రంగేయాలని అనిపించడం లేదు

12
5

[dropcap]త[/dropcap]న చిటికెన వేలినుంచి
నా చేతిని దూరం చేసుకుంటూండగానే
బాల్యం చల్లగా నా నుండి జారిపోయింది
తను చెప్పడం, గద్దించడం మానేసి
చర్చించడం… ఆలోచనలు పంచుకోవడం
నాతో మొదలెట్టిన నాడే
యవ్వనం నాకు టాటా చెప్పేసింది
తను మాట్లాడటం తక్కువ చేసి
నా మాటలు పట్ల మొగ్గుచూపుతూంటే
నడివయసు నా ఒంటి వాకిట్లో
మెల్లమెల్లగా తచ్చాడటం మొదలయ్యింది

అయినా
అప్పుడప్పుడూ, ఎప్పుడో ఒకప్పుడు
నాన్న పక్కన చేరినప్పుడల్లా
పారిపోయిన బాల్యం ఓవైపు నుంచి
దూరమైన యవ్వనం మరో వైపునుంచి
వచ్చి ఒళ్ళో వాలిపోయేవి
జ్ఞాపకాలపందిరి కింద తిష్టవేసుకు కూచుని
అప్పటెప్పటివో ఆనందాలను వెలికితీస్తూ
చిలిపి చేష్టల గురుతుల్ని
చూపిస్తూ … మూసేస్తూ హాస్యాలాడేవి

అది చూసి
పెరిగిన నా వయసు
నాదైన అనుభవము
నే సంపాదించుకున్న హోదా
ఓ మూలన మూతిముడుచుకు కూచుని
ఉరిమురిమి చూసేవి … ఉడుక్కుని చచ్చేవి

ఇప్పుడాయన లేడు
తను ఊతం చేసుకున్న
పెద్దరికపు చేతికర్రను
చెప్పకుండానే నా చేతికప్పజెప్పి
బతుకు బొమ్మలపెట్టెలో
అపుడపుడూ తీస్తూ దాచేస్తూ
జాగ్రత్తగా నేను దాచుకున్న
నా బాల్యాన్ని, యవ్వనాన్ని
నన్నడక్కుండానే తనవెంట తీసుకెళ్ళాడు

ఇపుడెందుకో
వాలిపోతున్న నా భుజాలను
పైకెత్తి నిలపాలని అనిపించడం లేదు
అక్కడక్కడా నెరిసిన నా జుత్తుకు
రంగేయాలనీ అనిపించడం లేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here