రామాయణంలో కరప్షను అనగా అవినీతి కథ

4
13

[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘రామాయణంలో కరప్షను అనగా అవినీతి కథ’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]వా[/dropcap]ల్మీకి రామాయణం ఉత్తరకాండకి ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలానందినీ వ్యాఖ్య ప్రకారము 59వ సర్గ తరువాత వరుసగా వచ్చే మూడు ప్రక్షిప్త సర్గలలో ఒక కుక్క ప్రసక్తి వస్తుంది. ఒక రోజు శ్రీరాముడు సభ చేసి యుండగా, అనుజ్ఞ తీసుకొని కుక్క కార్యార్థియై రాజసభలో ప్రవేశిస్తుంది. సర్వార్థసిద్ధుడు అనే బ్రాహ్మణుడు తనని అకారణంగా కొట్టాడని రాజారాముడికి ఫిర్యాదు చేస్తుంది. ఆ బ్రాహ్మణుణ్ణి రాజసభకి పిలిచి విచారిస్తే అతను ఏమి చెబుతాడంటే: “నేను భిక్ష కోసం తిరుగుతుంటే భిక్ష దొరకలేదు. ఆ కోపంలో ఈ కుక్కను కొట్టాను. అది తప్పే. నా అపరాధాన్ని శిక్షించండి. రాజు శిక్షిస్తే, ఇంక నాకు నరకం భయం ఉండదు.”

కుక్కను అకారణంగా కొట్టిన నేరానికి ఏం శిక్ష వేయాలో ఆ రోజుల్లో ఉన్న శిక్షాస్మృతిలో ఉన్నట్లు లేదు (ఈ రోజుల్లో కూడా లేదు). ఈ విషయం మీద సభలో చర్చలు జరిగిన తరువాత చాలా మంది పండితులు, మంత్రులు “బ్రాహ్మణుని దండించకూడదు” అని నసుగుతారు. ఆ మాట విని, ఆ కుక్క “రామా! నువ్వు నాకు వరం ఇవ్వదలుచుకుంటే, ఆ బ్రాహ్మణునికి కాలాంజర క్షేత్రంలో కులపతిత్వము, దేవాలయ మఠాద్యాధిపత్యము ఇవ్వు” అంటుంది. వెంటనే ఆ విధంగా అమలు చెయ్యడంతో, ఆ బ్రాహ్మణుడు సంతోషంతో వెళ్ళిపోతాడు. మంత్రులందరూ “ఇదేమిటి, అది బ్రాహ్మణునికి వరం అవుతుంది కాని, దండన కాదు కదా” అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. అప్పుడు, రాముడు “ఉండండి, మీకు తెలియదు. దీనికి కారణం ఆ కుక్కకే తెలుసు” అని అంటాడు.

ఆ కుక్క అసలు విషయం ఈ విధంగా చెబుతుంది: “రామా! నేను పూర్వజన్మలో ఆ క్షేత్రంలో కులపతిత్వం చెయ్యబట్టి, ఈ జన్మలో కుక్కని అయ్యాను”. మఠాధిపతిగా, దేవతా బ్రాహ్మణుల పూజ అయిన తరువాత మిగిలిన దాన్నే తినేవాడిననీ, దాసదాసీజనానికి అన్నాదులు ఇస్తూ మంచి బుద్ధితో దేవతాద్రవ్యాన్ని రక్షించేవాడిననీ, సమస్త ప్రాణుల యందు దయగా ఉండేవాడిననీ, అంత పవిత్రంగా జీవితం గడిపినా కూడా తనకు తరువాత జన్మలో కుక్కగా అవస్థా అధమగతీ పట్టాయనీ కుక్క చెబుతుంది. అంత జాగ్రత్తగా ఉన్న నాకే కుక్క జన్మ ప్రాప్తం అవగా, కోపిష్టి, అధార్మికుడు, క్రూరుడు, అయిన ఆ బ్రాహ్మణుడు కులపతిగా ఉంటే అతనికి వెనుకటి ఏడు తరాలు రాబోయే ఏడు తరాలు అపవిత్రం అవుతాయి. అందుకని, కులపతిని చెయ్యడం బ్రాహ్మణునికి దండనే కాని వరం కాదు అని కుక్క చెప్పిన దానికి అంతరార్థం. ఇంకా స్పష్టం చేస్తూ కుక్క ఏం చెబుతుందంటే: “ఎట్టి పరిస్థితుల్లోనూ కులపతిగా ఉండకూడదు. ఎవరినన్నా నరకానికి పంపాలంటే, అతనికి దేవాలయాల మీద, గోవుల మీద, బ్రాహ్మణుల మీద పెత్తనం ఇవ్వాలి”. ఆ మాటలు విని రాముడితో పాటు సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు.

దీన్ని బట్టి మనకి ఏమి అర్థం అవుతుందంటే, దేవాలయాలు, ఇంకా ఇతర ఉమ్మడి ఆస్తులు (సంఘానికి చెందినవి) లాంటి వాటి మీద పెత్తనం చేసే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో సమయంలో వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగించడం జరుగుతుంది. తెలిసో తెలియకో ద్రవ్యాన్ని హరించడమో, తినడమో, నాశనం చెయ్యడమో కులపతిగా ఉంటే చెయ్యడం జరుగుతుంది. అదే వాళ్ళ కొంప ముంచుతుంది.

ఈ కథ రామాయణంలో ప్రక్షిప్తము, అంటే, కేవలం కల్పితం, తరువాత చేర్చబడినది, అని అనుకున్నా సరే మంచి సందేశం, ఈనాటికీ పనికొచ్చే విధంగా, ఇస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో (Endowments Department) పని చేస్తే, అతి జాగ్రత్త అవసరం. రోజూ దేవుని ప్రసాదం తీసుకున్నా కూడా తప్పేనేమో. ఆ మాత్రం దానికే, తరువాతి జనంలో కుక్కగా పుడతామేమో అన్న భయం వేస్తుంది.

దేవతాద్రవ్యము తెలియక హరించినా (ఉదాహరణకి ప్రసాదం రోజూ తిని), తెలిసి హరించినా పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. తెలిసి హరించే మార్గాలు ఎన్నో. దేవాలయ వ్యవహారాల మీద పెత్తనం చేసేటప్పుడు, దేవాలయ ఆస్తులకి సంబంధించిన అవకతవకలు, దేవాలయ ప్రసాదాల తయారీ – వితరణలకి సంబంధించిన లాలూచీలు, దర్శనానికి సంబంధించిన వ్యవహారాల్లో చూపించే బంధుప్రీతి మరియు ఇతరములైన అవినీతులు, ఇలాంటివి ఎన్నో చెప్పొచ్చు, ఇప్పటి పరిస్థితుల్లో.

కుక్కని అకారణంగా కొట్టడానికి శిక్ష మన శిక్షాస్మృతిలో ఇప్పటికీ లేదుగానీ, పైన పేర్కొన్న తెలిసి చేసే తప్పులకి మాత్రం తగిన శిక్షలు ఉన్నాయి. కాకపోతే, రామాయణంలో బ్రాహ్మణుడి లాగా “నేను తప్పు చేశాను, నన్ను శిక్షించండి, నేను ఇక్కడే శిక్ష అనుభవిస్తే నాకు మరణించిన తరువాత నరక బాధ తప్పుతుంది” అని నిజాయితీగా అనేవాళ్ళు మనకి కనపడరు.

అయితే, జరిగిన తప్పుని తప్పుదోవ పట్టించడానికి మాత్రం చాలా మంది తయారు. ఈ మధ్య తిరుపతి లడ్డూలు తయారు చేసే నేతిలో కల్తీ జరిగిందన్న వివాదం బయటకు వచ్చింది. ఈ కల్తీ అన్నది మనం మొదటిసారి వింటున్నది ఏం కాదు. దీని మీద విచారణ జరిగి అసలు నిజాలు వెలికి వచ్చే లోపే మన హడావిడి మనది. కోడి పందాల్లో పై పందాలు వేసే వాళ్ళ లాగా రకరకాల కోణాలు అన్వేషించి తెర మీదికి తీసుకొస్తాము. ఏ మతమూ కల్తీ చెయ్యమని చెప్పదు అని తెలిసినా మనం మతాన్ని తీసుకొస్తాం, దీన్లోకి. ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి మతం, కులం ఏమిటి అని ఎవరూ ఆలోచించ రెందుకని? అదీ కాక, తిరుపతి లడ్డూలో జరిగింది మనం ఇంట్లో తినే వంకాయ కూరలో జరిగితే పరవాలేదా. కల్తీ నూనో నెయ్యో తయారు చేస్తే పరవాలేదా, తిరుపతి లడ్డూలో వాడడమే అభ్యంతరమా? అసలు కల్తీ వస్తువులు తయారు చెయ్యడానికి అనుమతి ఎవరు ఇచ్చారు, ఎన్నాళ్ళుగా సాగుతోంది అని ఎవరూ ఆలోచించరే? కల్తీ నూనో నెయ్యో తయారయిన తర్వాత తిరుపతి లడ్డూలో వాడనివ్వక పోతే, వేరే ఎక్కడ వాడనిస్తారు? అసలు సమస్య, కల్తీ గురించి గాని, తిరుపతి లడ్డూ గురించి కాదని గ్రహించరేం? రామాయణంలో కుక్క చేసిన హెచ్చరికలు మనకి గుణపాఠాలు కావా?

రిఫరెన్సు గ్రంథాల జాబితా:

వాల్మీకి రామాయణం ఉత్తరకాండకి ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలానందినీ వ్యాఖ్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here