రామప్ప కథలు-3

0
8

[బాలబాలికలకు కాకతీయుల చరిత్ర, రామప్ప దేవాలయం గురించి కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి డి. చాముండేశ్వరి.]

గణపతి దేవ మహారాజు

[dropcap]కొ[/dropcap]ద్దిరోజుల విరామం.. గ్యాప్ తరువాత మదనిక ఎప్పటిలా సువాసనలు వెదజల్లుతూ గాలిలో తేలుతూ వచ్చింది. మంచి నిద్రలో ఉన్న రవి చలికి.. బ్రైట్ లైట్‌కి మెలకువ వచ్చింది. మదనిక వచ్చిందని అర్థం అయింది.

రీడింగ్ టేబుల్ చైర్‌లో కూర్చున్న మదనిక చిరునవ్వుతో “మిత్రమా! రవీ, కుశలమా? బహుకాల దర్శనం. వందనం” అంది.

“హలో మదనికా! Good to see you. సింపుల్ తెలుగులో మాట్లాడు.”

“అటులనే. సారీ సారీ! కాలప్రభావం. సర్లే. నువ్వు అడిగిన మా కాకతీయ మహారాజు గణపతి దేవుని గురించి నాకు తెలిసింది చెప్పాలని వచ్చాను. రవీ! నీకు కాకతీయుల గురించి తెలుసుకోవాలని ఎందుకింత ఇంట్రెస్ట్/ఆసక్తి?”

“మదనికా! కాకతీయులు పరిపాలించిన ప్రాంతంలో ఉన్నా కూడా మాకు తెలిసింది చాలా తక్కువ. స్కూల్ పిల్లలతో టూర్ వెళ్లినా, నేను తెలుసుకున్నది తక్కువే. నువ్వు చెబుతున్న కథలు నేను బుక్‍లో రాసిపెడుతున్నా, మర్చిపోకుండా. ఏదో ఒక రోజు బుక్‌లా పబ్లిష్ చేస్తాను అందరికి తెలిసేలా” అన్నాడు ఉత్సాహంగా రవి.

రవి ఆసక్తి, ఉత్సాహం చూసి ముద్దుగా చెంప నిమిరింది.

“రవీ, అందరు అనుకున్నట్లుగా చరిత్ర అధ్యయనం/చదవటం, తెలుసుకోవటం వేస్ట్/వృథా కాదు. గతం/చరిత్ర సరిగా తెలుసుకుంటే వర్తమానం, భవిష్యత్తుకు ఎలాంటి మార్పు అవసరమో అర్థం అవుతుంది. అప్పటి ప్రజలు, వృత్తులు, జీవనం, సంసృతి, నిర్మాణాలు, యుద్ధాలు తదితర వివరాలు తెలుస్తాయి. యుద్ధం ఎంత వినాశనం కలిగించిందో తెలుస్తుంది.”

“మదనికా! కథ మొదలుపెట్టు. ప్లీజ్”

“విను. కాకతీయ పాలకుల్లో గణపతి దేవుడు ప్రసిద్ధి. ఏకబిగిని 60 ఏళ్ళు పాలించాడు. వివిధ రాజుల పాలనలో ఉన్న తెలుగు ప్రజలను ఒక్క పాలన కిందకు తెచ్చాడట.”

“గ్రేట్.”

“క్రీ.శ. 1195లో దేవగిరి రాజైన జైత్రపాలుడు కాకతీయ రాజైన రుద్రదేవునితో యుద్ధం చేసి అతన్ని చంపాడు. ఆ యుద్ధంలో చిన్నవాడైన గణపతి దేవుని బందీగా తీసుకు వెళ్ళాడట. నీకు తెలుసా? యుద్ధ ఖైదీల పరిస్థితి ఎలా ఉంటుందో?”

“తెలుసు. అర్థం చేసుకోగలను. చాలా బాధలు పెడతారట. ఇప్పటికి దేశాల మధ్య అలాగే ఉంది” అన్నాడు రవి.

“ఏమిటో? మా కాలంలో యుద్ధాలు, కష్టాలు చూసి శాంతిని కోరుకున్నారు ప్రజలు. నిజానికి ప్రజలు ఎప్పుడు శాంతిని కావాలంటారు. ఇక ముందు యుద్ధాలు లేని రోజులు ఉంటాయని అనుకున్నాము. అది నిజం కాదని తెలిసింది.” అంది నిరాశగా.

రవికి ఏమనాలో తెలీలేదు.

“సరే విను. రుద్ర దేవుని తమ్ముడు మహాదేవుడు అన్న ప్లేస్‌లో రాజు అయ్యాడు. యుద్ధంలో బందీగా అయినా తన కొడుకు గణపతి దేవుని విడిపించడానికి దేవగిరి పైకి యుద్ధానికి వెళ్ళాడు.”

“Again war? మరి గెలిచాడా? గణపతి దేవుని విడిపించారా?” అడిగాడు రవి.

“కొడుకుని విడిపించాడు. పాపం ఆ యుద్ధంలో మహాదేవుడు చనిపోయాడు. విడుదలైన గణపతి దేవుడు రాజయ్యాడు. మహాదేవుని స్వల్ప కాల పాలనలో యుద్ధాల వల్ల రాజ్యంలో చాల అశాంతి, ఆందోళన వచ్చిందిట.”

“అయ్యో. పాపం”

“కాకతీయుల సేనాధిపతి రేచర్ల రుద్రుడు తన శక్తి సామర్థ్యాలతో రాజ్యాన్ని కాపాడి గణపతి దేవుడు రాజుగా మంచి పాలన చేసేలా సాయపడ్డాడు. గణపతి దేవుని పాలనలో వ్యవసాయం, వర్తకం బాగా అభివృద్ధి చెందాయి. వర్తకులను ఎగుమతి దిగుమతుల విషయంలో బాగా ప్రోత్సహించాడు. తన కాలం లోనే ప్రజల క్షేమం కోసం రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చాడు. రాజ్యంలో అనేక గొలుసు చెరువులు తవ్వించాడు. పాకాల, గౌడ సముద్రం చెరువులు అతని సేనానులు తవ్విచారు. యథా రాజా తథా ప్రజా అని నానుడి. అంటే పాలకుడు మంచి పనులు చేస్తో ప్రోత్సహిస్తే, ప్రజలు రాజుని అనుసరించి మంచి నడవడితో ఉంటారని” అంది మదనిక.

“మదనికా! కాకతీయులు ఇరిగేషన్‌కి చాల ఇంపార్టెన్స్ ఇచ్చారు. గ్రేట్” అన్నాడు రవి.

“అవును. వ్యవసాయం లాభసాటి పండగలా ఉండాలంటే నీటి లభ్యత చాలా అవసరం అని తెలిసిన పాలకులు” అంది.

“మదనికా! గణపతి దేవుని పాలనలో యుద్ధాలు జరగలేదా? Kingdom ని expand చెయ్యలేదా?”

“గణపతి దేవుడు అందరి రాజుల వలే రాజ్య విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. సైనికులకు చక్కని శిక్షణ ఇచ్చి, సైనిక బలాన్ని పెంచాడు. క్రీ. శ. 1201లో, తరువాత బెజవాడ, దివి సీమ, వెలనాడు తూర్పు తీరంలో, కృష్ణ గోదావరి గుంటూరు ప్రాంతాలను, నెల్లూరు రాయలసీమ తదితర ప్రాంతాలను జయించి తెలుగు ప్రాంతాలను ఒక పాలన కిందకు తెచ్చాడట. విదేశీ వ్యాపారంలో కూడా వారు పేరుపొందారు. మోటుపల్లి, మసులీపట్నం రేవుల ద్వారా చీని చీనాంబరాలు దిగుమతి అయ్యేవి”

“చీని చీనాంబరాలు? అవేంటి?” అన్నాడు రవి

“చీని దేశం నుండి వచ్చిన పట్టు బట్టలు. నీకు తెలీదా?”

“ఓహ్! చైనా సిల్క్.”

“మన దగ్గర నుండి విదేశాలకు మంచి ముత్యాలు, దంతాలు, వజ్రాలు, అద్దకం వస్త్రాలు, తివాచీలు, కంబళ్ళు, ఇనుము, ఉప్పు ఎగుమతి అయిన ముఖ్య వస్తువులట. ప్రజలు అందరు సుఖంగా ఉన్నారు. గణపతి దేవునికి కొడుకులు లేరట. ఆయనకీ, ప్రజలకు అదొక పెద్ద బాధ. ప్రజలకు గణపతి దేవుని తరువాత పాలన ఎవరికి సొంతం అవుతుంది? ఎలా ఉంటాము? అని భయం ఉండేది. గణపతి దేవుడు తన తరువాత రాజ్యం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండాలని తన పెద్ద కూతురైన రుద్రాంబను మహారాణిగా ప్రకటించాడు. ఆమె చిన్నతనం లోనే అనేక యుద్ధ, రాజ విద్యలు నేర్చుకుని మహారాజుకి తోడుగా పాలనలో పాలుపంచుకుంది.”

“రుద్రంబా? రాణి రుద్రమ దేవి కదా” అన్నాడు రవి.

“అవును. ఓహ్. తొలిపొద్దు పొడిచింది. Sunrise అయింది. నేనిక వెళ్ళాలి” అంటూ మదనిక వెళ్ళిపోయింది రవి చెప్పేది వినకుండా.

రవి మదనిక రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here