రాముడున్నాడు

1
6

[dropcap]గ[/dropcap]త రెండు రోజులు నుంచి ఒకటే బెంగ, రామకోటి రాయడానికి వాడే ఎర్ర రీఫిల్ పెన్‌లు లేవు, రామకోటి లేఖనం ఆగిపోతుందేమో అని. భారం అంతా రాముడి మీద వేసా. బజార్లో దొరకడం లేదు.

ఈ రోజు ఉదయం పూజకి ఇంటిముందున్న పూలు కొస్తుంటే మా వీధిలో ఉంటున్న పుస్తకాలు అంగడి అయన పేపర్ పాల ప్యాకెట్ పట్టుకెళుతూ కనబడ్డారు. అంతే, ఆయన్ని అడిగాను “ఉన్నాయి, పంపుతా” అని పంపారు. అప్పుడనిపించింది రాముడున్నాడు అని.

బాల్యంలో నా 4వ ఏట మా నాన్నగారు నాచే పలికించిన భక్తి మాటలు ‘హరేరామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’.

నేను వెళ్లిన మొదటి గుడి రామాలయం. గుడికి పెద్ద చపటా ఉండేది. చిన్న పిల్లలం అందరం అక్కడ చేరి ఆటలాడుకునే వాళ్ళం. శ్రీరామ నవమి, ధనుర్మాసం బాగా చేసేవారు. పులిహోర చాలా బాగుండేది. బుట్ట బొమ్మలు రాత్రి వాహనాల్లో దేముళ్ళు ఊరేగుతున్నపుడు ఉండేవి. చాలా ఆనందం ఆశ్ఛర్యం కలిగేవి. వాటిని చూడడానికి రాత్రిళ్ళు మా ఇంటికి వచ్చే వరకు నిద్ర పోయే వాళ్ళం కాదు. బియ్యం, బెల్లం ముక్క నైవేద్యంగా ఇస్తే బియ్యం ఉంచుకుని బెల్లం ముక్క ఇచ్చేవారు. అది మేము తిని పడుకునే వాళ్లం రాముణ్ణి తలచుకుంటూ. అలా 5వ తరగతి వరకు ఆ వీధిలో ఉన్నంత కాలం రాముణ్ణి చూసా, ఆటలు ఆడుకుంటూ ఆయన గుడి చప్టా మీద.

మేము సెలవల్లో తాతగారి ఊరుకు వెళుతుండేవాళ్ళం వేసవి కాలం. అక్కడ మా పెదనాన్న గారి పిల్లలు బాబయ్యల పిల్లలతో ఆటలు. నాకు పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అప్పుడప్పుడు చందమామ, బాలమిత్ర చదివే వాణ్ని. మా పెదనాన్న గారు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు. రామ భక్తులు. రోజు ఉదయం 7 నుండి 10 వరకు; స్కూల్ అయ్యాక స్నానం చేసి మడిగా క్రింద కూర్చుని రామకోటి రాస్తూండేవారు. అయన పుస్తక గ్రంథాలయం నిర్వహణ చేస్తుండేవారు. రెండు బీరువాలు నిండా పుస్తకాలు ఉండేవి. ఆయన్ని చదవడానికి పుస్తకం ఇమ్మని అడిగితే బాలల రామాయణం బొమ్మలది ఇచ్చి చదవమన్నారు. చదివాక ప్రశ్నలు వేసేవారు.

అయన నాకు రామకోటి పుస్తకం పెన్సిల్ ఇచ్చి రాయమనేవారు. నేను కూడా స్నానం చేసి తుండు గుడ్డ కట్టుకుని రామకోటి రాసేవాడిని. అయన నాకు రామకోటి పుస్తకాలు ఇచ్చి మళ్ళీ సంవత్సరం పూర్తి చేసి తెమ్మని చెప్పేవారు. వారు మా నాన్నగారికి రాసే ఉత్తరాల్లో “చిరంజీవి కాశి రామకోటి శ్రద్ధగా రాస్తున్నాడని తలుస్తున్నా” అనే వాక్యంతో ముగించేవారు. అయన పేరు వెంకట రమణయ్య గారు. అప్పటి నుంచి రామకోటి రాయడం అలవాటు అయ్యింది.

కాలేజీ చదువులకి వచ్చిన. ఇంట్లో నుండి బయటకి వెళ్లే ముందు ఉదయం రామకోటి రాయకుండా వెళ్లే వాడిని కాదు 108 సార్లు. పరీక్షలలో కూడా వెళ్లే ముందు రామకోటి రాసి సిందూరం ధరించి వెళ్లేవాడిని. పై చదువులకి ఉత్తర్ ప్రదేశ్ వెళ్లినా, రామకోటి పుస్తకం కూడా ఉండేది చెంత. రోజు రాయడం ఆపలేదు.

చదువై ఉద్యోగం కోసం తమిళనాడు, మహారాష్ట్ర వెళ్లినా రామకోటి, రామ మందిరం దర్శనం నా జీవితంలో భాగం అయిపోయాయి. రోజు రామ మందిరం తప్పకుండా వెళ్ళేవాడిని.

రాముడున్నాడు:

పెళ్లి అయ్యింది, రాజమండ్రి రావడం జరిగింది. సాయంత్రాలు రామ మందిరానికి నా పెద్ద పిల్లవాడిని మా ఆవిడని తీసుకొని వెళ్లి వాడిని. ఆవిడ రాలేకపోతే బాబుని తీసుకొని వెళ్లేవాడిని.

ధనార్జన కోసం వేరే దేశం వెళ్ళేటప్పుడు కూడా రామకోటి పుస్తకాలు పట్టుకెళ్లి రాసేవాడిని రోజూ. పూజ మందిరంలో రామ పట్టాభిషేకం ఫోటో చిన్నది పెట్టుకునే వాడిని. సిందూరం వెంట ఉండేది. అది రోజూ ధరించేవాడిని.

ఏదైనా పని అసాధ్యం అనుకుంటే రామబంటును ఆశ్రయించి ఆయనకు రోజు 108 ప్రదక్షిణలు 40 రోజులు చేసేవాడిని.

మా నాన్న గారు చెప్పిన శ్లోకం చదువుతూ ‘అసాధ్యహా సాధక స్వామిన్ అసాధ్యం తవ కిమ్ వదా రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో’ ప్రార్థిస్తే, అంతే కార్యం సఫలం అయ్యేది.

రామకోటి రాస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా అనుకుంటూ రాసేవాడిని. అలా ఒక అలవాటు అయిపొయింది.

రాముడున్నాడు:

రచయిత గొల్లపూడి మారుతీరావు గారు ఒక వ్యాసం రాస్తూ అందులో భద్రాచలం రాముడు గురించి, తరువాత రామకోటి గుడిలో కూర్చుని రాసిన అనుభవం గురించి రాసారు. అంతే రామకోటి పుస్తకాలు నేను రాసినవి పట్టుకుని కొత్త పుస్తకం పట్టుకుని వెళ్లి 3 రోజులు భద్రాచలంలో ఉండి రోజూ 108 సార్లు ప్రదక్షిణ, 25000 రామకోటి రాశా. అది చాలా తృప్తిని కలిగిస్తే మరుసటి ఏడాది కూడా వెళ్లి రామ దర్శనం, రామ కోటి లేఖనం చేశాను.

శ్రీ రామ కర్ణామృతం మీద బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు సందర్భంగా రామకోటి రాయమని ఆదేశించారు. అప్పుడు 12 రోజుల్లో 50000 రాసి భక్తితో నా పాత రామకోటి పుస్తకాలు అర్పించడం జరిగింది ఎందుకంటే వారి సంకల్పం 10 కోటి రామకోటి భక్తులచే వ్రాయించి రాముడికి అర్పించాలని. అందులో భాగం అయ్యాను రాముడున్నాడు అని.

సుమారు 11 వ ఏట ప్రారంభం అయిన రామకోటి లేఖనం ఇప్పటికి 76 లక్షలు పూర్తి అయ్యి 77వ పుస్తకం రాస్తున్న నా 64వ యేట రాముడున్నాడని.

అంతే కాక కోటి రామకోటి లేఖన యజ్ఞం ఓ ఏడాదిలో సంకల్పంగా వాట్సప్ సమూహలు ద్వారా రామ భక్తులు అందరిచేత, మరియు సంస్కృతి పాఠశాలల కార్యకర్తలు, విద్యార్థులు సమిష్టిగా ‘కోటి రామకోటి లేఖనం’ యజ్ఞం గత ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏట అడుగుబెట్టాం.

‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ’ జయ మంత్రం గత ఏడాది 10 కోట్లు సమిష్టిగా జపం చేసి ఈ శోభకృత నామ సంవత్సరం నుండి ప్రతి నెల ‘కోటి జపం’ విజయవంతంగా చెయ్యడం జరుగుతుంది. రాముడున్నాడు.

100వ రామకోటి పుస్తకం నాచే వ్రాయించి నా జన్మ ధన్యం చేసి నాతో అనిపించాలి అప్పుడు ‘రాముడున్నాడని’. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ముగిస్తున్నా – ‘రాముడున్నాడని’.

హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత రామ చంద్రులకు నమస్సుమాంజలి అర్పిస్తూ 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here