రాణీగారి పులి!!

0
8

[H.H.Munro (Saki) కథ, ‘Mrs. Packletide’s Tiger’ కి సముద్రాల హరికృష్ణ గారు యథేచ్ఛాశైలిలో చేసిన అనుసృజన]

[dropcap]కే[/dropcap]తనపురి జమీందార్ల దారే వేరు. మగవారంతా కళాప్రియులు, మెత్తటి వాళ్ళూ! వారి రాణులందరూ సాహస కృత్యాలు, వేటలు, కత్తి యుధ్ధాలూ ఇష్టపడే వీర వనితలు! తరాలుగా ఇంతే ఆ కుటుంబంలో! ఇదొక విచిత్రం ఆ రోజుల్లో!!

ఇష్టం వరకేనా, సాహసాలు చేసిన దాఖలాలు ఉన్నాయా అంటే కాస్త కష్టమే చెప్పటం! ఒంటి చేత్తో, ఏ మెకాన్నీ కాల్చినా కూల్చినా కథలైతే ఏవీ బయటకు రాలేదు. కనుక ఆ విషయాల్లో ఇష్టం వరకేనేమో అని అనుకోవచ్చు!!

***

రాణీ రాజ్యలక్ష్మాయమ్మారావు గారు ఎందుకో ఒక అంశం మీద ఈ మధ్య పట్టుగా ఉన్నారు. ఒక పులిని కాల్చిన ఖ్యాతి తమ ఖాతాలో ఎట్లాగైనా వేసుకోవాలని!

అదేదో ఒక క్రూర మార్గాన్ని చంపేసి, తద్వారా దేశసేవ చేద్దామనే ఉద్దేశంతో మటుకు కాదు!

పక్కనే ఉన్న, పెద్దగా సత్సంబంధాలు వీరితో లేనీ, సమీరపురి జమీకి రాణి యైన సువర్చలాదేవి గారు ఒకదాన్ని, అనగా పులి నొకదాన్ని ఆ మధ్య కొట్టారట!

ఆ పులిచర్మమే వారు తమ ఆసనంలో అంతఃపురంలో వేసుకుంటారనీ, బాగా ఆ నోటా ఈ నోటా నలిగి, ఈ మధ్యనే ఈమె చెవిన బడ్డది.

అప్పటి నుంచీ తానూ ఆ పని చేసి ఆమె కీర్తి తగ్గించి, తన కీర్తి హెచ్చించి చూసుకోవాలని ఈమెకు తెగ ఉత్సాహం, తొందరా పుట్టుకొచ్చాయి!

***

రాజులూ, రాణులూ తలచుకుంటే ఆటకైనా, వేటకైనా, తక్కువేముంటుంది?!

వెంటనే దివాను గారు – పెద్దవారు, అనుభవజ్ఞులు, తామే స్వయంగా వెళ్ళి, ఒక గ్రామం వారితో ఒప్పందం కుదుర్చుకొచ్చారు, ఈ పని వారికి ఇష్టం లేకపోయినా, ఉద్యోగ ధర్మంగా కానిచ్చారు, దివానుగారు!

ఆ ఒప్పందం ఏవిఁటంటే, ఆ గ్రామస్థులు ఒక వృధ్ధపులిని, మరీ దగ్గరగానూ, మరీ దూరంగానూ కాకుండా, కట్టడిలో ఉంచి, దూరం నుంచి రాణీ గారు గన్నుతో దాన్ని కాల్చే ఏర్పాటు చేస్తారు!

దీనికి గాను వారికి 1000 రూపాయలు రొక్కం బహుమతి ఇవ్వబడుతుంది అని!!

***

గ్రామస్థులు పులి ఎట్లా తేవటమూ తరువాత ఆలోచిద్దాం, ముందు ఒప్పుకుందాం అని ఒప్పుకున్నారు.

ఎట్లాగో- బాగా దెబ్బలు తిని, ముసలిదై పోయిన పులి నొక దాన్ని సంపాదించి – అంటే పొంచి దాని ఆవాసం అదీ కనిపెట్టి, ఆట్టే చురుకు లేదులే దీనికి అని నమ్మకం కలిగాక, పని అయిపోతుంది అనే ధీమాకు వచ్చారు.

అది ఎక్కడ తప్పించుకుంటుందో అని చిన్నా చితకా మేక, గొర్రే ఆహారాలు వేస్తూ దాన్ని ఊరిస్తూ,ఆ ‘కాల్చే’ రోజు కోసం వేచి చూస్తున్నారు!

ఇంకో భయం కూడా వారిని వేధిస్తోంది!

పొరపాటున ఈ పులి, ఆ కాల్చే రోజు కంటే ముందే ‘హరీ’ అంటే?!

గోవిందా గోవిందా, రాబడి రూ. 1000/-కీ!

అంతా సజావుగా సాగాలిరా భగవంతుడా, అని భక్తితో, అంతో ఇంతో తన ప్రాణభయంతో రాణీగారు వేడుకుంటుంటే, గ్రామస్థులు, పులి ప్రాణం అనుకున్న పని అయ్యే లోపే పోతుందేమోనన్న భయంతో, అట్లా పోకూడదనే విన్నపంతో, ప్రార్థిస్తున్నారు!

మునిమాపు వేళల్లో వాళ్ళ ఆడవాళ్ళు, పని నుంచి అడవి మార్గం గుండా తిరిగొస్తూ, తగ్గించిన స్వరంతోనే వీపున ఉన్న తమ పిల్లలకు పాటలు పాడాలని హుకుం కూడా వేశారు.

ఎందుకూ?!

నిద్దరోతున్న పులిరాజు నిద్రకు ఏదైనా ఈ పాట శబ్దం వల్ల ఆటంకం అవుతుందేమోనని!!

***

ఆ బంగరు ముహూర్తం రానే వచ్చింది.

వెన్నెలరాత్రి, మబ్బులు లేని రాత్రి!

ఒక పెద్ద బల్ల లాంటిది కట్టారు సుమారైన దూరంలో, ఒక చెట్టుకి!

రాణీ గారికి, పులి కదలికలు కనిపించేలా!

రాణీ గారికి కాస్త వీటిల్లో అనుభవం ఉన్న ఒక నమ్మకస్థురాలూ, ధైర్యవంతురాలు, అప్పటికే ఆమె దగ్గర పనిచేస్తున్న ఒక యువతిని సహాయుకురాలిగా ఉంచారు. ఆమె పేరు సత్యక్క!

చాలా గట్టిగా, వింతగా మే మ్మే అనే మేకను కూడా కట్టేసి ఉంచారు, పులి స్థావరానికి కాస్త దూరంలో!

దీని అరుపు ఎంత కైయ్ మని ఉంటుందంటే, పులికి చెవుడు ఉన్నా వినబడేటంత!

ఇది పులికి ఆశ పుట్టించి, బయటకు రప్పించటానికి!

ఆ సమయంలో రాణీ వారు రైఫిల్ పేల్చి, పులిని కాల్చీ, కూల్చే ముచ్చట తీర్చుకోవాలన్నది ప్రణాళిక!!

***

ఉన్నట్టుండి సత్యక్క, “మనం కాస్త ప్రమాదంలో ఉన్నట్టున్నాం అమ్మా”, అన్నది!

“అవకాశమే లేదు, ముసలి పులి మనమున్న చోటికి దూకాలన్నా దూకలేదు! ఏమీ ప్రమాదం. లేదు”, అన్నారు రాణీగారు, ధైర్యం నటిస్తూ!

“అది కాదమ్మా, అట్లా అయితే, ఆ దూకలేని, ముసలి పులికి 1000/- రూపాయలు ఎందుకూ?! చాలా ఎక్కువమ్మా”, అన్నది సత్యక్క,యజమాని పట్లా, ఆమె డబ్బు పట్లా తనకున్న జాగ్రత్తను చాటి చెప్పుతూ!!

“పులి, దెబ్బలతో ఉన్నట్టున్నది”, అన్నది సత్యక్క, పొదల్లో దాక్కున్న గ్రామస్థులకు వినబడేట్టు, వాళ్ళను అప్రమత్తంగా ఉంచేందుకు!!

వారికి పులి ఏ అవస్థలో ఉన్నదో తెలిసిందే!

ఎక్కడ లేని అలసత్వమూ, ఆఁ ఇదేం చేస్తుందిలే అనే ధీమా, రెండూనూ వారికి!! పెద్దగా పట్టించుకోలేదు, ఆమె మాటల్ని!

ఇంతలో పులి కదలటం కనబడ్డది వారికి.

కట్టేసి ఉన్న మేకను చూసింది కూడా!

చూసి ఇక పట్టుకోవడానికి, సిద్ధమైన పోజులో కాస్త వంగి, అడుగులో అడుగు వేస్తూ, పంజా వేయటానికా అన్నట్టు మేక వైపు రాసాగింది.

“మేక దగ్గరకు వచ్చి దాన్ని ఏం చేయకుండా, అంటే భోంచేయకుండా వెళ్ళిపోతే, ఏమీ ఇయ్యనక్కరలేదు అదనంగా, అమ్మగారూ, ఆ డబ్బులు మనకు ఆదాయే” అన్నది, సత్యక్క చురుగ్గా!!

వెయ్యిలో మేక ఖర్చు కలిపి లేదు, అది అదనం!

అందుకూ ఆమె ఆ మాట అన్నది!

“అబ్బా, డబ్బు కాదు ఇక్కడ ముఖ్యం, పులిని కొట్టడం”, అన్నారు రాణిగారు చిరాగ్గా!!

***

వ్యాఘ్ర వృధ్ధం, కదలగానే, రాణీగారు పేలుద్దామనే ధైర్యంకంటే, పులిని చూసిన భయమే కాస్త ఎక్కువ మోతాదులో తనను తోయగా, రైఫిల్ తీశారు.

తీయటం ఆలస్యం, ఏదైతే అది అవుతుందని, ట్రిగ్గర్ నొక్కేశారు, పళ్ళు బిగబట్టి, గుండె రాయి చేసుకుని!!

పెద్ద శబ్దంతో, గుండు దూసుకుని వెళ్ళిపోయింది.

పులి పడిపోవటం, దాని ప్రాణాలు గాలిలో కలిసిపోవటం, అందరు చూశారు.

జయజయ నాదాలు, డప్పులూ మోగించి దండోరా వేసినంత చేశారు గ్రామం వాళ్ళు, “రాణీ గారు పులిని చంపిన వీరవనిత వినండహో” అంటూ!

రాణీ గారు, ‘నిజమేనా, నేనేనా’, అన్నట్టు నిలబడి పోయారు కాస్సేపు!

‘అందరూ అంటున్నారుగా, చేసే ఉంటాలే’, అని తనను తాను మెచ్చేసుకున్నారు కూడా!

‘ఇప్పుడూ, ఆ సువర్చలకు తాను ఒక్కతే కాదు, రాచరక్తం ప్రవహిస్తున్న వ్యక్తి ఈ ఇలాకాలో, ఈ రాజ్యలక్ష్మీదేవి కూడా ఉన్నదని తెలిసొస్తుంది! అదీ పొరుగునే, సత్యభామాదేవి అపరావతారంగా!!’ అని తనకి కితాబు కూడా ఇచ్చుకున్నారు, ఉదారంగా!

***

ఇంతలో కల చెదరగొట్టినట్టు, సత్యక్క ఆ స్థలానికి వెళ్ళి చూసి వచ్చి, “అమ్మగోరూ, తమరు చంపింది మేకనండీ, అది గుండు తగిలి గిలగిలమని కొట్టుకొని పోయిందండీ! ఆ గుండు శబ్దానికి, మేకను ఇంకా ముట్టుకోని ఆ పులి, భయపడి గుండె ఆగి పోయినట్టున్నది రాణిగారూ! దాని మీద ఏ గుండు గుర్తూ, లేదమ్మగోరూ” అన్నది, చావు కబురు చల్లగా చెప్పినట్టు!

దేని చావూ,?!

చంపాలని వచ్చిన పులిది కాదు, మె మ్మె మేకది!

‘కొట్టాలని వచ్చింది పులినీ, కొట్టింది మేకను’, అన్నమాట అనుకుంటూ రాణీగారు కాస్త ఢీలా పడ్డా, వెంటనే కోలుకున్నారు.

“ఒసేయ్, నోర్మూసుకో, మనం పులిని చంపటానికి వచ్చాం, కాల్చాం, పులి చచ్చిపోయింది. మేక దానంతట అదే భయంతో కట్లు తెంచుకొని. పారిపోవాలన్న ప్రయత్నంలో ఉండగా, ఏ కాస్తో దానికీ తగిలి ఏదో కాస్త రక్తం అదీ వచ్చిందేమో! ఏదైనా ఈ మరణం దానికి గర్వకారణమే, పులితో పాటు పోయింది ఘనంగా!!” అన్నారు తన సహాయకురాలితో!

విషయం అంతా తెలిసే – ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే ఊరి జనం ఒప్పుకుని, తన కీర్తి పాఠాలు వల్లె వేస్తుంటే, ఇంకా వేరే ఆలోచనకు తావేముందీ?! అనుకున్నారు రాణీగారు!

వెయ్యి రూపాయల కోసమే ఇదంతా ఒప్పుకుని ఈ నాటకంలో పాత్ర వహించారు గ్రామస్థులని, ఎవరికీ తెలిసేది?!

పులి చావటానికి, తన రైఫిల్ లోంచి దూసుకెళ్ళిన గుండే, కారణం, నిశ్చయంగా!

గుండు తగిలి చచ్చిందా, భయం వల్ల గుండె ఆగి పోయిందా, అన్నది అనవసరం!

అంటే తను చంపినట్టే! ఇదే ఆఖరి మాట!

ఇదీ రాణి గారి ఆలోచనా వైనం ఆ క్షణంలో!

అదే చరిత్రలో నిలిచి పోయింది కూడా!

చివరిగా, కీలకంగా ఇంకో మాట అన్నారు.

“సత్యా, ఏం జరిగిందో అర్థమయ్యిందిగా, అంతే, ఎక్కడ చెప్పినా, ఇదే రాగం తాళంలో ఉండాలి ఈ వరస, సరేనా”, అని!

సత్యక్క, “అలాగే రాణీగోరూ, మీరెలా చెప్తే అట్లానే”, అన్నది రాబోయే నవ్వు నొక్కేస్తూ!

***

ఒక వారం తరువాత, సత్యక్క మహలులో, పూలకుండీలు సరి జేస్తూ, “అమ్మా, అసలు సంగతి తెలిస్తే, ప్రపంచం ఎంత విస్తుపోతుందో కదండీ”, అన్నది యథాలాపంగా!

“ఏమిటే అసలు సంగతి”, రాణీగారి కంఠం, గద్దిస్తూ!

“అదేనండీ, గుండుతో మీరు మేకను కొట్టగా, గుండు శబ్దానికి భయంతో దానంతట అదే, గుండె ఆగి ఆ ముసలి పులి చచ్చి ఊరుకోవడం”- సత్యక్క మాట!!

“ఓసినీ, మళ్ళీ ఆ ఊసు తేవద్దన్నానా?!”, రాణిగారి ఆజ్ఞ!

శిరసావహించింది, సేవకురాలు!!

***

ఊరికే కాదులెండి!

ఆ తరువాతి సంభాషణ వింటే మనకే తెలిసిపోతుంది, ఊరికేనో, బహుమానం పుచ్చుకునో?!

***

“ఆ ఊసు తేవద్దిక”, అని రాణీ గారనగానే, సత్యక్క-

“సరేనమ్మా, ఇది వినండి”, అని చొరవగా కొనసాగించింది, సత్యక్క!

“ఊరవతల ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది, చాలా వీలుగా ఉంటుంది నాకు. కొనాలంటేనేమో డబ్బు సరిపడా లేదు నా దగ్గర, ఎట్లాగబ్బా అని ఆలోచిస్తున్నానమ్మా” అన్నది తాపీగా, ఓరకంట చూస్తూ, తన యజమాని హావభావాలు!

“నేనిస్తాలే, కొనుక్కో” అన్నారు రాణిగారు, వెంటనే ఉదారంగా!

వెరసి అర్థం – సేవకురాలు ఆ ఇల్లు కొనాలనుకున్నది, రాణీగారు సేవకురాలినే కొనేశారు, ఆ మాటతో!

***

ఆ ఇంటికి సత్యక్క పెట్టుకున్న పేరు, ‘పులినిలయం!!’

అందరిలో సత్యక్క దర్జా బాగా పెరిగిందిప్పుడు, రాణీగారింట్లో నౌకరీ ఉండనే ఉంది, సొంత గూడు కూడా!!

మరి పెరగదూ, మర్యాద!

***

ఆ తరువాత ఎప్పుడూ పులి, మేక, రాణీగారూ- ఆ ఊసే ఎత్తినట్టు లేదు, నమ్మినబంటు సత్యక్క!!

రాణీ రాజ్యలక్ష్మి గారు కూడా సంతోషంగా గడిపేశారు, తరువాత ‘వీరవనిత’, అనే కీర్తిఛత్రం కింద, చాలా ఏళ్ళు!!

***

సత్యక్క, ఇదేమైనా ఓ కథగా తన మనవలు, మనవరాళ్లకు చెప్పిందేమో, మనకు మటుకు తెలియదు!

రాణీగారు తెలుసుకోవాలని, అనుకోరు గాక అనుకోరు!

ఆ కథ కంచికే ఇక, మన లెక్కలో మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here