి బయలుదేరాను.

ఈ 36 గంటలకూ నేను వెలకట్టలేను. నా జీవితంలో, యింతవరకూ, నేనిలాంటి సమయం గడిపి యెరుగను. ఇకముందు కూడా గడపబోను.

పంతులుగారి కటాక్షవీక్షణం నామీద ప్రసరించినంత సేపూ యేదో అపూర్వ శక్తి వొకటి నాలో జాగరితం అవుతూ వున్నట్టు తోచింది. తెలుగు భాషను గుర్తించిన సమ్యగ్జానం నా మెదటిలో సంచితం అవుతూ వున్నట్టు కూడా అనిపించింది.

ఆంధ్రదేశానికి నూత్న సందేశం వెలువడ్డ ఆ గదిలో కూచుని వుపదేశం చేస్తూ వుండగా పంతులుగారి దివ్య దర్శనం చేసుకున్నాను. నా జన్మ సఫలం అయింది.

నేను వెళ్ళేటప్పటికి, పంతులుగారు, టేబిలు ముందు కూచుని ఫలహారం చేస్తున్నారు. “రాజమండ్రి నుంచి యెవరో వచ్చా”రని మాతృశ్రీ అన్నపూర్ణమ్మ గారు మనవి చెయ్యగా వారు వెనక్కి తిరిగి చూశారు. వెంటనే నేను నమస్కారం చెయ్యగా అందుకున్నారు గాని నన్నానవాలు కట్టలేకపోయారు.

రాజమహేంద్రవరంలో వారికి సన్మానం జరిగాక మళ్ళీ నేనిదే వారి దర్శనం చెయ్యడం.

ఇది యిలాగే జరుగుతుందని నేను చేతిలోనే వుంచుకుని వున్న కార్డు అందించాను. వెంటనే వారు గభీమని లేచి “అలాగా! చాలా సంతోషం” అంటూ నా భుజంమీద తట్టి, కొంచెం దూరంలో వున్న కుర్చీ తెచ్చి వేసి కూచోమన్నారు. నేనే అది తెచ్చుకోవాలని ప్రయత్నించాను; గాని ఆ పులిపంజాలలో వున్న కుర్చీని నేను స్వాధీనపరుచుకోలేకపోయాను.

నన్ను చూశారు. అప్పటిదాకా ఫలహారం చేస్తూ, వూసిపోడానికి మూలుగుతూ వున్న పంతులుగారు, గ్రాంథికవాదులలో కొమ్ములు తిరిగిన వారి తప్పుడు రచనల ప్రస్తావన ప్రారంభించారు.

అవి గ్రాంథిక వాదుల అప ప్రయోగాలే కాదు, అర్థం లేని ఆక్షేపణలే కాదు, కుట్రలే కాదు, కుత్సితాలే కాదు, అశక్త దుర్జసణలే కాదు – అది అఖండ గోదావరి నిండు ప్రవాహం.

ఈ కారణం వల్ల, తరువాత, పదినిమిషాలలో పూర్తి కావలసిన ఫలహారానికి ముప్పావుగంట పట్టింది.

తరువాత నేను భోజనం చేసి వారితో కూడా మేడ మీదకి వెళ్ళాను.

శ్రీ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు

ఆ గదిలో వొకచోట స్వర నిఘంటువు చిత్తులు, ఒకచోట తయారులో వున్న సాపులు. ఒకచోట ప్రూఫులు. ఒకచోట నాలుగైదు రోజులుగా వచ్చిన తెనుగు పత్రికలు, ఎదటి గూట్లో అరవం, కన్నడం, మరాఠి, ఇంగ్లీషు, జర్ననీ, ఫ్రెంచి వగైరా భాషల బృహాన్నిఘంటువులు.

వాటి మధ్య, శరీరం అంతా చితక్కొట్టబడ్డ వీరమ్మన్యుడులాగ పడివున్న శబ్దరత్నాకరం.

ఆ గదిలో కార్యస్థానపు లక్షణాల కంటే యుద్ధరంగపు లక్షణాలే యెక్కువగా వున్నాయి.

మళ్ళీ కబుర్లు మొదలయినాయి.

బ్రహ్మశ్రీ (మారేపల్లి రామచంద్ర) కవిగారి ప్రస్తావన వచ్చింది.

వెంటనే లేచి, పంతులుగారు, నా చెయ్యి పట్టుకుని వసారాలోనికి తీసుకువెళ్ళి, గడమంచీ మీద వున్న బండెడు తాటాకు పుస్తకాలూ చూపిస్తూ “కవిగారికి విశాఖపట్నం జిల్లా వారు షష్ఠిపూర్తి మహోత్సవం చెయ్యడం బాగానే వుంది; కాని వారి ఘనుతకా గౌరవం చాలదు. వారి పేర, యలమంచిలిలో, బోర్డు యాజమాన్యం కిందగాని, విశాఖపట్నంలో మునిసిపాలిటీ పెత్తనంలోగానీ వొక పుస్తక భాండాగారం స్థాపించి, రిజిస్టరీ చేయించేట్టయితే నేనీ తాటాకు పుస్తకాలన్నీ ఆ భాండాగారానికిస్తాను. సీతాపతి యింట్లో లేకపోవడం మీరు చూస్తూనే వున్నారు. విశాఖపట్నం వెళ్ళి నేనా మహోత్సవం కళ్ళారా చూడవలసిన వాణ్ణే కాని ఇల్లు కదలలేని స్థితిలో వున్నాను. మీరు వెడుతున్నారు కనక యీ సంగతి మీ మాటలతో మహాసభలో చెప్పండి” అని సెలవిచ్చారు.

తరువాత, వారి, యీ సందేశం, నేను విశాఖపట్నంలో మహాసభలో ప్రకటించాను.

అదివరకే నేను, కవిగారు గొప్ప పండితులని యెరుగుదును; కాని పంతులు గారి యీ సందేశం వల్ల నాకు కవిగారి పదవి మరింత మహోన్నతంగా కనపడింది.

ఇవాళ, తెనుగు దేశంలో, ఆంధ్ర పండితుల తారతమ్యం తెలుసుకోవాలంటే, అందుకు రామమూర్తి పంతులుగారి నిర్ణయం వొక్కటే ఆధారం.

తరవాత వీరేశలింగం పంతులుగారి శిలావిగ్రహం సంగతి వచ్చింది. “రేపది రాజమహేంద్రవరంలో మహోత్సవంతో ప్రతిష్ఠించబడుతోంది కదా మీరిలా వచ్చేశా”రేమని పంతులుగా రడిగారు. “ప్రబుద్ధాంధ్ర నన్నింటో వుండనివ్వడంలే”దని రాసి చూపించాను. “ఔనౌను. మీ ప్రచారం సంగతి విన్నాను. ప్రబుద్ధాంధ్రకు, సంపాదకుడు నెలకు ఇరవై రోజుల చొప్పున ప్రెస్సు బిల్లూ పేపరు బిల్లూ పూర్తిగా చెల్లకపోతూ వుండడం దేశీయుల గాఢ నిద్రకు నిదర్శనం అయితే; ఈ వూళ్ళో మీరు మా యింట్లో బసచేయడం బాగాలేదు. ఏమంటే? అన్నివిధాల మాకీ వూళ్ళో వెలి. ఈ వూరి తాపీ పనివాడెవడూ మా యింటో పనిచెయ్యడానికి రాడు. వస్తే, తరువాత కంట్రాక్టర్లూ రాజాగారి పోష్యవరంలో వారూ వాణ్నిక చేరనివ్వరు. పెంకులమ్ముకునే వాడు మాకు పెంకులివ్వడు. ఇస్తే వాడిక వర్తకం కట్టిపెట్టుకోవాలి. రాజాగారితో సంబంధం వున్న పెద్ద మనుష్యులెవరూ మా యింటికేసి కూడా చూడరు. ఎక్కడేనా కనపడితే దూరంగా తొలగిపోతారు. మాకేగాక మరికొందరికి కూడా యిలాంటి చిక్కులున్నాయి. మీరు మరోచోట బస పెట్టుకుంటే పని జరిగివుండు”నని పంతులుగారన్నారు. దానికి నేను “తమ దర్శనం కోసం వచ్చాను. మరేమీ పనిలేదు. వచ్చాను కనక యిదివరకే తమ ద్వారా చందాదారులై వున్నవారిని చూస్తాను” అని రాసి చూపించాను. పంతులుగారు సంతోషించారు. కాని “మాటలవల్ల పనులు జరుగుతాయా? సరే మరీ కష్టపడండి. దేశీయులు మీ సేవను గుర్తిస్తారు. కొంతవరకూ గుర్తించి కూడా వున్నారు” అని చెబుతూ మళ్ళీ వీరేశలింగం పంతులుగారి ప్రస్తావన అందుకున్నారు.

“వీరేశలింగం పంతులుగారు పండితులనడానికి వీలులేదు; కాని పండితులే. చెయ్యవలసిన పనులెన్నో చేశారు. వారు చేసిన పనులు మరెవ్వరూ చెయ్యలేక పోయారు కూడాను. వారు చివరికి, నా వాదం అంగీకరించారు. వెంటనే వారి ఆనందాశ్రమంలో వర్తమానాంధ్ర భాషాప్రవర్తక సమాజం యేర్పరచబడ్డది. దానికి పంతులుగారే అధ్యక్షులు. అప్పటికి వారు ఆంధ్రకవుల చరిత్ర సంస్కరిస్తున్నారు. మద్రాసు ప్రయాణం తొందరలో కూడా వున్నారు. ‘ఈ పని పూర్తి కాగానే నేనీ సమాజం పని శ్రద్ధగా చేస్తా’నని చెబుతూ వారు మద్రాసు వెళ్ళారు. కాని కొద్దిరోజుల్లోనే వారక్కడ కాలం చేశారు. ఈ సంగతులన్నీ తెలుపుతూ శిలా విగ్రహ ప్రతిష్ఠకు ప్రధాన పురుషులైన పెద్దాడ సుందర శివరావు గారికి నేను జాబు రాశాను. వారు దాన్ని ఆ సభలో చదువుతారని నమ్ముతున్నా”నన్నారు పంతులుగారు.

అప్పటికి రాత్రి పదిగంటలు దాటింది. పంతులుగారింకా మాట్లాడ గలిగేటట్టే వున్నారు; కాని ప్రయాణపు బడలిక వల్ల నాకంతకుముందే నిద్రమత్తు ప్రారంభమయి వుంది. అది చూసి వారు, నాకు, “పడుకో”మని సెలవిచ్చారు.

నవంబరు 24:-

సూర్యోదయం అయ్యేటప్పటికే పంతులుగారు కాలకృత్యాలు తీర్చుకుని సిద్ధంగా వున్నారు. మరో అరగంటకి నేను తెమిలాను. మాతృశ్రీ గారిచ్చిన కాఫీ పుచ్చుకుని యిద్దరమూ మేడమీదకి వెళ్ళిపోయాము.

పంతులుగారు, నన్ను, రెండో గదికి తీసుకువెళ్ళి ఉత్తమ ప్రబంధాలున్న బీరువా తెరిచారు. భారతం, భాగవతం, రామాయణం, మను వసు చరిత్రాదులు, ఏవి తీసినా పరిష్కర్తల తెలివి తక్కువ సవరణలు ప్రతి పేజీలోనూ గుర్తుపెట్టపడి వున్నాయి. కవిసార్వభౌముని శ్రీ కృష్ణ భారతం కనపడింది. ఎర్రపెన్సిలుతో గీటు పెట్టని పంక్తి కనపడలేదు. వావిలాల వాసుదేవశాస్త్రిగారి ఉత్తరరామ చరిత్ర కొత్త మార్పు కనబడింది. అక్షరం అక్షరానికి గీట్లున్నాయి. ఒక చోట శాస్త్రి గారు ‘హాని పొసగదు’ అని వాడారు. అది చూపించి, నవ్వుతూ, “శాస్త్రి గారికి పొసగు ధాతువు అర్థం తెలవదు. దాని ప్రయోగం అసలే తెలవదు. అయినా ఉత్తరరామ చరిత్ర తెనిగించారు. అయితే; వారి రచనలో వ్యావహారిక శబ్దాలు కుప్పలుగా వున్నాయి. తెలిసి వుండే వారు వాటిని వాడారని నేను చెప్పగల” నన్నారు పంతులుగారు.

వడ్డాది సుబ్బరాయుడుగారి ప్రస్తావన వచ్చింది. “శబ్దరత్నాకరం లేనిదే వారు మాట్లాడ”రని చెబుతూ పంతులుగారు, నన్ను, మొదటి గదికి తీసుకువెళ్ళి శబ్దరత్నాకరం ముందుపడేశారు.

చూస్తిని గదా, బలమైన దారంతో అది గట్టిగా కట్టబడి వుంది. విప్పగా, ఏ అట్టకా అట్ట, ఏ కాగితానికా కాగితమూ విడిపోయి వరసగా మాత్రం వున్నాయి. అందులో తప్పులేని శబ్దం కనపడ్డం చాలా కష్టమయింది. ప్రతీపేజీలోనూ అచ్చుభాగం కంటే పెన్సలుతో రాసిన భాగమే హెచ్చుగా వుంది. అది మళ్ళీ యథాప్రకారం కట్టేస్తూ పంతులుగారిలా చెప్పారు.

ఇద్దరమూ నుంచునే వున్నాం. “తమరు కూచోండి” అని కుర్చీ దగ్గరికి లాగాను. కాని “నుంచుని మాట్టాడడమే నాకలవాటు” అంటూ వారలాగే వుండి మాట్టాడారు.

“ఇటీవల నేను, శబ్దరత్నాకరం మరో ప్రతి కూడా కొని, తెల్లకాగితాలు చేర్చి బైండు చేయించి వున్నాను; కాని నేను యీ ప్రతిని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటున్నాను. ఒకప్పుడొక సన్నివేశం తటస్థించింది. ఒక సందర్భంలో మరికొన్ని పుస్తకాలతో పాటు ఇది కూడా పట్టుకుని రాజమహేంద్రవరం వెళ్ళాను. అక్కడ డాక్టరు చిలుకూరి నారాయణరావు గారి యింట్లో బస. పని పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చూడగా పెట్టెలో శబ్దరత్నాకరం కనపడలేదు. ప్రయాణం తొందరలో అది అక్కడే వుండిపోయింది. అది లేకపోవడం వల్ల నాకు మతిపోయింది. అంచేత “అది మళ్ళీ నా చేతికి వచ్చేదాకా నేను భోజనం చెయ్య”నని శపథం తాల్చాను. ఈ సంగతి తెలుపుతూ వెంటనే సీతాపతి నారాయణరావుకి టెలిగ్రామిచ్చాడు. దానికి నారాయణరావు “అవును. అది యిక్కడ కనపడింది. వెంటనే పార్శలు చేసి పంపేశాను. ఈపాటికి సగం దారిలో వుంటుంది” అని బదులు తంతి కొట్టాడు. అప్పుడు మా వాళ్ళు, బోధించి, బతిమాలగా నేను భోజనం చేశాను. అయితే ఈ పుస్తకం అంటే నాకింత శ్రద్ధ ఎందుకో మీకు తెలుసునా?”

ఇలా అడుగుతూ పంతులుగారు మరింత దగ్గిరగా వచ్చి తమ రెండు చేతులూ నా భుజాలమీద వేసి వూపుతూ వొత్తి వొత్తి పలుకుతూ-

“మీరు బాగా వినండి. గట్టిగా నమ్మండి. నేనిదివరకి చేసిందలా వుండనియ్యండి. నేనింకో పని చెయ్యవలసి వుంది. అది చెయ్యకుండా నేనీ శరీరం విడిచి పెట్టను. ఇది నా ఇచ్ఛకు వ్యతిరేకంగా జరగదు. ఆంధ్ర సాహిత్య పరిషత్తు యొక్క స్థితిగతులు మీకు బాగా తెలుసు. జయంతి రామయ్యగారు దాని చిగుళ్ళన్ని చిదిమేశారు, ఇప్పటికీ చిదిమేస్తూనే వున్నారు. అది పూర్తిగా గిడసబారి పోయింది. దానికింక యెదుగు బొదుగులు లేవు అది యిక చిగిర్చదు. పుయ్యదు, కాయదు, ఫలించదు. ఇక రామయ్యగారు ఆశ పెట్టుకున్నదల్లా సూర్యరాయాంద్ర నిఘంటువు. దేశం కనిపెట్టుకుని వున్నది దానికోసమే. అయితే; అది శబ్దరత్నాకరం మీద ఇంప్రూవ్‌మెంటు తప్ప స్వతంత్రం కాదు. సమగ్రం అంతకంటే కాదు. నిరుష్టం కానేకాదు. కావడానికి తగిన సన్నివేశాలక్కడ లేనేలేవు. అది అచ్చులో వుందని తెలుస్తుంది. కనక యెప్పటికేనా బయటికి వొస్తుంది. నేను దానికోసం యెదురుచూస్తున్నాను. వచ్చీ రావడం తోటే దాన్ని నేను ముక్కాచెక్కా కింద చితక్కొట్టేస్తాను. అందుకోసమే యీ శబ్దరత్నాకరం యింత జాగ్రత్తగా వుంచాను. దీన్ని అనుసరించి వెడుతుంది కనుక అది దాన్ని విమర్శించాలంటే దీనిమీద రాసి వుంచిన నోట్సు చాలా అవసరం. తరవాత దీని పని తీరిపోతుంది. ఇంత పనిచేస్తే గాని కృతకాంధ్రం యొక్క దౌర్భల్యమూ, దౌర్భాగ్యమూ విదేశీయులకు పూర్తిగా బోధపడవు. నిఘంటువు రాయడానికెలాంటి వారు పూనుకోవాలో, వారి హృదయం యెంత విశాలమయినది కావాలో, సంకుచిత భావాలతో పూనుకుంటే అది ఎలాగ నిరర్థకం అయిపోతుందో, జీవద్భాషను విడిచిపెట్టి నిఘంటువు రాయడం యెంత శవాలంకరణమో దేశీయులకు బోధపడడం చాలా అవసరం. యేది జరిగినా యేది జరగకపోయినా నేనిది మాత్రం చేసి తీరతాను. మీరు చూస్తారు.”

పంతులుగారీ మాట లుచ్చరించేటప్పుడు వారి ముఖంమీద దివ్య తేజస్సు మెరిసిపోయింది.

వ్యాస రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

తరువాత పంతులుగారు, కుర్చీలో చేరబడి వొక్క క్షణానికి చిత్తాన్ని సమహితం చేసుకున్నారు. ఈలోపుగా నేను పలక మీద వొక ప్రశ్న రాసి వారి కందించాను.

నా రచనలెంతో వుబలాటంతో చదివే ప్రియమిత్రులు, భావరాజు వెంకట కృష్ణారావు పంతులుగారు నాలుగైదు మాట్లు నాకొక సలహా చెప్పి వున్నారు. కాని దాన్ని నేనింతవరకూ అంగీకరించలేకపోతూనే వచ్చాను. అయితే ఇటీవల రామమూర్తి పంతులుగారికి రాసి యీ విషయం పరిష్కరించుకోవాలనుకుంటూ దీని సందర్భంలో కూడా శ్రద్ధ చెయ్యలేకపోయాను.

“రాశాను”

“కోసెడు దూరం”

“బాగా వుంది”

“అది చూసి వొకడు”

ఇలా రాయడం మంచిది కాదంటారు కృష్ణారావు పంతులుగారు. “వ్రాశాను” “క్రోసెడు దూరం” “బాగా ఉంది” “అది చూసి ఒకడు” అనకూడదా అంటారు వారు. “అసలు వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన రామమూర్తి పంతులుగారు మీరు రాసినట్టూ రాస్తారా?” అనికూడా అడిగారు.

రామమూర్తి పంతులుగారికి నేను రాసి చూపించిన విషయం యిదీ. దీని మీద పంతులుగారిలా సెలవిచ్చారు.

“సుబ్రహ్మణ్యశాస్త్రి రాసినట్టు రామమూర్తి రాయడు. రామమూర్తి రాసినట్టూ సుబ్రహ్మణ్యశాస్త్రి యెందుకు రాయాలీ? కృష్ణాగారిని మీరిలా అడగండి. నేనడగమన్నానని మరీ అడగండి. ఇందులో వున్న కిటుకేమిటంటే? నేను రాయమన్నది శిష్ట వ్యావహారికం. శిష్టులందరూ “రాశాను” అంటారు కాన “వ్రాశాను” అనరు. అనకపోతే లోపమున్నూ లేదు. నేను గ్రాంథికంలో పుట్టి పెరిగాను. ఆ వాసన యింకా నన్ను వదలలేదు. పూర్వులు వ్యాఖ్యానాలు వగైరాలలో వాడిన శబ్దాలను వాడడమే నాకలవాటయింది. మీరు శిష్ట వ్యావహారికాన్ని స్వీకరిస్తున్నారు. అది చాలా మంచిపని. నేనలా రాయకపోయినా మిమ్మల్ని ఆక్షేపించను. మీ రచనలలో జాతీయత వుంది. మీరు వాడే శబ్దాల వల్ల ఆ జాతీయతకేమీ భంగం కలగడం లేదు. శిష్ట వ్యావహారంలో వున్న భాష వాడాలి అని మీరు జ్ఞాపకం వుంచుకున్నంత కాలమూ మిమ్మల్ని నేనేమీ ఆక్షేపించను.”

ఈ సమాధానం కృష్ణారావు పంతులు గారి కిష్టమవుతుందో కాదో నేను చెప్పలేను; కాని నాకు మాత్రం చాలా వుత్సాహం కలిగించింది.

ఈ సమయంలో “వంట అయిం”దని మాతృశ్రీగారి దగ్గరనుంచి కబురు వచ్చింది. ముడికట్టుకుని యిద్దరమూ భోజనాల గదిలోకి వెళ్ళాము.

భోజనానంతరం మళ్ళీ మేడమీదకి వెళ్ళాము. పంతులుగారు ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మనీ వగైరా పాశ్చాత్య భాషల గ్రంథాలున్న బీరువా తెరిచారు. అందులో వున్నవన్నీ భాషాతత్వ శాస్త్రానికీ, వ్యాకరణానికీ, ఆయా వాఙ్మయాల చరిత్రలకూ సంబంధించిన గ్రంథాలు. నేను యథాలాపంగా వొక పుస్తకం తీశాను. విప్పి చూడగా అది ఫ్రెంచి భాషా తత్వ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం. చాలా విలువయింది. ప్రామాణ్యం కలది కూడానూ. అందులో వొక పేజీ అంతటా పెన్సిలుతో పెట్టిన కొంకిర బింకిరి గీతలున్నాయి. ఇదేమని నేనడగడానికి ముందే పంతులుగారు వాటిని చూపిస్తూ యిలా చెప్పారు.

“మీరు నా కుమారుడు సూర్యనారాయణ నెరుగుదురు. అతని కుమారుడు ఏడెనిదేళ్ళవాడు మీరెరుగుదురు. రాజమహేంద్రవరంలో జరిగిన ఆధునికాంధ్ర సభలో అధ్యక్షుల వారి టేబిలు మీద కూచుని దీక్షితులు గారి లీలాసుందరి కథ చదివాడు. ఏం? బాగా జ్ఞాపకం …. ….? వాడు గీశాడు ఆ గీతలు, నేనోనాడు దీక్షగా వొక పుస్తకం చదువుతున్నాను. పక్కని కూచుని యెప్పుడు తెరిచాడో యిది చల్లగా గీసేస్తున్నాడు. నేను చూశాటప్పటికాక పేజి నిండిపోయింది. కాస్త ఆలస్యమయితే; మరో పేజీకూడా అయిపోవును. అయితే నన్ను చూసి, వాడు, తెల్లపోయాడు. ఏం చెయ్యను? పుస్తకం గొప్పది. చేసిన పని కలిసిరాంది. చేసినవాడు మనవడు. కోపం వచ్చింది. కాని వాత్సల్యంలో లీనం అయిపోయింది. చెయ్యెత్తాను, కాని వేళ్ళు వాడి ముంగురులు సవరించాయి. ఇంకెందుకూ? కొట్టలేకపోయాను. గదుమలేకపోయాను. కళ్ళెర్రజేయడం కూడా పడింది కాదు కాని కొంతసేపటికి గాంభీర్యం తెచ్చిపెట్టుకుని “శ్రద్ధగా చదువుకుంటానంటే ఈ పుస్తకం చదవగలిగేటంత వరకూ చదువుకుంటానంటే – అప్పుడీ పుస్తకమే చదువుతానంటే నిన్నిప్పుడు కొట్టను. ఏం? ఏమంటావు? ….?” అన్నాను. దీంతో వాడికి ప్రాణాలు కుదుటబడ్డాయి. వెంటనే వాడు చాలా చురుకైన వాడు లేండి. ఉచితానుచితాలు బాగా తెలిసిన వాడవుతాడు. ఏమీ సందేహం లేదు, వెంటనే రెండు చేతులూ జోడించి “చదువుకుంటా” నన్నాడు. నా గాంభీర్యమంతా యేమయిపోయిందో పోయింది. హృదయం ఆనంద మయమయిపోయింది. వెంటనే వాణ్ని వొక్కమాటు వొళ్ళోకి తీసుకుని హృదయాని కదుముకుని “వెళ్ళి ఆడుకో” అన్నాను వాడికి కూడా భయం పోయి ఉత్సాహం కలిగింది. వెంటనే యెగురుతూ దుముకుతూ కిందికి వెళ్ళిపోయాడు. వాడెప్పుడేనా యీ బీరువా దగ్గరకు వచ్చినపుడు ‘ఏమండీ నేను చదువుకునే పుస్తకం యిందులో వుంది కా?’ అంటూ వుంటాడు. నాకేమీ సందేహం లేదు వాడు అంతటివాడవుతాడు.”

ఈ మాటలు చెప్పేటప్పుడు పంతులు గారి కళ్ళలో ఆనందం సుడి తిరిగిపోయింది.

తరవాత వొక్క అరగంటదాకా ఆ మాటా యీ మాటా చెప్పుకున్నాము. ఆ సమయంలో డాక్టరు పోచిరాజు వైకుంఠం పంతులుగారూ, కేంబావి శ్రీనివాసరావు పంతులుగారు వచ్చారు. నలుగురమూ డాబామీద కూర్చున్నాము. పంతులుగారు వారికి నా సంగతి స్వయంగా చెప్పారు. నేను రాసిన ప్రేమపాశం సంగతి యెత్తుకుని దానిని గురించి వారితో చాలా ప్రీతితో మాట్లాడారు. మరికొంతసేపటికి పంతుళ్ళ వారిద్దరూ కచేరీలో పనివుండి వెళ్ళిపోయారు. రామమూర్తి పంతులు గారు చెప్పగా వారి వెనకనే నేను వూళ్ళోకి వెళ్ళాను.

నలుగురు యువకులు కొత్తగా చందాదారులయినారు. డాక్టరు పోచిరాజు వైకుంఠం పంతులుగారు ఐదురూపాయిలు విరాళం యిచ్చారు. జి. భాస్కర రామచంద్రరావు (ఉలవభద్ర) దొరగారూ, కేంబావి శ్రీనివాసరావు పంతులుగారూ విరాళాలు వాగ్దానం చేసి “వారం పదిరోజుల్లో పంపుతా” మన్నారు.

పొద్దుగూకింది. చీకటిపడింది. బసకి వచ్చాను. పంతులుగారు లఘువుగా ఫలహారమూ, నేను భోజనమూ చేశాము.

మళ్ళీ యథాప్రకారంగా మేడమీదకి వెళ్ళాము.

ఎందరో పండితుల ప్రస్తావన వచ్చింది. పంతులుగారు, ఆ పండితుల అపప్రయోగాలు వివరిస్తూ ఎంత విలువయిన పాఠాలో చెప్పారు.

మాటలో మాట మన తెనుగువారి దేశసేవ ప్రస్తావన వచ్చింది. ఎన్నో సంగతులు వెళ్ళిపోయాయి. ఈ సందర్భంలో పంతులుగారు హృదయవిదారకమైన వొక సంగతి సెలవిచ్చారు.

అది తలుచుకుంటే యిప్పటికీ ఒళ్ళు జలదరిస్తోంది.

ఓఢ్రుల దురాక్రమణ సందర్భంలో మనం చూపిన ఔదాసీన్యం వల్ల కాంగ్రెస్సు పేర ప్రదర్శించిన చచ్చు ఔదార్యం వల్ల శుద్ధాంధ్ర సోదరీసోదరులు సుమారు మూడులక్షలమంది ఓఢ్ర రాష్ట్రంలోకి లాగివెయ్యబడ్డారు.

దీనివల్ల వచ్చిన ఆపత్తేమిటంటే?

మనతోపాటు మెజారిటీ సౌకర్యాలనుభవించవలసిన మూడులక్షల తెనుగు వారు ఓఢ్రుల పంజాలో చిక్కుకుని మైనారిటీలో పడిపోయారు. తద్వారా – యిక్కడ – మనకి కూడా అరవల యెదట మైనారిటీ వచ్చింది.

ఇంతేకాదు

దీనివల్ల మానధనులైన శ్రీరామమూర్తి పంతులుగారికి, నమ్మి, ప్రాయం అంతా గడిపిన వూళ్ళో – పదివేలు పోసి కట్టుకుని యాభైయేళ్ళ నుంచి కాపరం వున్న యింట్లో వుండే యోగం లేకుండా పోతోంది.

సంగతేమింటే?

1936వ సంవత్సరం ఏప్రిల్ నెల మొదటితేదీని పర్లాకిమిడి పట్నం ఓఢ్ర రాష్ట్రంలో చేరిపోతుంది. అయితే పంతులుగారు ఓఢ్ర రాష్ట్రీయ పౌరులనిపించుకోవడానికిష్ట పడడం లేదు.

వారు సెలవిచ్చిం దిదీ.

“కొన్ని గడియలనూ ఓఢ్ర రాష్ట్రీయఛ్ఛాయ అలుకుముకుంటుందనగా నేను, పర్లాకిమిడి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోకి వచ్చేస్తాను. అయితే పర్లాకిమిడి స్టేషన్‌లో రైలెక్కాను. పాతపట్నం వెళ్ళి, ఏటిలో స్నానం చేసి, పర్లాకిమిడి మళ్ళీ మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప లేకపోతే ఆ వూళ్ళో; బతికివుండగా నేనా వూళ్ళో అడుగుపెట్టనని కంకణం కట్టుకొని రైలెక్కుతాను. అయితే, రైలెక్కి ఏవూరు వెళ్ళడం? ఈ వృద్ధాప్యంలో నాకెక్కడ సుఖంగా వుంటుందీ? భాషా పరిశ్రమ చేసుకోడానికి నాకేవూళ్ళో అవకాశాలున్నాయీ?”

పంతులుగారు తలవూపుతూ ప్రశ్నార్థకంగా చూశారు.

వెంటనే నేను, మా రాజమహేంద్రవరం దయచెయ్యవలసిందని ప్రార్థించాను. “మా వూళ్ళో గౌతమి పేరిట పెద్ద పుస్తక భాండాగారం వుంది. మీ కుమారుడు గారు మా వూళ్ళోనే ఉద్యోగంలో వున్నారు. తాను గీతలు గీసిన ఫ్రెంచి పుస్తకం పెద్దపెరిగాక చదువుతానని మాట యిచ్చిన మీ మనుమడు కూడా మావూళ్ళో వున్నాడు. మీ శిష్య పరమాణువులం మేము కూడా ఉన్నాము. గోదావరి ఒడ్డు కావాలంటారా, ఇన్నీసు పేటలో వుండండి. విశాలమైన వీధులతో జనసమర్థం లేని స్థలం కావాలంటారో దానవాయి గుంటలో వుండండి, దీక్షితులు గారు షష్ఠి గడియలూ మిమ్మల్ని కనిపెట్టుకునే వుంటారు. గౌతమీ భాండాగారం దగ్గిరకూడా చాలామంచి యిళ్ళున్నాయి. మీ యిష్టం. రాజమహేంద్రవరమే మీరు దయచెయ్యాలి” అని నేను మరీ మరీ కోరాను.

పంతులుగారు తలవూపారు. బాగుందన్నారు. ప్రస్తుతం అంతకంటె మంచిది కనపడ్డంలేదని కూడా అన్నారు.

విశాఖపట్నంలో, కవిగారి షష్టిపూర్తి మహోత్సవ సభలో వుపన్యసిస్తూ సభలో కూచునివున్న డాక్టరు పాలకోడేటి గురుమూర్తి పంతులుగారినీ ఆగ్రాసనంలో వున్న న్యాపతి సుబ్బారావు పంతులుగారినీ సంబోధించి నేనీ సంగతి చెప్పాను.

పంతులుగారి శపథం విన్నప్పుడు నిజంగా నాకు శరీరం అవశ్యం అయినట్లయి పోయింది.

ఏమనుకుంటే యేముంది?

తెనుగువాడిప్పుడు భావదాస్యంలో మగ్గిపోయి ఆత్మగౌరవం యెరక్కుండా వున్నాడు. పాము నోట్లో వున్న కప్ప కబళించే దోమగా వున్నాడు.

ఆ రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు.

మర్నాడు యిరవై అయిదో తేదీ వుదయం ఎనిమిది గంటలవేళ పంతులుగారికి పాదాభివందనం చేసి, మాతృశ్రీ గారికి కూడా నమస్కారాలు చెప్పుకుని, ఆ గురు దంపతుల దీవెనలు శిరసావహించి, స్టేషనుకి వచ్చి రైలెక్కాను.

రైలు కూడా నాలాగే మందకొడిగా వుండి ఎనిమిది గంటలకు పర్లాకిమిడిలో బయలుదేరింది. పదికొట్టాక నౌపడా స్టేషను చేరింది.

– శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

[ప్రబుద్ధాంధ్ర 10 డిసెంబర్ 1935 (6వ సంపుటం, 12వ సంచిక)].

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here