కాజాల్లాంటి బాజాలు-132: రసగుల్లా ఇడ్లీ

1
10

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]రెం[/dropcap]డురోజుల్నించీ వదిన దగ్గర్నుంచి ఫోన్ లేదు. బిజీగా ఉందేమోలే అనుకున్నాను.. కానీ, మూడో రోజు కూడా పగలు పదకొండు గంటలయినా ఫోన్ రాకపోయేటప్పటికి ఒకవేళ ఒంట్లో బాగోలేదేమో, కనుక్కుందాం అనుకుంటూ నేనే ఫోన్ చేసేను. ఫోన్ తియ్యలేదు కానీ, ‘బిజీగా ఉన్నాను, సాయంత్రం కాల్ చేస్తాను.’ అంటూ వదిన మెసేజ్ పెట్టింది.

సాయంత్రం వరకూ నాకు తెలీకుండా వదిన ఏమేం ఘనకార్యాలు చేసేస్తోందోనని తెగ ఆరాట పడిపోయేను. ఆఖరికి నా నిరీక్షణ ఫలించి రాత్రి ఏడుగంటలకి “ఏంటి స్వర్ణా సంగతులూ..” అంటూ వదిన దగ్గర్నించి ఫోన్ వచ్చింది.

“నువ్వే చెప్పాలి వదినా.. అంత బిజీగా ఈ మూడురోజుల్నించీ ఏం చేస్తున్నావో!” అన్నాను.

“ఒక కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. టార్గెట్ రీచ్ అయే పనిలో బిజీగా ఉన్నాను.” అంది పేద్ద గొప్పగా..

ఇంట్లో కూచుని, ఇడ్లీలు వేసుకుంటూ, చపాతీలు వత్తుకుంటూ రోజులు గడిపేవాళ్లం నేనూ వదినానూ. అలాంటివాళ్ళని పేద్ద ఉద్యోగం చేసేవాళ్ళలాగా ప్రాజెక్టూ, వర్కూ, టార్గెటూ అని వదిన అంటుంటే నాకు భలే ఆశ్చర్యం వేసింది.

“ఎక్కడైనా జాబ్‌లో చేరేవా!” ఆత్రంగా అడిగేను.

“హూ.. మీ వదినని ఎంత తక్కువగా అంచనా వేసేవ్! ఎవరికైనా జాబ్ ఇస్తాను కానీ ఒకరికింద చేసేదాన్ని కానని నీకు తెలీదూ! ఎవరికైనా ఏదైనా కావాలంటే నా దగ్గరికి రావల్సిందే.”

హూ! ఎంత అభిజాత్యం అనుకుంటూ, “అసలు సంగతి చెప్పు వదినా నాన్చక.” అన్నాను విసుగ్గా.

“అయితే విను మీ వదిన చేసిన గొప్ప పని. నీకు మా వదిన కోడలు విద్య తెల్సు కదా! తనకి ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళూ, పదేళ్ళూ వాళ్లకి. వాళ్ళు ఇప్పటి చాలామంది పిల్లల్లాగే మాకు పప్పూ అన్నాలూ, ఇడ్లీలూ వద్దూ.. పిట్జా, బర్గర్లు కావాలీ అని పేచీలు పెడుతున్నారుట. ఎప్పుడైనా ఓసారి అవి తింటే పర్వాలేదు కానీ రోజూ అవి తింటే పిల్లలకి మంఛిది కాదు కదా అని విద్య గొడవ. చక్కగా ఇడ్లీలాంటి హెల్దీ ఫుడ్ పిల్లలు తినేలా చెయ్యడమెలాగా అని నన్నడిగింది.

దానికి నేను.. ‘దాందేముందీ.. ఆ ఇడ్లీపిండితోనే వాళ్లడిగింది చేసెయ్యీ’ అన్నాను. ఇడ్లీపిండితో అవన్నీ ఎలా చేస్తారని దివ్య ఆశ్చర్యపోయింది. ‘నేను చెపుతాను చేసెయ్యీ’ అన్నాను. వెంటనే ‘ఆగండాగండీ, మీరు చెప్పేవన్నీ వీడియోలా తీసుకుంటాను. నాతోపాటు మా ఫ్రెండ్స్ చాలామందికి ఈ సమస్య ఉందీ, వాళ్లందరికీ మీరు చెప్పిన రెసిపీలు చూపిస్తానూ..’ అంటూ అవన్నీ నేను చెపుతుంటే, చేస్తుంటే వీడియోలు తీసింది. వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్‌లో తన ఛానల్లో అప్లోడ్ చేస్తానంది. ఈ మూడురోజులూ అదన్నమాట నా టార్గెట్.”

ఊపిరి పీల్చుకుందుకు కాసేపాగింది వదిన.

నాకిక్కడ ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఇడ్లీపిండితో పిట్జాలూ, బర్గర్లూనా! నేనింకా తేరుకోకుండానే వదిన మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.

“నువ్వూ ఎలాగా అని ఆలోచిస్తున్నావు కదూ! హూ.. మీకందరికీ ఎవరైనా ఏదైనా చెప్తే గొర్రెల్లా వెనకాలపడి వాళ్ళు చెప్పినట్టు చేసెయ్యడం తప్ప ఇంకేం తెలీదు. కాస్త స్వంతబుర్ర ఉపయోగిస్తే బోల్డు విధానాలు తెలుస్తాయి.”

“అదే ఎలా!”

“సరే విను. మనం రోజూ తాగే కాఫీ సంగతే తీసుకో. ఎన్ని రకాలూ.. ప్యూర్ కాఫీ, చికొరీ కాఫీ, కోల్డ్ కాఫీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డూ. అవన్నీ వదిలెయ్యి, మనందరం ఎప్పుడూ చేసుకునే చింతపండు పులిహార అసలు వంటకం. కానీ దానిని ఎవరికనుకూలంగా వాళ్ళు నిమ్మకాయ పులిహోరనీ, దబ్బకాయ పులిహోరనీ చెయ్యటంలేదూ! అలాగే ఒకే అన్నంతో కావల్సినవి కలిపేసుకుని జీరా రైస్, మేతి రైస్, గోంగూర రైస్, ఆవకాయ రైస్ అని ఎన్ని చెయ్యటంలేదూ! అలాగే ఇదీనూ. వాటన్నింటికీ అసలు రైస్ ఉండడం ఎంత ముఖ్యమో, నేను చెప్పినవాటికి కూడా ఇడ్లీపిండి మెయిన్ ఇంగ్రెడియెంట్. మిగిలిన పధ్ధతంతా మామూలే.”

వదిన మాటల్ని మధ్యలోనే ఆపి, “ఇడ్లీపిండితో అవన్నీ ఎలా వదినా!”

“ఏం.. వడలు చేసి, దానిని బన్‌లో పెట్టి వడాపావ్ అని ఊపిరి ఆడని బిజినెస్ చేస్తున్నారే.. అలాగే.”

ఇంకా నాకు వదిన చెప్పింది అర్థం కాలేదు.

“స్వర్ణా, పిల్లలకి పేర్లు ముఖ్యం. ఇడ్లీని ముక్కలుగా కోసేసి, మూకుట్లో ఒహో ఈ రోజుల్లో మూకుడు అనకూడదు కదా.. పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయముక్కలు టొమేటో ముక్కలూ వేసి వేయించి, పైన చిల్లీసాస్ పోసి, చాట్ మసాలా జల్లితే పిల్లలు పరిగెడుతూ వచ్చి తినేస్తారు.

అదే ఇడ్లీముక్కలకి ఇంత సాస్ పట్టించి మసాలా దట్టించి గ్రిల్ చేస్తే ఆ రుచికి ఎగిరి గంతేస్తారు.

అలాగే ఉప్మాకి కాదేదీ అనర్హం అన్నట్టు ఇడ్లీని ముక్కలుగా కోసి, ఇన్ని ఉల్లిపాయిలూ టొమేటో ముక్కలూ వేసి రవ్వ బదులు ఈ ఇడ్లీముక్కలు వేసి కలియబెట్టేస్తే బ్రెడ్ ఉప్మాలాగా ఇడ్లీఉప్మా రెడీ.

అంతేకాదు ఇడ్లీతో బజ్జీలు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీని ముక్కలుగా చేసి, బజ్జీలకి కలుపుకున్నట్టే సెనగపిండిలో ముంచి, నూనెలో వేయిస్తే వేడి వేడి ఇడ్లీ బజ్జీ ఊదుకుంటూ తినేస్తారు.”

ఆగకుండా ప్రవాహంలా సాగుతున్న వదిన మాటలకి నాకు బుర్ర పని చెయ్యడం మానేసింది. అసలు ఇడ్లీ హెల్దీ ఫుడ్ అని కదా పిల్లలకి పెడదామనుకుందీ ఆ విద్యా.. మరి ఆ ఇడ్లీనే ముక్కలు చేసేసి, వేయించి నానారకాల మసాలాలూ వేస్తే అది హెల్దీ ఫుడ్ ఎందుకవుతుందీ!

అదేమాట అడుగుదామనుకుంటున్న నాకు అట్నించి వదిన మాటలు మళ్ళీ వినిపించేయి.

“స్వర్ణా, ఇలాంటి ప్రయోగాలు చాలామంది చేస్తున్నారు. ఆఖరికి ఇడ్లీపిండితో రసగుల్లా ఇడ్లీ లాంటి స్వీట్ కూడా చెయ్యొచ్చు తెల్సా!”

నేను ఫోన్‌ని పడిపోకుండా కాస్త గట్టిగా పట్టుకున్నాను. వదిన ఆగకుండా చెప్పుకుపోతోంది.

“చాలా సింపుల్. నువ్వు స్వీట్ షాప్ నించి రసగుల్లాలు తెచ్చుకుని, ఒక పెద్ద కప్పులో సగందాకా ఇడ్లీపిండి వేసి అందులో ఒక రసగుల్లాని కుక్కేసి, ఇడ్లీ కుకర్‌లో ఉడికించెయ్యడవే. ఎంచక్క ఇడ్లీ మధ్యకి ముక్క విరవగానే తియ్యటి రసగుల్లా కనిపిస్తే పిల్లలు ఎంత సంబరపడిపోతారూ!”

వదిన ఇడ్లీలతో చేసే చాలా రెసిపీలు అలా చెప్పుకుపోతూనే ఉంది. కానీ ఇంక మొబైల్ కూడా పట్టుకునే ఓపిక లేక రసగుల్లా ఇడ్లీ దగ్గరే దానిని ముందున్న టీపాయ్ మీద పెట్టేసి, దీనంగా దాన్నే చూస్తూ కూర్చున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here