యువభారతి వారి ‘రామాయణ సుధాలహరి’ – పరిచయం

0
11

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

రామాయణ సుధాలహరి

[dropcap]ఉ[/dropcap]త్తమ సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అనువైన పరిస్థితులను కల్పించగలిగినప్పుడే, సమాజంలో ప్రతిభకు సరైన స్థానం లభిస్తుంది. పరస్పరావగాహన సమాజంలో పెంపొందుతుంది. ప్రతి వ్యక్తిలోని పార్ధక్యం దేశానికీ, జాతికీ ఉపయోగ పడుతుంది. ఈ లక్ష్యంతో యువభారతి, యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉపన్యాసాల ద్వారా, వ్యాస సంకలనాల ద్వారా ప్రాచీన అర్వాచీన సాహిత్యాచార్యుల గ్రంథ ప్రచురణల ద్వారా, తోచిన మేరకు, చేయగలిగినంత మేరకు, సాహితీ సేవ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో, యువభారతి పదమూడవ వార్షికోత్సవాల సందర్భంగా రూపొందించిన కార్యక్రమమే – ‘రామాయణ సుధాలహరి’.

భారతీయ ఆత్మను అవగాహన చేసుకోవడానికి రామాయణ కావ్యాధ్యయనం అనివార్యం. ప్రపంచానికే అది ఆదికావ్యం. ఈ కావ్యం ప్రతిపాదిస్తున్న ఆదర్శాలను పరిణత మనస్కులు ఇప్పటికీ సమాదరిస్తున్నారు. భారతీయుల కుటుంబ వ్యవస్థలో, సాహిత్యంలో, సాంఘిక జీవితంలో, రామాయణ కావ్యం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో తన ఉనికిని కనబరుస్తూనే ఉంటున్నది.

భారతీయ భాషల్లో నిన్న మొన్నటిదాకా వచ్చిన సాహిత్యాలకి ఇది అంతస్సూత్రంగా భాసించింది. ఇప్పటికీ ఈ కావ్యానికి భారతీయులను సమైక్యపరచగలిగే శక్తి ఉన్నది. ఇందులోని సౌందర్యాన్నీ, అనుభూతులనూ, ఉపదేశాలనూ ఎవ్వరూ నిరసించడం లేదు. ఐతే, దేశకాలోచితమైన పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారే గానీ, ఆ కావ్యం ఆచరణీయమనే భావాన్ని తమ రక్తంలోనుంచి తీసివేయలేక పోతున్నారు. అందుకే రామాయణం భారతీయ సాహిత్య శాస్త్ర లక్షణాలకు లక్ష్యప్రాయంగా ఉంటూ వస్తోంది.

రామాయణ భారత భాగవతాలను సహృదయంతో చదవనిదే భారతీయ భాషలకు సంబంధించిన ఏ సాహిత్యాన్నైనా తలస్పర్శిగా అర్ధం చేసుకోలేరనే అభిప్రాయంతో, భారతీయ భాషలలో కొన్నింటిలో వెలువడ్డ రామాయణాల తీరుతెన్నులను గురించి సాధికారకంగానూ, సవిస్తరంగానూ ఉపన్యసించగలిగిన సమర్థులైన పండితులను ఎంచుకుని వారి ద్వారా ఉపన్యాసాలను ఇప్పించింది.

ఈ ఉపన్యాస లహరీ కార్యక్రమాలలో –

వాల్మీకి రామాయణం లోని కవితా పారమ్యాన్నీ, రామాయణ కావ్య ప్రాశస్త్యాన్నీ – ఆచార్య దివాకర్ల వేంకటావధాని గారు ఉగ్గడించారు.

డా. ధూళిపాళ శ్రీరామమూర్తిగారు ఆధ్యాత్మ రామాయణ పఠనం అనివార్యమని నిరూపించారు.

 డా. చల్లా రాధాకృష్ణ మూర్తిగారు తమిళ మలయాళ రామాయణాలను గూర్చి సరసంగా, విజ్ఞానప్రదంగా ప్రసంగించారు.

కన్నడ రామాయణాల లక్షణాలను గురించి డా. బాడాల రామయ్య గారు మహోదాత్తంగా వివరించారు.

హిందీ భాషలో వెలసిన రామాయణాలను గురించి, ప్రత్యేకించి తులసీదాసు రామాయణాన్ని గూర్చి, భక్తిరస ప్రపూర్ణంగా ప్రసంగించినవారు శ్రీ వారణాసి రామమూర్తి ‘రేణు’ గారు.

విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షాన్ని గురించి వివేచనాత్మకంగా ఉపన్యసించిన డా. జి. వి. సుబ్రహ్మణ్యంగారు కల్పవృక్షం ఆధునిక కాలానికి ఆదర్శప్రాయమని నిరూపించారు.

జానపదుల జీవితాల్లో అల్లుకొనిపోయిన రామాయణాలను గూర్చి మధుర గంభీరంగా ప్రసంగించారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

తెలుగులోని రామాయణాలను అపూర్వ పద్ధతిలో విశ్లేషించి, తెలుగువారి ఆరాధ్యదైవం శ్రీరామ చంద్రుడిని వాళ్ళ సాహిత్యంలో ప్రతిబింబించిన తీరును ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు సాక్షాత్కరింప జేశారు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/ramayana-sudhalahari/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here