రామ్ములక్కాయ!

0
7

[box type=’note’ fontsize=’16’] కన్యాశుల్కం గిరీశం – బుచ్చమ్మల కల్పిత సంభాషణను అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ. [/box]

ములగంత పచ్చలును కావెటు
ములగంత నిడువులు కావు
గోళములైన ఈ ఎర్రని పండ్లు
ఏలర రామ్ములగలాయె రామా?!

అని చదువుకుంటూ వస్తున్న గిరీశం, బావి దగ్గర ఉన్న బుచ్చమ్మతో మాట కలుపుతాడు.

గిరీశం: చూశారా వదినా  అరణ్యవాసంలో సీతాదేవికి దేనితో సరి పెట్టుకోవాల్సొచ్చిందో! మేలిరకం వంటలతో పంచభక్ష్యపరమాన్నాలతో భోంచేయాల్సిన మనిషి పాపం ఈ రామ్ములక్కాయలతోనా?!! విరివిగా కాసేవేమో, మనవాళ్ళు రాముల వారి పేరే పెట్టేసినట్లున్నారు దీనికి!!

బుచ్చమ్మ: అయితే ఇవి దేవుళ్ళు తిన్న కాయగూరలంటారుటండీ, గిరీశం గారూ!

ఏమోలెండి, అయ్యే ఉంటుంది! మీలాంటి చదువుకున్న వాళ్ళు చెపితే తప్ప, మా బోంట్ల కేం తెలుస్తయి విషయాలు!!

రాముల వారు అంత ఇష్టంగా తినే వారు కాబోలు! పాపం ఏం చేస్తారు, ఉన్నదాంతో సరిపెట్టుకోక!

ఆ తట్టూ, ఈ తట్టూ తిరిగి కోసుకొచ్చేదేమో ఓ పది కాయలు తట్టలో పాపం, సత్తెకాలపు ఇల్లాలు!

కరివేపాకు వేసి ఎప్పుడైనా రామ్ములక్కాయ చారు కాచ మనేవారేమో, ఆ అడవుల్లో చికాగ్గా ఉన్న వేళల్లో! ఆ అడవుల్లో నేవళంగా ఇంత కరివేపాకు దొరికేదో లేదో ఆమె గారికి పాపం!

సీత కష్టాలు సీతవి!

పొలంలో దొరికిన మహాలక్ష్మి, చివరకు వనంలో కూరగాయలు కోయాల్సొచ్చింది!

గిరీశం: అదేం లేదు వదినా, తోడుగా లక్ష్మన్న వెళ్ళేవాడుగా నిత్యం, ఏమీ భయం లేకుండా!

అయ్యో, స్పష్టంగా రాసుంది, వాల్మీకి రామాయణం అరణ్యకాండ, నాల్గవ సర్గ రెండవ శ్లోకంలో! చదవమన్నారా?!

బుచ్చమ్మ: దాని అవసరం ఏముందిలెండి,, అన్నీ చదివిన మీరే చెపుతుంటే, ఉండే ఉంటుందిలెండి, నాకు  నమ్మకమే!!

గిరీశం: ఉంది కదా, హమ్మయ్య, అదే నాక్కావలసింది. అయిన వారు నమ్మితే చాలదుటండీ! కొండంత బలమదే!!

లోకందేముంది,అది ఎప్పుడూ పని లేని కోడే, చెవి కోసిన మేకే! కూస్తూనే ఉంటుంది అదే పనిగా అరుస్తూనే ఉంటుంది!

మన లాంటి ఖలేజా ఉన్న మనుషులు పట్టించుకోనవసరం ఏముందీ?! బేఖాతరే!!

బుచ్చమ్మ: ఏమోనండీ గిరీశం గారూ, మీ మాటలు వింటూంటే అన్నీ నిజమే ననిపిస్తాయి కానీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ మా ఆడవాళ్ళకు కష్టాలు తప్ప ఏం రాశాడండీ ఆ బ్రహ్మ దేవుడు!

ఈ సీతమ్మ ఇట్లా రామ్ములక్కాయల సహాయము తీసుకోవాల్సొచ్చింది కాస్త అన్నం లోకి ఆధరువుకి!

మహరాణి కాదుటండీ వాళ్ళ నాన్న ఇంట్లో, ఆమెకీ అవస్థా?!

ఇంక ఆ ద్రౌపది పడ్డ కష్టాలు చెప్పనే వద్దండీ గుండె తరుక్కుపోతుంది! అప్పుడెప్పుడో మా చెల్లి, సుబ్బి పురాణంలో విని చెపితే తెలిసింది లెండి! నా మొహం, నే వీథిలో కెళ్ళి ఏళ్ళౌతోంది!!

గిరీశం: ఆగండి,ఆగండి, వదినా! అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. బ్రహ్మ ఎవరండీ బ్రహ్మ! ఉత్త బొమ్మ! అంతా చేస్తోంది మీ నాన్న లాంటి మగ రాయుళ్ళండీ!!

దీని మీద కాదూ నేను కిందటేడు, సురేంద్రనాథ బెనర్జీ, ఆ బంగాళ దేశంలో లాగా, మన విసాపట్నంలో 2 గంటలు లెక్చరు ఇస్తా,గుక్క మంచినీళ్ళైనా పుచ్చుకోకుండా!!

లోతులు మీకు అర్థం కావు గానీ సూక్ష్మంగా చెపుతాను వినండి వదినా! పరమ రహస్యం,ఇంత దాకా మీ చెవిన ఎవ్వరు వేసి ఉండరు!!

ఈ లోక వ్యవహారం ఆంతా ఒక దగా చట్రం!!ఇక్కడ జరిగేదంతా అవతలి వాళ్ళను పీడించటమే!

డబ్బున్న వాడు లేనివాడినీ, తెలివి గలవాడు తెలివి తక్కువ వాణ్ణీ, బలమున్నవాడు బలహీనుణ్ణీ, మగవాళ్ళు ఆడవాళ్ళనీ – ఇదే తంతు!

అందుకేగా నా లాంటి వాళ్ళం నడుము కట్టాం స్త్రీ జనోధ్ధరణకై! స్త్రీలు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి ఊళ్ళూ ఏలాలి. ఆప్పుడు,అప్పుడే నా లక్ష్యం నెరవేరినట్టు.

మనుషుల్నీ, రాజ్యాలను, రాజులను, రాజకీయాలను చదివి, నమిలి, అరిగించేసుకున్న వాడి మాటలివి సుమా! గుర్తుంచుకోండి, అక్షరం పొల్లు పోని నికార్సైన సత్యాలు!

అసలు మనుషులేమిటండీ నా యీ సిధ్ధాంతానికీ ఆ దేవతలు,పురాణాలు అన్నీ లోబడి రావాల్సిందే!

అదెలాగా అంటారా వినండి కొసంటా చెప్పేస్తే కానీ నాకూ “తసల్లీ” గా ఉండదు.

ఓహో గబుక్కున నిజామీ మాట దొర్లింది, తస్సాదియ్యా! ఏం లేదు వదినా, నైజాము నవాబుతో లావాదేవీలు ఉన్నవాడిని కదూ, ఆ లష్కరీ జుబాన్ వచ్చేసింది!

తసల్లీ అంటే తృప్తి అని! అహ, మీకు సమస్తం అర్థం అవ్వాలని వివరిస్తున్నాను!

ఇంతకీ ఎక్కడున్నాము?! ఆఁ, మన పురాణాల దగ్గర!

అమృతం అంతా కలిసే కదండీ చిలికారు, మరి సరి సమానంగా రావాలా అక్కర్లేదా, దేవతలకూ రాక్షసులకు వాటా!.

రానిస్తేనా?! ఆ విష్ణుమూర్తి!

మోహినిగా వచ్చి,పిచ్చి సన్నాసులు రాక్షసులను మోసం చేసి చక్కా పోయాడు.

అదిగో అక్కడే నాలాంటి పెద్దమనిషికి కోపం వచ్చేది! మనకు భూమ్మీద మనుషులైనా, పై లోకాల్లో సురాసురులైనా ఒక్కటే! మాటంటే మాటే! నిలబడాల్సిందే!

సరి ఈ ఘట్టం అయిందా, ఆ వామన వటువుగా వచ్చి చేసింది నిలువు దోపిడీ కాదూ!! అప్పటికీ ఆ గురువైన శుక్రుడు హెచ్చరిక చేయనే చేశాడట, తగ్గవయ్య ప్రభో ఆ వచ్చిన వాడు మాయావి, విష్ణువని! వింటేనా ఆ బలి!

మూడు అడుగులే కదా అనుకుని, తనే బలి అయ్యాడు!, మూడు లోకాలూ నష్టపోయాడు, అధః పాతాళానికి తొక్కేయబడ్డాడు!

ఇవన్నీ ఏమిటి చెప్పండి వదినా! మోసాలు కాదూ, ఒకడ్ని ఒకడు దోచుకోవటం కాదూ!!

సరే ఇహ మన,కచ్చేరీల్లో, ఊళ్ళల్లో, పొలాల్లో, ఇళ్ళల్లో నడిచేవి, వాటి ఆను పానులు,లోతుపాతులు, నేను మీ అదృష్టాన మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచీ ఏకరువు పెట్టుతూనే ఉన్నాను. నూరిపోస్తూనే ఉన్నాను.

ఒక్కోసారి కల్కి అవతారం నేనే ఎత్తేసి, కత్తి చేత పట్టుకుని, ఈ అన్యాయాలను రూపుమాపి, తెల్ల గుర్రం మీద సర్రున దూసుకెళ్ళి పోదామన్నంత ఆవేశమొస్తుంది. తమాయించుకుంటాననుకోండి, “బాగుండదు ఎవరు చేసే పనులు వారే చేయాలని!”

పైగా మనమెటో వెళ్ళిపోతే మీరంతా ఏంగాను, అన్న బెంగొకటీ నన్ను కట్టి పడేస్తుంది ఇట్లా!

బుచ్చమ్మ: బాబ్బాబు, అంత పని చేయబోకండి, ఉన్న పళాన! కనీసం మా వెంకటేశం చేత కబురు పెట్టించండి. లేకపోతే నాకు గాభరాగా ఉంటుంది.

గిరీశం: ఏ పని గురించి, మీరంటూంటా?!

బుచ్చమ్మ: అదేనండీ, తెల్ల గుర్రం, కత్తీ……

గిరీశం: మీరు బలే అమాయకులండీ వదినా, నేనేమైనా మీ నాన్న లాంటి కఠినుడినా! అట్లా నమ్ముకున్న వారిని నట్టేట ముంచడానికీ!

నిర్భయంగా ఉండండి. నా సంపూర్ణ సలహా సంప్రదింపులు, లోకజ్ఞాన బోధలూ మీకు అందుతూనే ఉంటాయి!

నా మాటంటే ఇంగ్లాండు రాణి ముద్ర ఉన్న నాణెమే అనుకోండి, తళతళా మెరుస్తూ!

***

అప్పుడే, గంపెడు రామ్ములక్కాయలతో అగ్నిహోత్రావధాన్లు ఇంటికి రావడంతో, బుచ్చమ్మ అందుకోవటానికి వెళ్తుంది. అది చూసిన గిరీశం మెల్లగా తన గదిలోకి జారుకుంటాడు.

“అమ్మాయి బుచ్చమ్మా, మీ అమ్మకు చెప్పమ్మా కాస్త ఘాటుగా రామ్ములక్కాయ చారు తగలెట్టమనీ, తల అంతా నాదుగా ఉంది” అన్న మాటలు గిరీశం చెవులో పడక పోలేదు, అతగాడు “What a Funny Coincidence” అని అనుకోక మాననూ లేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here